MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
వ్యాస మధురాలు
దేవుడికి ఉత్తరం - చిన్న కథలు - సహజ వాస్తవాలు
రాజేశ్వరీ దివాకర్ల
శ్రీమతి వి.ఎస్. రమా దేవి గారు రాసిన చిన్న కథల పుస్తకం దేవుడికి ఉత్తరం.
వారీ కథలను పెద్దన్నయ్య వడ్ల పట్ల లోక రాజు గారికి అంకితం ఇచ్చారు.
ఈ కథలకు రావూరి భరద్వాజ గారు ముందు మాట సంగ్రహంగా రాసారు. చిన్నకథ లక్షణాలను తెలిపారు. చిన్న కథ ను రాయడం కష్టం, ప్రేమ కథలు సాధారణం. ఆ కథలలో చాలా మటుకు నాజూకు తనం ఉండదు. పేలవం గా ఉంటాయి అన్నారు. చిన్న కథలలో విషయం, చెప్పే విధానం, ముఖ్యమని స్పష్టం చేసారు. మన చుట్టూ నిత్యం అనేక సంగతులు జరుగుతుంటాయి. వాటిని చెప్పే నేర్పు ఉండాలి అన్నారు. ప్రతి సంసారం లో మామూలుగా జరిగే విషయాలను ముని మాణిక్యం గారు, సమాజం అంగీకరించని భావాలను గోపీచంద్ గారు రాసి ప్రత్యేకతను సాధించారు. సాధారణ విషయాలను గ్రహించ గలగాలి. గ్రహించినా రాయలేక పోవడం బలహీనత అని ఉన్న మాటను విన్న వించారు. రమా దేవి గారు విషయాలను ఎన్ను కోవడం లో వినూత్నమైన నేర్పు చూపారు. మొదటి నుంచి చివర వరకు చదివించ గలిగిన కథనం వారిది అని చెప్పారు. ఏ కథ కాకథ ఎంతో బాగున్నా రమా దేవి గారు తమ కథ పేలవం గా ఉంది అంటే ఒప్పుకున్నారట. నిజాన్ని ఒప్పుకోగల ధైర్యం ఆమె జీవితం లోనే కా దు కథల్లో కూడా ఉంది అని కథకురాలి స్వభావ గుణాన్ని సున్నితంగా వివరించారు.
ఇక రమా దేవి గారు తమ మాటగా ఈ కథల రచనా నేపథ్యాన్ని చెప్పారు.
ఈ కథలలో నిజం నిష్టూరం మరి రెండు కథానికలను తమ పధ్నాల్గు, పదిహేనేళ్ళ వయస్సులో రాసినవని ముందు గానే పఠితలను సిద్ధ పరచారు. అన్ని కథలూ పత్రికలలో ప్రచురణను పొందాయి. కథల రచనా కాల గమనం లో గల తారతమ్యం వాటి స్థాయి లో కనిపించిందని విన్నవించారు.
మొదటి కథ - దేవుడికి ఉత్తరం
సుశి, సీత ఇద్దరూ తమకు డబల్ ప్రమోషన్ వచ్చిన విషయన్ని చెప్పడానికి ఇంటికి వచ్చారు. సుశి ఇల్లు తాళం వేసి ఉంది. సీత తల్లి ప్రేమ గా ఆదరించింది.
సుశి ఇంటికి తిరిగి వచ్చి చీడీల మీద కూచుని ఏడుస్తూ అక్క కోసం ఎదురు చూసింది.
అక్క వనజకి చెల్లి బాధ తెలుసు.
సుశి అమ్మ సంగతి అడుగుతుందని వనజ కి తెలుసు. అమ్మ తిరిగి రాదని వనజకు తెలుసు. సుశి, వనజలు విచారంగా ఉన్నారని తెలిసిన అన్నయ్య రాము నిజం చెప్పాడు, అమ్మ చనిపోయిందని.
చనిపోవడం అంటే ఏమిటో కూడా తెలీని వయసు సుశిది.
ఆ పసి మనసును ఊరడించడానికి ప్రయత్నించారు నాన్నా, అన్నయ్య, అక్కలు.
పుస్తకాల అలమారు దగ్గరకు వెళ్ళి "దేవుడు తాతయ్య ! అమ్మను దబ్బును పంపు " అని ఉత్తరం రాసింది.
అమ్మ మేఘాల వెనక ఉంది, బట్టలు సర్దుకుని రెడీ గా ఉంది. నాన్న వెళ్ళి తీసు కొస్తాడని చెప్తే నమ్మింది.
దేవుడు తాతయ్య కు ఉత్తరం రాసాను. నాన్న వెళ్ళి తీసుకొస్తాడని ఎదురు చూసింది.
అసలు విషయం తెలిసిన సీత తల్లి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
తండ్రి ఎవరో కొత్తావిడతో వచ్చాడు. అమ్మ ఊరు వెళ్ళి చాలా రోజులయింది కనుక మారి పోయిందని వనజ చెప్తే నమ్మింది సుశి.
పై కథ సున్నిత మైన పసి హృదయాలను ఆవిష్కరించింది. ప్రతి వాక్యం అతి కోమలమైన వస్తు నిర్మాణానికి బలాన్నిచ్చింది. రచయిత్రి లేత మనసు ఈ కథలో ప్రత్యక్షం అయింది.
రెండో కథ మరీ విపరీతం. సరస్వతమ్మను గురించిన కథ. హఠాత్తుగా ఆవిడకు సుశి మీద అభిప్రాయం మారింది. ముందు ఆమె సుశి కి గర్వం అనుకుంది.. తన పిల్లలతో కలివిడి గా ఉంటే ఆత్మీయతను చూపింది. కాని సుశి తన భర్త తో చనువు గా మాట్లాడితే మాత్రం నచ్చదు. సరస్వతికి ఆయనని లొంగదీసుకుంటున్న అభిప్రాయం కలుగుతుంది. "మీతో జోక్యం పెట్టుకోనంత వరకే ఎంత మర్యాదైనా చేసేది. అంటూ మనసులోని మాటను చెప్పేస్తుంది.
ఈ కథ ఆడవారి మనసులోతుల్ని తెలుపుతుంది. సాధారణమైన గృహిణి సరస్వతి. తన భర్త తనకే స్వంతం అనుకున్న సంకుచితత్వం లోనే బోళా తనాన్ని కలగలిపి ఆమె స్వభావాన్ని నిరూపించారు రచయిత్రి. నిముషాని కో అభిప్రాయం మార్చుకుంటున్న భార్య మీద భర్త చిరాకు పడడం వారి సంసారం లోని సరిగమల గమకాలను నొక్కుతుంది.
మూడవ కథ జాలి పడటం లేదు కదా! మనుషులకు అనవసరమైన పర చింతన కథ. ఇతరులను గూర్చిన అసూయతో కూడిన ఆలోచనల కథ. వయసులో పెద్దవాడు సుబ్రమణ్యం. కళాశాలలో విజయ తోటి అధ్యాపకురాలు . ఆమెకు మంచి పేరుండడం, ఆమెకున్న సామర్థ్యం అతని పెద్దరికానికి లోకువ చేసినట్లు ఇన్ ఫిరియారిటీ కాంప్లెక్స్ తో మధన పడతాడు. ఆమె చేస్తున్న కార్యక్రమ నిర్వహణలో జోక్యం కల్పించుకుని ఆరాలు తీస్తాడు.
ఇతరులందరూ కలసి కట్టుగా ఉండడం, సహించలేడు. తనకి తగినంత గౌరవం ఇవ్వటం లేదని సాడిస్టు బుద్ధిని ప్రకటిస్తాడు. విజయ ఇతరులతో కలసి ఉండడం కంటకం అవుతుంది. మూర్తి కి విజయకు విభేదాలు కలగాలన్న ఆలోచనలతో తృప్తి పడతాడు. అందరూ తనను అడిగి సలహాలను తీసుకోవాలని భావిస్తాడు.
తన ప్రమేయం లేకుండానే కాలేజీ నాటక సంసిద్ధత జరిగింది. అతని మనసు తపన పడింది. తానెన్ని వంకర మాటలు మాట్లాడినా అందరూ తనపట్ల గౌరవం చూపించడం , వాళ్ళందరూ తన పట్ల జాలి చూపిస్తున్నారేమో అన్న ఆత్మ న్యూనత కలిగింది.
ఈ సంపుటి లో ఏకబిగిని చదివించిన కథ ఇది. పెద్దతనం అన్నది వయసుకు వచ్చింది. కాని మనసు పక్వం కాలేదు.
నాల్గవ కథ "నిట్టూర్చింది".
గ్రహణం మొర్రి ఉన్న సుమతి కథ. తన ఆకారాన్ని గురించి ఇతరుల వ్యంగ్యం విని బాధ పడుతుంది. మేనమామ కొడుకు చంద్రం తిరస్కరించినప్పుడు బాధ పడింది . ఇక పెళ్ళి గురించి ఆలోచనలు మానింది. తన గురించి తాను ఎంత నిగ్రహించుకున్నా ఇతరుల మాటలు సహించలేకపోయింది. తను చదువు కుని తనంతట తాను స్థిరపడాలని అనుకుంటుంటే ధభీ మని కింద పడేస్తున్నారు. తన అవకరాలను తను ప్రేమించదలచింది. స్థిర నిర్ణయం తో నిట్టూర్చింది. తన నల్లటి రం గునూ, మూతి వంకరనూ, తను కాక పోతే ఎవరు రక్షిస్తారని, దృఢచిత్తం తో ఓడి పోకూడ దనుకుంది. మహిళలకు మనో బలాన్నందిచిన కథ.
అయిదవకథ "ఇదీ నా బాధ"
రచయితలను గురించిన లోక వ్యవహార కథ. యథాలాపం గా సాగిపోతుంది.
ఆరవ కథ వడ దెబ్బ
ఎంతో ఆపేక్ష చూపిన ఇల్లాలి కథ. ఇంటికి రమ్మంటుంది. ఎంతో ఆప్యాయం గా వండి వడ్డిస్తుంది. చక్కగా క్షేమ సమాచారాలు కనుక్కుంటుంది. స్వవిషయాలను వివరించి చెప్తుంది. డబ్బు ఆదా చేసుకోవాలని హితువు చెప్తుంది. ఆవిడను పరామర్శించడానికి వెళ్ళిన నిర్మలకు ఆవిడ తనను మనస్ఫూర్తిగా విశ్వసించ లేదని తెలిసింది. పై పై నటనగా ఆమె ప్రదర్శించిన వాత్సల్యానికి వడ దెబ్బ తగిలినట్లయింది నిర్మలకు.
డబల్ టైఫాయిడ్
ఇది నిజంగానే రెండింతలు షాక్ ఇస్తుంది . రజని శశి మధు ల కథ. మధు శశి ని ఇష్ట పడు తున్నాడని అనుకుని, రజని దూరంగా ఉంటుంది. కాని మధు తనను వలచిన విషయం తెలిసి ప్రేమను వ్యక్తం చేస్తుంది. ఇంతలో ఊరు ప్రయాణానికి సిద్ధమైన మధు అపఘాతం లో మరణించాడు .రజనికి డబల్ టైఫాయిడ్ వచ్చింది.
ఏడవ కథ. భ్రాంతి
ఇది మానసిక సంఘర్షణలను నిరూపించిన కథ. ఉదాత్తమైన అంశం. జీవన వాస్తవాలను అంగీకరించిన మనుష్యుల కథ. సుబ్బారావు సుజాత ఒకరినొకరు ఇష్ట పడ్దారు. ఈ ఇష్టం కూడా చిత్రమైన పరిస్థితులలో కలిగింది. ఇతరులందరూ వీరిరువురి నడుమ లేని సంబంధాన్ని కల్పించటం వల్ల వీరిలో నిజమైన ప్రేమ అంకురించింది. సుజాత కుటుంబ పరిస్థితులను కాదనలేక సుబ్బా రావుకు దూరమయింది. సుబ్బారావు నాన్న ను కాదనలేక వివాహం చేసుకున్నాడు. అటు తరువాత ఆమె అవివాహితగానే ఉండి పోడానికి తాను కారణం కాదనుకుని భ్రాంతి పడి తృప్తి పడ్డాడు. కాని నిజంగా తనను వలచి నందువల్లనే ఆమె అలా ఉండి పోయిందన్న విషయం అతనికి తెలుసు. రమా దేవి గారు మనో విశ్లేష కులని తెలుపుతుంది ఈ కథ.
కళ్ళ తో చూసిందంతా నిజం కాదు అని అతి చక్కగా చెప్పినకథ "కళ్ళకు కట్టింది." ఇందులో పాత్రలు రేఖ, ప్రమీల, -అన్నయ్య, వదినలు. అన్నయ్యకు ఒంట్లో బాగులేనప్పుడు రేఖ ఆప్తురాలిగా సహాయం చేసింది. వదినకు ఒంట్లో బాగు లేనప్పుడు అన్నయ్య తలనిమురుతూ రేఖ అతనికి దగ్గరగా ఉండడం ప్రమీల అపోహ పడింది. రేఖ మంచి తనాన్ని ప్రమీల అపార్థం చేసుకుంది.
మరొకప్పుడు స్వయంగా ప్రమీలకు కలిగిన కష్టానికి భర్త అన్నగారు ఆమె తలను నిమురుతూ ఓదార్చి ఆప్యాయతను చూపినప్పుడు ఆనాటి రేఖ ప్రవర్తన ఆమె కళ్ళకు కట్టింది. పశ్చాత్తప్తురాలయింది.
ఎగుడు దిగుడు లలిత శేఖర్ ల కథ. లలిత లాభాలకు పొంగిపోదు. నష్టాలకు దిగులుపడదు స్థిత ప్రజ్ఞురాలు. ముందు ఆమె స్వభావాన్ని అర్థంచేసుకోక నిందించాడు శేఖర్. నష్టం కలిగినప్పుడు కుంగిపోదు లలిత. అతని మీద ఆర్థిక పరమైన చేయూత నిచ్చి సంసారాన్ని నిలదొక్కింది. కథను చదివిన వారికి లలిత అంటే గౌరవం, ఎగుడు దిగుళ్ళకు వశం అయ్యే శేఖర్ అంటే జాలి కలుగక తప్పదు.
భవిష్యత్తు వైపుకు కథ ఒంటరిగా గమ్యం చేరలేని సామాన్యు యువతి బ్రతుకు కథ. రామి వేంకటేశును మారు మనువాడడానికి గల నేపథ్యాన్ని స్త్రీ కోరుకునే మాతృత్వ భావన తో నాజూకుగా ముడి వేసారు రచయిత్రి.
నిజం నిష్టూరం కథలో పేద ధనిక స్త్రీలు ఇద్దరకూ ఒకే విధమైన కష్టం వచ్చింది. ఆ బాధ ఇద్దరికీ ఒకటే. కాని ఉన్న వెసులు బాటు వేరు . ఈ నిజాన్నే నిష్టూరంగా కథలోని పాత్రతో చెప్పించారు.
వెలుగు-నీడలు వీరయ్య మల్లి కథ లో మొదటి సారి పట్టిన ముసురుకు తల్లి కాబోయి చచ్చి బతికింది మల్లి. మల్లి ని ప్రాణం గా ప్రేమించిన వీరయ్య మనసు కుదుట పడింది. రెండో సారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ముందు జాగ్రత్తతో ఇక అంతటా వెలుగు నిండింది.
ఎక్కడికి పోస్ట్ చేయను? అంటు రోగాలను లెక్కచేయ సేవ కావించిన అన్న చెళ్ళెళ్ళ కథ. కాని బ్రతికి బట్ట కట్టాలంటే బంధాలు కాదు, జాగ్రత్తలు ముఖ్యమని హెచ్చరించిన కథ.
రమా దేవి గారు నిశితమైన దృష్టి తో చుట్టూ జరుగుతున్న సంగతులను పరిశీలించారు. మనకన్నీ తెలిసిన విషయాలనే కథలుగా ఎన్నుకున్నారు. స్త్రీ స్వభావాలను వివిధ కోణాలలో పరిశీలించారు. చిన్న పిల్లలా దేవుడికి ఉత్తరం రాసి మనలను కూడా అమ్మ వస్తుందని ఎదురు చూసేలా చేసారు. మనిషి లోపలి మనిషి ని చూపించి, ఇతరులు తన పై జాలి పడడం లేదు కదా అనుకున్న మనో సంఘర్షణను వెలికి తీసారు. ఎక్కడికి పోస్ట్ చేయను? కాల సమన్వయాన్ని సాధించింది.
శ్రీమతి రమాదేవి గారు ప్రతి చిన్న కథలో పెద్ద ప్రయోజనాన్ని సాధించారు. ఈ కథలను చదివిన స్త్రీలకు లోక వ్యవహార జ్ఞానం అలవడుతుంది. కుటుంబ బాంధవ్యాలను, ఔద్యోగిక వాతావరణం లోని చిత్త వృత్తులనూ తెలిపే కథలను రచయిత్రి 1961 వ సంవత్సరంలో రాసారు. ఇప్పటికి 2021 దాటినా ప్రభవించే చిగురాకు ఆలోచనలతో పిల్ల గాలులను వీస్తూనే ఉంటాయి.
*****