MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కథా మధురాలు
డీయసైడ్*
- నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్)
"దేవుడుని చూద్దాం, రా," అన్నాను నేను వడివేలు తో.
"ఏం వేళాకోళం గా ఉందా? నిన్న రాత్రి ఏదో పార్టీకని వెళ్లినట్టున్నావు. మత్తు ఇంకా దిగలేదా? అయినా నాకు ఛాయిస్ ఉండి ఏడ్చిందా? నువ్వెక్కడ తీసుకెళితే అక్కడికి పోవాల్సిందే కదా," అన్నాడు వడివేలు, మరో చెట్టు మొదలు వాసన చూస్తూ.
"మత్తులో కాదు. నిజంగానే చెప్తున్నాను. నా దేవుని దగ్గరికి తీసుకెళ్తాను," అన్నాను నేను.
"దేవుని దగ్గరికి తీసుకెళ్తావా? ఏమైనా సూయసైడ్ ఆలోచనలు వస్తున్నాయా కొంపదీసి. కావాలంటే నువ్వు ఆత్మహత్య చేసుకొని నీ దేవుడుని కలువు. అంతే కానీ, అదేదో ఈజిప్ట్ ఫారో చక్రవర్తుల లాగా నన్ను కూడా చంపి నీ వెంట తీసుకొనిపోకు," అన్నాడు వడివేలు.
"ఛా, చచ్చి బ్రతికాను. నీకు తెలుసు కదా? చావు ఎందుకు కోరుకుంటాను. నిజంగానే నా దేవుడిని నువ్వు కూడా చూడవచ్చు. నా దేవుడు సజీవి. నీతో మాట్లాడ గలుగుతాడో లేదు తెలీదు కానీ, నాతో మాత్రం చక్కగా మాట్లాడుతాడు" అన్నాను నేను.
నా మాటల ప్రభావం వడివేలు మీద ఎంత ఉందో తెలీదు. వాడు వాసనలు చూడడం ఆపి తన కార్యక్రమం ముగించేసుకున్నాడు. వెంటనే పూప్ బ్యాగ్ తీసి క్లీన్ చేసి ఆ బ్యాగ్ అక్కడే చెట్టుకు దగ్గర ఉన్న డిస్పోసల్ ట్రాష్ లో వేసాను.
"దేవుడు! బ్రతికి ఉన్న దేవుడే? నమ్మకం కలగడం లేదు?" అన్నాడు వడివేలు. వాడి కంఠంలో కాలకృత్యం అయిపోయిన కులాసా ధ్వనిస్తున్నది. ఇందాకటి వెటకారం లేదు.
"బ్రతికి ఉన్న దేవుడే. ఆ దేవుడి వల్లే నేను ఈ రోజు ఇలా జీవం తో ఉన్నాను. 'వైద్యో నారాయణ హరి'. " అన్నాను నేను.
"ఓవ్, వావ్, ఓవ్. నీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నావా? అలాంటి దేవుళ్ళను చాలానే చూసాను. నాకేమీ చూడాలని ఇంటరెస్ట్ లేదు," అన్నాడు వడివేలు.
"డాక్టర్ కాదు. నిజంగా దేవుడే. నీకు అర్థం కాదేమో అని ఆ కోట్ చెప్పాను," అన్నాను నేను.
"ఆ చివరి వాక్యం అవసరమా? నీకు నా తెలివి పై ఎప్పుడు చులకన చూపే," నిష్టూరంగా అన్నాడు వడివేలు.
"సరే, నీకు నా దేవుడు ఎలా దేవుడు అన్న సందేహం వచ్చినట్లు ఉంది. మానవులలో మతం పుట్టింది దాదాపు 3500 ఏండ్లు క్రితం అనుకుందాం. ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న చాలా మతాల వయస్సు ఆ సంఖ్య కంటే తక్కువే. మతంతో బాటు దేవుళ్ళు పుట్టుకొచ్చారు. అలా అనుకుంటే, నా దేవుని వయస్సు 3500 ఏండ్ల పై చిలుకే ఉంటుంది. మనకు తెలిసిన దేవుళ్ళు నాకు తెలిసిన దేవుని తరువాత పుట్టిన వారే," అన్నాను నేను.
"మరి నీ దేవుడు, నీకు మాత్రమే ఎలా తెలుసు?" అన్నాడు వడివేలు.
"ఈ క్యాన్సర్ వచ్చి చచ్చిపోతానని భయపడిన తరువాత కానీ, నేను నా దేవుడిని గుర్తు పట్టలేదు. ఆ దేవుడి అనుగ్రహం, సానుభూతి వల్లే నా జీవిత కాలం మరి కొంత పెరిగింది," అన్నాను నేను.
"ఎంత పెరింగిందేమిటి? ఇంకా ఎన్ని ఏండ్లు బ్రతకాలని నీ ఉద్దేశం?,"
"నిన్నో, మొన్నో పోవాల్సినవాడిని. కనీసం మరో ఇరవై ఏళ్ళైనా దక్కినట్లే కదా?" అన్నాను నేను.
కిషోర్ కుమార్ చెట్లతో పుట్లతో మాట్లాడుతాడని విని తెగ నవ్వుకున్నాను లోకంతో పాటు. కానీ పోయిన సంవత్సరం నాకు క్యాన్సర్ అని తెలిసిన తరువాత, ఉన్నట్టుండి నేనూ ఓ పాటలు పాడని కిషోర్ కుమార్ అయిపోయాను. మనుష్యులతో నా సంభాషణలు తగ్గిపోయి, కొత్త స్నేహితులతో కబుర్లు వేసుకోవడం మొదలెట్టాను. ఇదిగో మా వడివేలు తో మాట్లాడినట్లే. నేను అందరితో మాట్లాడినా, అవన్నీ విని తలలూపినా, నాకు బదులిచ్చి మాట్లాడే వారు ఇద్దరే.
ఒకటి వడివేలు. ఐదేళ్ల క్రితం షెల్టర్ నుండి సీత పట్టుకొచ్చింది తోడు ఉంటాడని. వాడి కింది నాలుగు పళ్ళు ముందుకు పొడుచుకొచ్చి, వాడు మూతి మూసినా ఆ పళ్ళు బయటికే ఉంటాయి. వాడి నవ్వొచ్చే ముఖం చూసి, మేమే వడివేలని పేరు పెట్టాము. వాడితో మాట్లాడడం మొదలెట్టాక, వాడికి వడివేలు కామెడీ కంటే, రవితేజ వెటకారమే ఎక్కువని తేలిసింది. మంచి తెలివైన వాడే. మనుష్యులు ఏడు యేళ్ల లో నేర్చే విషయం ఒక్క సంవత్సరంలో పట్టేస్తాడు.
రెండవ వారు మా కమ్యూనిటీ కొద్దిగా దూరంగా కొలనుకు అటువైపు ఉన్న అడవి లో ఉంటాడు. పొడవుకు 160 అడుగులు పైనే ఉంటాడు. ఉన్న చోటే ఉంటాడు. ఎక్కడఅకీ కదలడు. తన వయస్సు ఓ 3500 ఏళ్లు పైబడే నని ఋజువులున్నాయి. తనే, నా దేవుడు, పేరు -'సెనేటర్'**. అసలు నా దేవుడికి పేరు మీద పట్టింపు లేదు. తన జీవిత కాలంలో తనని కొన్ని వేల పేర్లతో పిలిచారు, పిలిచిన వారంతా వారు పెట్టిన పేర్లతో బాటు చచ్చి ఊరుకున్నారు. తను మాత్రం అలానే నిలబడి ఉన్నాడు.
ఇదిగో ఇప్పుడు వడివేలుని తీసుకొని సెనేటర్ దగ్గరే పోవాలనే నా ప్రయత్నం. నా ఆపరేషన్ తరువాత ఇదే తిరిగి మొదటిసారి సెనేటర్ ను కలవడం. సెనేటర్ తో మాట్లాడం అదో గొప్ప అనుభవం. తన జీవితానుభవాలు పంచుకోవడంతో నాకు గత ప్రపంచ చరిత్ర తెలుస్తుంది, నా సమస్యలకు జవాబులు దొరుకుతాయి. అవి నాకు తెగ నచ్చుతాయి, ఊరట కలిగిస్తాయి. నన్ను అప్పుడే సగం చనిపోయినవాడి లాగా చేసి నాతో మాట్లాడడానికి కూడా సంకోచించి, నన్ను ఆక్టివ్ గా తప్పించుకొని తిరుగుతున్న వారితో పోలిస్తే ఎంత తేడా. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. సెనేటర్ కదలలేడు, నన్ను తప్పించుకొని పారిపోలేడు కూడా! అందుకే నేను, తనకి కనరాని దూరంలో జరిగిన విషయాలు, అక్కడి దృశ్యాలు వర్ణిస్తే ఆసక్తిగా వింటాడు. అటు వైపు వచ్చే పక్షులు, చేపలు, మొసళ్ళు మరిన్ని జీవాలు కూడా సెనేటర్ తో కబుర్లు చెప్పడం వల్ల, నేను చెప్పిన విషయాలు తనకు అదివరకే తెలుసని నా అనుమానం. కానీ గుడ్ లిసెనర్స్, తెలిసిన విషయాలు వింటున్నా, మళ్లీ అదే ఆసక్తితో వింటారని విన్నాను. సెనేటర్ విషయంలో అది నిజమై ఉండాలి. మరి ఇన్ని ఏళ్లు, ఇన్ని విషయాలు కని, విని, ఎదిగిన జీవి, భగవంతుడు కాక ఎవడై ఉంటాడు.
" ఇరవై ఏళ్ళు?" గట్టిగా నవ్వాడు వడివేలు, "అంటే ఇక మీదట నీదో కుక్క బతుకేనన్న మాట. నువ్వో? నేనో? ఎవరు ముందు పోతామో తెలియదు."
"కుక్క బతుకా? నేనీ కొత్త జీవితంలో ఎన్నో సాధించదలచు కొన్నాను. నాది కుక్క బతుకెట్లా అవుతుంది? మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనది," అన్నాను, నాది మానవ జన్మ అన్న కొంత గర్వంతో, వడివేలును చూస్తూ.
"అంటే నీ ఉద్దేశ్యం ఏమిటి? నా జన్మకు మాత్రం తక్కువేమీ? సమయానికి తిండి వేస్తారు. అప్పుడప్పుడు ట్రీట్స్ ఇస్తారు. మంచి షాంపూతో స్నానం చేయిస్తారు. అంతెందుకు రోజుకు రెండుసార్లు నన్ను నడిపించి, నా ముడ్డి కూడా కూడా వైప్స్ తో శుభ్రంగా తుడుస్తారు. రాజా లాగా ఉంది నా బ్రతుకు," అన్నాడు వడివేలు.
అరే, ఈ కోణం నాకు తట్టలేదే అని ఆశ్చర్య పోయి, బింకంగా "అయినా బెల్ట్ నీ మెడకేసి నిన్ను లాక్కుపోతుంటాను. నీవు రాజా అని ఎలా అనుకుంటావు. నీది మా ఇంట్లో ఓ కుక్క బతుకే కదా," అన్నాను.
"నువ్వు గమనించలేదనుకుంటాను. నువ్వు ఆ ఫోన్లో ఏదో గెలుకుతూ నేనెటు వైపు లాక్కెళ్ళితే అటువైపే బెల్ట్ పట్టుకొని వస్తావు. నేనే నీకు బెల్ట్ వేసి లాక్కెళ్ళుతున్న ఫీలింగ్ నాకు. నేనే నిన్ను, నీ ఫ్యామిలీని చూసుకుంటూ, కాపాడుతున్నట్లు ఉంది. నేను సంతోషంగా ఉన్నాను. నీవే ఏదో పోగొట్టుకొని వెదుతున్నట్లు మొఖం పెడతావు. భరించలేకపోతున్నా, ఆ మొఖం మార్చి నాలాగా సంతోషం గా ఉండు," అన్నాడు వడివేలు.
"నీకు కేన్సర్ అంటే తెలిసినట్లు లేదు. చనిపోవడానికి ఆస్కారం ఉంది అని డాక్టర్లే అన్నప్పుడు, నా మొఖం సంతోషంగా ఎలా పెడతాననుకున్నావు?" అన్నాను.
"అది అవుతుందో, కాదో? అంతులేని ప్రశ్నలతో, భవిష్యత్తులో ఎందుకు జీవిస్తావు? నీవేదో సాధించాలనకుంటున్నావు. నీకదేమో తెలియదు. ప్రస్తుతం లో నాలా నివసించి చూడు. ఆనందంగా ఉంటావు. అయినా నీకు చెప్పి లాభమేముంది. కుక్క సలహాలు ఎవరు వింటారులే అని త్రోసి పుచ్చేవాడివి. నువ్వు నన్ను ఓ కుక్కలా చూస్తే, నువ్వు నాకొక మనిషే. మనిషంటే, మాకేం పెద్ద గొప్ప అభిప్రాయం లేదు," అన్నాడు వడివేలు ముందు వేగంగా అడుగులు వేస్తూ, బెల్ట్ తో లాగుతూ, నన్ను ఇంకొంచెం వేగంగా కదలమంటూ.
వీడి మాట, ప్రవర్తన విపరీతమే. కానీ వాడి వెటకారం వెనుక అపరిమితమైన ప్రేమ ఉందని నాకు తెలుసు.
వాడి మాటలు కొట్టి పారేస్తూ, "సెనేటర్ దగ్గరకు పోదాం రా. తనే నాకు బోలెడంత ధైర్యం ఇచ్చింది, నాకు గమ్యం తెలిపింది. ఒకసారి కలిస్తే, నీకు అర్థం అవుతుంది," అన్నాను.
"నీవు ఆ కొలనుకు అటు వైపు చూస్తూ ఏదో గొణుగుతుంటే, డిప్రెషన్ లోకి పోయావనుకున్నాను. నీవు అవతలి గట్టు జీవాలతో మాట్లాడుతున్నావా? అయినా నాకు గమ్యం వెదికే అవసరం లేదు. ఇప్పటికే నేను సంతోషంగా ఉన్నాను. నాకు దీనికి మించి గమ్యాలు ఏవి లేవు" అన్నాడు వడి వేలు.
"ఓహ్ నువ్వు నాకు డిప్రెషన్ అనుకున్నావా? పొరబాటు. నేను సెనేటర్ తో మాట్లాడేవాడిని. తన 3500 ఏళ్ల పై బడ్డ జీవితం నుంచి అంతులేని జ్ఞానం సంపాదించేశాడు. వాటి సారం తో అతను చెప్పిన మాటల వల్లే నాకు చావు అంటే భయం పోయింది. సర్జరీకి సంతోషంగా వెళ్ళాను. నువ్వొక్కసారి కలిస్తే నీ జీవితం కూడా మారిపోతుంది," అన్నాను నేను.
"నీకింకా అర్థం అయినట్లు లేదు. జీవితం మార్చుకొనే ఉద్దేశ్యం నాకు లేదు. మరే కోరికలు లేవు. కాబట్టి నాకు నీ దేవుడి అవసరము లేదు. ఇంతకీ నీ దేవుడు నీకిచ్చిన సందేశం నువ్వు సంతోషంగా ఉండటానికే కదా," అన్నాడు వడివేలు.
"అలాంటి ఓదార్పునే అనుకో. కాదంటే తనతో ఉన్నప్పుడు, నేనే ప్రపంచం, ప్రపంచమే నేనన్న ఓ గొప్ప అనుభూతి కలిగేది. అన్నట్టు తను, నేనేదో సాధించాలంటే, నీలా వెటకారంతో మాట్లాడేవాడు కాదు," అన్నాను నేను.
"నేను వెటకారం చేస్తానని ఒకటే బాధ పడిపోతావు. కానీ ఆ వెటకారం వెనుక ఎంత ఆర్ద్రత ఉందో నీకు తెలిసినట్లు లేదు. అయినా నువ్వు, సెనేటర్ ఇలా అనోన్యంగా, సంతోషంగా ఉండడం, నాకూ సంతోషమే," అన్నాడు వడివేలు.
"నువ్వనుకున్నంత సఖ్యం లేదులే. రోజూ సెనేటర్ దగ్గర వెళ్లినప్పుడు నాకున్న చిన్న జీవిత కాలం గుర్తుకువచ్చి వాపోయేవాణ్ణి. ఆ సమయంలో నాకు, సెనేటర్ కి ఉన్న వేల ఏళ్ల జీవితం పైన అసూయ, తరచూ బయట పడేది," అన్నాను నేను.
"మరి సెనేటర్ రియాక్షన్ ఏమిటీ?" అన్నాడు వడి వేలు ఫైర్ హైడ్రంట్ మొదలు వాసన చూసి పాస్ పోస్తూ.
"సెనేటర్ కు పరిమితమైన జీవిత కాలాలు ఉన్న మానవులు, జంతువులు, పక్షులు, చెట్లు చేమలు బాగా పరిచితమే. చీమల చావు పుట్టుకలు మనం పట్టించుకోనట్లు, సెనేటర్ కూడా ఎవరి చావు, పుట్టుకలు పట్టించుకోడు.
నేనే చొరవ చేసుకొని పలుకరించకపోతే , తనూ నన్ను పట్టించుకునేవాడు కాదు. నా బాధ సెనేటర్ తో చెప్పుకోవాలనిపించింది. 'నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి, నేను మరో 20 ఏళ్లు బ్రతుకుతాననుకున్నాను, ఇలా అవాంతరం వచ్చిందే' అని బాధ పడ్డాను. ఓపికగా నాతో మాట్లాడి, నాకు ఊరట కలిగించాడు," అన్నాను నేను.
"నేనూ నీకు ఊరట కలగడానికే కదా, నీకు నవ్వు, కోపం తెప్పిస్తూ, మాటలు చెప్తుంటాను. నేను చెప్పని విషయాలు నీకు ఆ దేవుడు ఏమి చెప్పాడో?" అడిగాడు వడివేలు.
"నీ మాటలకు, తన మాటలకు ఓ తేడా ఉంది. తను చాలా కథలు తన జీవితానుభవంలో నుంచే చెప్పేవాడు. అన్ని కథలలోనూ నాకు బాగా గుర్తుండిపోయిన కథలు, తన ఆత్మ కథలే. తన వేయేళ్ళ పై బడ్డ జీవితంలో తను చూసిన ప్రకృతి ప్రళయాలు వర్ణిస్తుంటే వళ్ళు గగుర్పాటు కలిగేది. హరికేన్ ల వల్ల తన పక్కనున్న చెట్లు, జంతువులు చనిపోవడం, అదీ ఒకసారి కాదు మళ్లీ, మళ్లీ చూడడం అతని దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. తను చాలా సార్లు అన్నాడు, ఏదో పెద్ద అనుకోని ఉపద్రవం వస్తే, తన లాంటి వారు కూడా కుప్పకూలి పోతారు అని. జనన మరణాలు ప్రకృతి ధర్మం. అది ఒక సారి అర్థం అయ్యింది అంటే, చావంటే భయం పోతుందని చెప్పేవాడు. ఆ మాటలు వినీ వినీ, నాకు భయం పోయింది. ఆపరేషన్ కు సంతోషంగానే బయలుదేరాను," అన్నాను నేను.
"ఆపరేషన్ అంటే గుర్తుకు వచ్చింది. నువ్వు గత కొన్నిసార్లు నన్ను వదలిన డాగ్ కీపర్ దరిద్రంగా ఉన్నాడు. మాటలు బాగా చెప్తాడు కానీ, నాతో బాటు మరో నాలుగు కుక్కలను చూసుకున్నాడు. మా నలుగురికి సరిపడేంత స్థలం లేదు. ఒకటే వాసన కూడా వాడి ఇంట్లో. నువ్వు మంచి రేటింగ్ ఇవ్వాలని, నీకు ప్రతీ గంటకు నాదో ఫోటో ఒకటి పంపించినా, వాడు మమ్మల్ని సరిగా చూసుకోలేదు.మరోసారి అవసరం పడితే, వాడి దగ్గర వదలకు. ఇక, నీ ఆపరేషన్ ఎలా జరిగిందో చెప్పు," అన్నాడు వడివేలు, వడి వడిగా అడుగులు వేస్తూ.
"రోవర్ లో వాడి రేటింగ్స్ బాగానే ఉన్నాయే. సరే నువ్వు చెప్పావుగా వాడి దగ్గరకు మళ్లీ పంపించను.ఇక ఆపరేషన్ అంటావా, సర్జన్ మంచి పేరున్న వాడు. అన్నీ అనుకున్నట్లే సవ్యంగా జరిగాయి. ఆపరేషన్ తరువాత నా క్యాన్సర్ పూర్తిగా పోయిందని రిజల్ట్స్ వచ్చాయి. కానీ ఆ హాస్పిటల్ నచ్చలేదు," అన్నాను.
"ఎందుకు? పేరుందనే కదా నీవు అక్కడకి పోయింది," అడిగాడు వడివేలు
"పేరుండటమే సమస్య. చాలా మంది నా వంటి వారు అక్కడ నయం చేసుకోవడానికి పోవడంతో, డాక్టర్లను చూడటము, సర్జరీలు చేయించుకొనడానికి బాగా టైం తీసుకుంటున్నది. నాకు మొదటి అపాయింట్మెంట్ మూడు నెలలకు కానీ దొరకలేదు. ఆపరేషన్ కు మరో మూడు నెలలు పడింది," అన్నాను నేను.
"అవును. అప్పుడు నన్ను తరచూ రోవర్ వాళ్ళ దగ్గర పంపించేసే వారు. మీ కోసం ఎదురు చూపులతో నా దినాలు గడిచిపోయేవి," తీవ్ర అసంతృప్తితో అన్నాడు వడివేలు.
"ఇక్కడి నుంచి ఓ నాలుగు గంటల పైనే ప్రయాణం. హాస్పిటల్ లో ఆలస్యమైతే, అక్కడే హోటల్ లో ఉండి మరుసటి రోజు బయలుదేరే వాళ్ళం. అందుకే, మరో ఆసుపత్రి తెరిస్తే మంచిదని సలహా ఇచ్చాను. నా లాగా ఈ వూళ్ళోనే ఉన్న వారు, వందల మైళ్ళు ప్రయాణం చేయాల్సిన పని లేదు. అలాంటి పేరున్న స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడా తెరవచ్చు. మేయో క్లినిక్ అలా అక్కడక్కడ ఓపెన్ చేసారుగా అని ఓ ఉదాహరణ కూడా ఇచ్చాను," అని వడివేలు తో అన్నాను.
అలా చెప్తుండగా, ఎదురుగా మా పొరుగు వారు, వాళ్ళ కుక్కతో ఎదురొచ్చారు. వడివేలును చూసి వాడు మొరగడం, వడి వేలు వాడిని చూసి మోరగడం, రచ్చ రచ్చ అయ్యింది.
"ఏమీ ఆ అరుపులు," అన్నాను, విసుగుతో వడివేలును దూరంగా తీసుకెళ్తూ.
"నీ కంఠం లోని విసుగు నాకు అస్సలు పడదు. ఏదో పొరుగు వాడితో మాట్లాడుతున్నాను కదా, సరిగా మాట్లాడనివ్వవు కూడా!' అంటూ వడివేలు గొణగటం విన్నాను.
వడివేలు ఉన్నట్టుండి ముభావంగా అయిపోయాడు.
అదిగో ఆ మలుపు తిరిగితే కొలను, కొలనుకు అటువైపు గట్టు మీద నా సన్నిహితుడు, దేవుడు సెనేటర్. చెప్పాల్సిన కబుర్లు చాలా ఉన్నాయి. వేగంగా మలుపు వైపు అడుగులు వేసాను.
వడివేలు ఎందుకనో నా వెనుకబడ్డాడు. కోపం వచ్చిందనుకుంటా. నేనే వాడిని నాతో పాటు వేగంగా నడవమని బెల్ట్ తో లాగాల్సి వస్తున్నది.
మలుపు తిరిగిన వెంటనే మతి కోల్పోయాను. మెదడు మొద్దు బారిపోయింది.
వడివేలు అంటున్న మాటలు కలలోలా లీలగా వినిపిస్తున్నాయి.
"ఇందాక మన పొరుగు వాళ్ళ కుక్క చెప్తూనే ఉంది. నీ దేవుడున్న ఆవలి గట్టునంతా గత వారమే చదును చేసేసారట. ఏదో కొత్త హాస్పిటల్ కడతారట."
*****
* డీయసైడ్ (Deicide) = దేవుడి హత్య.
**సెనేటర్ : లాంగ్ పార్క్, ఫ్లోరిడా లో ఉన్న 3500 ఏళ్ల పై వయసున్న బాల్డ్ సైప్రస్ చెట్టు. 2012 లో ఓ మెత్ అడిక్ట్ తన మందు కోసం అంటించిన నిప్పు అదుపు తప్పడంతో కాలిపోయి, శిథిలంగా మిగిలిన దేవుడు.
*****