top of page
bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

“దీప్తి” ముచ్చట్లు

ఆవలిస్తే?   [కథ]

Deepthi Pendyala, madhuravani, Deepthi Pendyala madhuravani

దీప్తి పెండ్యాల

 ఉదయాన్నే పేపర్లో కనబడ్డ "ఆ అబ్బాయి" ఫోటో చూసి ఆశ్చర్యపోయాను. ఆ అబ్బాయిని ఐదు సంవత్సరాల క్రితం ఓ రోజు చూసాను. నేను రిటైరై విశ్రాంతి తీసుకుంటున్నతొలిరోజులలో. గుర్తు పెట్టుకోవాల్సినవాడవునో కాదో అపుడు తెలీలేదు కానీ, గుర్తుండిపోయాడలా.

ఆ రోజు -

 

 ఉక్కగా ఉందేమో అన్నట్టుగా చెమటలు పడుతున్నాయి ఆ అబ్బాయికి. ఆ చల్లని చలువరాయి గదిలో.

ఆ ఎయిర్ కండీషన్డ్ గదిలో, విశాలమైన సోఫా మీద కూర్చుని అతని పెయింటింగ్ వైపే తదేకంగా, తాదాత్మ్యంగా చూస్తూ కూర్చున్న ఆ బర్గండ్రీ రంగు సూటు వేసుకున్న వ్యక్తి నా చిన్ననాటి మిత్రుడు జీవన్. కళల పట్ల జీవన్ కి ఈ అభిరుచి ఎప్పుడు మొదలయిందీ నాకూ తెలీదు. బహుశా ఇబ్బడిముబ్బడిగా సంపాదన పెరిగాక అనుకుంటాను. మా చిన్నపుడు కూడా తను కళలపై ఇంతే ఆసక్తి కలిగిఉన్నట్టు, మా ఆర్టు క్లాసు టీచర్ తనలోని కళాతృష్ణని తరచుగా అభినందించినట్టు,చెప్పీ, చెప్పీ నాకు అస్పష్టమైన ఓ జ్ఞాపకాన్ని గుర్తుచేయబోతాడు కానీ గుర్తుపెట్టుకునేంత ఆకర్షణ ఉన్న అతని కళాభినివేశం ఎప్పుడూ చూసిన గుర్తులేదు నాకు. అవునవును అంటూ తలూపి వదిలేస్తాను.

 

మరోసారి ఆ పెయింటింగ్ తెచ్చిన అబ్బాయి వైపు చూసాను. ఆ అబ్బాయి కళ్ళు జీవన్ స్పందనకై ఎదురుచూస్తున్నాయి. ఆదుర్దా లో ఉన్నాడేమో నుదుటిపై అట్టే ఆనవాలు కనిపించని స్వేదాన్ని మాటిమాటికీ తుడుచుకుంటున్నాడు. జీవన్ స్పందన కాస్తవరకూ ఆ అబ్బాయి భవిష్యత్తు నిర్దేశించబోతుంది.

 

జీవన్ అతి సంపన్నుడు. దయగలవాడుగానూ పేరు తెచ్చుకున్నాడు. ఏదయినా కళలో ప్రవేశం, ప్రావీణ్యం ఉండి, ఆర్థికస్థోమత లేని కాలేజీ పిల్లలకి తాము కోరుకున్న పెద్దచదువులకి ఆర్థిక సహాయం అందజేస్తాడు జీవన్. ఆ పై, వాళ్ళు కోరుకుంటే, అతని ఫార్మా కంపెనీలో ఉద్యోగమూ సులభమే.

 

ప్రతీ వారం అతని హడావిడి జీవితంలో ఒక్క గంటయినా ఈ స్కాలర్షిప్ అర్హత పరిశీలనకై కేటాయిస్తాడు. ఈ పనికై ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేసి రిటైరయ్యాక ఖాళీగా ఉన్న నా సాయం కోరాడు.

 

వేరే పనేమీ లేదు కనుక, ఈ పనేదో నాకూ ఆసక్తిగానే అనిపించింది. కానీ, అర్హత నిర్ణయించే ప్రవేశం నాకు ఏ కళలోనూ లేదు. అదే మాట అన్నాను జీవన్ తో.  చిత్రంగా నవ్వాడు. "నాకు మాత్రం ఉందా? నన్ను కదిలించినవాళ్ళనే పిలుస్తాను. మాట్లాడేటపుడు ఓ గంట నాతో పాటు కూర్చుంటే చాలు." అన్నాడు. అలా అని ఊరుకునుంటే నేనూ ఊరుకుందునేమో. కానీ "ఆవలిస్తే పేగులు లెక్కపెడతావురా నువ్వూ" అనీ అన్నాడు. ఆ మాట తిరుగులేని మంత్రమయింది. మంత్రం వేసినట్టే ఒప్పేసుకున్నాను. 

 

అలా ఆ రోజు ఉదయం ఆ అబ్బాయి పెయింటింగ్ ఆధారంగా అతని స్కాలర్షిప్ నిర్ణయించబోతున్నాడన్నమాట.

 

ఆ పెయింటింగ్ వైపు నేనూ చూసాను. ఏమీ లేదు. చుట్టూ పచ్చిక. పచ్చికలో  ఒక్క పచ్చని చెట్టు. అంతే.  నిండుగా ఉన్న ఆ చెట్టులో ఆకర్షణ, ముఖ్యంగా ఓ జీవకళ ఉంది. అనుమానం లేదు. కాకపోతే ఎందుకు ఇంతసేపుగా పరిశీలిస్తున్నాడో అర్థం కాలేదు.

 

"ఈ పెయింటింగ్ వెనుక కథేమయినా ఉందా?" జీవన్ పెయింటింగ్ పైనించి చూపు మళ్ళించకుండానే అడిగాడు.

 

ఆ అబ్బాయి మొహంలో చిన్న వెలుగు. అతని సమాధానం ఎదుటివారి నిర్ణయాన్ని సానుకూలం చేయగలదనే ఆత్మవిశ్వాసం వల్ల అయుండాలి. "ఉంది సర్. నా చిన్ననాటినుంచీ తాతగారి గది అవతల ఉన్న చెట్టు కథ. తాతగారి కథ."

 

జీవన్ అతని వైపు తిరిగాడు. నేనూ ఆసక్తిగా చూసాను.

 

"నా చిన్ననాట మా తాతగారికి ఏదో మనోవ్యాధి. సరిగ్గా తినేవాడూ కాదు.వైద్యం చేసే డాక్టర్ రోజూ వస్తూ, బలానికి మందులిచ్చేవాడు, మంచిమాటలు చెప్పేవాడు. ఎందుకో కానీ తాతగారు మాత్రం గది బయట గోడవారగా ఉన్న చెట్టునే చూస్తూ దిగాలుగా ఉండేవాడు. మేమంతా తాతగారిని మాటల్లో పెట్టి తెలుసుకున్నదేమంటే, ఓ మిత్రుడు ఆ చెట్టు చూపిస్తూ "ఆ చెట్టుపై ఆకులున్నంతవరకూ నీ ఆయుష్షు" అన్నాడట తాతగారితో. అతను ఊహించినవి నిజమవుతాయని ఊర్లో నమ్మకమట. ఆ మాట విన్నాక, తాతగారు రోజూ కొత్తగా ఆ చెట్టునే గమనించటం మొదలుపెట్టాడు. అంతవరకూ రాలిన ఆకులని చూసే సమయమూ లేని చెట్టంత మనిషి, అలా చెట్టుని కొత్తగా గమనించటం మొదలుపెట్టాక, చెట్టుపై ఉన్న ఆకులు కాక, రాలుతున్నవే చూసి దిగులు పడటం మొదలయిందట. అదిగో అలా దిగులుతో మంచాన పడ్డాడట."

చెబుతూ ఆగాడు ఆ అబ్బాయి. విచారవీచికలు అతని మోముపై.

 

నాకూ తెలిసిన కథలా అనిపించడంతో కుతూహలంగా అడిగాను.  “ఆ తరువాత?”

 

లిప్తకాలం పాటు నన్నే చూశాడు ఆ అబ్బాయి.  తిరిగి చెప్పటం కొనసాగించాడు.

"ఆకురాలే కాలంలోనూ పచ్చగా ఉన్న ఆ చెట్టు, ఓ నాటి శీతాకాలపు శీతవేళ వీచిన ఈదురుగాలికి పూర్తిగా దెబ్బతిన్నది. ఆ రోజు మా నాన్న తాతగారి గదిలో కిటికీ మూసి, నన్ను పిలిచి ఓ పని అప్పజెప్పాడు. దాని ప్రకారం నేను రాత్రంతా కూర్చుని చెట్టుకి ఆనుకుని ఉన్న గోడపై ఓ కొమ్మనీ, దానికి రెండు జంట ఆకులనీ గీసాను. ఇంకా రెండు ఆకులు ఆ చెట్టుకి ఉన్నట్టే భ్రమ కలిగించేలాగన్నమాట. నాన్న చెప్పినట్టే చేసాను. తాతగారు కిటికీనుంచి చూస్తే ఆ జంట ఆకులు చెట్టువే అన్నట్టుగా సజీవశాఖ చిత్రాన్ని గీసాను. తాతగారు ఎన్నిరోజులు ఎదురుచూసినప్పటికీ, ఆ రెండు ఆకులు మాత్రం రాలకుండా ఉండటంతో ఆయనకి మెల్లిగా తన ఆయుష్షు గట్టిదన్న నమ్మకం మొదలయింది. ఆ పై చెట్టు చివుర్లు వేస్తూనే, తాతగారిలో కూడా జీవితేచ్ఛ చిగుర్లు తొడిగింది. దాంతో, నాలోనూ నా సృజనపై నమ్మకమూ కలిగింది, చిత్రకళపై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత ఆరోగ్యం పెరిగి, మామూలయ్యాక తాతగారికి ఆ జంట ఆకుల కొమ్మ బొమ్మ విషయం తెలిసి, ఇపుడు మీరు చూస్తున్న ఈ పచ్చని చెట్టు బొమ్మ నాతో వేయించుకున్నారు. ఆయన గదిలోదే ఇది." చెప్పటం ముగించి మా వైపు చూశాడు ఆ అబ్బాయి.

 

నేను పట్టేసాను. "ఓ.హెన్రీ కథ కదా ఇది?" ఆగలేక అడిగాను.

 

జీవన్ నవ్వి అందించాడు. "ద లాస్ట్ లీఫ్?"

 

ఆ అబ్బాయి తొణకలేదు. "ఆ ఆంగ్ల కథ సంగతి తెలీదు సర్ నాకు. ఇది మా ఇంట్లో జరిగిన కథే!"

 

నేను నమ్మలేదు. అపనమ్మకంగా చూసాను. ఆ మాట పైకే అన్నాను."నమ్మలేకపోతున్నాను. నిజమా?"

 

ఆ అబ్బాయి అంతే కచ్చితంగా జవాబు చెప్పాడు - "నిజం సర్. కావాలంటే మా తాతగారితో మాట్లాడి కనుక్కోవచ్చు మీరు."

 

ఆ మాటతో తిరిగి ఏమనటానికీ లేకపోయింది. ఆ సందిగ్ధంలో నేను ఉండగానే, జీవన్ ఆ విషయం నుంచి మళ్ళించి, వేరే ఏవో ప్రశ్నలు అడిగాడు, ఆ అబ్బాయి చక్కని సమాధానాలు ఇచ్చాడు. కాంటాక్టు వివరాలు ముందుగదిలో ఇచ్చి పొమ్మని చెప్పి, నిర్ణయం త్వరలో చెబుతామని చెప్పి పంపించాడు. ఆ అబ్బాయి మా ఇద్దరికీ వినయంగా నమస్కరించి వెళ్ళాడు.

 

"అతి వినయం ధూర్త లక్షణం" గొణుక్కున్నాను పైకే.

నవ్వాడు జీవన్ గట్టిగా.

 

నాకెందుకో కాకతాళీయమయినా అంత అతికినట్టు సంఘటనలు జరుగుతాయని నమ్మకం కలుగలేదు. అదే అన్నాను జీవన్ తో.

జీవన్ నన్ను ఖండించలేదు.  “మన ఎంపికకి అతనిలో ఉన్న చిత్ర కళే కానీ, అతను చెప్పిన కథ ప్రాతిపదిక కాదుగా. ఏమి చేద్దామంటావు?" అడిగాడు నన్నే.

ఏమీ చెప్పలేకపోయాను. ఆ అబ్బాయి వెళుతూ వెళుతూ నన్నే చూస్తూ వెళ్ళటం గుర్తొచ్చింది. కళ్ళలో అర్థింపు ఏదో కనీ, కనబడకుండా దాగింది. ఎంత అవసరమో అతనికి ఈ అవకాశం. కానీ ఇది ప్లేజరిజం. కథాచౌర్యం. మరీ అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించటం తప్పు కదూ? ఏమిటీ సంకటం?

"ఏమో. నా మటుకు నేను కళతో పాటూ గుణమూ ముఖ్యమనుకుంటాను. నిజాయితీ లేకుంటేనో? నీకు ఆ అబ్బాయిపై నమ్మకం కలిగినట్టయితే, అది నీ ఇష్టం." జీవన్ కి నా బాధ్యతగా చెప్పాల్సింది చెప్పాను.

జీవన్ ఏదో తట్టినట్టుగా అన్నాడు. "ఒకవేళ అతను చెప్పింది అబద్ధమయినా, నువు అడిగినపుడు కనీసం తొణకనైనా లేదు. అంత గొప్పగా నటించగలడంటావా?"

 

"అబద్ధం చెప్పటం అలవాటేమో?" చటుక్కున అనేసాను.

 

జీవన్ తలపంకించాడు. ఆ పై మా ఇద్దరి మధ్యా ఆ అబ్బాయి ప్రసక్తి రానేలేదు.

 

***

ఇదుగో ఇన్నేళ్ళ తరువాత ఇలా పేపర్ లో వార్తతో ఆ అబ్బాయి పునర్దర్శనం.

కళ్ళద్దాలు సరిచేసుకుని, ఆ వార్త చదివాను. ఆ అబ్బాయి డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడట. నమ్మలేకపోయాను. మరీ ఇంతగా ఊహించలేదు. ఈ డ్రగ్ డీలర్లందరూ ముద్దుగా "బిగ్ భాయ్" అని పిలుచుకునే అసలు సూత్రధారి ఆచూకీ మాత్రం పట్టలేకపోయారట. వాడినెక్కడ పట్టగలరూ? ఎక్కడికక్కడ  లంచాలిస్తూ  ఈ డ్రగ్స్ వ్యాపారాన్ని హాయిగా సాగించేస్తున్నట్టున్నాడు. యేళ్ళుగా వెతుకుతూనే ఉన్నారు. అసలు నేను పోలీసుల్లో ఉండుంటే ఈ పాటికి పట్టుకునుండేవాణ్ణి కాదూ? వ్యవస్థని విసుక్కున్నాను.

పేపర్ లో ఆ అబ్బాయి గురించి చదివాక జీవన్ తో ఆ విషయం పంచుకోవాలనిపించింది. జీవన్ కి ఫోన్ చేసాను ఈ విషయం చెప్పేందుకు. ఆ అబ్బాయి గుణాన్ని లెక్కకట్టటంలో నా అంచనా తప్పు కాలేదని జీవన్ కి చెప్పాలనీ కావచ్చు నా ఆతృత. జీవన్ ఫోన్ తీయలేదు. ఏదో పని హడావిడిలో ఉండుంటాడని ఊరుకున్నాను. ఆలోచనల నుంచి బయటపడటానికి టీ.వీ రిమోట్ అందుకున్నాను.

టీవీలో ఫ్లాష్ న్యూస్. ఎపుడూ ఉండేవే ఈ అరుపులూ అంటూ విసుక్కుని, ఛానల్ మార్చాను.

అక్కడా ఆ అబ్బాయి గురించిన వార్తలే. డ్రగ్ మార్కెట్ ని విస్తృతపరిచిన "బిగ్ భాయ్" గురించి వివరాలు అందించి, అప్రూవర్ గా మారాడట. కొన్నేళ్ళుగా చిక్కకుండా, దొరకకుండా తిరుగుతున్న ఆ బిగ్ భాయ్ ఎవరో చూడాలని ఉత్సుకత మరిక ఛానల్ మార్చనీయలేదు. అది ఎవరో తెలిసాక నాకు కలిగిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు.  

ఆ బిగ్ భాయ్ ఎవరో కాదు. "జీవన్"ట. జీవన్ ఫోటో మార్చి మార్చి చూపిస్తూ, జీవన్ ఇంటి మీదకే టీ.వీ. కెమెరాలన్నీ ఎక్కుపెట్టి ఉంచారు. అంతా చూసి హతాశుడినయ్యాను. 

ఫ్లాష్ న్యూసులు చెప్పేటపుడు వార్తాహరుల మొహంలో ఉత్సాహం అనుపమానం. అసమానం. ఆ ఉత్సాహంలో చిలవలు పలువలుగా చెప్పిన ప్రకారం ఆ అబ్బాయి ఐదేళ్ళ క్రితం చదువుకుంటూ, అతను చదివే కాలేజీలోనూ, పెయింటింగ్స్ అమ్మే ఆర్ట్ ఎగ్జిబిషన్లలోనూ క్లయంట్లని సాధించి డ్రగ్స్ అమ్మేవాడట. అప్రమేయంగా ఆ కూపంలో పడ్డాడే కానీ, ఏనాడూ డ్రగ్స్ ని రుచి కూడా చూడలేదట. ఆ తర్వాత చదువయిపోతూనే, ఉద్యోగంలో చేరి, ఇవి తనకి సప్లయి చేసిన బిగ్ భాయ్ ఎవరన్న కుతూహలంతో రహస్యంగా రీసెర్చు చేసాడట. సంపన్నుల సర్కిల్స్ లోని ఆర్టు ఎగ్జిబిషన్లో తన పెయింటింగ్స్ ప్రదర్శించి అమ్మే గొప్ప అవకాశాలు రావటం, ఆ ఆర్టు ఎగ్జిబిషన్లలోనే సప్లయర్లు కలవటం,  క్లయంట్లూ అతిసులభంగా లభిస్తూండటం అలా అతని ఆరంభం నుంచీ సంఘటనలకి లంకె కలుపుతూ వెళుతూంటే చివరికి వెళ్ళి సూత్రం జీవన్ వద్దే ఆగిందట. ఆ దశలోనే పట్టుబడటమూ, అప్రూవర్ పేరుతో పోలీసులకి సహకరించటమూ చకచకా జరిగాయట. దాని ఫలితమే జీవన్ పట్టుబడటం.  అంతా చూస్తూ, నా మెదడు మొద్దుబారింది. ఆ సుప్తావస్థలోనూ గత కొన్నేళ్ళుగా జరిగిన ఇంటర్వ్యూలలో నేను గుణం అంచనావేసి తిరస్కరించిన మరికొందరు అర్భకులని గుర్తు తెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తోంది నా మొద్దు మెదడు.  సారీ. మొద్దుబారిన మెదడు.

నా పక్కనే ఉండి, అంతా చూసి బీరుపోయిన మా ఆవిడ ఒకింత వ్యంగ్యంగా అడుగుతోంది నన్ను - "చిన్ననాటినుంచీ జీవన్ మీ ముందెపుడూ ఆవలించలేదా?" అని.

 

*****

bottom of page