top of page
hasya.JPG
adannamaata.png

సంపుటి  4   సంచిక  1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

బోస్టన్ టీ పార్టీ

KVR Photo copy.jpg

- డా.కే.వి.రమణ రావు

‘వాళ్ళ పెళ్ళికి ఇండియా వెళ్లొచ్చిన వాళ్ళందరిది ఒకటే మాట. అర్పితా మల్లెతీగల, నవీన్ కొండగుడి ఇద్దరూ ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అన్నారు. రూపంలోనే కాదు, అభిరుచుల్లో కూడా అంతగా కలసిపోయారన్నది ‘బే ఏరియా’లో వ్యాపించిన వార్త.  ఆమె బోస్టన్లో ఎమ్మెస్ చేసి ఆ మధ్య అక్కడే ఉద్యోగంలో చేరింది. అతను గ్రాడ్యుయేషన్ నుంచి ‘బే ఏరియా’లోనే చదివి ఇక్కడే నాలుగేళ్లు ఉద్యోగం చేసి ఈమధ్యనే బోస్టన్ వెళ్లిపోయాడు. అర్పిత  పాటలు పాడుతుంది, కవిత్వం రాస్తుంది. నవీన్ కీబోర్డు వాయిస్తాడు, ట్యూన్స్ కడతాడు. ఇద్దరూ ఈ దేశంలో జరిగిన పాటల కార్యక్రమాల్లో విజయవంతంగా పాల్గొని మంచిపేరు తెచ్చుకున్నవాళ్ళే. వాళ్లు ఒకరకంగా యువ ఎన్నారైలలో సెలెబ్రిటీలు. ముఖ్యంగా అర్పితది అబ్బురపరిచే అందం.’

      ఇదీ వినయ్ వాడరేవుల నాకు చెప్పిన సమాచారం. పెళ్ళిలో తను వాళ్లిద్దర్నీ చూశానని, వాళ్లతో స్టేజిమీద చాలాసేపు మాట్లాడానని చెప్పాడు. వినయ్ మా యింటికి నడకదూరంలోనే ఉంటాడు. తరచుగా పార్కులో మార్నింగ్ వాక్ లో కలుస్తూంటాము. మా యింటిదగ్గరుండే ఇండియన్ స్టోరుకొచ్చినప్పుడంతా నన్ను లాక్కెళ్తూంటాడు. మేమప్పుడే ‘బే ఏరియా’లో జెండా నాటి పదేళ్లు దాటింది, కొంచెం సీనియర్లకింద లెక్క.  

      “పెళ్ళికి నువ్వు ఇండియా వెళ్ళావా? వాళ్ళు నీకంత ఫ్రెండ్సా” అని అడిగాను.

      “అంతే అనుకో, పెళ్లప్పడు ఇండియాలోనే ఉన్నా. నవీన్ యిక్కడే కదా ఎప్పట్నుంచో తెలుసు. ఆమెనిదే చూడ్డం, కామన్ ఫ్రెండ్స్ ద్వారా అన్నివిషయాలు తెలుస్తూంటాయి” అన్నాడు.

      “మ్యూజిక్ కార్యక్రమాల్లో పాల్గొనేవారన్నావు లవ్ మ్యారేజీనా”

      “లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పలేను కానీ ఇద్దరిమధ్య కెమిస్ట్రీ కనిపించింది. మరో విషయం తెల్సా ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి కూడా” అన్నాడు నవ్వుతూ

      “అదెలా? నువ్వు చెప్పేది సెల్ఫ్ కాంట్రడిక్టరిగా వుంది” అన్నా

      “నీలాంటి లోకం పట్టించుకోని ప్రొఫెషనల్స్ కి అలాగే అనిపిస్తుంది. ఇద్దరూ లవ్లో పడ్డాక యింట్లోవాళ్లతో చెప్పారు, వొప్పించారు” అని నవ్వి “అది సరే, అసలు విషయం ఏమిటంటే వాళ్ళు రాబోయే ఆదివారం ‘శానోసే’లో ఫస్ట్ యియర్ వెడ్డింగ్ ఆనివెర్సరి పార్టీ యిస్తున్నారు. యిక్కడి ఫ్రెండ్స్ కోసమని యీసారి యిక్కడ పెట్టుకున్నారు. నాకు ఇన్విటేషన్ వచ్చింది. నేను అనుకోకుండా ఆటైములో డాలెస్ వెళ్తున్నాను. నాబదులు నువ్వెళ్ళాలి, తప్పదు. మీఆవిడ ఇండియా వెళ్ళిందికదా, బోనస్ గా వో పూట మంచి తెలుగు విందు భోజనంకూడా” అన్నాడు ఫోల్డర్లోనుంచి ఒక ఇన్విటేషన్ కార్డు, ఒక చిన్న పుస్తకం బయటికి తీసి నాకిస్తూ.

      “నేనెలా వెళ్తాను వాళ్లెవరో నాకు తెలియకుండా” అన్నా ఇన్విటేషన్ చూస్తూ.

      “నేను ఎటెండ్ అవుతానని మెసెజ్ పంపాను, సీటు బుక్కయివుంటుంది. నాబొకే వాళ్ళకి అందాలి కదా, విత్ ఫ్యామిలి అండ్ ఫ్రెండ్స్ అనివుంది చూడు, కాదనకు” అన్నాడు.

      “సరే, తప్పదంటే వెళ్తా” అన్నా. నాకు వాళ్ళిద్దర్నీ, ముఖ్యంగా ఆమె ‘అబ్బురపరిచే అందం’ ఎలావుంటుందో చూడాలనిపిస్తోంది. నేనిప్పటివరకు అలాంటివాళ్లని చూడలేదు.

      ‘పుస్తకమేంటా’ అనిచూశా. అది అర్పిత కవిత్వపు మొదటి సంకలనం. కవిత్వం గురించి నాకు బొత్తిగా తెలియదుగాని కవులంటే గౌరవం ఉంది. రంగుల కవరు పేజీతో పోష్ గా ఉంది. చిన్నవయసులోనే అది రాసిన ఆమెమీద గౌరవం మరింత పెరిగింది.

      “బొకే తక్కువకొస్తుందని మాల్ లో కొనేవు. నన్ననుకుంటారు. మంచి ఎక్స్ క్లూజివ్ షాపులో కష్టమైస్డ్ ది కొను. యెంతైనా నేను రీయింబర్స్ చేస్తా. అన్నట్టు పేరు నాది రాయించాలి మర్చిపోకు” అన్నాడు లేస్తూ.

      వినయ్ ఎప్పుడూ ఇంతే. పాతవి అప్డేట్ చేస్తూనే ప్రతిసారీ ఏదో కొత్తవిషయం పట్టుకొస్తూంటాడు. అతని ప్రపంచం ఎంత పెద్దదా అని ఒక్కోసారి నేనాశ్చర్యపోతూంటాను. మాఆవిడ ‘నందిని పెద్దిపాలెం’కు అతను నచ్చడు, కానీ ఈవిడకు అతని భార్య ‘ఉష జాజికంటి’తో మంచి స్నేహం. ఈ రెండిటికీ సంబంధముందేమో నాకు తెలీదు. వినయ్ ‘ఇంటికి ఇనుము బయటివారికి బంగారం’ అనే అభిప్రాయాన్ని ఉష మా ఆవిడ నందినికి కలగజేసిందని నా అనుమానం.

      "లోకంలోని అందరి విషయాలు యితనికెందుకు, అన్నీ ప్రత్యక్షంగా చూసినట్టు చెబుతాడు. అక్కడి ట్రివియల్ సంప్రదాయాలన్నీ యిక్కడికీ తేవాలా?" అందోసారి నందిని అతనొచ్చి వెళ్లాక.

      "’యితరుల విషయాలు తెలుసుకోవడమనేది వొక అదనపు సమాచారవిలువ. మన స్వంత బాధల్నుంచి కొంతసేపు రిలీఫ్ యిచ్చే టానిక్. దాన్ని కల్పించడం లోకం బాధ్యతల్లో వొకటి’ అంటాడు వినయ్. అతను లోకానికి ప్రతినిధి. ఇండియాలో ఐతే అసలు మీ సర్కిల్స్ లోనే యిలాంటివాళ్లెక్కువ. మీది జెలసీ కూడా కావచ్చు" అని సర్ది చెప్పాను. అప్పుడు నందిని నావైపు అదోరకంగా చూసినట్టు గుర్తు.

      * * *

      అర్పిత, నవీన్ల వెడ్డింగ్ ఆనివెర్సరీ పార్టీకి వచ్చానుగాని నాకు చాలా మొహమాటంగా ఉంది. మొదట్లో రాగూడదనుకున్నా, కానీ ఆ సమయం వచ్చేసరికి ఒక ‘మంచి బొకే’ తీసుకుని బయలుదేరిపోయాను. పరిచయం లేని కొత్తదంపతుల్ని అందులోనూ పెళ్లైన పరస్త్రీని చూడ్డానికి రావడం సబబుకాదేమో అనిపించిందిగాని వినయ్ వాళ్లని సెలెబ్రిటి స్థాయికి పెంచాక ఫరవాలేదనుకున్నా. సెలెబ్రిటీలని చూడాలనుకోవడంలో తప్పులేదని విఙ్ఞులంటారని విన్నా.

      ఆమె తెల్లగా, పొడవుగా, నాజుగ్గా, తీర్చిన కనుబొమ్మలతో నాట్యకారిణిలా బరువైన మెరూన్ రంగు కంచిజరీపట్టుచీరను మోయలేకపోతుందేమో అన్నట్టుంది. అతను నగిషీతోవున్న పొడవైన తెల్లని రాజస్థానీ షేర్వాణితో హ్యాండ్సంగా ఉన్నాడు. ఆమె తెలుగు సంప్రదాయాన్ని, అతను ఉత్తరభారతదేశపు పద్ధతిని ప్రతిబింబిస్తున్నారు. ‘తెరవెనుక వాళ్ల సంగతెట్లున్నా తెరముందు అభినయించేవాళ్లు మాత్రం పొందికైన ఫిజిక్ ని మెయింటేన్ చేయడం అవసరమని’ ఎక్కడో చదివాను.

      రెండు పెద్ద కేకులు కోశాక కొత్త దంపతులు వచ్చినవాళ్లతో మాట్లాడ్డం, ఫోటోలు దిగడం, గిఫ్ట్స్ తీసుకోవడంలోనూ హడావుడిగా ఉండిపోయారు. చాలామందే వచ్చారుగానీ నాకు, వినయ్ కి తెలిసిన కామన్ ఫ్రెండ్స్ పెద్దగాలేరు. దూరంగా ఒక టేబిల్ దగ్గర కూర్చుని చూస్తున్నాను. వాళ్లిద్దరూ అందరితో సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్నా నాకేదో కొద్దిగా తేడా కనపడింది. అది నా భ్రమకూడా కావచ్చనుకున్నా. అతను, ఆమె అంతగా కళ్లు కలిపి మాట్లాడుకోవడం లేదు. అతనికంటే ఆమె చుట్టూ ఎక్కువమంది గుమిగూడుతున్నారు.

      కొంత సద్దుమణిగాక వాళ్లిద్దరేవున్న సమయం చూసి వాళ్లదగ్గరికెళ్లాను. పరిచయం చేసుకుని, వినయ్ గురించి చెప్పి బొకే ఇచ్చేలోపలే ఆమె ఫ్రెండ్సెవరో వస్తే అటువైపు తిరిగి వాళ్లతో కబుర్లలో పడింది. నవీన్ రెండుమూడుసార్లు పిలిచినా ఆమె పట్టించుకోలేదు. బొకేతో నిలబడ్డం నాక్కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అతను ‘నిన్నంతా ప్రయాణమే ఐంది’ అని ఏదో చెప్తున్నాడు. కొద్దిసేపు తరువాత ఆమె నావైపు తిరిగింది. బొకే ఇచ్చాను. నవ్వి థాంక్స్ చెప్పింది. నవీన్ మొహం ఎర్రబడ్డట్టు కనిపించింది. నేనామె పుస్తకం గురించి ప్రస్తావించి పరిస్థితిని కొంచెం మెరుగుపరిచాను. కొత్తవాళ్లందరితో మాట్లాడినట్టే నాతోకూడా మర్యాదపూర్వకంగా మాట్లాడి ‘డిన్నర్ తప్పకుండా చేసి వెళ్లండి’ అన్నారు.

      వాళ్లని దగ్గర్నుంచి చూసినా ఇద్దరూ పూర్తి మేకప్ లో ఉండడంవల్ల వాళ్లు సహజంగా ఎలావుంటారో అంచనా వేయలేకపోయాను. ఆ మేకప్పు, దుస్తుల జిగేల్లో ఆమె వ్యక్తిత్వధోరణి యేమిటో తెలియడంలేదు. ఆమెలో అబ్బురపరిచే అందంకంటే వోవరాల్ మెరుపు ఎక్కువగావుంది. మనుషుల్లో తాము గుర్తించిన మంచిచెడులను ఉన్నదానికంటే కొంచెం ఎక్కువచేసి చెప్పుకోవడంలో జనానిక్కూడా ఆనందమేమో. ఇద్దరూ బాగానే ఉన్నారనిపించింది. ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అన్నమాట మాత్రం నిజమే.

      * * *

      నేను వెడ్డింగ్ రెసెప్షన్ కి వెళ్లొచ్చిన మూడునెల్లగ్గాని వినయ్ తో తీరిగ్గా మాట్లాడ్డానికి కుదర్లేదు. ఆ ఆదివారం పొద్దున మార్నింగ్ వాకయ్యాక యిద్దరం పార్కులో కూర్చున్నాం.

      నేను రెసెప్షన్ లో జరిగింతా వివరంగా చెప్పి "వాళ్లిద్దరి మధ్యా యేవో తేడాలు కనబడ్డా అవి చిన్నవే అనుకుంటాను. వాళ్లిద్దరూ ‘మేడ్ ఫర్ యీచ్ అదర్’ లాగానే వున్నారు" అన్నా.

      "నీకింకా విషయం పూర్తిగా తెలిసినట్టులేదు. అప్పుడు నువ్వు సరిగ్గానే గమనించావు, యిప్పుడు వాళ్లిద్దరిమధ్యా బాగా తేడాలొచ్చాయిట"

      "వాళ్లిద్దరిదీ ప్రేమవివాహమన్నావు, పైగా కెమిస్ట్రి కూడా కలిసిందన్నావు. పెళ్లై గట్టిగా సంవత్సరమేగా అయిందీ"

      “నువ్వలాగే అనుకుంటావు, నీకు సెలెబ్రిటీల విషయం తెలీదు, వాళ్లకి యీగోప్రాబ్లెమ్స్ యెక్కువ. ఆమెకు గాయకురాలిగా యీస్ట్ లో మంచి స్థాయికి చేరుకుంటుందోట. పైగా యేనాటికైనా ఆమె కవితల యింగ్లీషు అనువాదాన్ని న్యూయార్క్ ప్రపంచ కవి సమ్మేళనంలో చదివే అవకాశం వుంటుందని కూడా చెప్పారుట. ఆమెకు అదే లోకమైపోతూందట”

      “కళాకరులెవరైనా అలాంటి వృద్ధినే కోరుకుంటారు, తప్పులేదనుకుంటాను” 

      “నేను కాదన్నానా, కానీ అది వాళ్ల కాపురాన్ని దెబ్బతీస్తున్నమాటకూడా నిజమేకదా. అతను ‘బే ఏరియా’లో మంచి కెరీర్ ని వొదులుకుని ఆమెకోసం అక్కడికి వెళ్లాడు. ఆమాటకొస్తే నవీన్ కూడా కళాకారుడే కదా. యిక్కణ్ణుంచి లేటుగా వెళ్లడంవల్ల అక్కడ మ్యూజిక్ అవకాశాల్లో అతను వెనకబడిపోతున్నాడట. పైగా ఆమెకు సపోర్ట్ గా వుండాలంటే అతను మ్యూజిక్ ని త్యాగం చేసి కెరీర్ మీదే దృష్టి పెట్టాలి. అతని యీ త్యాగాలు ఆమె గుర్తించాలికదా. తనే గొప్పదాన్ననుకుని, ఆమె యింకా భర్తని నిర్లక్ష్యంచేసే కళాకారిణి స్థాయికి చేరలేదని మా అభిప్రాయం”

      “మరి మీరంతా సర్దిచెప్పి సరిదిద్దచ్చుకదా”

      “మా ప్రయత్నాలు మేం మొదలెట్టకుండా యెలావుంటాం. ప్రపంచం చూస్తూ వూరుకుంటుందనుకున్నావా?” నాకు హామీ ఇచ్చి లేచి నిలబడ్డాడు వినయ్. ఇద్దరం ఇళ్లదారి పట్టాము. ఆతరువాత మేం అప్పుడప్పుడూ కలుస్తూనేవున్నాంగాని మా మాటల్లో అర్పిత నవీన్ల ప్రసక్తి రాలేదు.

      * * *

      ఓ నాలుగు నెల్లు గడిచాయి. ఓ ఆదివారం ఉష ఊర్లో లేకపోవడంతో వినయ్ ని డిన్నరుకి పిలిచాం. భోజనాలయ్యాక బాల్కనిలో కుర్చీల్లో కూర్చుని నెలవంక చిరువెన్నెలను చూస్తూ, పసిఫిక్ నుంచొస్తూన్న చల్లగాలిని పీలుస్తూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం. నందిని మామాటలు వినపడే దూరంలో హల్లో సోఫాలో కూర్చుని లాప్ టాప్లో సోమవారంకోసం ఏదో ఆఫీసుపని చూసుకుంటోంది. తను వినయ్ మాటలని కొట్టిపడేసినా ఎప్పుడూ ఓ చెవి అతనివైపు వేసే వుంటుందని నా నమ్మకం.

      “యిది నీ వరకూ వచ్చిందా” అన్నాడు వినయ్ హఠాత్తుగా.

      “నువ్వు యింకా చెప్పకముందే నాకెలా తెలుస్తుంది” అన్నా.

      “అదే, నవిన్ అర్పిత విడిపోవడానికి సిద్దంగా వున్నారుట. ఆమె డైవోర్సుకి దరఖాస్తు కూడా చేయబోతోందని సమాచారం”

      “నిజమా, పెళ్లై రెండేళ్లైనా కాందే. మీరంతా వాళ్ల కాపురాన్ని నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారుగదా యిదెలా జరిగింది”

      “మేమేకాదు, యిరుపైపులా పెద్దవాళ్లు కూడా ప్రయత్నించారని తెలిసింది. వాళ్లు యిక్కడికి రావడము, వీళ్లు యిండియా వెళ్లడమూ అయిందట. అదంతా పెద్దవాళ్లు వీళ్లకి నచ్చజెప్పడానికేనట. ఐనా ఫలితం లేదుట. యిక మా చేతుల్లో యేముంటుంది?”

      “కారణాలేమైనా తెలుసా”

      “పాతవే. యేమైనా న్యూయింగ్లండ్ ప్రాంతం వాతావణమే వేరుట. ఆమెకి పాటలు పాడ్డానికి, కవిసమ్మేళనాలకి అవకాశాలు యింకా రోజురోజుకు సౌత్ కు, మిడ్ యీస్ట్ కు విస్తరిస్తున్నాయట. అంతేగాక యీమధ్య షికాగో లో ఆమెకు సన్మానం కూడా చేశారట. త్వరలో వాళ్లే ఆమె కవితల రెండో సంకలనం తెస్తామన్నారట. అక్కడ యితను కీబోర్డ్ వదిలేసి డ్రాపింగులు, పికప్పులతో సెకండ్ ఫిడేలు వాయించాల్సొస్తోందట. అందుకే యిక లాభంలేదంటున్నారు”

      “అయ్యో” అన్నా, వాళ్లు విడిపోవడం నేనెందుకో జీర్ణించుకోలేక పోతున్నాను.

      “అవేకాదు, యింకా వున్నాయని తెలిసింది. వొకసారి యీగో ప్రాబ్లెమ్స్ వస్తే తర్వాత అవే అంతర్గత తేడాలని పెంచుతాయి. అతను గ్రాడ్యుయేషన్ నుంచి యిక్కడి యూత్ కల్చరు అలవాటైనవాడు, ఆమె బీటెక్ వరకు యిండియాలో సంప్రదాయంగా యింట్లోవుండి చదివింది. ఆమెది రాయలసీమ మిడిల్ క్లాసు, అతనిది వుత్తరాంధ్ర అప్పర్ క్లాసు. యివి చాలవా”

      “యివి నిజంగా వున్నవా లేక మీరనుకుంటున్నారా” అన్నా ఇంకా నమ్మకం కుదరక.  

       “నాల్రోజులాగు నీకే తెలుస్తుంది” అని నవ్వి “వస్తా, పొద్దున పదికే మా టీముమెంబర్సుతో మీటింగుంది” అంటూ లేచి హాల్లోకెళ్లి,  నందిని దగ్గర ఆగి ‘వంటకాలు బావున్నాయని’ మరోసారి మెచ్చుకుని,’గుడ్ నైట్’  చెప్పి వెళ్లిపోయాడు.

      “విన్నావా” అని ఈవిషయం చెప్పబోయా నందినితో.

      “వినబడ్డాయి. అయినా యెవరి వొడిదుడుకులు వాళ్లకుంటాయి. వీళ్లు అంచనావేసి ముద్రవేస్తే దాని ప్రకారం వాళ్లు నడవాలా. వీళ్లేమన్నా సుప్రింకోర్టా? యితని మాటలు సరైన సాక్ష్యం లేకుండా నమ్మడానికి నేను వెర్రిదాన్ని కాదు” అని నా మీద కోపం కూడా తీర్చుకుంది.

      “మనుషులంతా కోరుకుని సంఘాన్ని యేర్పరుచుకున్నప్పుడు మనుషుల బాగోగుల్ని పట్టించుకోడం ఆ సంఘం బాధ్యత కాదా” అంటూ నందినివైపు చూడకుండా బెడ్రూంలోకి నడిచాను.

      * * *

      కొన్నాళ్ల తరువాత నందిని, నేను తన కొల్లీగ్ ఒకావిడ కొడుకు బర్త్ డే ఫంక్షన్ కి వెళ్లాము. ఆలస్యంగా పుట్టడంతో గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. అది వెనకవైపున తోటవున్నపెద్ద కమ్యూనిటి హాలు, చాలామంది అతిథులొచ్చారు. స్టేజికి దగ్గరగా ముందువరసల్లోని సీట్లలో స్థిరపడ్డాము. పిల్లవాడి కేకు కోసే కార్యక్రమంకంటే ముందుగా పాటలు, గ్రూప్ డ్యాన్స్ ఐటెమ్స్ నడిచాయి. అవి అవగానే ఆ పిల్లల తల్లిదండ్రులు వాళ్లతో ఫోటోలు తీయించుకోవడంతో ఇంకా ఆలస్యమైంది. యిక అసలు కార్యక్రమం మొదలతుందనుకున్నాము.

      ఇంతలో ఒక నిర్వాహకుడు స్టేజిమీదికొచ్చి "యిప్పుడు మీకందరికీ వొక సర్ప్రైజ్ గిఫ్ట్. వీళ్లకి దగ్గరి బంధువులైన, మనందరికీ తెలిసిన ప్రముఖ గాయకురాలు, కవయిత్రి శ్రీమతి అర్పితగారు యీ ఫంక్షన్ కి వచ్చివున్నారు. ఆమెని స్టేజిమీదకు వచ్చి వొక పాట పాడాల్సిందిగా అందరి తరఫునా కోరుతున్నాను" అని ప్రకటించాడు.

      అర్పిత లేచి నవ్వుతూ వచ్చి వేదికెక్కి అందరికీ నమస్కరించింది. ఆమె చక్కగా కట్టుకున్న పసుపురంగు ధర్మవరం పట్టుచీర తళతళలాడుతూంది. అప్పటికంటే కొంచెం లావైనా ఆ లావణ్యమేమీ తగ్గలేదు. మొహం మాత్రం కొంచెం అలసినట్టుగా ఉంది.

      నేను ఆశ్చర్యంనుంచి తేరుకునేలోపలే అందరూ చప్పట్లు కొట్టడం ఐపోయింది. నందిని నావైపు తిరిగి "యీ అమ్మాయేగదా" అంది చిన్నగొంతుతో. అవునని తలవూపాను.

      "యిప్పుడు వీరి భర్తగారైన ప్రసిద్ద కీబోర్డు ప్లేయర్ శ్రీ నవీన్ గారిని కూడా స్టేజిమీదకొచ్చి అర్పితగారికి మ్యూజిక్ తో సహకరించవలసిందిగా కోరుతున్నాను" అని మళ్లీ ప్రకటించాడు.

      నవీన్ ఒక చిన్న పోర్టబుల్ కీబోర్డు పట్టుకుని వచ్చాడు, లేత నీలంరంగు లాల్చీ పైజామాలో ఉన్నాడు. కొంచెం వొళ్లు చేశాడు. మళ్లీ చప్పట్లు మ్రోగాయి.

      ఆమె మైకు తీసుకుని ‘తను అంతగా ప్రిపేరై రాలేదని సరిగ్గా పాడలేకపోతే క్షమించమని’ కోరింది. తరువాత గొంతు సవరించుకుని పిల్లల మీద తానే రాసిన ఒక మంచి లలితగీతం పాడింది. అతను లోప్రొఫైల్లో కీబోర్డు వాయించాడు. మధ్యలో నేనొకసారి హాలంతా చూశాను. అందరూ ఆసక్తిగా వాళ్లవైపే చూస్తున్నారు. అయితే నేను విన్నది నిజమే అన్నమాట. ఈవిధంగానైనా వాళ్లమధ్య రాజీ కుదురుతుందని నిర్వాహకులు చివరి ప్రయత్నంగా వాళ్లను స్టేజీ పైకి పిలిచినట్టున్నారు. పైకి బావున్నా ఆ ఒత్తిడి ఆమె మొహంలో కనిపిస్తూంది అనుకున్నా.

      పాటంతా అయ్యి అందరూ వాళ్ల చుట్టూచే రి అభినందిస్తున్నారు.

      "వాళ్లు బాగానే వున్నారుగా" అంది నందిని నన్ను మోచేత్తోపొడిచి.

      "నీకలాగే అర్థమైంది. ఆమె పాటకి, అతని సంగీతానికి యేమన్నా సంబంధం కనిపించిందా” అన్నా.

      "ఆ పాట ట్యూను సెమిక్లాసికల్, కీబోర్డేమో చిన్నది” అని మీకింకా తెలివిరాలేదు అన్నట్టు నావైపు చూసింది నందిని. నాక్కొంచెం నిజమేనేమో అనిపించింది మొదటిసారిగా.

      పాడటం అయిపోయాక వాళ్లు మాముందునుంచి వెళ్తూంటే వాళ్లతో వస్తున్న నందిని స్నేహితురాలొకావిడ ఈమెని పిలిచి అర్పితను పరిచయం చేసింది. వాళ్లు ముగ్గురూ కాస్సేపు మాట్లాడుకున్నారు. దగ్గర్నుంచి చూస్తే తక్కువ మేకప్పులో అమెలో కొంచెం మెరుపు తగ్గినట్టు కనిపించింది, కానీ బుగ్గలొచ్చి నిండుగావుంది. అతనిలో మరే పెద్ద మార్పూ లేదు.

      కేకుకటింగూ అవీ అయ్యాక, చాలా పొద్దుపోయిందని ఒక్కసారిగా అందరూ ఒకవైపు ఏర్పాటు చేసిన బఫే డిన్నరు వైపు వెళ్లి క్యూ కట్టారు. మేం ముందు వరసల్లోంచి బయటపడేలోపల క్యూ చాలా పెద్దదైపోయింది.

      ‘బయట తోట చాలా బావుంది వో సారలా వెళ్లొద్దాం’ అంది నందిని.

      ఇద్దరం బయట తోటలోకెళ్లాం, అక్కడక్కడా లైట్ల వెలుతురు పడనిచోట్ల చీకటిగా ఉంది. అలా నడుస్తూండగా పల్చని చీకట్లో ఒక చెక్కబెంచి మీద ఓ అమ్మాయి అబ్బాయి చేతిలో చెయ్యి వేసుకుని దగ్గరగా కూర్చుని కనపడ్డారు. అమ్మాయి తల అతని భుజంమీద ఆన్చి గోముగా ఏదో చెబుతూంది. అతను నవ్వుతున్నాడు. మేము కనబడగానే వాళ్లు లేచి నిలబడ్డారు, వాళ్ల మొహాల మీద వెలుగుపడింది. చూస్తే అర్పిత, నవీన్. మమ్మల్ని పలకరించారు.

      “తనకి వొంట్లో అంత బావులేదండి, సరిగ్గా పాడటానికిముందే బిరియానీలు అవీ రావడంవల్ల మసాలా వాసనకి తనకి కడుపులో తిప్పింది. యిక్కడ చల్లగాలి బావుందని యిలా వచ్చాం" అన్నాడు నవీన్. 

      అర్పిత సిగ్గుతో తలవంచుకుంది. నందిని ఆమె భుజంచుట్టూ చెయ్యివేసి "యిలాంటప్పుడు మీ పేరెంట్స్ వచ్చేవరకూ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి" అంది నవ్వుతూ.

      అర్పిత నవ్వి “థాంక్సక్కా” అంది.

      “పాట సాహిత్యం బాగా రాశావు. యింకా కొత్తవేమన్నా రాస్తున్నావా" అంది నందిని.

      "అదే చెప్తున్నాను, తనకి ఆ బోస్టన్ వాతావరణం బావుంది. అక్కడే వుందామంటే తను వినడంలేదు. యిక్కడైతే నా కెరీర్ బావుంటుందని యిక్కడికే వచ్చేద్దామని పట్టుబడుతోంది. చాలా మొండిది” అన్నాడతను భార్యవైపు ముద్దుగా చూస్తూ. అర్పిత సిగ్గుగా నవ్వింది.

      "ఆల్ ది బెస్ట్" అంటూ ముందుకు నడిచింది నందిని. నా అఙ్ఞానాన్ని నేనే తెలుసుకున్నానని అనుకుందో ఏమో, ఆ తర్వాత వీళ్ల ప్రసక్తి తీసుకురాలేదు మా ఆవిడ. డిన్నరు ముగించుకుని ఇల్లు చేరేసరికి పన్నెండైంది.

      మరుసటిరోజు ఆదివారం పొద్దున్నే బద్ధకంగావున్నా వినయ్ తో తేల్చుకోవాలని మార్నింగ్ వాక్ కి పార్కుకెళ్లాను. వినయ్ కనపడగానే ఆపి ముందురోజు జరిగిందంతా చెప్పి "నువ్వు చెప్పిందంతా తప్పు, మా ఆవిడ ముందు నేను ఫూలయ్యాను" అన్నా.

      "మా ప్రయత్నాలు ఫలించి వాళ్లిద్దరూ కలిసిపోయారని యెందుకనుకోకూడదు" అన్నాడు కిందపడ్డా తనదే పైచేయంటూ...

      "నాకలా అనిపించడంలేదు, నువ్వు చెప్పిందంతా ‘బోస్టన్ టీ పార్టీ’ లాగుంది" అన్నా .

      "దానికి దీనికీ యేం సంబంధం" అన్నాడు.

      "అందులో టీ వుందిగాని పార్టీ లేదు, యిదీ అంతే, నిప్పులేని పొగ." అన్నా.

      "లోకం అలాగే ఆపరేట్ చేస్తుంది, దాని పద్దతులూ, పరిమితులు దానివి. అన్నిసార్లూ పర్యవసానాలు అనుకున్నట్టు వుండకపోవచ్చు. అంతెందుకూ? మేమడక్కపోయినా అప్పటి వాళ్ల వెడ్డింగ్ ఆనివెర్సరీలో నువ్వే మా ప్రతినిధిగా పనిచేసి కొంత డేటా మాకిచ్చావా లేదా" అన్నాడు నవ్వుతూ.

      నేను అవాక్కయి అతనివంక కళ్లప్పగించి చూస్తూండిపోయాను.  

*****

bottom of page