MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వ్యాస మధురాలు
చాటువు
డా. వై. కృష్ణ కుమారి
తెలుగు సాహిత్యంలోని ప్రత్యేకత విభిన్నమైన ప్రక్రియలే.
అందులో మెరుపుల్లాగా మెరిసే చాటువులొక ప్రత్యేక స్థానాన్ని కల్గి ఉన్నాయి. చాటువు అనే పదం చటస్స అనే శబ్దం నుంచి వచ్చింది. మనసుని మురిపించే వాక్యమని ఒక అర్థం కాగా ముఖస్తుతి, మిథ్యాప్రియ వాక్యం అని నైఘంటికార్థం గా కనిపిస్తున్నది. చక్కటి చమత్కృతి తో, వినగానే ఉల్లాసం కల్గించే ఈ చాటువులు మౌఖిక ప్రచారం ద్వారానే జనులలో నేటికీ మిగిలిఉన్నాయి.
చరిత్ర కందినంత వరకు నన్నయ మహా భారతంలో మొదటిసారిగా గ్రంధస్థమైన కొన్ని చాటువులను అప్పటికే బాగా ప్రాచుర్యం పొందినవిగా గుర్తించవచ్చు. ముఖ్యంగా చాటువులు ముక్తకాల వంటివి కాబట్టి సందర్భాన్ని బట్టి కథలో అంతర్భాగాలుగా కనిపించడం కద్దు. అవే చాటువులు విడిగా కూడా ఆయా సందర్భాల ననుసరించి ఉపయోగించడం గమనించవచ్చును. అందుకే చాటువులలోని వస్తువు ఆనంతమైనది అని చెప్పవచ్చును. జనజీవన విధానానికి చాటువు ఒక దర్పణం వంటిది. సంస్కృతి సంప్రదాయాలకు మాత్రమే కాదు సమాజ ఆలోచనా విధానానికి కూడా చాటువులు పట్టుగొమ్మలు.
చరిత్ర కందినంత వరకు తొలి చాటువు ఆదికవి వాల్మీకిదే.
‘మానిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ స్స మాహ్
యత్క్రౌంచ మిధునాదేక మవధీం కామామోహితం’
సత్కరింపబడినప్పుడు గాని, ఛీత్కరింపబడినప్పుడు గాని, అందమైన దృశ్యం చూసినప్పుడు గాని, డెందం గాయపడినప్పుడు గాని అనేకానేక సందర్భాలలో అప్రయత్నంగా నోటివెంట వచ్చే పదాల పోహళింపే చాటువనుకుంటే వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చిన ఈ శ్లోకం భారతీయ సాహిత్యంలో మొదటి చాటువనడంలో సందేహం లేదు కదా!
భోజనప్రియుడైన ఒక కవి వరేణ్యుడు వంకాయను వర్ణించిన చాటువు నేటికీ ప్రజల నోళ్లలో నాను తూనే ఉంది కదా.
‘వంకాయవంటి కూరయు
పంకజ ముఖి సీత వంటి భామామణీయున్
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి రాజును గలడే’
పల్నాటి సీమను ఆసాంతం తిరిగిన మహాకవి శ్రీనాథుడు ఆ ప్రాంతంలో నీళ్ళు దొరకక కష్టాలు పడి తన స్వానుభవాన్ని ఈ విధంగా చెప్పాడు.
‘సిరిగలవానికి చెల్లును
తరుణులు పదియారువేల దగ పెండ్ళాడగన్
తిరిపమున కిద్దరాండ్రా
పరమేశా! గంగ విడుము పార్వతి చాలున్’
ఉచితానుచితములు తెలిసిన దాత దగ్గరికి యాచకులు తమంత తామే వస్తారు. వారిని ఎవరు పిలవనక్కరలేదు ఆన్న సత్యాన్ని క్షేత్రయ్య ఎంతో అందంగా చెప్పాడు.
“తమకు దామె వత్తురర్థులు
క్రమమెరిగి దాత కడకు రమ్మన్నారా
కమలంబులున్న కొలనికి
భ్రమరంబుల నచ్యుతేంద్ర రఘునాధ నృపా ?’
ఆధునిక కాలంలో కూడా మనకు ఈ చాటువులు వినిపిస్తూనే ఉన్నాయి. దాస్య శృంఖలాలలో మగ్గిపోతున్న భారత జాతిని ఉద్ధేశించి చిలకమర్తి వారు ఆశువుగా చెప్పిన ఈ చాటువు నేటికీ ప్రజల నోట తిరుగాడుతూనే ఉంది.
“భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడ లై యేడ్చు చుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి’
చాటువులు కేవలం ఆ సందర్భానికి స్పందించి చెప్పినప్పటికీ తర్వాతి కాలంలో అనేక సందర్భాలలో వాటిని ఉపయోగించడం వాటి నిజాయితీని, ఔచిత్యాన్ని వివరిస్తున్నది . ఉపయోగిస్తున్న కొద్దీ ఇవి మెదడుకు మేతగా ఉంటాయి. కాబట్టి చాటువులలో జీవన సత్యాలు ఉన్నాయి, అందమైన అక్షర బంధమూ ఉంది, పరిపక్వత చెందిన అనుభవము ఉంది అని నిస్సందేహంగా చెప్పవచ్చును.
*****