top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg

సంపుటి 7  సంచిక  4

అక్టోబరు-డిసెంబరు 2022 సంచిక

maagurinchi.jpg
rachanalu.jpg

“దీప్తి” ముచ్చట్లు

ఓ సీత, ఓ రాముడు, అక్కడక్కడా సీతారాముడు!

Deepthi Pendyala.jpg

దీప్తి పెండ్యాల

'కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా!' రాముడన్నాడు. అంతే అందమైన సమాధానం సీత నుంచి-

'మెరుపులో ఉరుములా దాగుండే నిజము చూడమ్మా!'

 

మా పేర్లూ రామాసీతలే. నేను ఆ రాముడిలా వెంటపడటమే కానీ, నా సీతకి ఇంత అందమైన సంభాషణలు రావు. త్రేతాయుగంలో సీతలా సుతిమెత్తగా, మార్దవంగానూ మాటాడదు. అలాగని సీత పేరుకు అసలు తగదేమో అనుకునేరు.  సౌందర్యంలో సీతే. సీతాకోకచిలుకే! ఇంకా చెప్పాలంటే మన సీతారాముడి పాటే! ఎటొచ్చీ మాటే, సూటిగా. ధాటీగా. ఏ ప్రశ్నకైనా సూటైన సమాధానాలే సీతవి. అలాంటి ఓ సమాధానమే నాకో సవాలు విసిరింది. తేల్చుకోలేని మీమాంసలో ఇలా చిక్కుకుపోయానీరోజు. గడువింకా ఒక్కరోజే ఉంది. ఏమని తేల్చుకోనూ?

 

అసలు మా సీతని తొలిసారి చూసిన అపురూపమైన ఆ రోజు మొదలయింది మా కథ.

ఆ రోజు ఏదో అవశ్యమయి ఆ ఇంటి మీదుగా వెళుతున్నాను. వివశుడినయ్యే ముహూర్తం తరిమినట్టుంది. ఆ ఇంటిని ఇల్లు అనేకంటే కూడా ఓ కుటీరం అంటే బాగా నప్పుతుంది. ప్రహారీ గోడలకంతా పరుచుకున్న మాలతీ తీగలు, లోపలి వైపుగా వాకిలి గచ్చు మీద పచ్చగా మెరుస్తూ ముంగిలికి సోయగాలు అద్దుతున్న గౌరీ మనోహరాలు,  శుభ్రంగా కడిగి అలంకరించిన తులసికోట దగ్గరి వాకిలి కట్ట మీద ముగ్ధమనోహరంగా కూర్చుని, కురులారబెట్టుకుంటూ దేనికోసమో ఎదురుచూస్తూ కనబడింది. నుదుటన దోసగింజలా చిన్న బొట్టు, అంత బారుగా ఉన్న ఆ వాలైన కనురెప్పలు ప్రయత్నిస్తే తగలకపోతాయా అన్న ధీమాతో అక్కడక్కడే నుదుటి మీదే తచ్చాడుతున్న ముంగురులు, వాటిని సున్నితంగా వెనక్కి నెట్టేస్తూ ఓ చేయి, ఓ చిన్న రేగు కొమ్మని పట్టుకుని వాకిలిపై నక్షత్ర మండలాలెన్నో సృజిస్తూ సుకుమారంగా కదులుతున్న మరో చేయి, వీధికేసే వేచిచూస్తూ నిలిపిన సూటయిన చూపులు, వెరసి చిన్నప్పుడు విన్న 'చినుకు తడికి చిగురు తొడుగు పూవమ్మా...' అనే సీతారాముని పాటని గుర్తు తెచ్చింది. ఆ పాటలో జీవ సౌందర్యం రూపం పోసుకుని నా ఎదుటకి సీత రూపంలో వస్తుందని కలలోనూ ఊహించలేదెపుడూ! ఆ రోజు అలా అనాలోచితంగా చూసానే కానీ, ఆ తరువాత ఆలోచనలని వదలకుండా ఇలా మనసులో కూర్చుండిపోతుందని తెలీనైనా లేదపుడు. నా మొహంలో మైమరపు పట్టేసినట్టుంది. 'ఆ రాముని సుమశరమా...?' సీతారాముడి పాట నన్నడిగింది! "అవునేమో. అయితే మాత్రం, ఆయనంత అందంగా చెప్పటం నా తరమా?" అనుకున్నాను నవ్వుకుంటూ.

ఆ రోజున సీత మొహంపై దిగులు మొయిలేదో ఒకటి మోమంతా కమ్ముకునే ఉంది కానీ, అది ఆ మొహంలో సౌందర్యాన్ని మాత్రం దాచలేకపోయింది. నవ్వుతూంటే అందంగా ఉండే మొహాలు చూసాను. నవ్వుతోనే అందమొచ్చే మొహాలూ చూసాను. మరి సీత అందానికి మటుకూ నవ్వుతో సంబంధమేమీ అవసరం లేనట్టుంది. అదెలా సంభవమో తెలీలేదు. చిరునవ్వేమయినా చూచాయగానయినా విడీవిడని పెదవులమధ్య చిక్కుకుపోయి సతమతమవుతుందేమో చూద్దామని వెదికాను. ఉహూ, ఆ జాడెక్కడయినా లేకున్నా మెరిసిపోయే అందం సీతదని అర్థమయింది. 

 

ఆమడ దూరంలో ఉండి ఆరాధనతో చూసిన ఆ క్షణం ఆమెని ఏ జన్మకైనా అందుకోగలననీ నమ్మలేకపోయానెందుకో. కానీ, రాసున్న అదృష్టమనుకుంటా. కోడలికై అన్ని దిక్కులూ వెదుకుతున్న పెద్దలకి సీత ఊసు అందింది, ఆ అమ్మాయి చిత్తరవు నా చేతికందించి "పేరు సీత" అని చెప్పటం వరకూ పూర్తిగా గుర్తుంది. సీత నాతో మాట్లాడాలని అందనటమూ బాగా గుర్తుంది. ఆ పై సీత నా ఎదురుగా నిలుచుని తన కలల గురించి చెబుతుంటేనే కదా నాకు తెలిసింది, ఆ మొహంలో దిగులు కూడా ఎందుకంతగా అందం అద్దుతుందో? సీతలో గూడుకట్టుకుపోయిన వేదన ఉంది. అది అందరి గురించి. సీత మాటలు వింటూ, మాటల్లో వ్యక్తమవుతున్న మేలిమి సీతని చూస్తూ రెప్ప వాల్చటం కూడా మరిచిపోవటం వరకయితే గుర్తుంది. ఆపై అంతా కలలోలా గుండెలో సందడే కాదు, గట్టిమేళమూ సీతారాముడి పాటలా తోడొచ్చి కావాల్సిన కళ్యాణం కావించింది.

ఆ పై మొదలయింది మా జీవితం. జీవితమంటే నిజం. కలలన్నీ కలిసి ఒక్క నిజమై, అచ్చంగా సీతై  ఎదురొచ్చాక, కలలోలా సాగదూ జీవితం? ఇక సీతకున్న కలల లోకమూ సీతతోపాటే వస్తుందని ఎరుగనివాడినేమీ కాదుగా? తన కలలన్నీ నావే అనీ అనుకున్నాను.

 "సీత అందాల బొమ్మ. అద్దమంటి మనసు. సౌందర్యంలోని సౌకుమార్యం మనసునీ అంటిపెట్టుకుని ఉంది కదా మెలకువగా మాటలాడాలి. మన్ననగా చూసుకోవాలి, కష్టపెట్టొద్దు. ఇష్టంగా తనకి తగ్గట్టే మసలుకోవాలి, తెలుసునా?" ఇంతే చెప్పింది అమ్మ. అంతేకదా అనుకున్నాను. అలాగే ఉంటున్నాను.

 

యేళ్ళు గడిచాయే కానీ, సీత అలాగే ఉంది. తనకూడా మా జీవితంలోకి తెచ్చుకున్న కలలు సాకారమవుతూంటే తన ప్రపంచం పెద్దదయింది. నేనలాగే ఉండిపోయాను. సీతే నా లోకంగా. మరి సీతకో? లోకమే జీవితం. మన సీతారాముడి భాషలో 'జగమంత కుటుంబం' సీతది. జగమే జీవితం. ఎవరూ లేని పిల్లలకి అన్నీ తానే అవుతుంది. తన ఆదాయమంతా ఆశ్రమానికి వెచ్చిస్తానని పెళ్లికి ముందే చెప్పింది. అదేమంత మాట? అనుకున్నానప్పుడు. సీత మాటలే మూటలవుతాయని, మూటలన్నీ ధారాళంగా ఇచ్చేయగలదనీ తెలిసింది తర్వాతేగా? చెప్పొద్దూ. నాకు మటుకూ గర్వం పెరిగింది. ఇంత సౌందర్యంతో జీవితం పంచుకునేంత అర్హుడినెలా అయ్యానా అని? ఆ మాటే అంటాను సీతతో. "నువ్వు రాముడివిలే, నీకు తెలీదంతే!" సుతారంగా నా జుట్టు చెరిపేసి తీర్మానించేస్తుందంతే.

సరిగ్గా ఓ పద్నాలుగు రోజుల ముందు అలాంటి అతిమయ సౌందర్యాతిశయ సందర్భంలోనే మెల్లిగా  "మరి మనకి లవకుశులొద్దా?" అని మాత్రం అడిగాను.  అదే ఇలా ఈ రోజు నన్ను ఈ సందిగ్ధావస్థలో ఉంచేసింది.

 

అదెప్పట్నుంచో నా మనసులో ఉన్న మాట మరి. నా లోకంలో సీతతో పాటు నాకంటూ మా కన్న పిల్లలుండాలని. ఆ చిన్ని ప్రశ్నతోటే సీత మొహం చిన్నబోయింది.

 

"పర్ణశాలలో అందరు పిల్లలుండగా మనకంటూ వేరుగా మళ్ళీ పిల్లలా? వాళ్ళు మన పిల్లలు కారా?" కళ్ళల్లోకి చూస్తూ మెల్లిగా అడిగింది.

 

"అందులోనే ఒకరిని దత్తత తీసుకుంటేనో?" మృదువుగా రాజీకొస్తూ అడిగాను.

 

"ఒకరికి మాత్రం ఎక్కువ ప్రేమా?" ఒక్క క్షణం ఆగింది. ఆ వెంటనే అంది "అంతేగా. సరే అయితే పక్షం పాటు శెలవు పెట్టి, పర్ణశాలకి వచ్చేయ్. అందరితో గడుపుతూ ఓ పదిహేను రోజులు గడిపేయ్. నీకెవరెక్కువ నచ్చితే వాళ్ళని దత్తత తీసుకుందాము. గుర్తుంచుకోవాలి మరి. పక్షం మాత్రమే గడపాలి సుమా! వచ్చే విదియవరకల్లా నీ నిర్ణయాన్ని చెప్పాలి!" అంది.

"పదిహేను రోజులా. చాలా ఎక్కువ సమయమే. రోజులో తేల్చేయనూ?" అన్నాను ధీమాగా.

 

అదిగో, అప్పుడు నవ్వింది సీత. ఫకాలున నవ్వింది. అబ్బురంగా చూడబోయి ఉక్రోషపడ్డాను. అదేదో వింతవిషయం విన్నట్టుగా ఏమా నవ్వు? ఏమన్నాననీ?

 

నవ్వు ఆపాక మళ్ళీ చెప్పింది. "అది కుదరదు. పదిహేను రోజులు పర్ణశాలలో గడిపిన తరువాతే చెప్పాలి మరి." అని.

 

సరేనన్నాను. తెల్లారే బయల్దేరాను. పర్ణశాలలో గడపటమంటే ప్రకృతిలో సరదాగా గడిపినంత ఆహ్లాదంగా ఉంటుంది మరి. 'పర్ణశాల' అనగానే మీరూహించింది నిజమే. అది ఆశ్రమానికి సీత పెట్టుకున్న పేరు. అందులో పదిహేనుమంది పిల్లలు, వారిని ప్రాణమల్లే ఎంచే నలుగురు సంరక్షకులు. ఇంకా ఇద్దరు వనమాలులుంటారక్కడ . వర్ణశోభితమైన పూలు పూసే చెట్లపై ఒక వనమాలికి శ్రద్ధ ఎక్కువ. మరో వనమాలికి మాత్రం ఆ పిల్లలకి ఫలసాయమందించే  చెట్లంటే మిన్నంత మక్కువ. అలా తోట నిండుగా ఎన్నో చెట్లు విరబూస్తుంటాయి. పూలనో, పళ్ళనో.   ఆ పచ్చటి పరిసరాల్లో సాయంత్రాలు చదువుకునేందుకు అనువుగా ఉన్న పొదరిళ్ళలో తివాచీలు పరుచుకుని పిల్లలంతా కూర్చుని చదువుకుంటూనో, ఆడుకుంటూనో తూనీగలకి మల్లే తిరుగుతూంటారు. తుళ్ళుతూ నవ్వుతూంటారు. కేరింతలతో మనసుని మురిపిస్తారు. ఆనందలోకమది. సీత సృష్టించిన అందాల లోకం మరి.

 

ఇంతకుముందు ఎన్నోసార్లు పర్ణశాలకి వచ్చినప్పటికీ,  సీతకి భర్తగా నేను నాన్నగానే గుర్తించబడ్డాను. కానీ, మొదటిసారి, గత పద్నాలుగు రోజులుగా వీళ్ళతో ఇక్కడే గడిపాక  నాకు నేనూ వాళ్ళకి నాన్ననయ్యాను. ఆర్నెల్లు గడిపితే వారు వీరవుతారట. సీతతో పెళ్ళయి ఆరేళ్ళు మరి. ఆ విషయం తెలిసే తెలివిగా నన్నిలాంటి సందిగ్ధంలో పెట్టిందేమో.


నిన్నటి రాకాచంద్రుని వెలుగులలో ఆరుబయట నా చుట్టూరా కూర్చుని, నేను చెప్పిన కథలు వింటూ, అలాగే అక్కడే ధీమాగా పడుకుండిపోయిన పదిహేనుమంది పిల్లలని చూస్తూ ఆలోచిస్తున్నాను.  ఏ ఒక్కరిని ఎక్కువ ప్రేమించానన్నది అంతుపట్టట్లేదు. ఏ ఒక్కరు ఎక్కువ కావాలని ఆలోచిస్తుంటే ఎక్కడో చిన్న దిగులు మొదలయింది. అచ్చంగా తొలిసారి సీతని చూసినపుడు సీత మొహంలో నేను చూసిన దిగులులాంటిదేదో నా మొహమ్మీద తారాడుతున్నట్టే తెలుస్తోంది.

 

నా సందిగ్ధం తొలగుతున్నట్టే ఉంది.  ఈ పక్షంలో పదిహేనుమంది పిల్లలపై పెరిగిన మమకారమే రేపు సీతకి నేనివ్వబోయే సమాధానమవబోయేలా ఉంది.  

వేకువ వెలుగులు పూర్తిగా పరుచుకున్నాక, లోపలికి వస్తున్న సీత కనబడగానే, నాలుకపై కూర్చుండిపోయిన  సీతారాముడడిగాడు నా సీతని- "నిశీధులన్నీ తలొంచే తుషారానివా?"  

 

ఇక నా 'ప్రేమ' కథ మొదలవుతుంది. ఇపుడు నాకు సీతే లోకం కాదు. సీత లోకమే నా లోకం కూడా.

*****

bottom of page