top of page

సంపుటి 1    సంచిక 4

మధురవాణి ప్రత్యేకం

నా డైరీల్లో కొన్ని పేజీలు... ఫిబ్రవరి- ఏప్రిల్ 1971

గొల్లపూడి మారుతీ రావు

1971:

ఫిబ్రవరి 2:  పసుమర్తి శ్రీరామ శాస్త్రి అనే ఆయన మా నాన్నగారి దగ్గర్నుంచి ఉత్తరం పట్టుకుని విజయవాడ రేడియో స్టేషన్‌కి వచ్చారు. రేడియోలో ఆయనకి అవకాశం కల్పించమంటూ.

నాకు చాలా ఆశ్చర్యాన్నీ, కాస్తపాటి ఆనందాన్నీ కలిగించిన సందర్భమది. మా నాన్నగారు నాకు తెలిసి నా ఉద్యోగాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు. "మీ అబ్బాయి రేడియోలో పని చేస్తున్నాడు కదా? నాకు 'పురాణ కాలక్షేపం' చేసే అవకాశం ఇప్పించమని చెప్పండి" అని ఈ శాస్త్రిగారు అడిగి ఉంటారు. మా నాన్న పూనుకుని ఉత్తరం రాసి ఇచ్చారు. నేను తర్వాత కార్యక్రమాలు చూసే ఆఫీసరునయాక ఇలా చాలా మందికి అవకాశాలు కల్పించిన మాట నిజమే గాని, ఈ దశలో, మా నాన్నగారి రికమెండేషన్ విచిత్రమైన సంఘటన.అప్పుడు ఉషశ్రీవో మరెవరో ఆ కార్యక్రమాన్ని చూస్తున్న గుర్తు. వెళ్ళి చెప్పాను. నేనెప్పుడూ అలా అడిగిన వాడిని కాదు. వాళ్ళూ ఆశ్చర్యపోయారు. శ్రీరామ శాస్త్రి గారి చేత 'పురాణ కాలక్షేపం' చేయించాం. పదిహేను రూపాయల చెక్కు ఇచ్చిన గుర్తు. ఆ రోజుల్లో ఆ పైకం ఘనమే. శాస్త్రిగారికి చాలా తృప్తి కలిగించిందనుకుంటాను. నాకు మరీ ముఖ్యం - మా నాన్నగారి రికమెండేషన్‌కు - నా జీవితంలో ఒకే ఒక్కసారి విలువనిచ్చినందుకు. మనస్సులోనైనా నాన్నగారు గర్వపడి ఉంటారు. అప్పట్లో ఒక చిన్న ఉద్యోగికి దక్కిన 'పెద్దా ఆనందమది.

 

ఫిబ్రవరి 10: మొక్కపాటి నరసింహశాస్త్రి గారికి నాటకం ఇతివృత్తం చెప్పాను. 'బావుంది. చాలా పవర్‌ఫుల్ నాటకం అవుతుంది. నాటకం వ్రాయడం ఎలాగో నాకు చాతకావడం లేదు కాస్త చెప్పండీ’ అన్నారు.

అప్పుడు నేను రాస్తున్న నాటకం "లావాలో ఎర్ర గులాబి". ముందుగా ఒక అపురూపమయిన సంఘటన చెప్పాలి. ఏడేళ్ళ కిందట - నేను జీవితంలో రాసిన మొదటి సినిమా కథకి (ఆత్మగౌరవం) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి నందీ బహుమతి - ఉత్తమ రచనకి పుచ్చుకున్నాను. హైదరాబదు గాంధీ మైదానంలో పెద్ద సభ. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డిగారి చేతుల మీదుగా అందుకున్నాను. గవర్నరు పట్టం తానూపిళ్ళె, అక్కినేని, దుక్కిపాటి, రేలంగి, యద్దనపూడి సులోచనారాణి, వి.మధుసూదనరావు వంటి ప్రభృతులెందరో వేదిక మీద ఉన్నారు. ఆనాటి నా ప్రసంగం బాగా రాణించింది. సభ్ ఆయాక నేనొక్కడినీ వేదిక దిగుతున్నాను. మెట్ల దగ్గర ఒకాయన నిలబడి ఉన్నారు. నేను దిగగానే నా చెయ్యి పుచ్చుకుని 'మిమ్మల్ని అభినందించడానికి నిలబడ్డాను. బాగా మాట్లాడారూ అన్నారు. "తమ పేరు?" అప్పుడు చెప్పారు - మొక్కపాటి నరసింహ శాస్త్రి. వెంటనే పాదాభివందనం చేశాను. ఆయన 'బారిష్టరు పార్వతీశం' తెలుగు సాహిత్యంలో క్లాసిక్. తర్వాత - నాకు విజయవాడ బదిలీ అయినప్పుడు - బుచ్చిబాబుగారు భోజనానికి పిలిచారు. ఆ రోజు వారింట్లో నలుగురు రచయితల విందు - బుచ్చిబాబు, వారి సతీమణి శివరాజు సుబ్బలక్ష్మి, మొక్కపాటి, నేనూ.

1924లో తెనాలిలో నవ్య సాహిత్య పరిషత్ సభలు జరిగాయి. ఆ తర్వాత ఓసారి వారి స్వస్థలం గుమ్మలూరు పడవ మీద వెళ్ళారు. బావమరుదులూ, మరదళ్ళూ అంతా చుట్టూ చేరగా - తన ప్రయాణాన్ని కడుపుబ్బ నవ్వించేలాగ చెప్పారు. "ఈ అనుభవం మీద కథ రాయమని" అందరూ రెచ్చగొట్టారు. ఆయన రాసి, అక్కడినుండి గుంటూరు వెళ్ళ్నప్పుడు ఆ కథని తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి, నోరి సరసింహ శాస్త్రి, వజ్జల సుబ్బారావు, శ్రీనివాస శిరోమణి కి చదివి వినిపించారు. వారూ పగలబడి నవ్వారు. "ఇది కథగా కాదయ్యా, కుర్రాణ్ణి నిడదవోలు కాదు, ఇంగ్లాండు పంపించు" అంటూ అప్పటికప్పుడు కుర్రాడికి ఆయనే పేరు పెట్టారు - బారిస్టరు పార్వతీశం - అని. అదీ ఆ గొప్ప నవల ఒక గొప్ప పాత్ర పుట్టుక కథ.

నరసింహ శాస్త్రిగారిది అతి సౌమ్యమైన మనస్తత్వం. ఆయనకి నేను నాటకం రాయడం నేర్పడం ఏమిటి? - అది వారి సౌజన్యం. అంతే.

 

ఏప్రిల్ 10: మద్రాసు ప్రయాణం. మెయిలు నిండా ఎన్‌టీఆర్ పెళ్ళి బంధువులు. కాని టీసీలు (ట్రావెలింగ్ టిక్కెట్టు ఇనస్పెక్టర్లు) నా అభిమానులు. నన్ను ఒక కూపే ఎక్కించారు.

సినిమా రచనకి మద్రాసు వెళ్తున్నాను. మద్రాసు వెళ్ళడానికి విజయవాడలో మద్రాసు మెయిల్ చాలా పాపులర్ రైలు ఆ రోజుల్లో. రాత్రి 9 గంటలకి విజయవాడలో ఎక్కితే ఉదయం 5 గంటలకి మద్రాసు. సినిమాల వారందరికీ ఆ రైలు లాయకీ. ఆ రోజు విజయవాడలో ఉన్న ప్రతి పంపిణీదారుడూ, ప్రతి సినీ ప్రముఖులూ ప్లాట్‌ఫారం మీద ఉన్నారు. నవయుగ శ్రీనివాసరావు గారూ, చంద్రశేఖర రావుగారూ, విజయా పూర్ణచంద్ర రావుగారూ, లక్ష్మీ ఫిలింస్ పంపిణీదారులు - అంతా ప్లాట్‌ఫారం సినీమా జనంతో క్రిక్కిరిసిపోయింది. ఈ పరిస్థితిలో మద్రాసు వెళ్ళగలనా అని సందేహించాను. నా చుట్టు - రైల్వే టికెట్ కలెక్టర్ మిత్రులు. బాబూరావు, చక్రవర్తి, దాశరథి, నారాయణరావు - 46 సంవత్సరాల తర్వాత నాకు గుర్తున్న పేర్లు. నేను కంగారు పడుతున్నాను. ఈ లోగా మెయిల్ వచ్చేసింది. సినీ పెద్దలంతా బిలబిలమని ఎకుతున్నారు. నా మాటేమిటి? మా మిత్రుల నవ్వే సమాధానం. రైలు బయలుదేరే సమయానికి నన్ను ఒక ఫస్టుక్లాసు కంపార్టుమెంటు దగ్గరికి తీసుకొచ్చారు. ఒక కూపే తలుపు తెరిచారు. "గురువుగారూ.  ఇది మీ కూపే. మద్రాసు దాకా దీనిలో ఎవరూ ఎక్కరు. గుడ్ లక్!" అన్నారు. ఆశ్చర్య,. చిన్నపాటి గర్వం - అంతమందిలో నకు ఈ గౌరవం, సుఖం దక్కినందుకు.

ఈ కథకి నీతి: పెద్ద పెద్ద సంతర్పణాల్లో కూడా - వడ్డించేవాడు మనవాడు కావడం గొప్ప సౌకర్యం.

 

ఇక్కడిదాకా రాసి మిత్రులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌గారికి ఫోన్ చేశాను. పలకలేదు. మరో నిముషంలో చాంతాడంత నెంబరునుంచి ఫోన్. లక్ష్మీప్రసాద్ గారు సతీమణితో స్విట్జరులాండులో కారులో వేళ్తున్నారు. "ఓ సమాచారం ప్రసాదు గారూ! 1971 ఏప్రిల్ 11న ఎన్‌టీఆర్ కుటుంబంలో ఎవరికి పెళ్ళయింది?" అనడిగాను. ఆయన ఆచర్యపోయారు - అంత స్పధ్టంగా తేదీతో సహా అడుగుతున్నందుకు. "మీరు ఫోన్ పెట్టెయ్యండి. అయిదు నిముషాల్లో ఫోన్ చేస్తాను" అన్నారు. సరిగ్గా అయిదో నిముషానికి ఫోన్. "హరికృష్ణ గారితో మాట్లాడాను. ఏప్రిల్ 11న జయకృష్ణకి మద్రాసులో ఎబోట్స్బరీలో పెళ్ళి జరిగింది" అన్నారు.

డైరీలు ఎన్ని జ్ఞాపకాలను తవ్వి బయటికి తోస్తాయి!.

***

Bio

గొల్లపూడి మారుతీ రావు

గొల్లపూడి మారుతీ రావు: గొల్లపూడి మారుతీ రావు గారి పేరు తెలియని తెలుగు వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. గొల్లపూడి మారుతీరావు గారు సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి.  తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితులు. శతాధిక నాటకాలు, కథలు, నవలలు, వ్యాసాలు, కవితలూ రాశారు.  రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశారు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తి కి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. విజయనగరంలో జన్మించిన మారుతీ రావు గారి ప్రస్తుత నివాసం విశాఖపట్నం. ప్రపంచవ్యాప్తంగా శతాధిక పురస్కారాలు అందుకున్నారు.

***

Comments
bottom of page