top of page

'అలనాటి' మధురాలు

ధర్మక్షేత్రము

కవిత తొలి ప్రచురణ:  భారతి పత్రిక- 1941 జూన్ సంచిక​

స్వర్గీయ చాగంటి సోమయాజులు (చాసో)

(1915-1994)

నారాయణుడే నరునకు 
సారధి అయినాడు !

 

పుడమిని పాడిస్తూ
తారలనాడిస్తూ
నారాయణ చక్రము
నదిలో నాదము లాగను
‘ఓం. ఓం’
అన్నాది!

 

రణరంగములో
ప్రణవగానము
గాంభీర్యముగా
గర్జన చేస్తూ
పాంచజన్యము
‘హరోం, హఱోం’
అన్నాది!


గాండీవ ధనుష్టం
కారము
ఝాంకారము తో
‘వ్రోం వ్రోం’
అన్నాది!

 

నర విముక్త విష, నిశిత 
నారాచములూ
నారిని వీడీ
రోలంబ నినాదములా 
‘ఱోం ఱ్ఱోం’
అన్నాయి !

 

కదన భూమి
కల్లోలములో 
మార్గణాది
మారణాస్త్ర హత 
వికలాంగ వీరుల 

వీరాలాపములూ;
విగత ప్ర్రాణం తో
విభులపై బడి
వెర్రెత్తిన
యువిదల
యుద్దాంతర
హృదయ దళన 
రోదనార్తులు
విహాయసానికి మొత్తముగా 
వినిపించాయి, 
“డదబరోం! డదబరోం!
హరోం ! హఱోం! 
సోహం ! సోహం !” 

 

గోవర్ధనమెత్తీ 
గో, 
గోపిక గణమును 
గాచిన 
నారాయణుడే 
నరునకు
సారధి అయినాడు!

ఊర్ధ్వముఖంగా మొదలు 
అధోముఖంగా ఆకులు 
పెట్టుకుని మర్రి 
నిక్షేపంగా
నిలబడ్డాది!

 

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...

click here to post your comments...

Anchor 1
bottom of page