top of page

సంపుటి 1    సంచిక 4

వ్యాస ​మధురాలు

సాహిత్య డిటెక్టివ్ కధ

Jada Subbarao

మెడికో శ్యాం

నేను నా గురించి ఏం రాసినా, ఏం చెప్పినా ఇప్పటి నా గురించి కాకుండా ఎప్పుడో ఎక్కడో వుండిన నా గురించి చెప్పాలి, కధకుడిగా, కవిగా, రచయితగా…  అప్పుడు నా పేరు 'మెడికో శ్యాం'.  అలా అని నేను పెట్టుకోలేదు.  స్టూడెంట్ ఆఫ్ ఈస్థెటిక్స్, ఓ మెడికో శ్యాం అని రాసాను.  మరి ఆ పత్రికవాళ్ళు 'మెడికో శ్యాం' గా వేసారు.  ఎందుకంటే     అది ' మెడికొ ప్రేమగీతం '.   ఇంకా నేను సి.శ్యాం, షై, బద్రీనాథ్ అనే పేర్లతోనూ రాసాను.

చాలామంది నేను ఎక్కువగా చదివాను అని భావిస్తే మా నాన్నగారు   నేను చదివేది తక్కువ, మిగతా వ్యాపకాలు ఎక్కువ అని భావించేవారు.  నేను ఇంకా ఎక్కువ చదివితే మంచిది, నేను ఇంకా ఎక్కువగా, ఇంకొంచెం బాగా రాయగలిసేవాణ్ణని భావించేవారు.  ఆయన సాహిత్య అభిలాషా, పుస్తకపఠనం, పుస్తకసేకరణల గురించి రాయడం అనవసరం.

ఒకసారి నేను నాకు సహజమైన నా ధోరణిలో  ( దానికి ఏ పేరుపెట్టాలో నాకు తెలియడంలేదు)  ఎక్కువ రాసినవాళ్ళందరూ  అంత ఎక్కువగా ఎలా చదవగలరు?  మీ ఉద్దేశ్యంలో  ఆస్కర్ వైల్డ్, షా వీళ్ళందరూ అలా చదువుతూ కూర్చుంటే ఎప్పుడు రాస్తారు?  తమ తమ జీవితాల్లోంచి, ఉద్దేశ్యాల్లోంచి రాస్తారు.  అంతేగాని పుస్తకాలు చదివి కాదు.  మహా అయితే క్లాసిక్స్ చదివి వుంటారు.  నేనూ ఆ మాత్రం చదువుతున్నాను గదా.  చదివేవాళ్ళు చదువుతారు.  రాసేవాళ్ళు రాస్తారు, అనేశాను.

 

ఆయనేం మాట్లాడలేదు.

 చాలా ఏళ్ళ తర్వాత అన్నారు, 'నిజమే నువ్వు అన్నది ' అని.

ఆ సరికి నేను మర్చిపోయాను ఆ విషయం.

'ఏమిటి?' అన్నాను.

'నిజమే. అందరూ చదవక్కరలేదు.  నువ్వు అంత చదవక్కర లేదు.' అన్నారు.

నేను ఆశ్చర్యపోయేను.

ఒక విధంగా చెప్పాలంటే  ఐ వజ్ హంబుల్డ్.

'కాదు.  కాదు.  వీలయినంత ఎక్కువగా చదవాలి.  నేను నా ఫ్లాంబొయెన్సులో  అలా అన్నాను గాని, నిజానికి  రాద్దమనుకుంటున్న ప్రతివాడూ ఎక్కువగా చదవాలి' అన్నాను.

నా బాల్యం:

' కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృధ్ధులు ' అన్నది ఎందుకన్నా ఏసంధర్భంలో అన్నా నా విషయంలో కొంతవరకూ నిజమేనేమో అన్పిస్తుంది.  నేనా ఢిల్లీలో ఏదో స్కూల్లో, గొపీనాథ్ బజారుకి దగ్గర్లో ఢిల్లీ  కంటొన్మెంట్లో చేరినట్టూ, ఆస్కూలు గదిగోడలు నీలం రంగులో వున్నట్టూ గుర్తుంది. అక్కడినుంచి విజయనగరం స్కూల్లోకి మారినపుడు మొదట్లో టోపీ, బూట్లూ, సాక్సూ, యూనిఫారాలు మెల్లమెల్లగా ఎగిరి చెప్పులుకూడా లేకుండా స్కూలుకు వెళ్ళే స్థితికి ఎదిగాను.  విజయనగరం కొత్తపేట బ్రాహ్మణ  వీధి స్కూలు (మంగాయి బడి).  ఆరు నుంచి ఎనిమిదో క్లాసుదాకా బ్రాంచి కాలేజీ, మూడులాంతర్ల దగ్గర ఎమ్మారెంపీస్కూలూ.  ఆతరువాత తొమ్మిదీ పదీ పెద్దకాలేజిలో వున్న ఎమ్మారెంపీ హైస్కూల్.  తరువాత ఎమ్మర్కాలేజ్.

విజయనగరంలో గురాచారి వారి వీధిలో దక్షిణ  భారత హిందీ  ప్రచారసభ  వాళ్ళ హిందీ స్కూల్లో ప్రాధమిక నుంచీ విశారద దాకా.

అన్ని భాషలలోనూ  ప్రావీణ్యం వున్నా లేకపోయినా వుత్సాహం  బాగా వుండేది.  ఇంగ్లీషు బాగా రావాలనీ, వచ్చుననీ భావనలు వుండేవి.  ప్రయత్నమూ వుండేది.  ఇంగ్లీషులో కొన్ని కవితలూ వ్యాసాలూ రాసే ప్రయత్నం చేయడమూ జరిగింది.

తరువాత విశాఖపట్నంలో ఎంబీబీఎస్.  హాస్టెల్.  కొత్తజీవితం.

కొత్త ఊరు.  కొత్త పరిచయాలు.  విశాఖ బీచి, యూనివర్సిటీ.  ఎట్సెట్రా.  ఎట్సెట్రా.  చదువూ.

చదవడం.  సినిమాలు.  రాయడం.  అన్నీ గబ గబ.  చకచక.

తీరికలేని తీరుబడి జీవితం!

రకరకాల ఇంట్రెస్టులూ, ఎట్రాక్షన్సూ.  వైద్యవిద్యలోనూ.  సాహిత్యంలోనూ.

వైద్యవిద్యకి సంబంధించిన చదువూ బాగానే చదివేనేమో.

ఏదొ ఒకే ఇంట్రెస్టు వుండివుంటే బాగుండేదా? లేక ఇదే బాగా?

బాగోగులు సరిగ్గా చెప్పలేను. 

మా నాన్నగారు:  సి.ఎస్.శర్మ.  చిర్రావూరి సర్వేశ్వర శర్మ.  'ఢిల్లీ శర్మగారు ' అనేవారు.

 మా అమ్మ సి.లలిత.

మేం నలుగురం.  ఇద్దరూ ఇద్దరూ.

నేను కాకుండా తతిమ్మా ముగ్గురూ ఎలక్ట్రానిక్స్ ఇంజనీయర్స్.  కాకినాడ ఇంజనీరింగు కాలేజీలో చదివారు.

మా ఇంటినిండా పుస్తకాలు.  మరీ చిన్నప్పుడు మా నాన్నగారికి ఢిల్లీనుంచి బెంగుళూరికి ట్రాన్స్ఫరయితే, పార్సలయి వచ్చిన పుస్తకాలని, కారుమేఘాలు కమ్మి, వర్షం వస్తూ వచ్చేస్తూ వచ్చినవేళలో ఒంటెద్దుబండిలో విజయనగరం స్టేషన్  నుండి  ఆ పుస్తకాల గుట్టలని (పార్సిలు ఊడిపొయిన) బండినిండా నింపుకుని నేనూ, మా అమ్మా రావడం గుర్తు.  ఒక పుస్తకం పడిపోతే, ఆ బండివాడితో మా అమ్మ పడిన గొడవ ఆవిడ సాహిత్యాభిలాషకి నిదర్శనంగానే భావిస్తాను.

 రెండోక్లాసులో మానుండి విడిపోయిన కొయ్యా ప్రసాదూ, ఇంటర్లో మా నుండి విడిపోయి పాకిస్థాన్ వెళిపోయిన వహీదూ గుర్తొస్తూవుంటారు.  కిషన్ చందర్ పుస్తకంలో విడిపోయిన మిత్రులలాగే  తనకీ జరిగిందనీ 'సలీం' అనే మిత్రుడు  పాకిస్థాన్ వైపు వెళిపొయాడనీ  మా నాన్నగారు నాతో  అన్నారు.

ఒకటీ  ఒకటీ అలా అలా చాలా బహుమతులు (లిటరరీ కాంపటీషన్స్ లో) వచ్చి, వస్తూ వున్నప్పుడు 'అక్షరలక్షల 'ని సంతోషపడే మా అమ్మ ప్రోత్సాహం... కూడా ముఖ్యమైనదే.

మా ఇంట్లో వున్న పుస్తకాల్లో వీలయినవీ, చదవగలిగినవే కాకుండా ఎక్కడ ఏ పుస్తకం దొరికినా చదవగలిగితే చదివేను.  ఆ విషయం నా రాతల్లో తెలుస్తుందనే  అనుకుంటాను. 

డిటెక్టివ్ పుస్తకాలు దొరికిన మేరకి చదివేను.  ఆరుద్రగారి, కొమ్మూరి సాంబశివరావుగారి,  టెంపోరావుగారి కధలూ, నవలలూ, బాగా నచ్చేవి. ఇన్స్పెక్టర్ వేణూ, చంద్రం, రుక్కూ, రవీ, కెడీనరిసిగాడూ, ఎర్రగుర్రం, టూ టౌన్ పోలీస్ స్టేషన్ గుర్తొస్తూ వుండేవారు. వి. యుగంధర్, రాజు, కాత్యా, ఎక్కువగానూ, లాయర్ విశాలాక్షి, ఆనందరావులు కొద్దిగానూ కన్పిస్తుండేవారు.

 ఒక కధలో (సిగరెట్ ప్యాకెట్లో రహస్యం) నేరస్థుల్ని వెంటాడుతూ  ఆగి కారుదిగి రోడ్డు మీది గాజుపెంకుల్ని తీసిపారేసిన యుగంధర్ చాలాసార్లు  గుర్తు వస్తాడు ఇప్పటికీ.

   ఏడడుగుల వాలిగారూ, గిరీ, పరశురాం - అతగాడి తిండి ఇంట్రెస్టులూ, సంగీతం సరదాలూ, వుడ్బైన్ సిగరెట్టూ, 'కదిలే కంచాలూ, తిరిగే మంచాలూ '  అశ్వ ధ్ధామా, మిస్ సురేఖ, అక్వేరియం, మరిగుజ్జు మంజూ, తిరిగితిరిగి గుర్తొస్తూవుండేవారు.

 ఇక్కడ రాయడానికి వీలులేనన్ని పేర్లూ, వాళ్ళ కార్ల పేర్లూ, ఇంకా ఇంకా వివరాల రెడీరెకనర్ని నేను.  నేనూ రాసేను డిటెక్టివ్ శ్యాంసుందర్ పరిశోధనలు: 'బ్లాక్ మెయిలింగ్, 'ఎవరా ఎక్సు ? ', 'నేరం దాగదు', ఏడవక్లాసులో.  

    అదేవిధంగా, పరోపకారి పాపన్న, గుండుభీమన్న ఇంకా చాలా చాలా చందమామ కధలూ ఇష్టమే నాకు.  బేతాళ కధలు చాలా ఇష్టంగా వుండేవి.  మరీ పాత చందమామ కధలు చదవడానికి శ్రీమతి తెన్నేటి అన్నపూర్ణమ్మగారింట్లో పుస్తకాలు (చందమామలు)  బైండు చెయ్యడానికి తయారయ్యేను.

 మా విజయనగరంలో పార్కు  చెరువుకి ఎదురుగా వున్న వెన్లాక్ లైబ్రరీ, అయ్యకోనేరు కి ఎదురుగా వున్న లైబ్రరీ మూసేసే వరకూ కూర్చొనేవాడిని వీలుకుదిరినప్పుడు.

 హిందీ స్కూలువలన, హిందీ క్లాసుపుస్తకాల వలన, ఎందరో కవులూ, కధకులూ పరిచయమయారు.  చాయావాదం, రహస్యవాదం, ప్రగతివాదం, ప్రయోగవాదం  లాంటి వాదాలూ, ప్రేంచంద్, జైనేంద్రకుమార్, ' అశ్క్ ' వంటి  పేర్లూ, సుమిత్రానందన్  పంత్,  మైథిలీ శరణ్ గుప్త్, జయ్ శంకర్ ప్రసాద్, సూర్యకాంత్ త్రిపాఠీ ' నిరాలా ',  సుభద్రా కుమారి చౌహాన్లూ కబీర్దాసులు, సూరదాసులూ, రహీంలూ వీరందరి పేర్లూ,  రకరకాల కవితలూ,  రచనలూ తెలిసేయి.

ఆ రోజుల్లోనే  కొ.కు.గారి 'ఫాలౌట్ ', రావిశాస్త్రిగారి 'వర్షం ' వగైరాలున్న 'మాడంతమబ్బు' అనే కధా సంకలనం చదివేను.  సి.రామచంద్రరావు గారి 'నల్లతోలు ' ఎక్కువగా నచ్చేది.  అరిగే రామారావు గారి 'నచ్చినోడు ' మళ్ళీ మళ్ళీ చదివేవాణ్ణి.  అలాగే రావికొండలరావుగారి ' మాయమైన మనీపర్సు '.  రుద్రాభట్ల నరసింగరావుగారు రాసిన, 'వరలక్ష్మికి వరుడు ' చాలా  నచ్చేది.  తిలక్ గారి 'సీతాపతి కధ 'చాలాసార్లు  చదివినట్టు గుర్తు.  కధ మొదట్లోని  వాక్యాలు బాగా నచ్చేవి.

కుటుంబరావుగారి 'సాహసం ' అనే కధ బాగా నచ్చింది.  పాత తెలుగు స్వతంత్రలూ, ఆంధ్రజ్యొతులూ (మాస పత్రిక), భారతులూ, ఆంధ్రపత్రికలూ చదివేవాణ్ణి.  శ్రీవాత్సవగారి సాహిత్య సింహావలోకనం  వ్యాసాలు నచ్చుతూ  వుండేవి.

ఆంధ్రపత్రికలో వచ్చిన 'అయిదు రెళ్ళు '(మందరపు లలిత), ఆంధ్రప్రభ 'లో వచ్చిన 'మంచు బొమ్మలు '(భట్టిప్రోలు  కృష్ణమూర్తిగారిది వేల్పూరి సుభద్రాదేవి పేరుతో) సీరియల్సు  చాలా నచ్చుతూవుండేవి.

 'రమణ ' (ముళ్ళపూడి) గారి రచనలూ చాలా నచ్చుతుండేవి.

తరువాత ఎమెస్కొ పాకెట్ బుక్సూ, పుస్తక ప్రపంచం  వీలయినపుడూ  చదివేను.

 కొమ్మూరి వేణుగోపాలరావుగారి  'హౌస్ సర్జన్ ' నవల చాలా చాలాసార్లు చదివేను.  వారి 'మర మనిషి' అనే కధ ప్రత్యేకించి గుర్తొస్తూ వుంటుంది.  'ఆకర్షణ ' అనే చిన్న నవల కూడా గుర్తొస్తూ వుంటుంది. అది ఒక రకంగా 'హౌస్ సర్జన్' కి సీక్వెల్.

  'జగతి ' మాసపత్రికలో వచ్చిన ఎన్ ఆర్ చందూర్ గారి ' చలికాలం' ఆంధ్ర జ్యోతిలో వచ్చిన 'దీపాలవెలుగు ' అనే ఈ 'శాంతాదేవి ' కధలు నాకు చాలా బాగా నచ్చి నేనాయనకి రాసినట్టూ ఆయన నాకు ఓ 'జగతి ' ఫ్రీ కాపీ పంపినట్టూ గుర్తు.

మా నాన్నగారు 'చిత్రగుప్త ', 'వినోదిని ' ఇంకా చాలా పీరియడికల్స్ లో 1938, 1939 ప్రాంతాల్లో ప్రచురించిన రచనలన్నిటినీ కాపీచేసి  తిరిగి ప్రచురించే ప్రయంత్నంలో  అవన్నీ చదివేను.  ఆయన రాసిన రచనలు చాలామట్టుకు నాకు చాలా బాగా నచ్చినా ఆయన ఎంతో చదువుకున్న మనిషైనప్పటికీ నేను క్రమక్రమంగా ఆయన అభిప్రాయాల్ని అంగీకరించలేకపోయేవాణ్ణి.  ఎక్కడో ఒకచోట  నేను విభేదించేవాణ్ణి.  ఆ స్వాతంత్రం ఇవ్వడం ఆయన గొప్పదనం.

   విజయనగరంలో చాలామంది రచయితలకీ, కధకులకీ చాసోగారు గురువుగారు.  మా స్నేహితుల్లో  చాలామంది ఆ విషయం చెప్పుకున్నారు.  పతంజలీ(కె.ఎన్.వై), దాట్ల, అరుణకిరణ్, చాగంటి శంకర్ మొదలయినవాళ్ళు. పంతుల జోగారావుతో  పరిచయం లేకపోయినా వున్నట్టే.  పతంజలీ నా మాటల్లో, దాట్ల నారాయణ మూర్తిరాజు మాటల్లో తరచూ వచ్చే పేరే.  కాని నేను చాసోగారిని నా గురువుగారు అనలేను.  రోజూ కాకపోయినా తరచూ ఆర్ అప్పలస్వామిగారితో మా ఇంటికి వచ్చే చాసోగారితో దగ్గర పరిచయం వుంది.  వాళ్ళ ఇంటికి తరచూ వెళ్తూ వుండేవాడిని.  వాళ్ళ పిల్లలందర్తోనూ, ఆయన శ్రీమతిగారితోనూ చాలా దగ్గరతనం వుండేది.  ముఖ్యంగా వాళ్ళ అమ్మాయి తులసిగారు తర్వాత విశాఖపట్నంలో ఎం.ఫిల్ చెయ్యడం, మా హాస్టెల్కి దగ్గరగానే వుండడంతో ఆ పరిచయం పెరిగి స్థిరపడింది. 

నేను రాసిన 'కధలు రాయడం ఎలా?' అనే వ్యాసాన్ని విశాఖపట్నం రేడియో కేంద్రానికి సబ్ మిట్ చేసింది ఆవిడే.  సోమయాజులుగారు ఒకసారి నేను రాసిన కవితని సంస్కరించే పధ్ధతిలో తిరిగిరాసినా ఆ విధమైన శిష్యరికం కుదరలేదు, నా స్వభావం వలన.  ఆయన మాటల్లోనే, 'నువ్వు అడగక పోయినా (చదవమని), నీ కధ చదివేను.  ‘బాగుంది.’  అన్నారు.  బహుశా 'ఇదీ మా కధ ' అనుకుంటాను.  ఇది ఆయన గొప్పతనం, అడగకుండా చదివి అభిప్రాయం చెప్పడం.  నా మీద అభిప్రాయం కొద్దిగా అటూ ఇటూగా వున్నా చాలా అభిమానంగా వుండేవారు. 

విజయనగరంలో వున్నన్నాళ్ళూ రోజూ మాఇంటికి వచ్చే ఆర్ అప్పలస్వామిగారు అనే రోణంకిగారు, మానాన్నగారికి చాలా దగ్గిర స్నేహితులు.  ఆయనంటే మానాన్నగారికి చాలా గౌరవం.  'మాష్టారూ' అనితప్ప మరోపేరుతో ఎన్నడూ ఆయన్నిగురించి మాట్లడేవారు కాదు.  మాట్లాడేవాళ్ళం కాదు. కాని నాకు ఆయన మాష్టారు  కాదు.  నేను ఆయన దగ్గిర చదువుకోలేదు.  ఆయనకు తన స్టూడెంట్స్ పై వుండే అభిమానం, తన స్టూడెంట్స్ కానివారి పై వుండేదికాదు.  నేను ఆయన  దగ్గర ఏమైనా  నేర్చుకున్నానా?  ఆ విజ్ఞాన మహాసాగరం నుంచి నాకేమైనా దక్కిందా?  అనుమానమే.  ఆయన తుళ్ళ కసుర్లను తట్టుకుని నేర్చుకునే ప్రయత్నం చేసే నిదానం అప్పుడు నాకు లేదు.  ఇప్పుడుందా?  తెలీదు.  నేను కనకల కృష్ణ, మానేపల్లి సత్యనారాయణల వంటి వినయశీలుణ్ణికాను.  నా అదృష్టవశాత్తూ చాలామంది టీచర్సుకీ, లెక్చరర్సుకీ నేనంటే ఎంతో అభిమానం.  ఆ అదృష్టం అప్పలస్వామిగారి దగ్గర దక్కలేదు.  నేను నా రచనలు మాష్టారుగార్ని చదవమని అడగలేదనే విషయం మా నాన్నగారికి ఆశ్చర్యమే.  మనకి తెలిసిన (గొప్ప) రచయితలందరూ తమ రచనలు చదవమని అడుగుతున్నారా? అన్నది నా ప్రశ్న.  మనమే చదువుతున్నామన్నది నా అభిప్రాయం.

ఒక విధంగా మాష్టారితో చాలా దగ్గర సంబంధం వున్నట్టే లెఖ్క.  అందుకే మాష్టారి గురించి ఈ విషయాలు ఇప్పటికీ నన్ను ఆలోచింపజేస్తున్నయేమో.  తను పుస్తకపఠనం ద్వారా మహోన్నతమైన ఆనందాన్ని అనుభవించానన్నరాయన.  అదే సరియైన నిజమైన సాహిత్య ప్రయోజనమేమో అన్పిస్తుంది.  శ్రీశ్రీ గారికీ, మాష్టారికీ జరిగిన వెర్బల్  డ్యూఅల్  చాలా విచారకరంగా, మాస్టారిపట్ల అన్యాయంగా బాధగా అన్పిస్తుంది.  మహానుభావులు కూడా  మామూలు మనుషులేనా?  ఆశ్చర్యకరమైన సత్యంగా అన్పిస్తుంది.

ఇక విజయనగరంలోనే 'ప్రశాంత నిలయం' అనే లాడ్జిలో శ్రీ శ్రీ గారిని కలిసేను.  ఆయన్ని మా స్కూలుకి రమ్మని పిలవడానికి.  ఆయన రాలేనన్నారు.  శ్రీ శ్రీ గారు ఏమని  ప్రోత్సహించేరో  రాయడం  కొంచెం ఎక్కువ రాయడం అవుతుంది.

 దాశరధి (కృష్ణమాచారి) గారి రిక్షా వెనకాతల ప్రకాశం  పార్కునుండీ  పాత బస్టాండుదాకా   పరిగెట్టేను. బహుశా పక్కన అరుణ కిరణ్ వున్నాడు. 

'విమానంలో వచ్చి నా మానం కాపాడేరు నారాయణరెడ్డిగారు' అన్నారు మానాప్రగడ శేషశాయిగారు.

విన్నాము  మేమందరం, నారాయణరెడ్డి గారి, 'ఎవరన్నారివి కన్నులనీ' పాట మీద ఆయన కవిత్వం మీద ఆయన అభిప్రాయాలు. 

తెన్+కు = తెనుగు అనీ, తెలుగు కు, కుయి భాషల్లో 'కు ' కు చెందినదనీ, అన్న ఆరుద్రగారిని విన్నదీ విజయనగరంలోనే.  సమగ్ర ఆంధ్ర సాహిత్యం చదివి ఆఖరి  వాల్యూం కోసం ఎదురుచూస్తూ అందులో ఏమేం మరిచిపోకూడదో ఆయనకే రాసేను!  ఆయన  ఒక కార్డు రాసి ప్రోత్సాహంతోపాటు కాస్త కాషన్ నీ జతచేసారు.  ఆకార్డు ఇవాళ నా దగ్గర లేదు.  అవార్డులతోనే మనుషులు గొప్పవారవుతారా?  అని ఆయన అన్నా ఆయనికి రాని పద్మ, జ్ఞానపీఠ్ అవార్డులు ఇవాళ కూడా నన్ను కలత పెడతాయి.

 మా హిందీ హెచ్ ఒ డీ అప్పలరాజుగారు (ఆయన కృష్న్ణశాస్త్రిగారి కవిత్వాన్నీ  చాయావాద కవి సుమిత్రానందన్ పంత్ కవిత్వాన్నీ కంపేరు చేసి థీసిస్సు రాసేరనుకుంటాను) నన్ను దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి దగ్గరకు తీసుకువెళ్ళేరు.  తన కవిత్వం మీద, అభ్యుదయ, విప్లవకవిత్వాల మీద నేను వేసిన ప్రశ్నలకి సమాధానాలు రాసి, నన్ను మెచ్చుకొని ప్రోత్సహించేరు.  ఆల్ పోయెట్రీ  ఈజ్ వన్.  శ్రీ శ్రీ కీ తెలుసు అనీ.  కె వి మహదేవన్ చాలా గొప్ప సంగీతకారుడు  అనీ అన్నట్టు గుర్తు.  

విశాఖపట్నంలో భరాగో, విశాఖసాహితి, ఇంకా చాలా మందితో పరిచయాలు.  సుశ్మితారమణమూర్తి, ఆదూరిదంపతులు, అడపా తడపా రాసే అడపా రామకృష్ణ, ఇందూరమణ  ద్విభాష్యం రాజేశ్వర్రావుగారు వగైరాలు కొంతమంది.

ఆరోజుల్లోనే ఒకసారి మా హాస్టెల్కి అది ప్రశ్న- ఇది జవాబు: అవసరాల రామకృష్ణారావు గారు  వెతుక్కుంటూ వచ్చేరు.  కొన్ని ప్రశ్నలు సీరియెస్ గా అడిగి వెళ్లిపోయేరు.

 భరాగో ఇంట్లో ఆకర్షణలు: హిందీ 1963 హిట్స్ ఎల్ పీ, హం దొనో లో అభినా జావో  చోడ్  కర్  పాటా, లతా-ఆశా డ్యూయెట్స్ ఈ పీ, పాత పుస్తకాలూ, వాళ్ళ మేనల్లుడు సొమయాజులుతో హిందీపాటల మీదా, రామగోపాలం గారితో చాలా విషయాల మీదా కబుర్లు.  ఆయన చెప్పేవాడా?  వినేవాడా? అంటే రెండూనూ.

 ‘ఆ హం దొనోలో పాట వద్దు.  అది ఆరు నిమిషాలు.  మనం మాట్లాడుకుందాం.'  అనేవాడు ఆయన.  'మరోసారి విందువు గాని' అనేవాడు.

ఆయన 'వంటొచ్చిన మొగాడు ', 'పనికిరాని కధ ', 'గమనశ్రమ' కధలు నాకు బాగా నచ్చేవి.  ఆయనకి అప్పట్లో ఏదో పత్రికలో వచ్చిన అవార్డు  సీరియస్ కధలు నాకు నచ్చేవికాదు.  ఒకసారి ఆయన రాజ్ కపూర్ కి మహమ్మద్ రఫీ పాడనేలేదు  అని రాస్తే, నేను కాదని చెపితే నువ్వుజెపితే అయేవుంటుంది  అని ఒప్పుకోవడం  అదీ ఆయన.  ఆయనకి సాహిత్య అకాడెమీ  అవార్డు వచ్చిన సంధర్భంలో ఢిల్లీ రేడియో కేంద్రానికి  నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేసేను, ఆల్ ఇండియా రేడియో కేంద్రం ఆఫీసరు హనుమంతరావుగారివలన  (ఇప్పుడు డీడీ వుద్యోగి  హైద్రాబాద్ లో). 

విశాఖపట్నం రేడియో  కేంద్రం నా 15 నిమిషాల టాక్ 'కధలు రాయడం ఎలా?' అనేది ప్రసారం చేసింది.  ఇది కావాలని కా.రా. (కాళీపట్నం రామారావు) మాష్టారు అన్నారు.  కాని నా దగ్గర లేదు.  ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చింది.  అదీ లేదు.  కా.రా. మాష్టారితో విశాఖపట్నం గుప్తా బుక్ స్టోర్లో  పరిచయం.  ఆయనే నా దగ్గరికి వచ్చి నన్నుతట్టి నా ఏదో కధ చదివేనని చెప్పారు.  అప్పటికి ఆయన చాలా పేరున్న కధకుడు.  ఆయన మోడెస్ట్ అఫెక్షనేట్ మరియూ ఎంకరేజింగ్ బిహేవియర్ ఇప్పటికీ నాకు కళ్ళకి కట్టినట్టు కన్పిస్తోంది.  అప్పటికే ఆయన మనస్సు మారుమూలలలో  'కధానిలయం' మూలాలు వున్నాయా? 

అప్పట్లో చాలా ప్రొలిఫిగ్గా రాసే ఇచ్చాపురం రామచంద్రం గారితో కాస్త పరిచయం.  ఆయన నన్ను ఐ.వి.ఎస్. అచ్యుతవల్లి(?) గారింటికి తీసుకువెళ్ళినట్టు గుర్తు (అనకాపల్లిలో).

విశాఖపట్నం గురించిరాసి రావిశాస్త్రిగారి గురించి  రాయకుండా వుండడం  అసంపూర్ణం. జగదాంబ జంక్షనునుండి వాళ్ళింటికి రిక్షాలో రోజూ 'ఒకానొక స్థితి' లో వెళ్తూవుంటే చూస్తూ వుండేవాడిని. ఎప్పుడూ కలవడానికి ప్రయత్నించలేదు.  ఒకసారి కోర్టులో ఆయన వాదిస్తుండగా విన్నాను.  చాలా చిన్నవాదన.  'స్పార్కులున్నా మార్కులు వెయ్యలేననడం' అంటే ఇదేనేమో అని పించింది.  'ఆడదీ మొగమనిషీ' కధ చాలా బాగా నచ్చేది.

 వాళ్లమ్మాయి పార్వతి(?) మా జూనియర్, తెలుసు.  ఆమెని, 'సైగల్ ', 'గుంటూరు' కధల గురించి అడిగేను, ఆయన దగ్గర వున్నాయా?  అని.  ఆ అమ్మాయికి ఆయన 'సైగల్ ' అనే కధ రాసేరని తెలీదు అప్పటికి.

'అది నిజమే.  కాని నా దగ్గరా లేదు' అని ఆయన అన్నారని ఆమ్మాయి చెప్పింది.  దూరపు చుట్టరికం వున్నా ఆయన్ని కలవలేకపోయేను.  తన వైద్యానికి గవర్నమెంటు సహాయాన్ని తీసుకోని ఆయన నిర్ణయం మీద ఇవాళకూడా నేను అసంతృప్తితో వున్నాను.  కలకంఠి, బాకీ కధలూ కొన్నిచోట్ల  చదివిన ఆయన  స్నేహశీలతా, ఇతరుల అనుభవాలూ హాంట్ చేస్తాయి.  

నేనూ 'రఫీ' అని రాద్దామనుకునేవాణ్ణి.  'మహమ్మద్ రఫీ' నా అభిమాన గాయకుడు.  గొప్ప, మంచి సాహిత్యానికి  పెర్ ఫెక్ట్ జస్టిఫికేషన్ సంగీతపరంగా.  హ్యూమన్ ఇమోషన్సుకీ  వాటిలోని వేరియేషన్సుకీ అంత పెర్ ఫెక్ట్ రెప్లికేషన్ ఎలా సాధ్యమో ఆశ్చర్యంగా వుంటుంది.  ఏ పాటైనా మళ్ళీ ఇతను రెండోసారి పాడగలడా? అని ఆశ్చర్యం వేస్తుంది.  అతని గురించి  ఎంత రాసినా ఎంత చెప్పినా తక్కువేనేమో అని ఇవాళ్టి నా అభిప్రాయం.  అతని హిట్స్ గురించి కాదు నేను చెప్పేది.  తక్కువ తెలిసిన అతని పాటల గురించి.  అంత తక్కువ జీవితంలో అంత పని! ఎంత పని?!

'రేఫియన్ ' (Rafian) అనేది నాకుతెలిసి చాలాముందుగా నేను అతని స్టైల్ గురించి అన్నానని (77లోనో 78లోనో) నా వుద్దేశ్యం.  ఇవాళ ఆ పదం విరివిగా వాడుతున్నారు అతని అభిమానుల గురించి.  నాకు ఒకప్పుడు కేరంసు అంటే చాలా ఇష్టం.  అదే ఇష్టం, రఫీగారికీ, శ్రీశ్రీ గారికీ వుండేదని తెలిసి చాలా సంతోషపడేవాణ్ణి. 

కధలు రాయడానికి  కవిత్వం ఎక్కువగా చదివివుంటే బావుంటుందని భావించేవాడిని.  పదాలపట్ల, అందమైన పదాలపట్ల ప్రత్యేకమైన ఆకర్షణ వుండేది, కొత్త కొత్త వింత వింత పదాలు ఏ భాషైనా సరే.  శ్రీశ్రీగారి 'పదబంద ప్రహేళిక ' సూర్యరాయాంధ్ర నిఘంటువు సహాయంతో పూర్తి చెయ్యడానికి ప్రయత్నించేవాళ్ళం నేనూ,  ప్రకాశ శాస్త్రీ కలిసి.  పదాల మీద 'సాహిర్ 'కి వున్న పట్టుకూడా ఆశ్చర్యంగా చాలా ఇష్టంగా వుండేది.  కాని ' కవిత్వమంటే  మాటలు కాదు ' అనే మా నాన్నగారి మాటలూ గుర్తున్నాయ్.

ఆస్కార్ వైల్డ్ స్ బెస్ట్ పోయెట్రీ ఈజ్ ఇన్ హిజ్ ప్రోజ్ రైటింగ్స్.  అతను చెప్పే  ఆ అందమైన  శైలే లేకపోతే ఆ విషాదగాధలు ఎవరూ చదవలేకపోయేవారేమో.

హీ (గోల్డు స్మిత్) లెఫ్ట్ నథింగ్ అన్ టచ్ డ్ ఎండ్ టచ్ డ్ నథింగ్ అన్ అడోర్న్డ్, వంటి వాక్యాలు తరచూ గుర్తొస్తూ వుండేవి.

ఏంటొని ట్రొలోప్ చాల కష్టపడి  రచయితగా పైకివచ్చిన మనిషి.  అతనిలా ప్రతిరోజూ ఏదో రాస్తూ వుండాలి  అనేది మనస్సులో వుండేది.

జాన్ రస్కిన్ లా  పాఠాలు  చెబ్తున్నట్టు  పబ్లిక్ లెక్చర్స్ ఇస్తూ పోవాలనీ అలా రాయాలనీ అన్పించేది.

ఎపిగ్రంసూ, ఎపిగ్రమాటిక్ రైటింగ్ చాలా ఇష్టంగా వుండేవి.  చాలా తక్కువలో చాలా ఎక్కువగా రాయాలని అనుకునేవాణ్ణి.  ఇలా రాస్తే ఎలా వుంటుంది అని ఒక్కొక్క వాక్యం గురించి  ఆలోచిస్తూ వుండేవాడిని. 

అలా రాసిన వాక్యాల్లో ' ఈ ఒక్క వాక్యం చాలు ' అన్నాడు  పతంజలి నాతో చాలా ఏళ్ళ తర్వాత.  'మీరు ఇంకా రాయాలి, కానీ లేకపోయినా ఇది చాలు' అన్నాడు. ఆ వాక్యం 'వస్తువు అసహ్యకరంగా వుంటే విసిరేయగలం.  జీవితం అసహ్యకరంగా వుంటే విసిరెయ్యలేం. విడిచెయ్యలేం.'

కలలో ఒకసారి 'పురాణం సీత ' తో ముచ్చటించినట్టు గుర్తు.  పురాణం కధలూ, ముచ్చట్లూ, రాతలూ, పుస్తక పరిచయాలూ, వ్యాసాలూ, శైలీ చాలా నచ్చుతూ వుండేవి.  పతంజలితో కలిసి సుబ్రహ్మణ్య  శర్మగారినీ, బాలినీ ఆంధ్రజ్యోతిలో కలిసేను.

విశాఖపట్నంలో పతంజలి 'ఈనాడు' ఆఫీసులో గంటలు గంటలు టీలూ… కబుర్లూ...   కవిత్వం మీద కవిత్వం కూడా కవిత్వమే!  కధల మీద కధలు కూడా కధలే నా దృష్టిలో అపుడూ ఇపుడూ!

ఆ టైంలోనే వేమూరి బలరాంగార్ని విజయవాడలోనూ వేమూరి సత్యనారాయణగార్ని మద్రాసులోనూ కలిసేను.  (హ్యూస్టన్ సభ తరువాత వేమూరి సత్యనారాయణగారు హైద్రాబాద్ నుంచి ఫోన్ చేసి నా పుస్తకం గురించి మాట్లాడడం ఆకస్మికమూ.  కాకతాళీయమూ.)

నా కధలు మామూలు పాఠకులకి  అర్ధం కావడం కష్టమనీ, అందుకే బావున్నా  నా  'నత్తివాడి కధ'ని స్వీకరించలేదనీ బలరాం  గారు అన్నారు.  పాఠకులని అండర్ ఎస్టిమేట్ చెయ్యకూడదేమో అని నేను అన్నాను.  అలా అయినా కూడా పత్రికల్లో అన్ని రకాలూ వెయ్యాలనీ, ఎంత గొప్ప రైటరుకైనా సెక్టోరియల్  రీడర్ షిప్  తప్పదనీ నేను అన్నాను.

అప్పట్లో కొందరు ఇది ప్రభ కధ, ఇది జ్యోతి కధ అని ప్రస్తావించేవారు. నేను మాత్రం నాకు తోచినట్టు రాసి అది ప్రచురించే  ప్రయత్నం చేసేవాణ్ణి.

ఒకసారి 'ఆంధ్రజ్యోతి 'లో పనిచేసే ఒక సబ్ ఎడిటర్  మా హాస్టెల్ కి వస్తే, నా గురించి అడిగేరుట మా కొలీగ్స్ నీ, కో స్టూడెంట్స్ ని...

అతను   కవితలు మానేసి కధలు రాస్తే మంచిది.  అతనేది రాసినా మా ఎడిటర్ గారు వేసేస్తారన్నాడుట ఆ సబ్ ఎడిటర్.

అది కాంప్లిమెంటో,  కామెంటో అర్ధం కాలేదు. కాని అప్పట్లో ఆ సంఘటన నన్ను చాలా కష్టపెట్టి మిగతా పత్రికల్లో వేరే పేరుతో రాసేలా చేసింది.  కధలు  రాసేలానూ చేసిందేమో.    

కధలు కొత్తగా విడిగా, ముందెవ్వరూ రాయని పద్దతుల్లో నాకు నచ్చేలా నేనే రాసేలా వుండాలని భావించేవాణ్ణి.  సంభాషణ కూడా ప్రత్యేకంగా వుండాలి.  జీవితాన్నించి కధ రాస్తే చాలని, ఏ ప్రత్యేకమైన 'ఇజమూ' అక్కరలేదని భావించే వాడిని.  జీవితంలో అన్నీవున్నాయని,జీవితానికి ఎంత దగ్గరగా వుంటే అంత స్పష్టంగా అన్ని రకాలూ వస్తాయని భావించేవాణ్ణి.

  రచన జీవితానికి దగ్గరగా వుండాలని,అప్పుడే దానికి విశ్వజనీయత వుంటుందనీ, వుండాలనీ భావించేవాణ్ణి.  ఈ జీవితం ఇంకొంచెం బాగుండాలి.  ఇంతకంటే బాగుండాలి అన్పిస్తూ వుండేది.  'ఇలాక్కాదు ' అని ఒక కధే రాసాను. 

 నాకు తెలిసిన జీవితమే రాయాలనీ, రాస్తే చాలనీ అనుకునేవాణ్ణి. 'మీ కధలు మధ్య తరగతికి చెంది వుండటం లేదు అనీ, మధ్య తరగతి కధలు రాయండి అనీ చాలాసార్లు అంటూవుండేవాడు దాట్ల నారాయణముర్తిరాజు. 'రెణ్ణిమిషాలు ' అని రాయండి అంటే రాసాను.  అది ఆయనకే ఇచ్చాను తరువాత కాలంలో ఆయన ఎడిటరయాక.  మరి అచ్చువేసిందీ లేనిదీ తెలీదు. 

ఎంతో మందితో వున్న వుండిన పరిచయాలూ స్నేహాలూ ఇప్పుడు నేను రాసినవాటికంటే ఎక్కువే.  అసలు నేను చేసిన 'రచనల ' కంటే ఎక్కువే.  ఇక నా పరిచయాలూ,  స్నేహాలూ మిగతా రంగాల గురించీ రాయడమంటే ప్రయాసే!

అందరూ   నాకు చెబుతూ వస్తే  నిజమే అని నమ్మి దెబ్బ తిన్నది నా జ్ఞాపకశక్తి విషయంలో.  అది ఈమధ్య ఈ అమెరికాలో 'కిరణ్ ప్రభ 'గారితో మాట్లాడినపుడు తెలిసింది.

'మిమ్మల్ని 36 సంవత్సరాలు వెనక్కి తీసుకు వెళ్తాను 'అన్నారు, ఫోన్ చేసి.  తీసుకు వెళ్ళారు కూడానూ, నెలలతోసహా చెప్పి.  

 ఆయన  చెప్పినదాన్నిబట్టీ ఆయనతో సుమారు ఒక సంవత్సరం పాటు పెన్ ఫ్రెండ్ షిప్ చేసి, కార్డుల మీద కార్డులు రాసి, ఇక ఇలా లాభంలేదని ఆయన రూం కి వెళ్ళికలిసి మాట్లాడుకున్నాం. నేనూ, ఆయనా, పతంజలీ, మరెవరో, బహుశా అరుణ్ కిరణ్  కలిసి విశాఖపట్నం 'గ్రీన్స్' రూఫ్ గార్డెన్లో కామోసు ఒక గంటకి పైగా కబుర్లు చెప్పుకున్నాం.  మరి  నాకు ఒక్క ముక్కకూడా జ్ఞాపకం లేదు. జ్ఞాపకం రాలేదు.   దెబ్బ మీద దెబ్బలా ఈ డిసెంబరు నెలలో 6 వ తారీఖున విశాఖపట్నం వెళ్ళినపుడు వచ్చికలిసేడు జయంతి ప్రకాశశర్మ, విజయనగరం కధకుడు.  విజయనగరం కధకుల ఒక సంకలనంలో మా ఇద్దరి కధలూ వున్నాయి. ఇతనూ నేనూ కూడా అదే   'గ్రీన్స్ '  హోటల్లోనే అదే రూఫ్ గార్డెన్ లోనే ఒక గంటకి పైగా కధల గురించే మాట్లాడుకున్నాం, ఇతని ప్రకారం.  మరి నాకేమీ గుర్తులేదు. రావడం లేదు.

అంచేత ఈ సాహితీయానాన్ని ఇక ఆపడమే మేలేమో !

అప్పుడెప్పుడో రకరకాల సంపాదక మహాశయులతో, పత్రికలతో నాకున్న అనుభవాల్నీ, అభిప్రాయాల్నీ కలిపి 'సాహిత్య డిటెక్టివ్ కధ' రాస్తూ రాస్తూ రాయకుండా పోయేను.  ఇప్పటికి ఇలా అవకాశం వచ్చింది.  అవకాశాన్ని కల్పించిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు.

***

Bio

మెడికో శ్యాం

ఎంచుకున్న వృత్తి వైద్యమే అయినా, సాహిత్యమే ఆయన జీవన పథం.  చిన్నతనం నించే తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రముఖ రచయితల పుస్తకాలు ఎన్నెన్నో చదివి తన తండ్రి గారైన సి ఎస్ శర్మ గారు, చాసో, రోణంకి అప్పలస్వామి గారు తదితర విజయనగరంలోని ప్రముఖులతో సమానంగా సాహితీ చర్చలలో పాల్గొనేవారు.  వంగూరి ఫౌండేషన్ వారు ప్రచురించిన 'శ్యాం యానా' కథల పుస్తకం మెడికో శ్యాం సాహితీ మేధకు ఒక మచ్చుతునక. తను పుంఖాను పుంఖాలుగా కథలు రాయలేదు.  రాసిన కొన్ని కథలూ తను చేసిన ప్రయోగాలకు, పదునైన ఆలోచనాశక్తికి దర్పణం పడతాయి.  మెడికో శ్యాం ఆధునిక తెలుగు సాహిత్యానికి నడుస్తున్న ఒక ఎన్ సైక్లోపీడియా అంటే అతిశయోక్తి కాదు.

Comments
bottom of page