MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
“దీప్తి” ముచ్చట్లు
'కల' కలం
దీప్తి పెండ్యాల
సీతమ్మవారు వ్యాహ్యళికని బయల్దేరుతూ, నందనవనంలా ఉండే ఆ ఊరిలో అందరినీ ఓ సారి చూసెళదామని దారితీసింది.
తీరా చూస్తే ఊహించని దృశ్యం. ఊరంతా అల్లకల్లోలంగా ఉంది.
ఇళ్ళ గోడలపైనంతా రకరకాల రాతలు, బొగ్గుగీతలు, ఒకరి గోడపై మరొకరు విసురుతున్న పిడకలు, కోపాలు, ద్వేషాలు, ఆవేశకాలు... ఏమి జరుగుతుందో అర్థం కాక కలియతిరిగితే అక్కడే ఓ గోడని చూస్తూ వేదనగా నిలుచున్న సుగుణేశు కనబడ్డాడు.
సుగుణేశు ని చూడగానే పుత్రవాత్సల్యం కలిగింది సీతమ్మవారికి. ఎంతటి జ్ఞాననీ? ఎంత చక్కటి ప్రభోధాలు చేసాడనీ? సుగుణేశు వద్దకు వెళుతూంటే, దైవత్వం ఉనికిని పట్టేసాడు సుగుణేశు. చటుక్కున వెనక్కి తిరిగాడు. తనూ దివ్యత్వాన్ని పొందినవాడు మరి. ప్రేమ, కరుణ నిండిన మనిషిలా ఈ భూమిపైనే నడయాడినవాడు. హుందాగా, ఠీవీగా వస్తున్న ఆ తల్లిని చూడగానే పరుగున వెళ్ళి పలకరించాడు.
“తల్లీ, నీవిక్కడ?" ఆశ్చర్యంగా అడిగాడు.
ఆ తల్లి చిరునవ్వుతో అంది- “బిడ్డలని చూసేందుకు రావటానికై ఏ తల్లికైనా అభిజాత్యాలుంటాయా నాయనా? ఇంద తీసుకో. చందనం. ఆంజనేయులు పంపాడు ప్రేమగా. యేళ్ళు గడిచినా మానని ఆ గాయాలకి రాసుకో నాయనా. ఉపశమిస్తాయేమో.”
“రామచంద్రుల వారు పడిన బాధల ముందు నా బాధలు ఏపాటివమ్మా? ఆ తండ్రి ఎన్నో తరాలుగా పరీక్షలకి గురవుతున్నాడు కదమ్మా? రాముడికి తెలీనిదా రావణుడంతటి రాక్షసుడినీ ఆమడ దూరంలో నిలబడేలా నిలువరించిన నీ శక్తిపార్శ్వం ? నిన్ను అడవులకి పంపాడట. నీకైనా తెలియకుండా నిన్ను అడవులలో దింపుమని లక్ష్మణుడికి చెప్పాడట. తెలిసీ, తెలియని వారి నిందలు మోస్తూనే ఉన్నాడు కదమ్మా? ఇదంతా అర్ధ సత్యమని తెలుపవేమి తల్లీ? ఎవరికీ చెప్పవేమమ్మా? ఏనాడూ నీకిష్టం లేని పని నీవు చేయలేదని? సమ్మతమవనిదేనాడూ నీవు చేయలేదని? అడవులకెపుడెళ్ళినా అది సీత నిర్ణయమేననీ? ఆ కాలానుసారంగా జరిగినవన్నీ ఆనాటి సమాజ నియమాలని అనుసరించి జరిగినవనీ సరిగ్గా ఎరుగక, సాక్షాత్ రామరాజ్యాన్ని, స్త్రీలని చులకన చూసిన పురుషాహంకార రాజ్యమంటారేమమ్మా? మీరిరువురూ ఉలకరేమి తల్లీ? అసలు రామచంద్ర స్వామి అడవులకేగిననాడయినా - తండ్రిమాట కోసం వెళ్ళాడన్నారు. కాదు, తల్లికి తండ్రి ఇచ్చిన మాట కోసం ఎవరు వారించినా వినకుండా అడవులకెళ్ళాడు. ఆనాడు గౌరవించింది మాతృ స్థానం లో ఉన్న స్త్రీమాటకే. ఆతడా పురుషహంభావి?
పురుషహంకారే అయితే- “ఆడవారి మాటకేం? ఆడవారికిచ్చిన మాటకేం?” అంటూ ఒక్కమాటలో తేల్చేసి సింహాసనం పై కూర్చునే వాడే కదా?”
సీతమ్మ వారు చిన్నగా నవ్వి- “ నీవే చెబుతున్నావు కదా ? తెలిసీ తెలియనివారని. తెలుసుకుంటారులే. ఓ శతాబ్దంలోనే మానవ సమాజం ఇన్ని మార్పులు చవి చూస్తుందే?! మా కథ ఎన్ని వేల సంవత్సరాలక్రితం మాటనీ? కాలానుసారం కొన్ని సమాజనియమాలు మారడం సహజం. ఎన్ని మారినా ఎన్నటికీ మారనివే సత్యం, ధర్మం. ఆ ధర్మాన్ని అర్థం చేసుకుని ఆకళింపు చేసుకున్నవారి మదిలో ఏ సందేహాలూ ఉండజాలవు. అత్యంత పురాతనమైనదయినప్పటికీ ఈ రామ కథ అమేయంగా ఉందంటే ఆ ధర్మాన్ని గ్రహించిన అలాంటి జ్ఞానులైన గురుపరంపర వల్లే కదా. నీలాంటి ప్రేమమయులు గ్రహించగలిగిన సత్యప్రభావం వలనేగా?
ఇక పురుషాహంకారమా ? శ్రీరాముడికా? అసలు శ్రీరాముడెక్కడివాడు? “కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః" అమ్మవారి చేతి నఖముల( గోర్ల) నుండే విష్ణు మూర్తి యొక్క 10 అవతారాలు వచ్చాయని కదా శాస్త్ర ప్రమాణము? సాక్షాత్ శివుడే భండకాసురుని సంహారం నిమిత్తమై అమ్మవారి ఆవిర్భావం కొరకు యజ్ఞం చేసాడనీ, ఆ యజ్ఞ ప్రభావాన అగ్నిహోమం నుంచి జనించి, ఆ పరాశక్తి రాక్షస మూకల సంహారం గావించింది అని కదా పురాణాలు చెప్పాయి. ఎక్కడుంది పురుషాహంకారం? స్త్రీ శక్తిని సమున్నతంగా చూపిన ధర్మమిది. యత్ర నార్యంతు పూజ్యతే, తత్ర రమంతే దేవతా” అంటూ ప్రభోధించినదీ ఆ పురాణాలే. స్త్రీశక్తిని తక్కువ చేసింది హిందూ ధర్మం అని చెప్పటం అవగాహన లేని మాటలేగా, మరిక బాధ ఏల, సుగుణేశా?”
**
బజ్...బజ్..బజ్ జ్ జ్ జ్
చెవుల్లో అలారం ఆగకుండా మోగింది.
వెంటనే మెలకువ వచ్చింది.
దివ్యమూర్తులని కలలో గాంచిన ఆనందాన్ని మెలకువలోనూ అనుభూతించేలోపే పక్కనున్న గడియారం సమయాన్ని చూపింది. ఉదయం 6 గంటలు. అమ్మో వారాంతం కూడా కాదు, ఐదు వరకల్లా లేవలేదంటే, ఎనిమిదింటిలోగా పనులన్నీ ముగించుకుని, ఏదోటి చేసి లంచు బాక్సులు, వాటర్ బాటిల్సు సర్ది పిల్లలని పంపి తాము బయటపడాలంటే ఓ సర్కస్ చేయాల్సిందే. ఐదింటికి అలారం మోగకుండా పోయిందేమిటని కంగారుగా లేచాను.
నిద్రమత్తు వదిలించుకుని, హాల్లోకి వస్తుంటే "చిదగ్ని కుండ సంభూతా, దేవ కార్య సముద్యతా..." లలితా సహస్రనామం వినిపిస్తుంది. వంటింట్లో నుంచి వస్తున్న కుక్కర్ విజిల్స్ తో మిళితమై! భక్తిగా ఆ పరాశక్తికి ఒక్క క్షణం నమస్కరించుకున్నాను.
రాత్రి రెండింటి వరకూ పెండింగ్ వర్క్ చేసుకోవటంతో సింకులో గిన్నెలు తోమటమవలేదని గుర్తొచ్చి, గబగబా రోజూవారి పనులు మొదలుపెట్టిన నా చేతికి టీకప్పు అందించింది ఓ హస్తం... కప్పుతో వంటింట్లోకి వెళ్ళిన నా ఎదురుగా తళతళా మెరుస్తున్న ఖాళీ సింకు, ఆ పక్కనే ఓ స్టవ్ పై మధ్యాహ్నానానికని చపాతీలని కాలుస్తూ, మధ్య మధ్యలో పక్కనున్న స్టవ్ పై పిల్లలకని పాస్తాని కలియతిప్పుతున్నఇందాకటి హస్తం- అది ఇంట్లో పురుషుని హస్తం.
అవటానికి ఈ దృశ్యం చిన్నదే కావచ్చు.
కానీ, ఒక శతాబ్ధం ముందు, కనీసం మూడు దశాబ్ధాల ముందు వరకూ కనబడనిదీ దృశ్యం. అప్పుడు ఓ స్త్రీ కలలోనైనా ఊహించలేనిదయి ఉండాలి ఈ దృశ్యం. ఈ దృశ్యం ఎందరికో ఓ కల. ఓటుహక్కయినా లేని స్త్రీ జాతి నేడు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నదంటే, ఆ వెనుక జరిగినవెన్ని పోరాటాలో? ఆ పోరాటాలన్నీ మొదలయినది ఇలాంటి అతి సాధారణ కల దగ్గరే. వంటింటి కల దగ్గరే.
ఆ కల నాకు ఇపుడిపుడే సాకారమవుతున్నట్టుంది. నాకు మల్లేనే ఓ లూసీ కీ, ఓ ఫరీదాకీ ఈ కల సాకారమవుతున్న దశకి చేరి ఉండవచ్చు. స్త్రీ వివక్షని గమనించి, స్త్రీ వాదాన్ని వినిపించి, అప్పటివరకూ పేరుకుని ఉన్న భావజాలాన్ని ఖండించి, ధిక్కరించి ప్రశ్నించిన గళాల వల్ల!!
ఆ ప్రశ్నించిన గళం ఒక తులసిదీ, ఒక మేరీదీ, ఒక మలాలాదీ కావచ్చు. ఆ గళాలన్నిటికీ వందనాలు. ఈ రోజు నేను స్త్రీ సాధికరతకి అర్థం మెల్లిగా నేర్చుకుంటున్నాను.
శతాబ్ధం గడిచినప్పటికీ ఇప్పటికీ ఇంకా ఈ కల ఎందరికో తీరనిదయి ఉండవచ్చు. ఇప్పటికీ ఈ దృశ్యం కలగానే మిగిలిపోయుండవచ్చు. కార్టూన్లకే పరిమితమయి అవహేళనలు అందుకుంటూ, మారబోతున్న పురుషులని రీకండీషనింగ్ చేస్తూండవచ్చు.
ఆ కల-
పగలంతా కూలీకెళ్లి ఇల్లుచేరాక, తాగిన మత్తులో పురుషుడు బాదుతూంటే, వాతలు తేలిన గాయాలకి నిద్రలేకుండా గడిపిన ఒక జయ, ఒక జూలియా , ఒక అమీన ... ఎవరి కలయినా కావచ్చు.
సమాన చదువులు చదువుతూ, ఉద్యోగాలు చేస్తూన్నప్పటికీ, సమానంగా ఇంటి పనులు పంచుకోనేందుకు నొసలు ముడుస్తున్న పురుషులని భరిస్తూ అలిసిపోతూ ఉన్న ఒక ప్రణీత, ఒక రోజీ, ఓ ఫర్హా... ఎవరి కలయినా కావచ్చు.
మతాలకతీతంగా ఓ సగటు స్త్రీ కనే సామాన్యమైన సమానత్వ కల ఇది. ఏ మార్పయినా మొదలు ఇంటి నుంచి ప్రారంభమవాల్సిన అవశ్యకత గుర్తెరిగిన ఓ మామూలు స్త్రీ కల ఇది.
ప్రపంచంలో అన్నిచోట్లా అనేకరకాలుగా స్త్రీకి ఉన్న కట్టుబాట్లు, నియమాలు, దుర్భేద్యమైన కోటలు బద్దలు కొట్టి, వివక్షని ధిక్కరిస్తూ ప్రశ్నిస్తూ స్త్రీ సాధికారకతకై పోరాటం చేస్తున్న ఎన్నో గళాలకి చప్పట్లు కొడుతున్న తరుణంలో...
స్త్రీవాదం ఒక శక్తిలా రూపుదిద్దుకుంటున్న ఈ కీలక సమయంలో...
ఆ కలకి మతం రంగు పులిమి, మసకబారనిచ్చి, బలహీన పరిస్తే తిరిగి లేచి ఈ శక్తిని పుంజుకొనేందుకు మరో శతాబ్ధమూ పట్టవచ్చు.
అంత సమయం లేదు.
రండి. కలిసి ప్రశ్నిద్దాం. అందరి కలనీ సాకారం చేద్దాం..
*****
A feminist is anyone who recognizes the equality and full humanity of both women and men. -Gloria Steinem.