MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వ్యాస మధురాలు
తెలుగు సాహిత్యంలో పర్యావరణ స్పృహ – ఆవశ్యకత
డా. తన్నీరు కళ్యాణ్ కుమార్
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన వ్యాస పోటీ లో ఉత్తమ బహుమతి సాధించిన వ్యాసం
ఆధునిక ప్రపంచంలో అనేక రంగాల్లో మార్పులు కలిగినట్లుగా పర్యావరణంలో కూడా అనేక పరిణామాలు సంభవించాయి. ఆధునిక యుగం యాంత్రిక యుగం కావడంతో పర్యావరణం కలుషితమైంది. సృష్టిలోని అనంత ప్రాణకోటిలో బుద్ధిజీవి మానవుడు. మితిమీరిన స్వార్థంతో మానవుడు ప్రకృతిని వికృతిగా జేస్తూ, సృష్టిలోని సమతుల్యతను వినాశనం చేస్తున్నాడు. ప్రకృతి శక్తులను, సహజ వనరులను విచక్షణారహితంగా ఉపయోగించుకుంటూ, వాటిని మార్పులు చేర్పులకు లోను చేస్తూ పర్యావరణ కాలుష్యానికి కారకుడవుతున్నాడు. నేటి సామాజిక సమస్యలలో ఇది ముఖ్యమైనది.
ఆధునిక సాహిత్యంలో కవులు తమ రచనలలో ప్రకృతిని వర్ణించారు. ప్రకృతి ఆరాధన ఆవశ్యకతను తమ రచనలలో వ్యక్తం చేశారు. రాయప్రోలు, దేవులపల్లి, దువ్వూరి, విశ్వనాథ, జాషువ, కరుణశ్రీ, వెంకటేశ్వర పార్వతీశ్వర కవులు, నాయని సుబ్బారావు, వేదుల సత్యనారాయణ మొదలైన కవుల రచనలలో ప్రకృతి పట్ల ఆరాధన భావం ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఈ కవులు ప్రకృతిని గూర్చి, ప్రకృతిలో జీవజాలాన్ని వాటి పట్ల చూపాల్సిన భూత దయను గూర్చి పద్యాలు రాశారు. ప్రకృతిని ఆరాధించాలని ప్రబోధించారు. వీరి కవిత్వంలో ప్రకృతిని చూసి మురిసిపోవడమే కన్పిస్తుంది గానీ భవిష్యత్తులో ప్రకృతికి కలుగబోయే వినాశనాన్ని గూర్చి, ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకతను గూర్చి చెప్పినట్లు కన్పించదు.
కాలం గడుస్తున్న కొద్దీ కాలుష్యం పెరిగిపోతూ ఉండటాన్ని గుర్తించిన మరికొంత మంది రచయితలు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ప్రబోధించారు. ఈ పర్యావరణ చేతన అనేది సాహిత్యంలో విలువైన వస్తువుగా గ్రహించబడింది. తెలుగు కవులు పర్యావరణ సమస్యల పట్ల స్పందించి మానవాళికి తమ సాహిత్య సృష్టి ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే హితోపదేశం చేస్తున్నారు. రచనల ద్వారా పర్యావరణ పరిరక్షణను ప్రబోధిస్తూ ప్రజలను జాగృతం చేసి, కర్తవ్యోన్ముఖులను చేసే ప్రయత్నం చేస్తున్న తెలుగు రచయితలు – రచయిత్రులు అభినందనీయులు.
ప్రకృతిలో అత్యంత ప్రాధాన్యం వహించిన వృక్షాన్ని సంరక్షించకపోవడమే కాలుష్యానికి ప్రధాన కారణం. ‘వృక్షో రక్షతి రక్షితః’ అనే ఆర్యోక్తిని శిరస్సున ధరించిన దుద్దేల పుల్లయ్య కరుణశ్రీ పుష్ప విలాపాన్ని దృష్టిలో పెట్టుకొని “వృక్షవిలాపం” అనే కావ్య సంపుటిని 2000వ సంవత్సరంలో ప్రచురించారు. జంతు విలాపాన్ని వినిపించారు. ధూమపానాన్ని ఖండించారు. సామాజిక వనాల ఆవశ్యకతను చాటి చెప్పారు. ఆయన ‘పర్యావరణ రక్షణ – సుబాబుల్ చెట్లు’ అనే పదమూడు పద్యాల కవితా ఖండికను రాశారు. ఇది “వృక్ష విలాపం “ కావ్య సంపుటిలో ఇది ముద్రించబడింది. “స్వార్థబుద్ధిని నరుకుచు అడవులన్ని, చేటు కొని తెచ్చుకొంటిమి చేతులార, చాల పరిశోధనలు చేసి శాస్త్రవిదులు, ఇట్టి విషమస్థితిని దాటి గట్టు కెక్క, చెట్లు పెంచుడీ శరణని చెప్పినారు” అని లోకానికి చెట్లు పెంచడమే శరణ్యమని చాటి చెప్పారు. “చెట్టు లెక్కుడుండుట కదా! శ్రేయమగును, అత్యనావృష్ఠులు తుఫాను లాగిపోవు, అట్టి మమ్ముల చంప నీ కెట్టులొప్పు, మానవా! నీవు తలచునా! మనము నందు” – పుల్లయ్య చెట్ల వలన ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో క్రమంగా వివరిస్తూనే, అటువంటి చెట్లను నరకడానికి మనిషికి ఎట్లా బుద్ధి పుట్టిందని, చేతులెట్లా ఆపని చేయడానికి ఒప్పుకున్నాయంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు. చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల అతివృష్టి – అనావృష్టి - తుఫానుల బారి నుండి కాపాడవచ్చని, కావున జనులంతా మనసుపెట్టి ఆలోచన చేయాలని విన్నవించారు. మానవుడా! చెట్లను నరికి దానవుడు కావద్దని హెచ్చరించారు.
మానవుడు చెట్టును ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలువునిస్తూ మాలకొండారెడ్డి ‘చెట్టు’ కవితలో “జీవిత లక్ష్యాన్ని గూర్చి చెట్టేమని అంటుంది, ప్రతిఫలమిస్తూ ఆశింపక ఫలము లీయమంటుంది, నడవలేదు గానీ మంచి నడవడి చూపిస్తుంది” చెట్టు ఫలితాన్ని ఆశించి పనిచేయదు. మానవుడు కూడా ఆ విధంగా పనిచేయాలనీ కవి కాంక్షించారు. వాస్తవానికి చెట్టు నడవలేదు, కానీ అది ఎదిగే క్రమాన్ని చూసి మనిషి మంచి నడవడిక నేర్చుకోవచ్చునని తెల్పారు. గెడ్డాపు సత్యం రాసిన ‘చెట్టు’ కవితా ఖండికలో చెట్టును త్రిమూర్తులతో పోల్చారు. “సృష్టికర్తవె యాహార సృష్టి వలన, స్థితికరుండవె యాశ్రమ శుద్ధి గూర్చి, శివుడవే వాయు కాలుష్య శిక్ష వలన, నీవు నిజముగా ప్రత్యక్ష దైవతమవు” అంటారు. అట్లే చెట్లు లేకపోతే కలిగే పరిణామాలను వివరిస్తూ – “నీవు లేని జగము నిర్ధూమ ధామమ్ము, నీవు లేక నిలువ నీడ లేదు, నీవు లేని పుడమి జీవన రహితంబు, నీవు లేక ప్రాణి నిలువలేదు” అని పేర్కొన్నారు.
కవి వడ్డేపల్లి కృష్ణ ‘చెట్టే ప్రగతికి మెట్లు’ అనే కవితలో చెట్లను గూర్చి “చెట్టే ప్రగతికి తొలి మెట్లు, చెట్లే జగతికి పనిముట్లు, అందుకే వాటిని పెంచాలి, ఆనందాలను పంచాలి” – అంటూ చెట్ల ఆవశ్యకతను తెల్పారు. చెట్ల ప్రాశస్త్యాన్ని గూర్చి జయంపు కృష్ణ ‘చెట్లకు నమస్కారం’ అనే కవితలో “నిలువెత్తున వృక్షాలు....మహావీరుల వృక్షాలు, వరదల నుండి తుఫాను బెడదల నుండి రక్షణ యిస్తాయి, జీవులు వదలిన కర్బన విషాన్ని భక్షణ చేస్తాయి, చెట్ల త్యాగం గణన చేయలేనిది “- అంటూ చెట్లు జీవరాశుల్ని ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడుతున్నాయని, వాటి త్యాగం లెక్కకు సాధ్యం కాదని వివరించారు. విష వాయువుల్ని స్వీకరించి, ప్రాణ వాయువును మానవులకు అందిస్తున్న చెట్ల రుణం మానవాళి ఏవిధంగా తీర్చుకోలేనిదిగా మిగిలిపోతుందని కవి హితవు పల్కారు. నరులకు తరువులే గురువులని ప్రబోధిస్తూ జంధ్యాల పాపయ్యశాస్త్రి –
“తలపయి మండుటెండలను దాలచి చల్లని నీడలిచ్చు పాం,
ధిలకు, కఠోరమౌ శిలలతో పడమోదిన పూలు కాయలున్,
ఫలములొసంగు, ప్రాణములు బాసియు కాయము కోసి యిచ్చు నీ
యిల నరజాతికన్ తరువులే గురువుల్ పరమార్ధ బోధనన్” – అని తెల్పారు.
చెట్లకు తెలిసిన చరిత్ర మనుష్యులకు కూడా తెలియదని పేర్కొంటూ, జ్ఞానాన్ని ప్రసాదించే దైవంగా చెట్లను అభివర్ణిస్తూ ఆచార్య పసుల వెంకటరెడ్డి ‘విచ్ఛిన్న స్వప్నం’ అనే కవితలో – “తరతరాల చరిత్ర తెలిసిన మహా వృక్షాలు, మనిషికి ప్రకృతి ప్రసాదించిన జ్ఞాన ప్రదాతలు, సమస్త జీవకోటికి ప్రాణ దాతు” అని పేర్కొన్నారు. మానవుడు మృత్యురూపంలో జీవరాశిని వెంటాడి మరీ వాటిని ప్రకృతిలో లేకుండా చేస్తున్నాడని, ఇంతే కొనసాగితే చివరకు ప్రకృతి ప్రళయాంతకమౌతుందని హెచ్చరిస్తూ కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ ‘జీవన వసంతం’ అనే కవితలో “మనిషి మృత్యువై అపురూప పక్షి జంతు జాతుల్ని, ప్రకృతి చిత్రం నుండి కర్కశంగా చెరిపేస్తున్నాడు, ఈ బాటలో ఇలాగే కొనసాగితే ప్రళయమే మన చివరి గమ్యం” అని అంటారు. ఆది మానవుడు స్థితి నుండి ఆధునిక మానవుడు స్థాయి వరకు మానవ ప్రస్థానంలో ప్రతి దశలోను చెట్టు మనిషికి అండగా నిల్చి ముందుకు నడిపించిన తీరును తెల్పుతూ పాపినేని శివశంకర్ ‘ఆకు పచ్చని లోకం’ కవితలో చెట్టు ప్రాముఖ్యాన్ని గూర్చి – “ఆకుపచ్చని లోకంలో ఆశ్రమాలు వెలిసినప్పుడు - వృక్షమూలం గురుపీఠమైంది, జీవిత మూలాలు వెదుకుతూ అడవికి చేరిన అహింసామూర్తికి - వృక్షమే మహాబోధి అయ్యింది, చెట్టు మన ఆది దేవత” - అని పేర్కొన్నారు.
ఒకప్పుడు నాగరికతలు విలసిల్లడానికి దోహదపడిన నదులు నేడు మానవులు చేస్తున్న అనాలోచిత చర్యలతో కాలుష్యం బారిన పడుతున్నాయి. నీరు స్వచ్చమైనదిగా వుంటే మానవాళి సుఖశాంతులతో ఉంటుందని, లేకపోతే ప్రాణాంతకమైన అరిష్టాలు ప్రారంభమౌతాయని హెచ్చరిస్తూ కె.వి. రామానాయుడు ‘జల ప్రస్థానం’ అనే కావ్యంలో ‘జల కాలుష్యం’ అనే కవితలో – “యంత్రాల సర్పాల కోరల్లోంచి జారిన విషాన్ని తోసేస్తారు, నదిలోకో జలనిధిలోకో, నాగరికతను నిలబెట్టిన నదులు, అనాగరికంగా హింసించబడ్డాయి” –పేర్కొన్నారు. గతంలో సముద్ర జలాలు స్వచ్ఛంగా ఉండేవి. అందులో జీవించే జీవరాశులు సుఖవంతంగా బతికేవి. ఆ పరిస్థితులు ప్రస్తుతం కనుమరుగవుతున్నాయి. జలచరాలు వాణిజ్య వస్తువులుగా మారిపోవడం, విస్తరిస్తున్న నూనె బావులు, బ్లోఅవుట్ - డ్రిల్లింగ్ వల్ల నూనె సముద్రంలోకి వచ్చి చేరుతుంది. సముద్రాల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వాటిలోని ప్రాణులకే కాదు మొత్తం భూగోలానికే ప్రమాదమన్న సంగతిని నేడు విస్మరిస్తున్న తీరును నిరసిస్తూ డాక్టర్ పి. విజయలక్ష్మీ పండిట్ ‘సముద్ర సంపదలను కాపాడుకో’ అనే కవితలో – “చమురు బావులు ఓడలు ఒలికించిన, చమురు పేరుకొని కలుషితమై, అపార సముద్ర జీవ సంపదకు, మృత్యు కుహరాలైనాయి” – అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
నీటి కోసం బాధలు పడటం ఆదికాలం నుండి ఉందని, మానవాళి ఈ విషయాన్ని గమనించి నీటిని పొదుపుగా వాడుకొని భవిష్యత్తులో నీటి యుద్ధాలు జరగకుండా జాగ్రత్తపడాలనీ సూచిస్తూ ‘జలగీతం’ అనే దీర్ఘ కావ్యంలో “ నీటి కోసం స్పర్థలు ఈనాటివి కాదు, నీటి కోసం తిప్పలు ఈనాటివి కాదు, యుగాంతాలు అవతార పురుషుడి కోసం, జలాంతరంగాలు భగీరథుని కోసం నిరీక్షించాయి” – అంటూ కృత, త్రేత, ద్వాపర యుగాల్లో కూడా నీటి కోసం జరిగిన ఇబ్బందులు ఉన్నాయని, భగీరథుని ప్రయత్నంతో సుసంపన్నంగా నీరు భూమి మీదకి వచ్చిందని కవి నీళ్ళ పూర్వస్థితిని వివరించారు. సహజ సంపదలైన నదుల్ని కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని లేని పక్షంలో ఈ శతాబ్దం కాలుష్య శతాబ్దంగా మారిపోతుందని, మానవ జాతి ఉనికికే ప్రమాద ఘంటికలు ఏర్పడతాయని గోపి హెచ్చరిస్తూ – “జ్ఞానం వికసించిన జలతీరాల్లో వాణిజ్యం పడగవిప్పింది, మితిమీరిన వాణిజ్య దాహం నీటి ప్రాణాల్ని బలిగొంటున్నది, ఈ శతాబ్దం ఇక కాలుష్య శతాబ్దమేనా...” అన్నారు.
అద్దేపల్లి ప్రభు ‘పిట్ట లేని లోకం’ అనే దీర్ఘ కవితలో మానవుడు ఇప్పటికైనా మేల్కొని తన తోటి జీవరాశుల్ని కాపాడాలనే ఆకాంక్షతో ఉండాలని సూచిస్తూ – “కళ్లకొక పిచ్చుక కనపడదు, చెవులకొక కోయిల వినపడదు, మనిషి చుట్టూ డబ్బు గడ్డకొట్టి, అతడొక వొంటరి శిలాజంలా మిగుల్తాడు”- అని కవి పిట్టను పిట్టలాగా బ్రతకనివ్వమని ఆవేదనతో వేడుకుంటున్నారు. ఒకప్పుడు మానవులు పిచ్చుకల కోసం వరికంకుల్ని గుచ్చుగా వేలాడదీసికట్టేవారు. ఆ కంకుల్ని పిచ్చుకలు ఆనందంగా పీక్కుతింటూ కిచకిచరావాలు చేసేవి. అటువంటి పిచ్చుక జాతి నేడు అంతరించిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎస్.ఆర్. భల్ల ‘పిచ్చి(క) ప్రేమ’ అనే కవితలో – “పొట్టును వేరు చేసి గింజలు తినే, ప్రియాతి ప్రియమైన పిచ్చుక నెచ్చలి ఏది, సెల్ టవర్ల రేడియేషన్, పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా పనిచేస్తున్నదేమో....” అంటారు. పంటల దిగుబడి కోసం ఎక్కువగా పురుగు మందులు పిచకారి చేయడం వల్ల పిచ్చుకలకు తగిన ఆహారం దొరకడం లేదు. ఇదిగాక మితిమీరిన సెల్ టవర్ల నుంచి వెలువడుతున్న రేడియేషన్ తరంగాలు పిచ్చుకల పాలిట మృత్యుతరంగాలుగా వెంటాడుతున్నాయి. పిచ్చుకలు రైతులకు ఎంతగానో సహాయపడతాయని, పంటల్ని ఆశించే చీడపీడల్ని నాశనం చేయడంలో సహకరిస్తాయని కవి భల్ల పిచ్చుకల ప్రాశస్త్యాన్ని ఈ కవితలో ప్రస్తుతించారు. ఒక జాతి అంతరిస్తే జీవవైవిధ్యం దెబ్బ తింటుందని, సమతుల్యత లోపిస్తుందని, పక్షులు చూడటానికి చిన్నవి అయిన సమాజానికి వాటి అవసరం ఎంతో ఉంటుందని, వీటిని రక్షించుకోవాల్సిన గురుతర బాధ్యత అందరిపై ఉందని కవి ఈ కవితలో ఉద్బోధించారు.
పచ్చదనాన్ని పరిరక్షించుకోవడాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని, పచ్చని చెట్టు చేమలతో పర్యావరణాన్ని సంరక్షించుకుంటే మానవుని ఆయుర్ధాయం పెరుగుతుందని సందేశాన్నిస్తూ కె. విల్సన్ రావు ‘ఉద్యమించోయ్’ అనే కవితలో – “పచ్చదనం కోసం ఉద్యమించి, చెట్టుచేమలతో స్నేహించండోయ్, పర్యావరణాన్ని సంరక్షించండోయ్, సగటు జీవి ఆయుర్దయాన్ని పెంచండోయ్” – అంటూ పర్యావరణాన్ని సంరక్షించుకోవడానికి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆధునిక జీవనంలో సౌలభ్యం కోసం మనం విరివిగా ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లు పర్యావరణానికి విపరీతమైన విఘాతాన్ని కలుగజేస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్లు అనేక వేల సంవత్సరాలైనా భూమిలో కలిసిపోవు. .ప్లాస్టిక్ సంచుల్లో ఆహారం తినడం వల్ల మానవులు నానారకాల వ్యాధులకు గురిఅవుతున్నారు. జి.శ్రీనివాసులు ‘ప్లాస్టిక్ జీవితం’ అనే కవితలో ప్లాస్టిక్ మోజులో పడి మానవాళి ఎన్ని విధాలుగా నష్టపోతుందనే విషయాన్ని వివరిస్తూ – “ధనస్వామ్యపు విలువలకు....దారిద్ర్యపు బతుకులకు – నాగు పాములా వెంటపడుతుంది, అధికారం ధనం గవ్వలకు దాసోహమై, ప్లాస్టిక్ భూతం ప్రేమ పరుగులు తీస్తుంది.” – అంటూ ప్లాస్టిక్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అమెరికా , చైనా దేశాల్లో మొదట ప్రారంభమై నేడు ప్రపంచమంతా ప్లాస్టిక్ మాయలో పడిపోయిందని కవి పేర్కొన్నారు. ధనికునికి, దరిద్రునికి కూడా ప్లాస్టిక్ తాచుపాము పగబట్టి తిరుగునట్లు తిరుగుతుందని కవి పోల్చి చెప్పారు. ప్లాస్టిక్ వాడకం వల్ల ఆరోగ్యానికి ముప్పువాటిల్లుతుందన్న విషయం తెలిసి కూడా అధికారులు, రాజకీయ నాయకులు ఆర్థిక లబ్ది కోసం వీటిని తయారు చేసే పరిశ్రమల్ని మూయించడం లేదని కవి వీరి కుటిలనీతిని బహిర్గతం చేశారు.
రసాయనాలతో కూడిన ఎరువులు, ఎత్తుల్లో ప్రయాణించే విమానాలు విడుదల చేసే వాయువులు, అంతరిస్తున్న అడవులు, ఎక్కువవుతున్న వేడిమి ఇవన్నీ కలిసి ఓజోన్ పొరను బలహీనం చేస్తున్నాయి. సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు భూవాతావరణంలోకి ప్రవేశించండం వల్ల వాతావరణంలో క్లోరిన్ అణువులు ఏర్పడతాయి. అతినీలలలోహిత కిరణాలు ఎటువంటి వడపోత లేకుండా నేరుగా భూమి మీద ప్రసరించడం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు చోటుచేసుకుంటున్నాయి. క్యాన్సర్ లాంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. చర్మ వ్యాధులు, కంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఓజోన్ పొరకు చిల్లులు పడటం వల్ల పొంచియున్న పెను ప్రమాదాన్ని గూర్చి హెచ్చరిస్తూ డాక్టర్ పి. విజయలక్ష్మీ పండిట్ “ధరిత్రీ విలాసం” కవితా సంపుటిలో ‘ఓజోన్ పొర గాయాలపూడ్చు’ అనే కవితలో – “విష వాయువుల విసర్జనను, పూర్తిగా అరికట్టే మార్గం చూడు, ప్రాణవాయువు శాతం పెంచి, ఓజోన్ పొర గాయాలను పూడ్చడం, ప్రపంచ ప్రజలందరి బాధ్యత సుమా” – అంటూ మానవాళికి చేటును కలిగించే అతినీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా అడ్డుకోగల ఓజోన్ పొరను రక్షించుకోవడం ప్రపంచ ప్రజలందరూ తమ ప్రథమ కర్తవ్యంగా భావించాలని కవయిత్రి సూచించారు.
ఎం. సత్యవతి ‘కిట్–కీ’ అనే కవితలో భూమిని మానవులు తమ స్వార్థం కోసం ఎన్నో విధాలుగా హింసిస్తున్న విధానాన్ని గూర్చి – “భూమిని తొలిచే రాజకీయ ముషికాలు ఇనుప ఖనిజాన్నే తినేస్తుంటే, రాజకీయ భోతాళ యక్ష ప్రశ్నలకు కోకొల్లలు సమాధాన తులరాశులు, పచ్చని ప్రకృతిని మంటగలిపే సౌందర్య ఘూతకుల్ని కూకటి వేళ్లతో పెకలించాలి, అణు ఇంధనం వాటాలు పంచుకునే వృద్ధవృకోదరులంతా, భవిష్యత్ భారతాన్ని భరతం పట్టే పథక రచన మానుకోవాలి” – అంటూ రాజకీయ నాయకులు తమ పదవులను అడ్డంపెట్టుకొని భూమితో వ్యాపారం చేస్తూ మట్టి త్రవ్వి పారేస్తున్నారని, కొందరు వ్యాపారులు తమ వ్యక్తిగత లాభం కోసం అడవులను నరుకుతూ జీవరాశిని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు మానవాళికి ముప్పు కలిగించే అణు ఒప్పందాలకు స్వస్తి చెప్పాలని అన్నారు. ప్రకృతికి, పర్యావరణానికి విధ్వంసం సృష్టించే నయవంచకుల్ని నామరూపాలు లేకుండా నశించిపోయేవిధంగా కఠిన శిక్షలు విధించేలా చట్టాలు చేయాలని కవయిత్రి సూచించారు.
రసాయనాల విషాల వల్ల కుళ్ళిపోతున్న మత్స్య సంపదతోను, డాలర్ల కలల్లో పంట చేలను చేపల చెరువులుగా మార్చడం వల్ల ప్రకృతిలో పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. పండించే నేల, పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు అన్నీ విషపూరితమవుతున్నాయి. “రొయ్యల మడుగుల కింద,భూమాత కళేబరం వలవేస్తే, డాలర్లే పండాయి” అంటూ యన్. గోపీ తన నిరసనను వ్యక్తం చేశారు. టర్మినేటర్ విత్తనాల విలయ విన్యాసాన్ని, వాతావరణ కాలుష్యాన్ని పెంచుతున్న రసాయనాల వాడకాన్ని , వాటిని నిల్వ చేసే రైతుల ఇళ్ళ దీనస్థితిని పెరుగు రామకృష్ణ ఇట్లు వర్ణించారు. ““తల్లి వాసన వేసే పల్లె మట్టి యిప్పుడు టర్మినేటర్ విత్తుమింగి ఆత్మహత్యకు సిద్ధపడుతుంది, ప్రియురాలి తీపి స్పర్శ స్పృహకు తెచ్చే స్వచ్ఛమైన గాలి కాలుష్యపు కల్మషాన్ని మోసుకొని బరువుగా వస్తుంది, పల్లె పెద్దలూ అశ్రయమిచ్చే పచ్చని చెట్లు ….మొదడు లేని మనిషి నరిగిన మొదళ్ళతో కృంగిపోయాయి, పాడిపంటలతో తులతూగే పంట కాపుల ఇళ్ళు, విషపు రసాయనాలు పెంచిన వడ్డీ మూటల మధ్య, చీకట్లు వాంతి చేసుకునే జైళ్ళ గదుల్లా మారాయి.” – అంటూ వర్ణించారు.
అట్లే “పండేభూముల్ని తవ్వి, పరిశ్రమలు పెడుతున్నారు, కూడెవడిస్తాడు?, నదులన్నీ తోలుకెళ్లి, నగరాలకు అందిస్తరు, నీళ్లెవడిస్తాడు?, పరిసరాలను పాడు చేసే, రోగాలను తెస్తన్నరు, మందెవడిస్తాడు?”- అంటూ ఛాయారాజ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.పర్యావరణ విపరీతంగా కాలుష్యం పెరిగిపోవడంతో మానవ మనుగడ ప్రమాదకరంగా మారుతున్న తీరును విల్సన్ సుధాకర్ “ఇప్పుడు కలుషితం కానిదేదీలేదు, విలువలపై హిపోక్రసీలూ – భారతీయతపై అబద్ధాలూ, నీరూ – నిప్పు – ఆహారం – పీల్చే గాలీ, మానవ చెత్తలోంచి ఊపిరి పీల్చుకునే ఒక్క ఈగ చాలు, వంద పులుల కంటే ప్రమాదం కావడానికి....” - అంటూ హెచ్చరించారు ప్రకృతిని మించిన పరమాత్మ లేడు, మానవతను మించిన మతం లేదంటూ పి. పాపిరెడ్డి తన ప్రకృతి కవితలో ఇట్లు తెల్పారు. “రసమయి జగత్తు గమ్యమైన విత్తు, కవిరాజు కలంలో రసధార కురిపించు, శ్రామికుల ఒడిలోన ప్రేమికునిగా చేరు, కార్మికుల హస్తాల కర్మిష్ఠిగా మీరు, సౌభ్రాతృత్త్వమును మించిన భాగ్యం లేదు, జగత్తు మనదనుకుంటే విపత్తే లేదు”- జనులంతా సద్భావనా సౌభ్రాతృత్వంలో ఉండాలనీ, ప్రకృతి మనది అని అందరూ అనుకుంటే ఎలాంటి విపత్తులు తలెత్తవనే సందేశాన్నిచ్చారు. సుప్రసిద్ధ మహా సహస్త్రావధాని డా. గరికపాటి నరసింహారావు పర్యావరణ పరిరక్షణ ప్రధానాంశంగా కలిగిన “సాగరఘోష” అనే శీర్షికతో పదకొండు వందల పదహారు పద్యాలతో మహా కావ్యాన్ని వ్రాశారు. పర్యావరణ సంబంధమైన సమస్తాంశాలు దీనిలో స్పృశించారు. జంతువధ, జల కాలుష్యం, వాయు కాలుష్యం, ఓజోన్ పొర, ఉష్ణ కాలుష్యం, ప్లాస్టిక్ వాడకం మొదలైన పర్యావరణ సమస్యలను ఆధారంగా గ్రహించి ఈ పద్య కావ్య రచన చేశారు.
ప్రకృతిని ఆశ్రయించినంత కాలం మానవజాతి ప్రకృతితో పాటు పరవశించింది. ప్రకృతికి ద్రోహం తలపెట్టగానే మానవజాతి కూడా ప్రకృతితో పాటు కన్నీరు కారుస్తుందంటూ దాశరథి రంగాచార్యులు ‘జీవనయానం’ అనే కవితలో – “సకల ప్రాణీ జలం ప్రకృతిలో భాగం, ప్రకృతితో జీవిస్తే దాని ఆకృతి నిలుస్తుంది, ప్రకృతిని హతం చేస్తే, ప్రకృతిని చేరుస్తే, సకల ప్రాణజాలానికి విలయం తప్పదు” – అంటూ హెచ్చరించారు. వికటించిన మానవుని పోకడల వలన ఛిన్నాభిన్నమవుతున్న పర్యావరణ తీరును గూర్చి శేషేంద్రశర్మ – “నిన్న జీవ ఘనీభవించిన వాగుల్లో, ఇవాళ అలలు కన్న కలల్లా, చేపలు శివాలండుతున్నాయి” అంటారు. సి.నా.రె. రాసిన “దృక్పథం” అనే ఖండ కావ్యంలోని కొన్ని ఖండికలు, డా. ధారా రామనాధశాస్త్రి రాసిన “కాహళి” అనే ఖండకావ్యంలోని ‘తాతయ్యతోట’, ‘వనలేఖ’ అనే ఖండికలు, ప్రజాకవి గోరేటి వెంకన్న రాసిన ‘నల్లతుమ్మ’ గేయం, పొన్నూరు శ్రీనివాసరావు రాసిన ‘విత్తు విలాపం’, వేణుగోపాలాచార్య రాసిన ‘నీటి కటకట’ తదితర రచనలలో పర్యావరణ చేతన కన్పిస్తుంది. గాదిరాజు రంగరాజు, ఏటూరి నాగేంద్రరావు, మానుకొండ సూర్యకుమారి, శివజ్యోతి, వి.కృష్ణ, సీరపు మల్లేశ్వరరావు, తోకల రాజేశం, యజ్ఞల మురళివేణి, ఆచార్య గంగప్ప, కందేపి రాణీవరప్రసాద్, విద్వాన్ విశ్వం, ఇస్మాయిల్ తదితర కవులు పర్యావరణం పట్ల ఆలోచింపజేసే ప్రయత్నాన్ని తమ కవితల ద్వారా చేశారు.
తెలుగులో వచ్చిన విజ్ఞానశాస్త్ర కాల్పనిక కథలలో మరి ముఖ్యంగా భవిష్యత్తును ఊహిస్తూ రాయబడిన కథలలో పర్యావరణానికి సంబంధించిన అంశాలను రచయితలు ప్రాముఖ్యాన్నిచ్చారు. ఈ విజ్ఞానశాస్త్ర కాల్పనిక కథలు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గూర్చి మరియు రాబోయే కాలంలో ఈ పర్యావరణ సమస్యలు ఎంత భయంకరమైన సమస్యలుగా రూపుదాల్చి మానవుని మనుగడకు సవాళ్ళుగా నిలుస్తాయో వివరిస్తాయి. అదే విధంగా అణ్వాయుధాలు ప్రయోగించడం వల్ల కలిగే నష్టాలను గూర్చి, తద్వారా సంభవించే వింత రోగాలను గూర్చి వివరించి, పాఠకుల మనస్సులో భయాన్ని కలిగించి, అణ్వాస్త్ర ప్రయోగాల పట్ల నిరసన కలిగేటట్లు చేస్తాయి.
రాబోయే 33వ శతాబ్దంలోని మానవులు 1980 సంవత్సరంలోని మానవ సమాజానికి టైమ్ క్యాప్యూల్స్ ద్వారా మానవ మనుగడ కోసం పంపిన సందేశమే గుజ్జారి రామచంద్రరావు రాసిన ‘టైమ్ క్యాప్సూల్స్’ కథ. పర్యావరణ కాలుష్య నివారణకు మార్గాలను వైజ్ఞానిక నేపథ్యంలో తెలియజేస్తుందీ కథ. ఇంధన వనరులు మితిమీరి వాడటం, పారిశ్రామికీకరణ, రసాయనిక ఎరువులు విచక్షణారహితంగా ఉపయోగించడం వల్ల వాతావరణం కలుషితమైపోయి శరీరంలో కలిగే హానికరమైన మార్పులను, విష కాలుష్య ఫలితాలను విశదీకరిస్తుందీ కథ. బెలగాం భీమేశ్వరరావు రాసిన ‘హెచ్చరిక’ కథ పర్యావరణం ప్రధానాంశంతో వెలువడిన మరో కథ. పర్వతాలను పగులగొట్టడం వలన జరిగే అనర్ధాలను గ్రహాంతరవాసులు, భూగ్రహవాసులకు తెలియజేయడం ఈ కథ ముఖ్యోద్దేశ్యం.
మైనంపాటి భాస్కర్ రాసిన ‘డీప్ ఫ్రీజ్’ కథలో రచయిత ఇప్పటి పరిస్థితులను ఆధారంగా చేసుకొని 2050 సంవత్సరం నాటి మానవ సమాజాన్ని, సాంకేతిక పురోభివృద్ధిని ఊహించారు. 2050 నాటికి భారత జనాభా మూడు వేల కోట్లు అవుతుందని, పెరిగిన విపరీత కాలుష్యంతో వ్యాధి నిరోధక దుస్తులు – ఆక్సిజన్ మాస్కు – చెవులకు ఫిల్టర్లు లేకుండా మనుష్యులు బయటకురాలేని దుస్థితి ఉంటుందని, ఆరు బయట ఎక్కడ ఒక్క చెట్టు కూడా కన్పించదని కథలో రచయిత ఊహించారు. యర్రమిల్లి జె. శేఖరం రాసిన ‘భూమి పుత్రుడు’ కథలో కథా కాలం 2090. ఈ కాలం నాటికి భూమి పై నున్న చెట్లన్నీ నశించిపోవడం వల్ల మానవులు ఆక్సిజన్ కోసం ఆక్సోజల్స్ అను మాత్రలను వాడుతుంటారని రచయిత ఊహిస్తాడు.
పర్యావరణంలో పశుపక్షాదులు కూడా ముఖ్యమైన భాగం. మనిషి చేస్తున్న పనులు పశుపక్షాదుల ఉనికిని ఏవిధంగా ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయో డాక్టర్ పాపినేని శివశంకర్ ‘చివరి పిచ్చుక’ కథలో కన్పిస్తుంది. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం అనే అంశాలు ఈ కథకు ప్రధాన వస్తువు. మానవుల పర్యావరణ చేతనరాహిత్యం జీవావరణ విధ్వంసానికి కారణమవుతుందని ఈ కథ హెచ్చరిస్తుంది. ఈ కథలో పిచ్చుక పాత్ర ద్వారా పర్యావరణ సమతుల్యాన్ని మనిషి ఏవిధంగా దెబ్బతీస్తున్నాడో చాలా చక్కగా చిత్రించారు. మారుతున్న పర్యావరణ స్వరూపాన్ని, ప్రాణులపై దాని ప్రభావాన్ని ఈ కథ అద్భుతంగా ఆవిష్కరించింది. ప్రపంచీకరణ నేపథ్యంలో మారుతున్న పల్లెల స్వరూపాన్ని, పర్యావరణ వినాశానాన్ని, చితికిపోతున్న ప్రజాజీవితాన్ని అద్భుతంగా చిత్రీకరించిన కథ కేతు విశ్వనాథరెడ్డి రాసిన ‘విరూపం’ కథ. వేపచెట్ల పల్లె అనే కుగ్రామం ఈ కథకు కేంద్రం. ఒకప్పుడు వందలాది వేప చెట్లతోను, చీని తోటలతోను, నిండిన బావులతోను కళకళలాడిన ఆ గ్రామం – నేడు సిమెంటు ధూళితో కూడిన దుమ్ము క్షేత్రంగా మారడం, రైతులు కారమికులుగా మారిన వైనాన్ని రచయిత కథలో ప్రస్తావించారు. ప్రపంచీకరణ వల్ల నేటి సమాజం ఎదుర్కొంటున్న దుష్ఫలితాలలో పర్యావరణ వినాశనం కూడా ఒకటనే అభిప్రాయాన్ని ఈ కథ కలిగిస్తుంది.
‘వేయిపడగలు’ నవలలో విశ్వనాథ సత్యనారాయణ ప్రకృతికి ప్రతీకగా పసిరిక పాత్రను తీర్చిదిద్దారు. పచ్చని పంటపొలాలకు, ఆహ్లాదకరమైనప్రకృతి సౌందర్యానికి ప్రతినిధి పసిరిక పాత్ర. భవిష్యత్తులో సంభవించనున్న ప్రకృతి విపత్తులను ముందుగా ఊహించి, పసిరిక పాత్రను ఆలంబనగా చేసుకొని విశ్వనాథ కథను నడిపిన తీరు పరిశీలిస్తే ఆశ్చర్యము, ఆనందము కలుగకమానవు. పాశ్చాత్య నాగరికత విస్తరణ కారణంగా జనజీవన విధానంలో చోటుచేసుకున్న అనూహ్యమైన మార్పులు, భవిష్యత్తులో కలుగబోయే దుష్ఫరిణామాలను విశ్వనాథ వారు వేయిపడగలు నవలలో ప్రతీకాత్మకంగా ఆవిష్కరించిన తీరు ప్రశంసనీయము. పర్యావరణ విఘాతం వల్ల నేటి సమాజంలో చోటుచేసుకున్న అంశాలను 80 సంవత్సరాలకు పూర్వమే వేయిపడగలు నవలలో విశ్వనాథ ఊహించడం విశేషం.
పాశ్చాత్య నాగరికత ప్రభావంతో మానవ జీవన విధానంలో అనూహ్యమైన జలావరణాన్ని ప్రధాన సమస్యగా తీసుకొని, ప్రకృతిని వికృతి చేయవద్దనే పిలుపునిస్తూ, ప్రకృతి సంపదలను భావితరాలకు అందజేయాలని సందేశాన్నిస్తూ చంద్రలత రాసిన నవల ‘దృశ్యాదృశ్యం’. ఈ నవల ఆనకట్టల నిర్మాణం, ఈ నిర్మాణం వల్ల చితికిపోతున్న జీవితాలను పరామర్శించింది. ప్రకృతికి – మనిషికి మధ్య నున్న అనుబంధాన్ని పెంచడానికి చేసిన ప్రయత్నమే ఈ నవలలో ఇతివృత్తంగా చెప్పబడింది. అప్పటి వరకు నది ఒడ్డున జీవించి, ప్రాజెక్టు కారణంగా తమ ఊరు మునిగేపోయే పరిస్థితి వచ్చినప్పుడు, ఏమీ చేయలేని అసహాయతతో కొత్త ఊరిని నిర్మించుకునే జనం, కేవలం మానవ జీవితాల్లోనే కాక సమస్త ప్రకృతిలోను ప్రాజెక్టు నిర్మాణం వల్ల కలిగిన మార్పులు...తదితర అంశాలను రచయిత్రి ఈనవలలో స్పృశించారు. పర్యావరణం పట్ల అవగాహన లేకుండా ప్రవర్తించే వారి తీరుపై రచయిత్రి ఈ నవలలో అక్కడక్కడ చురకలంటిస్తారు.
తెలుగులో వెలువడిన పర్యావరణ చేతనా సాహిత్యాన్ని పరిశీలిస్తే – కవితా ప్రక్రియలో ఈ విధమైన సాహిత్యంగా అధికంగా వెలువడినట్లు తెలుస్తుంది. వృక్షం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ, జీవరాశి మనుగడ – జలసిరులను కాపాడుకోవాల్సిన తీరును గూర్చి సందేశాన్నిస్తూ, పర్యావరణ కాలుష్యం వల్ల సంభవించే విపత్కర పరిస్థితులను గూర్చి హెచ్చరిస్తూ ఈ కవితలు వెలువడ్డాయి. కథా సాహిత్యాన్ని పరిశీలిస్తే పర్యావరణ స్పృహను కలుగజేసే కథలు రాశి పరంగా తక్కువగానే వెలువడిన వాశి పరంగా చక్కని సందేశాన్ని అందించే కథలే వెలువడ్డాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మానవుడు ఎదుర్కొనే పర్యావరణ విపత్కర సమస్యలను ఊహిస్తూ, పర్యావరణ సమతుల్యత లోపించడం వల్ల ఇప్పటికే జరిగిన – జరుగుతున్న నష్టాలను వెల్లడిస్తూ చక్కని కథలు వెలువడ్డాయి. తెలుగు నవలా ప్రక్రియలో పర్యావరణ చేతనా సాహిత్యంలో చాలా వెనుకబడిందనే చెప్పాలి. ఒకటో, రెండో నవలలు మాత్రమే సందర్భానుసారంగా పర్యావరణ స్పృహను స్పృశిస్తూ వెలువడ్డాయి. వ్యాసంలో పేర్కొన్న కవితలు, కథలు, నవలలే గాక ఇంకా చాలా మంది రచయితలు - రచయిత్రులు పర్యావరణ స్పృహను కలుగజేస్తూ వివిధ ప్రక్రియలలో రచనలు చేసి ఉండవచ్చు. నేను పరిశీలించిన పరిధి మేరకు, వ్యాస నిడివిని దృష్టిలో ఉంచుకొని కొంతమంది రచయితలు - రచయిత్రులు రచనలు మాత్రమే ఈ వ్యాసంలో పేర్కొంటున్నందుకు క్షతంవ్యుడ్ని.
నేడు ప్రపంచం ఎదుర్కొంటున్నప్రధాన సమస్య పర్యావరణ కాలుష్యం. మరి ముఖ్యంగా భారతదేశంలో ఈ సమస్య చాలా జఠిలంగా ఉంది. అతివృష్టి – అనావృష్టులు దేశానికి శాపంగా మారాయి. గత పది సంవత్సరాలలో భారతదేశంలోపలు చోట్ల భూకంపాలు చోటు చేసుకున్నాయి. హిమాలయాలు కరిగిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దేశంలో అత్యధిక రాష్ట్రాలలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాగు - త్రాగు నీరు లేక ప్రజలు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. త్రాగటానికి నీరులేక – తినడానికి గడ్డి లేక పశువులు ఆకలితో – దాహంతో దీనస్థితిలో కాలం గడుపుతున్నాయి. సస్యశ్యామలంగా పచ్చని పంట పొలాలతో కళకళలాడే ప్రాంతాలు కరువు రక్కసి కోరల్లో చెక్కుకొని అల్లాడుతున్నాయి. పలు జంతు – పక్షి జాతులు నశించిపోతున్నాయి. క్యాన్సర్ లాంటి మహమ్మారి రోగాల బారిన పడి ప్రజలు చనిపోతున్నారు.పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ఇప్పటికైనా కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ముందుకు రావడం ఒక శుభపరిణామమనే చెప్పాలి. స్వచ్ఛ భారత్, పచ్చదనం – పరిశుభ్రత, నీరు – చెట్టు, వనం – మనం తదితర కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాలు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాయి.
సమాజాన్ని కదిలించే శక్తి ఒక్క సాహిత్యానికి మాత్రమే ఉంది. పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని ప్రజల్లోని తీసుకొని వెళ్ళడంలో తెలుగు రచయితలు – రచయిత్రులు కీలక పాత్రను పోషించాల్సిన తరుణమిది. పర్యావరణ పరిరక్షణ అనే ఉద్యమాన్ని నేటి సాహితీ లోకం తమ భుజ స్కంధాలపై వేసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పర్యావరణానికి విఘాతం కలుగుచేస్తున్న శక్తులను ఎండగట్టి, ప్రజలలో చైతన్యాన్ని తీసుకురావల్సిన గురుతర బాధ్యత నేటి రచయితలపైనను – భావి రచయితలపైనను ఉంది. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం రచయితలు - రచయిత్రులు తమ రచనల ద్వారా చేయాలి. పర్యావరణాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని గూర్చి అవగాహన కలుగజేస్తూ, పర్యావరణానికి విఘాతం వల్ల ఇప్పటి వరకు నష్టపోయిన తీరును – ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో జరగబోయే తీవ్ర పరిణామాలను గూర్చి హెచ్చరిస్తూ ప్రజలను దిశానిర్దేశం చేస్తూ రచయితలు తమ రచనలు కొనసాగించాలి. పర్యావరణ స్పృహను కలుగజేస్తూ బాల సాహిత్యం ఎక్కువగా వెలువడాల్సి ఉంది. రచయితలు సైతం బాల సాహిత్యంపై ఎక్కువగా దృష్టి సారించాలి. పర్యావరణ చైతన్యాన్ని విద్యార్థి దిశ నుండే కలుగజేయడంలో బాలసాహిత్యం కీలక భూమికను పోషిస్తుంది. పర్యావరణ చేతనా సాహిత్యానికి పత్రికలు సైతం తగు ప్రాధాన్యతను ఇవ్వాలి. పర్యావరణ స్పృహతో రచనలు చేసే రచయితలను ప్రభుత్వం కూడా బహుమతులతో ప్రోత్సహించాలి. రానున్న రోజుల్లో పర్యావరణ చేతనా సాహిత్యం ఒక ఉద్యమంగా – ఉధృతంగా వెలువడి, ప్రజలను చైతన్యపర్చి, భవిష్యత్తులో చక్కని ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించడంలో తమదైన పాత్రను పోషిస్తుందని మనసారా ఆశిద్దాం.
వృక్షో రక్షతి రక్షితః
*****
డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్
డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్ గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని కొలకలూరు గ్రామంలో జన్మించారు. తెనాలిలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా పని చేస్తున్నారు. అమెరికా తెలుగు కథా సాహిత్యంపై పరిశోధన చేసి పిహెచ్.డి. డిగ్రీ పొందారు. అనేక జాతీయ - అంతర్జాతీయ - అంతర్జాల పత్రికలలో ఈయన రాసిన సాహితీ వ్యాసాలు ప్రచురించబడ్డాయి. ఆంధ్రదేశంలో వెలువడే ఆంధ్రజ్యోతి, సాక్షి దిన పత్రికల్లో ఈయన రాసిన పలు ఎడిటోరియల్ వ్యాసాలు ప్రచురించబడ్డాయి. 2014 ఆటా వారు నిర్వహించిన వ్యాస రచన పోటీలో ప్రథమ బహుమతి, 2015 తానా వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నారు.