MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
“దీప్తి” ముచ్చట్లు
స్వప్రయోజనాలంటే?
దీప్తి పెండ్యాల
"లాభం లేదు, నేనెలాగయినా పాపులర్ అయిపోవాల్సిందే!" ఏదో వైరల్ ట్వీటు చూస్తూ నిశ్చయంగా అంటున్న మాన్య మాటలు వినగానే నింపాదిగా తలెత్తి చూసాను.చివాల్న తలెత్తి చూసేంత ఆశ్చర్యమేమీ లేదామాటలో. ఉండుండి ఆకస్మిక నిర్ణయాలు ప్రకటించటం దానికలవాటే. ఆచరణలోనూ మన మోదీగారి శిష్యురాలనే చెప్పొచ్చు.మహా ఫాస్టు.
"ఎందుకిపుడూ ఆ జాగోరేలూ, ఝంఝాటాలు? బానే ఉన్నావుగా?" భూప్రపంచమ్మీద ఎవరే టాపిక్ నాతో మాట్లాడినా అవతలివారికి కాసింత గౌరవసూచకంగా స్పందించకుండా ఉండలేని నా గుణాన్ని ఎంత ప్రయత్నించినా మార్చుకోలేను.బహుశా, నాలో నాకు అధికంగా నచ్చేదీ అదేనని నా అనుమానం. మరింకేం? నచ్చాక, మార్చుకోవటమెందుకంటారా? మాబ్ లో ఉంటూ మాబ్ బిహేవియర్... (ఆంగ్లాన్ని మన్నించాలి) అదే గొర్రెల్లో గొర్రెలా ఉండకపోతే ఏం బావుంటుందండీ? మనిషి ప్రాథమిక లక్షణం గొర్రెలా, తన సాటి గొర్రెలమంద ఏది చేస్తే అది పొలోమని ఫాలో అవటం కాదూ? కాదంటారా? అబ్బే. అనరు లెండి. ఇంకెవరయినా ఏమంటారో చూసాక అప్పుడేదో ఒకటంటారు. ఎవరూ ఏమీ అనకపోతే ఇంకేం. ఇంకా హ్యాపీస్. మనమూ ఏమీ అనమంతే. ఇదే మరి, గొర్రె లక్షణం. దీనికి అతీతులు ఏ కొందరో ఉంటారు లెండి. ఇపుడూ, ఫేస్ బుక్కు గోడలపై అనాథ ప్రేతల్లా వేలాడే మంచి పోస్టులు ఎంత బాగున్నా లైకులు కొడతామా? అబ్బే. అస్సలు కొట్టము. ఎంత చెత్తయినా సరే, అవతలి వాడికి వంద లైకులొచ్చాయంటే వీరావేశంతో అదెలా ఏడ్చినా, "నేను సైతం..." అంటూ వందొకటో లైకు కొడతాము! ఇప్పుడీ లైకుల గొడవెందుకంటే, మా మాన్య పరిభాషలో పాపులారిటీ అంటే ఏ సాంఘిక మాధ్యమంలోనో ఎప్పటికైనా ఓ వైరల్ పోస్టు/ ట్వీటుపెట్టి వేల స్పందనలు తెచ్చుకోవటమే పాపులారిటీ. చిన్ననాటి నుంచీ మహా కష్టపడి ఏదో ఓ కళాంశంలో ప్రావీణ్యత సంపాదించి, ఏ నడివయసులోనో పాపులర్ అనిపించుకునే రోజులటండీ ఇవి? ఉత్తి ఓ నాలుగు ఇచ్చకం మాటలాడో, కొట్టేసిన తాలూకా పోస్టులు పోస్టో,లేదంటే మనోభావాలు దెబ్బతీసే మాటలతోనో 'మమ ' అనిపించేసుకుంటే సరి. ఇపుడా మమ అనేసుకుందామనే మాన్య ఎదురు చూసేది.
"ఏం చేయమంటావు, చెప్పు." రెట్టించింది మాన్య.
బాగుంది. అదంత ఈజీ అయితే ఈ భూపెపంచకంలో పాపులర్ తప్ప నాలాంటి మామూలు మనుషులే ఉండేవారు కాదు కదా? ఆశా చాకొలేటడిగినంత చలాగ్గ అడుగుతుందేంటీ ?
"ఏమో. నాకు సరిగా తెలీదు కానీ, మన సంధ్యని అడగకపోయావా? ఈ మధ్య అదేదో పీడితుల గ్రూపు నాయకుడి ఉద్యమంలో పాల్గొంటూ చాలా ఫేమస్ అయిందన్నావుగా? "
మాన్య నన్ను అదోలా చూస్తూ- "అదేదో పీడితులంటున్నావు? పీడితులంటే చులకనయిందా నీకు? వాళ్ళు ఎన్నిరకాల వివక్షకి గురవుతారో తెలుసా నీకు?"
నేను నవ్వేస్తూ అన్నాను- "గుడ్, పాపులర్ అయే లక్షణాలు చాలా ఉన్నాయే నీకు. చిన్న పదంలో ఇన్ని అర్థాలు తీయగలగటం అత్యంత ముఖ్య లక్షణం. మామూలు వారు చేయలేరీ పని. గో ఎహెడ్."
మాన్య ఊరుకోలేదు. -"నువ్వు మాట దాటేయకు. పీడితులంటే నీకు ఏ సానుభూతీ లేదు. పైగా చులకన. అంత తేలిగ్గా 'అదేదో' అని ఎలా అనగలిగావు?"
మాన్యకు అర్థమయేలా చెప్పాలనిపించింది. "భలేదానివే?సానుభూతా?ఎందుకు? సానుభూతి, అదిగో అక్కడే ఉంది కీలకమంతా. నీ తోటివారనుకున్నవారిపై నీకు సానుభూతి ఉండనే ఉండదు. సానుభూతి చూపటమే చులకన చేయటం కదా? కాదంటావా? సహానుభూతి కదా ఉండాల్సింది? సానుభూతి చూపించేందుకు నేనెవరిని? ఒకరిపై సానుభూతి చూపుతున్నానంటే నాకు నేను లేని గొప్పదనం ఆపాదించుకోవటమే కదా?"
మాన్య వింటుందని ఓసారి నిర్ధారించుకుని మళ్ళీ మొదలెట్టాను. -"ఇపుడూ... ఇక్కడా ఎంతో కొంత వర్ణ వివక్ష ఉంది కదా? అంటే బ్రౌను వర్ణం కల నీవు తక్కువనీ, ఎవరయినా సానుభూతితో స్నేహం చేస్తే నీకు నచ్చుతుందా?"
"ఛ ఛ..అలా ఎందుకు చేస్తారూ?"
"కదా, మరి నీకు మాత్రం మరో తరహా వివక్ష ఎదుర్కొంటున్నవాళ్ళపై సానుభూతి ఎందుకు? పీడితులనటమే నాకు సమస్యలా కనబడుతుంది. ఇపుడిపుడే సమానమంటూ అంతటా స్థానం సంపాదించుకుంటున్న వారిని అసమానులమని నమ్మేలా మాటలు ఎగదోసి, సమాజం నుంచి వేరుపడేలా విభజించి, ఆపై పాలించాలనుకునే స్వప్రయోజనాలు చూసుకునే సంఘాలూ, వాటి నాయకులుంటారు చూడూ. వాటిపై ఆ "అదేదో" అనేంత నిరసన.
అసలూ- స్వప్రయోజనం కాక మరి ఏ ఇతర స్పష్టమైన ఆదర్శం,ఆచరణంటూ లేని సంఘాలని, వాటికి నాయకత్వం నెరిపే నాయకులనీ.." ఉపన్యాస ధోరణిలోకి వెళ్ళబోతున్న దాన్నల్లా, మాన్య ఏదో ఆలోచనలో పడ్డట్టనిపించి, ఆగాను.
"నువన్నది నిజమే కానీ, నాయకులే సమస్యంటావా??" సాలోచనగా అడిగింది.
"వివక్ష ఉన్నమాట నిజం. దీన్ని గుర్తించి, ప్రశ్నిస్తూ ఆ వివక్ష తొలగటానికి వీలయినంత కృషి చేసిన మహా నాయకుల వల్లే, వివక్షని వ్యవస్థ మూలాల్లోంచి పెకిలించివేసే చట్టాలొచ్చాయి కదా. సామాజికంగా వివక్షని ప్రదర్శించటం చట్టవిరుద్ధం అయిందీ అలాంటి ధీటయిన నాయకులవల్లేగా. క్రమంగా దీన్ని, మనసులలోంచీ తీసేయగల సమర్థ నాయకులూ రాకపోరు.. ఎటొచ్చీ, తమ నాయకత్వప్రయోజనాల కోసం విడదీసి, వేరుచేసి పాలించేవారి వల్ల ప్రమాదమే ఎక్కువ."
"స్వప్రయోజనాలంటే?" ఆసక్తిగా అడిగింది మాన్య.
ఏదో అనుమానం వచ్చి- "ఇపుడేంటీ? ఆ టాపిక్ మీదికి మరలుతున్నాము? నీవేదో పాపులారిటీ, ట్వీటులు, పోస్టులు అన్నావుగా?"
"అవునే. నేనేమీ డైవర్ట్ అవలేదు. నేను పాయింటు మీదే ఉన్నాను. ఇదేదో నా పాపులారిటీ పోస్టుకు పనికొచ్చే అంశాల్లా ఉన్నాయనిపించి. చెప్పు, చెప్పు..." మాన్య ఉత్సాహంగా అడిగింది.
"ఇంకేం చెప్పను? నువ్వే బాగా చెప్పావులే స్వప్రయోజనాలంటే. లక్ష్యంలో నిజాయితీ లేని వారందరూ మార్పు కోసం దిగటమే. ఇంకెక్కడ మార్పు?" గొణుక్కుంటూ నా లాండ్రీ రూముకెళ్ళాను. గుట్టల్లా పేరుకున్న బట్టలు మడతేస్తూ మాట్లాడితే కనీసం నా ప్రయోజనమైనా నెరవేరుతుందని.
మాన్య వదల్లేదు నన్ను. నా వెంటే వచ్చింది. "పోనీ,మరి దేని గురించి రాస్తే బాగుంటుందంటావు?"
విసుగ్గా చూసాను.
నా చూపునస్సలు పట్టించుకోకుండా- "ఇంకా చాలా,చాలా మాట్లాడి ఒకటేదయినా ఎన్నుకుంటాను. ఎన్ని రకాల పీడితులో? కులవివక్ష, మత వివక్ష, ప్రాంత వివక్ష,లింగ వివక్ష... ఓ మై గాడ్. నాకు చాలా టాపిక్స్ ఉండేలా ఉన్నాయి. మార్పుని సాధ్యం చేసి చూపిస్తా, చూడు" పట్టలేనంత ఆనందంగా అంది.
"అవునవును. మార్పు సాధ్యమే. అదీ నీ వల్లే." గొణుక్కున్నాను. బట్టలన్నీ రగ్ మీద బోర్లిస్తూ. రంగురంగుల బట్టలు. రకరకాల సైజులలో. వాటిని వేటికవి సర్దేలోగా ఎన్ని మాటలైనా మాట్లాడొచ్చు. నా ప్రయోజనం నెరవేరుతుంది. మాన్యదీ నెరవేరుతుంది.
మరి మార్పు సంగతో?.
*****