top of page

కథా​ మధురాలు

భూతం

 

తమిళ మూలం :అఖిలన్
తెలుగు అనువాదం : రంగన్ సుందరేశన్.

Rangan Sudareshan.jpg

1

మీరు దెయ్యం, భూతం చూసివున్నారా? నేను చూడలేదు. అంతెందుకు? నేను దేవుడినికూడా చూడలేదు.

 

దేవుడి మాట అలా ఉండనీ. నేను దేవుడు పేర్లు వల్లిస్తూ, భజనలు పాడే భక్తుడు కాదు. అతన్ని దూషించే నాస్తికుల గుంపులో సభ్యుడూ కాదు. ఆ ఇద్దరూ కలిసి లోకజ్ఞానంలేని ప్రజలని, భక్తి లేని మందలని, బాగా మోసపుచ్చుతున్నారు. మూర్ఖులందరికి అదే గతి.

దేవుడు నాకు డబ్బు ఇవ్వలేదు, అతన్ని వదిలేసి కథకి వద్దాం. ప్రస్తుతం నా మనుగడకి ఆధారం భూతమే అనాలి.

భూతాలు కూడా భయపడే అంధకారం, అమావాస్య. “మీరు భూతాలని చూడలేదే?” అని నన్ను అడక్కండి. నేను చూడలేదు, నిజం. కాని నమ్మకం లేదని ఎవరన్నారు? భూతాలు కూడా భయపడే చీకటి అని చెప్పానుకదూ? అదొక చౌకుచెట్ల తోట.

 

 సూర్యుడు ఉగ్రంగా ప్రకాశించే మట్టమధ్యాహ్నంలోనే అక్కడ ఏమాత్రం వెలుతురు కనిపించదు. ఇక ఈ అర్ధరాత్రిలో, అమావాస్య గురించి వేరే చెప్పాలా? ఆకాశంకి, భూమికి మధ్య పెరిగిన చౌకుచెట్లు గ్రామ దేవత గుడిలోని ఈటెల్లాగ నిక్కబొడుచుకొని ఉన్నాయి. తోటకి గాలి సహవాసం దొరికింది, ఇక చెప్పాలా? గంతులాటకి, వేడుకలకి నివర్తి లేదు. అహంకారంకి అడ్డు లేదు.

చౌకుతోటకి అభిముఖంలో ఒక ఎండిన సెలయేరు. ఒకప్పుడు సెలయేరుగా ఉండి, ధారగా ప్రవహించి, ఇప్పుడు శిథిలమై, ఇసకతో, పండని భూమిగా అయిపోయింది. అందులో గడ్డి, నాచు, మొక్క ఏదైనా సరే మొలకెత్తడం అసాధ్యం. దుర్బుద్ధి గుండెలాగ అది నిత్యమూ కసితో భగ భగ మండుతోంది. ఈ ఉభయం మధ్య, కంచెగా, ఒక జత నాగుపాములు. రెండింటికీ ఒకటే వయసు, ఒకటే పొడుగు, ఒకటే వెడల్పు, ఒకటే దట్టం. పాములకి తలా, తోకా లేవు. ఆది, అంతం ఎరగని పరాపరంలాగ అవి ఎక్కడో ఆరంభించి, ఎక్కడికో వెళ్తున్నాయి. మధ్య ఎన్నో అడవులు, కొండలు, పొలాలు, తోటలు.

శక్తి, శివుడు లాగ అవి నిత్యమూ కలిసికట్టుగా కనిపిస్తాయి, కాని ఒకటినొకటి తాకకుండా ఒకే దూరంలో నిలబడతాయి. ఈ పాములని పగటిపూట రైలు పట్టాలని పిలుస్తారు. ఏదైనా సరే, వెలుతురులో చూస్తే ఒకలాగ, చీకటిలో మరొకలాగ, అవునా?

రాత్రివేళ చాలా విచిత్రమైన ఘటనలు జరుగుతాయట. భూతాలుకూడా వాడుకగా రాత్రిలోనే సంచరించడం జరుగుతోందట.

 

ఆ సమయం అక్కడ ఏ భూతమూ లేదు. ఒక మనిషి మాత్రం నిల్చొనివున్నాడు. వాడిని మనిషి అని పిలుస్తే మీరు నమ్మరు. వాడు భూతంలాగ కాదు, భూతంకంటే భయంకరంగా ఉన్నాడు. వాడు అక్కడ రావడానికిముందు భూతాలు సంచరించాయంటే, అవి వాడిని చూడగానే ఆ చౌకుతోటలో దాక్కొనివుండాలి.

 

ఎలుగుపిల్లలాగ గడ్డం పెంచుకొని వాడు ఆ పాములమధ్య నిల్చున్నాడు. నడుములో నాలుగు గజాల మురికి పంచె. ఎఱ్ఱబడిన కళ్లు రాత్రివేళ కనిపించలేదు. నుదుటమీద దట్టంగా విభూతి పూసుకున్నాడు. ఎవరినో, దేన్నో ఆతురతగా ఎదురుచూస్తున్నట్టు కనిపించాడు.

 

వాడు మెల్లగా వంగి ఒక పాము వీపుమీద చెవి చాచి బాగా విన్నాడు. పాము అలాగే ఉంది, కదలలేదు. వీడి మొహంలో నమ్మకంతోబాటు కాంతి చోటుచేసుకుంది.

 

వాడు మళ్ళీ లేచి నిల్చున్నాడు. పకాలున నవ్వాడు. పిడుగుతో వినిపించే గర్జనలాంటి నవ్వు. ఆ చౌకుతోట ఒక క్షణం గాలితో కలిసిన తన మూలుగుని ఆపేసి వీడి నవ్వుకి గుర్తింపు ఇచ్చింది.

 

దక్షిణదిశలో వాడు చూసినప్పుడు ఒక కాంతి చుక్క కనిపించింది. ఆకాశంలో భూమికి కొంచెం దూరంలో తారలు ఉదయించే వేళ అదొక అపూర్వ దృశ్యం. కాని ఆ కాంతి దానితో ఆగలేదు. ప్రతి నిమిషం అది క్రమంగా పెద్దదవుతోంది. కొంచెం పెద్దదిగా, ఇంకా కొంచెం పెద్దదిగా, చాలా పెద్దదిగా మారుతోంది. అది నక్షత్రం కాదు, చంద్రుడూ కాదు. అది నిప్పులు కక్కే భూతం!

 

ఆ భూతం ఆ మనిషిని గురి చూసి, బొబ్బరించుతూ, గెంతుతూ వస్తోంది. పొదల్లో దాచుకున్న జింకని వాసన కొట్టిన పులిలాగ దూకుతూ వస్తోంది. మనిషి దాన్ని చూసి నిర్లక్ష్యంగా నవ్వాడు. ఆ కాంతిలో నాగుపాముల వీపులు నిగనిగమని మెరిసాయి.

 

భూతం ఇప్పుడు ఇంకా ఎక్కువగా నిప్పు కక్కుతోంది. దాని గర్జనకూడా పెరుగుతోంది.

 

కళ్ళని జ్వలించే కాంతిని విరజిమ్ముతూ, గుండెని అదరగొట్టే ధ్వని చాటుతూ ఆ పిశాచం మనిషిని తాకింది. వాడు నిదానంగా నిద్రకని దానిముందు వాలాడు.

 

వాడిని దాటుకొని వెళ్ళి, వాడి రక్తంని తన కాళ్ళలో పూసుకొని, అగ్గిని శ్వాసగా విడిచి ఆ భూతం నిల్చుంది. పగటిపూట దాన్ని చూస్తే మీరూ నేను రైలుబండి అని అంటాం. తెల్లదొరలు మన వీపులమీద సవారి చెయ్యడానికి మనకోసం ఏర్పరిచిన సవారుబండి అని రాసిపెట్టి, మనల్ని ఒప్పించిన భూతం.

 

డ్రైవరు బండిని ఆపి దిగులుతో పరుగెత్తుకొని వచ్చారు. బొగ్గు తోసే కూలీ అతని వెనుక వచ్చాడు. బండిలో నిద్రపోతూ, నిద్రపోకుండా, మాటాడుతూ, మౌనంగా ఉన్న ప్రయాణికులకి ఏమైందో తెలియక ఒక క్షణం భ్రమ కలిగింది. సగం నిద్ర పోతున్నవారు మెలకువతో కిటికీలకి అవతల మెడలు చాటి చూసారు. అందరి కళ్ళూ, అందరి చెవులూ చురుకుగా పని చేసాయి. కొందరు కిందకి దిగి వచ్చి డ్రైవరు వెనుక పరుగెత్తారు.

 

మరికొందరికి కిందకి దిగి విషయమేంటో చూడాలనే ఆతురత ఉంది. వాళ్ళుగాని టికెట్టుతో ప్రయాణం చేసివుంటే అలాగ చేసివుంటారు.

 

ఇప్పుడెందుకు అగత్యంగా వెళ్ళి ఎవడిదగ్గరో చిక్కుకోవాలి?

 

ఒక చిన్న గుంపు రైలు బండి వెనుక ఏర్పడింది. రైల్వే ఉద్యోగస్తులు అందరూ అక్కడ ఉన్నారు, ఒకడు మాత్రం లేడు. ఎవడు ఆ సమయం తప్పనిసరియో, వాడు మాత్రం కనిపించలేదు.

 

చచ్చిన మనిషి ఖచ్చితంగా చచ్చిపోయాడు. ఇంతకు ముందే ఒక సారి రైలుబండిలో చిక్కుకొని చనిపోయే అలవాటు తనకున్నట్టు కనిపించాడు. మొండెం, తల - రెండే పద్దులు. మరేం చిక్కూ, చిత్రవధ ఏమీ లేదు.

రైలుగార్డు పరిసరాలు చూసారు. తోడున్న సహోద్యోగులు కూడా పరిసరాలు చూసారు

        

“పోలీసు ఎక్కడ? బండిలో ఎవరు వచ్చారు?”

 

“9333!”

 

అప్పుడే కానిస్టేబులు 9333 బ్రేక్ వేన్ లో హాయిగా నిద్రపోతున్నాడు. వచ్చే స్టేషన్ కి ఇంకా పదిహేను మైళ్ళు ఉన్నాయి. ఇంతవరకు అతను మామూలుగా సంపాదించిన డబ్బులో ముప్పై రూపాయలు జేబులో మిగిలాయి. నిద్రలో దొర్లినప్పుడు అతనికి ఆ కదలిక వలన చిరాకు రాకపోలేదు. “ఈ వెధవలు నోట్లు ఇవ్వకుండా చిల్లరగాఎందుకు ఇస్తున్నారు?” అని సగం నిద్రలో మూలుగుతూనే పొరలుతున్నాడు.

 

“ఏమయ్యా, మూడు"

 

పొడుగాటి పేరు కాబట్టి దాన్ని తగ్గించి ఆఖరి సంఖ్యతో అతన్ని పిలవడమే అందరికీ అలవాటు.

 

మూడు లేచి తేరిపాఱ చూసాడు.

 

“స్టేషన్ వచ్చేసిందా?”

 

“స్టేషన్ కాదయ్యా, నీకు ఇప్పుడు ట్యూటి వచ్చింది.”

 

ట్యూటి అని అంటే కానిస్టేబులు 9333 నిఘంటువులో - ఈ రెండు సంవత్సరాలలో - డబ్బు అని అర్ధం. రెండవ మహా యుద్ధం అనే జనసంహారం అప్పుడు నడుస్తోంది. జేబులో కులుకుతున్న ముప్పైరూపాయలతోబాటు త్వరలో ఐదో, పదో దొరుకుతుందని అతనికి ఆహ్లాదం. ‘డబ్బు డబ్బుతోనే చేరుతుంది’ అని ఎవడో మహానుభావుడు అనలేదూ?

 

కాని డబ్బుకి బదులుగా కానిస్టేబులు 9333 వెళ్లి చూసినది శవం. చూడగానే కళ్ళు తెరిచి మూసుకున్నాడు. తేరిపాఱి చూడాలనిపించలేదు. రైలు పట్టాలకి కొంచెం దూరంలో అది కనిపించింది.

 

“చావాలంటే ఈ గాడిద ఊరులో చావకూడదా? అడవి మధ్య చావాలా?” అని మూడు అన్నాడు.

 

“ఈ చుట్టుపట్ల నుయ్యి, చెరువూ ఏదీ లేదా?” అని ఇంకొకతను వాడితో కలిసి పాటపాడారు.

 

కొంచెం సమయంలో రైలులో ప్రయాణం చేసేవారు బండిలో ఎక్కారు.

 

మిగిలినవాడు అక్కడే ఉన్నాడు. జేబులో ఉన్న ముప్పై రూపాయల్లో ఒక రూపాయి మాత్రం ఉంచుకొని బాకీని తన్ను లేపిన స్నేహితుడికి ఇచ్చాడు. ఇంటిలో ఇవ్వమని చెప్పాడు.

 

“అవును. డబ్బంటే జాగ్రత్తగా ఉండాలి” అన్నారు అతను.

 

“దారితప్పి సంపాదించినది కదండీ. ఈ రోజుల్లో డబ్బంటే శవం కూడా నోరు తెరుస్తుంది.”

 

రైలు కూతతో కదలింది. స్నేహితుడు పరుగెత్తుకొని వెళ్ళి అందులో వేలాడారు. ఆ బండి ఒక మనిషిని చంపేసి, చాలామందిని మోసుకొని, ఇంకొక మనిషిని శవంకి కాపలా పెట్టి బయలుదేరింది. బండి వెనుక గుండ్రంగా అంటుకున్న ఎర్ర దీపంని చూసాడు 9333. అది వాడికి దీపంలాక కనిపించలేదు. గతించిన మనిషి రక్తం మరకలాగుంది.

 

2

 

9333 జన్మ, పెంపకం గురించి చోద్యంగా చెప్పుకోడానికి ఏవీలేవు. వాడి జీవితంలో ఏ భాగం చూసినా సిగ్గుచేటుగానే కనిపిస్తుంది. ఏదో ఒక తాలూకాలో, ఒక జిల్లా మునసబుకి వాడు పదవ పిల్లవాడుగా పుట్టాడు. పదిహేను నిండగానే చదువు చాలించడమైంది. ఐదవ తరగతి బడిపంతులు బెదిరించే వాడి నాన్నగారి మీసం చూసి వాడిని ‘పాస్’ చేసేసారు.

ఆ పరిసరాల్లో మరెవరూ అతనికి సాటి లేకపోవడంతో మునసబుగారి పేరు, పలుకుబడి బాగా పెరిగాయి. అతని కుమారుడు అన్నిరకాల క్రీడలు చేస్తూనే రోజులు గడిపాడు. మామిడితోటల్లో మల్గోవా పండ్లు మాయమవడం అందరికీ తెలుసు. తాటిచెట్లలో మట్టి కుండలు వేలాడుతున్నాయి, కల్లు మాత్రం కనిపించని రహస్యం ఊరులో అందరికీ తెలుసు. కాని ఏం లాభం? మునసబుగారి గల్లాపెట్టె కూడా ఆకలేస్తే తరచుగా ఐదో పదో తినడమూ జరిగింది. ఇక గ్రామంలోని కన్యలు తమకు తామే వాడి గురించి నొచ్చుకున్నారు: దారితప్పిన కుక్కలాగ తమ వెనుక తిరుగుతూ పళ్ళు ఇకిలించాడట!

 

గ్రామంలో మకాం చేసిన రెవిన్యూ ఇన్పెక్టరుని కలుసుకొని మునసబు వీడికి ఒక ఉద్యోగం ఇవ్వమన్నారు. ఎలాగైనా వీడిని ఊరునుంచి తొలగించి తన పరువు కాపాడుకోవాలని అతనికి మనసులో ఉంది. రెవిన్యూ ఇన్పెక్టరు అబ్బాయిని రమ్మని పిలిచారు, కిందకీ మీదకీ చూసారు. ‘వీడు అబ్బాయా? రౌడీలాగ కనిపిస్తున్నాడే?’

 

“నీకు అబధ్ధం చెప్పడం తెలుసా?”

 

“తెలీదండి!”

 

“నీకు బాదడం తెలుసా?”

 

“తెలీదండి!”

 

 “నిన్ను ఎవరైనా కొడితే, ఆ దెబ్బలకి ఊరుకుంటావా?”

 

“తెలీదండి!”

 

 “వీడికి అబద్ధం చెప్పడం, బాదడం, దెబ్బలు తినడం - అన్నీ తెలుసు” అన్నారు రెవిన్యూ ఇన్పెక్టరు.

 

“అంతే కాదు. వీడికి మరెన్నో తెలుసు” అన్నారు మునసబు.

 

“వీడికేనా నా సిఫారసు కావాలని అడుగుతున్నావ్? నీకేం పిచ్చా? ఎవడయ్యా వీడిని పనిలో పెట్టుకుంటాడు?”

 

మునసబు మరేం అనలేకపోయారు. యువరాజుకి భరింపలేని కోపం. వాడికి రెవిన్యూ ఇన్పెక్టరుని అక్కడే గొంతుపిసికి చంపేయాలనిపించింది. కాని ఇన్పెక్టరు చుట్టూ నిల్చున్న నలుగురు కాయపుష్టి మనుషలని చూసి ఊరుకున్నాడు.

 

రెవిన్యూ ఇన్పెక్టరు కఠినంగా మాటాడారు కాని ఒక నెలలో అబ్బాయికి ఆర్డరు వచ్చేసింది. రైల్వే పోలీసు ఉద్యోగం. ఈ ఉపకారంకి మునసబు తన వాటా పొలాలనుంచి పది మూటల ధాన్యం రెవిన్యూ ఇన్పెక్టరు పేరుకి పట్టా మార్చి రాసారు.

 

ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంతలో ఎన్నో మార్పులు. మునసబు గతించి పరలోకం చేరారు. ఆస్తి విభజన, దౌర్జన్యం కోసం తరచుగా కోర్టు వ్యవహారాలన్నీ సక్రమంగా జరిగాయి. ఇప్పుడు ఆ పది పుత్రులకి ఆస్తి విభజన పత్రం అనుసరించి రక్త సంబంధం తప్ప మరేం ఆస్తి సంబంధం లేదు. వీడి వాటాకి రెండు ఎకర్ల పొలం, ఒక భార్య, ఐదుగురు పిల్లలు - ముగ్గురు కొడుకులు, ఇద్దరు అమ్మాయిలు. ఆరవ బిడ్డకి ప్రస్తుతం వాడి భార్య కడుపులో ఆరు మాసాలు.

 

9333 ఎందరో అధికారుల దగ్గర పని చేసేసాడు. అన్ని ఊరులూ తిరిగి చూసేసాడు. వాడికింద పని చేసిన చాలామంది ముందుకు వచ్చేసారు. వీడ్ని మాత్రం ఇంకా ఉద్యోగంనుంచి వెళ్ళగొట్టలేదంటే, అది ఆశ్చర్యమే అనాలి.

రైల్వేలో పోలీసు అధికారంకి ఒక పరిమితి ఉంది. దాన్ని దాటడం వాడికి ఇష్టం లేదు. వీధుల్లో తలెత్తి సంచరించే ఎఱ్ఱ టోపీలని చూస్తే వాడికి అంతులేని అసూయ.

 

ఇరవై సంవత్సరాలుగా అన్ని రైలు వాహనాలు పట్టాలమీదే ప్రయాణం చేస్తున్నాయి, అందులో ఏ పురోగమనం, నవీనత లేదు. విప్లవకారుల చేష్టలవలన కొన్ని సమయాల్లో అవి పట్టాలు తప్పి, ‘ముందుకు’ వెళ్ళి, కూలిపోవడం జరిగింది, అంతే.

 

వీధుల్లో, సందుగొందుల్లో, ఈ రైలు బండి ప్రయాణం చేస్తే ఎంత మజాగా ఉంటుంది! 9333 అధికారం అన్ని చోట్లా ఎలా వ్యాపించుతోంది! వాడి ఎఱ్ఱ కళ్ళు, బెదిరించే మీసం, చూస్తే చాలు, ఏడుస్తున్న చంటిపిల్ల నోరు మూసుకోదూ?

 

ఐతేనేం వాడి సాహసం ఏమాత్రం తగ్గనేలేదు.

 

అవి దేశభక్తులు గౌరవించబడిన రోజులు కావు. దెబ్బలు తినే రోజులు. వాళ్ళని ఖైదుచేసి రైలు బండిలో తీసుకొనివెళ్ళినప్పుడు వందలకొలదీ ప్రజలు స్టేషన్ లో గుమికూడుతారు. అప్పుడు 9333 లో కనిపించే క్రోధం, వెర్రితనం ఎలా వర్ణించడం? ఆజ్ఞ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే, వాడి చేతిలో ఉన్న లాఠీకర్ర వాయించడం ఆపదు.

 

భయపడి, నక్కే మనుషులంటే వాడికి చాలా ఇష్టం. ప్రజలు హడలెత్తి అరుస్తే వాడికి ఆనందం. ఇతరులమీద - పేదలు, అశక్తులు ఇందులో లెక్క - అధికారం చెలాయించడానికే తను పుట్టినట్టు ఒక భావన. ఇటువంటి వీరుడు రెండు రూపాయలకి ఒక షావుకారుకి - టికెట్టు కొనే అలవాటు లేని పెద్దమనిషికి - వినయంతో నౌకరీ చేస్తాడు. డబ్బుకోసం ఏదైనా చేస్తాడు.

ఒక బిచ్చగాడు ఒంటరిగా ఒక రోజు 9333 దగ్గర చిక్కుకున్నాడు. చెంపపై ఒక వాయింపు! బిచ్చగాడి ఒక రూపాయి, చిల్లర వీడి చేతికి వచ్చేసాయి. బిచ్చగాడి బుద్ధి మారుతుందా?

 

“సార్, ఆకలేస్తుంది, సార్! రెండణాలు ఇవ్వండి సార్! బాకీ మీరు ఉంచుకోండి” అని అంటూ చేయి ముందు చూపాడు.

 

“ఊరుకోరా, వెధవా!”

 

బిచ్చగాడు తనలో గొణుక్కున్నాడు. అంతే, వాడికి శిక్ష, దెబ్బలు పెరిగాయి. బిచ్చగాడు తలనుంచ జుత్తు పీక్కొన్న తరువాతే మన వీరుడు నిష్క్రమించాడు.

 

ఇంకా ఇలాగ ఎన్నెన్నో. ఇప్పుడు భూతాలు కూడా భయపడే అర్ధరాత్రిలో శవంకి కాపలాగ, ఒంటరిగా, ఈ కానిస్టేబులు నిల్చున్నాడు.

 

3

 

రైలుబండి వాడి కళ్ళనుంచి మాయమైంది. 9333 బండి వెనుక కనిపించిన ఎఱ్ఱదీపం చూసాడు. నిశాదేవి నెత్తిమీద బొట్టు లాగ కనిపించిన ఆ దీపంని చెఱిపేసినట్టనిపించింది.

 

వాడికి ఎఱ్ఱరంగు అంటే అసహ్యం. ఎందుకని వాడికే తెలీదు. తను తెల్లదొరల దత్తు కొమారుడు అనే భావన వాడి మనసులో ఉండడం వలన ఆ పొరబాటు ఏర్పడిందేమో? తెల్ల చర్మంకి ఎఱ్ఱ రంగు అంటే దిగులు, అవునా?

“అది డేంజర్ సిగ్నల్, నాకు అసహ్యం!” అని 9333 అంటాడు. కాని ఎఱ్ఱరంగు చీరలు దానికి విరుధ్ధం. అప్పుడు అపాయం ఆ ఎఱ్ఱరంగు చీరలకే!

ఎఱ్ఱదీపం అదృశ్యమవగానే వాడు హాయిగా ఒక నిట్టూర్పు వదిలాడు. అప్పుడే తన చేతిలోని లాంతరుని గమనించాడు. ఇదేంటి, దీపంకి ఒక పక్క ఎఱ్ఱరంగు గాజు, మరొక పక్క పచ్చరంగు గాజు. ఎఱ్ఱరంగు గాజు ద్వారా జోరుగా రక్త ప్రవాహం!

 

కోపంతో వాడి మీసం రెపరెపలాడింది. ఆ దీపాన్ని పట్టాలమీద విసరిగొట్టి పొడి చేయాలనుకున్నాడు. కాని నిశాదేవి ఇంకా భయంకరంగా రూపు మారి, కోపంతో తన్ను మింగితే తను చేసేదేముంది?

 

వాడు చేతిగడియారం చూసాడు. ఇంకా నాలుగు గంటలు అక్కడ నిలబడాలి. తోడుకి మరెవరైనా ఉంటే బాగుణ్ణు!

 

శవం మొహం చూడాలనుకున్నాడు. తెలియకుండానే తనను భయం ఆక్రమించడం గమనించాడు. ఛీ, శవం దగ్గర ఎందుకు భయం? పదిమందిని బాదే బలం తన దేహంలో ఉంది. లాఠీకర్రకూడా ఉంది. చచ్చినవాడు బతికివచ్చినా వాడి ఎముకలన్నీ పగులగొట్టవచ్చు.

ఒక చేతిలో లాంతరు, ఇంకొక చేతిలో లాఠీకర్రతో శవం దగ్గరకి వెళ్ళాడు. తల - తెగిన భాగం - బోర్లాపడి ఉంది. మొహం కనిపించలేదు. మెల్లగా తలని లాఠీకర్రతో పక్కకి మళ్ళించాడు. అదేం చచ్చిన మొహంలాగ కనిపించలేదు. గడ్డం, మీసం, విభూతి, కుంకం - అది కుంకమేనా?

కొంచెం వొంగి ఇంకా తీవ్రంగా చూసాడు. ఎడం చేతిలో ఉన్న దీపం వాడి పట్టునుంచి తనే మళ్ళీ ఆ ఎఱ్ఱగాజు ద్వారా చూసింది. కోపంతో పచ్చరంగు గాజుని చూడాలని తిరిగాడు. కాని ఎవరో తన్ను గట్టిగా పట్టుకొని ఆపినట్టు భ్రమ కలిగింది. ఆ దీపంలోని జ్వాల ఎందుకలా వొణుకుతోంది?

ఇంతకుముందు ఆ మొహంని ఎక్కడో చూసినట్టు వాడికి గుర్తు. తేరిపార చూసాడు. విభూతి, కుంకం మాసిపోకుండా అలాగే ఉన్నాయి. అది విభూతి అనడానికి ఎటువంటి సందేహం లేదు. కాని ఆ కుంకం బొట్టు? పెళ్ళిలో ఆరతి తరువాత వరుడికి నెత్తిలో తిలకం పెడతారే, చూడడానికి అలా ఉంది. 9333కి ఒక విపరీతమైన ఆశ. కుడిచేయి చూపుడువేలుతో దాన్ని ముట్టుకున్నాడు. అది కుంకం కాదు, రక్తం! ఎంత సరిగ్గా నెత్తిలో అది అంటుకొనివుంది!

 

కళ్ళని బాగా తెరిచి చూసాడు. వాడేనా? వాడుకూడా ఇలాగే గడ్డం, మీసం, విభూతి, కుంకంతో కోవిల పూజారిలాగ కనిపిస్తాడు.

 

9333 కి అనుమానం పెరుగుతూ వచ్చింది.

 

చూపుడువేలులో రక్తం అంటుకొనివుంది. జుగుప్సతో దాన్ని నేలమీద తోమాడు. రక్తం మరక పోలేదు. కోపంతో మళ్ళీ ఒకసారి వేలుని నేలమీద తోమాడు. అంతే, వేలునుంచి రక్తం బొట్లు కారాయి. ఒక బొట్టుకి బదులు తొమ్మిది బొట్లు!

 

‘అవును, వాడే!’

 

‘అవును, వాడే!’

 

అదేం ప్రతిధ్వనియా?

 

అంతకుమించి ఆ మొహం చూడడానికి భయమేసింది. రెండడుగులు వేసి వెనక్కి తిరిగాడు. కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిచాయి - కానిస్టేబులు కళ్ళే!

వేలు మొనలో నొప్పిగా ఉంది. దాన్ని నోరులో పెట్టుకొని పీల్చాడు. వాడి దేహంలోని ప్రతీ అవయవం అణువుని విద్యుచ్ఛక్తి తాకినట్టు ఒక భావన.

‘అవునులే, ఆడదంటే సర్వనాశనం!’

 

‘సర్వనాశనం’ అనే మాట వాడిని మీరి వచ్చేసింది గాని వాడు ఆత్మశుధ్ధితో దాన్ని పలకలేదు. మంచి, చెడూ, దైవ భక్తి - ఇటువంటి మూఢనమ్మకాలు వాడికి లేవు. తన మేధకి అందనిది ఏదీ వాడు నమ్మడు. తన అవగాహనలో ఉన్న వెయ్యి లోపాలు వాడు ఎరుగడు.

 

శవంగా పడివున్న మనిషి గురించి వాడు ఆలోచించాడు. దానితోబాటు ఆడవారి జ్ఞాపకం వచ్చింది.

 

‘అదేం ఆడదా? భూతం!’

 

గభీమని పెద్దధ్వనితో పేలుతున్నట్టు ఎవరో నవ్వారు. నివ్వెఱపోయి వీడు శవంని చూసాడు. అది నవ్వలేదు. వెనక్కి తిరిగాడు. చౌకుతోటలో సద్దుమణుగింది. ఆలోచించాడు. చౌకుతోటలో ఎవరో నవ్వివుండాలి, లేకపోతే ఆ శవంనుంచి ఆ నవ్వు వచ్చివుండాలి. కాకపోతే తన్నుంచే ఎవరో నవ్వివుండాలి. ఎవరది?

 

4

 

అప్పుడు వాడికి ఆ ఆడపిల్ల గుర్తుకి వచ్చింది. తెలివితక్కువవారి మాటలు వింటే ఆమెకూడా ఇప్పుడు భూతంగా ఉండాలి. ఇంతకుముందు నవ్వినది అదేనా?

 

ఇప్పటిలాగే అర్ధరాత్రి. అవి యుద్ధం రోజులు కావు. గుంపులు లేవు. స్టేషన్ వదిలి రైలు జరగుతూంటే కానిస్టేబులు పరుగెత్తుకొనివచ్చి ఒక కంపార్టమెంటు చేతిపిడిని పట్టుకొని వేలాడాడు. తలుపు తెరచుకొని లోపలికి ప్రవేశించాడు. ఆరేడుగురు మాత్రం కూర్చోడానికి తగిన చిన్న జాగా. రెండు బెంచీలు ఎదుటెదుటగా కనిపించాయి.

 

లోపల ఎవరూ లేరని నిదానంగా కూర్చొని వీడు చుట్ట కాల్చుకొని రెండు సార్లు పీల్చాడు. ముక్కునుంచి, నోటినుంచి పొగ వెలుబడింది. వేలాడుతున్న కాళ్ళని ఏదో మూట తాకినట్టనిపించింది. తొంగి చూసాడు. ఒక ఆడపిల్ల దొర్లపడి గాఢ నిద్రలో వుంది.

 

వీడు ఆమెని బాగా చూసాడు. ఆమె ఒక కొత్త బిచ్చగత్తె, ఈ పరిసరాలకి వచ్చి రెండు వారాలుకూడా అవలేదు. ఎవడో కుంటివాడితో కలసి, పాటలు పాడుతూ, డబ్బు సంపాదించుతోంది. వయసు, కంఠధ్వని, కలిసిరావడం వలన ముష్టికి కొఱత లేదు. ఇంతకు ముందే 9333 ఆమెను చాలా సార్లు చూసివున్నాడు. ‘సరేలే, మనల్ని వదిలి ఎక్కడికి పోతుంది?’ అని వీడి నమ్మకం.

 

తన్ను తాను మరచి నిద్రపోతున్న ఆమెని అవయవం అవయంగా, అసహ్యమైన కళ్ళతో వీడు ఆరసించి చూసాడు. తొమ్మిది గజాల చీర, రవిక ఆమెకి ఎవరిస్తారు? తన పరువును తను రక్షించుకున్న నమ్మకంతో ఆమె నిద్రపోతోంది. ఆమె దగ్గర అందం లేదు, వయసు, ఎదగడం మాత్రమే. ఆ కుంటి మొగుడు ఏమయ్యాడో తెలీదు.

 

“ఏయ్!” అని వీడు అరిచాడు. అదిరిపడి ఆమె లేచింది.

 

“వచ్చే స్టేషన్ లో దిగుతానండి!” - లోపలనుంచే మాటాడింది.

 

“సరేలే, ముందు బయటికి రా. ఇక్కడ వచ్చి కూర్చో.”

 

“టికెట్టు కొనలేదండి. వచ్చే స్టేషన్ లో దిగుతానండి.”

 

“నీకెందుకు భయం? నేను నిన్ను టికెట్టు అడగడం లేదు. లేచి రా! ఇదేంటి మా తాతగారి రైలు అనుకున్నావా? నేనా ఈ రైలుకి అధికారి?”

 

ఆమె నవ్వింది. వీడూ నవ్వాడు.

 

ఆమె లేచి వచ్చి జంకుతూ బెంచీ పక్కన నిలబడింది. ఒళ్ళు వణుకుతోంది. కళ్ళలో దిగులు, భయం కలిసిన చూపు. కూర్చోమని వీడు మూడుసార్లు చెప్పాడు. ఆమె వినలేదు.

 

“కూర్చుంటావా? లేకపోతే నిన్ను నేను కూర్చోపెట్టనా?”

 

“. . . . . ”

 

“కూర్చోకపోతే నిన్ను ఎత్తి బయట పారేస్తాను.”

 

ఆమె కూర్చుంది.

 

“ఈ వయసులో నువ్వు ఒక కుంటివాడుతో కలిసి బిచ్చమెత్తాలా? పడుచుపిల్ల ఇలా ఊరక తిరగడం మంచిదా?”

 

“. . . . . ”

 

“నీకు కావలసినది తిండి, చీర, అవునా? అది ఇస్తే నా మాట వింటావా?

 

“. . . . . ”

 

“మాటాడవేం? నేను చెప్పిన పని చేస్తావా?”

 

“ఏం పని అండీ?”

 

“మంచి పనే. మంచి చీరలు కట్టుకోవచ్చు. మంచి తిండి తినవచ్చు. నలుగురుముందు కుక్కలాగ అఱచి డబ్బు అడగనక్కరలేదు.”

 

కాని అదేం పని అనేది ఆమెకి అర్ధం కాలేదు. కాని మనకి తెలియాలి, అవునా? ప్రపంచంలో ఎటువంటి పనులు జరుగుతున్నాయని తెలుసా?

వ్యభిచారం న్యాయతఃగా ఒక నేరం. దాన్ని పురికొల్పడం నేరం. కాని ఆకలితో బాధపడడం నేరం కాదు. పదిమంది తిండిని ఒకడు తింటే ఆదీ నేరం కాదు. అందువలనే ఆకలి, ఆకలి లేకపోవడం - ఈ రెండూ చట్టంని తికమకలు చేస్తున్నాయి.

 

9333 కి ఇది అదనపు ఉద్యోగం. చాలామంది పేద పడుచులు ఉన్నారుగా? పెట్టుబడి తిండి, చీర: వచ్చేదంతా లాభం. డబ్బు ఇచ్చి రోగం కొనడానికి ఈ దేశంలో ముఠాలకి ఏం తక్కువ? చట్టం అనే గాడిదకి మొహంలో ఒక గుద్దు గుద్ది, వీపుమీద ఒక తన్ను తన్ని, వీడు డబ్బు సంపాదించడం జరుగుతోంది.

 

బిచ్చగత్తెకి ఏంపని అని ఇంకా తెలియలేదు. నివ్వెఱపడుతూ వాడిని చూసింది.

 

“ఏంపని అని తెలుసా?” గభీమని ముందుకు దూకి పోలీసు ఆమె చేతిని పట్టుకున్నాడు.

 

ఆమె మొహం దెయ్యం బాదినట్టయిపోయింది. నోరు తెరిచి అరిచింది. ఏం లాభం - రైలు కూతలో?

 

హఠాత్తుగా రైలుకి పిచ్చి పట్టేసింది. కొండ శిఖరంనుంచి కిందకి దొర్లుతున్న వేగంలో ఆది అదిరిపడి పరుగెత్తింది. ఎదుట ఉన్న అంధకార ప్రపంచం రెండుగా బద్దలై కింద వాలింది.

 

చేతిని విదులుస్తూ ఆమె వెనక్కి జరిగింది. పోలీసు వెగటుగా నవ్వాడు. మెల్లగా ఆమెను చేరుకున్నాడు. అప్పుడు రైలు బొబ్బరింత ఇంకా భయంకరంగా ఉంది. సెలయేరు వంతెన మీద ప్రయాణం చెయ్యడంవలన ఆకాశం వణుకుతన్నట్టనిపించింది.

“ఏమే బిచ్చ ముండ! ఎందుకీ పతివ్రత వేషం?”

“అయ్యో! . . . ఆ! ”

ఆ తరువాత ఏమైందో కానిస్టేబుల్ కి తెలీదు. వాడి కళ్ళు తెరిచేవున్నాయి. జ్ఞానేంద్రియాలన్నీ సజీవంగానే ఉన్నాయి.

 

వెనుకకి తిరిగిన ఆమె అలాగే తలుపుమీద ఆనుకుంది. బయటకి తెరిచే తలుపు ఆమె భారం తాళలేక తెరుచుకుంది. కింద ప్రవహిస్తున్న కాలువ ఆ బిచ్చగత్తెని తన ఒడిలో తీసుకొని ఆమె పరువుని కాపాడింది. ప్రాణం కాపాడే శక్తి దానికి లేదు.

 

అన్నీ ఒక మెఱుపు లాగ ఒక క్షణంలో జరిగాయి. తలపోసినప్పుడల్లా వీడికి ఆ దృశ్యం జ్ఞాపకంలో వస్తుంది. ఆలోచించే సమయం మాత్రం వస్తే తప్పేం కాదు. ఆలోచించని సమయంలో కూడా వచ్చి బెదిరించాలా?

 

మనసనే ఆ జిత్తులమారి భూతం మానవుడి లోతట్టులో చేసే అల్లరిని వీడిప్పుడే గ్రహించాడు. అది కుచేష్టకి సిద్ధమైంది. ఒక కొమ్మనుంచి ఇంకొక కొమ్ముకి గెంతుతూ కనిపించినదంతా కొరికి పారేసే ముసలి కోతిలాగ పాత కాల ఘటనలని తన పళ్ళతో వాడిముందు విచ్ఛిన్నం చేసి వెక్కిరించింది.

 

“అయ్యో! . . . ఆ! ”

 

రెండు మూడు సంవత్సరాలముందు ఆ పడుచు ఏడ్చిన ధ్వని ఇప్పుడు వాడి లోతట్టునుంచి వెలుబడింది. తరువాత, ఏమైంది, ఆమెకి?

 

మంచివేళ. తనిప్పుడు ఆ సెలయేరు దగ్గర నిలబడకుండా మరెక్కడో ఉన్నాడు. చచ్చిన ఆడపిల్ల దగ్గర ఒక మగవాడు, పోలీసు, ఎందుకు భయపడాలి?

 

వాడు పట్టాలకి దూరంగా కనిపించే ఇసక నేలని చూసాడు. ఇదేం గర్జన, ఎక్కడనుంచి వస్తోంది? గభీమని ఎక్కడినించో వరద వచ్చి ఈ ఇసకనేలని మింగినట్టు గారడీ చేస్తోందే! ఆ రాత్రి ఆ సెలయేరులో పొగరుతో నురుగు కక్కిన ప్రవాహం ఇవాళ దిక్కు మార్చుకుందా ఏమిటి? సెలయేరు మధ్య ఒక పడుచు వయ్యారంగా తేలుతూ వస్తోంది. అలలు అలలుగా తన నల్ల జుత్తుని పడక లాగ నీళ్ళమీద పరచి, సొగసుగా నడుస్తూ వస్తోంది.

“అమ్మా, ఆకలి, బాబూ ఆకలి-- ” అవును. సందేహం లేదు. అదే ఆ బిచ్చగత్తె కంఠధ్వని. రైలులో ముష్టికి అది పాడే పాట.

 

పోలీసు పులి వదరుబోతుగా ఐపోయింది. వికారమైన ధ్వని వాడి గొంతులోనుంచి పైకి వచ్చింది. ఎటువంటి ధ్వని? జగత్తుని బెదిరించే ఆ కూత విని వాడు తుపాకీ గుండు తగిలి అల్లాడే పులిలాగ మారిపోయాడు.

కళ్ళని బిగువుగా మూసుకున్నాడు. కాని ఏం లాభం? ఆ సెలయేరు ప్రవాహం ఎందుకు గబ గబమని తన గుండెలో దూరుతోంది? ఆ పడుచు ఎందుకు తన గుండెని బద్దలు చేసి లోపలికి చొరబడుతోంది? తామర మొగ్గలాగ బొర్లా వేలాడుతున్న తన గుండెని కొరుకుతూ, రుచి చూస్తోందే, ఎందుకు?  ఎందుకు? ఎందుకు?  

 

‘దేవుడా!’ వేదన భరించలేక వాడి గుండెలో ఒక గూఢమైన మూలనుంచి ఒక ధ్వని బతిమాలింది.

 

మళ్ళీ కళ్ళు తెరిచి చూసినప్పుడు వాడి ఎదుట సెలయేరు లేదు, పడుచు లేదు. పాత, ఇసక నేల మాత్రం వ్యాపించి ఉంది. ముందు విన్న పాట ఎక్కడో దాక్కుంది.

 

 

5

ఈ ఒక నిమిషం అవస్థలో వాడి దేహమంతా చెమటతో తడిసిపోయింది. గుండీలు విప్పి చొక్కాయిని తెఱుచుకున్నాడు. ఆక్కడ నిలబడడానికి వాడికెలాగో ఉంది. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాడు. మెల్లగా తిరిగిచూసాడు.

 

వాడి వెనక ఎవరో వాడికంటే వేగంగా నడుస్తూ వచ్చారు. గభీమని తిరిగి చూసాడు. ఎవరూ లేరు. మళ్ళీ నడిచాడు. మళ్ళీ అలాగే ఎవరో నడిచే శబ్దం.

 

వాడికి చెడ్డ కోపం వచ్చింది. “ఇదేంటి, నువ్వు భూతంగా వచ్చి నన్ను బెదిరిస్తున్నావా?” అని పటపటమని పళ్ళు కొరికాడు. చేతిలోని లాఠీకర్రని గట్టిగా పట్టుకొని గాలిని వేగంగా బాదాడు. లాఠీకర్రని విసరివేయాలని వాడికి ఆలోచన లేదు. కాని అదే వాడి చెయినుంచి జారి గాలిలో ఎగిరింది. పాము పడగలాగ దూకుతూ ఆ శవంమీద వాలింది.

 

లాఠీకర్ర జారుతుందని వాడు ఎదురు చూడలేదు. ఇప్పుడు వాడిని పూర్తిగా దిగులు పట్టుకుంది. వికారమైన ఏదో ఒకటి తన చేతినుంచి లాఠీకర్రని లాగి విసిరేసిందా?

 

ఒక క్షణం వాడు జంకాడు. మళ్ళీ లాఠీకర్రని తీసుకొని రావడం గురించి ఆలోచించాడు. వట్టి చేతితో ఉండడానికి వాడికి భయమేసింది. వెళ్లి దాన్ని తీసుకురావడానికి భయం. మరి, ఇప్పుడు తనేం చెయ్యాలి? ఆఖరికి ధైర్యంతో ఆ శవంని చేరుకున్నాడు. లాఠీకర్రని అందుకోవాలని వంగాడు.

 

వంగినప్పుడు కళ్ళు ఆ మొహంమీద వాలాయి. ‘అవును, సందేహం లేదు. వాడే, అవును, వాడే!’

 

‘నాయనా, బాగున్నావా? నేనిప్పుడు బయటకి వచ్చేసాను!’ శవం నోరు తెరిచి మాటాడుతున్నట్టనిపించింది. లాఠీని అందుకొని కసితో వీడు ఆ మొహం చూసాడు.

 

నాలుగైదు రోజులుముందు ఇదే మనిషిని రైలుబండిలో చూసినట్టు గుర్తు. రెండు సంవత్సరాలకి తరువాత వీళ్ళ మధ్య జరిగే మొదటి దర్శనం ఇది. ఇంతకుముందు వాడికి గడ్డం, మీసం లేదు. నెత్తిలో విభూతి లేదు. రెండు సంవత్సరాల కారాగారశిక్ష వాడిని కొత్త మనిషిగా చేసేసింది. చెఱసాలలో బాగా బలిసిపోయాడు.

 

వాడు 9333 ని అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఇది: “నాయనా, బాగున్నావా? నీకు తెలుసా? నేను బయటకి వచ్చేసాను.”

 

“అరే, నువ్వేనా? నేను గుర్తు పట్టలేక పోయాను! సన్యాసి ఐపోయావా?

 

“అవును. సన్యాసిగా మారి దేవుడ్ని చూడాలని ఆశ.”

 

‘సరేలే, వీడికి సగం పిచ్చి’ అని కానిస్టేబులు తనలో చెప్పుకున్నాడు.

 

“దేవుడ్ని ఈ కళ్ళతో ఎదురుగా చూడాలి. నాకేం వరం వద్దు. కాండ్రించి వాడి మీద ఉమ్మేయాలి. నీలాంటి అయోగ్యులని వాడెందుకు సృష్టించాలి?”

 

అంతకు మించి అక్కడ నిలబడితే అపాయమని పోలీసుకి అనిపించింది. ఇంతకుముందు వాడి దగ్గర తను అనుభవించిన దెబ్బలు చాలవా? ముక్కులో రక్తం కారుతుంటే వాడు వాయించిన పోట్లు 9333 మరచిపోలేదు.

 

అదికూడా నలుగురిలో సిగ్గు పడవలసిన పనే. రేషన్ కాలంలో చట్టానికి విరుద్ధంగా రైలుబండిలో ఒక కాలు మూట బియ్యంతో ఒక వితంతువు ప్రయాణం చేసింది. వితంతువు అంటే వయసు చెల్లిన ఆడది కాదు. ఆమె ఒంటరిగా వచ్చింది. ఆమె చేసిన నేరాంకి పరిహారంగా ఆమెని ఇంకొక నేరానికి వీడు పురిగొల్పాడు. ఆమె అదిరిపడి పక్కనేవున్న కంపార్టుమెంటుకి పరుగెత్తుకొని వెళ్ళి ఎవడి కాళ్ళముందో పడింది.

 

ఆ మూడవ మనిషికి చట్టం తెలీదు. కాని న్యాయం తెలుసు. వాడికి మెదడులో బుద్ధి లేదు. గుండెలో మంచి ధైర్యం ఉంది. డ్యూటీలో ఉన్న పోలీసుని వాడు బాగా వాయించేసాడు.

 

అందుకు వాడు రెండు సంవత్సరాల కారాగారశిక్ష అనుభవించాడు.

 

చెరసాలనుంచి బయటకి వచ్చిన తరువాత కూడా వాడి డాబు తగ్గలేదని తెలుసుకొని పోలీసు మెల్లగా జారుకున్నాడు. ‘సరేలే, వీడెక్కడికి వెళ్తాడు?ఇంకా రెండు మూడు కేసుల్లో చిక్కుకుంటే మనకి లొంగుతాడు’ అని వీడి నమ్మకం.

 

‘చెడగొట్టేవాడంటే వీడే - బతికివున్నా, చనిపోయినా, ఒకటే!’ అని పోలీసు తనలో గొణుక్కున్నాడు.

 

వీడిమాటలు పొంచివుండి విన్నట్టు చౌకతోట గభీమని నవ్వింది. తిరిగి చూసాడు. చౌక చెట్టులోని ప్రతీ ఆకు ఒక సూదిలాగ వీడిని పొడిచింది.

ఎవరు నవ్వారు? చనిపోయినవాడు దెయ్యంగా మారి నవ్వుతున్నాడా?. హూం, దెయ్యంట, భూతంట! ఎవరు నమ్ముతారు?

 

ఆ నవ్వు ఇప్పుడు వీడి లోతట్టునుంచి సవాలు చేసింది: ‘నువ్వంటే నాకేం భయం లేదు. బతికివున్నప్పుడే నీకు ఏదీ చేతకాదు. ఇప్పుడు నన్ను బెదరిస్తున్నావా?’

 

భయమో, కోపమో తెలియలేదు. కాస్తా మిగిలివున్న కొంచెం మత్తు పోలీసుకి ఉంది. ఛేతిలోని లాఠీకర్రతో ఆ శవంని కొట్టబోయాడు.

 

“ఉస్ . . . ఉస్ . . . ”

 

ఆకాశంని చీల్చుకొనే బాణంలాగ రెండు పిట్టలు వాడి తలకి పైగా ఎగిరాయి. ఒకటిని తరుముతూ ఇంకొకటి. కాని పిట్టలు మాయమైన తరువాత కూడా ఆ ‘ఉస్’ శబ్దం మాయమవలేదు.

 

లోతట్టునించి నవ్వు, ధ్వని వినిపించాయి:

 

‘హా హా హా . . . ఇది దేహం కాదురా! ఇది ఆవిరి, అవును ఆవిరి!’

కొట్టాలని లాఠీకర్రని బలవంతంగా అందుకున్నవాడు అలసిపోయాడు. కాని ఆ క్షణం వాడి మూర్ఖత్వం వాడిని వదల్లేదు. తన బలమంతా కూడబెట్టుకొని బాదాడు.

 

ఏదో చెట్టు వేరుపడి నేల వాలినట్టు ధ్వని.

 

తిరిగిచూసాడు. కళ్ళు స్థిరంగా నిలిచిపోయాయి. వందలకొలదీ చౌకుచెట్లు నిలబడిన జాగాలో ఒక చెట్టుకూడా కనిపించలేదు. మారుగా వందలకొలది జడాశరులు ! వందలకొలది భూతాలు!

 

సీసంని కరిగించి, తన పేగుల్లో పొడుచుతున్నట్టు 9333 కి అనిపించింది. దెయ్యాలు ఎంత ఆవేశంతో తాండవమాడుతున్నాయి! వారి శిఖలు, వెండ్రుకల ముడులు, కట్టలు కట్టలుగా వేలాడుతూ గాలిలో ఎలా గిరగిరమని తిరుగుతున్నాయి! దెయ్యాలు తమ చేతులు బాగా విస్తరించుకొని, అణువు, అణువుగా జరుగుతూ దగ్గరకి వస్తున్నాయి. అబ్బా, అవి చేసే అరుపులు! మూలుగులు!

 

మళ్ళీ కళ్ళు బాగా మూసుకున్నాడు. లోతట్టులో తన అవస్థ గురించి ఆలోచించాడు. అక్కడ తుఫానులో రెపరెపలాడుతున్న దీపంలాగ వాడి ప్రాణం అల్లాడుతోంది.

   

“హా హా హా, ఇది దేహం కాదురా! ఇది పొగ, అవును పొగ!’

వాడి ప్రాణం చిందరవందరగా, వీధిలోని వెఱ్ఱి కుక్కని చూసి పరుగెత్తే పసివాడిలాగ గిజగిజలాడింది. భయపడే ఆ బాలకుడి భద్రతకి ఒక రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు ఎక్కడ?

 

తన లోతట్టులో, మనసులో, ప్రాణంలో, ఆ రక్షకుడుని ఆ క్షణంలో పోలీసు వెతుకుతూ తిరిగాడు. వాడు వెతికిన చోటల్లో ఒకటే చీకటి! మిణుగురుబూచిలాగ రవంతైనా కాంతి కనిపించడం లేదే? కాని తను వెతుకుతున్నవాడు అక్కడే ఉన్నాడని ఆఖరి నిమిషంలో పోలీసుకు తెలిసింది. రెండు చేతులు నిష్కపటంగా ముందుకు వచ్చి వాడిని కౌగిలించుకోడానికి సిధ్ధంగా ఉన్నాయి. కాని ఆ చేతులకి అధిపతిని దర్శించడం ఎలాగ? అతని కాళ్ళు పట్టుకొని ఏడవడం ఎలాగ?

9333 కళ్ళు తెరచాడు.

 

అప్పుడు వందలకొలది జడాశురులు, ఒకటితో ఒకటి అంటుకొని, జగత్తుని ఆక్రమించుకున్నాయి. ఎక్కడ తిరిగిచూసినా అంధకారం. ఆకాశంలోని నక్షత్రాలన్నీ చచ్చిపోయాయి. అవన్నీ ఒక పెనుభూతంగా మారి - ఒక పర్వతం కంటే పెద్ద జంతువులాగ - నిల్చొనివున్నాయి.

ఆ పెనుభూతం వదిలే నిట్టూర్పు తుఫాను, సముద్రం కలిసి చేసే ఘోష కంటే భయంకరంగా ఉంది. 9333 చేతులు వణికాయి. ముందు లాఠీకర్ర కిందకి పడింది. ఆ తరువాత లాంతరు నేలమీద దొర్లడంతో దీపం ఆరిపోయింది.

 

ఒడి బరువైనట్టనిపించింది. గుండె బరువైనట్టనిపించింది. కాళ్ళు బరువైనట్టనిపించాయి. భారం సహించలేక గుండె బద్దలవుతందనే భయంతో పోలీసు రెండు చేతులతో దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. కాళ్ళు ఒకటితో ఒకటి అల్లుకొని వాడిని ముందుకు తోసాయి. ఆ తరువాత వాడు భయపడలేదు.

తెల్లవారింది. చౌకుచెట్లతోట చౌకుచెట్లతోటగానే ఉంది. ఎండిన ఇసక భూమి అలాగే ఉంది. పట్టాలు ఇనుము తీగల్లాగే ఉన్నాయి. కాని ఒక శవం ఉన్న జాగాలో రెండు శవాలు!

 

రైల్వే డాక్టరుతో కొందరు ఉద్యోగస్తులు అక్కడకి వచ్చారు. ఒక మూడవ మనిషి కూడా - ఒక బాటసారి - అక్కడకి వచ్చాడు. ఆ బాటసారిని, రైలు తగులుతో చచ్చిన వాడిని, వాళ్లు మళ్ళీ మళ్ళీ చూసారు. ఇద్దరికీ మంచి పోలిక. బాటసారికి మొహంలో గడ్డం, మీసం. నెత్తిలో విభూతి, కుంకం అన్నీ ఉన్నాయి.

 

డాక్టరు నాడిని పరీక్షించి చూసి పెదవి విరిచారు.

 

“దెయ్యమేదో కొట్టేసింది ” అన్నాడు, ఒక రైల్వే కూలి.

 

“దేవుడికి కళ్ళు ఉన్నాయండి” అన్నాడు ఆ బాటసారి. ఇంతకుముందు దేవుడ్ని చూసి కాండ్రించి ఉమ్మేయాలని అనుకున్న కోపిష్టి అతనే.  

 

*****

bottom of page