MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కథా మధురాలు
దైవం మానుష రూపంలో
వాత్సల్య
పొద్దున్నే పనిమనిషి రాలేదని విసుక్కుంటూ వాకిట్లో ముగ్గేస్తున్న మహా లక్ష్మికి "అమ్మాయి ఫోనోయ్,ఏదో అర్జెంటుట" అన్న కేక వినపడినా వినబడనట్టే ముగ్గు వేస్తోంది.
కూతురి నుండి ఫోనంటే "అమ్మా,నేను ఈరోజు ఆఫీసుకెళ్ళాలి, చంటాడిని చూసుకో" అనో లేకపోతే "అమ్మా, నేను ఈ పూట వండుకోలేను,నాకు అన్నం, కూర నాన్నతో పంపించు లేకపోతే నువ్వొచ్చి వంట చెయ్యి" ఇవే కదా అనుకుంటూ.
ఆవిడ పలకకపోయేసరికి "ఇదిగో నిన్నే" అంటూ పొద్దున్నే చూస్తున్న వార్తలకి కలిగిన అంతరాయానికి విసుక్కుంటూ ఆ విసుగుని కూతురి మీద చూపించలేక, కోపంగా మహా లక్ష్మి వంక చూస్తూ, ఫోను ఆవిడ చేతికిచ్చారు నారాయణ రావు గారు.
"అమ్మా, ఈరోజు ఆఫీసుకెళ్ళాలి, కాస్త నాన్నని వచ్చి బుజ్జిగాడిని తీసుకెళ్ళమను" అంది నిద్ర గొంతుతో లావణ్య.
"ఈరోజు ఆఫీసుకెళ్ళాలని నిన్న రాత్రి తెలీదా?" విసుక్కుంది మహాలక్ష్మి.
"అది కాదమ్మా, ఏదో పనిలో పడి మర్చిపోయాను, అయినా అందరి తల్లులూ ఎంతో ఇష్టంగా కూతుర్లకి సాయం అందిస్తోంటే నువ్వొక్కదానివే విసుక్కుంటావు, అసలు నువ్వు నా కన్న తల్లివేనా అనిపిస్తుంటుంది ఒకోసారి" అంది విసుగ్గా.
"నిద్ర లేచిన వెంటనే కూడా దీని నాలుక పదునే " అని మనసులో అనుకుని "సరే నాన్నని ఎన్నింటికి పంపాలో చెప్పు" అని అడిగి ఫోను పెట్టేసింది.
నారాయణ రావు, మహాలక్ష్మి దంపతుల ఇద్దరు సంతానంలో చిన్నది లావణ్య. ఇటు నారాయణ రావు గారు, అటు మహాలక్ష్మి వైపు నుండీ కూడా చిన్న మనవరాలు కావడంతో గారానికి ఏ లోటూ లేదు. చదువు పెద్దగా అబ్బలేదు కానీ చిన్నప్పటి నుండే ఆరిందా మాటలు మాట్లాడుతూ అటు అత్తలు, పెద నాన్న ఇళ్ళకీ, ఇటు మామయ్యలు, పెద్దమ్మల ఇంటికీ తిరుగుతూ ఉండేది.
ఎలాగో కష్టపడి డిగ్రీ పూర్తయ్యిందనిపించగానే చుట్టాల్లోనే ఒక మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు నారాయణరావుగారు. అబ్బాయికి అప్పటికి ఏదో ప్రైవేటు ఉద్యోగం కానీ ఆ తరువాత పంచాయితీ శాఖలో ఉద్యోగం సంపాదించుకున్నాడు.వేణ్ణీళ్ళకి చన్నీళ్ళని లావణ్యకి కూడా ప్రభుత్వం అప్పుడే క్రొత్తగా గ్రామాల్లో ఆరేళ్ళలోపు పిల్లల కోసం ప్రారంభించిన "బాల బడి"లో టీచరుద్యోగం వేయించి తామున్న ఊళ్ళోనే కాపురం పెట్టించారు నారాయణరావు గారు.
భార్యా భర్తలిద్దరికీ ఆ టవును ప్రక్కనున్న చెరొక పళ్ళెటూర్లో ఉద్యోగం, అయినా లావణ్య తల్లి తండ్రుల సహకారం వల్ల అదేమంత పెద్ద సమస్య కాలేదు.
లావణ్య పని చేసే బాల బడిలో ఆమెతో పాటు ఒక అటెండరు, ఇంకొక టీచరు కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేసేవారు.ప్రక్కనున్న రెండు మూడు పల్లెటూర్లలకీ ఈ బాల బడి ఒక ప్రీ స్కూల్ లాంటిదన్నమాట.
ప్రభుత్వం పధకాలు ప్రారంభించినంత ఆర్భాటంగా వాటి అమలు చూడకపోవడం లావణ్య లాంటి ప్రభుత్వోద్యోగులకి ఒక వరం. బాల బడిలో పని చేసే ముగ్గురూ కుమ్మక్కయ్యి వారంలో రెండు మూడు రోజులు మాత్రం ఓ రెండు మూడు గంటలు పనిచేసేవారంతే. రిజిస్టరులో హాజరు మాత్రం రోజూ వస్తున్నట్లు చూపించేవారు
అందుకని లావణ్య ఉద్యోగానికెళ్ళే ఆ రెండు లేదా మూడు రోజులూ వాళ్ళ రెండేళ్ళ పిల్లాడిని అమ్మా వాళ్ళ దగ్గిర వదిలి వెళ్తుండేది. జీతం తీసుకుంటూ ఇలా ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని మహాలక్ష్మికి కోపం. ఎన్నో సార్లు కూతురికి చెప్పి చూసింది కానీ ఫలితం శూన్యం.
చేతిలో నాలుగు డబ్బులు పడేసరికి లావణ్యలో నిర్లక్ష్యం, అహంకారం జంటగా పెరిగి పెద్దవవ్వడం మొదలయ్యి పర్యవసానంగా తల్లి తండ్రులతో సహా పెద్దవారినెవ్వరినీ లెక్క చెయ్యకపోవడం అలవడింది.అత్తగారిని కూడా ఇంటికే రానిచ్చేది కాదు. శేఖర్ ఈ విషయములో లావణ్యకి సర్దిచెప్పాలని ప్రయత్నించి, ఆమె నోటికి భయపడి సర్దుకుపోయాడు.
కూతురు ఉద్యోగానికి వెళ్ళే ఆ మూడ్రోజులూ విసుక్కుంటూనే మహాలక్ష్మి మనవడిని చూసుకునేది.ఇది చాలదన్నట్లు మిగిలిన నాల్రోజుల్లో మూడ్రోజులు మహాలక్ష్మే కూతురికి రెండు పూటలకి సరిపడా భోజనం కూడా పంపించాల్సొచ్చేది.
లావణ్య ఎంతసేపూ కొత్త డిజైన్లలో వచ్చిన బట్టలూ నగలూ కొనుక్కుంటూ రోజంతా టీవీకో, ఫోనుకో అతుక్కుపోయి ఇంటిని కూడా సరిగ్గా పట్టించుకునేది కాదు.
“ఉద్యోగం ఎలాగూ సరిగ్గా చెయ్యావు, ఇంటినైనా చక్కదిద్దుకొవడం నేర్చుకో” అన్నందుకు ఒకసారి మహాలక్ష్మిని "గెటవుట్" అంది లావణ్య.
మనసు కష్టపెట్టుకున్న మహా లక్ష్మి ఇంకెప్పుడూ దాని గుమ్మంలో అడుగుపెట్టను అని నిశ్చయించుకుంది. కానీ కడుపు తీపి నిలువనివ్వలేదు.
“బుజ్జిగాడి కోసమైనా నేను వెళ్ళి దాని ఇల్లు సర్ది, వంట చేసి పెట్టాలి” అనుకుని మళ్ళీ కూతురికి వంట చేసి పంపించడమో లేకపోతే తనే వెళ్ళి చెయ్యడమో మొదలుపెట్టింది.
"నువ్వే దానిని గారం చేసి చెడగొడుతున్నావు, ఒకసారి నువ్వు చెయ్యను అని చెప్పి చూడు. ఉద్యోగం మానెస్తుందో,ఇంకేమి చేస్తుందో దానిష్టం." అని పెద్ద కూతురు ఎంత చెప్పినా కడుపు తీపితో అలా చెయ్యలేకపోయేది మహా లక్ష్మి.
లావణ్య భర్త చంద్ర శేఖర్ కూడా ఉద్యోగ ధర్మం విషయంలో లావణ్యకి తీసిపోడు. ఆఫీసు వారిచ్చే జీతం తీసుకుంటూనే ఓ రెండు మూడు రోజులు మాత్రం ఆఫీసుకెళ్ళి కేవలం సంతకం పెట్టి వచ్చి రియల్ ఎస్టేట్, ఇతరత్రా వ్యాపారాలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు.
బాబూ!,నీ పరిధిలో ఉన్న గ్రామాల్లో పరిశుభ్రత పర్యవేక్షించాల్సిన బాధ్యత నీది. అసలే ఈరోజుల్లో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. జీతం తీసుకుంటూ నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు" అన్న మామగారి హితబోధ మురుగులో పోసిన పన్నీరే అయ్యింది.
ఒక సారి ఆకస్మిక తనిఖీకి వచ్చిన ఆఫీసరు "బాల బడి" మూసి ఉండటం గమనించి పై అధికారులకి ఫిర్యాదు చేయడంతో, ప్రభుత్వోద్యోగి కావడం వల్ల లావణ్య వారం రోజుల్లోగా అధికారుల ఎదుట హాజరయ్యి సంజాయిషి ఇవ్వాలని నోటీసొచ్చింది.
అది చూస్తూనే లావణ్య ఏడుపు మొదలు. "పోనీ లే అమ్మా!,తప్పైపోయిందని ఒప్పుకో,విధులకి క్రమం తప్పకుండా హాజరవుతానని లిఖిత పూర్వకంగా రాసి ఇయ్యి, మహా అయితే ప్రమోషన్లో ఆలశ్యం అవుతుంది అంతే కదా" అని నారాయణరావు గారు ఎంత సముదాయించినా లావణ్య ఏడుపు ఆపట్లేదు.
అప్పుడే ఇంటికొచ్చిన చంద్ర శేఖర్ ఆ నోటీసు చూసి తను అన్నీ చూసుకుంటాను, ఏమీ భయపడద్దని భార్యకి చెప్తే కానీ లావణ్య శాంతించలేదు.
ఆ పై వారం లావణ్య అధికారుల ఎదుట హాజరయ్యి “తను క్రమం తప్ప కుండా ఉద్యోగానికి వస్తుందనీ, ఆ రోజు పిల్లవాడికి ఒంట్లో బాగోలేకపోవడం వల్ల కాస్త లేటుగా వచ్చానని” చెప్పి కావాలంటే గ్రామస్తులని విచారించుకోవచ్చని చెప్పింది.
అప్పటికే చంద్ర శేఖర్ గ్రామస్తులలో ఇద్దరు పెద్ద మనుష్యులకీ, విచారణాధికారులకీ ముట్టచెప్పాల్సినవి ముట్ట చెప్పడం వల్ల అంతా లావణ్యకి అనుకూలంగా జరగడంతో లావణ్యే తిరిగి విచారణాధికారి మీద ఫిర్యాదు చేసింది.
"ఒక స్త్రీ అయ్యుండి సాటి స్త్రీ సమస్యని పట్టించుకోకపోవడమే కాకుండా, అసలు నిజా నిజాలు తెలుసుకోకుండా తన మీద ఫిర్యాదు చేసి తనకి క్లేశం కలిగించింది" అంటూ తమ యూనియన్లో ఫిర్యాదు చేయడంతో పాపం ఏ తప్పూ చెయ్యకపోయినా ఆ అధికారిణే లావణ్యకి క్షమాపణ చెప్పి ఉబికి వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ "ప్రైవేటు ప్లే స్కూళ్ళకి ధీటుగా పేదలకి అందుబాటులో ప్రభుత్వం ప్రారంభించిన ఇలాంటి పధకాలెన్నో మీ లాంటి వారి వల్ల నీరుగారిపోతున్నాయి. ప్రభుత్వోద్యోగి అలసత్వం వల్ల జరిగే నష్టంనీ దాకా వస్తే కానీ నీకు తెలీదు" అనుకుంటూ వెళ్ళిపోయింది.
ఇదేమీ పట్టించుకోని లావణ్య ఆమె వెళ్తున్న వైపు విజయ గర్వంతో చూస్తుండిపోయింది.
ఒక రోజు సాయంత్రం చంద్ర శేఖర్ హుషారుగా ఇంటికొచ్చి తన కొలీగ్ కుమార్ పెళ్ళికి వెళ్ళాలని చెప్పి, ఆ ప్రక్క ఊర్లో ప్రసిద్ధ జలపాతం ఉంది కనుక పెళ్ళి వేడుక ముగిసాకా అది కూడా చూసొస్తే కలిసొస్తుందని సాయంత్రానికల్లా తయారుగా ఉండమని చెప్పాడు. బుజ్జిగాడికి ప్రొద్దున్నుండీ జ్వరంగా ఉండటంతో లావణ్య మొదట అంత ఆసక్తి చూపలేదు కానీ “నువ్వు తప్పక రావాలి” అని శేఖర్ బలవంత పెట్టడంతో పిల్లాడిని అమ్మా వాళ్ళ దగ్గర వదిలి వెళ్దామంది.
“వద్దులే లావణ్యా! ఆఫీసులకి వెళ్ళిన ఆ నాలుగైదు గంటలు వదిలేస్తేనే అత్తయ్య విసుక్కుంటున్నారు ఈ మధ్య. జ్వరమే కదా, మందులు తీసుకెళ్దాము, మూడ్రోజుల్లో వెనక్కి వచ్చేస్తాము కదా, అంతగా అవసరమయితే వెనక్కొచ్చేద్దాము, మహా అయితే నాలుగ్గంటల్లో ఇంటికి చేరుకోగలము " అనడంతో లావణ్యకి ధైర్యం వచ్చింది. మరునాడు ప్రొద్దున్నే స్నేహితులతో కలిసి కుమార్ స్వగ్రామానికి బయలుదేరారు.
సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, బుజ్జిగాడి కేరింతలని ఆస్వాదిస్తూ పదకొండవుతుండగా కుమార్ స్వగ్రామానికి చేరారందరూ.
ఆ మండువా ఇళ్ళు, వీధంతా తీర్చిదిద్దిన ముగ్గులు, వీధిలో ఇంటి ముందర కొబ్బరాకుల పందిరి చూస్తూనే మైమరిచిపోయారు టవును నుండి వచ్చిన పెళ్ళి కుమారుడి స్నేహ బృందం. పెరట్లో గాడిపొయ్యిల్లో పెద్ద గంగాళాల్లో ఉడకగానే లేత అరిటాకుల్లో వచ్చి పడుతున్న వేడి అన్నం, రుచికరమైన కూరలు తినేసరికి మధ్యాహ్నం అందరూ హాయిగా తమ తమ గదుల్లో ఒళ్ళు తెలియకుండా నిద్రపోయారు. సాయంత్రం లేచి చూసేసరికి బుజ్జిగాడు పెళ్ళి కొడుకు కుటుంబ సభ్యులతో హాయిగా ఆడుకుండుటంతో లావణ్య, శేఖర్ ఊపిరి పీల్చుకున్నారు.
"అయ్యో సారీ అండీ, బాగా నిద్ర పట్టేసింది, వీడెప్పుడు లేచాడో అస్సలు తెలీలేదు" అంది లావణ్య కుమార్ వాళ్ళమ్మగారితో సంజాయిషీ ఇస్తున్నట్లు.
"ఫరవాలేదమ్మా, మాకూ కాలక్షేపం. పాపం నువ్వు కూడా ఉద్యోగం చేస్తున్నావుట కదా, ఈ రెండ్రోజులయినా కాస్త రెస్టు తీసుకో" అంది పెళ్ళి కొడుకు కుమార్ తల్లి ఈశ్వరి.
సాయంత్రం అందరూ తయారయ్యి ఊరి చెరువు ఒడ్డున ఉన్న వేణు గోపాలస్వామి గుడికెళ్ళి ఆ పచ్చటి పరిసరాలనీ తమ కెమేరాల్లో బంధిస్తూ స్వఛ్చమైన గాలిని పీలుస్తూ మైమరిచిపోయి ఉండగా గాలివాన వచ్చేటట్లుంది కాబట్టి కుమార్ వాళ్ళ నాన్నగారు సదాశివం గారు వీళ్ళని అర్జెంటుగా ఇంటికి రమ్మన్నారని పాలేరు కబురు తీసుకురావడంతో అందరూ ఇంటి ముఖం పట్టారు.
ఇంటికొచ్చేసరికి ఇంట్లో కరెంటు లేదు. జనరేటర్ ఉంది కానీ ఏదో సమస్య వల్ల అది పనిచెయ్యట్లేదని సదాశివంగారు చిందులు తొక్కుతున్నారు. "అసలు ఈ ప్రభుత్వోద్యోగులకి తమ ఉద్యోగం మీద శ్రద్ధ ఎక్కడుంది? పెద్ద గాలొస్తే ముందు జాగ్రత్తగా కరెంటు తీసెస్తారంతే,మళ్ళీ దాని రాక ఆ భగవంతుడికి కూడా తెలీదు. ఫిర్యాదు చేద్దామంటే కరెంటు ఏ. ఈ. గారు టవునులో కాపరం. అసలు ఎవ్వరూ పట్టించుకోరు" అంటూ రంకెలేస్తున్నారు.
అప్పటికప్పుడు పెట్రోమాక్సు లైట్లు ఏర్పాటు చేసి ఆ వెలుతురులోనే షడ్రసోపేతమైన భోజనాలు వడ్డించారు. తెల్లవారుఝాము ఎప్పుడో కరెంటు వచ్చింది. పెళ్ళికి వాన అడ్డంకి అవుతుందేమో అని అందరూ భయపడ్డారు కానీ మరునాడు ఆకాశంలో సూర్యుడిని చూసి అందరి మనసులూ తేలిక పడ్డాయి.
మరునాడు కుమార్‌ని పెళ్ళి కొడుకుని చేసే కార్యక్రంలో స్నేహ బృందం అంతా ఉత్సాహంగా పాల్గొంది. మధ్యాహ్నానికి బుజ్జిగాడి ఒళ్ళు మళ్ళీ వెచ్చబడడంతో లావణ్య కాస్త కంగారు పడింది కానీ వెంట తెచ్చుకున్న మందులు వేసిన కాసేపటికి వాడు మళ్ళీ హుషారుగా ఆడుకోవడం మొదలెట్టాడు.
ఆ రాత్రి అచ్చ తెలుగు పద్ధతిలో ఫోటోగ్రాఫర్ల హడావిడి కాకుండా చుట్టాలు,ఆప్తుల సందడితో జరిగిన ఆ పెళ్ళిని కుమార్ మిత్ర బృందమంతా ఆస్వాదించింది.
మరునాడు మిత్రులందరూ ఊరికి ఓ నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న జలపాతాన్ని చూడటానికి బయలుదేరారు. వీళ్ళకి తోడుగా కుమార్ వాళ్ళ నాన్నగారు ఒక పాలేరుని పంపించారు.
అక్కడకి చేరుకునేసరికి భారీ వర్షం మొదలవ్వడంతో మిత్ర బృందం వెనక్కి వెళ్దామని బయలుదేరినా ఇరవై కిలో మీటర్లు వెళ్ళేసరికి వాహనం ముందుకు కదలని పరిస్థితి.
అదృష్టవశాత్తూ వాళ్ళు ఒక ఊరిలో చిక్కుబడటం, ఆ ఊరి సర్పంచ్ జోగారావు,సదాశివం గారి స్నేహితుడవ్వడంతో పాలేరు జోగారావుగారితో మాట్లాడి వర్షం తగ్గేవరకూ అందరూ జోగారావుగారింట్లో ఉండే ఏర్పాటు చేసాడు.
భారీ వర్షం అతి భారీ వర్షంగా మార్పు చెందుతోంది,బుజ్జి గాడి ఒళ్ళు కూడా గంట గంటకీ వేడెక్కడం మొదలయ్యింది. లావణ్య ఎన్ని మందులు వేసినా ఇసుమంతయినా మార్పులేదు. ఆ జ్వరానికి తోడు ఏమీ తినకపోవడంతో పిల్లాడు మెల్లిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. సమయం సాయంత్రం మూడు, కానీ కారు మబ్బుల వల్ల రాత్రయిపోయిందా అనిపిస్తోంది.
చంద్ర శేఖర్‌కి కాళ్ళూ చేతులూ ఆడటం లేదు. అక్కడ ఆరోజు వర్షం ఎక్కువ కురిసిందా లావణ్య కళ్ళు ఎక్కువ వర్షించాయా అంటే చెప్పడం కొంచం కష్టమేనేమో కూడా.
కుమార్ వాళ్ళ నాన్నగారికి ఫోను చేద్దామంటే ఫోనుకి సిగ్నల్స్ అందట్లేదు. సర్పంచ్ గారి భార్య వచ్చి పిల్లాడి ఒళ్ళు తడి బట్టతో తుడిస్తే కాస్త జ్వరం తగ్గినట్లే తగ్గి, మళ్ళీ విజృంభించింది. అంత చిన్న పిల్లాడికి అంత జ్వరాన్ని చూసి ఆవిడకీ ఏమి చెయ్యాలో తోచలేదు.
"మీ ఊర్లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఉంది కదండీ,డాక్టర్ గారుండరా?" అని జోగారావు గారిని అడిగాడు చంద్ర శేఖర్ ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ.
జోగారావు గారు చంద్ర శేఖర్‌ని పిచ్చివాడిని చూసినట్లు చూసి "అసలు ప్రభుత్వ ఉద్యోగులు వారానికి ఏ రెండు మూడు రోజులో తప్ప పల్లెటూర్లకి రోజూ ఎందుకు వస్తారయ్యా? టౌన్లలో వాళ్ళ వ్యాపారాలు చూసుకోవద్దూ?" అనడంతో లావణ్యా, చంద్ర శేఖర్లకి ఎవరో చాచి కొట్టినట్లనిపించింది.
చంద్ర శేఖర్ వాచీ చూసుకున్నాడు, సాయంత్రం నాలుగున్నరవుతోంది. పిల్లాడి పరిస్థితి చూసి ఇంక ఉండబట్టలేక వాడిని భుజాన వేసుకుని కారెక్కాడు. లావణ్య అతన్ని అనుసరించింది.
"బాబూ ఈ వర్షానికి రోడ్లవీ బాగోవు, మీ టవును సంగతి అటుంచు, కనీసం కుమార్ వాళ్ళూరు చేరడం కూడా కష్టం ఈ వర్షంలో. కావాలంటే మనిషిని పంపించి డాక్టరు గారి గురించి వాకబు చేయిస్తాను" అన్న జోగారావు గారి మాటలు వర్షం హోరులోనే కలిసిపోయాయి.
హోరున కురుస్తున్న ఆ వాన లోనే అతి లాఘవంగా శేఖర్ కారుని ముందుకు పోనిస్తున్నాడు. ఇలా మెల్లిగా వెళ్ళినా ఓ నాలుగు గంటల్లో టవును చేరుకుని హాస్పిటల్‌కి తీసుకెళ్ళచ్చని లావణ్య ఆశ. ఆమె ఆశలని ఆవిరి చేస్తూ కారు మొరాయించింది.
బయట ఉరుములూ పిడుగులతో భారీ వర్షం, చిమ్మ చీకటి. రోడ్డు మీద నీటి మట్టం క్రమంగా పెరిగితే ఇంక తమకి ఇదే ఆఖరు రాత్రేమో అన్న ఊహే శేఖర్‌కి భయంకరంగా తోచింది.
ఒక గంట అలా భారంగా కారులోనే పిల్లాడితో గడిపారు వారిద్దరూ. ఇంతలో వారి పక్కన ఒక వాహనమొచ్చి ఆగింది.
ఆ వర్షంలోనే ఒకాయన గొడుగేసుకుని వచ్చి వీళ్ళ కార్ డోరు మీద కొట్టి తియ్యమన్నట్లుగా సైగ చేసాడు. ఇద్దరికీ పై ప్రాణాలు పైనే పోయాయి. అతను ఇంకాస్త గట్టిగా కొట్టడంతొ శేఖర్ అద్దం దించి మాట్లాడక తప్పలేదు.
"మీకు లిఫ్టు కావాలా" అని అడిగాడు ఆ గొడుగాయన.
దొంగలు ఇలాగే దోచుకుంటారు అని సినిమాల్లో చూడటం, పేపర్లలో చదవడమే గానీ ఇదే ప్రత్యక్షానుభవం లావణ్యా, శేఖర్‌కి.
లావణ్య భయం భయంగానే “తమ పిల్లాడికి బాగాలేదనీ,అతనికి కావాల్సిన డబ్బు, బంగారం, ఫోన్లూ అన్నీ ఇచ్చేస్తాము తమని వదిలెయ్యమని” చేతులు జోడించింది.
అతను జేబు లోంచి టార్చి లైటు తీసి కారు లోపలకి వేసి చూసి మళ్ళీ జేబులో చెయ్యి పెట్టగానే భార్యా భర్తలిద్దరికీ పై ప్రాణాలు పైనే పోయాయి. అతను ఒక విజింటింగ్ కార్డు తీసి వీళ్ళ చేతిలో పెట్టాడు. దానిలో అతను ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో పని చేసే డాక్టర్ అని చూసి శేఖర్‌కి ప్రాణం లేచొచ్చింది.
వెంటనే కార్ డోర్ తీసి అతన్ని లోపలి రమ్మని సైగ చేసాడు. డాక్టరు గారు పిల్లాడిని పరీక్షించి అర్జెంటుగా సెలైన్ పెట్టాలని చెప్పడంతో “ఇప్పుడున్న పరిస్థితిల్లో మందులు దొరకడమే గొప్ప, ఇంక సెలైన్ ఎలా పెడతాము?” అనుకుని లావణ్య ఆశలు అడుగంటిపోయాయి.
వెంటనే డాక్టరు గారు తన వాహనంలో ఒక మెడికల్ కిట్ ఎప్పుడూ రెడీగా ఉంటుందని చెప్పి వాళ్ళని తన జీప్‌లోకి ఎక్కించి పిల్లాడికి ముందు ఒక ఇంజెక్షన్ చేసి పిల్లాడిని రోడ్డు ప్రక్కనున్న హోటల్ దగ్గరకి తీసుకు వెళ్ళి తలుపు కొట్టగానే వాళ్ళు తలుపుతీసి ఈయనని చూసి చేతులు జోడించి లోపలకి ఆహ్వానించారు.
గుడ్డి దీపాల వెలుతురులోనే డాక్టరు గారు ఎంతో జాగ్రత్తగా పిల్లాడికి సెలైన్ ఎక్కించారు. ఇంతలో ఆ హోటల్ ఆవిడ వేడి వేడి అన్నం, సాంబారు తీసుకొచ్చి వీళ్ళ ముందు పెట్టి తినమన్నట్లు సైగ చేసింది. డాక్టరు గారు మొహమాటం లేకుండా అడిగి వేయించుకుని మరీ తింటున్నారు.
లావణ్య, శేఖర్ మొహమాట పడుతోంటే ఆవిడే కల్పించుకుని "అమ్మా, ఈ డాక్టరు గారు ఈ ఊరికి దేవుడు. వానొచ్చినా, వరదొచ్చినా డ్యూటీ మానడమ్మా! ఇలా ఎంత మందిని కాపాడారో ఆయన. రోజూ రావడమే కాదు తన కార్లో ఎప్పుడూ మందులు పెట్టుకుని తిరుగుతుంటారమ్మా, ఎవరికి ఎక్కడ ఏమి అవసరమో అనుకుంటూ" అని చెప్తోంటే ఆమె భర్త అందుకుని "ఈయన మనసున్న మారాజమ్మా,ఓ సారి ఇలాగే మా అబ్బాయికి జెరం వచ్చింది, టవునుకి వెళ్దామంటే బస్సులు లేవు, అలా బయట నిలబడి ఏ జీపు లాంటిదో దొరక్కపోతుందా అని చూస్తున్న మాకు ఈయనే దేవుడిలా వచ్చి ఇక్కడే వైద్యం చేసారు. అప్పటి నుండీ పేనాలు కాపాడ్డానికి ఈ మారాజు చేస్తున్న పనిలో మేమూ ఏదో ఇలా సాయం చేస్తుంటాం" అని చెప్తోంటే
డాక్టరు గారు కలగ చేసుకుని "మంగమ్మా,వెంకయ్య! ఎవరి ఉద్యోగం వాళ్ళు చెయ్యడం కూడా ఘన కార్యమైనట్లు చెప్తున్నారే,నేను జీతం తీసుకుంటున్నది ఎందుకు?అందరికీ ఆరోగ్యం అందాలనే కదా ప్రభుత్వం మా లాంటి వారిని నియమించింది. సరే కానీ మీ కొడుకు చదువు ఎలా సాగుతోంది?" అని అడిగారు తానేదో ఘన కార్యం చేసానన్న అతిశయం ఏ మాత్రం లేకుండా.
ఇంతలో బుజ్జిగాడు మెల్లిగా కళ్ళు విప్పి చూసాడు. లావణ్యకీ, శేఖర్‌కీ ప్రాణం లేచొచ్చింది. ఈ వర్షంలో ఎలాగూ వెళ్ళలేరు,పిల్లాడికి నిమ్మదించింది కాబట్టి ఈ రాత్రికి ఇక్కడే ఉండమని మంగమ్మ, వెంకయ్య అడగడంతో డాక్టరు గారితో సహా అందరూ ఆ రాత్రికే అక్కడే ఉండిపోయారు.
పడుకున్నారన్నమాటే కానీ లావణ్య, శేఖర్ ఇద్దరిలో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. డాక్టరు గారు కూడా తమ లాగే పల్లెటూళ్ళో ఉద్యోగి, అయినా ఎంతో నిబద్ధతతో ఆయన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తోంటే తామేమో ఉద్యోగానికొచ్చిన మూడ్రోజులో నాల్రోజులో కూడా సరిగ్గా పని చెయ్యరు.
"బాబూ ఊరిలో దుర్గంధం వ్యాపిస్తోంది, కాస్త పూడిక తీయించండి బాబూ, పిల్లలకి జ్వరాలొస్తాయి" అని తన ఆధ్వర్యంలో ఉన్న మూడు గ్రామాల ప్రజలూ ఎంత వేడుకున్నా కానీ శేఖర్ ఏనాడూ వాళ్ళ గోడు విన్నది లేదు. ఈ అపరిశుభ్రత వల్ల వాళ్ళ పిల్లలకి జ్వరాలొచ్చి జరగకూడనిది జరిగితే అన్న ఊహకే శేఖర్‌కి ఒళ్ళు జలదరించింది. ఒకవేళ అలా జరిగితే విచారణాధికారులని మచ్చిక చేసుకునిక్రమ శిక్షణా చర్యలని తప్పించుకుంటాడేమో కానీ తన అంతరాత్మకి సమాధానం చెప్పుకోగలడా?"
తను ఇలా ఆలోచించగలుగుతున్నాడంటే తనలో ఇంకా మానవత్వం మిగిలే ఉందనీ, ఒక సాధారణ డాక్టరు రూపంలో వచ్చిన ఆ మనిషి తన గుండె తడి ఆరిపోలేదని గుర్తు చేసాడు అనిపించింది శేఖర్‌కి.
లావణ్య ఆలోచనలు కూడా దాదాపు అలాగే సాగుతున్నాయి. ఇక మీదట ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. డాక్టరు గారిచ్చిన మందుల వల్ల జ్వరం తగ్గిపోయి ప్రొద్దున్న కల్లా బుజ్జిగాడి మొహం తేటపడింది.
మరునాడు టవునుకి బయలుదేరారు అందరూ. ఇంటికి రాగానే తన తల్లికి ఫోను చేసింది లావణ్య.
తల్లి ఫోనెత్తగానే "నాన్నని రేపు ఎనిమిదింటికల్లా పంపించనా" అని అడిగేసరికి లావణ్యకి సిగ్గేసింది.
"రేపు ఒక్క రోజే రోజే కాదమ్మా , అత్తమ్మ వాళ్ళు వచ్చేవరకూ వీడిని మీరు చూసుకోవాలి, మేమిద్దరమూ రోజూ ఉద్యోగానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము" అంది.
మహా లక్ష్మి ఆశ్చర్యపోయి "రోజూ వెళ్తే శేఖర్ వ్యాపారాలెలా సాగుతాయి? మంచి పని చేస్తున్నారు కానీ ఇంత అకస్మాత్తుగా ఈ నిర్ణయమేమిటి " అని అడిగింది.
"పోతే పోనీ అమ్మా! ఆడంబరాలకి పోకపోతే ఇద్దరికీ వచ్చే సంపాదన చాలు ఇంకో బిడ్డ పుట్టినా హాయిగా పెంచుకోవడానికి. ఉద్యోగాన్ని దైవంలా భావించే ఒక వ్యక్తిని చూసానమ్మా, అందుకే ఈ నిర్ణయం. ఇందాకే అత్తమ్మకి ఫోను చేసాను. ఓ వారం రోజుల్లో ఇద్దరూ మా దగ్గరకి వచ్చేస్తామన్నారు." అన్న కూతురి మాటలు వింటూ మహా లక్ష్మి నోట మాట రాలేదు.
ఏ దైవమో వీరి మనసు మార్చింది అనుకుని ఫోను పెట్టేసి ఎదురుగుండా గోడ మీద ఉన్న దేవుడి పటానికి మనస్ఫూర్తిగా దణ్ణం పెట్టుకుంది మహాలక్ష్మి.
*****