MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వ్యాస మధురాలు
రసికులకనురాగమై...
మల్లాది లక్ష్మణశాస్త్రి
"సృజనకారుని బాధ్యత సృజన. నిజమైన సృజనకారుని ఊపిరి సృజన. ఈ ప్రక్రియ ద్వారా నాకేమిటి, నాకెంత అనుకునేవారు, అలా అనుకునే ప్రాతిపదికతో సృజించలేరు ఎప్పటికీ, ఎంతమాత్రమైనా. సృజనకి ప్రాతిపదిక ఆహ్లాదం. ఆహ్లాద ప్రసారణ సృజనకి అనుబంధ విశేషం. సృజించలేని వానిని రచయిత అనటం భరిస్తున్నవాళ్ళకే కాదు, భాషకీ అవమానమే."
రచనాప్రక్రియలో రచయిత పాత్ర గురించి, పాత్రౌచిత్య ప్రాధాన్యత గురించి మల్లాది లక్ష్మణశాస్రి గారు పంచుకున్న ఈ వ్యాసం చదవండి. మీ ఆలోచనలు ఇలా వ్యాసరూపంలో వేలాది పాఠకులతో పంచుకొనదలుచుకుంటే మీ రచనలని editor@madhuravani.com కి పంపండి. -సంపాదకులు.
కవి కావ్యాన్ని సృజిస్తాడు. గాయకుడు గీతాన్ని ఆలాపిస్తాడు. చిత్రకారుడు చిత్రాన్ని గీస్తాడు. శిల్పి శిల్పాన్ని చెక్కుతాడు. నర్తకి నృత్యం చేస్తుంది. సామాన్యంగా వీరందరూ సౌందర్యంతో అనువర్తనం కలిగిన వారు. అంతే సామాన్యంగా ఈ కళాకారులు తమ హృదయస్పందన వివిధ మాధ్యమాల ద్వారా పాఠకునికి, శ్రోతకి, ప్రేక్షకునికి పంచటానికి ప్రయత్నిస్తారు. సౌందర్యభావం కలిగించాలని కాంక్షిస్తారు. రసానుభూతిలో గ్రహీతలు ఓలలాడటం కళాకారుని మహోన్నత లక్ష్యం. ద్వితీయ తృతీయ లక్ష్యాలుగా గుర్తింపు, పారితోషికాలని చెప్పుకోవచ్చు. రచన కళాకారుడే చేయగలడు. రచించటమే కళ. కళావిహీనమైనది రచన అనిపించుకోదు. కొంత పరిశ్రమతో నేర్చుకోదగ్గ కూసువిద్య మాత్రమే.
రసాత్మకమైనది కళ. ఈ వ్యాసంలో రచన స్వభావం, రచన రసస్ఫోరకమెలా అవుతుంది అని విశ్లేషించుకుని, చివరగా రసగంగలో రచయిత పాత్ర గురించి చర్చించుకుందాం.
కళ, అందం, సౌందర్య దృష్టి (Aesthetics), ఆనందం (సచ్చిదానందం లోని ఆనందం) వంటి సంబంధిత లావణ్య పదాలకి అర్ధం, నిర్వచనం, ప్రయోజనం నిర్ధారించటానికి వేదకాలంనించి ఈరోజు వరకు ఎందరెందరో ఋషులు, తత్వవేత్వలు, లాక్షణికులు, మేధావులు, భాష్యకారులు దేశవిదేశాల్లో విమర్శకులు సంస్కృతం, గ్రీకు లాటిన్ జెర్మన్ ఫ్రెంచి భాషల్లో, ఆంగ్లంలో ఎంతో మేధోమధనం చేసి అనేక ఉద్గ్రంధాలు మనముందుంచారు. అన్ని దేశభాషల్లో లాగానే ఈవిషయం మీద ఆంధ్రంలోనూ చెప్పుకోదగ్గ పరిశోధనలు జరిగాయి. అన్ని సామాజిక శాస్త్ర పరిశోధనలలానే ఇవికూడా సామాన్యుడికందని క్లిష్ట పదజాలంతో మనబోంట్లు ఎంతో సమయం వెచ్చించి బుద్ధి రంగరించినా అంతుపట్టని మసకార్ధాలని మాత్రం ప్రతిపాదించి, మిగతా పరిశోధకుల్లో పసలేదని నిరూపించడానికి చేసే ప్రయత్నాలలాగా గోచరిస్తాయి.
మనం పైన చెప్పకున్న మౌలిక విషయాలపై ఎవరూ చేయనంత లోతుగా తరచి చూచి ఎన్నో వందలమంది తార్కికులని తయారు చేసి తీర్చి దిద్దిన జర్మన్ మేధావి ఇమాన్యుయల్ కాంట్. ఆయన ప్రభావితం చేసిన తత్తవేత్తల్లో హెగెల్, షోపెన్హోవర్, కార్ల్ మార్క్స్ లాటి ప్రపంచ చరిత్రని నిర్దేశించిన చింతకులున్నారు. నీతి, అందం, మతం, జ్ఞాన మీమాంస, తర్కం, ఖగోళశాస్త్రం వంటి అనేక విషయాలపై విస్తృతంగా వ్యాసాలు ప్రచురించిన కాంట్ ని అభిమానించిన వారు ఎంతోమంది ఉన్నారు, విభేదించిన వారు అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆయన ఏంచెప్ప దలచు కున్నాడో అర్ధంకాక జుట్టు పీక్కున్న వారు మరింత ఎక్కువ మంది ఉన్నారు. ఆయన గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. కాంట్ కొంత వయస్సు పైబడ్డాక ఒక స్త్రీని ఇష్టపడ్డాడు. ఆమెని వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది అని విశ్లేషించుకున్నాడు కూడా. దీర్ఘంగా ఆలోచించుకుని లాభనష్టాల పట్టిక తయారు చేసుకుని ఒక్క పిసరు లాభమే ఎక్కువని తీర్మానించుకోవడానికి ఆయనకి నాలుగేళ్ళు పట్టింది. తీరా పెళ్ళిచేసుకుందామని ఆమెని అడగటానికి వెళ్ళేసరికి ఆమెకి పెళ్ళయి ఇద్దరు పిల్లల తల్లని తెలిసింది. మళ్ళీ జీవితంలో పెళ్ళి జోలికే కాదు, స్త్రీల జోలికి కూడా వెళ్ళలేదు.
అందం, ఆనందం విశ్లేషించే వస్తువులు కాదు. పోగు చేసుకునే వస్తువులు అంతకంటే కాదు.
రసాస్వాదన
రసాస్వాదన ఎలా చేయాలో ఒకరు చెపితే చేయగలిగేది కాదు. రసాస్వాదన ఒక అనుభవం. ఎవరికి వారికే పరిమితమయ్యే అనిర్వచనీయమైన స్వానుభవం. అగణనీయ అంతశ్చేతనా వస్తువు.
"రస" అన్న భావం భారతదేశానికే పరిమితమయినదనుకుంటాను. మిగతా దేశాల్లోనూ, భాషల్లోనూ ఈ పదం లేదు. 'రస' ని ఆధారంచేసుకుని మనం అనేక అందమైన సమాసాల్ని, పదబంధాల్ని సృష్టించుకుని నిత్యజీవితంలో వాడుకుంటున్నాము. రసోత్పత్తి, రసానుభూతి, రసగంగ, నవరసాలు, రసికత, రసికుడు వగైరా ఎన్నెన్నో.
రసం ఒక అభిలషణీయ అనుభూతి అన్న ప్రా థమికం నుంచి మనం మొదలు పెట్టవచ్చనుకుంటాను. రచయిత రసం పండిస్తే పాఠకుడు చేరువై రసాన్ని అందుకుని ఆస్వాదిస్తాడు. రసవిహీన రచనలు అతనికి నీటికినోచుకోని ఎడారి వంటివి. రచన మాధ్యమంగా రచయిత పాఠకుడిని రసంతో ద్రవింప చేస్తాడు. ఎండుతున్న క్షేత్రంలో చినుకులు కురిపిస్తాడు. రచయితని పాఠకుడిని చేరువ చేసే సూత్రం రసం. రచయిత ఎంత ఎక్కువ రసాన్ని రచనలో జొప్పించగలిగితే అంత ఎక్కువగా పాఠకుడు రచనతో మమేకమవుతాడు. ఇక్కడ మనం కవి, కథకుడు, గాయకుడు, శిల్పి, నర్తకుడు వంటి అందరు కళాకారుల్నీ, సృజనకారుల్నీ రచయిత అనే పేర్కొంటున్నాము. అలానే శ్రోత, ప్రేక్షకుడు, పాఠకుడు బదులుగా పాఠకుడు అన్న సామాన్య పదం వాడుతున్నాము.
తిండి, బట్ట, నిలువనీడ శరీర పోషణార్ధం మనిషి సమకూర్చుకుంటాడు. కనీస స్థాయిలో ప్రా థమిక అవసరాలు సమకూరిన తరువాత మనిషి కాంక్షించేది రసం. ఆజీవన పర్యంతం మనుజుడు తపించేది కూడా రసం కోసమే. పశుపక్ష్యాదులు తిండి, గూడుని మించి ఇంకేమీ కోరుకోవు. సంతానోత్పత్తి కూడా యథాలాపంగా జరిగిపోతుంది. రసకాంక్ష మనిషిని పశువునుంచి వేరుగా నిలబెడుతుంది. రచింప చేసే శక్తి, రచనని చదివింపచేసే శక్తి కూడా రసకాంక్షలోంచే ఉత్పన్నమౌతాయి.
వేదకాల ఋషులు నిస్సంశయంగా గొప్ప తార్కికులు, దార్శనికులు. క్రమేపీ దార్శనికత సత్యశోధనకీ మార్మికతకీ దారులు చూపింది. అంతస్సంతుష్టతకి పెద్దపీట వేసిన సనాతన సమాజం బాహ్య ప్రపంచ విశ్లేషణని పెద్దగా పట్టించుకోలేదు. రంగు రాళ్ళు పోగుచేసుకోవటం వంటి బాల్యక్రీడలలో జీవితాలు వ్యర్ధం చేసుకోలేదు.
ప్రాచ్యం ప్రపంచానికి బుద్ధుల్నీ ఉపనిషత్తుల్నీ కానుకగా ఇస్తే, పశ్చిమం తత్వశాస్త్రాన్ని, తద్వారా సామాన్య శాస్త్రాన్ని పెంపొందించింది.
'రస' అన్న పదం ఋగ్వేద సామవేదాల్లో ఉన్నా దాన్ని ప్రధమంగా నిర్వచించింది క్రీస్తు పూర్వం 200-300 ప్రాంతాల్లో నాట్యం శాస్త్రం రచించిన భరతముని. బహుశా భారతీయులే రస అన్న అపూర్వపదాన్ని సృష్టించి, అంత అందమైన అంతరార్ధం ఆపాదించగల సమర్ధులు. నిత్య జీవితంలో 'రస' ఎంత మౌలికమైన భావనో, మనిషి మనస్సు 'రస' కేంద్రబిందువుగా ఎలా సంచరిస్తుందో దర్శించగలిగారు.
విభావా౽నుభావ వ్యభిచారి సంయోగా ద్రసనిష్పత్తిః
అన్నాడు భరతముని. తరువాతి శతాబ్దాలలో అనేకమంది భాష్యకారులు భరతముని వాక్యానికి అర్ధాలు చెపుతూ రసాన్ని, రసం యొక్క భావాన్ని పరిపుష్టం చేయటానికి ప్రయత్నం చేశారు. చివరిగా క్రీస్తు శకం 1000 ప్రాంతంలో కాశ్మీరీ శైవ తాంత్రిక తత్వవేత్త అభినవ గుప్తుడు నాట్య శాస్త్రానికి భాష్యం చెపుతూ సంయోగం, నిష్పత్తి అన్న పదాలకి చక్కని అర్థం చెప్పి చివరిగా రసం సహృదయ నిష్టం అంటాడు. రసజ్ఞులు భాష్యాలు చెప్పరు. భాష్యాలు చెప్పబూనేవారికి పాండిత్య ప్రకర్ష ఎక్కువ, రసాస్వాదనాపిపాస తక్కువ. పాండిత్యం, పరమార్ధం పుష్కలంగా పుణికి పుచ్చుకున్న అభినవ గుప్తుని వంటి వారు అరుదుగా జన్మిస్తారు.
తంత్రానికి రసానికి అవినాభావ సంబంధం ఉంది, పరమ హంసలకి రసానికి ఉన్నట్లుగా. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి పరవశత్వంలో 'పిబరే రామరసం' అంటారు.
ఇంతకీ రసం ఎక్కడినుంచి అవిర్భవిస్తోంది? రచయిత కలం నుంచా, రచన స్వరూపం నుంచా, ప్రేక్షకుడి హృదయం నించా? రచన నుంచి కాదు. రచన ఒక నిర్జీవ పదార్థం. శిల్పం, సినిమా, కాగితం, టీవీ స్క్రీన్, నిర్జీవాలు. పాషాణల్లో, శవాల్లో ఆర్ద్రత ఉండదు. ప్రేక్షకుడి సమక్షంలో కేవలం రచన ఉంది. రచయిత లేడు. ఒక నిర్జీవ వస్తువు రసానికి ప్రేరకం కావచ్చు, ఉత్పాదకం కాలేదు.
రసోద్భవం ప్రేక్షకుడి గుండెల్లో సంభవించే సజీవ ప్రక్రియ. శ్రోత తన్మయత్వంలో ఒక అంశ. పాఠకుడి లగ్నతకి ప్రతీక.
రచన- రచయిత -పాఠకుడు త్రిపుటిలో ఎప్పుడూ పాఠకుడిదే మకుటం. అతనే రారాజు. సర్వ హక్కులూ అతనివే. నిర్ణేత అతనే, భోక్త అతనే. అతని రసానుభూతికి మౌలికంగా అతనే కారణం.
రచనలో పాఠకుడిని రసోన్ముఖుని చేసే ప్రేరకాలు అవశ్యం ఉన్నాయి. కానీ ఆ ప్రేరకాలకి నిశ్చలత్వం, కచ్చితత్వం, నిబద్ధత లేవు. ఎప్పుడు ఎంత ఏరసం అతని హృదయం లోంచి ఆ రచన ద్వారా ఉత్పన్నం అవుతుందనేది కేవలం పాఠకుడి మానసిక స్థితిగతుల పైన, సంస్కారం పైన మాత్రమే ఆధార పడుతుంది. ఒకానొక కాలంలో ఒక సమాజంలో ఒకానొక వర్గంలో కొంతమందిని 'న భూతో న భవిష్యతి' ప్రమాణాల్లో ప్రభావితం(రసోత్పత్తికారకం) చేసిన రచన, కావ్యం (కావ్యానికి నిర్వచనం ఇదే అని పండితులు నిర్ధారించిన పద్య సంపుటో, గద్య సంపుటో, గేయసంకలనమో), శిల్పం, చిత్రం, నృత్యరూపకం వగైరా ఎన్నెన్నో ఇంకొక కాలంలో, ఇంకో సమాజంలో పరమ పేలవమైనవిగా తీర్మానింపబడవచ్చు.
నేను తెలుగు దేవదాసు సినిమా పదిమాట్లు చూసి ఉండవచ్చు సీటుకతుక్కుపోయి ఆనాడు. పది నిముషాలుకూడా చూడలేకపోవచ్చు పిల్లలు పుసుక్కు పుసుక్కుమని నవ్వకుండా ఈనాడు. స్వానుభవం.
వేలమంది తోసుకుతోసుకు సెల్ఫీలు తీసుకుతీసుకు లూవర్ మ్యూజియంలో ఆస్వాదించవచ్చు మోనాలీసాని. అందం, ఆకారం లేని ఈ చిత్రానికోసం ఇంత పైత్యమేమిటనిపించవచ్చు నాకు. అనిపించింది కూడా. స్పందన వ్యక్తి మనోసామ్రాజ్యానికి స్థిమితమైన ఆంతరంగిక అనుభూతి.
తిండికి లేక వందరూపాయలకి వాన్ గోగ్ అమ్ముకున్న చిత్రం ఆయన గతించిన వంద సంవత్సరాలకి వందకోట్లు పలికింది, చిత్రం.
సృజనకారుని బాధ్యత సృజన. నిజమైన సృజనకారుని ఊపిరి సృజన. ఈ ప్రక్రియ ద్వారా నాకేమిటి, నాకెంత అనుకునేవారు, అలా అనుకునే ప్రాతిపదికతో సృజించలేరు ఎప్పటికీ, ఎంతమాత్రమైనా.
బల్ల మీద కుప్ప పోసి ఉన్న జిగ్ సా ముక్కలతో పజిల్ పూర్తి చేయడం సృజన కాదు.
ఉన్న పేకముక్కలతో కొత్త గాలిమేడ కట్టటం సృజన అనిపించుకోదు.
సృజనకి ప్రాతిపదిక ఆహ్లాదం. ఆహ్లాద ప్రసారణ సృజనకి అనుబంధ విశేషం. సృజించలేని వానిని రచయిత అనటం భరిస్తున్న వాళ్ళకే కాదు, భాషకీ అవమానమే.
రచన సృజన పర్యాయపదాలు.
అనిర్వచనీయమైన అపరిమిత ఆనందం రసం అన్నాడు శాస్త్ర కారుడు.
సృజింపబడిన కళావస్తువులో ప్రేక్టకుడు పరిపూర్ణంగా నిమగ్నత చెంది స్థాయీపరంగా తీవ్రతని స్పృశిస్తే కలిగే ఆనందానుభూతి రసం అన్నాడు భరతముని. శృంగారం, వీరం, కరుణ, అద్భుతం, హాస్యం, భయానకం, భీభత్సం, రౌద్రం రసాలంటూనే రసానికి నిర్వచనం అపరిమితానందం అంటున్నాడు! లోతుగా చూస్తే నవరసాలనబడేవి రసాలు కాదు. శృంగార వీర కరుణాదులు ప్రేక్షకుని ఆనందస్థాయికి చేర్చగలిగితేనే రసాలనబడతాయి. రసం ఒకటే. మార్గాలు వర్గీకరణ చెయ్యబడ్డ తొమ్మిది. భయమో జుగుప్సో కలగచేసినంత మాత్రాన వాటికి రసమమనబడే స్థాయి రాదు. గమ్యం ఒకటే, నవరసాలు మార్గాలు. శాస్త్ర పరిభాషలో స్థాయీభావాన్ని ప్రేక్షకుని హృదయంలో ఉదయింప చేయటానికి కారకం 'విభావం'. విభావం ఆలంబనతో మొదలయి ఉద్దీపనతో ముగుస్తుంది. ఈ ప్రక్రియలో కొన్ని సంచారభావాలు ఉదయిస్తూ, సమసిపోతూ ఉద్దీపనకి తోడ్పడతాయి. రచనయినా, శిల్పమయినా, నృత్యమయినా, గానమయినా ఈ విభావం అంతర్గతంగా ఉండితీరాలి. నానృషిః కురుతే కావ్యం.
రచయితగా కృతార్ధత చెందాలనుకునే ప్రతి వ్యక్తి ప్రేక్షకుని ఒక సార్వభౌమునిగా చిత్రీకరించుకోవాలి. సార్వభౌముని ఆనందం కోసం, మెప్పుకోసం అనేకమంది కళాకారులు కొలువులో ప్రదర్శనలిస్తారు, కానీ కృతార్ధులయేది ఏకొద్దిమందో.
ఇంచుక భాషా పరిజ్ఞానం ఉన్నంత మాత్రానో, ఛందోజ్ఞానం ఉన్నంత మాత్రానో రచయిత తను పాఠకుడికంటే ఉన్నతుడనుకుంటే అది అవివేకం అవుతుంది. పాఠకుడిదెప్పుడూ ఉన్నతాసనమే. పాఠకుని రసోత్పత్తికి కారకమవలేకపోతే రచయిత యొక్క అభ్యాసం, కృషి నిరర్ధకాలు. రాజుగారిని మెప్పించలేని గారడీ విద్యలు.
పద్ధతిగా పాట పాడాలన్నా, కలంపట్టి కవిత్వం చెప్పాలన్నా, ఉలిపట్టి శిల్పం చెక్కాలన్నా, గజ్జెకట్టి నృత్యం చేయాలన్నా, కుంచె పట్టి చిత్రం గీయాలన్నా, కొంచెమయినా ఆడే చలనచిత్రం తీయాలన్నా సంవత్సరాల కృషి ఆవశ్యకం. వీరందరి పరమోద్దేశం రసోత్పత్తి గావించటమే. రసం పండిస్తేనే కళాకారు లనబడతారు. రసోత్పత్తి గావించలేనివి పొట్టకూటి విద్యలు కళలు కావు, కుప్పిగంతులు. సినిమాల్లో ఎక్స్ట్రా వేషాలు వేసేవారినీ మనం కళాకారులనే అంటాము మర్యాదపూర్వకంగా.
కళ ఏమాత్రం లేకపోయినా రచన పాఠకుడికి నచ్చవచ్చు. జుగుప్సాకర సినిమాలు కూడా డబ్బులు చేసుకున్నట్లు. ఇక్కడో చిన్న విశేషం. నవరసాల్లో ఒకటయిన భీభత్స రసపు ఏకైక లక్ష్యం జుగుప్స రేకెత్తించడం!
ఇప్పటివరకూ మనం కళ, రసం అన్న పదాలని వాటి ఉన్నతమైన అర్ధాలతో మాట్లాడుకున్నాం. వాస్తవానికి అధికాంశ రచయితలు కళాకారులు కాదు. ఆ సంగతి వారికి లోలోపల తెలుసు, కొంచెమైనా ఆలోచించే వారైతే. జనాదరణ పొందే సినిమాలు తీసేవారుకూడా మా సినిమాలు కళాఖండాలు అనరు, అనుకోరు. కళ వేరు, సాంకేతికత వేరు. సౌందర్యం వేరు, చాకచక్యం వేరు. ప్రజల గుండెల్లోకి ప్రవేశించటం వేరు, ప్రేక్షకుడి నాడి తెలిసుకుని పబ్బం చేసు కోవడం వేరు.
పుంఖానుపుంఖాలుగా రచనలు, సినిమాలు, సీరియళ్ళు ప్రవహిస్తూనే ఉన్నాయి. అమాయక ప్రజలు డబ్బు వెచ్చించి చూస్తూనే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వినోద పరిశ్రమ వందల బిలియన్ల డాలర్లు పోగుచేసుకుంటూ ప్రవర్ధమానమౌతోంది. ఎందుకని? అంతే వేగంతో చూపించేవారిలో కళాభినివేశం, చూసేవారిలో రసపరాకాష్టానుభూత్యవకాశాలు కృశిస్తున్నాయి. ఎందుకీ విరోధాభాస?
రసం సహృదయ నిష్టం.
అభినవగుప్తుడు రస పరాకాష్ట పొందటానికి ప్రేక్షకుడు 'సహృదయ స్థితి' లో ఉండాలంటాడు. స్థూలంగా చెప్పుకోవాలంటే రసహృదయుడైన కవి తన కళాభినివేశాన్ని తన రచనలో జొప్పిస్తే, రసహృదయుడైన పాఠకుడు రసాన్ని జొప్పించినదానికంటే మరింతగా జుర్రుకోవాలి. ఉపనిషత్కాలంలో ఎక్కువమంది సహృదయులు ఉండే వారేమో! కలి విజృంభణతో సమాంతరంగా సహృదయం కనుమరుగైపోవటం కాలధర్మమేమో. ఈకాలంలో వినోదపరిశ్రమ ప్రజలకి ఎవరికి కావలిసిన రసం వారికి పుష్కలంగా అందిస్తూనే ఉంది. కానీ నిశ్చయంగా స్థాయీపర తీవ్రత జనింపచేసి రసపరాకాష్టకి చేర్చి అపరిమితానంద స్థితికి దారి చూపించటంలేదు.
ఈ కాలంలోనైనా, ఆ కాలంలోనైనా రసానికి మానవుడు ఆకర్షితుడే. రసవాంఛ మానవ ప్రవృత్తి. ఎటువంటి రసవాంఛ తనలో పడగెత్తింది, తను ఈక్షణంలో వాంఛిస్తున్న రసం అందిన తర్వాత అంతరంగంలో ఏం మార్పులు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, పరాకాష్టకి చేరని రసోత్పాతం వలన ఉనికికి మేలుజరుగుతోందా కీడు జరుగుతోందా అన్న ప్రశ్నలు సామాన్యునికి అసందర్భం, అనూహ్యం. భీభత్స రసం కావలిసిన వారికి భీభత్స రసం పోయటమే పరిశ్రమ లక్ష్యం, విజయకారణం. అలానే భయానకం, శృంగారం, వీరం, రౌద్రం.
శృంగారరసం ఉద్దేశం రతికాంక్షని ప్రేరేపించటం, రౌద్రరసం ఉద్దేశం కోపాన్ని ప్రేరేపించటం. ఈ రసాలు కొన్ని తరగతుల ప్రేక్షకులు, కొన్ని సందర్భాల్లో అపస్మారకంగా కాంక్షిస్తారు. నాడితెలిసిన సినీ నిర్మాతలు ప్రజలకి ఈరసాలని పుష్కలంగా అందించి తమ జేబులు నింపుకుంటారు. ఈనాటి సాహిత్యం, సినిమాలు, టీవీ కార్యక్రమాలు సమాజంలో సింహభాగాన్ని ముఖ్యంగా యువతని ఎలా ప్రభావితం చేస్తోందో, ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి దుష్పరిణామాలకి దారి తీస్తోందో వివరించవలసిన పనిలేదు.
ఋషులు అప్పటి మనిషి మస్తిష్కంలో లేశమాత్రం ఉన్న ఆవేశం, దుఃఖం, కోపం, భయం, జుగుప్స వంటి భావాల్ని నిర్మూలించి వ్యక్తి సత్యాన్వేషణా మార్గాన్ని సుగమం చేయటానికి నాట్యం వంటి ప్రక్రియలని రూపకల్పన చేసి, సవివరంగా క్రమబద్ధీకరించేందుకు శాస్త్రాలు రచించారు. భరతముని నాట్యశాస్త్రం అటువంటి ఒక ప్రమాణ గ్రంధం. ఉష్ణం ఉష్ణేన శీతలం అన్న ప్రాథమిక సూత్రం మీద వారి కార్యాచరణ పధకం రచించబడినది. ఆకాలపు ప్రజలు స్వభావసిద్ధంగా సున్నిత మనస్కులు, శాంత స్వభావులు, శాంతి కాములు. అల్లకల్లోలమైన ఆలోచనలు లేక ధ్యానమగ్నులో, ధ్యాన సంసిద్ధులో అయి ఉండేవారు. రౌద్రరసాన్ని అభినయిస్తున్న నర్తకి భావజాలంతో అనురాగం, అను రాగం, పొంది తమలో దాగి ఉన్న కోపఛాయల్ని పరిపూర్ణ స్పృహతో ఉద్దీపనం చేసుకునే వారు. స్థాయీపరంగా తీవ్రతరం చేసుకునే వారు. వంద డిగ్రీలు వేడెక్కిన నీరు ఆవిరయిపోయినట్లు కోపం సమసిపోయేది. రసాభ్యంగనం వలన కల్మష విముక్తి తటస్థించేది. తత్స్వరూపంగా అపరిమిత ఆహ్లాదం కలిగేది. సచ్చిదానందం సంగ్రహావలోకనం అయేది.
రసాలు ఎనిమిదిగా వర్గీకరించాడు భరతముని. శృంగారవీరకరుణాద్భుత హాస్యభయానక భీభత్సరౌద్రాలు. అష్టరసాలకే అభినవగుప్తుని వరకు భాష్యకారులు భాష్యాలు రాశారు. శిల్పశాస్త్రంలోను, కావ్యాలలోనూ అష్ట రసాలనే ఉటంకించారు. క్రీస్తు తర్వాత అయిదారువందల సంవత్సరాలకి పండితులు ఎందుకనో శాంతాన్ని రసంగా నిర్వచించి అష్టరసాలకి శాంతరసాన్ని జోడించి నవరసాలు చేశారు. అదెందుకో సవ్యంగా తోచదు. శాంతంతో శాంతాన్ని నిర్మూలించటానికి శాంతమేమీ ముల్లువంటిది కాదు. శాంతము అవాంఛనీయమూ కాదు. శాంతం మనిషి సహజ స్వభావం. సత్వగుణ నిరూపణం. మిగతారసాలన్నీ వికారాలు.
రసాలు, అవి పండించే తీరు, ప్రేక్షకులపై వాటి ప్రభావ పర్యవసానాలు నాట్యంలో నప్పినంతగా గ్రంధరచనకి నప్పవు.
తను రాస్తున్న గ్రంధం ఎలా రూపు దిద్దుకుంటుందో రచయితకి తెలియదు. పూర్తి అయిన తర్వాత అది ఎప్పుడు ఎవరి కంట పడుతుందో తెలియదు. వారు ఎలా స్పందిస్తారో అంతకన్నా తెలియదు. చిత్రకారునిదీ, శిల్పకారునిదీ అదే పరిస్థితి. రచయిత, రచన, ప్రేక్షకుడు వేరు వేరుఅక్షాంశ తులాంశాల్లో వేరు వేరు సమయాల్లో ఉంటారు. కరుణరసం ఉద్దేశించి రాసిన పద్యంలో ప్రేక్షకుడు వీరరసం చూడవచ్చు. ఇంకో సమయంలో అతనికి హాస్యం కనిపించవచ్చు. ఇది సంభావ్యతే కాదు, తథ్యం కూడా.
నాట్యం పోకడ వేరు. నర్తకి, నాట్యం, ప్రేక్షకుడు ఒకరికోసం ఒకరన్నట్లు మమేకమవుతారు. ముగ్గురిలో ఏ ఒక్కరు లేకపోయినా మిగతా ఇద్దరూ లేరు. ప్రేక్షకునికి అనుగుణంగా నర్తకి, నర్తకి నుంచి నాట్యం, నాట్యానికి అనుగుణంగా ప్రేక్షకుడు పరస్పరం స్పందిస్తారు. నర్తకికి, ప్రేక్షకునికి మధ్య యవనిక ఉంటే నాట్యం లేదు. నాట్యంలో ప్రతి భంగిమ ఒక చిత్రకారుడు గీసిన చిత్రం, ప్రతి జతి ఒక పద్యం, సృష్టి స్థితిలయల సమాహారం. నాట్యం నటరాజస్వామి విశ్వరూపం. ప్రేక్షకుని రససిద్ధికి సులభతరమైన సోపానం.
రచయితకి పద్యాన్ని ఫలానా రసాన్ని పండించే ఉద్దేశంతో రాస్తున్నాననుకునే హక్కు తప్పకుండా ఉంది. కానీ ఈ పద్యంలో ఈరసం ఉంది చూడండి అనకూడదు. తను ఉద్దేశించిన రసం పాఠకుడికి చేరటంకంటే చేరకపోవటానికి ఎక్కువ అవకాశాలున్నాయని గుర్తించాలి.
వేద కాలంలోను, ఉపనిషత్కాలంలోను, మరో ఏడెనిమిది వందల ఏండ్ల వరకూ ఋషులు ఆత్మానందమే ఆలంబనగా రచనలు చేసేవారు. అప్రయత్నంగా ఇంపైన ఛందస్సుతో గానయోగ్యంగా మంత్రాలు, శ్లోకాలు వారి ముఖతా వెలువడేవి. కొన్నివేల తరాలు, కొన్ని పదుల సహస్రాబ్దాలు నిలిచిపోయి మానవాళి చరిత్రని వికాసంవైపు పయనింపచేసే శక్తివంతంగా. కొన్ని వేలరచనలు కాలగర్భంలో కలిసిపోయినా, మన సుకృతం కొద్ది మిగిలిన ఆణిముత్యాలు ఈరోజుకీ భారతీయుల నోళ్ళల్లో నానుతూనే ఉన్నాయి. దైవసమానులైన ఆ మహనీయులు తమపేరుని కానీ రచనాసమయాన్ని కాని ఉద్దేశపూర్వకంగా చెప్పలేదు. రచనలని వారు రాయలేదు. కేవలం గానంచేశారు. లిఖితమైతే మంత్రవస్తువు శక్తిని కోల్పోతుందని వారికి తెలుసు. ముఖతా మరో శ్రోతకి శృతిరూపేణా చేరవలసినవే. ఇంత ఔన్నత్యం కలిగిన రచయితలు కాని, ఇంత ప్రగాఢత్వం, నిగూఢ సత్యం కలిగిన రచనలుకాని మరే దేశంలోను, మరే కాలంలోను రాలేదు. రాలేవు. ఉపనిషత్తులు చెప్పని, చెప్పలేని, చెప్పటానికి మిగిల్చిన సత్యవస్తువు ఏదీ లేదు. కనుకనే మనం ఉపనిషత్తుల్ని అపౌరుషేయాలు అని ముద్దుగా పిల్చుకుంటాం.
క్రీస్తు తర్వాతకాలం
తమ ఆత్మానందం సాక్షిగా మానవాళికి మంచి చేద్దాం, వాళ్ళకి అర్ధమయే భాషలో ఉపనిషత్సారం అందచేద్దాం అనే సదుద్దేశంతో రచయితలు రచనలు చేశారు. సుందరమైన కల్పనలు చేశారు. చక్కని కవిత్వం రాశారు. వచనకవిత్వం జోడించారు. ఛందస్సుని పాటించారు. తాళపత్రాలపై లిఖించారు. తత్కాల రచయితలందరూ తమ తమ పూర్వ రచయితలని గౌరవించి వారి కల్పనలని కొనసాగిస్తూ కొత్త కల్పనలని జోడించారు. ఫలస్వరూపంగా మనకి వేదకాలంనాటి ఇంద్రుడు, రుద్రుడు వరుణుడు, అగ్ని, సవితుడు వంటి రసవిహీన కర్మకాండప్రధాన దేవతల స్థానంలో రసవత్తరమైన అనేక దేవీ దేవతలు సాక్షాత్కారమయ్యారు. అవే అష్టాదశ పురాణాలు. అయిదారు వందలసంవత్సరాల అంతరంలో కొన్ని వందలమంది రచయితలు కూర్చిపేర్చిన మహా కావ్యాలు. ఏపురాణం చదివినా మిగతా అన్ని పురాణాలతో అందంగా అతుకుతుంది. ప్రతి పురాణంలోని ప్రతి పాత్ర సజీవత్వం మిగతా పురాణాల్లో బలోపేతం అవుతూ ఉంటుంది. అంతటి మహోద్భవ మహత్తర లోక కల్యాణోద్దేశ సృష్టి న భూతో న భవిష్యతి. నేను భారతీయుణ్ణి అని గర్వపడటానికి అంతకి మించిన కారణం కలికానికి దొరుకుతుందా? పురాణకర్తలందరూ వ్యాసులే!
అష్టాదశ పురాణ కర్తలు కూడా తమ పేర్లు, రచనాకాలం, తరువాతి తరాలవారికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. లోకకల్యాణం సంకల్పించి. ఆ కాలంలోనే ఆ మహనీయుల ఆశీర్వాదం వలనే
రాముడుద్భవించినాడు రఘుకులమ్మునా
స్వాగతం కృష్ణా శరణాగతం శరణాగతం కృష్ణా
ఆ తరువాత కవులు కొంచెం సమాజానికి మంచి చేదామనే తలంపుతో పాటుగా కొంత గుర్తింపు కూడా కోరుకున్నారు. పురాణాల కథల్నే సుందరంగా ప్రబంధాలుగా, మహా కావ్యాలుగా మలిచారు. వేయి వసంతాలయినా వారి కవితా పటిమకి సాటిలేరెవరు అన్న రీతిలో. ఇంకో కాళిదాసు పుడతాడని ఆశించటం దురాశవదూ?
అటు పిమ్మట కవులకి, కవిత్వం పాఠశాలల్లో నేర్చుకున్న కవులకి, గుర్తింపు కన్నా పారితోషికం ముఖ్యంగా తోచింది. ఏ రాజు ఎక్కువ సొమ్ము ముట్టచెపితే కావ్యం ఆరాజుకే అంకితం.
ఇప్పటి రచయితలకి కొందరికి పారితోషికమే పరమావధి. ఎంత సంపాదిస్తున్నామనేదే గుర్తింపు. సంపాదనకి మించిన ఆత్మానందం ఉంటుందా? నవల రాసినా సినిమా తీసినా నలుగురినెలా ఆకట్టుకోవాలన్నదే ఆశయం. విజయానికి సూత్రప్రాయంగా మూడు మెట్లు. మొదటగా ఎటువంటి ప్రేక్షకులకోసం రచన ఉద్దేశింపబడిందో కచ్చితంగా నిర్ధారించుకోవటం, రెండు వారు ఏయేరసాలు ఏయేమోతాదుల్లో కలబోసి అందిస్తే ఆత్రంగా అందుకుంటారో లెక్క కట్టటం, మూడు, అతిముఖ్యమైనది, తమ పూర్వానుభవం, చాకచక్యం రంగరించి, చరిత్ర అధ్యయనం చేసి రస బాణాలు ఎక్కుపెట్టి వదలటం. ఉదాహరణకి కరుణ, రౌద్రం, శృంగారం, హాస్యం 4:3:2:1 నిష్పత్తిలో పంచితే ఒక తరహా ప్రేక్షకులు అందుకోవచ్చు. ప్రేక్షకుని కళ్ళముందు కదలాడే పాత్రలు ప్రాణమున్న వ్యక్తులు అని భ్రమింప చేసేటట్లుగా రూపకల్పన చేయటం అత్యంత ముఖ్యమైన ప్రా థమిక సోపానం.
అర్ధ శతాబ్దంగా భారతీయుల చేతనత్వంలో భాగమైన షోలే సినిమా వలన ఏమైనా సామాజిక ప్రయోజనం ఒనగూడిందా? ఆసినిమా నిర్మాతలు ప్రజలకి ఏదైనా శక్తివంతమైన సందేశం అందించారా? మహాభారతంలో సందేశం ఉందా? ఒకవేళ ఉంటే తరతరాలుగా భారతం వింటున్న ప్రజలు ఆ సందేశం జీర్ణించుకున్నారా?
రక్తపాతం, సెక్సు, భీభత్సం, భయానకం చూడటానికి ఒకవర్గం ప్రేక్షకులు క్యూలు కడతారని గమనించి అటువంటి ఫార్ములా సినిమాలు, వెబ్ సిరీసులు దర్శకనిర్మాతలు సమాజోద్ధరణకోసం తీస్తున్నారా?
కొంతమంది నవలా రచయితలు, సినీ దర్శకులు మేధావులతో, విమర్శకులతో పాల్గొన్న చర్చల్లో కథలో 'సందేశం' ఎలా జొప్పించాలి అని వాదోపవాదాలు చెయ్యడం చూస్తుంటాము. ఎంత మేరకు సందేశం ఉండాలి, కథలో అంతర్లీనంగా ఉండాలా, పాత్రచేత చెప్పించాలా? నిఖార్సైన హాస్యం.
షడ్రిపులు
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు మనలో దాగి ఉండే ఆరు శత్రువులని శాస్త్రాలు చెపుతున్నాయి. బయటి శత్రువులు మహా అయితే శారీరకంగా హాని చేయగలరు కానీ ఈ ఆరుగురు అరిషడ్వర్గమనే అంతశ్శత్రువులు కలిసికట్టుగా మనని హింసిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తాయి. చాపకింద నీరులా ఇవి విస్తరిస్తూ వాటి ఉనికిని మనం గుర్తించకుండా జాగ్రత్త పడుతూ మనసులో విషబీజాలు నాటుతాయి. భగవంతుడికీ మనకీ దూరాన్ని పెంచుతాయి. ప్రారబ్ధ కర్మల్ని బలోపేతం చేస్తాయి. మోక్షమార్గం వైపు కన్ను తిప్పనివ్వవు. అన్నీ నేనే చేస్తున్నానని భ్రమింపచేస్తూ ఎందుకిన్ని తప్పులు చేస్తున్నాననే దుఃఖాన్ని పోగుచేయిస్తాయి. ఈ రహస్యం తెలిసిన విజ్ఞుడు అరిషడ్వర్గాన్ని దూరంగా ఉంచుతాడు. పాము పడగ లేపినవెంటనే జాగ్రత్త పడతాడు. శత్రువుల్ని నిర్వీర్యం చేస్తాడు.
కామం అంటే కోరిక. షడ్రిపుల్లో అన్నిటికంటే తక్కువ ఇబ్బంది పెట్టేది. జీవనానికి ఎంతో కొంత అవసరం కూడా. కామం విశృంఖలంగా పెరుగుతూపోతే కామానికి క్రోధం జోడవుతుంది. కొన్ని పరిస్థితుల్లో దురాశ,లోభం సైతం జోడవుతాయి. వస్తువులమీద, పరివారంమీద మోహం పెరుగుతుంది. కామక్రోధమోహాల పర్యవసానంగా మదం పేరుకుంటుంది. 'నేను' బలపడుతుంది. అవధుల్లేని కామం ఈర్ష్యాసూయల్ని వెంటపెట్టుకుంటుంది. ఆరుశత్రువుల్లో ప్రతి శత్రువు మనిషిని మానసికంగా, శారీరకంగా కృంగదీస్తుంది. ఇవి శత్రువులు అని మనిషి గుర్తించకుండా ఉంచేందుకు మధ్యమధ్యలో చిన్నచిన్న సుఖాల్ని చూపిస్తూ ఉంటాయి.
రసాలు ఎనిమిదని చెప్పుకున్నాం. శృంగారం-వీరం-కరుణ-అద్భుతం-హాస్యం-భయానకం-భీభత్సం-రౌద్రం
షడ్రిపులు. కామం-క్రోధం-లోభం-మోహం-మదం-మాత్సర్యం
జాగ్రత్తగా గమనిస్తే కరుణ, హాస్యం ( కరుణ, హాస్యం గురించి విడిగా మాట్లాడుకుందాం) మినహాయిస్తే ఉన్న ఆరు రసాలు ఆరు శత్రువులే!
ఆరు శత్రువుల పర్యవసానాలు ఆరు రసాలనే బాహ్య వికారాలు.
షడ్రిపులని గుర్తించి వాటిని చేతనత్వంనుంచి తొలగించటమన్నా, ఆరు రసాలని గుర్తించి వాటిని ఆవిరి చేసి ఆనందరస ప్రాప్తి పొందటమన్నా ఒకటే. ఒకే ప్రక్రియ.
ఆనాటి ఋషులు ప్రజల మస్తిష్కంలో చిన్న కలుపు మొక్కల్లా ఉన్న షడ్రిపుల్ని పెకలివేయటానికి గ్రంధాల్లో అనేక ఉపాయాల్ని సూచించారు.
ఈనాటి సినిమాలు, ఇతర వినోదాలు ప్రజలో నాటుకుపోయిన షడ్రిపులనే చెట్లని మహావృక్షాలుగా పెంచుతున్నాయి.
కరుణరసం
నాటకాల్లోను, పుస్తకాల్లోను, సినిమాల్లోను చూపరిని తిరుగు లేకుండా కట్టి పడేసేది కరుణరసం.
కరుణ రసానికి భావం దుఃఖం. బుద్ధ భగవానుడు జీవితం దుఃఖం అనే సూత్రం మీద నడుస్తుందంటాడు. జీవితం అనిత్యం. అనిత్యం దుఃఖ హేతువు. అప్రమేయంగా ఉన్నది దుఃఖం. అప్పుడప్పుడు మనకి సుఖాలుగా తోచేవికూడా దుఖంలోంచి జనించేవే.
షడ్రిపుల ప్రతిబింబం దుఃఖం. దుఃఖానికి వ్యతిరేకం సుఖం కావచ్చు, కానీ సుఖదుఃఖాలకి అతీతమైననది ఆనందం. మనిషి దుఃఖంతో సుపరిచితుడు. అవతలి వ్యక్తిలో కొంతైనా 'తన' ని చూస్తే అవతలి వ్యక్తితో పాటు తనూ దుఃఖిస్తాడు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రచనలన్నీ కరుణరస ప్రధానమైనవే. షేక్స్పియర్, డికెన్స్, టాల్ స్టాయ్ పకడ్బందీగా పాత్రలు సృష్టిస్తారు. పాత్రలు నిజమైన వ్యక్తులని, జీవించే ఉన్నారని మనని భ్రమింపచేసేంత ఉత్కృష్టంగా ఉంటుంది వారి రచనా పటిమ. పిమ్మట రచయితలు పాత్రలకి పెట్టే కష్టాలన్నీ మనం అనుభవిస్తాం. కరుణరసం ఉప్పొంగుతుంది. విచారించి చూడగలిగితే కరుణ ఉప్పొంగేది మనమీద మనకే. ఎన్నిమాట్లైనా చదువుతాం, ఎన్ని మార్లైనా చూస్తాం. చూసిన ప్రతి సారీ పాత్రలతో మనబంధం మరింత పటిష్టమౌతుంది. అంతశ్చేతనలో మరింత దుఃఖం నింపుకుంటాం. సీతమ్మ కష్టాలు, ద్రౌపది కష్టాలు ఎన్నిమాట్లు చదివినా మనకి తనివి తీరదు. రచయితలు పాత్రల్ని కష్టాల్లో వదిలేస్తారా లేక వారిపై భోగభాగ్యాలు, సుఖసౌఖ్యాలు కురిపించి శుభం కార్డు వేస్తారా అన్నది వాళ్ళిష్టం. కట్టి పడేసేది కరుణరసమే. మిగతా సూత్రాలతో పాటు ఈ ముఖ్యసూత్రం తెలిసిన రామానంద్ సాగర్, రాజకపూరు, రాజమౌళి వంటివారు మనల్ని థియేటర్ల చుట్టూ తిప్పుకుంటారు.
లండన్లో ఒక రాజవంశీకురాలు 19వ శతాబ్దపు చివరిలో ప్రఖ్యాత హాలులో ప్రదర్శింపబడుతున్న ఒక నాటకాన్ని అతిగా ఇష్టపడినదట. ఆమె ప్రతి శుక్రవారం నాటకాన్ని తిలకించటానికి ఖరీదైన గుర్రపు బగ్గీలో వచ్చేది. ఆ విషాదాంత నాటకంలో హీరోయిన్ పేదరికంతో పాటు అనేక ఇతర కష్టాలు పడుతుంది. ఆ పాత్రతో ఎంతో మమేకమైన మన కళాభిమాని స్టేజీమీద హీరోయిన్ కనబడినప్పుడల్లా ఏడుపు ఆపుకోలేక పోయేది. తిరుగు ప్రయాణంలో గుర్రపు బగ్గీలో కూడా ఆమె ఏడుస్తూనే ఉండేది. టోపీలు పట్టుకుని ఆమె చుట్టూ మూగిన యాచకులిని కసిరి తోలేసేది కానీ పెన్నీ రాల్చేది కాదు. పై శుక్రవారం మళ్ళీ ఇదే డ్రామా.
దుఃఖాన్ని (కరుణరస హేతువు)ని జయిస్తే అరిషడ్వర్గాన్ని జయించినట్లే. అందుకే భరతముని కరుణరసాన్ని వదిలించుకుని ఆనందాన్ని పొందమన్నాడు. ట్రాజెడీలు ఇష్టపడే వారు, ట్రాజెడీలు మళ్ళీ మళ్ళీ చూసేవారు ఈ సత్యాన్ని గమనిస్తే గుండెలు తేలికవుతాయి. కరుణ వేరు, కరుణ రసం వేరు. గుర్రపు బగ్గీ ఆవిడకి కరుణ లేదు. దుస్తులు తడిపే దుఃఖం ఉంది.
హాస్యరసం
హాస్యం ఆరిషడ్వర్గంలో లేదు. హాస్యం హర్షణీయం, అభిలషణీయం. ఎందుకు మరి అభినవగుప్తుని వంటి మార్మికుడు సైతం హాస్యాన్ని హాస్యంతో తీసేయమన్నాడు?
షడ్రిపుల నుంచి విముక్తి పొందినా, పొందక పోయినా మస్తిష్కంలో కొన్ని హేళనాభావాలు, కొందరి పట్ల చులకనా భావాలు ప్రారబ్ద కర్మాన అంతరాంతరాలలో దాగి ఉంటాయి. దాగి ఉన్నాయని మనకి తెలియక పోవచ్చు కూడా. క్రోధం, మదం, మాత్సర్యం గుణాలలో ఉండే విషం ఈ భావాలలో ఉండదు, దుఃఖఃలో ఉండే కృంగతీత ఉండదు. కానీ నిర్మోహత్వానికీ నిశ్చలతత్వానికి అవరోధాలుగా నిలుస్తాయి. చూసేవాడిని నిరవరోధంగా ప్రకృతిని తిలకించనీయవు. ద్రష్టకి సత్యానికి మధ్య తెరలా నిలుస్తాయి.
ఈ భావాలని కడిగివేయటానికి హాస్యం ఉపకరిస్తుంది. నవ్వు ఒకరకమైన ధ్యానం. లాఫింగ్ మెడిటేషన్.
అమెరికా సోవియట్ రష్యా మధ్య అర్ధ శతాబ్దం పాటు జరిగిన ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అమెరికన్లు రష్యా మీద, రష్యన్ల మీదా కొన్ని వేల జోకులు పుట్టించారు. కడుపుబ్బా నవ్వుకున్నారు. రష్యన్లు కూడా అమెరికన్లపై జోకులేసుకున్నారేమో మనకు తెలియదు. హాస్యరసం ప్రపంచాన్ని అణుయుద్ధాన్నించి తప్పించిందను కోవటంలో తప్పు లేదు.
స్వల్ప పరిమాణాల్లో ఒక వర్గానికి ఇంకో వర్గంపై అసహనం, అసంతృప్తి, అసూయ, హేళన, ఆధిక్యతా భావం, నిమ్నతాభావం, ప్రతీకారభావం వంటి అనేక భావాలు బీరువాలో అస్థిపంజరాల్లా దాగి ఉంటాయి. అది స్వాభావికం.
అత్యంత సహజమైన పరిణామాత్మక ఆవశ్యకత.
యూదుల మీద జోకులు, బ్లాండ్లమీద జోకులు, నల్లవాళ్ళ మీద జోకులు, చైనా వాళ్ళ మీద జోకులు, పొలిటీషియన్ల మీద జోకులు, డబ్బున్న వాళ్ళపై జోకులు, తీవ్రవాదులపై జోకులు…
మనదేశంలో సర్దార్లపై, బెంగాలీలపై, దాక్షిణాత్యులపై, పాకిస్తానీయులపై, గుజరాతీయులపై, మార్వాడీలపై, మరెన్నో అదనంగా ఉన్నాయి.
కొంతమంది జోకులు జోకులుగా ఆనందిస్తే, మరి కొంతమంది ఆత్మాభిమానం అంటూ కోర్టుకెక్కుతారు. సర్దారు జోకులు సర్దారులే చెప్పాలి. భార్యల మీద జోకులు లక్షలాదిగా ప్రచారంలో ఉన్నా, వందలకొద్దీ అనునిత్యం పుట్టుకొస్తూనే ఉన్నాయి. శతాబ్దాల భార్యా పీడనత్వ ఫలితమేమో మరి. విచిత్ర మేమిటంటే ఈజోకుల్ని మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళూ ఆస్వాదిస్తారు.
జోకు పలకడానికి చెప్పే వారు, వినేవారు ఒక పరస్పర సమ్మతమైన వేదికమీద ఉండాలి. ప్రహసనం చిన్న కథలా మొదలయి పంచ్ లైన్ తో ముగియాలి. పంచ్ లైన్ తగలంగానే విన్నవారికి శబ్దంతో కూడిన కిలకిల నవ్వు పుట్టాలి. ఒక గట్టి తుమ్ము ముక్కుని, గొంతుని, ఛాతిని శుభ్రం చేసినట్లు మస్తిష్కంలో ఉన్న మకిలి నవ్వుతో బాటుగా బయటికి వచ్చేయాలి. కల్మషం వదిలించే జోకు ప్రక్షాళణలా ఉండాలి. ఎక్కడికో తీసుకెళ్తున్నట్లుగా అనిపింపచేసి, అప్పటిదాకా బిగించిన మూతి, భృకుటి పంచ్ లైన్ వినంగానే విప్పారింపచేసి విస్ఫోటకం చేయాలి. గాలిలో తేలిపోతున్న అనుభూతి కలగాలి. పంచ్ లైన్ పడుతుందని తెలిసినప్పటికీ ఎప్పుడు పడుతుందో తెలియకూడదు. సర్వం మమ సమానం అన్న స్వస్వరూప దర్శనం అవాలి.
ప్రతి జోకుకి తప్పనిసరిగా ఒక హేళనాలక్ష్యం ఉంటుంది. దేశం, జాతి, కులం, భాష, యాస, ప్రాంతం, మతం, శాఖ, వ్యక్తి, పద్ధతి, వర్గం, వృత్తి, అలవాటు, సంఘటన వగైరా. లక్ష్యంమీద వినేవానికి హేళనా భావం లేకపోతే జోకు జోకవదు. ఒకే లక్ష్యంపై పదేపదేజోకులు వింటుంటే ఆజోకుల్లో పదును తగ్గుతూ వచ్చి చివరికి ఏమాత్రం నవ్వురాని పరిస్థితి వస్తుంది. అంటే ఆవర్గం పట్ల మనస్సులో ఏమూలో ఉన్న ద్వేషం సంపూర్ణంగా సమసిపోయిందన్న మాట.
బఫూన్ని చూసి కూడా నవ్వుతాం. ఆ నవ్వుతో మన ఊహాజనిత ఆధిక్యత బలపడుతుంది. అది హర్షణీయం కాదు. ఆధిక్యతానిర్మూలన చేయగలిగే గట్టి నవ్వు మాత్రమే భరతముని సిద్ధాంతీకరించిన నవ్వు.
హాస్యరస పరమోద్దేశం సంపూర్ణ ప్రక్షాళన. స్థితప్రజ్ఞులని ఏజోకూ నవ్వించలేదు. వారు చిరునవ్వుకి మించి నవ్వరు. సదా ఉండే చిరునవ్వు అది.
సెన్స్ ఆఫ్ హ్యూమర్ అన్న పదానికి సరయిన అర్ధం కనబడదు. వినేవాడి మనోగతం తెలిసి అతనిలో నవ్వు పుట్టించటం జోకు చెప్పే వాడి బాధ్యత. జోకనబడే ప్రతి సంగతీ విన్నప్పుడల్లా నవ్వాలని ఏమీ రూలు లేదు. నవ్వు రాకపోతే వినేవాని బలహీనతేమీ కాదు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటూ ఒక వస్తువు ఉంటే అది జోకు వేసేవాడిలో ఉండాలి. వినేవాడిని పురస్కరించుకుని ఉండాలి. అది పదాల కూర్పు, శబ్దం, టైమింగ్, జోకుకి సరయిన వాతావరణం కలగచేయటం వగైరా. టెక్నిక్ ఆఫ్ జోక్ టెల్లింగ్ అనుకోవచ్చు.
ఏదైనా జోకుకి మనం పెద్దగా నవ్వి ఆనందించగలిగితే అది మంచి పరిణామం. హాస్యరసోద్ధేశం మనకి స్పృహలో ఉంటే తత్క్షణమో, అతిత్వరలోనో అంతరంగం శుభ్రమౌతుంది.
భావోద్వేగాలు
ఇమోషన్ అన్న ఆంగ్ల పదానికి భావోద్వేగం తెలుగు అనువాదం. భావమిశ్రమాలు, తరచిచూడలేని ఆలోచనలు, అనుభూతులు కలగలిపిన మానసిక స్థితి. భావోద్వేగం అలజడితో కూడుకున్నది. ముఖ్యంగా దుఃఖదాయిని. అప్పుడప్పుడు సంతోషకరం కూడా అవవచ్చు. ఇమోషన్ మూడ్ ని నిర్దేశిస్తుంది. భావోద్వేగం తాత్కాలికం కావచ్చు, దీర్ఘకాలికం కావచ్చు.
నిస్పృహ, భీతి, ఆందోళన, ఆవేశం, సంభ్రమం, తొట్రుపాటు, చికాకు, న్యూనత, శౌర్యం, భీరుత్వం, అతి స్పందన, అసహ్యం, ఆశ్చర్యం, అహంకారం, అత్యుత్సాహం, కంగారు, విభ్రమం, కాముకత్వం, బద్ధకం, మాంద్యం, కింకర్తవ్యతా మూఢత్వం, కర్కశత్వం, క్రూరత్వం, అతి వినయం ఇత్యాది మానసిక స్థితులన్నీ ఇమోషన్లనుకోవచ్చు.
ఇమోషన్ నిర్వచనం ఏమిటి, ఎందులోంచి జనిస్తుంది, ప్రత్యక్ష పరోక్ష ఫలితాలేమిటి, మానసిక శారీరక ఆరోగ్యానికి భావోద్వేగాలు ఎటువంటి మార్పులు తెస్తాయి, అనే అంశాలపై అరిస్టాటిల్ సమయం నుంచి నేటివరకూ విభిన్న విభాగాల శాస్త్రజ్ఞులు విస్తృతంగా పరిశోధనలు చేశారు, చేస్తున్నారు.
రససిద్ధాంతం దృక్కోణంలో ఇమోషన్లన్నీ వికారాలే. వస్తువుల మీదకాని, వ్యక్తులమీద కానీ అమితమైన కాంక్ష, పొందలేమేమో అన్న భీతి. కాంక్షభీతుల వివిధ నిష్పత్తుల ఫలస్వరూపాలే భావోద్వేగాలు.
కామించిన వస్తువు సిద్ధించినా, సిద్దించకపోయినా కాంక్ష ఆగదు. స్వభావరీత్యా వృద్ధి చెందుతూనే ఉంటుంది. కాంక్ష వెంటే నీడలాగా ఉండే భీతి అంతే నిష్పత్తిలో వృద్ధి చెందుతుంది. ప్రకటిత భావోద్వేగాలు, నొక్కి వేయబడ్డ భావోద్వేగాలు శరీరాన్ని, చేతనత్వాన్ని తుదముట్టించేత వరకు కృంగదీస్తాయి.
సృష్టి పరిణామక్రమంలో ఈ ప్రక్రియ అనివార్యం అని వాదించే వారుండవచ్చు. ఆవాదన నిర్హేతుకం. పేరుకు పోయిన, కరుడు కట్టిన, బాల్యం నుంచి అంతరంలో ఘనీభూతం చెందిన భావోద్వేగాల మిశ్రమానికే కర్మ అని మరో పేరు. ఆధ్యాత్మిక గురువు ఏకార్ట్ టోలే దానినే 'బాధాశరీరం' అంటాడు. ఇతరుల పట్ల మనిషి అనుచిత ద్వేష పూరిత ప్రవర్తనకి, తన్ను తాను మానసికంగా హింసించుకోవడానికి బాధాశరీరం కారణం. బాధాశరీరం ఉనికిని గుర్తించి, దాని తీరుతెన్నులని గమనిస్తూ ఉంటే బాధాశరీరం పెట్టే బాధల ఉద్ధృతి తగ్గుతుంది. నేను వేరు, భావోద్వేగాలు వేరు, అనే నిత్య ఎఱుక కీలకం.
యోగులు, దార్శనికులు, బుద్ధులు భావోద్వేగాలకి అతీతంగా ఉంటూనే పరమపద సోపానానికి మనకోసం నిచ్చెనలు వేశారు.
షడ్రిపులనే రిపులని గుర్తిస్తే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు కనుమరుగవుతాయి. అవి కలిసికట్టుగా మస్తిష్కంపై వేసే భావోద్వేగ బాణాలు గురితప్పుతాయి.
ద్రష్ట ప్రపంచాన్ని ప్రపంచంగా దర్శిస్తాడు.
వినోదం
ఆబాలగోపాలం ఆకాలపు సురమహేశునించీ ఈకాలపు మరమనిషి వరకూ వినోదం కోసం అర్రులు చాచుతూనే ఉన్నారు.
జీవితాన్ని రెండు పార్శ్వాలుగా విభజించుకున్నారు. విధి భాగం, వినోద భాగం.
అయిన వారికి విధులు కొంచెం. వినోదం కావలసినంత.
కాని వారికి విధులే జీవితం. కాలం కలిసొస్తే కొంత వినోదం.
కానీ అయిన వారి కంటే కాని వారే ఎక్కువ వినోదిస్తారు. బహుశా.
అప్సరసలు, సురాపానాలు సురేంద్రునికి వినోదం
సర్కస్సులు, బానిసలని బక్కచిక్కిన సింహాలు చంపుకు
తింటుంటే చూసి చప్పట్లు కొట్టటం సీజరుకి వినోదం.
బట్టలు విప్పుకు బూతులు తిట్టుకు బాకులు దింపుకు
చిందులుతొక్కే గొలుసు హంతకులు నేటి వినోదం.
వినోదం లోతుపాతులు పరీక్షించే ప్రయత్నం కంటే ముందు, వ్యక్తి సృష్ట్యాదిగా వినోదం కోసం ఎందుకు తపిస్తున్నాడో తెలుసుకునే ముందు,
వినోదం రెండు రకాలు అనుకుని ముందుకు సాగచ్చు. ఆహ్లాదం అభిలషిస్తూ వ్యక్తి సమయం కేటాయించేవి 1. చేసే కార్యక్రమాలు 2. చూసే కార్యక్రమాలు.
క్రియాత్మకంగా పాల్గొనగలిగేవి క్రీడలు, సంభాషణలు, పర్యాటనలు, స్వతహాగా ఉన్న ప్రతిభ పెంపొందించుకునే ప్రయత్నాలు, ఇరుగుపొరుగుని విజ్ఞాన పరిచే, ఆనందపరిచే ఆకాంక్షలు, ఇచ్చిపుచ్చుకునే ఇచ్ఛానురాగజనితచర్యలు, చేతనైననన్ని చేతలు.
వినిపించతగిన నాలుగు మాటలు, చదివించతగిన నాలుగు రాతలు, చూపించతగిన నాలుగు చేతలు, ఆడించతగిన నాలుగు ఆటలు.
చేసే కార్యక్రమాల్లో లక్ష్యం వినోదం. చేసే వ్యక్తికి, చూసే వ్యక్తులకి. రసానుభూతి కలిగిందా కలగలేదా అన్నది వేరే విషయం. ఒకరి వినోదం లోకవినోదం కావచ్చు. ఒకరి వినోదం ఇతరులకి కంటకం కావచ్చు.
చూసే కార్యక్రమాలలోంచి వినోదం పొందగోరే వ్యక్తి చేయగలిగిందల్లా సాగిలబడి కూర్చుని మనసుని, ఆత్మని, చేసేవారికి సమూలాగ్రంగా అర్పించుకోడం. చేయగలగడం అన్న పదం వాడలేనంత నిష్క్రియత్వం అతనిది.
రచయిత మనసుతో ఆలోచించటం, వక్త వాచకంతో మాట్లాడటం, గాయకుడి గొంతుతో పాట పాడటం, నర్తకి అడుగులతో కదం తొక్కడం, దర్శకుడి దృష్టి తో దర్శించటం.
వినోదం కోసం చూసే కార్యక్రమాలపై ఆధారపడే మనిషి తాత్కాలికంగా తన వ్యక్తిత్వాన్ని నోరునొక్కటానికి ఇంకో వ్యక్తికి అనుమతిస్తున్నట్లే. అప్పటిదాకా తను నడుపుతున్న గుర్రాన్ని ఆపి, పగ్గాలు వేరేవారికి కట్టపెట్టి తను నడిపేవాడి వెనక కూర్చోవటం. మస్తిష్కం అనేగుర్రాన్ని నడిపే అసౌకర్యమైన బాధ్యతని ఇంకొకరికి అప్పచెప్పి సమయాన్ని మరిచిపోవడం.
మనసుని కట్టిపడేసేలా చేసే ఏకార్యక్రమమైనా మనం వినోదమని భ్రమపడతాం. గుర్రం నడిపే బాధ్యతనుంచి తప్పుకోవడం వినోదం.
రౌతు మనగుర్రాన్ని ఏసందుల్లో తిప్పినా వినోదిస్తున్నామనుకునే అనుకుంటాం. ఆసందులో ఏడ్చేవారుంటే వారితో భావైక్యత పొంది ఏడుస్తాం. కొండొకచో నవ్వుతాం, అసహ్యించుకుంటాం, నీతులు చెపుతాం, నేరాలు చేస్తాం. సందులు మారుతాయి, పగ్గాలు రౌతు చేతిలోనే ఉంటాయి. సందులో దృశ్యాలతో మనం భావైక్యత పొందలేక పోయినా, గుర్రం వేగంగా నడవకపోయినా రౌతుని మారుస్తాం. కానీ పగ్గాలు చేతబట్టం. చానలు మారుస్తాం కానీ టీవీ కట్టెయ్యం. ఏదో ఒక రసం, అరిషడ్వర్గంలో ఏదో ఒక రిపుశేఖరుడు దాడి చేస్తూనే ఉండాలి. విరామం ఉండకూడదు.
మన మనసుని మనం ఎదుర్కొనలేక పోవటానికి, మన మనసుతో మనం బేషరతుగా సహజీవనం చేయలేక పోవడానికి ఏదో బలీయమైన కారణం ఉండి ఉండాలి. మన ఆలోచనలని మనం ఎదుర్కొన లేకపోవడాన్ని 'బోరు కొట్టటం' అంటాం. మన గుర్రం నడపటం ఇంకొకరి బాధ్యత అయినట్లు. బోరు అన్న పదం బహుశా భారతీయ భాషల్లో లేదు. ఇంగ్లీషు వాడినించి దిగుమతి అయింది. 'చేతినిండా పనిలేని వాడి బుర్ర దయ్యాల కార్ఖానా' అన్న నానుడి కూడా అంతే.
పది నుంచి ఐదు దాకా పని. ఇరవై ఐదునించి అరవై ఐదు దాకా పని పిల్ల పెళ్లి పని. పెళ్ళాన్ని పోషించడం పని. పిల్లల్ని పెద్దచెయ్యడం పని. జీవించడం ఇష్టం ఉన్నా లేకపోయినా చేస్తున్నాం అనుకుంటూ చేసే పని.
ఇష్టమో కష్టమో చేతినిండా కావాలి పని. ఎంక కష్టమైన పని అయినా పరవాలేదు కానీ, పని ఆగిపోతెనే నిజమైన కష్టం. భరించలేని బోరు.
మనసులో ఇబ్బడిముబ్బడిగా ఇబ్బంది పెడుతూ ఇష్టారాజ్యంగా మసిలే ఆలోచనల్ని వ్యాఖ్యానరహితంగా గమనించే ప్రక్రియని మన ఋషులు 'ధ్యానం' అన్నారు. అరిషడ్వర్గాన్ని దూరంగా ఉంచే ఏకైక సాధనం ధ్యానం. ధ్యానాన్ని మించిన వినోదం లేదు, ధ్యానాన్ని మించిన రససిద్ధి లేదు.
స్పృహ
జీవం, స్పృహ పర్యాయ పదాలు. జీవ వస్తువుని నిర్జీవ వస్తువు నుంచి వేరు చేసేది స్పృహ, Consciousness!
స్పృహకి అనేక పర్యాయపదాలు వాడుకలోను, తత్వవేత్తల, శాస్త్రజ్ఞుల పరిభాషలోను ఉన్నాయి. చేతన, జాగ్రత, ప్రజ్ఞానం, అభిజ్ఞత, స్మారకం, చిత్ వంటివి.
వృక్షాలు, జలచరాలు, పశుపక్ష్యాదులు వివిధ పరిమాణాల్లో చేతనకలిగి ఉంటాయి. మానవుని చేతనత్వపు స్థాయి మిగతా జీవరాశులతో పోలిస్తే అత్యున్నత దశకి చేరి ఉన్నదని చెప్పవచ్చు.
వ్యాస విస్తరణ జరగనీయకుండా జాగ్రత్త పడుతూ స్పృహ అనే తత్వవిజ్ఞాన విషయంమీద రచయిత ధైర్యం చేసి చేసే కొన్ని ప్రతిపాదనలు:
జాగ్రదావస్థ, చేతన గురించి మాట్లాడుతూ మనం ఎక్కువ తక్కువ అనే విశేషణాలే కాకుండా అతీంద్రియ, సుప్త, వంటి ఎన్నో పదాలు విభిన్న పరిమాణాలని ఉద్దేశిస్తూ వాడతాము. మెలకువలో ఎక్కువ జాగ్రత, నిద్రలో తక్కువ. గాఢనిద్రలో కంటే స్వాప్నిక స్థితిలో ఎక్కువ చేతన. శస్త్ర చికిత్స సమయంలో ఎంత ఎక్కువ మత్తు మందిస్తే అంత ఎక్కువ అపస్మారకంలోకి రోగి జారుకుంటాడు. అనగా కాన్షస్నెస్ ఆనే వస్తువు కొలవగలిగినది అయిఉండాలి! కొలతకి యూనిట్లు ఉండాలి. మనం ఊహించ గలిగినంత వరకు ఆ అవకాశం ఇప్పుడే కాదు, ఎప్పటికీ రాదు. చిత్ న్యూరాన్ల సంఖ్యతోను, వాటి వేగం తోను, ఆల్ఫా బీటా గామా తరంగాలతోను గణించగలిగే స్థూల వస్తువు కాదు.
వ్యక్తి చేతన చక్రీయన్యాయంతో హెచ్చు తక్కువలకి గురవుతుంది. గాఢనిద్ర, తేలిక నిద్ర, స్వల్ప మెలకువ, ఉచ్ఛ మెలకువ ఆటుపోట్ల వలె నిత్యం మారుతూ ఉంటాయి. ఈ చక్రీయత సృష్టికి, పరిణామ ప్రక్రియకి ఆయువుపట్టు.
సకల ప్రాణికోటి, అమీబానుంచి బుద్ధుని వరకూ ఈ సూత్రానికి బద్ధులే.
చేతనలో శిఖరాలు అధిరోహించే కవులు, శాస్త్రజ్ఞులు, పరమహంసలు తమ చేతనని జీవకోటితో పంచుకుంటారు, జీవకోటినుంచి అందుకుంటారు. చేతనత్వం అనే మహాసముద్రంలో ఐన్ స్టీన్ పెద్ద కెరటం, అనామకుడు చిన్న కెరటం.
విశ్వచైతన్యం అవధుల వరకూ అనునిత్యం వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఐతే ఈగ్రాఫ్ సరళరేఖలా ఉండదు. పాతికేళ్ల మైక్రోసాఫ్ట్ షేరు విలువ గ్రాఫ్ ని తలపిస్తుంది.
సామాన్య వ్యక్తి తన చేతనా స్థాయిని స్వసంకల్పంతో పెంచుకోగలడా? లేక అతను అజ్ఞేయవాది భాషలో ప్రకృతి చేతిలో, ఆస్తికుని భాషలో భగవంతుని చేతిలో ఒక కీలు బొమ్మా? ఎంత అవునో అంత కాదు.
గ్రాఫ్ కదలికలు తర్కానికి లోబడి ఉంటాయా? కచ్చితంగా కాదు.
వ్యక్తి జాగరూకతతో, తన మార్గాన్ని మలచుకునే స్వేచ్చ కలిగి ఉంటాడా? కచ్చితంగా అవును.
**
మనిషి ఎక్కువ సేపు నిద్రలో ఉండలేడు. అదే సూత్రంతో ఎక్కువ సేపు జాగరూకతతోనూ ఉండలేదు. అతని క్షమత పరిమితం. లోలకంలా ఊగుతూనే ఉండాలి. ఈ పరమ సత్యం ఎంత శాపమో అంత వరం.
రోజులో, అనగా నియమిత సమయంలో, ఎంత నిద్రిస్తాడో, ఇంచుమించు అంతే సమయం మేల్కొనగలడు. ఇంకో మాటల్లో చెప్పాలంటే జాగరూకత సహించలేడు. భరించలేడు. చేతనోద్ధతిని అణచివేయడానికి అపస్మారకంలోనే మార్గాలు అన్వేషిస్తాడు. అపస్మారకాన్ని సుప్తచేతనంలో ఆకాంక్షిస్తూ.
వినోదమనబడే వైపరీత్యాన్ని వెతుక్కుంటాడు; మనసు మరువటం కోసం. మనిషనే మగాడు మద్యాన్నో మగువనో, (మగువైతే మగాణ్ణో), మాదక ద్రవ్యాల్నో ఆశ్రయిస్తాడు. మగవాడు మగువతత్వం కోరి జారితే, మగువ మగతత్వం కోరి జారుతుంది. వర్తమానం ప్రసాదించే చేతనోద్ధృతిని భరించలేక వ్యక్తి నిద్రని కోరుకుంటాడు. ఆకోరికే మనసుని మద్యం వైపు పరుగులు తీయిస్తుంది. చేతన పెరగటం తటస్థిస్తే, స్వాభావికంగా పెరుగుతున్న చేతనకి ప్రయత్నపూర్వకంగా అడ్డు కట్టలు వేయకపోతే, మనిషి కవి అవుతాడు. ఋషి అవుతాడు.
మద్యం నుంచి వచ్చే సుఖం నిద్రలోకి జారుకునేటప్పుడు కలిగే సుఖం. చేతనాతిశయంలోంచి పంచేంద్రియాలు ప్రకృతిని అవధులమేరకు ఆస్వాదిస్తుంటే కలిగేది ఆనందం. సచ్చిదానందం.
ఒక శాఖనుంచి మరో శాఖకి విరామంలేకుండా లంఘించే మర్కటాలవంటి వందల ఆలోచనలు మనిషి శక్తిని హరింపచేస్తాయి. ఆలోచనల దాడిని తట్టుకునే శక్తిని కోల్పోయిన మనిషి అప్రయత్నంగా నిద్రాస్థితిని వాంఛిస్తాడు. లేదా ఆలోచనలని కేంద్రీకృతం చేస్తాడు. మేధస్సు ఉపయోగించవలసిన సమస్యకి సమాధానం వెతకటంలోనో, చదరంగం లాటి ఆటల్లోనో, విశ్వాన్ని జయిద్దామనే విపరీత దుగ్ధ ఉన్న అలెగ్జాండర్, హిట్లర్, జెంగిజ్ ఖాన్, పోల్ పోట్ వంటి అవాంతర వ్యక్తిత్వావేశంలోనో మనిషికి స్మారకం తగ్గించుకుందామనే కోరిక ఉండదు.
మత్తులోకో నిద్రలోకో జారకుండా, ఆలోచనా మర్కటాల అలజడి అణిగితే శక్తిప్రసరణ తీవ్రవంతమూ వేగవంతమూ అవుతుంది. వ్యక్తి ఉన్నత చేతనాశిఖరాలు అధిరోహిస్తాడు. ఆ ఎత్తులనించి కవిత్వం, ఋషిత్వం అప్రయత్నంగా ఆవిర్భవిస్తాయి.
కవిత్వం, ఋషిత్వం కోరితే వచ్చేవి కావు. సంవత్సరాల కృషిఫలితం కావు. యుగాంత పర్యంత కృషి ఫలితం ఎంతమాత్రం కావు.
'ఏమీ నాకొద్దు' స్థితి ఫలస్వరూపంగా వద్దన్నా విరుచుకుపడే 'ఏం మాయచేసావో గానీ'.
కొందరు జారటానికి, జూదాన్ని ఎన్నుకుంటారు, ఇంకొందరు జాలరితనాన్ని, మరికొందరు రోజరీని.
కొందరు రోజల్లా పూజలు చేస్తారు, ఇంకొందరు రామకోట్లు రాస్తారు, మరికొందరు రాళ్ళేరుకుంటారు.
కొందరు నీతులు చెపుతారు, ఇంకొందరు రచనలు చేస్తారు, మరికొందరు వ్యాసాలు రాస్తారు, నిద్రలోనే.
నిద్రలో జరిగే ప్రతి పని నిరర్ధకం. జాగరూకతతో చేసే ప్రతి పనీ భగవంతుని చేతే.
సౌందర్యం
భక్తి ఒక అమూల్య భావానుభూతి. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన మహత్తర కానుక. మోక్ష సాధకాలుగా పరిగణింప బడుతున్న రెండు మార్గాల్లో ఒకటి. ఆనందంతో అనుసరణీయమైనది. భక్తి నవరసాల్లో లెక్కలో లేదు. క్రీస్తు పూర్వం భరతఖండంలో ప్రజలు జ్ఞానసంపన్నులు. జ్ఞానంతోనే అజ్ఞేయాన్ని అందుకునే వారు.
భక్తి భావన పురాణకాలం తర్వాత భరతావనిలో వేళ్ళూనుకుని నవరసాలలో ఉటంకించబడిన అన్ని రసాల కన్నా ఉత్కృష్టంగా రూపుదిద్దుకుంది. భక్తిరసం ఏమోతాదులో వ్యక్తి స్వీకరించినా ఆనందహేతువే. ఎవరి పట్ల భక్తి ఉన్నా రసస్ఫోరకమే. నిర్ద్వంద్వ సమర్పణాప్రాతిపదికమీద ఉత్పన్నమైన ఇస్లాం మతస్థులకి సైతం భక్తి మూలాలు బోధపడవు.
తరాలు నిలబడిపోయి ఆనందాబ్దిలో మానవాళిని ఓలలాడిస్తున్న కావ్యాలు, నృత్యాలు, కృతులు, కీర్తనలు, గీతాలు భక్తిరసోద్భవాలే. ప్రసారం చేసేవారికీ అందిపుచ్చుకునేవారికి కూడా ఆనంద హేతువులే. భక్తిరసానికి కంపించే హృదయం ఉంటే రాగయుక్తంగా, లయబద్ధంగా వినిపించే త్యాగరాయ కృతులన్నీ రసవాహినులే.
ఖేలతి మమ హృదయే రామః.
భక్తిరసంతో సహా ఎటువంటి రసంతోను ముడిపడకుండా, సదా ఆనంద హేతువైనది సౌందర్యం. Aesthetics! రసజ్ఞులకి ఎల్లవేళలా అందుబాటులో ఉండేది సౌందర్యం. అరిషడ్వర్గానికి ఎంత దూరంగా ఉంటే అంత పులకరింపచేసేది సౌందర్యం. కవులు, చిత్రకారులు, గాయకులు, విశ్వకర్మలు, తన్మయించేది సౌందర్యంలో. అప్రయత్నంగా ప్రపంచానికి వారు పంచి పోసేది సౌందర్యం.
రేఖా విన్యాసంలో, వర్ణ వైవిధ్యంలో, ఘనాకృతిలో, సరిగమల పదనిసలో, తాళ క్రమంలో, కదలికల నిష్పత్తిలో, గంధాలలో, స్పర్శా వేడిమిలో సౌందర్యాన్ని నిరాక్షేపణీయంగా అనుభవించగలగడం రసజ్ఞత. బీతోవెన్నీ, తాజ్ మహల్నీ, బడే గులాం ఆలీ ఖాన్ని ఆనందించటానికి సౌందర్యపిపాస కావాలి. బాధాశరీరం అడ్డురాకపోతే మనిషి మనసులో మిగిలేది సౌందర్య పిపాస. పెల్లుబికేది కళాపిపాస.
రసజ్ఞుడు సినీకవి భరత్ వ్యాస్:
హరీ హరీ వసుంధరాపే నీలానీలా యే గగన్
కే జిస్ పే బాదలోంకీ పాల్ కీ ఉడా రహా పవన్
దిశాయే దేఖో రంగ్ భరీ, చమక్ రహీ ఉమంగ్ భరీ
యే కిస్ నే ఫూల్ ఫూల్ పే కియా సింగార్ హై
యే కౌన్ చిత్రకార్ హై యే కౌన్ చిత్రకార్!
యే కిస్ కవీకీ కల్పనాకా చమత్కార్ హై!!
అయిదు ఉపనిషత్ మహా వాక్యాలు మనకి సుపరిచితమైనవే.
ఆరవదిగా వర్గీకరింపవలసినది
రసో వైసః। రసం
హ్యేవాయం లబ్ధ్వాऽऽనన్దీ భవతి।।
తైత్తిరీయ ఉపనిషత్తు 2.7.1
రసో వైసః
ఓం శాంతి
*****