MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కథా మధురాలు
దృష్టి కోణం
మణి వడ్లమాని
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
"రిటైర్ అయిననాటినుంచీ ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉన్న ఆనందాలను దూరం చేసుకుని ఉండటమే కాకుండా, ఇంట్లో వాళ్ళ మీద కూడా ఆ ప్రభావం ఆపాదించాలని చూస్తున్నారా?" భార్య ఉమ అనేసరికి కోపం వచ్చేసింది.
గట్టిగా అరిచేసాడు - ”నేను చస్తే పీడా పోతుంది. నీకు ఏ లోటు లేకుండా చేసే ఉంచానులే. నువ్వే అనుభవించు!” భార్య తో వెటకారంగా అనడమూ జరిగింది.
“మీరే లేనపుడు ఇంకా నేనేమి అనుభవిస్తాను?“ అనేసింది ఉక్రోషంగా. అసలే భర్త ప్రవర్తన తో విసిగి పోయిన ఉమకి ఉక్రోషం,దుఃఖం రెండూ ఏకకాలం లో వచ్చాయి.
మనుషుల మధ్య సంబంధాలను గురించిన ఓ పుస్తకంలో భార్యాభర్తల గురించి ఎప్పుడో చదివిన వాక్యాలు గుర్తొచ్చాయి. ప్రేమ, తనమాటే చెల్లాలనే పంతం లేని ఓ కమ్యూనికేషన్ ఇవి మనం ముందుగా చూపిస్తేనే తిరిగి మనమూ అంత పొందవచ్చు. ఈ సూత్రం రెండు పక్కలా వర్తిసుంది. అప్పుడు మనుషుల మధ్య సంబంధాలు గట్టిగా నిలబడతాయిని.
కానీ ఈయన మటుకు “నాది కరెక్ట్. నీదే లేదా అవతలి వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళదే తప్పు” అనేస్తున్నారు.
పైగా ఆయనని ఎవరూ అర్ధం చేసుకోవటం లేదని ఒకటే గొడవ.
ఇంతవరకు సీరియస్ గా తీసుకోలేదు కానీ, ఈ రోజు జరిగిన గొడవతో ఆయన లోపల ఏదో అవుతోంది. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని అర్ధమయింది ఉమకి.
కొన్ని ఎందుకు జరుగుతాయో తెలియదు. అసలుపెద్ద కారణాలేమి ఉండవు. కానీ, దాని పరిణామాలు మటుకు చాలా తీవ్రంగా ఉంటాయి.
ఆరోజు పొద్దున జరిగిన సంఘటన గుర్తు చేసుకుంది. ఉమ, కృష్ణమూర్తి యేవో కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు.
కృష్ణమూర్తి కిచెన్ అంతా కలయచూస్తూ “అవునూ, కొత్త రైస్ కుక్కర్ వాడుతున్నావు కదా? మరి ఆ పాతది ఎక్కడుంది?”
“దాన్ని కమలకి ఇచ్చేసాను”
“నీకు బుద్ధుందా? పనిమనిషికివ్వడం ఏంటి ?”
“అయ్యో మనకి అవసరం లేదు, పైగా బాగు చేయించుకుని వాళ్ళు వాడుకుంటామని చెప్పింది. అయినా కొత్తగా ఇవాళ ఇలా అడుగుతున్నారేంటీ?”
“కాదా? మరి సంపాదించే వాడికి తెలుస్తుంది విలువ. అయినా నాకు చెప్పకుండా ఎందుకు ఇచ్చేసావు?"
“ఒక తీసి పారేసిన వస్తువు గురించి ఇంత గోల ఏంటండి?”
“అది నాది. కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్నది. నాకు చెప్పకుండా ఇచ్చేసి, పైగా వాదిస్తున్నావు. దానికి ఫోన్ చేసి చెప్పు, తిరిగి తెచ్చేయమని” అని గట్టిగా రంకెలు వేసాడు.
దానితో కోపం ఏడుపు ఉబికివచ్చాయి ఉమకి . ”వెధవది. ఒక వస్తువు కోసం ఇంత గోల పెడుతున్నారు? అంటే నాకు స్వతంత్రం లేదా? అరవై ఏళ్ళు నిండిన నాకు మన ఇంట్లో హక్కు లేదా? సంసారం కోసం ఇంత ఆరాటపడి ఇదా చివరికి? అయినా ఇలా తయారు అయ్యారేంటి? ఏమయింది మీకు? మనకి అన్నీ బానే ఉన్నాయిగా? అలా అరవకండి. తాగొచ్చి గోల చేస్తున్నారు అనుకుంటారు ఇరుగుపొరుగు” అని గట్టిగానే చెప్పింది.
ఒక రెండురోజులలా తుఫాను తరువాత ప్రశాంతతలా గడిచాయి.
ఇలా ఈ మధ్య తరచు గొడవ పెట్టడం, అరవడం ఎక్కువ అయిపోయాయి. చీటికి మాటికి కోపం వచ్చేస్తోంది.
ఉమకి లోలోపల నచ్చటం లేదు ఏదో చెయ్యాలి ! ఈ వయసులో ప్రతీదానికి తగవులు పడటం చిరాకుగా ఉంది. పోనీ, మనిషి స్వభావం ఇదే అనుకోవడానికి లేదు.
ఎందుకంటే మునుపు ఇలా ఉండేవారు కాదు. చక్కని ఆలోచనలు, ప్రతీదీ నా సలహాలు తీసుకునే చేయటం, ముఖ్యంగా ఇంటి బాధ్యత డబ్బు ఖర్చు పెట్టడం అన్నీ తనకే ఇచ్చారు.
చుట్టాల్లో మంచిపేరు,ఆఫీస్ లో ఎంతో గౌరవం పొందిన వ్యక్తి, ఈ మధ్య ఇలా ప్రతి విషయం పట్టించుకోవడం వింతగా అనిపిస్తోంది.
మరి ఈ మార్పుకి కారణం ఏమిటో ? అదే అంతుపట్టకుండా ఉంది. పోనీ పిల్లలకి చెబితే అన్న ఆలోచన వచ్చినా వాళ్ళు వాళ్ళ పనులతో బిజీ గా ఉన్నార్సలే, కంగారు పడతారని ఊరుకున్నాను. అంతకన్నా కూడా, అతని మీద కంప్లైంట్స్ చెప్పటానికీ మనస్కరించలేదు.
నిండైన వ్యక్తిత్వం, హుందాగా ఉండే దగ్గరి స్నేహితురాలు రమతో అయినా పంచుకోవాలనిపించింది.
“దిగులు పడకు ఉమా! నేను కూడా ఈ మధ్య చదివాను. కొంతమందికి ఈ వయసులో మూడ్ స్వింగ్స్ ఉంటాయిట. నీకు తెలియనిదేముంది? మరీ ఆలోచించకు, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒక్కోసారి వాటంతట అవే సర్దుకుంటాయి. కృష్ణ గురించి మనకు తెలుసు కదా? పైగా నువ్వు బాగా మనుష్యులని పరిశీలిస్తావు. గమనిస్తూ ఉండు. దాన్ని బట్టి పరిష్కారం కూడా దొరకొచ్చు అంది.”
తనూ అదే బెటర్ అనుకుంది.
**
కొన్ని రోజులు గడిచాయి అతని చిటపటలు, అర్థంలేని అలకలు, కోపతాపాలు వీటి మీదుగా.
ఓ రోజు పొద్దున్నే ఉన్నట్టుండి “ఇదిగో మా ఫ్రెండ్ చెప్పాడు యోగ ,మెడిటేషన్ సెంటర్ గురించి. నేను వెళ్లి జాయిన్ అవుతాను అక్కడ” అన్నాడు.
“ఎన్ని రోజులు ఉంటారక్కడ?”
“ఉంటానులే బానే,నీకు నా బెడద తప్పుతుంది హాయిగా!” మళ్ళీ వెటకారం.
ఉమ ఏమి సమాధానం చెప్పలేదు. మనసులో మటుకు అనుకుంది. “పోనీలే మార్పు మంచిదే. అంతే కాదు, అవసరం కూడా! వెళ్లి రానీ. అనుభవం వస్తుంది. అనుకుంది. అదే మాట అమెరికాలో ఉన్న పిల్లలకి చెబితే పెద్దగా విస్తుపోలేదు. తను చెప్పకున్నా ఫోన్ల మీద తండ్రి తీరుని సగం పసిగట్టేసినట్టున్నారు. "నీ ఇష్టం అమ్మా! అదే ఇక్కడ అయితే వెంటనే సైక్రియాటిస్టు కి చూపిస్తారు" అంది కూతురు. “ఆ మాట అనకు తల్లీ! దాన్ని ఇంకోలా అర్ధం తీసుకుని గోరంతలు కొండంత చేస్తారు." అని సర్ది చెప్పింది..
**
కృష్ణమూర్తి సరాసరి బాగ్ పట్టుకుని ఆశ్రమం గేటు దగ్గరికి వచ్చేసరికి బయట నుంచున్న సెక్యూరిటీ గార్డ్ అడిగాడు - "ఎవరిని కలవాలని సర్?"
వెంటనే స్వామీజీ పేరు చెప్పాడు.అతను ఆఫీస్ కి ఫోన్ చేసాడు అవతలనుంచి అడిగినట్లున్నారు. వెంటనే “మీ పేరు ఏంటి సార్” అన్నాడు. చెప్పాడు.
వాళ్లు రమ్మని చెప్పినట్టు ఉన్నారు. “సర్ మీరు తిన్నగా వెళ్లి ఎడమ వైపు కి తిరగండి అక్కడే ఆఫీసు ఉంది” అని చెప్పాడు.
ఆఫీస్ రూమ్ లో కూర్చున్న అతను “నమస్తే సార్! ప్రయాణం బాగా జరిగిందా? నిజానికి మేము అక్కడికి ఒక మనిషిని పంపించాము వేరే పని మీద. ఆలస్యం అయినట్లుంది. కానీ మీరు భలే తెలుసుకుని వచ్చారే” అన్నాడు.
“ఫర్వాలేదు. బస్టాప్ లో అడిగితే వాళ్ళు చెప్పారు. ఆటో రిక్షా చేసుకుని వచ్చేసాను” మాట్లాడుతూనే చుట్టూరా చూసాడు.
ఆశ్రమ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. అలా అని ఒక పర్ణశాలలా ఏమీ లేదు. పెద్ద కాంపౌండ్ వాళ్ళతో పెద్ద పెద్ద బిల్డింగ్ లు, చుట్టూ పూల చెట్లు వేప,మామిడి, గుల్ మొహర్ లాంటి పెద్ద చెట్లు అన్నీ ఉన్నాయి. హాయిగా ఉంది. ఒక ప్రశాంతమైన అనుభూతి కలిగింది.
“రండి మీ గది చూపిస్తాను” అని తీసుకుని వెళుతున్నాడు.
అంత సేపు మాట్లాడుతున్నాడు కానీ తన చేతిలోని సూట్ కేస్ మటుకు అందుకోలేదు అనుకున్నాడు. పైగా అంత దూరం నుంచి సూట్కేస్ మోసుకుంటూ రావడం చిన్నతనంగా అనిపించింది.
“అన్నట్టు, నాకు సింగల్ రూమ్ కావాలండీ. దొరుకుతుందా?" నిర్లక్ష్యంగా అడిగాడు.
“తెలీదండీ. స్వామీజీ గారు ఎలా నిర్ణయిస్తారో కనుక్కోవాలి!” అన్నాడు
“ప్రస్తుతం మీరు ఈ రూములో ఉండండి. ఒక గది తాళం తీసి ఇచ్చా!" లోపలి కి తీసుకెళ్ళాడు.
అందులో అప్పటికే ఇంకో వ్యక్తీ ఉన్నట్లున్నాడు. అతని మంచం పక్కన టేబుల్ మీద వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తివే కాకుండా ప్రముఖ ఇంగ్లీష్ రచయితల పుస్తకాలు కూడా ఉన్నాయి.
“కింద భోజనశాల ఉంది. అక్కడికి వెళ్లి తినొచ్చు. ఫలహారం చేసాక ఆఫీస్ కి వచ్చేయండి.స్వామిజి దగ్గరకు తీసుకుని వెళ్తాను అనేసి అతను వెళ్ళిపోయాడు.”
స్నానం మిగతా కార్యక్రమాలు చేసుకుని, కిందకి వెళ్లి ఫలహారం చేసి, ఆఫీస్ రూమ్ కి వెళ్ళాడు. ఇందాక, అతనే స్వామీజీ రూంలోకి తీసుకునివెళ్ళాడు.
ఆ గదిలోకి వెళ్ళగానే ఏంటో హాయిగా, ఎంతో ప్రశాంతంగా వుంది. ఇంతలో ఏవో వస్తున్న సడి వినిపించింది. పక్కకి తిరిగి చూసాడు
ఎందుకో స్వామీజీ రూమ్ లోకి వెళ్ళగానే ఒక తెలియని గౌరవ భావం కలిగింది. పైగా స్వామీజీ గురించి టీవీల్లో చూసి, అంతకుముందు తెలుసుకుని వెళ్లడం చేత ఒక తెలియని భక్తితో కూడిన భయం కూడా వేసింది. ఆయనను చూడగానే రెండు చేతులెత్తి నమస్కారం పెట్టాడు. ఆయన కూడా "ఓ, కృష్ణమూర్తిగారు మీరేనా" అన్నాడు. గంభీరంగా ఉన్నా మృదువుగానే మాట్లాడారు.
“సరే మీరు ఎందుకు ఆశ్రమ జీవితం కోరుకుంటున్నారు?”
“శాంతి కోసం,ప్రశాంత జీవన కోసం.అలాగే ఏ బరువు బాధ్యతలు లేకుండా ఉండటం కోసం. పైగా ఇంత కాలం మోసీ, మోసీ అలసి పోయాను. నాకు విశ్రాంతి కావాలనిపించింది. అందుకు ఇదే మార్గం అనిపించింది.”
“మరి, మీ ఇంట్లో మీ భార్య పిల్లలు ఒప్పుకున్నారా?”
“ వాళ్ళూ అథం చేసుకున్నారు, సరే అన్నారు. నాకు మమకారాలకు దూరంగా ఉండాలని ఉంది. అందుకు తగ్గ బోధన చేయండి. నేను దాని కోసమే వచ్చాను.”
“సరే మీకు ఆశ్రమ నిబంధనల గురించి మా శిష్యులు చెబుతారు” అంటూ లేచి వెళ్ళిపోయారు స్వామీజీ.
**
రోజులు గడుస్తున్నాయి. ఆశ్రమంలో ఉన కృష్ణమూర్తికి ఏదో అశాంతి. తను అనుకున్నది జరగటం లేదు. కారణం ముక్కు మూసుకుని ఒక చోట ప్రశాంతంగా కూర్చోవడం కాదు ఇక్కడ పద్ధతి. ఎవరి వయసుకి తగ్గట్టు వారు పనులు చేయాలి. ముఖ్యంగా ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. అది నచ్చటం లేదు.
ఆశ్రమజీవితం అంటే హాయిగా ఉంటుంది అనుకున్నాడు. హాయి అంటే ఏ పనీ చేయకుండా ఉండటం. పైగా డబ్బు కూడా కడుతున్నాడు.
ఇంతలో హలో అంటూ రూమ్ మేట్ హరిచరణ్ వచ్చి పలకరించాడు. వయసు ఎంత ఉంటుందో గాని భలే చలాకీగా ఉంటాడు. ఎపుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు.
ఉండబట్టలేక అడిగాడు “మీరు ఇంత సంతోషంగా ఎలా ఉంటారు. మీకు భయం లేదా?”
“భయమా? దేని గురించి?”
“...”
“చూడండి కృష్ణగారు, నేను జీవితంలో చాలా పొందాను, పోగొట్టుకున్నాను. కానీ, రెంటినీ సమంగా చూసాను.అందుకే నాకు భయం లేదు!”
ఆ జవాబు పెద్దగా రుచించలేదు. అయినా అతని గురించి నాకెందుకు అనుకుని వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోతున కృష్ణమూర్తి నే చూస్తుండిపోయాడు అతను.
వాళ్ళ సంభాషణ అంతా పక్కనే ఉన్న చెట్టుకి పాదులు చేస్తున స్వామీజీ విన్నారు.
**
రోజూ రాత్రి స్వామీజీ ఆశ్రమంలోని వారితో ఒక గంట మాట్లాడతారు. ఆరోజు కూడా అలా మాట్లాడుతూ ఒక్కొక్కరు జీవితాన్ని ఏవిధంగా చూస్తారు? మీ దృష్టికోణం ఏమిటి అని ప్రశ్న వేసారు.
అప్పుడు ఒక్కో వ్యక్తి ఒక్కో విధంగా చెప్పారు.
కృష్ణమూర్తి వంతు వచ్చింది. అప్పుడు చెప్పాడు. “ఏదో అశాంతి, ఇక నా పని అయిపోయింది. నేను దేనికీ పనికి రానేమో అనిపిస్తోంది. అందుకోసమే ఇక్కడ చేరాను. మీరు ఏదో బోధన చేస్తే దాన్ని అనుసరిద్దామని”
చివరగా “హరి చరణ్, మీరు చెప్పండి" అన్నారు స్వామీజీ.
“నమస్తే అందరికీ. నా గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. నేను ఒక మల్టీ నేషనల్ కంపెనీ కి సీఈఓ గ పని చేశాను. ఒక కొడుకు. అప్పటి వరకు అన్నీ బానే ఉన్నాయి. జీవితం పూల బాటలా సాగింది. నిజానికి మనకు తెలియని శక్తి ఏదో నడిపిస్తుంది. అదే విధి. ఇరవైళ్ళ కొడుకు బ్రెయిన్ కాన్సర్ తో చనిపోయాడు. నా భార్య ఆ దిగులు తో కొద్ది కాలానికే చనిపోయింది. కొన్ని రోజులు నా చుట్టురా చీకటి. శూన్యం. కానీ ఎన్ని రోజులు ఇలా? డబ్బు సంపాదించడానికి విశ్రాంతి అవసరం. కానీ జీవించడానికి కాదుగా! అప్పుడు అనిపించింది.కర్మ ని ఒక బాధ్యతగా నిర్వర్తించడము. అది కూడా నీ ఒక్కడి కోసమే కాదు. నీ తోటి వాళ్ళ కోసం చేయడం కూడా. అంటే పుట్టుక, జీవనం, మరణం అంతా కర్మ వలననే జరుగుతుంది. అని తెలుసుకున్నాను. నాకు తోచినంత నేను చేయగలిగింది చేస్తున్నాను. ఈ క్షణం మటుకే నాది అనుకుంటూ జీవిస్తున్నాను. అది జీవితం పట్ల నా పర్స్పెక్టివ్" అన్నాడు.
అప్పుడు స్వామీజీ లేచి, అందరినీ ఉద్దేశించి, "ఎవరికి నిర్దేశించిన పరిధి లో వాళ్ళు ఊపిరి ఉన్నంత వరకు పనులు చేస్తూనే ఉండాలి. అదే దీక్ష,సాధన. అంతే కానీ కర్మ నుంచి తప్పించుకుని శాంతి కావాలంటే దొరకదు. ఉన్నంతలో శాంతి, సంతృప్తి వెతుక్కోవాలి. నిజానికి అది నీ లోపలే ఉంటుంది. దానికి స్వామీజీలు, ఆశ్రమాలు, గురుబోధనలు అవసరం లేదు. ఈ సత్యాన్ని ఎంత తొందరగా తెలుసుకుంటే అంత ఉత్తమం" అనేసి అక్కడనుంచి వెళ్ళిపోయారు.
హరి చరణ్ చెప్పింది విని ఆశ్చర్యపోయిన కృష్ణ మూర్తి ఇప్పుడు స్వామీజీ చెప్పింది విని ఆలోచనలో పడ్డాడు.
**
“ఇన్ని రోజులు బానే గడిచిపోయాయి. ఆఫీస్ బాధ్యతలు, ఇంటి బాధ్యతలతో పాటు మన పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళకి మనతో పని లేదు. రెండోది అప్పుడే కరోనా వచ్చింది. చావు అంటే భయం లేదని అనను. అందులోనూ మనకి తెలుసున్న దగ్గర బంధ్వులు, స్నేహితులు పోవడంతో మన వయసు వాళ్ళకి తొందరగా ఎటాక్ అవుతుందని నాలో ఒక భయం, లోలోపల ఒక శూన్యం మొదలయింది. దేని మీద మనసు నిలవలేదు. ఇపుడు కోవిడ్ తగ్గుతున్న దశలో కూడా అప్పటినుంచీ గూడుకట్టుకుపోయిన భయం, దిగులు అలాగే ఉండిపోయింది. ఏ క్షణంలో అయినా ఏదైనా జరగొచ్చనే భయం వదలట్లేదు. అదిగో ఆ భయాన్ని కప్పడానికి చిరాకు, కోపం, అసహనం ఎక్కువ అయ్యాయి. ఇవన్నీ నీకు చెప్పడానికి ఇగో అడ్డు వచ్చింది. చిన్నతనం అనిపించింది. కానీ ఈ నెల్లాళ్ళ ఆశ్రమ జీవితం నాకు ఒక పాఠాన్ని నేర్పింది. క్షమించు ఉమా! ఇప్పుడు జీవితం పట్ల నా దృష్టి కోణం మారింది. రెండు రోజుల్లో ఇంటికి వస్తున్నాను. మనిద్దరం కలిసి అప్పుడెప్పుడో అనుకున్న “చైతన్యం” కు శ్రీకారం చుడదాం" అన్న కృష్ణ మూర్తి మెసేజ్ ఉమకు కొండంత భారం దింపినట్లయింది.
అదే విషయాన్ని స్నేహితురాలుతో పంచుకోవటానికి ఉమ వేళ్ళు ఆమె నెంబర్ ని నొక్కసాగాయి.
*****