MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
మధురవాణి ప్రత్యేకం
నా డైరీల్లో కొన్ని పేజీలు... 13
గొల్లపూడి మారుతీ రావు
జగమే మాయ
1973 జనవరి 16: నేనూ పూర్ణచంద్రరావుగారూ "దో గజ్ జమీన్ కే నీచే" సినిమా చూశాం.
మిత్రులు, సినీ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరాబుగారు చిన్న చిత్రాల 'రుచి' మరిగిన రోజులు.
చిన్న చిన్న చిత్రాల నిర్మాణంతో ప్రారంభించి, అంతకు ముందు ప్రముఖ నిర్మాత ఎస్. భావనారాయణగారి కంపెనీలో ప్రొడక్షన్ చూసేవారు) అలా ప్రొడక్షన్ చూసి, పెద్ద నిర్మాతగా మారిన మరొక వ్యక్తి వై.వి.రావుగారు. ఈయన భావనారాయణగారికి బంధువు. ఈయన చిత్రాలు జగద్విదితాలు. నిప్పులాంటి మనిషి, నేరం నాది కాదు ఆకలిది, లాయర్ విశ్వనాధ్.. ఇలా)
విశ్శు అనే ఓ తమిళ దర్శకుని సారధ్యంలో చిన్న చిత్రాల నిర్మాణం ప్రారంభించారు. "అగ్గి మీద గుగ్గిలం" వంటి చిన్న చిత్రాల నిర్మాణం చేశారు. అవి పెద్ద పెట్టుబడితో నిర్మించినవి కావు. తీరా అటూ ఇటూ అయినా పూర్తిగా నిర్మాతను ముచేసేవీ కావు. ఆ చిత్రాలు అంతంత మాత్రంగా నడిచాయి. నిర్మాతలని మిగిల్చాయి. ఆ 'రుచి', ఆ అలవాటూ విడిచిపెట్టని వ్యాపారి పూర్ణచంద్రరావు. అలాంటి చిత్రాలు మరో మూడు తీశారు. ఓ ఇంగ్లీషు చిత్రాన్ని మాతృకను చేసుకుని (Death rides a Horse) తెలుగులో నిర్మాణాన్ని చేశారు. అప్పటి చిన్న నటి, ఇలాంటి పాత్రలలో రాణించే జయలలిత ప్రధాన పాత్రను పోషించింది. ఇక మిగతా పాత్రలు త్యాగరాజు వంటి చిన్న చిన్న నటులు నటించిన గుర్తు. చిత్రం పేరు: "రౌడీ రాణి". దర్శకులు కె.ఎస్.ఆర్.దాస్. చిత్రం .. కథలో వేగానికీ, కొత్తదనానికి పెద్ద హిట్. జయలలితకు మంచి పేరొచ్చింది. రాత్రికి రాత్రి ఆమె పెద్ద నటీమణి అయిపోయింది. ఆ చిత్రానికి లక్ష్మీ ఫిలింస్ పంపిణీదారులు. వ్యాపారులకు విజయం ముఖ్యం. చిత్రం స్థాయి కాదు. అలా చూస్తే చిత్రం స్థాయిలో ఇది బొత్తిగా లెక్కలోకి రాని చిత్రం. అయితేనేం. పెద్ద హిట్. పూర్ణచంద్రరావుకి మంచి డబ్బు వచ్చింది. ఆ సినిమా 50 రోజుల సభకి మేమంతా విజయవాడ తరలి వెళ్లాం. 50 రోజుల పూర్తి పేజీ ప్రకటనని నేను రాశాను.
ఆ చిత్రానికి వచ్చిన లాభాలతో పూర్ణచంద్రరావు అనే చిన్న నిర్మాత సాంబశివన్ స్త్రీట్‌లో ఓ చిన్న ఇంటిని కొనుక్కున్నారు. డబ్బు పంపిణీదారులు పంపారు. ఆ యిల్లూ, పక్కనే ఖాళీ స్థలంలో కాటేజీ.. చాలా ముద్దుగా విజయం హద్దుల్లో ఉన్నప్పుడు ఉండే హంగులన్నీ ఉండేవి.
అటు తర్వాత ఇలాగే మరొక చిత్రాన్ని ఎంపిక చేశారు పూర్ణచంద్రరావు. సినిమా పేరు (Lost in the Desert) పూర్ణచంద్రరావుగారికి ఒక ఒడుపు ఉంది. కాగా మాతో పంచుకోని విషయం ఆర్ధికం. ఏ విధంగానూ చేతులు కాలని ప్రయోగం. వస్తే నాలుగు డబ్బులు రాలతాయి. అంతవరకే.
ఈ చిత్రానికి నేను స్క్రీన్‌ప్లే, రచన అన్నీను. కాగా పెద్ద ఊడబొడిచే సీన్లు లేవు. కథంతా ఎడారిలో జరుగుతుంది. అయితే ఇటుపక్క ఇంట్లో సీన్లకు పెద్ద నటవర్గాన్నే ఎంపిక చేశారు పూర్ణచంద్రరావు. ఎస్.వి.రంగారావు, నాగేష్, కైకాల సత్యనారాయణ, భాష ప్రమేయం ఎక్కువగా లేని ఓ కుర్రవాడు ఎడారిలో ఇరుక్కున్న కథ.
దర్శకుడు వి.రామచంద్ర రావు. రెండు భాషలని దృష్టిలో పెట్టుకుని రంగారావు, నాగేష్‌లని నిర్దేశించారు. ఆయన ప్రయత్నం ఊరికే పోలేదు. రాజస్థాన్ జైసల్మేర్ ఎడారిలో 20 రోజులు పైగా తీసిన ఈ చిత్రం పెద్ద హిట్ రెండు భాషల్లోనూ. ఆ రోజుల్లో కుర్రాడు ఎడారిలో ఇరుక్కున్న చిన్న విమానాన్ని పూర్ణచంద్రరావు కొనుగోలు చేసి ప్రతీ పట్టణంలోనూ ఆ విమానం ద్వారా కరపత్రాలను పంచారు. అదొక ప్రత్యేక ఆకర్షణ అయింది. చిత్రం ఎంత బాగా పోయిందంటే, తీరా మేం కాపీ కొట్టిన హాలీవుడ్ మూల కథ నిర్మాతల దాకా ఈ విజయం పాకుతుందేమోనని భయం వేసింది. వాళ్లు కేసు పెడితే లక్షల డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలి. ఎలా? నా స్క్రీన్‌ప్లేని యధాతథంగా ఓ నవలగా నా చేతే రాయించి ఆ పుస్తకాన్ని అచ్చు వేయించారు పూర్ణచంద్రరావు. ఇది బలహీనమయిన సాకు. ఏమయిన ఈ నేరం హాలీవుడ్ దాకా పాకలేదు. విజయం పూర్ణచంద్రరావుకి దక్కింది.
వ్యాపారికి ఇదో ఆర్జన మార్గం. కొండకి వెంట్రుకని బిగించడం. వస్తే నష్టం తగు మాత్రం. లాభం వస్తే తగు మాత్రమే. పోయేదీ లేదు.
ఇటు పక్క మేం పూర్ణచంద్రరావుగారి కోసం "దేవుడు చేసిన పెళ్లి" వంటి పెద్ద చిత్రాల కథ (శోభన్ బాబు, శారద) రూపు దిద్దుతుండగా మరొక టుమ్రీని పట్టుకునారు. దాని పేరు "దో గజ్ జమీన్ కే నీచే" "భూమికి రెండు గజాల క్రింద" అని శీర్షిక. ఊరు పేరు లేని వారెవరో నిర్మించినది. ఆనాడు మద్రాసు ఆనంద్ థియేటర్లో మద్యాహ్నం ఆటగా రిలీజయింది. దాదాపు ఎవరూ పట్టించుకోలేదు. ఓ ప్రేమ పిశాచి హత్య, దయ్యాలు.. ఇలాంటి కథ ఎవరినీ ఆకర్షించలేదు. కాని పూర్ణచంద్రరావు వ్యాపార దృష్టికి నచ్చింది. ఇది మరో కొండకి కొత్త వెంట్రుక.
అయితే ముందు రెండూ రెండు రకాలయిన సాహస గాధలు. తనకి జరిగిన అన్యాయానికి ఒక స్త్రీ ఎదురు తిరగడం మొదటి కథ అయితే , నిస్సహాయంగా ఎడారిలో ఇరుక్కున్న కుర్రాడిని రక్షించడం రెండో కథ. వాటితో పోలిస్తే ఈ కథకి బొత్తిగా 'పలుకు' తక్కువ. కాగా హత్యలూ, దయ్యాలు - ఈ వాతావరణం అందరికీ నచ్చని morbid కథనం. పూర్ణచంద్రరావు అనే వ్యాపారికి మరో నిర్మాణాత్మక కోణంలో ఈ కథ నచ్చి ఉండవచ్చు. ముందు రెండు రకాలయిన విజయాలను చూసిన మాకు ఏ విధంగానూ ఆయన 'నిర్ణయా'న్ని ప్రశ్నించాలనిపించలేదు. కాకపోతే ఈ వాతావరణం దాదాపు మా అందరికీ కొత్తే. బహుశా పూర్ణచంద్రరావుగారికి ఇది 'అగ్గి మీద గుగ్గిలం' ధోరణికి దగ్గరేమో.
ఏమయినా 'దేవుడు చేసిన పెళ్లి' వంటి కథలకు పూనుకున్న తాతినేని రామారావుకి ఇది ఇనుప గుగ్గిళ్ళు. కనుక ఇలాంటి కథల్లో ఆరితేరి, ఈ మధ్య విజయాన్ని చవి చూసిన ఓ దర్శకుడిని పూర్ణచంద్రరావుగారు ఎంపిక చేశారు. 'జగత్ కిలాడీలు', 'జగత్ జెట్టీలు' తీసిన ఐ.ఎస్.ఎన్. మూర్తి. ప్రతి సాంకేతిక నిపుణుడికి ఒక ఒడుపు ఉంటుంది. అయితే తెలిసి కొంత, తెలియక కొంత ఆయనకి మేమంతా అడ్డం పడిన మాట నిజం. ఇది గతుకుల రోడ్డులో గుర్రబ్బండి నడక. పాపం, మూర్తిగారు మమ్మల్ని తట్టుకున్నారు. తీరా ఇలాంటి క్రైం కథల రచన నాకూ కొత్త. వీటిలో ఆరితేరిన, ఆనాటి పాపులర్ రచయిత ప్రతాపరావు అనే ఆయన్ని పిలిపించారు. అయితే కథ, కథనం, మాటలు - అన్నీ నా పేరు వేసుకునే అవకాశం ఇచ్చారు.
ఇక ఈ చిత్రంలో నటీనటులు ఒక హీరో, ఒక విలన్ కావాలి. పూర్ణచంద్రరావు అనే అనుభవం ఉన్న నిర్మాత వెతికి వెతికి ఇద్దర్ని పట్టుకున్నారు. ఇది చలన చిత్ర సీమకు చరిత్ర. ఒక యువకుడు విజయవాడలో వ్యాపారి. పేరు రాజబాబు. నాటకానుభవం ఉన్న వ్యక్తి. మరొకరిది ఒంగోలు. పేరు శేషగిరిరావు. ఈయనకి బోలెడంత నాటకానుభవం ఉంది. ఇద్దరూ స్పురధ్రూపులు. మాకు చేరిన చాలా ఫోటోలు, వ్యక్తుల నుంచి ఏరి ఈ యిద్దర్నీ ఎంపిక చేశాం. చేసింది లగాయతు చిత్ర నిర్మాణం వివరాలు స్థిరపడేవరకూ ఈ యిద్దరూ రోజూ వచ్చి 8 విజయరాఘవాచారి రోడ్డులో లక్ష్మీచిత్ర వరండాలో కూర్చునేవారు.
ఇద్దరిలోనూ రాజబాబు కాస్త వెనుక వచ్చాడు. అతని ముఖం కొంత లలితంగా ఉండడం వల్ల ఇద్దరినీ పోల్చి చూసుని ముందుగా శేషగిరిరావుకి అనుకున్న పాత్రని ఇటు మార్చాం. అంటే రాజబాబు 'హీరో' అయ్యాడు. పేరు బొత్తిగా మామూలుగా ఉన్నదని పూర్ణచంద్రరావుగారు 'మోహన్'గా మార్చి తీరా 'మురళీమోహన్' చేశారు. శేషగిరిరావు 'గిరిబాబు' అయ్యాడు.
ఇక అభ్యంతరాలేమున్నాయి? చిత్ర నిర్మాణం శరవేగంగా సాగింది. అయితే ఏ దశలోనూ సెల్యూలాయిడ్ మీద కథనం "ఓహో" అనిపించలేదు. మాకే కాదు. రిలీజయాక ప్రేక్షకులకీ అనిపించలేదు. ఫలితం . చిత్రం ఫ్లాప్.
అయితే తెలుగు చిత్ర సీమకి ఇద్దరు ప్రముఖ నటుల్ని పరిచయం చేసిన ఘనత పూర్ణచంద్రరావుగారికీ, పరోక్షంగా ఆ చిత్రానికీ దక్కింది. మురళీమోహన్ ముందుకాలంలో నిర్మాతగా, వ్యాపారిగా, రాజకీయవేత్తగా ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. గిరిబాబు నిర్మాతగా, హీరోగా, కథా రచయితగా, దర్శకుడిగా ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
ఈ విధంగా కేవలం వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్ణచంద్రరావుగారు నిర్మించిన మూడు చిత్రాలూ మూడు కారణాలకి చరిత్రని సృష్టించాయి.
మొదట్నుంచీ చిన్న కమతంలో బంగారు పంటలు పండించడంలో ఒడుపు చూపిన నిర్మాత పూర్ణచంద్రరావు. అయితే ముందుకాలంలో దేశాన్ని ఊపి, పలకరించే, చరిత్రను సృష్టించే ఎన్నో చిత్రాలు.. హిందీ, తెలుగు, తమిళంలో - అంధా కానూన్, ఆఖ్రీ రాస్తా, మాంగ్ భరో సజనా వంటి పెద్ద పెద్ద హిట్ చిత్రాలకు నిర్మాత అయ్యారు. అమితాబ్ బచ్చన్‌కి ఆయన ఒక దశలో ప్రియతమ నిర్మాత అయ్యారు. ఆయన నిర్మించిన "అంధా కానూన్" రజతోత్సవ వేడుకలు మద్రాసు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగాయి. నేను ఒకే ఒకసారి ఆ కార్యక్రమానికి ఇంగ్లీషులో వ్యాఖ్యాతగా చేశాను.
ఆ దశలో పూర్ణచంద్రరావు వైభవం, కీర్తి వర్ణనాతీతం.
*****