MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వ్యాస మధురాలు
సాహిత్యం -మన ఆలోచనలూ పరిమితులూ - 1
మెడికో శ్యాం
గజల్ నిర్వచనాలన్నిటిలోకీ గజలంటే 'ప్యార్ కా గుఫ్తగూ' అన్నది నాకిష్టం. గుఫ్తగూ అంటే సంభాషణ.
సాహిత్యరూపాలన్నీ సంభాషణలే.
అంటే- నాలో నేను, తనలో తను, ఇద్దరి మధ్యా , కొందరి మధ్యా సంభాషణలే.
వ్యాసాలు బహుశా మోనోలాగ్సేమో.
ఇవాళ ఇదీ మీకూ, నాకూ మధ్య సంభాషణ. మనం, మీరూ, నేనూ - సాహితీవేత్తలం. ఇపుడు రాసేవాడూ, చదివేవాడూ ఒకటే. నిజానికి రాసేవాళ్ళమున్నాము కానీ, చదివేవాళ్ళము ఎక్కువగా లేము.
నా ఆలోచనలు. నాకు ఆశ్చర్యం కలిగించే, కలిగిస్తున్న విషయాలు కొన్ని గతం లో జరిగినవీ, ఇపుడు జరుగుతున్నవీ. అదే అదే పుస్తకం. పదే పదే విడుదల. ఇంకా రాని సంకలనాలపై అపుడే జరిగిన సంచలన సంకుల సమరాలు.
విపులాచ పృథ్వీ కాస్త గ్లోబల్ విలేజయి, ఇంకా ఇంకా కుంచించుకుపోతున్న కాలంలో మనమున్నాము. మన ప్రపంచం తరిగి, తరిగి సాహితీకారుల గుంపుగా మిగిలింది. సముదాయం కూడా కాదు. మనుష్యుల మధ్య సంబంధాలూ కుంచించుకుపోతున్న సమయంలో, మనుషుల కోసం సమయాన్ని వెచ్చించలేని మానసిక పరిస్థితులలో న్యూసుల్లోంచి ఊసుల్లాగి వ్యూస్ వెలిబుచ్చుతున్నారు. కథకులు. నవలంత లోతుగా జీవితంలోకి తరచిచూసే అవకాశం లేదనిపిస్తుంది.
ఒకసారి కుటుంబరావుగారిని ఎవరో ఫిక్షను ఎందుకు రాయటం లేదని కాబోలు అడిగారు. ఆయన- "నేను తెలుగుదేశంలో లేకపోవటం వలన, తెలుగు జీవితాన్ని సరిగ్గా గమనించే స్థితిలో లేకపోవటం వలన" అన్నట్టుగా చెబితే అడిగినవాళ్ళు అంగీకరించినట్టు లేదు.
నేను కూడా - "ఏం? ఆంధ్రాలో లేకపోతేనేం? మదరాసులో తెలుగువాళ్ళు లేరా? వాళ్ళది తెలుగు జీవితం కాదా? ఎక్కడున్నా జీవితమొక్కలాంటిదే కదా? వగైరా, వగైరాలనుకున్నాను.
కానీ, ఇవాళ ఆలోచిస్తూంటే నిజమే కదా ఆయనన్నది? అనిపిస్తోంది. మనం ఇవాళ ఏ జీవితానికీ దగ్గర్లో లేము. ఇకడి ప్రజల జీవన స్రవంతిలో భాగమే కాము. ఏదో, ఎవరిదోనని వర్చువల్ బబుల్ లో ఉన్నట్టున్నాము. మనకెందరో షేరింగు ఫ్రెండ్సు. అంతా సూపర్ ఫీషియల్. నిజానికి ఎవరికి ఎవరు? అనిపిస్తోంది.
1963లో ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీలో అబ్బూరివారు ఆధునిక సాహిత్యం గురించీ, తెలుగు రచయితల గురించీ రాసారుట.... బుచ్చిబాబు గారి పేరు మాత్రం వదిలేసేరట. అని బుచ్చిబాబు గారు తన డైరీలో బాధపడుతూ రాసుకున్నారు. అది చదివి నేనూ బాధపడ్డాను. అదెలా సాధ్యం? అని.
నేనెపుడో మరో సందర్భంలో రాసిన మహానుభావులూ మామూలు మనుషులేనా? అన్న వాక్యం గుర్తొచ్చింది.
శ్రీశ్రీ గారు "వైతాళికులు" లో తన కవిత ఉండకుండా ఉంచటం కోసం ప్రయత్నాలు జరిగేయి అని రాసినది కూడా గుర్తొచ్చింది.
ఒకసారి నేను చదువుకునే రోజుల్లో డెబ్భైల్లో ఆంధ్రప్రభవాళ్ళు మధురాంతకం గారి కథనీ, రావిశాస్త్రిగారి కథని తిరస్కరించేరనీ, మధురానతకం గారు బాధపడ్డారనీ భరాగో చెబితే ఆశ్చర్యపోయాను. ఇంకా ఆశ్చర్యపోతూనే ఉన్నాను. ఏదో తెలివిగా, లాజికల్ గా-- "పెద్ద కథకులయితే వేసెయ్యాలా?" అనలేకపోతున్నాను.
వాకాటి పాండురంగారావు గారు అకాడెమీ కోసం ఏదో సందర్భంలో ప్రత్యేకంగా చేసిన ఒక కథాసంకలనంలో ఒక అకాడెమీ అవార్డు గ్రహీత కథ లేదు, తను చాలా సరైన పద్ధతిలో ఆ సంకలనానికి కథల ఎంపిక చేసాననీ, అరవైకి బదులు అరవై మూడు కథలని చేర్చాననీ ఆయన నాతో అన్నారు.
ఇలాంటి అనుభవాలు నాకూ ఉన్నాయి. ఒక ఉదాహరణ - సుభాన్ గారు వేసిన కథాసాగర్ 87 కథల సంకలనాన్ని -ఆ రోజుల్లోనే మూడు వందలు ఖరీదు చేసే హార్డ్ బౌండ్ పుస్తకాన్ని నాకు ఉచితంగా ఇచ్చి, రివ్యూ రాయమన్నారు.
"రివ్యూకి నేను గుర్తొచ్చానా? కథల సంకలనం సమయంలో గుర్తు రాలేదా?" అని సరదాగా అంటే వచ్చిన సమాధానం మరో ఆశ్చర్యం. పల్లేటి బాలాజీ అనే రచయిత మిత్రుడూ ఉన్నాడక్కడే. -"గుర్తొచ్చేరు, గుర్తొచ్చేరు. మీ పేరు మా లిస్టులో ఉంది కనీ, మీ అడ్రసే తెలియలేదు. మీకూ, మాకూ బాగా తెలిసినవాళ్ళనడిగితే అతనికిపుడు సాహిత్యంలో అంతగా ఇంట్రెస్టు లేదు. మీకే సమాధానమూ రాదన్నారు." అన్నారాయన. ఇక తరువాత కథాకమామీషూ వివరించకపోవటమే ఉత్తమం.
వీటన్నిటిలోనూ, లేదా కొన్నిటిలోనూ రాగద్వేషాలున్నాయా? సరిగ్గా తెలీదు.
అయినా గతంలో జరిగినవివి. సదుద్ధేశంతోనే ఏవో విలువల కోసం విలువలు పాటిస్తేనే జరిగేయవి అని భావించి, వాటిని వెరిఫై చెయలేము కనుక అవి వదిలేద్దాము.
కానీ నడుస్తున్న చరిత్రలో జరుగుతున్న విషయాలు చూస్తూంటే మరింత ఆశ్చర్యం వేస్తోంది.
ఎంత మంచి ఉద్దేశ్యంతో ఎవరెంత మంచి పని చేసినా, ఆశించనివెన్నో, అనుకోనివెన్నో సంభవిస్తున్నాయి. కుంచించుకు పోతున్న ప్రపంచంతో పాటుగా, మన రచయితల మేధస్సూ, హృదయ వైశాల్యమూ కుంచించుకుపోతున్నాయా అనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు.
ఆ అ వైనాలన్నీ వచ్చే సంచికలో ముచ్చటించుకుందాము.
తరువాయి భాగము - వచ్చే జులై సంచికలో...
(హ్యూస్టన్ లో జరిగిన 42వ టెక్సస్ సదస్సులో ప్రసంగం ఆధారంగా...)