MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వ్యాస మధురాలు
ఆ అక్షరాలు చైతన్య జలపాతాలు…
మణి వడ్లమాని
“అబ్బ! ఈ వారం సీరియల్ చాలా బావుంది!!”
“అవునండీ! రోజాకి, లావణ్యకి ఒకే రకం చీరలు కొన్నారు”
“అంతేనా?! చిన్నపిల్ల రాధ ఒకటే సంతోషపడుతోంది. ఆ అమ్మాయి చేత మతాబులు కాల్పిస్తున్న రోజా మొహంలో విరిసే కాంతి చూసి ఆ తండ్రి మురిసిపోతున్నారు”.
“నిజమే! ఆయన రోజాకి తండ్రి అని మనకి తెలుసు, కానీ పాపం ఆ రోజాకే తెలియదు.”
ఈ విధంగా ఆ వారం సీరియల్ గురించి అమ్మ, పక్కింటావిడ మాట్లాడుకుంటున్నారు. (ఆ సీరియల్ ఏవిటన్నది మీకు ఈపాటికే తెలిసిపోయుంటుంది కదా!)
వాళ్ళ మాటలు అరుగుమీద ఆడుకుంటున్న నా చెవి లో పడ్డాయి. అంతే! ఉత్సాహంగా పరుగెత్తుకుంటూ వెళ్లి “ఆ రోజు దీపావళి! వేణుగోపాల రావు గారింట్లో పండగ సందడి కనిపిస్తోంది. రోజా పులిహార, బొబ్బట్లు ఇంకా బోలెడు పిండి వంటలు చేసింది”. అని చెబుతున్న నన్ను చూసి పక్కింటావిడ- ”ఏవిటి? మీ అమ్మాయి అప్పుడే పెద్ద ఆరిందాలా వారపత్రికలు చదివేస్తోందా? ఇలా కంఠతా పట్టి ఒప్ప చెప్పడమా?” అని బుగ్గలు నొక్కుకోవడం, పైగా “మా ఇంట్లో ఇలాంటివి జరిగితే మా ఆయన చంపేస్తారు” అనేసి వెళ్ళిపోవటం, ఆవిడ వెళ్ళిపోయాక మా అమ్మ… “అలా పెద్ద వాళ్ళు మాట్లాడుకునే సమయం లో నువ్వు మధ్యలో రావడం ఒక తప్పయితే ఆ సీరియల్ చెప్పకుండా చదవడం మరో తప్పు, పైగా దానిగురించి చర్చించడం కూడానా?” అని తిట్లతో పాటు గా కొట్టడం కూడా జరిగింది.
ఆవిడ రచనలు ఎంతగా ముద్ర వేసాయో చెప్పడానికి ఇది ఓ చిన్న ఉదాహరణ.
అలా మొట్ట మొదటగా సులోచనారాణి గారి రచనలు చదవడం ప్రారంభం అయింది. ఈ సంఘటన జరిగినప్పుడు ఏడో క్లాస్ చదువుతున్నాను. అప్పటి నుండి ఆవిడ రాసిన దాదాపు అన్ని నవలలు చదివాను.
ఆవిడ నవలల గురించి అందరి కీ తెలిసినదే .
యద్దనపూడి సులోచనారాణి పేరు తెలియని తెలుగు వారు ఉండరేమో… పరిచయమక్కరలేని రచయిత్రి!
తెలుగు నవలా ప్రేమికులు ఆమెను ఎంతగానో ఇష్టపడతారనీ! … అక్షరం వచ్చిన ప్రతి తెలుగువారు ఆవిడ రచనలని ఇష్టంగా చదివి ఉన్నవారే.
ఆవిడ రాసే నవలలో మానవ సంబంధాలు, కుటుంబభాంధవ్యాలు, ప్రేమానురాగాలు ఎంత సున్నితంగా ఉంటాయో, ఆడవారికి ఎంతో మనోధైర్యం ఇచ్చేలానూ ఉంటాయి. ఆవిడ రాతలు ఇన్ని దశాబ్ధాలుగా నిలుచుండిపోయినట్టే, మరిన్ని దశాబ్దాల బాటు ప్రజల గుండెల్లో నిలిచిపోతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. నవల మొదలు పెడితే చివరివరకుా ఆపకుండా ఏకబిగిని ఆముాలాగ్రం చదివించే శక్తి ఆమె రచనల సొంతం అని చెప్పడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు!! దేశాన్ని, రాష్ట్రాలని విడిచి పెట్టి వెళ్ళిన తెలుగువారికి ఆవిడ పుస్తకాలే ప్రియ నేస్తాలు, పక్క తోడూ అంటే అతిశయోక్తి కానే కాదు.
ఆమె తన కుటుంబ సభ్యులు, బంధువుల మానసిక ప్రవర్తనలను, సంఘర్షణలను చిన్నప్పట్నుంచి చూసి అధ్యయనం చేసి వాటినే తన రచనల్లో ఉపయోగించటం వల్ల పాత్రలు ఎంతో సహజంగా ఉండేవని చెప్పేవారు.
ఆమె తనకు తెలిసిన తన చుట్టూ ఉన్న జీవితాలనే కథా వస్తువుగా తీసుకుని నవలలు రాయడం ప్రారంభించినా, ఆ తరువాత మారుతున్న ప్రజల జీవన విధానాలను అనుసరించి పాత్రలను సృష్టిస్తూ వచ్చారు. సుకుమారి, సౌగంధి, మౌనపోరాటం, ఆగమనం, ఋతువులు నవ్వాయి మొదలయినవి అలాంటి నవలలే.
చాలావరకూ నవలలు భార్యాభర్తల మధ్య దాంపత్యం, కుటుంబ బాంధవ్యాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సెక్రటరీ, జీవనతరంగాలు, నీరాజనం, అమరప్రేమ, అమృత ధార మొదలయిన వాటిలో ఆవిడ నాయికలు మధ్య తరగతి అమ్మాయిలు. ఆత్మవిశ్వాసం, కుటుంబ బాధ్యతను మోసే వ్యకిత్వం కలిగి ఉంటారు. వాటిలో అబ్బురపరిచే సజీవపాత్రలెన్నెన్నో!
చదివే అలవాటు పెద్దగా లేనివారూ పుస్తకం పట్టేలా చేసాయి ఆవిడ రచనలు. అంతేనా! ఎంతో మంది ఆవిడని ఆదర్శంగా తీసుకుని రచయితలైనారు. ఆ ఎంతోమంది లో నేను కూడా ఉండటం ఒక గర్వకారణం.
నచ్చిన కొన్ని వాక్యాలు ఈ క్రమంలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలని పంచుకోకుండా ఉండలేకపోతున్నాను.
“జీవనతరంగాలు” లో నించి, ఈ వాక్యాల లోతుని గమనించండి.
“జీవితం లో సుఖం కంటే కష్టం, అందమైన భ్రమలకంటే చేదులాంటి యదార్ధమైన కఠినసత్యం, కన్నె వయసులో ఉన్నా-కమ్మటి కలలుకనే ఆంతర్యం లో బ్రతుకుని గురించి ఎలాంటి ఆలోచనలు లేకుండా క్షణం క్షణం భవిష్యత్ ను గురించి భయపడుతూ పెరిగినదానిలా కనిపిస్తుంది. కానీ గుండెల్లో భావ సంచలనం ఎలాంటి ఆటుపోటులకి గురి చేసినా వాటి అలల తాకిడి ముఖం లో ప్రతిబింబించకుండా జాగ్రత్త పడగల నేర్పు ఆమె లో(రోజా) ఉంది.”
“ఈ జీవితం ఎంత విచిత్రం? ఎక్కడోపుట్టి ఎక్కడెక్కడో ప్రవహించి, చివరకి మహా గంభీరుడైన సముద్రం లో ఐక్యం అయిపోవడమే లక్ష్యం గా పెట్టుకున్న నదిలా పరుగు తీస్తుంది.”
“జలపాతం” లో చెప్పిన ఈ వాక్యం నేటికీ వర్తించేదే.
“ఈ లోకంలో చాలామందికి పెళ్లి అంటే అర్ధం తెలియదు. జీవితం లో అదొక మొక్కుబడిగా చెయ్యవలిసిన పనిలా పెళ్లి అనేది చేసుకుంటారు. పెళ్లి అనే దాని విలువ అర్ధం చేసుకొని, చేసుకునే వాళ్ళు బహుకొద్దిమంది.”
నిజమే కదా! ఎంతమందికి పెళ్ళి అంటే అర్థం తెలుసు? చేసుకోవాలి కనుకే చేసుకునేవారే అధికం. నాటికైనా, నేటికైనా.
“మీనా” లో ఇలా అంటారావిడ. తడిమే వాక్యాలవి.
“కొన్ని పట్టుదలలుంటాయి. జీవితంలో జరిగినవన్నీ గుర్తుండవు. గుర్తుండే బలమైన సంఘటనలైనా జ్ఞాపకాలలో అప్పుడప్పుడూ కదులుతాయి. కానీ, కృష్ణకి మేనత్త వల్ల జరిగిన అవమానం గుర్తొస్తూ అనుక్షణం రక్తాన్ని మరిగించే పట్టుదలగా మారింది.”
“కొన్ని మనస్తత్వాలుంటాయి. ఇంకో పిల్లపుడితే వున్న ఒక్క కూతురు మీద ప్రేమ తరిగి పోతుందేమో, తన తల్లి ప్రేమని భాగాలుగా మలచాల్సి వస్తుందేమోనన్న వెర్రి ప్రేమ. తన మనస్సు, కూతురు మనస్సు ఒక్కటేనని, తనకి నచ్చిన భవిష్యత్తునే కూతురికి అందించాలని, ఓ తల్లి పడే తాపత్రయం…”
తరచి చూస్తే, ఈ వాక్యంలో, ఎపుడోసారి తన్ను తాను చూసుకునే తల్లులు ఉండరనిపిస్తుంది.
“మౌనతరంగాలు” లో ఓ అమ్మాయి చిత్రణ నేపథ్యం గమనిస్తే...
ఒక్కతే కూతురు అయిన మేధ గారాబంగా పెరిగింది. తల్లితండ్రులని ఎదిరించి పెళ్ళిచేసుకుంది. చాలీ చాలని జీతం తో ఎంతో ఇష్టంగా అతని తో కాపురం సాగించింది . ఒక్కో ఇటుక పేర్చుకుంటూ తన చిన్న ఇంటిని ఎన్నో ఆశలతో కష్టపడి కట్టుకుంది. స్వత్రంతంగా, ఉన్నదాంట్లో తృప్తిగా జీవిస్తున్న ఆమె జీవితంలో ఓ పెద్ద తుఫానువచ్చింది.
“ఎప్పుడయితే నన్ను, నది మధ్యలో వదిలేసి వెళ్ళావో అప్పటి నుంచి నువ్వు, నేను వేరు వేరు. ఒకటి కాదు. ఎప్పటికీ ఈ ఇంటి మనిషివి కాలేవు. ఈ జీవితం నాది, నిర్ణయాలు నావి, నేను పూర్ణ స్వత్రంత్రురాలుని, నాకు బాధ్యతలని మొయ్యడం తెలుసు, కష్టపడటం తెలుసు” అని చెప్పేస్తుంది.
“స్త్రీ ప్రేమించే హృదయాన్ని కించపరిచి, నిర్లక్ష్యం చేసి వెళ్ళిన పురుషుడు తిరిగి వస్తే స్త్రీ అతన్ని క్షమించాలా? అవసరం లేదు ? నేను క్షమించను”
ఆడపిల్లల్లో ఈ స్వతంత్ర భావజాలం అరుదుగా ఉండే ఆ రోజుల్లోనే ఆవిడ సృష్టించిన స్త్రీ పాత్రల్లో ఆత్మాభిమానం మెండుగా ఉండే వ్యక్తిత్వ చిత్రణ ప్రశంసనీయమనిపించక మానదు. నిజానికి ఆవిడ రచనలని పూర్తిగా అర్ధం చేసుకుంటే , ఆవిడ ఎక్కువ గా స్త్రీ వైపు ఉన్నట్లే తెలుస్తుంది.
అమృతధార లో ఈ వాక్యాలు…
“ఏమిటో, ఈ మనుష్యుల అనుబంధాలు, ప్రేమాభిమానాలు ముసుగుధరించిన దోబూచులాటలా. ఆత్మీయతను ఒక ఆయుధంగా ఉపయోగిస్తారు. దానిద్వారా మనుషులని కట్టిపడేసుకుని బానిసలుగా పని చేయించుకుంటారు. చిత్రమేమిటంటే అవతలి వాళ్ళకు తాము బందీ అయ్యారని తెలియదు.”
నిజమే సుమా! అని విస్తుపోయేట్టు చేసేవే..
"జీవన గీతం" లో ఇలా అంటారావిడ...
“ఈ జీవితం చాలా చిన్నది అయినా అద్భుతమయినది. మనకి ఈ జీవితం ఎందుకు లభించిందో తెలియదు . ఏమి తెలియకుండా పుట్టటం, తెలియకుండా పోవడం. అయితే మధ్యలో ఉండే ఈ జీవితం అద్భుతమైన ఈ అనంత సృష్టిని గమనించే అదృష్టం దొరుకుతుంది.
అంతరిక్షం లో తిరిగే వ్యోమగామిలా ఈ భూగోళాన్ని అక్కడనుంచే పరిశీలించినట్లుగా మానసిక దూరం తో మనం ఈ సంఘాన్నిమనుష్యులని గమనించాలి.”
ఈ మాటలు రాసిన సులోచనారాణి గారు నిజజీవితంలోనూ, అంతే తటస్థంగానూ, నిశ్చలంగానూ, తామరాకుపై నీటిబొట్టు చందంగానూ ఉండేవారని సన్నిహితులంటారు. అపురూప వ్యక్తిత్వమావిడది. నవలా రాణిగా అంతటి గుర్తింపుని పొందినప్పటికీ, నేల వీడని అసాధారణమైన చక్కటి వ్యక్తిత్వంతో ముగ్ధులని చేసేవారావిడ.
కుడి చేత్తో చేసినదాన్ని ఎడమ చేతికి తెలియనీయకుండా ఆవిడ చేసిన సహాయాలు, ఆవిడలోని సేవానిరతి గురించి దగ్గర వాళ్ళకు తప్ప అన్యులకి తెలియదు. మానవ సంబంధాల ఇతివృత్తంగా, ఎన్నో రచనలు చేసిన సులోచనారాణి గారు వయోభారం తో పెద్దవారైన ఒంటరి మహిళల కోసం ‘విన్’ పేరుతో ఒక వృద్ధాశ్రమాన్ని నెలకొలిపారు. అనాధ పిల్లల కోసం తన ఇంటి ఆవరణలోనే కొద్దిరోజుల పాటు ఒక పాఠశాలను నిర్వహించారు. ‘వయస్సు మీరిన తర్వాత మనకంటూ మనం ఓ వ్యాపకాన్ని పెట్టుకోవాలి’ తరచుగా అంటుండేవారని ఆమె సన్నిహితులు చెబుతారు.
ఆవిడ రచనలని ఎంతగానో అభిమానించే నేను ఆవిడని కలిసే అదృష్టం లభించాక, ఆవిడ వ్యక్తిత్వాన్నీ అదే స్థాయిలో ఆరాధించాను.
లేఖిని సాహితీ సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు డాక్టర్ వాసా ప్రభావతి గారి ద్వారా వారిని కలుసుకునే భాగ్యం కలిగింది. అప్పటి నుంచి వారిని పలుమార్లు కలవడం కూడా జరిగింది. ‘సెక్రటరీ’ నవలకి స్వర్ణోత్సవం జరిపే సందర్భం లో వారు, స్వయంగా నన్ను రమ్మనమని చెప్పడం నేనెప్పటికీ మరువలేని అనుభూతి.
నా కధల సంపుటి ‘వాత్సల్య గోదావరి’ని వారికి అంకితం చేసి, వారి ఆశీస్సులు అందుకోవడానికి నేను, మరో రచయత్రి సుందరీ నాగమణి కలిసి వారింటికి వెళ్ళినప్పుడు ఆవిడ మమ్మల్ని ఆదరించిన తీరు, ఎన్నో విషయాలను మాతో పంచుకున్న ఆవిడ ఆత్మీయత వర్ణనాతీతం. అప్పుడు మాలో కలిగిన ఆనందం చెప్పలేనిది. కానీ, అదే ఆఖరి కలయిక అని ఎంత మాత్రం ఊహించలేదు.
ఆవిడ తిరిగిరాలేకున్నా, నవలారాణిగా ఆవిడ కీర్తి శాశ్వతం. తెలుగు వారంటే గుర్తొచ్చేవి ఆవకాయ, గోంగూర, నవనీతం, బాపు, కూచిపూడి మాత్రమే కాదు వాటి సరసన సులోచన రాణి గారు ఎప్పటికీ నిలిచే ఉంటారు.
ఆవిడ ఒక అనంతం ..... ఆవిడ అక్షరాలు చైతన్య జలపాతాలు..
OOO