top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

“దీప్తి” ముచ్చట్లు

నాలుగు వేళ్ళ దూరం!

Deepthi Pendyala, madhuravani, Deepthi Pendyala madhuravani

దీప్తి పెండ్యాల

"బుద్ధుందా! అంతమాటనేస్తావా?  మగ దురహంకారం. ఈ క్షణాన నిన్ను వదిలే---<గిన్నేదో కింద పడిన శబ్ధం> గుర్తుంచ్... “ ఆవేశంగా వినబడుతున్న సత్య గొంతు- తలుపులు దాటుకుని మరీ వినిపిస్తుంటే, కాలింగ్ బెల్ కొట్టబోతున్న దాన్నల్లా అక్కడే నిలబడిపోయాను. "లోపలికి వెళ్ళాలా, వద్దా?" అన్న సంశయానుమానసందిగ్ధంతో. అవి మూడూ దాదాపుగా ఒకటేగా?  అని సంశయానుమానసందిగ్ధంగా చూడకండి. కాబోలేమో. కావచ్చేమో. మళ్ళీ ఈ రెండూ ఒకటేమో.  సత్య రౌద్రం ఆలకించిన తత్సమయాన, ఏకత్వాన్ని దర్శించే పరిస్థితిలో లేను.  కేవలం సంశయానుమానసందిగ్ధంలో ఉన్నాను!

 

ఆ వారం - హరికేన్ హార్వే వచ్చి మా హ్యూస్టన్ నగరాన్ని అల్లకల్లోలం చేసింది.

 

జలం గుప్పిట్లో నగరం.

 

భయం గుప్పిట్లో జనం.

 

స్కూళ్ళు, ఆఫీసులు, రోడ్లు అన్నీ స్థంభించిపోయాయి.  ఇళ్ళలోకి నీరు చేరిన వారిని సురక్షిత ప్రాంతాల్లో "షెల్టర్' లలో చేర్చారు. అలా, షెల్టర్ లలో  చిక్కుకుపోయిన హరికేన్ బాధితులకి, మిగతా నగరవాసులు వీలయినంత సాయం చేస్తున్న సమయమది.  ఉడతా సాయంగా- చర్చ్ లో వలంటీరింగ్ చేయటానికి, అలా చిక్కుకుపోయినవారికి కొన్ని నిత్యావసర వస్తువులు,  పిల్లలకి బొమ్మలు వగైరాలు ఇచ్చేందుకు వెళుతూంటే సత్య ఫోన్ చేసి అడిగింది. దార్లో వాళ్ళింట్లో ఆగి, తన దగ్గర ఉన్న బట్టలు, పుస్తకాలు కూడా తీసుకెళ్ళగలనేమో?  అని. అదిగో, అందుకే ఇక్కడ ఆగాల్సి వచ్చింది.

 

తీరా చూస్తే, సత్య ఇంట్లోంచి,  హరికేన్ ని మించిన ప్రళయ సంకేతాలు ఏవో వినబడుతున్నాయి.

 

సందర్భం కాదేమో అని వెనక్కి వెళ్ళబోతున్నదాన్ని కాస్తా ఆగిపోయాను. తలుపు తెరిచి నవ్వుతూ పలకరించిన సత్యని చూసి.

 

"పదింటివరకల్లా వస్తానన్నదానివి, ఇంకా రాలేదేమిటా అని చూస్తున్నాను. రా, లోపలికి" అంటూ లోపలికి దారి తీసింది.

 

సంశయంగానే లోనికి వెళ్ళాను. సోఫాలో కూర్చున్న సందీప్, లాప్టాప్ లో నించి తలెత్తి నన్ను చూసి పలకరింపుగా నవ్వాడు. ఊహించినట్టుగా ఇంట్లో యుద్ధవాతావరణం కనబడకపోవటంతో కాస్త తెరిపిన పడ్డాను.

 

అనుమానంగా టీ.వీ వైపు చూసాను. ఆ అరుపులు ఏ "చీకాకు చింతాకులు" సీరియల్ నుంచో కావచ్చనుకుని. "నాకేమీ తెలీదు!" అన్నట్టుగా టీవీ నిశ్శబ్ధంగా బ్లాంక్ స్క్రీన్ తో దర్శనమిచ్చింది. ఆ అరుపులకి భయపడిందేమో మరి. నల్లమొహంతో దిగాలుగా కనిపించింది.  బహుశా, నా కవిహృదయం అలా చూసిందేమో. 

 

పరిస్థితిని అంచనా వేసే ఆలోచనలు ఎక్కడెక్కడో తిరక్కుండా, మరో అరుపు చెవిన బడింది. "నే బయటకెళ్తున్నాను. తలుపేసుకో" అంటూ. నిస్సందేహంగా మా సత్య దే ఆ అరుపూ, అరుపు తాలూకు గొంతూ!

 

గరాజ్ నుంచి పేద్ద బాక్స్ తీసుకొస్తూ, నా వైపు తిరిగి - "పద, ఆలస్యమైందా?" అంటూ బయటకి నడిచింది.

ధడ్, భడ్, ధడ్, భడ్- ధడ్ ధడ్

 

"అదేంటీ, నువ్వూ వస్తున్నావా?" తనతో పాటే నేనూ నడుస్తూ అడిగాను. గుణ్, గుణ్, గుణ్...

 

"ఆ! మనసు బాలేదు. కాస్త మార్పు ఉంటుంది కదాని!" కార్ డోర్ వేస్తూ చెప్పింది.

 

ధణేల్!!

గాబరాగా చూసాను. తలుపుందో, ఊడి అవతల పడిందో అని. అసలే మా ఊర్లో ఉండే "డిలియన్ బ్రదర్స్"  మెకానిక్ షాప్ వాడికి ఈ కారంటే ప్రాణం. వాడి జీవనాధారంగా భావించి, వెళ్ళినపుడల్లా... ఆర్ద్రంగా చూసుకుంటాడీ కారుని. నవరాత్రులు వాళ్ళు జరుపుకోరు కానీ, లేదంటే, వాహనపూజకి వాడు మా  ఇంటికొచ్చి మరీ దీనికి పూజ చేసేవాడే. 

సత్య పుణ్యమాని తలుపూడుతే వాడికి ఈ కారు పై ప్రేమ అమాంతం పెరిగిపోతుంది మరి. అపుడిక దీన్ని తిరిగి తెచ్చుకోవాలంటే, ‘ఆస్థులు రాసిస్తా’ అన్నా ససేమిరా అంటాడు. అది మరీ నా బాధ.  అందుకని తలుపుని ఒకటికి రెండు సార్లు చూసాను. 

అది గమనించి, నా వైపో చిరాకు చూపు విసిరింది. "సత్య ఇక్కడ!  సత్య కి కోపమొస్తే, సత్య గురించే కానీ, కార్లు, ఆస్థులూ ఇవన్నీ ఏ కోడి మెదళ్ళోకి, కోడి మెదళ్ళో కాకుల్లా తిరిగే ఆలోచనలకీ  రాకూడదు!" అన్న పంచ్ హెచ్చరిక ఇమిడుంది అందులో మరి. 

ఆ మధ్య చపాతీ సినిమాలు మొదలయిన్నుంచీ, హీరోలు, విలన్లు-" నేను " అనటం మానేసారు. "గార్ధబ్, గార్ధబ్  ఇక్కడ" అంటూ-- గుడ్లురుముతూ గుర్తు చేస్తారు. అక్కడికేదో ఆ అద్భుతనామధేయాన్ని మనం మర్చిపోతామన్నట్టు. ఆ పాటికే, చెప్పీ, చెప్పీ... ఆ పేరే చెవిలో గింగిరాలు తిరుగుతూంటుందా! మళ్ళీ ఈ అరుపులు, పెడబొబ్బలతో మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తారు.  ఏ మాటకీ తమ పేరు గుర్తు  చేయటమే. ఇక్కడ- మూడేళ్ళ వరకూ చిన్నపిల్లలూ అలాగే... తమ పేరు పదే పదే చెప్పుకుంటూంటారు. ముద్దుముద్దుగా! కాపోతే వీళ్ళలా చేస్తే ముద్దొస్తారు. వాళ్ళు చేస్తే -<ధనాధన్ధనాధన్ధనాధన్ --->ఎందుకు లెండి! 

సరే, వాళ్ళ సంగతి మనకేల కానీ, మన ముచ్చట్ల హీరోయిన్ సత్య వద్దకొచ్చేద్దాము. 

ఇక తన చూపు తాను విసిరాక, నేనూ- 

"ఏంటీ, ఇంట్లో సీను?" కళ్ళతోనే అడిగా. అంటే, అదేదో సినిమా పాటలోలా ‘కనుబొమ్మ విల్లెత్తి’,  ఓ చూపు లో ఆ ప్రశ్న ని సంధించేసానన్నమాట.

 

సత్య, తన కోపమంతా సీటుబెల్టు లాగటంలో లాఘవంగా చూపిస్తూ అంది. "సందీప్ కూడా సగటు పురుషాహంకారి, దివ్యా! ఇన్ని రోజులు తెలీలేదు కానీ!“  నిష్టూరమో, నిజమో కానీ ఓ మాటనేసింది వాళ్ళాయన్ని. ఈ సన్నివేశంలో ఎఫెక్టు కోసం, వెనకటికైతే 'మెటికలు విరిచింది ' అనేవారు. ఇపుడవేవీ లేవు. ఎందుకంటే చేతులు ఫోన్లని నిమరటం కాక, మెటికలు విరవటం వగైరాలు చేయటం మానేసి దశాబ్ధం అయింది మరి.

 

 "ఏమయిందీ?" మెల్లిగా అడిగాను. ఆరా లా ధ్వనించకుండా జాగ్రత్తపడుతూ! “ఆరాతీస్తూ, ఆరాలా ఉండకుండా ఎలా ఉంటుందీ?” అని ఆరా తీయకండి. ముచ్చట్లు సీరియస్ మోడ్ లోకి వెళ్తుంటే అలాగే రాయాలని రచయిత హృదయం చెబుతోంది మరి.

 

"ఏముందీ! నేను ఎక్కడికీ వెళ్ళకూడదు. పాదదాసీలా పడుండాలి కాబోలు. ఆఫీసు,

ఇల్లు, ఇక వేరే జీవితమే ఉండకూడదన్నట్టుగా-!" పళ్ళు నూరుతున్న సౌండు! పటపటపట!

 

ఆశ్చర్యపోయాను. నాకు తెలిసీ, సందీప్ చాలా పరిణతి కలిగిన అబ్బాయే."ఇలా ఉండు, అలా ఉండాలి!" అంటూ ఆంక్షలూ, ఆక్షేపణలూ సత్య ఎపుడూ ఎరుగదు. ఇంట్లో పనులూ సమంగా చేసుకుంటారు. ఈ ఈగోలు లాంటివేవీ మునుపెన్నడూ తెలీదు. ఈ రకంగా అతడు చాలా మంచోడే. మంచోడంటే... మామూలుగా అందరు మగాళ్ళు ఉండాల్సిందలాగే కనుక, అలాగే ఉండుంటే భూమి బాగుండేది కనుక, అలాగే ఉండుండి, ఇతడిలాగే ఉండుంటే మామూలువాడయిఉండేవాడు!  కానీ, అక్కడో, ఇక్కడో, ముచ్చట్లలోనో తప్ప అలాంటివారు అరుదే కదా... అందుకని మంచోడయ్యాడన్నమాట. అలా... ఇద్దరూ అవగాహనతో ఉండేవారే! మరిదేంటీ కొత్తగా?

 

"నీకు తెలుసుగా దివ్యా? మా కలీగ్ రేష్మి వాళ్ళంతా కాస్త సరదాగా ఉంటారని? నిన్న ఓ కలీగ్ పుట్టినరోజని అమ్మాయిలందరం సాయంత్రం సరదాగా ఓ పార్టీకి వెళ్ళాము. కాస్త ఆలస్యమవుతుందని కూడా ముందే చెప్పాను. ఫోన్ మర్చిపోయి వెళ్ళాను. నేను బయటకెళ్ళాక, అక్క ఫోన్ చేసి, నాకోసం అడిగితే, “మీ చెల్లి పార్టీ కి వెళితే, పిల్లలని చూసుకుంటున్నాను" అన్నాడట. చిరాగ్గా. అక్క ఎంత బాధపడిందో? సందీప్ ఇంత కుంచితంగా ఆలోచిస్తాడని ఎపుడూ అనుకోలేదు తెలుసా? నాకు అతని నిజ రూపం తెలిసొచ్చింది. ఛ. మగవాళ్ళింతే!"  సత్య కోపం కాస్తా ఆవేశంగా మారింది.

 

కోపానికి పదునెక్కువ. ఆవేశానికి ఆలోచన తక్కువ. అయ్ బాబోయ్. ఈ పంచు లైన్ పై పేటెంట్ దొరుకుద్దో?  

 

సత్య అలక సీనుకెళితే… సత్య ఆవేశం చూసి నాకేం మాట్లాడాలో తెలీలేదు. నిజం చెప్పాలంటే, సత్య చెబుతున్న అమ్మాయిలంతా నాకూ తెలిసిన వారే. ప్రతీ రెండు వారాలకీ పార్టీ అంటూ, డౌన్ టౌన్ వరకూ వెళ్ళటం, ఆ రోజే రిలీజైన ఏదో ఓ సినిమా చూసి, అపరాత్రి ఇంటికి డ్రైవ్ చేయటం కద్దు.

 

గత వారమిలాగే ఓ నైట్ అవుట్ తర్వాత సత్య చెప్పింది - “సింధూ డ్రైవ్ చేస్తూ, నిద్రమత్తులో రాంగ్ వే లో ఫ్రీ వే ఎక్కింది, మేమూ మాటల్లో పడి చూసుకోలేదు. ఆక్సిడెంట్ తృటిలో తప్పింది, తెలుసా?” అంటూ అదీ గొప్ప విషయంగా చెబుతూంటే, నాకు మటుకు… ట్రెండీగా ఉండాలనుకుంటూ, పద్ధతులకి విరుద్ధంగా అన్నీ ప్రయత్నించే టీనేజ్ పిల్లలు గుర్తొచ్చారు.  వారికి, జాగ్రత్తగా ఉండాలన్న బాధ్యత కూడా తమదేనని తెలీదు.

సత్యతో  ఈ విషయంపై మాట్లాడే ధైర్యం ఎపుడూ చేయలేదు.

నేను ఆలోచిస్తూ మౌనంగా ఉండటాన్ని గమనించిన సత్య అంది- "నువ్వూ షాక్ కి లోనయ్యావు కదూ? అసలీ మగవాళ్ళింతే. ఆడవాళ్ళెపుడూ పీడితులే!" అని నిర్ధారించింది.

కనిపించని సంకెళ్ళేవీ లేకుండా, స్వేచ్ఛగా ప్రగతిని అందుకోగల దశలో ఉన్న సత్య, పీడితురాలు కాదు, బాధితురాలు కాదు. తనకా విషయం తెలీదంతే.

 

ఇక, సత్య అక్క- నాకు తెలిసినమ్మాయే. సందీప్ ఏమన్నాడో, తనెలా అర్థం చేసుకుందో అని చిన్న సందేహం.

 

చెప్పాగా! నాకు తెలిసీ సందీప్ కి ఆడ, మగ వివక్ష గట్రా తెలీదు. సంవత్సరం క్రితం, సత్య తన కలీగ్స్ తో కలిసి ఆస్ట్రేలియా కి సరదాగా వెకేషన్ వెళ్ళినప్పుడు, వాళ్ళబ్బాయి ఆర్నెల్ల అర్ణవ్ ని సందీప్ రెండు వారాలు చక్కగా చూసుకున్నాడు. అలాంటిది, సత్య ఓ పూట పార్టీకెళితే చిరాకుపడటం నిజమనుకోలేకపోయాను. ఓ వేళ పడ్డా- బహుశా ఆలస్యమయితే, ఆదుర్దా పడుంటాడేమో? ఇంటికి పిల్లలు లేట్ గా చేరితే తల్లి చూపించే ఆదుర్దా లాంటి ఎదురుచూపు, రానందుకు కోపం- అన్నిటినీ ఈ సో కాల్డ్ పురుషాహంకారంగా తీర్మానించటం నిజమైన బాధిత స్త్రీలకి మనం చేస్తున్న అవమానమే.- అని నాకనిపించింది.

  అదేంటో...

తామూ ఆకాశంలో, అవనిలో సగమనీ, తమకంటూ ఇష్టాలు, అభిప్రాయాలు ఉండొచ్చని, మరో సగమూ ఆ విషయం గ్రహించాలని గ్రహించలేక- "అమ్మో! మా వారు చంపేస్తారు!" అంటూ తమ జీవితాలని పూర్తిగా "వార్ల" చేతిలో పెట్టి, అజ్ఞానంలో సుఖముందనుకునే  అమ్మాయిలని చూస్తే చెప్పలేనంత ఆవేదనగా ఉంటుంది. 

 

తమ శక్తి ని గ్రహిస్తూ, తమకంటూ విలువనేర్పరుచుకుని సమస్థాయి లో ఉన్న అమ్మాయిలని చూస్తే గర్వంగా ఉంటుంది. 

 

ఎటు తిరిగీ, సమస్య స్థాయి దాటాక, సమస్థాయి దశలో ఉన్నఅమ్మాయిల్లో అతి కొందరు, ఆ దశని గుర్తించకుండా, ‘జాగ్రత్తగా ఉండమని స్నేహంగా చెప్పటానికీ, పెత్తనంతో అణిచివేయటానికీ’ మధ్య సన్నని తేడా తెలుసుకోలేక, మానవ సహజ ప్రవృత్తులకీ- అంటే- ద్వేషం, కోపం, అలక, అసహనం, సంతోషం, ప్రేమ- వీటికి ఆడ, మగ అంటూ రంగులద్దుతుంటే మటుకు -ఇదిగో- ఇలా ఉంటుంది. 

 

సత్య ఇంకా ఏదో చెబుతూనే ఉంది కానీ, అదంతా అక్క చెప్పిందనటంతో చెవులకేవీ అందట్లేదు.

 

అకస్మాత్తుగా మనసులో తట్టిన ఓ మూడు పదాలు బయటకే అనేసాను!

 

"నాలుగు వేళ్ళ దూరం!"

 

సత్య విచిత్రంగా చూసింది నా వైపు. "అంటే?"                                     

 

“ఉహూ. ఏదో ఆలోచిస్తూంటే ఓ కథ గుర్తొచ్చిందిలే. అనుకోకుండా బయటకే అన్నాను" అని చెప్పాను.

 

సత్య వదల్లేదు. నాకు తప్పలేదు. మనసులో తట్టిన కథ చెప్పాను-

 

అపుడెపుడో ఓ సారి, అక్బర్,  సభలో ఉన్నవారందరినీ అడిగాడట- "నిజానికి, అబద్ధానికి ఉన్న వ్యత్యాసమేంటో చెప్పా"లని! అయితే, దానికీ ఓ షరతు పెట్టాడట- సరిగ్గా మూడు పదాలకి మించని మాటల్లో చెప్పాలని.

 

ఎవరూ చెప్పలేకపోయారట.

 

బీర్బల్ చెప్పాడట "నాలుగు వేళ్ళ దూరం" అని! సరిగ్గా మూడు పదాల్లో!

 

అక్బర్ కి అర్థమవక, వివరణ అడిగాడట.

 

బీర్బల్  సమాధానం తెలుసా? “కళ్ళతో చూసినదే ఎక్కువసార్లు నిజం, చెవులతో విన్నది ఎక్కువగా అబద్ధమవవచ్చనీ, మన కళ్ళకీ, చెవులకీ మధ్య దూరం - నాలుగు వేళ్ళని!”

అంటే- నిజానికీ, అబద్ధానికీ మధ్య వ్యత్యాసం కూడా అంతేనని!

 

 ఎప్పటిలాగే, ఆ సమాధానాన్ని అక్బర్ మెచ్చేసి, బీర్బల్ కి కానుకలు గట్రా ఇచ్చాడట.

 

కథ చెప్పటం ఆపి సత్య ని గమనించాను.

సత్య నన్నోసారి పైకీ, కిందికీ చూసి, “దివ్యా? నువ్వు కూడా నన్ను జడ్జ్ చేస్తున్నావు కదా?" అంది అనుమానంగా!

"భలేదానివే! నాకంత దృశ్యం లేదు. కాకపోతే, నిజాయితీగా చెప్పాలంటే, నువ్వూ, అక్కా కలిసి సందీప్ ని జడ్జ్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను." నవ్వుతూ అన్నాను.

 

 సత్య నన్ను కాసేపు అలాగే శ్రద్దగా చూసింది. తిట్టుకుందేమో మరి, తెలీదు.

 

చర్చ్ పార్కింగ్ లాట్ లో కారు ఆపటంతో సత్య నాతో పాటు కిందికి దిగింది. కారు తలుపు మళ్ళీ...

ధడేల్!

అయిపోయింది. నా కారుకసలే కారవత్వం ఎక్కువ. కారవత్వం అంటేనా...? మనుషులకుంటే మానవత్వం కదా! మరి, కారుకు ఉంటే...? అదన్నమాట! రచయిత హృదయం! ఈ కారవత్వంతో తనని అమితంగా ప్రేమించే డిలియన్ బ్రదర్స్ కి తనని బాగుచేసే అవకాశమిచ్చి తన ఋణం తీర్చుకుంటుంది. మరి బ్యాంకుతో నాకు ఋణం పెరిగిపోదూ?

 

 ట్రంక్ లోని డొనేషన్ డబ్బాలతో సహా లాబీలోకి వెళ్ళాము.

లాబీలో ఉన్న ఖాళీ సోఫా పై కూర్చుండిపోయింది సత్య, హేండ్ బేగ్ నుంచి ఫోన్ తీస్తూ.

"అదేంటీ, లోపలికి రావా?" ఆశ్చర్యంగా అడిగాను.

"అమ్మో, లోపలికా! ఆ మాసిన బట్టలు, బొమ్మలూ అన్నీ సర్దటం నాకు అలర్జీ. నేనిక్కడే కూర్చుంటాను. నువ్వెళ్ళిరా." ఫోన్లోకి తల దూరుస్తూ చెప్పింది.

 

"మాసిన బట్టలా? ఎవరైనా అలాంటివి ఎందుకిస్తారు?" మనసులో అనుకుంటూనే ఒకింత  అనుమానంగా సత్య తెచ్చిన బాక్సు వైపు చూసాను. కొంపదీసి అందులో ఉన్నవవేనా? లీలగా సందేహం.

 సైన్ ఇన్ చేసి, "వలంటీర్" బాడ్జ్ తీసుకుని, లోపలికి వెళుతుంటే సత్య ఆత్రంగా పిలిచింది. "దివ్యా! ఒక నిమిషం"

కళ్ళెగరేసాను. నా "కనుబొమ్మ విల్లెత్తి" స్టయిల్లో!  

సత్య  దగ్గరగా వచ్చి  "అటు చూడు, ఆమెవరో తెలుసా?" గుసగుసగా అడిగింది.

తను చేయి సాచిన దిశగా చూసాను. మరో ఎంట్రన్స్ నుంచి లోపలికెళుతూ మానస కనబడింది.

"తెలుసు, మానసేగా?" అన్నాను.

"ఆ, అవును. ఇక్కడికీ తయారయిందా?" అదోలా అంది సత్య.

సత్య మాట్లాడుతున్నదేంటో నాకు అర్థం కాలేదు. మానస చాలా మంచి వ్యక్తి, ఏ సాయానికైనా, ఎక్కడయినా ముందుంటుంది. మా ఊరి హిందూ టెంపుల్ కమిటీలో కీలకమైన మెంబర్. తనొచ్చాకే, ఏ పాలిటిక్స్ లేకుండా సవ్యంగా పండుగలు, కార్యక్రమాలు జరుగుతున్నాయని అందరికీ ప్రత్యేక అభిమానం!

అందుకే సత్య అన్న మాట రుచించలేదు.

"అవును, ఏ? తను చాలా యాక్టివ్. ఈ ఏరియాకి సంబంధించీ, "డొనేషన్ డ్రైవ్" మొత్తాన్ని తనే నిర్వహిస్తుంది. చాలా పద్ధతిగా.” మెచ్చుకుంటూ అన్నాను.

"అబ్బో! నువ్వూ ఫ్లాటా!" సత్య వెక్కిరింపు గా అంది.

“సత్యా! తను చాలా ఎఫీషియెంట్ " అన్నాను.

"ఏమో, నాకెందుకో నచ్చదు! నేను చాలా స్ట్రెయిట్ ఫార్వార్డ్! ఫ్రాంక్ గా మాట్లాడుతాను. ఇలా అతి వినయం ప్రదర్శిస్తూ ఓవరాక్షన్ చేసేవారంటే నాకు చిరాకు.” అనేసింది సత్య. అసందర్భంగా, అర్థరహితంగా!

"మాట్లాడావా తనతో ఎపుడైనా?" అసహనంగా అడిగాను.

"లేదు. ఎక్కడ చూసినా యాక్టివ్ అన్నట్టుగా తిరుగుతుందిగా, చూస్తే తెలుస్తుందిలే. పేరేదో తెచ్చేసుకుందామని. నాకు నచ్చదంతే." సత్య సమాధానం.

అంతే! ఆ సమాధానం విన్నాక, నేనింకేమీ మాట్లాడలేదు. అంతే కాదు, నేను సత్యతో అన్ని విషయాలు ఉన్నదున్నట్టుగా ఎందుకు మాట్లాడలేనో కూడా అర్థమయింది. అవును. అందుకే. కొన్ని రకాల అజ్ఞానాన్ని భరించటం కష్టం. ఎదుటివారిలో మంచితనాన్ని, ఏ విషయంలోనూ మంచిని చూడలేని అజ్ఞానం భరించటం మరీ కష్టం. మగవారిదే కాదు. సాటి ఆడవారిదయినా. అజ్ఞానానికి అహంకారం చేరి చూపించే తృణీకారం, వెటకారం... బాబోయ్! ఆ కారాలు భరించటం మరీ కష్టం.

నేను కదుల్తూంటే చెప్పింది. "కాస్త జాగ్రత్త, మానసతో! నా దగ్గర మోసేసినట్టు అక్కడెళ్ళి మోయకు. తెల్లనివన్నీ పాలనుకునే రకం నువ్వు!"

మరో సారి కనుబొమ్మ విల్లెత్తి, తమాషాగా నవ్వుకున్నాను.

 

నాలుగు వేళ్ళు!

మెదడుకీ, నోటికీ మధ్య దూరం కూడా అంతే!

 

సత్యని సోఫాకే వదిలి, లోనికి వెళ్ళానో లేదో, అక్కడే పొద్దున్నించీ ఏదో ఓ పని చేస్తూ ఉన్న మా పిల్లలతో సహా వాళ్ళ స్నేహితులూ ఎదురొచ్చారు. నా చేతిలో ఉన్న డొనేషన్ బాక్సుల బరువందుకునేందుకు.

 

ఒకటి మాత్రం ఇచ్చి, సత్యది నేనే సర్దాలనుకున్నాను. ఏ అనుమానంతో డబ్బా తెరిచి చూసానో, అదే నిజమయింది. పాతవయిపోయిన మాసిన బట్టలు, ఏ కీలుకాకీలు విరిగి ఇక పనికి రావనుకున్న బొమ్మలు. తేదీ దాటిన ఫుడ్ టిన్లు. తెల్లగా, స్వచ్ఛంగా కనబడిందేదీ లేదు! మాసిపోయి దుమ్ము పట్టిన మురికే అన్నిటిపైనా! 

 

ఆ డబ్బా అలాగే తీసికెళ్ళి, నాలుగడుగుల దూరం లో ఉన్న చెత్తడబ్బాలో పడేసాను.

అంతేగా?  

మంచేగా పంచాల్సింది?

***

Tags Deepthi Pendyala madhuravani telugu magazine  Deepthi mutchatlu  madhuravani july 2017

bottom of page