top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

'సినీ' మధురాలు

మధురవాణి ప్రత్యేకం

V N Aditya

వి.ఎన్. ఆదిత్య

చలన చిత్ర దర్శకులు

ఆదిత్య సినీ మధురాలు

ఈ వారం ఆర్టికల్ రాద్దామని ఎన్నిసార్లు ప్రయత్నించినా ముందుకు  సాగలేదు...  వయసులో ఉన్నవాళ్లు ప్రేమలేఖలు కూడా ఇన్ని సార్లు తిరగ రాసి ఉండరు… ఇందుక్కారణం ఉంది. తెలుగు చలన చిత్ర దర్శకుడిగా, మే నెల చాలా రోలరు కోస్టర్ రైడ్ చేయించింది. కళా తపస్వి కే.విశ్వనాధ్ గారికి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం రావడం, వారికి పరిశ్రమ ఘనంగా సన్మానం చేసినప్పుడు అందులో పాలుపంచుకోవడము ఒక పదిహేను రోజుల పాటు ఛాతీ ఉప్పొంగడం ఒక ఆనందం.

అంతలోనే దర్శకరత్న దాసరి నారాయణరావు గారి అస్తమయం. వారి అంతిమ యాత్ర.  కడుపు తరుక్కుపోయి దుఖ్ఖము కమ్మేయడం. ఇదొక  బాధ…

ఇలా ఈ నెల జీవితం లో మర్చిపోలేని ఒక చక్రం తిప్పింది. ఆనందానికి బాధకి మధ్య ...  

విశ్వనాధ్ గారి సినిమాలు చూసి  వీరాభిమానిగా మానని తెలుగు క్లాస్ ప్రేక్షకుడు లేడు…

దాసరి గారి సినిమాలు చూసి చప్పట్లు, ఈలలు వెయ్యని తెలుగు మాస్ ప్రేక్షకుడు లేడు…

దర్శకులుగా బాణీలు, పంథాలు పక్కన పెడితే వ్యక్తులుగా వారి ఘనతలు చర్చించుకుంటే భావి తరాల దర్శకులకి ఉపయుక్తంగా ఉంటుందని నా నమ్మకం. 

దాసరి గారు…

ఒక రకంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ తన చిరునామా ని కోల్పోయింది వారితో పాటే. హైదరాబాద్ వచ్చాక తెలుగు పరిశ్రమ ఎదుర్కొన్నన్ని చిక్కులు ఏ పరిశ్రమా వేరెక్కడా ఎదుర్కొని ఉండదు. అన్నిటికీ పరిష్కార స్వరం దాసరి గారిదే... అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా ఓపిగ్గా ఏ స్థాయి వ్యక్తుల సమస్యలైనా ఒకే ప్రాధాన్యతనిచ్చి, కొత్త నిర్మాతలు, పంపిణీదారులు, స్టార్ హీరోలు,  నటీనటులు, ఫెడరేషన్ కార్మికులు, దర్శకులు, కదా రచయితలు, సీనియర్ నిర్మాతలు, థియేటర్ల ఓనర్లు, రిలీజ్  పంచాయితీలు, రెమ్యూనరేషన్ల వివాదాలు...  చిన్న సినిమాల కి, పెద్ద సినిమాలకి మధ్య గొడవలు, రాజకీయ నాయకుల ఒత్తిడులు, సినిమావాళ్ళ భూముల కబ్జాల గొడవలు, ఆంధ్రా, తెలంగాణా ఉద్యమాలప్పుడు ఏర్పడిన అంతరాలు, గొడవలు... మీడియాలలో తగాదాలు, మీడియా వాళ్ళతో పరిశ్రమ తగాదాలు, ఆడా, మగా తగాదాలు, కథా చౌర్యాల కేసులు... అన్ని యూనియన్ ల ఎన్నికలు, ఛాంబర్ ఎన్నికలు, ఫెడరేషన్ ఎన్నికలు, వాటి సమీకరణాలు, పత్రికలు నడపడం, కేంద్రమంత్రిగా బాధ్యతలు, వాటి వల్ల సంక్రమించిన వివాదాలు ... ఒకటి కాదు రెండు కాదు... వేలకొద్దీ మీటింగ్ లు.. వీటన్నిటి నడుమ 

రచయితలతో సినిమాల చర్చలు, షూటింగ్ లు... ఒక మనిషి వాళ్ళ కాని పని.. ఎవ్వరి పట్లా ప్రత్యేకించి రాగద్వేషాలు, పక్షపాత ధోరణి కనిపించకుండా పరిశ్రమ కి ఏది మంచిదో అదే మాట్లాడడం... మెషిన్ లాగా పనిచేస్తూనే ఉండడం... రోజుకి 20 గంటలు 40 ఏళ్ళు పని చేయడం... రచయితగా మొదలైన ప్రస్థానం దర్శకుడిగా మారి 151 చిత్రాలకు దర్శకత్వం వహించడం... దర్శకుడి గౌరవాన్ని నిలబెట్టడం... స్టార్లని తయారు చేసేది మేమే అని చాటించడం... డైరెక్టర్ ఈస్  కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని ప్రకటించడం...

సాటి భారతీయ దర్శకులందరు దర్శకుడి జీవితం ఇలా ఉండాలని కోరుకునేలా ఉండడం... నాలుగు డబ్బులు రాగానే కుటుంబాన్ని చూసుకోకుండా, పరిశ్రమని కుటుంబంగా చూసుకోవడం... స్టార్ డం తో పాటే చుట్టుముట్టే వివాదాలు... ప్రతి క్షణం ఒకే ఎనర్జీ... హిట్టుల్లోనూ, ప్లాపుల్లోనూ ఒకే హుందాతనం... అందరికీ తలలో నాలుకై, అందరి తరఫునా తానే నాలుకై... నాకెందుకు అనుకుంటే ఈజీ గా నాలుగొందల సినిమాలు డైరెక్ట్ చేసేవారేమో... దట్ ఈస్ దాసరి... నో వన్  ఈస్ హిస్ సరి...

 

కళా తపస్వి కే. విశ్వనాధ్ గారు...

తెలుగుదనానికి చిరునామా... సాంస్కృతిక, కళా సంప్రదాయాల్ని అవలీలగా కమర్షియల్ మీడియం లో నాటిన శ్రామికుడు... సంగీత, సాహిత్యాలు వాణిజ్య సూత్రాలని నమ్మి, నిరూపించిన ధీశాలి ..

సౌండ్ ఇంజనీరుగా కెరీర్ ప్రారంభించి, ఆదుర్తి గారి దగ్గిర దర్శకత్వ శాఖలో పని చేసి, దర్శకుడై, కొన్నాళ్ళు సాంఘిక, స్త్రీ సమస్యల ప్రాధాన్యమున్న చిత్రాలు తీసి, సిరి సిరి మువ్వ తో తెలుగు సంస్కృతిని, శంకరాభరణం తో తెలుగు సంప్రదాయాన్ని సజీవంగా వెండితెర మీద నిలబెట్టి కళా తపస్సు చేసిన మోక్షగామి... తెలుగు కళ, ఈయన అమ్మిన కలల్లో స్వాతి ముత్యమై మెరిసింది.. సిరివెన్నెలలు కురిపించింది.. స్వాతి కిరణాలు ప్రసరించింది... సాగర సంగమాన స్వర్ణ కమలాలు పూయించింది.. 

దర్శకుడంటే క్లాస్ 4 లేబర్ అని నమ్మి, జీవితమంతా దర్శకత్వం చేసినన్ని రోజులు ఖాఖీ యూనిఫామ్ నే వేసుకున్న కార్మికుడీయన... సినిమా అనే కళాత్మక వ్యాపారంలో కళో, ఆత్మో, వ్యాపారమో ఎదో ఒకటే న్యాయం చేయడం గగనమైపోతున్న రోజుల్లో ఆ వాక్యాన్ని పూర్తిగా వెండితెర మీద ఆవిష్కరించిన మార్గదర్శి... తెలుగు వారి సంస్కృతికి, శాస్త్రీయ సంగీత, నృత్యాలకి కాలం చెల్లిన తరుణంలో పవర్ఫుల్ మీడియా అయినా సినిమా ద్వారా విశేషంగా ప్రాచుర్యం కల్పించి తెలుగుదనం సజీవంగా నిలవడానికి తానొక సమిధగా మారిన కళా తపస్వి.. కుల రహితమైన తెలుగుదనం వీరి విశేష కృషి.. కాలంతో పాటు మారకుండా నమ్మకంతో నిలబడడం వీరి దీక్ష, దక్షతలు... దర్శకుడిగా ఎంత ఉన్నతిని సాధించారో, నటుడిగా అంతే గౌరవాన్ని పొందడం ఈయన గొప్పదనం... హాట్స్ ఆఫ్ కే.విశ్వనాధ్ గారు... మీరున్న తరం లో ప్రేక్షకుడి నుంచి  పరిశ్రమ లోకి రావడం మీతో సాన్నిహిత్యం కలగడం పూర్వ జన్మ సుకృతం ..

 

మళ్ళీ సంచికలో మరిన్ని విశేషాలతో కలుద్దాం...

మీ 

వీ.యెన్ .ఆదిత్య .

bottom of page