MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
“దీప్తి” ముచ్చట్లు
సరదా గా… కొంచెం జ్ఞానం!
దీప్తి పెండ్యాల
“మరో ఇరవయేళ్ళు. అంతే. అవి గడవనీయు. ఈ సంసారం, పిల్లలు, ఇల్లు, ఊరూ వాడ, వాట్సప్, ఫేస్బుక్... అన్నిటినుండీ పారిపోయి అడవుల్లో కుటీరం వేసుకుని శేషజీవితాన్ని హాయిగా గడిపేస్తాను.” - ప్రశాంతి మాటలు వింటూనే తనవైపోసారి వింతగా చూసాను...!
“అదేలే, అప్పటివరకూ బతికుంటే” - సవరిస్తున్నట్టుగా చెప్పింది.
నేను సర్దుకుని...”ఛ! శుభమా అని పూజ చేసుకుని, వాయనానికి పిలిచి, అవేం మాటలే? నిక్షేపంగా ఉంటావు కానీ, అంత విరక్తీ, విసుగు దేనికటా” ?
“అబ్బో. విసుగా, విసుగున్నరా? అసలూ “అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్” అంటారు చూడు. అది నాకు ఇంట్లో పిల్లలతో కాదు కదా... వంటింట్లో పాత్రలతో కూడా సాధ్యపడట్లేదు. ‘ఋణానుబంధ రూపేణ పశు, పుత్ర, పతి, పాత్ర, వంటిల్లహ’ అంటారు కదా... అలాగే ఉంది" అంటూంటే...
“ఆగాగు, ఏంటదీ? "పతి, పాత్ర, వంటిల్లహ?" అలా ఎవరన్నారు?” నవ్వాపుకుంటూ అడిగాను. ప్రశాంతి కి మొదట్నించీ వంటంటే గండం. వంటింటి ప్రాచ్యంలోకి అడుగెడుతూనే వైరాగ్యం వల్లేయటం అలవాటే. కానీ "“ఋణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ" కి అంత రిథమిక్ గా ఈ గతి పట్టిస్తుంటే నవ్వొచ్చింది.
"ఆ వాక్యానికి, నా జీవితానికీ అతికినట్టుంటేనూ, నేనే అలా ఉంచేసా. అసలూ... ఈ పిల్లలున్నారే, వాళ్ళ జీవితాలు సెటిల్ అవగానే... అదిగో "అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్" సాధన చేసుకోడానికి హాయిగా అడవులకెళ్ళి పోతాను. “ మళ్ళీ అడవులవద్దకే వెళ్ళాయి ప్రశాంతి మాటలు..
మధ్యలో ఆపి, “అమెరికా అడవులా లేక, ఇండియా అడవులా?” ఆసక్తిగా అడిగాను.
“ఆహా! ఎంచక్కా భారతంలోని అడవులకే. నిర్మోహ, నిశ్చల, నిర్వికార స్థితిలో జీవితం జీవించగలిగితే ఎంత బాగుంటుందీ? హాయిగా, ఏ హిమాలయలోకో వెళ్ళగలిగితే ఇంకా బాగుండదూ?” కలల్లో తేలుతున్నట్టుగా అంది.
“అబ్బే. అంత వరకూ అక్కర్లేదు. "మాల్" కెళితే చాలు. నాకక్కడే సిద్ధించింది. నీవన్న నిర్మోహ స్థితి…” -నా మాటలు విని, సీరియస్ గా చూసింది.
నేనే వివరించాను...
“నిజం! నిశ్చల, నిర్మోహ, నిర్వికార వగైరా వగైరా స్థితిని పొందేందుకే అయితే... హిమాలయాల వరకూ ఎందుకూ? వచ్చే నవంబర్ వరకూ ఆగి, బ్లాక్ ఫ్రైడే రోజు లోకల్ లో ఉన్న ‘మాల్’ కి వెళ్ళు. చాలు. వచ్చేస్తుంది. చెప్తున్నాగా, నమ్ము!“
"అదెలా? అంత సింపుల్ గా?" నమ్మలేనట్టుగా అడిగింది.
“బ్లాక్ ఫ్రై డే రోజు ఉదయాన్నే ... ఏదో ఒక మాల్ లో...
డీల్సూ, డిస్కౌంట్లు... సేల్సు, బ్యానర్లు... ఆదాలూ, ఆఫర్లూ… అన్నీ,అన్నిటినీ దాటుకుంటూ... ఎక్కడా చలించకుండా, ఏ ఒక్కటీ కొనకుండా... నిర్వికార భావనతో కేవలం గమనిస్తూ వెళ్ళి మధ్యాహ్నం వరకూ అలా తిరిగి... పాప్ కార్న్ సైతం కొనకుండా బయటకి వచ్చేయ్! చాలు! సిద్ధి సిద్ధించేస్తుంది. నేనలాగే చేసాను. నాకొచ్చేసింది.”
“అమ్మో! ఏ ఒక్కటీ కొనకుండా బయటకి వచ్చావా? కష్టం కదూ? నువ్వు సాధన చేసే ఉంటావు. కనీసం ధ్యానం?” - అపనమ్మకంగా అడిగింది ప్రశాంతి.
“ఉహూ. ఇవేవీ చేయలేదు కానీ, వాలెట్ ఇంట్లో మరిచి వెళ్ళాను!”
"అరెరె. తిరిగి ఇంటికెళ్ళి తెచ్చుకోవాల్సింది. సిద్ధి మరోరోజొచ్చేదేమో. డీల్స్ మరో రోజొస్తాయా?” - ఆరాటంగా అంది. అర నిమిషం క్రితం అన్నీ వదిలి హిమాలయాలకి వెళతానన్న ప్రశాంతి.
నిరసనగా చూసి, లేచి నిల్చున్నాను- "సరే , ఐతే నే వెళుతున్నాను."అంటూ...
ప్రశాంతి నన్ను ఒక్కసారిగా సోఫాలోకి కుదేసి కూర్చోబెట్టి..."తొందరేంటీ? మొదలుపెట్టావుగా, సిద్ధి బోధ! ముగించే వెళ్ళు!" అని ఆర్డరేసింది.
"ఒక్కరోజు డీల్సు వదులుకొమ్మంటే కష్టమనేసావు. ఇక నీకు నేను సిద్ధిబోధ చేయటం కష్టమేమో!"- నిరాశగా అన్నాను.
"అబ్బా! సరేలే. సిద్ధగుండు లా డిస్టర్బ్ చేయకుండా వింటాను... చెప్పు తల్లీ..."
"అలా అన్నావు బావుంది. ఐతే విను." అంటూ సిద్ధయోగిలా గంభీర ముద్రతో మంద్రంగా మొదలుపెట్టాను.
"ఆ రోజు బ్లాక్ ఫ్రైడే.
థ్యాంక్స్ గివింగ్ సెలవులు మొదలవకముందు నుంచీ పోగేసుకున్న కూపన్లు, డీల్సు... అందంగా ఐఫోన్లోని "నోట్స్" లో అమరిపోయి ఉపయుక్తమవటానికి సన్నాహమవుతున్న సుదినం!
గత కొన్నేళ్ళుగా వాడని గిఫ్టుకార్డులు, దుమ్ముదులిపించుకుని ఎట్టకేలకి ఆ 'డీలు ' మాస శుభదినాన వాడబడి విముక్తి చెందేందుకై వాలెట్ లోకి చేరి, వేచియున్న రోజు...
ఆ రోజు...
ఉషోదయాన్నే నేనూ, మా అమ్మాయి ఉత్సాహంగా షాపింగ్ కని మాల్ కి వెళ్ళాము.
వేల కార్లు పట్టే పార్కింగ్ లాట్ పూర్తిగా నిండిపోయి, కార్ పార్కింగ్ కి ఎక్కడా స్థలం దొరకక అటూ, ఇటూ బిత్తరగా తిరుగుతుంటే, ఏ ఎంట్రన్సుకీ మైలుకి తక్కువకానంత దూరంలో ఓ చోట… ఒకావిడ, షాపింగ్ అపుడే ముగిసిందేమో... చేతుల్నిండా సంచులతో కళకళ లాడుతూ, మనోల్లాసాయాసంతో వస్తూ కనబడింది. ఆమె వెంటే వెళ్ళి, ఆమె కారుని వెనక్కి తీసిన వెంటనే, సిటీబస్ లో కర్చీఫేసినంత ఫాస్టుగా కారుని ఆ స్పాట్ లో పడేసి, పార్కింగ్ ప్రహసనం ముగిసిన ఆనందంలో చిక్కటి చలిలో చక్కా మైలు నడిచి మరీ మాలులో దూరాము.
మాలు లో అడుగెడుతూనే, బోల్డందరు మనుషులు!
ఎటు చూసినా మనుషులు, మనుషులు, మనుషులు...
అమ్మాయిలు, అమ్మలు, అమ్మమ్మలు, చంటిపిల్లలు, నాన్నలు, తాతలు, అబ్బాయిలు -- అబ్బబ్బా! మామూలు రోజుల్లో ఫ్లాప్ మూవీ సినిమా టాకీసులోలా జనముండే మాల్ లో ఆ రోజు మాత్రం “స్టార్ హీరో సినిమాకి” అభిమానులు తోలుకువచ్చినంత జనం!
ఎటు చూసినా ఉల్లాసంగా, ఉత్సాహంగా జనం. జనం.
చెప్పొద్దూ, హైదరాబాదులో సుల్తాన్ బజార్ కీ, జనరల్ బజార్ కీ ఒకే రోజు వెళితే కలిగే సంబరం ఉంటుందీ! (ఈ ఒక్కటీ- అమ్మాయిలకి మాత్రమే!) గాజులనీ, బ్యాగులనీ, బొమ్మలనీ... ఏదని కొనటం, ఎక్కడని ఆగటం? అందమైన అయోమయమది. తోడుగా వచ్చిన నాన్న గారో, తమ్ముళ్ళో జనాలని, షాపులవాళ్ళనీ, విసుక్కుంటూ, “ఇక్కడా? ఇక్కడెందుకూ మీ షాపింగ్?”అని గొణుక్కుంటూ, కాలుష్యానికి చికాకు పడుతుంటే, వాళ్ళకి సహానుభూతి చూపిస్తూ బయటకి చిరాకు నటించినా, గంటలకొద్దీ తెమలకుండా, కొండొకచో కావాలనే తెమల్చకుండా... షాపింగ్ చేస్తూండే రోజులున్నాయే! అలాంటి అలనాటి అనుభూతి,ఆ సంబరం కలిగేది అదిగో ఆ బ్లాక్ ఫ్రైడే రోజే. ఆనందం లో నిండుగా మునిగి తేలుతూ... ఒకసారి మాల్ ని ఈ చివర్నుంచీ, ఆ చివరకి చుట్టేసాను. నాతో పాటు మా అమ్మాయీ!
ఆ చివరకి వెళ్ళాక, కావల్సిన షాపులో చొరబడి, ఓ పది సంచులు మూట గట్టి, కౌంటర్ కి వెళ్ళాక గమనించాము! హేండుబాగులో... ఫోనూ, వాలెట్ రెండూ లేవన్న విషయం! అర్ధగంటకు పైగా సర్దిన మా బ్యాగులు మా వైపు చూసి నవ్వుతున్నట్టుగా తోచి, చిరాగ్గా వాటినక్కడే పడేసి, షాపు బయటకి వచ్చాము.
ఇంటికెళ్ళి తిరిగి వచ్చే ఓపికా లేదు. ఏ దేశీ ఫోనో తీసుకుని, ఇంటివాళ్ళని రప్పించాలన్నా... అబ్బే! వాళ్ళొస్తే షాపింగ్ లో ఫన్ ఏముంటుంది? " టూ క్రౌడీ" అని జనాల్ని విసుక్కుంటూ మన సంబరంపై నీళ్ళు చల్లుతారు. పెద్దగా ఆలోచించకుండా సరదాగా తిరుగుదామని నిశ్చయించుకున్నాము.
అలా సిద్ధి సాధన దిశగా తొలి అడుగు పడింది.
ఇక ఆ క్షణం నుంచీ కలిగిన నిర్మోహ స్థితి... ఆహా! అనుభవించి తీరాల్సిందే ఆ 'మాలు ' వైరాగ్యం!
డీల్సు పై, సేల్సుపై మోహాన్ని త్యజించిన ఆ క్షణం - అంతవరకూ పెద్ద పెద్ద బ్యానర్లూ, వాటిపై తాటికాయ సైజుల్లో 80% తగ్గింపు అని రాసిన అక్షరాలే కనబడ్డ కళ్ళకి, కిందెకడో చీమతలకాయ సైజులో "On Selected Merchandise” అన్న షరతులు కనబడటం ఆరంభిస్తాయి. “ఏ బ్యానర్ మీదయినా చిన్ని చుక్కలుంటాయి. చూడకపోయామో? చుక్కలు చూపించేవవే!” అని తెలిసిపోతూంటుంది. మబ్బులు వీడుతుంటే, కృతజ్ఞతా దినమంటూ మనలాంటి సామాన్యులకి పెడుతున్నవి కిరీటాలు కాదు, టోపీ లని అర్థమవుతాయి. వ్యాపార మర్మాలు, మతలబులూ అర్థమవుతున్నట్టే ఉంటాయి జ్ఞానం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. మనం మాత్రమే ఆ మాయాజాలాన్ని తప్పించుకున్న జ్ఞానులుగా, ఆ షాపుల్లో హడావిడిగా తిరుగుతున్నవాళ్ళంతా పిచ్చివాళ్ళుగా కనబడటం మొదలవుతుంది. ప్రతీ షాపులో క్యాష్ కౌంటర్ల ముందు అంత బారు లైన్లలో నిలబడ్డ వారి ఆత్రాన్ని, ఆరాటాన్ని చూస్తూంటే నిశ్చల మనసు చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది.
అంతవరకూ కళకళలాడుతూ, ఉల్లాసంగా తిరుగుతున్నట్టుగా కనిపించిన వాళ్ళంతా ఆవురావురుమంటూ ప్రేతాత్మల్లా తిరుగుతున్నట్టుగా అనిపించటం మొదలై నవ్వొస్తూ ఉంటుంది. అంతకు అర్ధగంట ముందు వరకు నువ్వూ ఆ ప్రేతాత్మల్లో భాగమే అని "బ్లాక్ అండ్ వైటు సినిమా ఇన్స్పైర్డ్ అంతరాత్మ" గుర్తుచేసి మరీ ఉలిక్కిపడేలా చేస్తుంది. డోంట్ కేర్! బెటర్ ద్యాన్ నెవర్! ఎపుడొచ్చిందన్నది కాదు. జ్ఞానం వచ్చిందా లేదా అన్నదే మ్యాటర్. ఆ మాటే గట్టిగా చెప్తే చాలు, కిమ్మనకుండా, బుద్ధిగా సర్దుకుంటుంది.
అలా, అలా-అనవసరపు ఆరాటాలన్నీ వదిలి మనసు నిశ్చల స్థితికి చేరుతుంది. అంతే. అదే సిద్ధి!" చెప్పటం ముగించి ప్రశాంతి వైపు చూశాను.
కాస్త సీరియస్ గానే చెప్పినట్టున్నాను. ప్రశాంతి లీనమై అంతా విన్నట్టుంది. శ్రద్ధగా!
"అంతే అంటావయితే. మొత్తానికి జ్ఞానం సంపాదించి నాకూ ప్రసాదించావు. థ్యాంక్సు చెబితే సరిపోదు కానీ, చిక్కని టీ పెడతాను ఆగు. జ్ఞానులకి ఎంతో కొంత సేవ చేసుకుంటే పుణ్యమట. " సరదాగా అంటూ స్టవ్ పై టీ పెట్టివచ్చింది.
"ఏంటీ? జ్ఞానినా? ఇంకా నయం. ఎవరూ వినలేదు. జ్ఞానం రాగానే ప్రతీ ఒక్కరూ జ్ఞానులైపోరు." సరిచేసాను.
"మరి? జ్ఞానులంటే?" -ప్రశాంతి. అమాయకంగా.
"జ్ఞానులంటే- మరికొందరు జ్ఞానులు కలిసి గుర్తించిన వారు."- నేను. శాంతంగా.
“మరి ఆ మరికొందరు జ్ఞానులు? జ్ఞానమున్నవారేగా?”- ప్రశాంతి. సందేహంగా.
"మళ్ళీ? ఉహూ. జ్ఞానానికి, జ్ఞానికీ ముడిపెట్టకూడదు. ఆ మరికొందరు జ్ఞానులు కూడా ఇంకొందరు జ్ఞానులు కలిసి సర్టిఫై చేసినవారే" -నేను. నిర్భావంగా!
"అబ్బా. కన్ఫ్యూజ్ చేయకు నన్ను. నేనంత జ్ఞానిని కాదు. ఈ తలతిక్క మాటలర్థమయేందుకు." -ప్రశాంతి. కించిత్ కోపంగా.
"అదే. నేననేదీ. మనం జ్ఞానులమవలేదింకా! అదో పెద్ద ప్రాసెస్!" -నేను. చిన్నగా నవ్వుతూ!
"ఇదీ మాల్ లో కలిగిన జ్ఞానోదయమేనా?" అనుమానంగా చూస్తూ అడిగింది.
"నీ మొహం. జ్ఞానులెలా కాబడుతారన్నజ్ఞానానికి మాల్ వరకూ ఎందుకు? ఫేస్ బుక్ గ్రూపుల్లోకి తొంగి చూస్తే చాలు. రోజుకి రెండు సార్లు. ఉదయం. సాయంత్రం. కావల్సినంత జ్ఞానం." అనుమాననివృత్తి చేసాననుకుని, ప్రశాంతి మొహంలోకి చూసాను.
ప్రశాంతి మొహంలో జ్ఞాన సముపార్జన తర్వాత కలిగే ప్రశాంతత లేదు సరికదా, కాస్త ఎక్కువగానే భయపడిందేమో, విరక్తితో ఇపుడే అడవుల్లోకి వెళ్ళేలా ఉందని గ్రహించాను. “జ్ఞానం క్యాండిడేట్” కాదని తెలిసీ, మొదలెట్టడం నా తప్పే అన్న జ్ఞానం కలిగింది. తద్వెంటనే, టాపిక్ పూర్తిగా మార్చాను. ఈ మధ్యే జరిగిన – “క్రికెట్ ఆటగాడు- సినీ హీరోయిన్- ఇటలీ పెళ్ళి” పైకి మరల్చాను. ఇట్ వర్క్ డ్! పూర్తిగా కోలుకుంది. మొహంలో కళాకాంతి చేరాయి.
ఈ లోపల ఏదో మాడుతున్న వాసన. చూస్తే, జ్ఞానంలో పడి టీని మరిచామేమో, అంతా అడుగంటింది.
నాకూ ఆలస్యమవుతుండటంతో బయల్దేరతానంటూ లేచాను.
“నేనైనా టీ తాగాల్సిందేగా. “స్టార్ బక్స్” పక్కనే కదా. అలా వెళ్ళి కాస్త కాఫీ తాగి రిఫ్రెష్ అవుదాము పద. “Buy 1, Get 1 Free” ఆఫర్ ఉంది కూడా!" అంది ప్రశాంతి. నా సిద్ధి బోధ ప్రశాంతి మెదడులోకి దూరుతూ, దూరుతూ, ఎక్కడో రాంగ్ టర్న్ తీసుకున్నట్టుంది. వంటిల్లుతో డిటాచ్మెంటు పెంచుకునే ప్రయత్నంలో పడ్డట్టుందపుడే.
స్టార్ బక్సూ, ఆఫరూ అనగానే, ఓ నిరసన నవ్వు నవ్వి, “కాఫీకయితే వెళదాము కానీ, ఆఫర్ కాఫీ పై కాదు మరి!” విషయం చెబుతూ బయటకి దారి తీసాను.
మరే! ఆ ఆఫర్ వేడి, వేడి కాఫీపై వర్తించదు. ఈ వణికించే చలిలో, గడ్డ కట్టేంత చల్లగా నాలుకని సర్రున కోసే పెప్పర్మింట్ లాంటి “చల్లటి పానీయాల” మీదే! అన్న నక్షత్రాల జ్ఞానం నాకు ఎపుడో ప్రసాదించబడింది మరి!
***
Tags Deepthi Pendyala madhuravani telugu magazine Deepthi MuchaTlu madhuravani January 2018