top of page

సంపుటి 2  సంచిక 2

“దీప్తి” ముచ్చట్లు

అంతరిక్షంలో ఆ రోజు!

Deepthi Pendyala, madhuravani, Deepthi Pendyala madhuravani

దీప్తి పెండ్యాల

40 కాంతి సంవత్సరాల ఆవల, భూలోకానికి అందే సూర్యకాంతికి 200రెట్లు తక్కువ కాంతి ఉన్న లోకాలలో కొన్నిట మరో సృష్టి ఆరంభమవుతున్న వేళ- అనంత విశ్వం లో జరుగుతున్న వింతలు అపుడప్పుడే అర్థం చేసుకుంటున్న మానవుడు దూరాలనుంచీ కొంగొత్త లోకాలని కనిపెట్టి 'అక్కడికి చేరేదెలా' అని బంగారు కలలు కంటూ పరిశోధనలు సాగిస్తున్న వేళ-

***

“డీ!! ఎక్కడున్నావు! త్వరగా వచ్చేయ్!" పెద్దగా ఉత్సాహంతో ఫోన్ లో అరిచిన సహోద్యోగి పీట్ ఆదుర్దా చూసి నవ్వుకున్నాను. "దారిలో ఉన్నాను. వస్తున్నాను" అని సమాధానం చెప్పి కారు వేగం పెంచాను. పీట్ ఒక్కడనే కాదు,  నాసా లో పనిచేస్తున్న మా శాస్త్రవేత్తల బృందాన్ని అంతటినీ కొన్నిరోజులుగా ఒక కొత్త పరిశోధన తాలూకు ఉత్సాహం ఊపేస్తుంది. దాదాపు నాలుగు సంవత్సరాల క్రిందట కొత్త గ్రహాల ఆనవాళ్ళు కనుక్కున్నామని ప్రకటించాక అత్యుత్సాహం చూపిన మీడియా, రెండురోజుల్లో దృష్టి మరల్చేసి రోజూవారీ ఇహలోక సంగతులు, సంఘటనలలో మునిగిపోయింది. తమని మాత్రం ఆనాటి నుంచీ అంతరిక్షలోక వింతలు, విశేషాలు ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. రోజుకో వింతలా ఏదో ఒక కొత్త విషయం. ఆలోచిస్తూండగానే నాసా పరిశోధనా కేంద్రానికి చేరాను. 

నే చేరేసరికి అక్కడంతా హడావిడిగా ఉంది. పారామెడిక్స్ బృందం, ఎమర్జెన్సీ వెహికిల్స్ ని చూసి నేను కంగారుపడుతుంటే అక్కడే ఉన్న షింగ్ చి చెప్పింది – పీట్ స్పృహ తప్పాడనీ, తాము ఎమర్జెన్సీని పిలిచామనీ. ప్రమాదమేమీ లేదని చెప్పి, అబ్జర్వేషన్ లో ఉంచారనీ చెప్పింది. ఏమయి ఉంటుంది? పీట్ కేవలం సహోద్యోగి మాత్రమే కాదు. నేను స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న "విష్ ఎ స్టార్" ఫౌండేషన్ లో ముఖ్య సమన్వయకర్త కూడా. చైల్డ్ ట్రాఫికింగ్ లాంటి మరెన్నో విపరీత విపత్తులనుంచి రక్షించబడిన పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని తిరిగి మామూలు పసిపిల్లలుగా మార్చేవరకూ వారి పూర్తి సంరక్షణని చూసుకునేందుకు, ఈ ఫౌండేషన్ మొదలుపెట్టాను. ఆ చిన్నారులు కోల్పోయిన అందమైన బాల్యాన్ని తిరిగి పొందేలా చేసేందుకు అనువైన వాతావరణం సృష్టించి, పసిమనసులని సేదతీర్చేందుకు ప్రయత్నిస్తారు మా వలంటీర్లు. వీటన్నిటినీ పీట్ ఎంతో చురుగ్గా సమన్వయపరుస్తుంటాడు. ఇక, మా పరిశోధనా కేంద్రంలో మాలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా గుర్తొచ్చేది- పీట్ పేరే. ఎప్పుడయినా, ఎక్కడైనా అదే అంకితభావంతో చలాకీగా నవ్వుతూ పని చేసే పీట్ అంటే మా అందరికీ ఎంతో అభిమానం. అందుకే, పీట్ కి ఏమయ్యిందోనని అందరి ముఖాల్లో స్వల్ప ఆందోళన! అంతటా నిశ్శబ్ధం పరుచుకుంది.

మరో గంట తర్వాత ‘పీట్ క్షేమమే’ అన్న వార్త వచ్చాక, అందరం హాయిగా ఊపిరి పీల్చుకుని పనుల్లో పడ్డాము.

నేనూ, పీట్ కలిసి పరీక్షించాల్సిన కొత్త టెలీస్కోప్ సిద్ధంగా ఉంది. దాని సహాయంతో కీలక పరిశోధనలకి దిగేముందు నాకు తెలీదు -అసాధారణ అద్భుతం  అనుభవంలోకి రానుందని.

**

సూర్యుడిని పోలిన మరో కాంతి నక్షత్రం ‘ట్రాపిస్ట్’ కి దగ్గరలో మా అన్వేషణ సాగుతుంది. జీవిక కోసం చేస్తున్న ఉద్యోగం మాత్రమే కాదిది. ఇదే జీవితం అనుకుంటాము అందరమూ. శరీరం భూమి పై ఉంటుందనే కానీ, హృదయం అంతరిక్షంలోనే తిరుగాడుతుంది, శోధనే శ్వాసగా!

అనంత విశ్వంలో పాలపుంతలని దాటి వెళుతున్న నా చూపులు ఒక్కసారిగా తెల్లని కాంతిలో చిక్కుకుపోయాయి. ఒక తేజోవంతమైన నిలువెత్తు కాంతిపుంజాన్ని గమనించాయవి. దుర్భిణీలని సరిగ్గా అమర్చి ఆ తేజాన్ని, మిరుమిట్లు కొలిపే ఆ కాంతిని అనుసరించబోతున్న నా కళ్ళు ఒక్కసారిగా మసకయ్యాయి.  ఆశ్చర్యపోతున్నంతలో జరిగింది ఓ అద్భుతం. నేను వీక్షిస్తున్న లోకాల్లో నన్ను నేను చూసాను. నేను శూన్యంలో తేలుతున్నాను. కాంతివలయంలో, నేను ఆ కాంతిపుంజం ఎదురుగా తేలుతున్నాను. తేలికగా, ‘భార’ రహిత స్థితిలో ఉన్నానని తెలుస్తుంది కానీ, ‘భావ’ రహిత స్థితిలో మాత్రం ఖచ్చితంగా లేను. అత్యద్భుతమేదో కళ్ళెదురుగా ఉంటే కలిగిన భావ ప్రకంపనలు నన్ను నిలువనీయట్లేదు. నిలువాలన్నా నిలువ నేలా లేదక్కడ. వింతకాంతిని కంటితో చూసిన మరుక్షణంలో నేనక్కడెలా తేలానో అర్థమవని సందిగ్ధమేదీ నన్ను దరిచేరలేదు. ఒక నిర్మల స్థితిలో ఉండిపోయాను.

విశ్వమంతటి శూన్యంలో వేలాడుతున్న నా మనసుని ఏ శూన్యమూ ఆవరించలేదు. కాంతిపుంజాన్ని చూసిన విస్మయం కన్నుల్లో నుంచి మదికంతా చేరింది. కేవలం అనుభూతిస్తున్నానంతే- నేను కలగన్న అంతరిక్షంలోని నా ఉనికిని! 

కలయా, వైష్ణవ మాయయా అని ఆశ్చర్యపడేంతలో- చిన్న నవ్వు- ‘మాయే!’  అన్నట్టుగా!

చకితురాలినై ఆ నిలువెత్తు కాంతిపుంజాన్ని సరిగ్గా చూసాక, సందేహం తీరింది. నిశ్చయంగా తెలిసింది. ఆ ఆకారం నిరాకారుడైన పరమాత్మదేనని.

అప్రయత్నంగా మనసులోనే చేతులు జోడించాను.

**

"నేనెలా ఇలా?" నా ప్రశ్నకి బదులు రాలేదు కానీ, పరమాత్మ ఎటు చూస్తున్నా, ఏది ఆలోచిస్తున్నా చిత్రంగా అంతా నాకు తెలిసిపోతుంది. నిశ్శబ్ధంగా గమనిస్తున్నాను. ఎన్ని వేల క్షణాలు గడిచాయో? చూస్తున్నానంతే. పరమాత్మ తన పని తాను చేస్తున్నాడు. శ్రద్ధగా, దీక్షగా!

అణువణువూ తానే అని రూఢీగా పలికిన పరమాత్ముడి అంతఃదృష్టి భూలోకంపై పడింది.

**

క్రౌంచ ద్వీపే, ఇంద్ర ఖండే, మేరో పార్శ్వ పశ్చిమ దిగ్భాగే, ఉత్తర అమెరికా ఖండే, మిస్సిసిపి మిసోరీ ఇలియా మహా నదియోర్మధ్యే--- మంద్రస్థాయిలో వినిపిస్తున్న సంకల్పం చెవిన పడగా,  దృష్టి అటు తిరిగింది. 

గలగల పారే సెలయేర్లు, హిమపాతాలు, తీర్చిదిద్దినట్టున్న వనాలు- ధర్మం మూడు పాదాలపై నడుస్తున్న చిహ్నంగా, క్రమం తప్పకుండా కురిసే వర్షాల వల్లేమో  అంతటా పచ్చదనమే. లిప్తపాటు గర్వం తొణికిసలాడింది పరమాత్ముడి దరహాసంలో! కొత్త సృష్టి మెల్లిగా చేయవచ్చన్న భావనా కలిగినట్టుంది.

అటుపై, పార్కులో ఒంటరిగా ఆడుకుంటున్న అయిదేళ్ళ బాబుపై పడింది ఆ పరమాత్మ దృష్టి. చుట్టూ పిల్లలే. రంగురంగుల పిల్లలుండాల్సిన చోట రెండు మూడు రంగులకి మించని పిల్లలు. రకరకాల పిల్లలుండాల్సిన చోట రెండో మూడో రకాలు. ఈ అబ్బాయి గోధుమ వర్ణంలో ముద్దొచ్చేలా ఉన్నాడు. చూడబోతే చలాగ్గా ఆడుతున్నట్టుగా, చక్కగా మాటాడుతున్నట్టుగా ఉన్నాడు. ఒంటరిగా ఎందుకున్నాడో? కోరుకున్న ఏకాంతమా? వెలివేసిన ఒంటరితనమా? పిల్లాడి మొహంలో అలుముకున్న నిరాశని చూసిన పరమాత్మలో ఉలికిపాటు. కారణం తెలుసుకునేందుకు, ఒకటొకటిగా నాలుగేళ్ళ పుటలని వెనక్కి తిప్పి చూసాడు. రంగురంగుల పిల్లలు అంతా ఒకటిగా ఆడుతున్న ఆ రోజుల్లో అజ్ఞానం గద్దెనెక్కింది. ప్రశాంతదేశంలో అశాంతి రగిల్చింది ఓ అహంకారం. ఆ అహంకారం వైరస్ కంటే వేగంగా ప్రసరించింది. కర్టసీ చిరునవ్వుల మాటున దాచేసిన జాత్యంకారంకారానికి ఈ అలుసు ఊతమయ్యింది. ఫలితం- ఎక్కడికక్కడ పుట్టుకొచ్చిన అంతరాలు. అంతరాలని సంస్కారం మాటున అణచాల్సిన అవసరం లేదన్న అంతర్లీన సందేశం తలకెక్కిందేమో, జాత్యహంకారం జడలు విప్పుకుంది. అధికారం మాటున అహంకారం వేసిన వేటుకి పిల్లలంతా చెదురుమదురయ్యారు. ఏ రంగు పిల్లలు ఆ రంగు దేశాలకి పయనమవుతే ఎక్కువగా మిగిలింది ఏకైక రంగే. అటూ ఇటు గా మిగిలిన కొన్ని రంగులు అజ్ఞానం సృష్టించిన అంతరాలకి సాక్షీభూతంగా అయోమయంలో పడ్డాయి.

పరమాత్మ హృదిలో కలకలం. కొత్త సృష్టి జరుగుతున్న పంచలోకాలవైపు దృష్టి సారించాడు. ఆ సృష్టీ ఇలాగే అవనుందా? అవనతం చెందనుందా? పరమాత్మ వేగంగా ఆలోచించటం మొదలుపెట్టాడు. నూతన లోకాలు ఇలా అవకూడదు. అవకూడదంటే సృష్టి మొదట్లోనే ఏదయినా చేయగలడు తాను. జీవి పుట్టకముందే తలరాతతో పంపగలడు తాను. కానీ, ఆ జీవి ఆలోచనలని నియంత్రించలేడు. సృష్టీ అంతే. మొదలు పెడుతున్న సమయంలోనే నియమావళి నిర్ధేశించగలడు. ఒకసారి మొదలయ్యిందంటే, సృష్టిలో ఆలోచనాశక్తి గల ఏదో ఒక జాతి ఆ గ్రహాన్ని తన ఆధీనం లోకి తెచ్చుకుంటుంది. భూగోళంలో జరిగిందదే. మనిషికి ఆలోచన ఇచ్చాడు. కానీ, ప్రకృతితో కలిసిపోయి, ప్రకృతిలో మమేకమయి జీవించాల్సిన వాడు  ఇతర జంతువులకు వేరయ్యాడు. చివరికి మనిషికి మరో మనిషీ పలురకాలుగా వేరవుతూనే ఉన్నాడు. ఆలోచనలో పడ్డ  పరమాత్మ ఒక నిర్ణయానికొచ్చాడు. తల పంకించాడు. కొత్త లోకాలలో ఈ పరిస్థితి ఉత్పన్నమవకుండా కొన్ని వరాలీయాలని భావించాడు.

ఆ కొత్త లోకాలకి ఓ వరమిచ్చాడు. ఇక ఏ లోకంలోనూ- “అహంకారానికి అందలం అందద”ని అన్ని కొత్త లోకాలకీ కలిపి శాశ్వత వరమిచ్చాడు.

ఆ వరమందించిన పిమ్మట మది నెమ్మదించిన సమయంలో-

మేరు పర్వతపు దక్షిణ దిగ్భాగానికి దృష్టి మరలింది. వేదాలు పుట్టిన చోటు, దేవతలు సంచరించిన చోటూ అయిన భరతఖండాన్ని ఓమారు చూసుకుందామని అటు వైపు దృష్టి సారించాడు.

బడికి వెళదాము పదమని బతిమాలుతున్న తల్లితో, 'ఉహూ! వెళ్ళనూ అంటూ వచ్చీ రాని మాటలతో మారాం చేస్తున్న ఆ మూడేళ్ళ చిన్నారిని చిరునగవుతో చూసి "నా సృష్టిలో ముగ్ధత్వానికి ఈ పసిపాప అద్దం పడుతుంది"  అనుకుంటూ ఆ పాపని కొద్దిగా పరికించి చూసిన పరమాత్మలో కలవరపాటు!

ఆ పాప నీలి కళ్ళలో కదలాడుతున్నది తల్లి మీద బెంగ కాదు. భయం. కొత్త చోటికి వెళ్ళాలన్న భయం కాదది. మృగాన్ని చూసి బెదిరిన లేడిపిల్ల కళ్ళలో తారాడే భయం అది! కారణం తెలుసుకోవటానికి పాప వెన్నంటే వెళ్ళింది తన చూపు. బడి పరిసరాల్లో కంటపడిన మానవ మృగాన్ని గమనించిన పరమాత్మకి చిన్నపాటి వణుకుతో  గగుర్పాటు కలిగింది.  తరచి చూస్తే అడుగడుగునా, ప్రతీ దశలో తన సృష్టిలో సగభాగమయిన జాతి అకృత్యాల బారిన పడటం గోచరించింది.

"తన సృష్టి లోపభూయిష్టమా?" అన్న సందేహం కలిగించిన క్షణాలు కోకొల్లలయ్యాయి. పరమాత్మ మనసులో కల్లోలాన్ని ఊహించగలిగాను. మెల్లిగా నోరు విప్పాను- "మన వేదభూమి లో ప్రతీ 8నిమిషాలకి ఒక ఆడపిల్ల అపహరణకి గురవుతుంది!"  

అభావంగా తలాడించాడు.

కొత్త లోకాలకి మరో వరమిచ్చాడు- "ఏ అకృత్యానికీ అందక అందం, అమాయక్వం ఆనందంగా సంచరించాలని" 'తథాస్తూ!’  నేను ఆనందంగా, మనసారా కోరుకున్నాను.

మనసు ప్రశాంతమయమై మరోమారు భూలోకం వైపు దృష్టి సారించాడు.

అన్ని ఖండాలనీ కలుపుతూ భౌగోళిక సరిహద్దులు చెరిపేస్తున్న ఓ కొత్త లోకం పరమాత్మ దృష్టిని ఆకర్షించింది. తాను సృష్టించిన మానవులు తమకు తామే సృష్టించుకున్న లోకమది.  స్నేహ సౌరభాలు, సేవాభావాలు, సంగీత సాహిత్యాలు వెల్లివిరుస్తున్నాయక్కడ. సంతోష విషాదాలే కాక సర్వావస్థలని ఒకరికొకరు పంచుకుంటూ సరిహద్దులు చెరిపి ముచ్చటించుకుంటున్న చూసి ఆశ్చర్యపోయాడు!

‘ఆ లోకం పేరు అంతర్జాలం' గర్వంగా చెప్పాను నేను! ఆ అంతర్జాల లోకాన్ని చూసి ముచ్చట పడ్డాడు. విభిన్నతలని మరిచి అనేకానేకులు ఏకమైన వైనం చూసి పరమాత్ముడు కలకాలం అలాగే వర్ధిల్లమని వరమీయబోయాడు. అంతలోనే మరో పార్శ్వం ప్రత్యక్షమయ్యింది. వైరాలు, వైషమ్యాలు, విపరీతాలు ఇక్కడా రాజ్యమేలబోతున్నాయని గమనించాడు. దృష్టి మరల్చబోతున్న పరమాత్మని నేను కంగారుగా చూసాను.

“పరిష్కారమేమీ తోచలేదా? అసలు పరిష్కారమే లేదా?”  మెల్లిగా అడిగాను.

చిరునవ్వు నవ్వాడు పరమాత్మ. "పరిష్కారం లేకేం? సృష్టి మొదలయినపుడే ఇచ్చాను పరిష్కారాన్ని. సమస్యకి పరిష్కారాన్ని ఇచ్చేదీ ఆలోచనే. సమస్యలని సృష్టించేదీ ఆలోచనే. ఆ ఆలోచనని సృష్టి తొలినాడే మానవులకి ఇచ్చాను కదా!" 

'కానీ-' అడగబోయి ఆగిపోయాను.  పరమాత్మ నా ఆలోచన పసిగట్టినట్టుగా తల పంకించాడు. ఆపై- సృష్టి మొదలవబోతున్న కొత్త లోకాల వైపు తిరిగి మరో వరాన్ని ప్రసాదించాడు.

ఆలోచన వివేకాన్ని, వివేచననీ ఏనాటికీ కోల్పోకూడదని! 

ఆ తరువాత, పరమాత్మ ప్రసన్నచిత్తుడై, కాసేపు ధ్యానంలోకి వెళ్ళేందుకు ఉద్యుక్తుడవుతూ ఒక్క క్షణం నావైపు తేరిపారా చూసాడు.

నన్నూ అడిగాడు- వరం కోరుకొమ్మని.

ఆలోచించకుండా అడిగేసాను- కొత్తలోకాలకిచ్చిన వరాలే భూలోకానికీ వర్తించాలని!

సమ్మతమన్నట్టుగా చిన్న చిరునవ్వు.

సంభ్రమంగా చూసాను.

 ఆపై,  కొన్ని క్షణాల పాటు కన్ను  పొడుచుకున్నా కనబడని చీకటి. అంతలోనే అరుణ వర్ణం అర్ణవమయింది. వరాలన్నీ ఇంద్రచాపం లో ఇమిడి వింతైన వెలుగులు నేలంతా పరుచుకున్నాయి!  అంతే!!  ఒక్క క్షణం నేనెక్కడున్నానో అర్థమవలేదు. అప్రయత్నంగా కళ్ళు మూసుకున్నాను. కాసేపట్లోనే చుట్టూ చల్లదనం నిశ్శబ్ధంగా ఆవరించింది.

**

"డీ! ఆర్యూ ఓకే?!!" షింగ్ చి పిలుపుతో కళ్ళు తెరిచాను. చుట్టూ నా సహోద్యోగులు ఆందోళనగా నావైపే చూస్తూ కనబడ్డారు. స్పృహలోంచి ఎప్పుడు బయటకొచ్చాడో కానీ, పీట్ కూడా అక్కడే ఉన్నాడు. ఆతృతగా అడిగాడు- "ఆ టెలీస్కోప్ నుంచి నీవేమైనా చూసావా?!" అని! అతని కళ్ళలో ఒకింత విస్మయం!

అవునన్నట్టుగా తలాడించి, చిన్నగా నవ్వాను! అందరి మొహాల్లోనూ పారదర్శకంగా ప్రతిఫలించింది నా నవ్వు!

 

*****

comments
bottom of page