top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

అందమైన అబద్ధాలు

భువనచంద్ర

ఈ  సినిమా టైటిల్ ఎనౌన్స్ చేసిన రోజునే ఇది 'సూపర్ హిట్' అవుతుందని చెప్పా. ఇది సూపర్ డూపర్ హిట్టని చెబుతున్నా" చిరునవ్వుతో అన్నాడు సూది నాయుడుగారు. అసలు పేరు ABC నాయుడు. 'సూది' సినిమాతో హిట్టయ్యాడు గనక అందరూ ఆయన్ని సూది నాయుడంటారు.

హాలంతా చప్పట్లతో, ఈలలతో దద్దరిల్లిపోయింది. "మీ హీరోనే  మా హీరో. అంటే ప్రజల కోసం, ప్రజల్లోంచి ఇండస్ట్రీకొచ్చిన ప్రజాహీరో అన్నమాట. మీకేం కావాలో ఆయనకి బాగా తెలుసు" హీరోగారి ఫేన్స్ వూగిపోయారు. ఉత్సాహంతో వెర్రికేకలు వేశారు.

"ఇక రచయిత సంగతి. ప్రజలనాడి  పర్ఫెక్టుగా తెలిసిన ప్రజారచయిత మాటల తూటాలు పేల్చడంలో ఆయనకి ఆయనే సాటి. ముఖ్యంగా ఆ డైలాగు, అదే.. 'అండర్‌వేర్‌తో కొట్టానంటే అండమాన్లో తేల్తావు' అన్న డైలాగ్. వాహ్.. ప్రివ్యూ చూసినప్పుడే పిచ్చెక్కించింది. అలాగే హీరోయిన్ విలన్‌తో 'ఒరేయ్.. నిన్ను చంపడానికి పిస్తోళ్లక్కర లేదురా.. పైట చెంగుతో కాటేస్తే, ఫట్టున చస్తావ్' అన్న డైలాగ్ తెలుగింటి ఆడపడుచుల పవరేంటో ప్రపంచానికి చూపించింది." మళ్ళీ చిరునవ్వు నవ్వి అన్నాడు సూదినాయుడు. హీరోయిన్ ఫేన్స్ లేచి డాన్స్ చేశారు. రచయిత అతి వినయంగా సూదినాయుడు వంక చూసి 'వందనం' అర్పించాడు.

"ఇక యీ చిత్రం ప్రారంభం రోజున క్లాప్ కొట్టిన మంత్రిగారిది నిజంగా సువర్ణహస్తమే. ఆయన పట్టింది బంగారం. కొట్టిందీ బంగారమే..." రెచ్చిపోయారు సూదినాయుడుగారు.

"వస్తే చస్తావ్!” అన్న టైటిల్ యీ సినిమాకి అతికినట్టు సరిపోయింది. 'ఎనీ డౌట్?' అన్న Tagline అద్భుతం. ఈ సినిమా హిట్టవడం మన తెలుగు చలన చిత్ర పరిశ్రమకి గర్వకారణం. ఇంత  హిట్టునందించిన  ప్రొడ్యూసర్ అప్పల్నాయుడ్నీ, డైరెక్టర్ తంగరాజన్‌ని మళ్లీ మళ్లీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. జై ఇండియా. జై హైదరాబాద్. జై గుంటూర్" అంటూ వుపన్యాసం ముగించాడు సూదినాయుడు.

"అన్ని జై లు ఎందుకూ?" పక్కవాడ్ని అడిగాడు ఓ ఫ్లోటింగ్ అభిమాని. "అదంతేలే... ఆ మధ్య కుంచేపు రాజకీయాల్లోకెళ్ళొచ్చాడు" గుసగుసగా అన్నాడు తెంపరరీ ఫేన్.

చప్పట్లు మారుమ్రోగినై. ఈలలు దిశలు దాటినై. ప్రొడ్యూసరూ, డైరెక్టరూ సూది నాయుడుగారి పవిత్రపాదాలకి ప్రణమిల్లారు.

"ఇప్పుడు... అక్లాండ ప్రేక్షల్నీ ఉట్కేసించి మన ప్రియాటిప్రియమైనా మాంట్రిగారు మాట్లాడ్తారు"  యాంకర్ అవతారం ఎత్తిన మాజీ నటి  'మధు కుక్షి' ముద్దుగా ఎనౌన్స్ చేసింది. మధుకుక్షి నిజానికి తెలుగుదే. తెలుగులో అవకాశాలు దొరక్క మద్రాసులో కొన్నాళ్లుండి ఆ తరవాత మళయాళ పరిశ్రమలో కొన్ని చిన్నాచితకా వేషాలు వేస్తూ మళయాళం బ్రహ్మాండంగా నేర్చుకుంది. దానిక్కారణం అజయ్‌మీనన్. తెలుగు నేర్చుకుందామని మధుకుక్షిని దగ్గరకు తీశాడు గానీ, అతనికి తెలుగు రాలా. ఆమె మాత్రం బ్రహ్మాండంగా మళయాళాన్ని పట్టేసింది. ఆ తరవాత కోలివుడ్లో హీరోయిన్ అయి ఓ పది సినిమాల దాకా పంజేసింది. కేరళకుట్టీలు కోకొల్లల్లుగా కోలీవుడ్డూ, టాలివుడ్డూ ఆక్రమించెయ్యడంతో యాంకర్‌గా సెటిలైంది.

మంత్రిగారు చిరునవ్వుతో లేచి మైకు అందుకున్నారు. "ముందుగా నన్నే మాట్లాడమని అడిగారు. నేను నో అన్నాను. ఎందుకంటే నేను మాటలోడ్ని గాదు. చేతలోడ్ని. మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన కెమెరా 'ఆన్', నేను 'క్లాపు' కొట్టిన 'జమాలకిడి జింగిడి' ఎంత పెద్ద హిట్టయిందో మీకు తెలుసు. ఈ సినిమాకీ మేవిద్దరం అదే పని చేశాం. ఈ సినిమాలో హీరో డూపు లేకుండా చేసిన 'స్నానం' సీను సినిమాకే హైలైటు . అదే విధంగా ఓటరులారా, హీరోయిన్ మేకప్ వేసుకోకుండా తల్లిగానూ, మేకప్‌తో కూతురిగానూ పోషించిన పాత్రలు మహాద్భుతం. నభూతో న భవిష్యతి. ముఖ్యంగా

' ఎక్కడ పెట్టావురోరయ్యా రయ్యా… ము__

ద్దెక్కడ పెట్టావురో సయ్య సయ్యా' అనే పాటలో మన హీరోయిన్ చూపించిన చలాకీతనం అద్భుతం. ఆ పాటకి నంది ఎవార్డు తప్పదు" అంటూ హీరోయిన్ని ఓరకంటతో చూసారు మంత్రివర్యులు. హీరోయిన్ కూడా వేళ్లతో జుత్తుని సుతారంగా సవరించుకుని మూతి సున్నాలా చుట్టి 'అర్ధవంతంగా' మంత్రివర్యులకేసి చూడడం జనాల దృష్టి దాటిపోలేదు. దాంతో మళ్లీ యీలలు, కేకలూ.

"మరో మాట. మా ముఖ్యమంత్రిగారు చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాల్ని స్ఫూర్తిగా తీసుకుని, వాటిని హీరోగారు తమ సినిమాల్లో చూపించడం నిజంగా ముదావహమూ. మా పార్టీకి గర్వకారణమూ…

"ఎత్తో ఎత్తో చీపురుకట్టా... అరె...

నెట్టొ చెత్తని ఆవలికంటా' పాటకి హీరో అభినయించిన తీరు సూపర్. ఆ పాటలో హీరోకి పట్టిన 'చెమట' నిజమైనదేననీ, మేకప్‌వాడు  వేసిన "స్ప్రే' కాదనీ, ఇప్పుడే నాకు డైరెక్టరుగారు చెప్పారు. ఇలా చెమటోడ్చి నటించే హీరోలు, భారతదేశంలోనే లేరంటే అతిశయోక్తి కానే కాదు. కేవలం  యీ ఒక్క సీనుకైనా ఆయనకి 'భారత రత్న' వస్తుందనీ, రావాలనీ ఆకాంక్షిస్తూ శలవు తీసుకుంటున్నాను. జై దేవారాం" అంటూ చప్పట్ల మధ్యలో కూర్చున్నారు మంత్రిగారు.

"జై దేవారాం అంటున్నారు. ఆయనెవరూ?" అడిగాడు ఓ విలేఖరి మరో విలేఖరిని.

"దేవారాంగారు యీయనకి రాజకీయ గురువు. ఆయన్ని డొక్కలో పొడిచాకే యీయనకి మంత్రి పదవొచ్చింది. అందుకే పైపైకి గురూగారి నామస్మరణ చేస్తుంటాడు" వివరించాడు సీనియర్ విలేఖరి.

డైరెక్టరుగారు లేచారు. ఈలలూ, చప్పట్లూ, వెర్రికేకలూ…" "సూదిరాయుడుగారు నిండా  మంచివాడు. ఆయన దగ్గరదా మొదట నేను పని చేసితిని. అందుకే ఆయన్నిదా సూటింగ్ దినాన ఫస్టు పాటకి డైరెక్షన్ చెయ్యమంటిని. చిరునవ్వుతో నేను అడిగింది సేసి పూడ్చినాడు. నాడే అనుకుంటిని. గువుగారు స్టార్ట్ అంటే సినిమా సూపర్ హిట్టై పూడుస్తుందని. హీరోగారు బాగా సేసినాడు. హీరోయిన్ నిండా బాగా సేసింది. తెలుగోల్లంటే నాకు బాగా ఇష్టం. నిజానికి  నేనూ తెలుగోడినే. మా తా౦త ది గుండూరు(గుంటూరుకి వచ్చిన దౌర్భాగ్యం) మీరు మల్లీ మల్లీ యీ సినిమా సూసి హండ్రెడ్ డేస్ ఆడించాల" అని అన్నాడు. జనాల చప్పట్లు, అరుపులూ, ఆకాశాన్ని అంటినాయి.

హీరోయిన్ లేచింది. జనాలందరూ ఒక్కసారిగా నిలబడి పిచ్చిపిచ్చిగా వెర్రికేకలు వేశారు. ఈలలతో చెవులు దిమ్మెక్కిపోయాయి.

ఎడమచెయ్యి పెదాలకి తగిలించి  మూతి సున్నాలా చుట్టి "I love you all" అంటూ కుడిచేతిని ఎగరేసింది. అంతటితో ఆగక ఆ చేతినే (left) జనాలవేపుకి చూపిస్తూ  ముద్దెట్టుకోమన్నట్టు సైగ చేసి కన్ను కొట్టింది. జనాలు వెర్రెక్కిపోతే, ఓ మాజీ  హీరోయినూ ప్రస్తుతం తల్లి వేషాలు చేస్తున్నావిడ మాత్రం 'వాంతి' రాబోతున్నట్టుగా మొహం పెట్టింది. మంత్రిగారు మాత్రం మహాహుషారుగా లేచి "నేన్రెడీ" అని ఆవిడ లెఫ్ట్ హేండ్‌ని సుతారంగా ముద్దెట్టుకున్నాడు.

గోలే గోల... యమగోల... వీరగోల...

 

"హీరోగారు ఫుల్ సపోర్టు ఇచ్చారు... వాటైమీన్... డైరెక్టర్గారు కావల్సింది చెప్పటమే కాక ఏం కావాలో అడిగి మరీ చేయించుకున్నారు. ప్రొడ్యూసర్‌గారు 200 కేరెట్ గోల్డు. ఆయన ఇప్పటికిపుడు కాల్‌షీట్స్ అడిగినా నేను రెడీ. నా కాల్‌షీట్స్ చూసే మా అమ్మ కూడా ఆయనకి 'ఫిదా' అయిపోయింది.”

ప్రొడ్యూసర్ మొహం ఆరు బేటరీల టార్చిలైట్లా వెలిగిపోయింది. "ఇంత చిన్న వయసులో డబుల్ రోల్ చెయ్యడానికి భయపడ్డాకానీ, హీరోగారు నా భుజం తట్టి (సిగ్గుపడుతూ) గంటకోసారి 'you can do it baby'  అని కారవాన్‌లోకి తీసికెళ్లి ధైర్యాన్ని నూరిపోయేయడంతో, రెండు కేరెక్టర్స్‌నీ అవలీలగా చెసేశా. ఇంకో సీక్రెట్ చెబుతున్నా మై డియర్ ఫేన్స్. 'ఏస్కో కారా కిళ్ళీ... చేస్కో నన్నే పెళ్ళి' పాటకి స్టెప్పులు కంపోజ్ చేసింది సాక్షాత్తు మన హీరోగారే" హీరోగారి అభిమానులు పేరుకి అందని 'గందరగోళ' నృత్యాన్నీ, 'కంగాళీకలీబలీ' జిబ్రిష్ భాషనీ కలిపి, హాల్‌ని అదరగొట్టారు.

"ఇక మా రైటర్‌గారైతే అర్ధరాత్రిపూట కూడా డైలాగులు ఓపిగ్గా నూరిపోస్తూనే వుండేవారు. సంగీత దర్శకుల గురించి చెప్పనే అక్కర్లా... భూగోళం అదిరిపోతుందనుకోండి."వారివారి వంక చిలిపిగా చూసి ఎడం చేతి ముద్దులు విసురుతూ అంది హీరోయిన్. వాళ్ల్లు కూడా కాస్త వినయంగా, కొంత ఉత్సాహంతోనూ ఆవిడకి రకరకాల విన్యాసాలతో రెస్పాన్స్ ఇచ్చారు.

"చివరిగా... యీ విజయం మీది" మళ్లీ కొన్ని ముద్దుల్ని మురిపెంగా విసిరి మంత్రిగారి పక్కన సెటిలైంది హీరోయిన్.

రచయితగారు లేచారు. "ప్రేక్షక దేవుల్లారా... మీ ఉత్సాహం చూస్తుంటే మరో రెండొందల సినిమాలైనా ఏకబిగిన కథా, డైలాగులు రాసెయ్యగలననిపిస్తోంది. ఆర్నెల్ల పాటు ఆస్ట్రేలియాలో కూర్చుని, అక్కడి పల్లెటూళ్లని అధ్యయనం చేసి, మన 'రాయలసీమ' వాతావరణానికి అన్వయించి రాశాను. డైలాగ్స్ విన్న హీరోగారు అమాంతం నన్నెత్తుకుని "యస్. దిసీజ్ వాట్ ఐ వాంట్' అని అభినందించారు. ఇక హీరోయిన్‌గారయితే .." ఓ క్షణం హీరోయిన్ వంక లుక్కిచ్చాడు రైటర్ సామ్రాట్. ఆవిడ దబాంగ్.. దిబాంగ్ మంటూ మరోసారి లెఫ్ట్ హేండ్ కిస్సుల్ని విసిరింది.

"ఇక మా నిర్మాత అప్పల్నాయుడుగారైతే షూటింగ్ సమయంలోనే 'మీ డైలాగ్స్ రాబోయే తరాలకి భగవద్గీతలాంటి'వని మెచ్చుకున్నారు. ముఖ్యంగా, 'నీ ఎర్రపైట అంచు పట్టి వంచి వంచి దంచి కొట్టనా, లేక ఇసగగుట్ట మీద పెట్టి ఇంచి ఇంచి కొల్లగొట్టనా' అన్న డైలాగుని ఇందాక్కూడా గుర్తు తెచ్చి నా వీపుని మరోసారి తట్టారు. డైలాగ్ రైటర్ దమ్మంతా తెలియాలంటే ఇటువంటి సినిమాలోనే తెలియాలి. ఈ సినిమాని వెయ్యి రోజులు లాగించాలని మిమ్మల్నందరినీ పాదాలు వొంచి తలలో (?)ప్రార్ధిస్తున్నాను" అంటూ తన సీట్లోకి నిష్క్రమించాడు.

పాటల రచయిత మైకందుకున్నాడు. “అయ్యా ఇది నా మొదటి సినిమా. నన్ను పరిచయం చేసిన నిర్మాతగారికీ, దర్శకులు తంగరాజన్‌గారికీ, ఆశీర్వదించిన పెద్దలు సూది రాయుడిగారికీ, అడుగడుగునా అభయమిచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన మన హీరోగారికీ, 'చిన్నవాడివి… బాగా పైకి ఇంకా పైకి రావాలి' అంటూ అనేకసార్లు ఆశీర్వదించిన హీరోయిన్ మదర్‌గారికీ నా ధన్యవాదాలు. నా యీ మొదటి సినిమాలో మొదటిపాట 'దుమ్ము దురేవా, కుమ్ము కురేవా, మస్త్ మరేవా… వారెవా' పాటని 'పిచ్చ'  పాప్యులర్ చేసిన అఖిలాంద్ర , తెలంగాణా, ప్రవాసాంధ్ర ప్రేక్షకులందరికీ కాక ఆటా, తాటా, తీటా, తానా, పీనా, జానా మొదలైన అంతర్జాతీయ తెలుగు సంస్థలన్నింటికీ నా పాదాభివందనాలు. వచ్చే కాలంలో మరిన్ని 'దుమ్ము' రేపే పాటల్ని వ్రాయగలనని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను" అని కూర్చున్నాడు. జనాల్లో పిచ్చ ఉత్సాహం.

ఎదురెదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. హీరోగారు లేచారు. జనాలు మహోద్రేకంగా గంతులూ,  యీలలూ వేస్తూ చప్పట్లు చరిచారు. "మైడియర్ ఫేన్స్..." హీరో అనంగానే జనాల్లో హోరు, "నా పేరు..." మీకే తెలుసన్నట్లు స్మైలిచ్చాడు. మళ్లీ జనాల్లో జోరు. ఆ తరవాత ఆయన మాట్లాడింది యీ 'దీనజీవి'కి ఒక్క ముక్కా వినపడలేదు గానీ, హీరోయిన్ని హీరోగారు దొరకబుచ్చుకుని ఆవిడ్ని అక్కడా ఇక్కడా గిల్లుతూ గిచ్చుతూ సభారంజకం చేయడం మాత్రం కనిపించింది.

ఆ విధంగా "మార్నింగ్ షో" తో విడుదలైన 'వస్తే చస్తావ్' సినిమా విజయోత్సవం మధ్యాహ్నం 'వెపేరీ' ఫంక్షన్ హాల్లో జరిగి ,సాయంత్రం అన్ని చానెల్సులోనూ టెలివైజ్ అయింది.

"అదేమిటీ, విడుదలైంది పొద్దునేగా..." ఆశ్చర్యం ప్రకటించి "మంత్రిగారెప్పుడు చూశాడూ" ప్రశ్నని అంతం చేశాడు సందేహమూర్తి. "ప్రివ్యూ చూసుంటాడులేవోయ్" సందేహం తీర్చాడు మరో చురుకు సుబ్బారావు.

మీడియా వారందరికీ, ఎవరి 'కవర్లు' వారికి ముట్టాయి. "హై… టీ'తో సభ పూర్తయింది.

మర్నాడు పత్రికల్లో ప్రముఖంగా 'వస్తే చస్తావ్' (ఎనీ డౌట్) విశేషాలు ప్రచురించబడ్డాయి.

మూడో రోజున ఒక్క పేపరు 'నిజం' మాత్రం సినిమా రివ్యూని, నిష్పక్షపాతంగా ప్రచురించింది.

" మొన్న విడుదలైన 'వస్తే చస్తావ్' (ఎనీ డౌట్) అనే సినిమా పేరుకి తగ్గట్టే ఉంది. నికృష్టపు కథా, అర్ధం పర్ధం లేని డైలాగులూ, అరవ ఓవర్ యాక్షన్‌తో జనాలు ఫస్ట్ షో ఇంటర్వెల్‌కే బయటికి రావడం మొదలెట్టారు. హీరో హీరోయిన్ల అభినయం 'డో'కొచ్చేంత లెవెల్లో వుంది.  ఇహ కామెడీ ట్రాక్  చూస్తూ ప్రేక్షకులు కళ్లనీళ్ళ పర్యంతమయ్యారు. మేకప్ లేకుండా హీరోయిన్ చేసిన 'తల్లి' పాత్ర సినిమాలో ఎంటర్ కాగానేపిల్లలు  దడుసుకుని, దడుపు జ్వరాలు తెచ్చుకున్నారన్నది నిర్వివాదాంశం. ఇహ పాటల సంగతి. ప్రతీ పాటా ప్రేక్షకుల్ని బాత్‌రూమ్స్ వైపు పరుగులు పెట్టించింది. 'విజయోత్సవ యాత్ర' అంటూ 'వెవేరీ' ఫంక్షన్ హాల్లో చేసిన హడావిడి చూసి సినిమాకి వచ్చిన ప్రేక్షకులు నిరాశలో కూరుకుపోయి డాక్టర్స్ వద్ద ట్రీట్మెంట్ కోసం పడిగాపులు కాస్తున్నారని తెలిసింది. అయితే చీకట్లో మెరుపులాగా మిగిలిన ఆశాకిరణం ఏమంటే "వరస్ట్ ఫిలిం ఆఫ్ ది ఇయర్" అవార్డుకి ఖచ్చితంగా ఎన్నికవుతుందని 'ఇండియన్ ఆస్కార్' కమిటీ వారు బల్లగుద్ది మరీ చెప్పడం" అంటూ రివ్యూ ముగించాడు 'నిజం' పత్రికాధిపతీ, విలేఖరీ, నిజాయితీగల జర్నలిస్టూ శ్రీ పోపుల సత్యనారాయణగారు.

ఆ మర్నాడు  హీరో, నిర్మాత, దర్శకుడు 'కౌంటర్' స్టేట్‌మెంట్ ఇవ్వడమేగాక,  'షో'కి ఓ పట్టుచీర, పదిసార్లు చూసిన (టికెట్ కౌంటర్ ఫాయిల్ పంపినవారికి) గిఫ్టు హేంపరూ' ఇలాంటి రకరకాల బహుమతుల్ని ఎనౌన్స్ చెయ్యడంతో వస్తే చస్తావ్! ( ఎనీ డౌట్) వారం రోజుల పాటు ఆడటమే గాక పెట్టుబడిలో నాలుగోవంతు సంపాయించుకోగలిగింది. రెండోవారం నిర్మాత అదే 'టీం'తో 'రాకపోతే చస్తావ్' (నో డౌట్) అనే సినిమాని ఎనౌన్స్ చేశాడు.

  

జై తెలుగు సినిమా, జై తెలుగు సినిమా

 

(విజయోత్సవాల 'Trend' గురించి వ్రాయడమే తప్ప ఎవరినీ కించపరచాలనో, ఎవరి మనోభావాల్ని దెబ్బ తీయలనో వ్రాసింది కాదని మనవి చేస్తూ )

 

మీ భువనచంద్ర.

Bio

భువనచంద్ర

నూజివీడు దగ్గర గుల్లపూడిలో జన్మించి, 18 సంవత్సరాలకి పైగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేసి, , నాలుగు వార్ మెడల్స్ పొందిన తరువాత భువన చంద్ర పదవీ విరమణ చేశారు.  తరువాత విజయ బాపినీడు గారి “నాకో పెళ్ళాం కావాలి” అనే సినిమాలో 1987 లో పాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేసి, సుమారు వెయ్యి చిత్రాలలో 2500 పైగా పాటలు రచించి విలక్షణమైన కవిగా లబ్ధ ప్రతిష్టులయ్యారు. స్క్రీన్ ప్లే, సంభాషణల రచయిత గానూ, నటుడిగానూ రాణించారు. అనేక పత్రికలలో కథలు, వ్యాసాలూ, ఒక ఆధ్యాత్మిక సీరియల్ మొదలైన ప్రక్రియలలో నిత్య సాహితీ కృషీవలుడిగా, మంచి వ్యక్తిగా పేరున్న భువన చంద్ర గారి నివాసం చెన్నై మహా నగరం.

***

bottom of page