MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కథా మధురాలు
చెల్లుబడి ధర్మరాయా
వెదురుమూడి రామారావు
రాత్రి పదిన్నర దాటుతోంది.
కంపెనీ గెస్ట్ హౌస్ లో, ఏసీ రూమ్ లో వున్నాను. మనసంతా తెలీని ఏదో అశాంతి.
దూరంగా 'కరోనా రేడియో' అనుకొంటాను, ఓ.పి.నయ్యర్ చక్కటి పాట మంద్రంగా వినిపిస్తోన్నది. ఆ మంద్రమైన సంగీతం కూడా కరిగించలేనంతగా ఘనీభవించిన చీకాకు. పొద్దున్నేకొండ మీదకి వెళ్లి స్వామి దర్శనం చేసుకోవాలి. ౩౦౦ రూపాయల దర్శనం అడ్వాన్స్ టికెట్ కూడా తీసుకొన్నాను. పడుకోడానికి ప్రయత్నిస్తూనే వున్నాను. ఇన్నేళ్లు దాటినా ఇంకా ఆ విషయం నన్ను అలా వెంటాడుతూనే వుంది. అయిపోయింది కదా. ముగిసి కూడా చాలా కాలం అయ్యింది కదా? మాటిమాటికి ఆ విషయం నన్ను ఎందుకు వెంటాడుతూవుంది ? ఎందుకు అలా జరిగింది ? జయపాల్ ఎందుకు ఆలా చేసాడు. నేను తప్పుగా ప్రవర్తించానా ? నాకు చాలా కోపం గా వుంది. అతడు కనిపిస్తే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి. ఎలా నా కోపం తీర్చుకోవాలి ? చికాకు మరీ ఎక్కువై పోతోంది. ఆలోచిస్తూనే ఎప్పుడో నిద్రలోకి జారుకొన్నా. చాలా చికాకుగా కలతగా వుంది. ప్రతీకారం ఆలోచించాలి. జీవితం లో అస్పష్టత అన్నది చాలా సాధారణం అయిన విషయం. ఏదో చెయ్యాలని వుంది. చెయ్యాలా వద్దా!! అసహాయతా? మంచితనమా??
ఈ ఉదంతం జరిగి చాలా ఏళ్ళు అయింది. జయపాల్ మా ఫామిలీ ఫ్రెండ్. బిజినెస్ మాన్. అమరేంద్ర, జయపాల్ కి దూరపుబంధువు. రియల్ ఎస్టేట్ బిజినెస్ లో బాగానే సంపాదిస్తున్నాడు.
జయపాల్ ఓరోజు అమరేంద్ర గురించి, అతని బిజినెస్ గురించి నన్ను ఏవో వివరాలడిగాడు. నాకూ అమరేంద్ర గురించి ఎక్కువగా తెలియదు. ఎందుకు ఈ ఎంక్వయిరీ? అని తిరిగి అడిగితే, కొంచెం నసుగుతూ అసలు సంగతి బయటపెట్టాడు జయపాల్. “అమరేంద్ర బిజినెస్ లో నన్ను కొంచెం ఇన్వెస్ట్ చెయ్యమని బలవంతం పెడుతున్నాడు. తేల్చుకోలేకపోతున్నాను. నీ సలహా ఏంటి?”
“డబ్బుకి సంబంధించిన విషయాలలో నన్ను దూర్చొద్దు. అమరేంద్ర పర్సనల్ విషయాలలో నాకు ఏ విధమైన అవగాహన లేదు. నీకు ఏమి సలహా ఇవ్వలేను “ అని గట్టిగా చెప్పాను. నాకు ఇంకా అనుమానం వచ్చి, మర్నాడు జయపాల్ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ ఆవిడ తో కూడా చెప్పాను. “జయపాల్ ఎదో ఇన్వెస్ట్మెంట్ అదీ అంటున్నాడు. అమరేంద్ర తో కొంచెం జాగరత్తగా ఉండమని చెప్పండి “ అని. తర్వాత తెలిసింది అప్పటికే జయపాల్ కొంత డబ్బు అమరేంద్ర కి ఇచ్చాడని. ఈ సంగతి అందరం మర్చి పోయాం.
ఒకనాడు నేను ఆఫీస్ లో ఉండగా జయపాల్ గాభరాగా ఫోన్ చేసాడు. ఆ గొంతు ఎంతో ఆందోళనగా “తొందరగా ఇక్కడికి రా. అర్జెంటు!” అంటూ ప్రాధేయ పడుతున్నట్టుగా వుంది. ఏమయిందీ, ఎక్కడున్నాడూ? ఎక్కడికి వెళ్ళాలి? అనే ప్రశ్నలన్నీ గుప్పించాను.
“నేను ప్రస్తుతం అమరేంద్ర ఇంట్లో వున్నాను. అమరేంద్ర వూళ్ళో లేడు. వాళ్ళ అబ్బాయి తో నా డబ్బు గురించి అడుగుదాం అని వాళ్ళ ఇంటికి వచ్చాను. అడిగితే గొడవ జరిగింది. ఆ అబ్బాయి నన్ను కొట్టడం ప్రారంభించాడు. నాకు బాగా దెబ్బలు తగిలాయి. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. నువ్వు తొందరగా రా ఇక్కడికి!” అంటూ కోపం, ఏడుపు కలసిన గొంతుతో ప్రాధేయ పడ్డాడు జయపాల్.
అమరేంద్ర వాళ్ల అబ్బాయి తో ఫోన్ లో అసలు విషయం ఏంటి అని అడిగాను. "నాన్న వూళ్ళో లేరు అంకుల్. ఈ జయపాల్ వచ్చి నన్ను డబ్బు గురించి అడుగుతున్నాడు. నాకేం తెలీదు అంటే కొట్టడం ప్రారంభించాడు. మీరు వచ్చి ఈ జయపాల్ కి కొంచెం చెప్పండి, నాన్న వచ్చే వరకు ఆగమని. ఈయన పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. మీరు కొంచెం వచ్చి హెల్ప్ చెయ్యండి" అని ప్రాధేయ పడ్డాడు.
ఇద్దరు తెలిసిన వాళ్ళే కదా, నేను చెబితే కొంచెం వింటారేమో అనుకొని వెంటనే అమరేంద్ర ఇంటికి వెళ్ళాను. అక్కడ సీన్ చాలా భయంకరంగా వుంది. ఇద్దరు హోరాహోరీ పోట్లాడుకున్నట్టున్నారు. జయపాల్ కి కొంచెం సర్ది చెప్పి, అమరేంద్ర వచ్చే వరకు ఆగమని చెప్పాను. అమరేంద్రవాళ్ళ అబ్బాయి కూడా కొంచెం తగ్గాడు. ఈ లోపున పోలీస్ వాళ్ళు వచ్చేరు. ఇదంతా రికార్డు చేసి వాళ్ళిద్దరిని నన్ను కూడా పోలీస్ స్టేషన్ కి పిలిచి ఏం జరిగింది? రికార్డు చేసుకొన్నారు. బయటికి వచ్చిఇద్దరు షేక్ హాండ్స్ ఇచ్చుకొని, అమరేంద్ర ఇంటికి తిరిగి వచ్చాము. కొంచెం తీరిగ్గా కూర్చున్న తరవాత జయపాల్ ఇలా అన్నాడు.
“ఏ కాగితం, డాక్యుమెంట్ లేకుండా నేను ఈ డబ్బు ఇచ్చాను. ఎన్ని సార్లు అడిగినా ఎంత ప్రయత్నిచినా వీళ్లు అసలు ఏమి మాట్లాడటంలేదు. నాకు దారి ఏమిటి ? నేను ఏ ఆధారం లేకుండా ఏంచెయ్యాలి ? మీరు మధ్యలో వచ్చారు కాబట్టి ఏదైనా సలహా, సహాయం చెయ్యండి. అమరేంద్ర వచ్చే లోపు ఏదయినా చెయ్యాలి. లేకపోతే నేను పోలీస్ ద్వారా యాక్షన్ తీసుకొంటాను” అని గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. అమరేంద్ర వాళ్ళ అబ్బాయి కూడా బెదిరిపోయి ఉన్నాడేమో, ‘ఏమైనా సలహా చెప్పండి అంకుల్’ అని నన్ను ప్రాధేయ పడ్డాడు. అమరేంద్ర వచ్చే వరకు వెయిట్ చెయ్యమని ఇద్దరికీ చాలా చాలా చెప్పాను. కానీ జయపాల్ ఎంతకీ శాంతించలేదు. "ఈ డబ్బు రాబట్టేందుకు నాకు ఏదయినా ఒక ఆధారం కావాలి. కనీసం ఈ అమరేంద్ర వాళ్ళ అబ్బాయిని ఇప్పుడు ఒక ప్రోమిసరీ నోట్ అయినా రాసి ఇమ్మనండి. ఆ కాగితం అయినా నా చేతిలో ఉంటే నాకు సంతృప్తి. అది నాకు ఆధారం. అమరేంద్ర వచ్చాక అది కూడా ఇవ్వడు" అంటూ గట్టిగా అడగడం మొదలు పెట్టాడు. నేను ఎంత చెప్పినా ఇద్దరు సమాధాన పడటం లేదు. తనకి ఏదయినా ఒక ఆధారం ఇస్తేనే ఇక్కడనించి కదులుతాను, లేకపోతే ఈ అబ్బాయిని అరెస్ట్ చేయిస్తాను అని గోల చేస్తున్నాడు జయపాల్. చుట్టుపక్కల వాళ్లు అందరు చోద్యం చూస్తున్నారు. నాకు ఏమి చెయ్యాలో తోచటం లేదు. జయపాల్ కి పొలిటికల్ గా పలుకుబడి వుంది. విషయం చాలా దూరం పోతుంది అనిపించి అమరేంద్ర వచ్చే లోపున కొంత వరకైనా శాంత పరుచుదామని నేను కొంచెం చొరవ తీసుకొని ఒక ఉచిత సలహా ఇచ్చాను. ఆ సలహా ప్రకారం వాళ్ళ ఇద్దరు శాంతిస్తారు అని అనిపించింది. కానీ అదే నా కొంప తీస్తుంది అని తరవాతే తెలిసింది. ఇది ఒక గుణ పాఠం. అనుభవం.
అమరేంద్ర వచ్చే లోపున జయపాల్ కి ఏదయినా ఆధారం కావాలి కాబట్టి జయపాల్ ఈ విధంగా ప్రస్తావన తెచ్చాడు. “అమరేంద్ర అబ్బాయి తన స్వంత పూచి మీద ప్రోమిసరీ నోట్ రాసి ఇస్తే తనకి ఉపయోగం గా ఉంటుంది. నేను లోన్ ఇచ్చినట్టు నాకు ఒక రుజువు చేతిలో ఉంటుంది. తరువాత వాళ్ళ నాన్నవచ్చేక దాన్ని మార్చుకోవచ్చు. ఆ నోట్ తీసుకొని నేను వెళ్ళిపోతాను.” ప్రస్తుతానికి ఈ పరిస్థితి నించి బయటపడ వచ్చు. అబ్బాయ్ కూడా “ఇది బాగానే వుంది, నాన్న వచ్చేక తర్వాత సంగతి చూసుకొందాం” అన్నాడు. నాకు కూడా ఇంతకన్నా మంచి తరుణోపాయం లేదు అనిపించింది. ఇద్దరూ రాజీ పడ్డారుగాబట్టి పరిస్థితి కుదుటబడుతుంది అనుకొన్నాను. ఇద్దరూ ఇంకా ఉద్రిక్తంగానే వున్నారు. ఈ ఒత్తిడి లో డాక్యుమెంట్ రాయడానికి రెండు మూడు కాగితాలు పాడుచేశారు. మేము సరిగ్గా రాయలేము కాబట్టి మీరే రాసి పెట్టండి అన్నారు. ఏదో విధం గా విషయం పరిష్కరించ బడుతోంది కదా అని నేను సరే అన్నాను. అది ఎంత పెద్ద పొరపాటవబోతుందో అపుడు నా ఊహకందలేదు.
జయపాల్ తనతో రెవిన్యూ స్టాంప్ కూడా తెచ్చుకొన్నాడు. వచ్చిన పరిభాష లో ఆ అబ్బాయి రాసినట్టు గా నోట్ రాసి అతనిచేత సంతకం చేయించి జయపాల్ చేతికి ఇప్పించాను. జయపాల్ చేటంత ముఖం చేసుకుని సంబరంగా “థ్యాంక్సోయ్” అంటూ ఆ డాక్యుమెంట్ తీసుకొని బయట పడ్డాడు. అమరేంద్ర గారి అబ్బాయి కూడా ఈ ఆ ఉదంతమంతా ఒక కొలిక్కి వచ్చినందుకు నాకు థాంక్స్ చెప్పాడు. ఈ థ్యాంక్సుతో నాలో "పెద్దమనిషి"ని మరోసారి నిద్రలేపాడు ఆ అబ్బాయి. భరోసాగా ఆ అబ్బాయి వెన్ను తట్టి చిన్నగా నవ్వి బయటకి వచ్చాను. ఇంటి బయట జయపాల్ నా కోసం కాచుకొని వున్నాడు. తాను ఏ హామీ తీసుకోకుండా ఇచ్చిన లోన్ నా వల్ల ఇప్పుడు చెల్లుబాటు అవుతోంది అని సంతోషం గా మెచ్చుకున్నాడు. ఆ మెచ్చుకోలుకి ఇంకాస్త ఉబ్బిపోయాను. “నోట్ మీద అప్పు తీసుకొన్న వాడి ఒక్క సంతకము కాదు, దానితో బాటు సాక్షి సంతకం కూడా ఉంటేనే చెల్లుతుంది. మీరు ఒక సాక్షి సంతకం పడేస్తే నా నోట్ చాలా చెల్లుబాటు అవుతుంది” అన్నాడు. అసలే మనసులో మంచి పని చేసాను అని పొంగి పోయి వున్నాను కదా ఒక్క సాక్షి సంతకమే కదా అని నేను సాక్షి సంతకం పెట్టేసాను. సాధ్యమైనంత వరకు నలుగురికి సాయం చెయ్యాలి కదా. నేను చాలా మంచి సహాయం చేశాను అని సంతోష పడ్డాను. అది నన్ను ఎటు తీసుకు వెళ్తోందో తరువాతే తెలిసింది. ఇంకొక అనుభవం.
ఒక వారం పది రోజులు మామూలుగా గడిచి పోయాయి. అమరేంద్ర మాత్రం నా మీద కోపంగా వున్నాడు. “మీరు మధ్యకి వచ్చారు గాని నేనయితే వాడిని లెక్క చేసే వాడిని కాదు. మా ఇంటికి వచ్చి మా అబ్బాయి ని కొడతాడా? అసలు నోట్ ఎందుకు ఇవ్వాలి. వాడి డబ్బులే ఇవ్వను “ అంటూ మూలిగాడు. మెల్లగా కొంత కాలానికి సద్దుకొన్నాడు. చాలా కాలం తరువాత తెలిసింది జయపాల్ కి ఇవ్వవలసిన డబ్బులు జాగ్రత్తగా ముట్టాయి అని. ఆ ఇద్దరు చాలా స్నేహితులయిపోయారని. ఈ లోపునే నాకు జరగవలసిందంతా జరిగిపోయింది.
ఊహించని విధం గా ఒక ఫోన్ కాల్ వచ్చింది. “ఇంకా కొద్దిసేపట్లో పోలీస్ మీ ఆఫీస్ కి వచ్చి మీ ఇంటినే సోదా చెయ్యడానికి తీసుకొని వెళతారు. కాస్త జాగ్రత్త”.
ఎందుకో, ఏమిటో. నిజం గా నాకేమి అర్ధం కాలేదు. దేని గురించి ఈ పోలీస్ ? కంప్లైన్ట్ ఏమిటి? ఇల్లు సోదా ఏమిటి ? దీనికంతటికి మూలం ఏమిటి? సరే. నాకు వున్నపలుకుబడి తో పెద్ద వాళ్ళ తో మాట్లాడాను. పోలీస్ రావడం మా ఇంటికి వెళ్లడం ఒక రొటీన్ గా జరిగి పోయింది.గొడవలేమి జరగ లేదు. ఆ విషయం సమసి పోయింది. నేను పోలీస్ స్టేషన్ వెళ్ళాల్సిరావటం ఇంట్లో వాళ్ళని చాలానే కలవరపరిచింది. దానితో నాకు ఒక కొత్త అనుభవం వచ్చింది.
కానీ ఇంకో పదిహేను రోజుల తరువాత సడన్ గా ఒక క్రిమినల్ కేసు కోర్ట్ నోటీసు,ఇంటికి వచ్చింది. నేను, అమరేంద్ర కలసి జయపాల్ ని మోసం చేసి డబ్బులు తీసుకున్నామని. దీనికి అంత నేనే బాద్యుడనని. నాది ఒక సాక్షి సంతకము కదా, నా మీద కేసు ఏంటి ? నాకు వున్న న్యాయ పరిజ్ఞానం లో సాక్షి కి డాక్యుమెంట్ లో వున్న విషయాలతో సంబంధం లేదు. ఇది ఒక కొత్త కోణం. కేసు నడుస్తూనే వుంది. కోర్ట్ కి హాజరై తీరాలి. వేరే లాయర్ ని పెట్టాల్సి వచ్చింది. కొంత కాలం అయిన తరువాత కేసు క్లోజ్ అయింది. గట్టిగా లెంపలేసుకున్నాను. ఈ అనుభవాన్నిమర్చిపోకూడదని తలచి.
అయిందా? అంతా ముగిసి తెరిపినపడ్డాననుకుంటూండగానే , ఒక రోజు ఒక స్థానిక సేకరణ ఏజెంట్ ( collection agents) నించి ఒక ఫోన్ వచ్చింది. వెంటనే వచ్చి కలవాలని. విషయము జయపాల్ కి అమరేంద్ర ఇవ్వ వలసిన డబ్బులుగురించి, దానిలో నా ఉనికి గురించి. వారిని కలసి అసలు విషయము వివరించు కొన్నాను.ఇది కూడా ఇదీ ఎలాగో ముగింపజేసుకున్నాను. ఈ చివరి దెబ్బ చిన్నదైనా, అంతకుముందే తగిలి ఇంకా పచ్చిగా ఉన్న అనుభవాలమీద పడ్డందుకేమో మహా నొప్పి మిగిల్చింది. నా అతిసేవాతత్పరతకి మరోసారి దణ్ణం పెట్టుకున్నాను. కానీ ఈ మరో అనుభవం అంత తేలిగ్గా ఈ విషయాలన్నిటినీ మరువకుండా మరింత బలపరిచిందని అపుడే అర్థమయింది.
చాలా కాలమయింది ఇవన్నీ జరిగి. కానీ ఈ అనవసర ఇబ్బందులు నన్ను నా కుటుంబాన్ని చాలా కలవర పెట్టాయి. ఇన్నేళ్లు దాటినా ఇంకా ఆ విషయం అపుడపుడూ ఉండుండి నన్ను వెంటాడుతూనే వుంది. “అయినదేదో అయిపోయింది. ఆ విషయం మర్చిపోండి. వాళ్ళని క్షమించేసాను అనుకొని స్థిమితపడండి. బాగుంటుంది” అని చెప్పింది నా భార్య. అనవసరంగా ఇంత జరిగినాక నిజంగా మర్చిపోవడం, క్షమించేయడం వీలవుతుందా? లేక సమయం చూసి బుద్ధి చెప్పటమా? ఛ, నేనేనా ఇలా ఆలోచించేది? ఆ ఏడుకొండలవాడినే అడిగాను. ధర్మమేదని?
తెల్లారుగట్టే లేచి కొండమీదికి వెళ్లి దర్శనం కి రెడీ గా తయారు అయ్యేను. స్పెషల్ దర్శనం లైన్ కి ఇంకొంచెం టైం వుంది. గుడి వెనకాల వున్న హోటల్ గట్టు మీద కూర్చొని వున్నా. స్వామి సన్నిధి లో వాతావరణం చల్లగా నిర్మలంగా వుంది.
ఒక మహానుభావుడు ప్రవచము లో చెప్పుతూ వున్న మాటలు కూడా వినిపిస్తున్నాయి “మర్చి పోవడం , క్షమించడం” ఎంత శ్రేష్ఠమైన గుణాలో చెపుతున్నాడు. అవును, కానీ అదేగా నన్నూ తొలుస్తుంది? అంత సులువా? వింతగా నవ్వుకున్నాను.
ఇంతలో ఎదురుగా ఒక ఆవిడ, పిల్లలు మెట్ల మీద నుంచి హోటల్ లోపలి వస్తున్నారు. వాళ్ళు జయపాల్ ఫామిలీ. యాదృచ్చికం ? దూరం నించే వాళ్ళను చూసి అనాలోచితం గా లేచి నించొని వాళ్ళని పలకరించాను. జయపాల్ రాలేదు. ఆవిడ నన్ను చూసి కొంచెం కలవరపడినట్టుగా అనిపించింది. అనాలోచితంగా వాళ్ళని లోపలికి పిలిచి టేబుల్ దగ్గరకు తీసుకొని వెళ్ళాను. పిల్లలు కూడా సరదాగా పలకరించారు. జయపాల్ ఇంకా రూమ్ లో వున్నాడుట. వెనకే వస్తున్నాడంది. వాళ్లు టిఫిన్ చేస్తూ ఉంటే నేను మళ్ళా బయటకి వచ్చి కూచున్నాను. కొంతసేపట్లో జయపాల్ కనిపించాడు. ప్రవచనం కొనసాగుతూనే వుంది. మనిషిని చూడగానే మనసులో ఉన్నవన్నీ ఎలా మాయమయ్యాయో మరి? అసంకల్పితంగా అతని చెయ్యి పట్టుకుని పలకరించాను. అతనికి నన్ను గుర్తు తెచ్చుకునేందుకు ఒక్క నిముషం పట్టింది. కుశల ప్రశ్నలు అయే టైం కి అతని ఫామిలీ కూడా బయటికి వచ్చి మాతో కలిశారు. మా ఇద్దరి మధ్య పాత సంగతులు ఏమి రాలేదు. ఇంత సేపటి నించి ఆలోచిస్తున్న ఆలోచనలు అన్ని ఎటో వెళ్లి పోయాయి. దీనిని క్షమించడం అనాలో, మర్చిపోవడం అనాలో, ఏమనాలో తెలియలేదు. అన్ని ఆలోచనలు దూరం అయిపోయాయి. జయపాల్ కూడా ఆ పాత విషయాలు ఏమీ ఎత్తలేదు. నాకు కూడా ఆ విషయాలు ఏమీ మాట్లాడాలి అనిపించ లేదు. తన మీద కోపం, పగ అవేవి గుర్తుకు రాలేదు. స్వామి సన్నిధి కదా ! ఒక్క సారి ‘క్షమించడం నేర్చుకో’ అని ఎవరో తట్టి చెప్పినట్టు అనిపించింది. ఒళ్ళు పులకరించింది. జయపాల్ ఏమాలోచిస్తున్నాడో తెలీదు. నాకు అనవసరం. ఇక మీద ఈ విషయం గురించి నేను మాత్రం ఆలోచించబోవటం లేదనేది తెలిసింది.
క్షమాగుణం లో ఇంత మంచి ప్రభావం వుందా? నాకు ఇంకొక అందమైన అనుభవం. ఇది మాత్రం గుర్తుంచుకోదగినదే.
మనస్ఫూర్తిగా నవ్వుతూ అతనిని టిఫిన్ చేయమంటూ వీడుకోలు చెప్పాను. ప్రవచనం కొనసాగుతూనే వుంది. కోనేటి రాయని దర్శనానికై బయల్దేరాను.
మెట్లు దిగుతూ ఉంటే మనస్సు కి ఎంతో తేలిక గా వుంది.
నేను మెట్లు దిగి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వైపు నడుస్తున్నాను.
ఇప్పుడు మనసుకు ఎంతో తేలికగా, హాయి గా వుంది. అనవసరంగా మోసేవన్నీ దించుకున్నాను కదా?
*****