MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
“దీప్తి” ముచ్చట్లు
అంతే కదా మరి !
దీప్తి పెండ్యాల
"డబుల్ ఎక్సెల్ సైజులో లేనట్టున్నాయే, పెన్సిల్ స్కర్ట్స్?! "
"అంతేనంటావా? మరెలా? ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చే టైమూ లేదు! "
టెంగ్లీషు మాటలు!
చటుక్కున తలెత్తి, ట్రై చేస్తున్న పాయింటెడ్ హీల్స్ ని పాదాలకి అలాగే ఉంచేసి, ఓ గెంతు గెంతి మరీ ఆ వైపు గా చూసాను. ఎవరా అని ఆసక్తితో.
ఈ 'మేసీస్' స్టోరులో టెంగ్లీషు మాటలు నాకలవాటే. కాకపోతే, తెలిసిన గొంతుల్లా అనిపించేవరకూ ఆరాటం ఆగలేదంతే. ఎటొచ్చీ, అపుడే నా పాదాలని అలంకరించిన హైహీల్స్ కి ఆ ఆరాటం వంటివి బొత్తిగా అర్థమవమనుకుంటా. పాపం, నా వేగానికి తడబడ్డాయి. తడబడితే తంటా లేదు. తడబడి, నాకు అడ్డంపడి నన్ను అడ్డంగా పడేసాయి. 'పడితే పడ్డాను, దెబ్బలు ఇంటికెళ్ళాక చూసుకోవచ్చు, ఎవరూ అయితే చూళ్ళేదు కదా!' అనుకుంటూ హడావిడిగా లేస్తూంటే కనబడ్డాయి- వడివడిగా నాకేసే వస్తున్ననాలుగు జీన్సుకాళ్ళు! కచ్చితంగా దేశీ కాళ్ళే! అందులో రెండు- బ్లూ డెనిం. రెండు- బ్లాక్ కాప్రి. అల్..లా పైకి చూస్తే, ఇద్దరు అచ్చ తెలుగు అమ్మాయిలు. ఆశ్చర్యంగా, ఒకింత ఆందోళనగా నన్నే చూస్తూ!
"హే! నువ్వా, ప్రవీణా?" ఇద్దరూ ఒక్కసారిగా అరిచారు. ఆ అరుపుకి అవతలివైపున్న ఓ ఆరు జతల కళ్ళు చూసీ చూడనట్టు ఓ చూపేసాయి, మా వైపు.
సర్దుకుని, చెరో వైపు చేయందిస్తూ - "అరె! మీరేనా! ఇదిగో మీ గొంతులు వినే, ఇలా ధభీమని పడ్డాను!" రెండు చేతులూ అప్పూకి, శృతికి చెరొకటిగా ఇచ్చి, లేపబడి నిల్చున్నాను.
నేను నిలబడ్డాక, నా హైహీల్సువైపుగా చూసి, కళ్ళెగరేసింది శృతి.
అప్పూ చేతుల్లో లైట్ గ్రే కలర్ బిజినెట్ సూట్ చూపిస్తూ నవ్వాను. "అందుకే!"
ఏంటీ? నువ్వూ ఉన్నావా ఆ వాట్సప్ గ్రూపులో? చూడనే లేదు? -శృతి.
"నాకూ మీరున్నారని ఇప్పుడే తెలిసింది. ఇద్దరి చేతుల్లో ఆ లైట్ గ్రే కలర్ సూటూ, అప్పూ జుట్టుకి ఆష్ కలర్ హైలైట్స్ చెప్పాయి!" నవ్వుతూ చెప్పాను.
అప్పూ తమాషాగా నవ్వింది. అదలా నవ్వగానే, ఆష్ కలర్ ముంగురులూ అలల్లా కదిలాయి. మరే. ‘చక్కటి తలకట్టున్నమ్మ ఏ కొప్పేసినా అందమే’ అనేది పాత సామెత. ఏ షేడ్ వేసినా నప్పటం ఇప్పటిమాట.
శృతి మాత్రం "ఏంటో! వాట్సప్ గ్రూప్ లో పడేశారు, బావుంది. 'విమెన్ ఎంపవర్మెంట్' అన్నారు. మరీ బావుంది. ఈ ఆదివారమే సెమినార్ అన్నారు. భలే భేషుగ్గా వుంది. ఇంట్లో పడున్న ఫార్మల్స్ వేసుకోనీకుండా, ఈ కలర్ కోడ్ ఎందుకో! మహా విసుగ్గా ఉంది. పొద్దున్నించీ తిరగలేక చచ్చామనుకో. అయినా, ఒకరిద్దరా! దాదాపు రెండొందలమంది మన ఊర్నించే. అందరికీ ప్రత్యేకంగా ఇదే కలర్ సూట్ ముందే ఉండి ఉండొద్దూ? ఇదే కావాలని షాపులన్నీ గాలిస్తుంటే అందరికీ దొరకొద్దూ? ఇదేదో ముందే తెలిస్తే, గత వారం ఆస్టిన్ వెళ్ళినప్పుడే కొనుక్కునే దాన్నేమో."
"హ్మ్, ఈ కలర్ కోడ్ వల్ల కాస్త ఇబ్బందయింది కానీ, గ్రూప్ కాన్సెప్టు మాత్రం బావుందే. మొదటిసారి కదా, ఈ సెమినార్ ఒకసారి వెళ్ళి చూసి, నచ్చితే మరోసారి వెళ్ళొచ్చు, లేదంటే ఊరుకోవచ్చనుకున్నాను. మీరూ వస్తున్నారంటే ఉత్సాహంగా ఉంది. మా ఇంటికి దగ్గరేగా 'మెరిల్ కన్వెన్షన్ సెంటర్ '. సెమినార్ అయిపోయిన తర్వాత ఇద్దరూ మా ఇంటికి వచ్చేయండి. సరేనా! కాసేపు మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది." అభిమానంగా ఆహ్వానించాను ఇద్దరినీ.
"గుడ్ ఐడియా! అలాగే కలుద్దాం." అప్పూ అంది. శృతి కూడా తలూపి "సరే మరి పద, ఇపుడయితే షాపింగ్ పూర్తి చేద్దాము!" అంది.
"అయిపోయిందే! నాకేవో దొరికాయి, మీరు కానివ్వండి" అంటూ చెకవుట్ దగ్గరికెళ్ళాను.
చేంతాడంత లైనుంది. అందులో డజన్ మంది మన దేశీలే!
***
ఆదివారం రానే వచ్చింది. పిల్లలకి ఎండాకాలం సెలవులవటంతో, ఉదయాన్నే పరుగులెత్తించే క్లాసులవీ ఏమీ లేక, ప్రశాంతంగా ఉంది.
తండ్రీ పిల్లలు కలిసి తీరిగ్గా కూర్చుని పాత ఇండియన్ సినిమాలు చుట్టేస్తున్నారు. హృతిక్ రోషన్ -'క్రిష్' చూస్తున్నారు. ముందురోజు చూపించిన "కోయీ మిల్ గయా" తో ఏ తంటా రాలేదు. బహుశా, ఆ సినిమాలో హృతిక్ నటనలో లీనమయ్యేసరికి మరేమీ కనబడలేదేమో! ఎటొచ్చీ, దాని సీక్వెల్ ' క్రిష్ ' చూస్తుంటే మాత్రం- మా అమ్మాయి, హృతిక్ డ్రెస్, ఆ పై, ఆ చెట్లు దూకడాలు, కొమ్మలపై వేలాడ్డాలు, కొండలెక్కడాలు-- ముఖ్యంగా- క్లైమాక్స్ దగ్గరలో "తాటిచెట్ల ఎలాస్టిసిటీ తో శతృసంహారం" సన్నివేశం- ఇవన్నీచూస్తున్నప్పుడల్లా, “ఇవన్నీ మరీ మరీ మహేంద్ర బాహుబలి నే గుర్తుకు తెస్తున్నాయి" అనేసింది. ఇంకా నయం. ఇంట్లో అంది. అదే మాట అభిమానుల ముందు అని ఉంటేనా? అమ్మో! భళ్ళాలల్లా బళ్ళాలు పట్టుకుని మరీ చీల్చేద్దురు. ఆ మాటలని. అంతే కదూ మరి. దూకుడు అవిడియాలు ఒకరి సొత్తా ఏమీ? మరి, రుడయార్డ్ క్లిప్పింగ్ "జంగిల్ బుక్" లో మోగ్లీ మన చిన్నప్పుడే ఇవన్నీ చేసి చూపించేయలేదూ! అంతమాత్రాన, మోగ్లీ, బాహుబలి కి ఇన్స్పిరేషన్ అంటే అసంబధ్ధంగా ఉందనరూ? అంతెందుకు? మన హనుమాన్ మాత్రం? పసి వయసులోనే బాల భానుడిని చూసి యాపిల్ అనుకుని తినేసేందుకు ఆకాశంలోకి ఎగరలేదూ?
వాళ్ళకీ ఇలాగే కొమ్మకీ, కొండకీ, తోకకీ ముడిపెడుతూ ఏదో చెప్పేసాను. పిల్లలు కదా, ఒక్కోసారి ఒప్పుకుంటారు. అదేంటో? అచ్చు ఫేసుబుక్కులో కొందరి గోడల పై తికమక పోస్టులకి వచ్చే మకతిక కామెంట్లలా నేనలా బాహుబలి నుంచి హనుమాన్ వరకూ వెళ్ళిపోయినా ఎవరి మనోభావాలూ దెబ్బతినలేదు. ఇల్లు కదా.
తండ్రీ పిల్లలు మూవీకెళ్ళి అట్నించటే లంచ్ కి వెళ్తామన్నారు. వంట బాధా లేదు. వేడివేడిగా మెత్తటి ఇడ్లీ, అల్లం చట్నీ, కారప్పొడి మటుకు బ్రేక్ఫాస్టుగా ఇచ్చి, తీరిగ్గా గ్రే కలర్ లో రెడీ అయి సెమినార్ కి బయల్దేరాను.
కన్వెన్షన్ సెంటర్ చేరాక, అక్కడ నేనూహించినంత కోలాహలంగా లేదు. ఎక్కువగా దేశీ ఆడవారే. ఐనప్పటికీ మాటలు, ముచ్చట్లు ఏవీ లేవు. ఒక్కోసారి ఈ ఫార్మల్ డ్రెస్సింగ్ వల్ల వాతావరణంలో వచ్చే గాంభీర్యత చాలా బావుంటుంది. మనసు చైతన్యాన్ని కోల్పోకుండానే ఓ నిశ్చలమైన నిశ్శబ్ధంలో ఉండిపోతుంది. ఇది చాలా అరుదయిన నిశ్శబ్ధం. తమలోకి తాము తరిచి చూసుకునే పుస్తకంలో లీనమయినపుడో, ప్రపంచాన్ని తరచి చూసే విజ్ఞానం లో లీనమైనప్పుడో మనసుని ఆవరించే నిశ్శబ్ధముంటుందే! అచ్చు దాన్ని పోలిన నిశ్శబ్ధం. ఆ నిశ్శబ్ధాన్ని అనుభూతిస్తూ లోనికెళ్ళాను.
పెద్ద హాల్. అందులో రెండొందలకు పైగా నిండి ఉన్నారు. ప్రతీ ఒక్కరికి ముందే సీట్ నంబర్ కూడా కేటాయించబడింది. G-40 నా నంబర్ చూసుకుని కూర్చున్నాను. తెలిసిన మొహాల కోసం అటూ ఇటూ తల తిప్పకుండానే కళ్ళతో చూస్తున్నాను.
కార్యక్రమం మొదలయింది. ప్రభావితం చేసే ఎంటర్ప్రెన్యూల ప్రసంగాలు వింటూంటే నాకు ఈ వాట్సప్ గ్రూప్ పై మొదట్లోనే కలిగిన ఉన్నత అభిప్రాయం సరైందేనని మరో సారి తెలిసింది. ముఫ్ఫై మధ్యల్లోనే పెరుగుతున్న వయసుని సూచించే గ్రే హెయిర్ ని చూసి బెంగపడకుండా, వయసుతో పాటుగా పెరుగుతున్న అనుభవం, పరిణతి చూసి గర్వించాలని చెప్పేందుకే గ్రే కలర్ కోడ్ తో ఈ సెమినార్ నిర్వహించాలనుకున్నారట. రాబోయే సెమినార్ కి నింగి రంగు నీలాన్ని ఎంచుకుంటున్నట్టు ప్రకటించారు! నింగి నుంచి సముద్రం వరకూ, తామే అవుతున్న విశిష్ట తరుణుల విజయాలే ప్రసంగాంశమని చెప్పారు. చప్పట్లతో ఆమోదం తెలియచేసారంతా! ఇద్దరు పాతతరం మహిళా సీ.ఈ.ఓ లకి జీవిత సాఫల్య పురస్కారాలందించారు.
అన్నిటిలోకి మిన్నగా అప్పూ, మా అపర్ణ ప్రసంగం చాలా నచ్చింది. పరిణతి చెందిన ఆలోచనలు, ఆకాశాన్ని ముద్దాడే ఆశయాలు కలగలిసిన అద్భుత ప్రవాహమది! ఈ మధ్య కాలంలో ఎపుడూ ఇంత ఉద్వేగానికి లోనవలేదేమో! మంచి ఆర్గనైజేషన్లో నెట్ వర్కింగ్ అనలిస్టు గా పని చేస్తూ, కెరియర్ లో హోదా, జీతం అన్నీ బాగున్నప్పటికీ, మరింకేదో సాధించాలని నిలకడగా ఉన్న ఉద్యోగాన్ని వదులుకున్న అప్పూని చూసి అందరం మొదట ఆశ్చర్యపోయిన వారిమే! కానీ, దరిమిలా నెట్ వర్కింగ్ సర్వీసెస్ అంటూ స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేసి, అతి కొద్ది కాలంలోనే టీ మొబైల్, వెరిజోన్, ఏటీ&టీ లాంటి టెలీదిగ్గజాలన్నిటినీ క్లయంట్లుగా మార్చుకున్న తన ప్రయాణం మాత్రం మేము ఊహించని విజయమే! WIB అనే లోకల్ బిజినెస్ పత్రిక, అప్పూని తమ కవర్ పై వేసి, తన గురించి చెప్పేవరకూ, దగ్గరి స్నేహితులమైన మాక్కూడా తన విజయాలు, కంపెనీ టర్నోవర్ విషయాలేవీ తెలీదు. ఫ్రెండ్స్ మధ్య ఉంటే తన బిజినెస్ విషయం అసలు రానీయదు. అలా, తన ప్రస్థానం గురించి తన మాటల్లో వినటం ఇదే మొదటిసారేమో, ఆ వాక్ప్రవాహంలో లీనమయి అబ్బురపోయాను.
సెమినార్ ముగిసిన వెంటనే అప్పూని మనస్పూర్తిగా అభినందించాను. శృతి మా దగ్గరకి వస్తూ, తనకి కలిసిన పాతస్నేహితులందరినీ తీసుకు వచ్చింది. ఆశ్చర్యానందాలు, ఆత్మీయ కరచాలనాలు అన్నీ అయ్యాక, అందరం ఆ పక్కనే ఉన్న ఇండియన్ రెస్టారంట్ లో కూర్చుని లంచ్ చేస్తూ మాట్లాడుకున్నాము. అందరినీ ఎక్కువగా ఆకర్షించింది మాత్రం అప్పూ ప్రస్థానమే! అప్పూని అందరూ మరోసారి అభినందించారు. అప్పూ ఎందుకో ఉత్సాహంగా మాట్లాడుతున్నట్టు లేదు. మా ప్రెజెన్స్ ని ఇష్టపడుతుందని తెలుస్తుంది కానీ, తరుచుగా ఫోన్లోకి చూస్తూ ఉత్తినే ఆన్/ఆఫ్ చేస్తుంది. బహుశా ఏదో ముఖ్యమైన ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తుండాలి!
ఆ తర్వాత వీడుకోళ్ళయ్యాక, నేను, శృతి, అప్పూ ముందుగా అనుకున్నట్టుగా మా ఇంటికి బయల్దేరాము. వాళ్ళిద్దరూ షటిల్ లో సెమినార్ కి వచ్చామనటంతో అందరం కలిసి నా కార్లోనే బయల్దేరాము.
కార్లోకి ఎక్కగానే, శృతి మొదట తన సూటుని ఖాళీ సీటుకి వేసేసి, రిలాక్స్డ్ గా కూర్చుంది. తను రిలాక్స్ అయిందంటే మన చెవులు బిజీ అయ్యాయన్న మాటే! తనో మాటల ఝరి. ముచ్చట్లు మొదలెట్టిందంటే ఇష్టంగా వింటూ ఉంటామంతే. అప్పూ మాత్రం కాస్త అనీజీగా ఉంది. ఎందుకో అసంకల్పితంగా అడిగాను "అప్పూ, ఇంట్లో అందరూ బావున్నారు కదా!"
"అందరూ బావున్నారే. నేను కూడా!" అని స్టీరింగ్ మీదున్న నా చేతిని చిన్నగా తట్టింది.
ఏదయినా పనుందేమో, ఇంటికి పిలిచి మొహమాటపెట్టట్లేదు కదా అని అనుమానమొచ్చింది. కానీ, తను ప్రాక్టికల్ గా ఉంటుంది. పనేదయినా ఉండుంటే, ఆ మాటే సున్నితంగా చెప్పి వెళ్ళేది.
ఇల్లు చేరుతూనే అర్థమయింది. పిల్లలింకా ఇంటికి రాలేదని. ఎక్కడ సర్దినవి అక్కడే ఉన్నాయి మరి.
కాస్త టీ స్టవ్ మీద పడేసి కూర్చున్నాము. బాల్యం కబుర్ల నించీ బాహుబలి రికార్డుల వరకూ, దారెంబటి నల్లకలువల దైన్యం నుంచి దేవసేన ధైర్యం వరకూ ఏ అంశాన్ని వదలకుండా మాటల్లో దొర్లిస్తున్నాము.
మాట్లాడుతున్నట్టే కనబడుతుంది కానీ, అప్పూ ఇంకా అన్యమనస్కంగా ఉన్నట్టు తెలుస్తుంది.
టీ తాగాక, బహుముఖ ప్రజ్ఞాశాలి దాసరి గారి దర్శకత్వం, లబ్ధప్రతిష్టులు సినారె గారి సాహిత్యం తలుచుకున్నాము. ఆణిముత్యమొకరు. జాతిరత్నమొకరు. భారంగా మారిన కొన్ని క్షణాలని సరదాదారికి తెచ్చేందుకు కాబోలు శృతి తనదైన దారిలో, మెల్లిగా టాపిక్ మార్చింది.
ఆ క్రమంలో శృతి చెప్పిన జోక్స్ కి నేను నవ్వాపుకోలేకపోయాను. అప్పూ మాత్రం పెదవులు విడివడీవడకుండా నవ్వింది. కనీసం నేనలా అనుకున్నాను.
అలా, అలా పిల్లల మీదకి వెళ్ళాయి మాటలు. గమనించారో, లేదో? గత కొన్నేళ్ళుగా ఏ ఇద్దరు మాట్లాడుకున్నా, రోజూవారి మాటల్లో స్టీవ్ జాబ్ ని తిట్టుకోకుండా మాటలు ముగియట్లేదు. అలాగే, మేము కూడా పిల్లల బాల్యంలో కొద్ది శాతాన్ని బలవంతంగా లాగేసుకుంటున్న ఐప్యాడ్ లనీ, ఫోన్లనీ కాసేపు తిట్టుకున్నాము. శృతి చెప్పింది. "మీకు తెలుసా, స్టీవ్ జాబ్ పిల్లలు ఇంతవరకూ ఐప్యాడ్ ని వాడలేదట. నిజానికి, స్టీవ్ జాబ్స్ వాడనీయలేదట?" అంది. తనే ఒక నిమిషం ఆగి, "తన కుటుంబాన్ని వాటి బారిన పడకుండా బాగానే కాపాడుకున్నాడు కదూ?"
అలా అంటూనే ఉంది, తన ఫోన్లోంచి సడన్ గా తలెత్తిన అప్పూ తనని మధ్యలో ఆపేసింది. "నన్ను పికప్ చేసుకోవటానికి సతీష్ వస్తున్నాడు. నువ్వూ నాతో వస్తావా, శృతి?"
ఇద్దరం విచిత్రంగా చూసాము.
"ఏంటే? ఎందుకంత హడావిడి? కూర్చుందామనే అనుకున్నాము కదా? ఏదయినా బిజినెస్ డీలా?" అంది శృతి.
అప్పూ నవ్వింది. అప్పుడే గమనించాను -తేటగా మారింది మొహం కూడా. రిలాక్స్డ్ గానే ఉంది. "అంతకన్నా పెద్దదే. పొద్దున్నించీ ప్రవీణ నా వెంట పడుతుంది కదా, "బానే ఉన్నావా?" అంటూ? నిజమే. ఇందాకటి వరకూ కాస్త నెర్వస్ గా ఉన్నాను! ఇదిగో ఇపుడే, ఈ మెసేజ్ చూసాక నా దిగులంతా హుష్ కాకి!" అంటూ ఫోన్ స్క్రీన్ చూపించింది.
" ష్యూర్, ఏడింటికి కలుద్దాము. – విక్టోరియా ఫ్లెమింగ్!" అని ఆంగ్లం లో మెరుస్తున్న అక్షరాలు, ఆ తర్వాత అడ్రస్ కనబడ్డాయి.
" ప్రశాంతంగా కూర్చోకుండా వీకెండ్ కూడా మీటింగా? " -శృతి మాటల్లో నిష్టూరం తన డిసప్పాయింట్మెంట్ ని దాచట్లేదు.
అప్పూ నవ్వుతూ అంది " ఉహూ. కాదు. వీకెండ్ కూడా మన సమయాన్ని మింగే అవకాశం బిజినెస్ కి అస్సలీయను. ఈ మెసేజ్ మా వాడు- సాహిల్ టీచర్, మిసెస్.ఫ్లెమింగ్ నించి వచ్చింది."
పెద్ద ప్రశ్నమార్కుల్లా మారిన మా మొహాలు చూసి నవ్వి, తనే వివరంగా చెప్పింది.
"విషయమేంటంటే- మా వాడు -సాహిల్, ఉదయం నేను బయల్దేరేముందే ఓ విషయం చెప్పాడు. ఈ థర్డ్ గ్రేడ్ లో వాళ్ళ టీచర్ తో ఒక్క ఫోటో కూడా లేదట. స్కూల్ ఆఖరి రెండ్రోజులూ వాడికి జ్వరం! పాపం. వెళ్ళలేకపోయాడు. స్క్రాప్ బుక్ లో కావాలి కదా. ఒక్క ఫోటో అయినా లేదని కాస్త డల్ అయ్యాడు. వాడి కళ్ళలో, కలతలో - టీచర్ మీద అభిమానం, జ్ఞాపకాల మీద గౌరవం కనబడ్డాయి!! మొదట తేలిగ్గానే తీసుకున్నాను. వచ్చే సంవత్సరమెలాగూ అదే స్కూల్ కదా, ఒకసారి ఆవిణ్ణి చూసి కలిసి ఫోటో తీసుకోవచ్చని చెప్పాను. కానీ, ఆవిడ ఫ్యామిలీతో సహా రేపే అర్కన్సాస్ కి మూవ్ అవుతున్నారనీ. ఇక ఎప్పటికీ కలవరనీ మా వాడు దిగాలుగా అనటంతో బాధేసింది. అందుకే ఆవిడకి పొద్దునే మెసేజ్ పెట్టాను. ఈ రోజు ఒక పది నిమిషాల సమయమీయమని. ఆవిడేమో పొద్దున్నించీ రిప్లయ్ ఇవ్వలేదు. అందుకే, వాడి చిన్న కోరిక ఎలాగైనా తీరితే బావుండని ఎదురు చూసానంతే!“ చెబుతూ ఒక్క క్షణం ఆగి,
“ఇదిగో ఇపుడిలా ఆవిడ పాజిటివ్ గా మెసేజ్ చేయటంతో దిగులంతా మాయమైంది. సాహిల్ కి ఇది మంచి సర్ప్రైజ్!” సంతోషంగా అంది!
చివరి రెండు వాక్యాలు చెప్పేటపుడు అప్పూ మొహం లో ఒక సంతోషం. ఒక వెలుగు. కళ్ళలో మెరుపు!
నిజం చెప్పొద్దూ, పొద్దున సెమినార్లో తన విజయాల గురించి అద్భుతంగా చెబుతున్నపుడూ అప్పూ మొహమింతలా వెలగలేదు. పిల్లలు మాయే కదా మరి!
ఇదంతా చెప్తున్నంతలోనే సతీష్ వచ్చాడు, సాహిల్ తో సహా. అప్పూ బై బై చెప్పి వెళ్ళింది. “దార్లోనే కదా, డ్రాప్ చేస్తా”నంటూ శృతినీ తీసుకెళ్ళింది.
చెప్పొద్దూ! అప్పూ చెప్పింది విన్నాక, కలతకి కారణం తెలిసాక, తెలీకుండానే తేలికయ్యాను. అలాగని ఆ కారణం తేలికైనదిగా ఏమీ అనిపించలేదు.
పిల్లాడి మనసులో దిగులు కంటే ఎక్కువగా తల్లిని కలవరపెట్టేది మరేముంటుంది?
అందుకే, అప్పూ కలత కానీ, ఆపై తన ఆనందం కానీ చిన్నవిగానో, చిత్రంగానో అనిపించలేదు.
నేనూ తల్లినే కదా!
*****
Tags Deepthi Pendyala madhuravani telugu magazine Deepthi mutchatlu madhuravani july 2017