top of page

“దీప్తి” ముచ్చట్లు 

ఫిల్టర్స్

deepthi pendyala.jpg

దీప్తి పెండ్యాల

"నీకు తెలీకుండానే అనేస్తున్నావా?" చూపు పెన్నువైపుకి తిప్పుతూ అడిగారు, ఎదురుగా కూర్చున్న థెరపిస్టు డాక్టర్ జేన్.

మౌనంగా తలూపింది స్ఫూర్తి.

"అదెలా?"  డాక్టర్ మాటల్లో నెమ్మదితనం. ప్రశ్నిస్తున్నట్టు ఉండదు డాక్టర్ గొంతు. తెలుసుకోగోరుతున్నట్టుగా ఉంటుంది. స్ఫూర్తికి అదేమిటో తెలిస్తే చెప్పేసేదే. కానీ, అదేదో డాక్టర్ కి తెలుసేమోననే అరవయయిదు డాలర్ల కోపే (ఫీ) కట్టి మరీ ఇలా థెరపీకని వచ్చింది స్ఫూర్తి.

మౌనంగా ఉంది స్ఫూర్తి.  ఇరవయ్యారు అంతస్తులున్న భవనంలో ఇరవయ్యయిదవ అంతస్తులో ఉన్న ఆ కన్సల్టింగ్ రూం లో తన ఎదురుగా ఉన్న కిటికీ నుంచి కంటికి అందుతున్న దూరం మేరా కనబడుతున్న ఇతర భవంతులని చూస్తుంది. ధారాళంగా పడుతున్న వర్షాన్ని చూస్తుంది. శబ్దమేదీ వినబడని వాన. ఆ కిటికీ అద్దాలు ఆపేసిన శబ్దాలన్నీ నిశ్శబ్దంగా మారి స్ఫూర్తి మనసులోనూ హోరున కురుస్తూ ఉన్నట్టుంది. నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఉంది స్ఫూర్తి.

  

డాక్టర్ జేన్ రాసుకుంటున్నారు. ఇక్కడ డాక్టర్లు, కౌన్సెలర్లు చిత్రగుప్తుల్లా రాస్తూనే ఉంటారు.  పేషంట్లు, క్లయంట్లు చెప్పిందే చెబుతూనే ఉంటారు. స్ఫూర్తిలా ఏదీ చెప్పనపుడు మరింత ఎక్కువ రాసుకుంటారు. పెన్ను ఆగింది.

 

“ఆర్నెల్లుగా ఇలా జరుగుతుందన్నావు కదా. సమస్య మొదలయినపుడు మనసు దెబ్బతినే సంఘటన ఏదయినా జరిగినట్టు గుర్తుందా?”

తల అడ్డంగా ఊపింది స్ఫూర్తి. అసలు అలా జరుగుతున్నట్టు గమనిస్తే కదా? మామూలుగా మాట్లాడుతున్నట్టే ఉంది ఆమెకి. హఠాత్తుగా మాటలకి ఫిల్టర్లు మాయమయ్యాయని తెలిసింది ఆమె కొడుకు గమనించి చెప్పినపుడే.

మొదట మెనోపాజ్ అని, హార్మోన్ల అసమతౌల్యమేమో అని ఇంట్లోవారిని సమాధానపరిచింది. రాన్రానూ అందరి ముందూ జరుగుతుండటంతో ఇలా థెరపీకి పంపారు పిల్లలు.

 డాక్టర్ జేన్ మళ్ళీ అడిగారు"మీరు మొదట గమనించిందెప్పుడు?"

 

స్ఫూర్తి చెప్పటం మొదలుపెట్టింది.

"ఆర్నెల్లయింది. ఆరోజు పార్కులో వాకింగ్ చేస్తున్నాను. మా వాడు నా పక్కనే స్కేట్ బోర్డుపై నుంచి సర్రున వెళుతూ, అపుడపుడూ నా కొరకు ఆగుతూ, కాసేపు నడుస్తూ వస్తున్నాడు. సరస్సు చుట్టూ మూడో రౌండు అది. అప్పటివరకూ ట్రంపు మొహంలా ఎర్రగా ఉన్న సూర్యుడు కింద రిసెప్షన్లో మొహం మొటమొటలాడిస్తూ కూర్చునే ఫ్రాన్సిస్ మొహంలా నారింజరంగులోకి మారాడు."

"స్పూర్టీ!' - డాక్టర్ జేన్ మొహమూ ఎర్రబడేదే ఆ మాటలకి, కానీ థెరపిస్టుగా క్లయంటు ఆలోచనల పట్ల ఉండాల్సిన సహానుభూతి పుష్కలంగా ఉండటం వల్ల రంగుమారలేదు.

ఠక్కున ఆపేసింది స్ఫూర్తి. సిగ్గుతో కందిపోతూ స్ఫూర్తి మొహం ఎర్రగా మారుతుంటే, మెల్లిగా గునుస్తూ అంది. "చెప్పానుగా డాక్టర్. ఇదే నా సమస్య మరి. ఫిల్టర్లు మాయమయ్యాయి."

డాక్టర్ జేన్ తేటబడి "సరే" అని తలాడించి, "ఆ తర్వాత?" అన్నారు.

స్ఫూర్తి గుర్తు చేసుకుంటూ అంది. "అలా మెల్లమెల్లగా చీకటి ఛాయలు చెట్ల నీడల్లో కలిసిపోయి మరింత చిక్కనవుతున్నప్పుడు చూసాను నా ఎదురుగా ఉన్న చైనీస్ జంట ఉన్నట్టుండి ఆగిపోయి కిందికే చూడటం. ఏమిటా అని చూసానా? ఇంత పెద్ద పాము. నడకకి అడ్డం పడేంత పొడవుతో. నాకు పాములంటే చచ్చేంత భయం. అది అలా సరసరా నడిచే దారిలోకి వస్తూటే భయంతో ఎగిరి గంతేసి పరిగెత్తబోయానా, నా ముందున్న జంట నాకంటే ఎక్కువ భయపడ్డట్టున్నారు. దాన్నే చూస్తూ, వేగంగా అడుగులేస్తూ మా వాడికి తగిలి, వాణ్ణి కిందపడేసారు. వాడలా పడిపోవటం చూసి కోపమొచ్చిందేమో, "పాములు,తేళ్ళు తింటారు కదరా మీ చైనీసువాళ్ళు, అంత భయమేంటి?" అని మా భాషలో గట్టిగానే అరిచేసాను. ఆ దూరాన, అందులోనూ ఆ కంగారులో వాళ్ళకేమీ అర్థం కాలేదు. కానీ, మా వాడికి అర్థమయింది. వాడు లేచి, నన్నే సూటిగా చూసాడు. పాము కన్నా నా మాటలు వాణ్ణెక్కువ భయపెట్టాయని అర్థమయింది. కాస్త ఇబ్బందిగా వాణ్ణి పట్టుకుని, వడివడిగా ఆ ప్రాంతం నుంచి తప్పించుకున్నాను.”

డాక్టర్ జేన్ అభావంగా చూసారు స్ఫూర్తిని.

"రిలాక్స్ స్పూర్టీ. ఇది తప్పని నీకు తెలిసి అపరాధభావన ఉంటే మటుకూ ఇది సమస్య కాదు. తప్పని తెలీనివారే, చెప్పినా అర్థం చేసుకోలేనివారే సమాజానికి సమస్యవుతారు."

 

"తెలుసు. కానీ, ఇలా ఫిల్టర్ మాయమవటం వల్ల, ఆఫీసులోనూ సమస్యలొచ్చేలా ఉన్నాయి. మొన్నటికి మొన్న అందరం ఆఫీసులో ప్రతీ సంవత్సరం జరిగే ఫాల్ పార్టీ కని వెళ్ళాము. బార్బన్ హైమర్ (Barbenheimer)థీం లో పార్టీ అన్నారు. ఆడపిల్లలు అందమైన బార్బీ డ్రెస్సులు, అబ్బాయిలు చక్కని డేపర్ సూట్లూ వేసుకుని రావాలని ముందే చెప్పారు. అందులో అటూ, ఇటూ కాని వాళ్ళేమో..." ఫిల్టర్ మాయమవటం తెలిసిపోయి, ఆగిపోయింది స్ఫూర్తి.  జేన్ సర్వనామం "They/Them" అని గుర్తొచ్చి, జేన్ వైపు చూసింది.

 

అయిపోయింది. అప్పటికే వినేసారు డాక్టర్ జేన్.  స్ఫూర్తి అక్కడ ఉండలేక, ఇబ్బంది పడుతూ "ఈ రోజుకి చాలు, నేను మళ్ళీ వస్తాను" అంటూ గబగబా లేచి, బ్యాగందుకుంది.

 

జేన్ పైపైన నవ్వారు. "ఫర్లేదు స్ఫూర్టీ. కూర్చో. నీ సెషన్ పూర్తయేందుకు ఇంకా అర్ధగంట సమయముంది. వినటానికే ఉన్నాను. ఎందుకలా ఉన్నట్టుండి ఫిల్టర్ మాయమవుతుందనేది ఆలోచిస్తున్నానంతే. ప్లీజ్, కూర్చో." అన్నారు.

 

నోరు విప్పితే ఏం మాట్లాడుతానో అన్న భయంతో కాసేపు మౌనంగా కూర్చుంది స్ఫూర్తి.

 

డాక్టర్ జేన్ వాతావరణాన్ని తేలికచేసేందుకు ప్రయత్నిస్తూ, "ఫర్లేదు చెప్పు, పార్టీలో ఏం జరిగింది. బహుశా, నేను ఊహిస్తున్నది కరెక్టే అయుండాలి" అన్నారు.

 

"నిజమే.  కొత్తగా, వింతగా కనబడుతున్న జంటల గురించి నా కలీగ్ తో మా భాషయిన తెలుగులోనే ఏదో అభ్యంతరకరంగా అనబోతూంటే ఆమె నన్ను చటుక్కున గిల్లి, ఆపేసింది.  సాక్షాత్తూ మా హెచ్.ఆర్ డేవిడ్, తన పార్ట్నర్ తో మా ఎదురుగానే ఉన్నాడు. మా కలీగ్ చెప్పింది ఆ పార్ట్నర్ తెలుగువాడని. అతను నన్ను చురుక్కున చూసి, డేవిడ్ ని పక్కకి తీసుకెళ్ళాడు. ఏం చెప్పాడో, ఇపుడేమి ఎదుర్కోవాలో? మా తెలుగువాళ్ళలోనూ ఇలా ఏకలింగ జంటలు తయారవుతున్నాయని నేను ఊహించలేదు." చివరిమాటంటూ డాక్టర్ వైపు చూసింది.

డాక్టర్ జేన్ తల రుద్దుకుంటూ కనిపించారు. ఆ చేతిలో పెన్ కదలటం ఆగిపోయింది.

స్ఫూర్తి కుర్చీలో అటూ ఇటూ అసహనంగా కదిలింది.

“దీనికి మందేమయినా ఉందా?” మెల్లిగా అంది స్ఫూర్తి.

“దేనికి? అనకపోవటానికా? అంటున్నదేదీ అనిపించకపోవటానికా? “ జేన్ మృదువుగా అడిగారు.

“ఇపుడైతే మొదట నా ఫిల్టర్లు నాకు కావాలి. మాటలపై ఉండే మృదువైన ముసుగులాంటి నా ఫిల్టర్లు లేకపోవటంతోనే కదా నన్నందరూ అదోలా  చూస్తున్నారు? ఈ సమాజం మరీ సున్నితంగా మారుతుందనిపిస్తుంది. ఏది మాట్లాడినా ఎవరో ఒకరికి తప్పుగా వినబడుతుంది. తెలుసుకోవాలి, అప్డేట్ అవ్వాలి అంటారు. ఎంతగా అవాలి డాక్టర్? నన్ను ఇండియన్ అని ఎవరైనా అంటే నాకు కోపమేమీ రాదే. గర్వంగానే చెప్పుకుంటాను. మరి బ్లాకుని బ్లాకనటంలో, బ్రౌన్ ని బ్రౌన్ అనటంలో తప్పేముంది? ఈ మధ్యే ఆర్నెల్ల క్రితం మారిన కొత్త ఆఫీసులో అయితే మరీ సున్నితమైన పరిస్థితులు. డైవర్సిటీ పై అవగాహన ఇస్తున్నారు మంచిదే. ఇంక్లూజివ్ ట్రైనింగులేవో ఇస్తూనే ఉన్నారు, మంచిదే . చులకన చేయనంతవరకూ మంచిదే. కానీ, సామాజికంగా  ఆడవారిని ఆడవారనొద్దు. వయసయిన వాళ్ళను పెద్దవాళ్ళు కదాని అతిగౌరవమివ్వొద్దు. వయసులో చిన్నపిల్లలని చిన్నపిల్లలని అనవద్దు. ఏంటిదంతా? చాలా కన్ఫ్యూజుడ్ గా మారట్లేదూ లోకం? మా చిన్నప్పుడు వేరే కులాల వారిని చిన్నచూపు చూడొద్దనేవారు. కలుపుకున్నాము. అంత సింపుల్ గా ఎందుకు లేదిపుడు?” స్ఫూర్తికి స్ఫురించలేదు ఇక్కడా ఫిల్టర్ పోయిందని. మారామని చెప్పుకోవటంలో ఉదారత్వం చూపటమూ ఆధిపత్యధోరణే అని తెలీదు స్ఫూర్తికి.

 

డాక్టర్ జేన్ నవ్వారు.  “నాకు ఇండియాలో క్యాస్టిజం గురించి తెలుసు. బ్యాక్ వార్డ్ కాని 'అదర్' క్యాస్టే కదా మీది? తెలీనివారికి సైతం మీ మాటలు అదే విషయం స్పష్టపరుస్తాయి. ఇక మనుషుల పనివిధానం చూడకుండా కేవలం వాళ్ళ వయసు పరంగానో, ఆడవారన్నకారణంగానో వారి సామర్థ్యాన్ని అంచనా వేయటం, వీళ్ళు ఇంతకన్నా చేయలేరనే ముద్ర వేసి, స్టీరియోటైపు చేసి వేరుగా చూడటం వారిని వేరు చేయటమేగా? ప్రపంచం సున్నితమవ్వట్లేదు. తప్పేదో, సరైనవిధానమేదో తెలుసుకుంటుంది."

 

"అలాగని సమస్యేమిటో తెలీనివారిని అనాగరీకుల్లా చూడటం మాత్రం జడ్జి చేయటం కాదా? అందరికీ అందరి బాధల గురించి తెలుసుకునే అవకాశం, పరిస్థితులు ఉండవు కదా?" స్ఫూర్తి అసహనంగా అంది. అంతలో చల్లబడుతూ అంది- "ఇక్కడే చూడండి. నా పేరు స్ఫూర్తి. కానీ, మీరు స్ఫూర్టీ అన్నప్పుడల్లా నాకేం కోపం రాలేదే?"

 

డాక్టర్ జేన్ అన్నారు. "నన్ను కరెక్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఇకపై స్ఫూర్తి అనే అంటాను. నిజమే స్ఫూర్తీ.  తెలీకపోవటం తప్పు కాదు. కానీ, తెలుసుకునే అవకాశం కలిగేదెప్పుడు?  అజ్ఞానాన్ని అజ్ఞానంగా ఎవరైనా ఎత్తిచూపితేనే కదా తెలిసేది. అలా తెలిసాక, ఆ అజ్ఞానం సులభంగా పోగొట్టుకోవచ్చు. కానీ, పుట్టిన జాతి, ప్రదేశం, రంగు, మతం, మూలాల గుర్తులు చెరుపుకోలేనివి, చెరుపుకోకూడనివి కదా. కాపాడుకోవాల్సిన వైవిధ్యతని ఎత్తిచూపుతూ, వాటి ఆధారంగా మనిషిని జడ్జ్ చేసి తక్కువ చేయటం ఎక్కువ అన్యాయం కదా?"

స్ఫూర్తికి అర్థమయినట్టే ఉంది, కానీ పూర్తిగా అర్థమవలేదు. చాలామందికి మల్లేనే. వివరణ కోరింది. 

డాక్టర్ జేన్ నవ్వారు. ఈసారి ప్రయత్నం లేకుండానే, మనస్ఫూర్తిగానే నవ్వారు. మరి, ఏదీ తెలుసుకోనవసరం లేదనుకునేవారిని ఎందరినో చూసారు డాక్టర్ జేన్. కానీ, స్ఫూర్తి తెలుసుకోవాలనుకుంటుంది. అదే కదా మొదటి మలుపు!

 

*****

bottom of page