MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
“దీప్తి” ముచ్చట్లు
అనుకుంటాము కానీ...
దీప్తి పెండ్యాల
ఒకానొక ప్రభాత వేళ, ధనుర్మాసానికి దరహాసాలద్దేందుకు మా కాంక్రీటు ముంగిట్లో ముగ్గు వేయాలనిపించింది. వారాంతంలో అయినా ఉదయాన్నే లేచే అలవాటేమో, అయిదవగానే మరి నిద్రపట్టక ఓ ముత్యమంత చిన్న ముగ్గయినా వేసేద్దామని తలుపు తీసాను.
ఆహ్లాదకరమైన ఉదయాన్ని ఆస్వాదిస్తున్న ముంగిలి మామూలు కంటే ముచ్చటగా తోచింది. రాత్రంతా కురిసిన వర్షం కళ్ళాపి చల్లి వాకిలిని సిద్ధంగా ఉంచింది. వర్షం వాకిలి చల్లగానే, మల్చ్ వెదజల్లిన మట్టి పరిమళాలు ఆక్రాన్ చెట్టు నుంచి వీస్తున్న గాలిలో కలగలిసి నన్ను కదలనివ్వలేదు. పూలని విడువలేక నిలుచుండిపోయిన కొన్ని వానచినుకులు మెరుస్తూ పూలమొక్కలని మరింత అందంగా మార్చాయి. క్రోటన్ మొక్కలన్నీ నవ్వుతూ శుభోదయం చెప్తున్నాయి. ముగ్గు వేసేందుకు అలవాటు కొద్దీ చాక్ పీసుని తెచ్చేందుకు కదిలానో , లేదో, చాక్ పీసులూ - క్షమించాలి. ముగ్గులకీ, ఆంగ్లానికీ పొంతన కుదరట్లేదు. ఈసారికి, సుద్దముక్కలంటేనే బావుంది. ఈ సారి ఏంటీ? ఎన్నిసార్లయినా, ఎప్పుడయినా అందాల తెలుగే ఆనందం. రాయటానికైనా, వినటానికైనా, చదవటానికైనా! ఆ - సుద్దముక్కలు నిండుకున్నాయని గుర్తొచ్చింది. ఇప్పుడెలా? అనుకుంటూ మా వీధి వెంటా దృష్టి సారించి, ఈ అమెరికా వీధిలో ఒక్క ముగ్గూ కనబడక, ఆకాశవీధి వైపు దృష్టి సారించాను. అబ్బో! చుక్కలు ఎన్నున్నాయో!
అసలా ఆకాశ వాకిట్లో చుక్కలెట్టిందెవరో? ముగ్గేయటానికి కొన్ని నక్షత్రాలని పట్టుకువస్తేనో? అనుకుంటూ అలాగే చూస్తుండిపోయాను. అంతలో చందమామ మబ్బుల్లోంచి అందంగా నవ్వుతూ బయటకి వచ్చేశాడు."ఆశ, దోశ” - అంటూ! నా మొహం ఆనందంతో విచ్చుకుంది. పిండారబోసినట్టున్న వెన్నెలని కాసింతిమ్మని చందమామని అడిగేయాలనిపించింది.
తెల్లగా ఉంటే ఎంత బావుంటుంది ముగ్గుపిండి!
ఇలా అన్నీ ప్రకృతిసిద్ధంగా ఉంచాక, సుద్దముక్కలు నిండుకోవటం సమస్యే అనిపించలేదు. అలా ఆశల నిచ్చెనపై ఆకాశానికెక్కేసి, వెన్నెల ముగ్గుపిండినీ, కొన్ని చుక్కలనీ దోసిళ్ళలో నింపుకుని వాకిలిపై వాలాను!
ఆపై?
ఏ ముగ్గేయాలా అని ఆలోచిస్తున్నంతలోనే భానుని ఆగమనానికి దారులు పోసిన లేలేత కిరణాలు నన్ను వెచ్చగా పలకరించి ఎంచక్కా గడపపై పసుపు అద్దటానికన్నట్టుగా వాలుగా పడ్డాయి. ఇంకేం! సూర్యుడిని ఈ ఒక్కపూట తన రథాన్ని అరువిమ్మని అడిగేస్తే సరి.
అలా అలవోకగా వచ్చి ఆ రథాన్ని కాస్త మా ముంగిట్లో దించేస్తే చాలు రంగులు నేనద్దుతాను! రథం ముగ్గు సిద్ధం! గొబ్బెమ్మలా కొలువయ్యేందుకు హిమపాతం కాసేపట్లో వస్తుందని వాతావరణ శాఖ ముందే చెప్పింది!
అలా ఊహల్లోనే రథం ముగ్గు వేసేసి, ఆ పై ఇంట్లో ఉన్న బియ్యంపిండితో నాకు వచ్చిన నిజం ముగ్గు వేసేసి ఆ పూటకి ముగ్గుల ముచ్చటని కానిచ్చాను.
స్నానాదులు ముగించి, పూజగదిలో దీపాలవీ వెలిగించి విష్ణు సహస్రనామాలు చదువుకున్నాను. అప్పటికీ టైం చూస్తే ఇంకా ఆరున్నరే! ఇంట్లో ఎవరూ లేవనపుడు, ఏ పనీ చేయకుండా, తీరిగ్గా కాఫీ తాగుతూ టీ.వీ. చూడ్డంలో ఆనందమే వేరు కదా! అలా ప్రశాంతంగా తెలుగు చానల్ చూస్తుంటే, ఒక ప్రవచనం ఆకట్టుకుంది. ప్రవచనాలు నన్నే కాదు అందర్నీ ఆకట్టుకుంటాయని ఈ మధ్యే తెలిసింది. ఆ రోజుకింకా నాకు తెలియలేదు. ప్రవచనాలు ఛోటామోటా లీడర్లకి కెరీర్లో ఎదగటానికి, వివాదాలు లేవనెత్తి మీడియాలో కనబడేందుకు, అల్లర్లు చేసి ఉనికిని చాటేందుకు పనికొస్తాయని తెలీని అమాయకపు రోజది. అనుకుంటాము కానీ, ఆ ప్రవచనం చెప్పే పెద్దాయనకి అన్నీ తెలుసనుకుంటాము కానీ, కలియుగ ధర్మమే తెలీదు. ఎక్కడో, ఎప్పుడో ధర్మం నాలుగు పాదాలు నడిచిన ముచ్చట్లే చెబుతుంటాడు. కలియుగ ధర్మం ఇదీ! ప్రజలసొమ్ము కోట్లకి కోట్లు కూడేసి, ఓ పాయింట్ రెండు శాతం ఆ ప్రజల మొహానే పారేస్తే- "ఆహా! నీవు దేవుడయ్యా" అంటారు. ఈ పాటి ధర్మం తెలీదు, రూపాయయినా తీసుకోకుండా నాల్గు మంచిమాటలు చెప్పి తృప్తిపడతాడట. ఆ తృప్తి కాస్తా దిష్టిబొమ్మల్లో తగలబడుతుంటే కూడా తెలిసిరాదో!? మర్డర్లు చేసేవాడిని, దేశద్రోహం చేసేవాడిని వేలెత్తి చూపలేని ధైర్యంలేనివారు అంతా చెయ్యెత్తి కొట్టేది ఇలాంటి ఓ మామూలు మాన్యుడినేనని? సరే, ఇదంతా ఎందుకు లెండి. యదార్థవాది-లోకవిరోధి అంటారు. ఎంచక్కా, ముగ్గులూ, గుడులూ రోజూవారీ ముచ్చట్లయితే సరే!
అలా - ఆరోజులోకి వెళితే, ప్రశాంతంగా కూర్చుని టీ.వీ చూస్తున్న నన్ను ఓ ప్రవచనం ఆకట్టుకుంది.
వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తరద్వార దర్శనం చేస్తూ, ఇష్టులైన స్వర్గీయ పెద్దలని తలుచుకోవాలట. అలా తలుచుకుంటే, దక్షిణం వైపుగా చూస్తున్న మహావిష్ణువు వారిని ఏకంగా వైకుంఠానికి రప్పించుకుంటాడట!
చటుక్కున రెండు సంవత్సరాల క్రిందే మమ్మల్ని విడిచి వెళ్ళిన అమ్మమ్మ గుర్తొచ్చింది.
'మై పంచాంగ్' చూస్తే ఆరోజే ఏకాదశి. గబుక్కున వెళ్ళి అత్తయ్యగారిని లేపి గుడికెళదామన్నాను. అరగంటలో రెడీ అయి బయట పడ్డామిద్దరమూ.
***
***
డ్రైవ్ చేస్తున్నానే కానీ, అమ్మమ్మ జ్ఞాపకాలు సన్నగా వీస్తున్న గాలితో పాటుగా నన్నల్లుకుపోతున్నాయి.
ఓ వైపు మాట్లాడుతూనే ఉన్నాను కానీ, మొన్నమొన్నటి వరకూ... అంటే కూడా రెండు సంవత్సరాల క్రితం వరకూ మెత్తగా ఒదిగిపోయి, గువ్వలా బజ్జుండిపోయిన అమ్మమ్మ ఒడి గుర్తొస్తుంది. నోటి నుంచి చెప్పకుండానే నాకు చూడాలని ఉందన్న విషయం పసిగట్టి ఒక్కపూటైనా వీలు చేసుకుని వచ్చి, మాకు నచ్చినవన్నీ చేసో చేయించో తీసుకొచ్చే అమ్మమ్మ గుర్తొస్తుంది. రెసిడెన్షియల్ కాలేజీ లో తిండి సరిగా తినని నా కోసం, డబ్బాల కొద్దీ తినుబండారాలు, అరిసెలు, లడ్డూలు పంపిస్తూ ఉండే అమ్మమ్మ గుర్తొస్తుంది. గుడికయినా, సినిమాకయినా, ఎగ్జిబిషన్ అయినా, మా పిల్లమూకని తీసుకెళ్ళి మా సరదా చూసి తాను సంతోషపడిపోయే అమ్మమ్మ గుర్తొస్తుంది. సముద్రాలు దాటి, దేశం కాని దేశం వస్తూంటే, నన్ను చూడకుండా యేళ్ళకేళ్ళు ఎలా ఉండాలో అన్న బెంగ కళ్ళలో ఏర్పడ్డ పలుచటి నీటితెరలో కనిపిస్తున్నప్పటికీ, చిరునవ్వుతో బై చెప్పిన అమ్మమ్మే గుర్తొస్తుంది. అంతు చిక్కని వ్యాధితో సతమతమవుతూ ఉన్నా, నన్ను బేలగా చూళ్ళేని అమ్మమ్మ బానే ఉన్నానంటూ నాకు తొలిసారిగా చెప్పిన అబద్ధం గుర్తొస్తుంది. నా కన్నుల్లో చెమ్మ కాస్తా క్రమంగా కళ్ళని నీటి చెలమల్లా మారుస్తున్న సమయంలో గుడికి చేరుకున్నాము.
లోపలికి ప్రవేశిస్తుంటే "ఇదెప్పుడూ వచ్చే గుడేనా?!" అనిపించిందో క్షణం! ఉత్తర ద్వారమంటే అదేనేమో! అద్భుతంగా అలంకరించారు. దైవత్వంలో ఉన్న గొప్పదనం అదే కాబోలు! నన్నప్పటివరకూ ముంచెత్తి, మనసంతా ఆక్రమించిన జ్ఞాపకాలు తెలియకుండానే నెమ్మదిగా గుండెలో ఏ మూలన సర్దుకున్నాయో మరి? ఓ చిత్రమైన అనుభూతిలో పడి చిత్తరువులా చూస్తుండిపోయానలా. అలౌకికానుభూతితో అబ్బురపోయి చూస్తూ! సంప్రదాయ వస్త్రధారణలో ముద్దమందారాల్లా ముద్దుగొలిపే ముచ్చటైన అమ్మాయిల పద్ధతైన స్వాగతానికి అచ్చెరువయి చూస్తున్నంతలో - జనసందోహం మా ప్రమేయం లేకుండానే, మమ్మల్ని మెల్లిగా లోపలికి తీసికెళ్ళబోయింది. ముందుకు వెళ్ళబోయి ఠక్కున ఆగిపోయాను. నేనొచ్చిందెందుకూ?! మా అమ్మమ్మని వైకుంఠానికి తెచ్చుకొమ్మని విష్ణువుతో ఓ మాట చెప్పేందుకు కదూ! ఇల్లలుకుతూ, ఇల్లలుకుతూ - తన పేరు మర్చిపోయిన ఈగలా, నేనూ వచ్చిన విషయం మర్చిపోయాను. ద్వారంలోకి ప్రవేశిస్తూ కదా ఆ మాట చెప్పాలి. మరేంటీ?! అప్పుడే ద్వారం దగ్గరికొచ్చేశాము.
అస్సలు, జనాలు నిలబడనిచ్చే అవకాశమీయట్లేదు. దాటేలా ఉన్నామే. ఇప్పుడే గట్టిగా చెప్పాలి అనుకుంటూ, ఆమ్మమ్మ పేరు వల్లించటం మొదలెట్టాను. అప్పుడొక సందేహం తట్టింది. శరీరం విడిచాక, "ఆఫ్టర్ లైఫ్" ఎలా ఉంటుందీ?! ఆత్మకి పేరుంటుందా?! శరీరానికే కదా పేరు? విడిచాక, ఆ పరలోకాల్లో ఎలా పిలుస్తారు? ఏ పేరుతో పెద్దవారంతా జీవిస్తూ (?!) ఉంటారు? ఇప్పుడు నేనీ పేరు చెబితే విష్ణుమూర్తి అమ్మమ్మని పోలిక పట్టగలడా?! అసలు అక్కడే ఉండి ఉంటుందా?! పునర్జన్మలో ఉండి, ఎక్కడో పసిపిల్లలా ఆనందంగా ఆడుకుంటూ ఉంటుందా?!
ఏదయినా, పేరు, పిలుపు రెండూ జపిస్తూనే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ ఆలోచనల్లో కొత్త సత్యం తెలిసింది. పోయేప్పుడు నీ వెంట ఏదీ రాదంటారే! అది నిజం. చివరికి బతికినన్నాళ్ళూ సంపాదించుకున్న పేరు కూడా ఇక్కడే వదిలేసి వెళతాము. అది మంచి పేరయినా, చెడ్డపేరయినా! ఈ సత్యం కాస్త ముందు తెలిసే కావచ్చు రాజకీయాల్లో ఉండే చాలా మంది, "ఈ వెధవ జీవితానికి, క్షణభంగురమైన బతుక్కి మంచిపేరెందుకూ?" అనుకుని అలా పాపాలు చేస్తూంటారు. అంతలో, పక్కన ఒక అర్చన టికెట్లు పెట్టుకున్న ఇద్దరు వాలంటీర్లు పలకరించారు. "అర్చన టికెట్ తీసుకుంటారా?" అని. ఆ టికెట్ కోసమని కార్డు స్వైపు చేసి, టికెట్ తీసుకుని మళ్ళీ క్యూలో నడువబడుతున్నాను. ద్వారం కిందికి వస్తూంటే, గట్టిగా కళ్ళు మూసుకుని అమ్మమ్మ పేరు, పిలుపు తలుచుకోబోతుంటే, పక్కన అమ్మాయి మెల్లిగా తట్టింది. కళ్ళెగరేసాను "ఏంటని". వెనకాలే నన్ను పిలుస్తున్న ఇందాకటి వాలంటీరబ్బాయిని చూపించింది. "మేడం, మీ పేరు రాయాలి, పేరేంటి?!" అచ్చ తెలుగులో అడిగాడు. నడుస్తూనే నా పేరు చెప్పాను. ముందుకు తిరిగి చూసాను కదా, సరిగ్గా ద్వారంలో అడుగుపెడుతూనే నా పేరు చెప్పాను. మా అమ్మమ్మ పేరు కదా అనాలి. అందుకే కదా బయల్దేరింది?! డైలాగు మారిపోయిందేంటీ అని, విసుక్కుని, మళ్ళీ క్యూలో కాస్త వెనక్కి వెళ్ళి నిలబడ్డాను. అత్తయ్యగారు తెలిసినావిడ కనబడితే మాట్లాడుతున్నరెలాగూ. ఓ ఇద్దరి వెనక్కి వెళ్ళి మళ్ళీ వద్దామని ఆలోచన!
అనుకుంటాము కానీ, ఉదయాన్నే ప్రయాణం మొదలుపెట్టింది దేనికసలూ? మన చేతిలో ఉందని మిడిసిపోయి మనం వేసుకునే ప్రణాళికలన్నీ, క్షణంలో ఎలా మారిపోతుంటాయో! ద్వారంలోకి అడుగుపెడుతూ అమ్మమ్మ పేరు తలచుకోవాలని పట్టుదలతో ఇంకాస్త వెనక్కి వెళ్ళాను. అంతలోపు జరిగిందిదీ! తెలిసినావిడతో మాట్లాడుతూ నాకు కాస్త ముందుగా నడుస్తున్న అత్తయ్య గారు మధ్యలో ఉన్న మెట్టు చూసుకోకుండా అడుగేసి పడబోయి నిభాయించుకున్నారు. అది చూసి నేను కంగారుగా "అత్తయ్యగారూ, జాగ్రత్త" అంటూ కాస్త ఫాస్టుగా నడిచెళ్ళి పట్టుకున్నాను. తీరా చూస్తే మళ్ళీ ద్వారం దాటేసాను. అనుకుంటాము కానీండి. అరె! ఎంత చిన్న విషయం? ఎంత చిన్న కోరికతో బయల్దేరాను, ఎంత చిన్న పని? పూర్తిగా నా చేతిలో ఉందనుకున్న పని సరిగ్గా ఆ క్షణం వరకల్లా జరుగకుండా పోవటమేంటీ? ఉదయాన్నే ముగ్గుకోసం ముచ్చటపడితే సుద్దముక్కలు నిండుకున్నాయంటే అది ముందు చూసుకోని అలక్ష్యం అవ్వొచ్చు. ఈ విషయంలో అయితే పట్టుదలగానే ఉన్నానే?! ఒకానొక అనుకున్న క్షణంలో అనుకున్న పేరు పలకటమూ అసాధ్యమవటం మనలో వైరాగ్యాన్ని కలిగిస్తుందని ఇప్పుడే అర్థమయ్యింది. మళ్ళీ వెనక్కి వెళ్ళి రావల్సిందే అని పట్టుదలగా వెళ్ళి, నేను చెప్పాలనుకున్న మాట, చెప్పాలనుకున్న చోటే చిద్విలాసంగా చూస్తున్న విష్ణువు చెవిలో వేసేసి ఆసారికి పిలుపు ముచ్చటా తీర్చుకున్నాను. హమ్మయ్య! కొన్ని నిమిషాల పాటు జరిగిన అంతస్సంఘర్షణ ఎట్టకేలకి ముగిసి, మనస్సు తేలికయ్యింది. ఆశే - అంటే కోరికే - కదా సర్వ దుఃఖహేతువు? ఏ కోరిక లేకుండా జీవిస్తూంటే ఏ దిగులూ ఉండదు. ఏ ఘర్షణా ఉండదు. కానీ, ఎటొచ్చీ- ఆశ, కోరిక లేనిదే ప్రయాణమే ఉండదు. ఆశే కదా, ఒక చిన్న కోరికే కదా ఇక్కడికి లాక్కొచ్చింది. లేదంటే, ఇంట్లో ఏవో మినపగారెల బ్రేక్ ఫాస్టు చేస్తూ కూర్చునేదాన్ని కదూ? అదీ, గారెలు తినాలన్న కోరిక ఇంట్లో ఎవరికో ఒకరికి కలిగితేనే! ఆ కోరికే లేకుంటే ఏ ఉప్మానో, కార్న్ ఫ్లేక్సో! అంటే, కాస్త కష్టం, దుఃఖం కలిగించినా కోరిక మంచిదే. అదేదో యాడ్ లో "మరక మంచిదే" అన్నట్టు - కోరిక మంచిదే! అది అత్యాశ అవనంతవరకూ! అర్చన జరుగుతున్నంతసేపూ నాలో ఆ ఆలోచనలు సాగాయి. అమ్మ చెప్పేమాట గుర్తొచ్చింది. ఆలయానికి ఎప్పుడు వెళ్ళినా, నిర్మలంగా ఏదీ కోరుకోకుండా వెళ్ళాలని. దేవుని విగ్రహం ముందు అలా ప్రశాంతంగా నిలుచునే భాగ్యం చాలునని! హారతి, తీర్థం ఇస్తుంటే భక్తిగా తీసుకున్నాను.
ఏ కోరికతోనో కాకుండా, వచ్చేసారి మాత్రం ఎప్పటిలాగా కేవలం దర్శనం కోసం వచ్చి నిన్ను దర్శించుకుంటానని ప్రశాంతమైన మనస్సుతో నమస్కరించి గుడి వెలుపలికి వచ్చాను. ఏ కోరికతోనూ రాకపోవటమూ నా చేతిలో లేదని తెలిసేందుకు ఏమంత ఎక్కువ సమయం పట్టలేదు. అనుకుంటాము కానీ - అదీ అత్యాశే అవ్వొచ్చని అప్పుడే తెలిసింది. బయటకి వచ్చాక చూస్తే హోరున వర్షం. హద్దంటూ లేని హ్యూస్టన్ వర్షం అప్పుడే మొదలయ్యింది. సరిపోయింది. నేనెళ్ళే రోడ్డులో హై వాటర్స్ తో రోడ్డు బ్లాకయ్యే సూచనలున్నాయి. వర్షం మరీ ఉద్ధృతమయ్యేలోపు ఇల్లు చేరాలి అనుకుని ఒక్కసారి ఫోన్లో వెదర్ చానెల్ వారి యాప్ లో అన్నీ సరిచూసుకుని బయల్దేరబోయాను. వెళ్ళేముందు సంశయం. ఎక్కడ చిక్కుకుపోతామో అని!
ఎందుకయినా మంచిదని, మళ్ళీ ఓసారి గుడి లోనికి దర్శనానికెళ్ళాను. క్షేమంగా ఇల్లు చేరితే చాలన్న కోరికను విన్నవించుకునేందుకు! చేరాక కొబ్బరికాయ ఒకటి బోనస్ గా కొడతానని అనుకోబోయి ఆగిపోయాను. అనుకుంటాము కానీ, కొబ్బరికాయ చేతిలో ఉండొద్దూ?!
నేనేమయినా రాజకీయాల్లో ఉన్నానా, తలుచుకుంటే అరక్షణంలో బాంబులూ, ఎక్కడెక్కడి అస్త్రాలూ చేతిలోకి వచ్చిపడేందుకు!
*****