MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కథా మధురాలు
'బోధ'వృక్షం
ఎమ్వీ రామిరెడ్డి
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా బహుమతి పొందిన కథ
అరగంట గడిచినా ఆ ఇంటి వాతావరణంలో మార్పు కనిపించలేదు శ్రీరామచంద్రమూర్తికి.
రాత్రంతా ప్రయాణించి, పొద్దున్నే ఏడు గంటలకు ఇంట్లో అడుగు పెట్టిన తండ్రిని కూతురు కుశలమైనా అడగలేదు. సోఫాకు అతుక్కుపోయి కూచున్నాడు అల్లుడు. ఇద్దరి మొహాల్లోనూ గడ్డకట్టిన విచారం.
''అనిరుధ్ ఎక్కడ?'' అల్లుణ్ని అడిగారు మూర్తి.
బెడ్‌రూము వైపు వేలు చూపించాడే తప్ప, నోరు మెదపలేదు.
తనను ఉన్న ఫళాన బయల్దేరి రమ్మని ఫోన్‌చేస్తే, ఎక్కడో ఏదో తేడా వచ్చిందనుకున్నాడే తప్ప ఆ పరిణామం ఇంత భయంకరమైన నిశ్శబ్దంగా ఉంటుందని ఊహించలేదు మూర్తి. ఆయన లేచి, వాటర్ ఫిల్టర్ దగ్గరకెళ్లి, నాలుగు గ్లాసుల మంచినీళ్లు తాగారు. గెస్ట్ బెడ్‌రూములోకి నడిచి, చొక్కా విడిచి, మార్బుల్స్ మీద కూచొని యోగా ప్రారంభించారు.
అరగంట తర్వాత స్నానం చేసి, పంచె కట్టుకుని, హాల్లోకి వచ్చారు. దశాబ్దాల తరబడి అది ఆయన దినచర్య.
కూతురు సన్నగా రోదిస్తోంది.
''ఏం జరిగింది?'' అడిగారు మూర్తి.
అతి కష్టం మీద నోరు విప్పాడు అల్లుడు.
++++++++++
ఉదయం పదిన్నర. హైదరాబాదు శివార్లలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల.
కాలేజీ బస్సు దిగిన విద్యార్థినులు గుంపుగా క్లాసులవైపు నడుస్తున్నారు. సెకండియర్ చదువుతున్న అవనిజ ముందువరసలో ఉంది. వారికి ఎదురుగా అల్లంతదూరాన, థర్డ్ ఇయర్ చదువుతున్న అనిరుధ్ ఓ గోడ చాటునుంచి బయటికొచ్చాడు. ప్యాంటు కుడిజేబులోని యాసిడ్ బాటిల్‌ను మరోసారి చేతుల్తో తడుముకున్నాడు.
'నాకు దక్కని అవనిజ ఇంకెవ్వరికీ దక్కకూడదు. నా ప్రేమను తిరస్కరించిన ఆ అందమైన మొహం వికారంగా మారాలి...' తనకు తాను రక్తంలోకి ఉన్మాదాన్ని ఇంజెక్ట్ చేసుకుంటూ, ఒక్కో అడుగూ వేస్తున్నాడు.
అమ్మాయిలు దగ్గరయ్యారు. మిగతా విద్యార్థినుల కన్నా కొంచెం ముందుగా, తల వంచుకుని నడుస్తోంది అవనిజ. అదే అదనుగా భావించి, యాసిడ్ బాటిల్‌ను చేతిలోకి తీసుకున్నాడు అనిరుధ్. బిగుసుకుపోయిన మూతను తీయడంలో కాస్త ఆలస్యమైంది. ఆ కాస్త సమయంలోనే, అవనిజకు వెనగ్గా నడుస్తున్న ఫైనలియర్ విద్యార్థిని మెరుపు వేగంతో కదిలింది. అవనిజను ప్కకు తోసి, తనూ తప్పుకుంది. యాసిడ్ నేల పాలయింది.
అప్పటికే అలర్ట్ అయిన మిగతా విద్యార్థినులు, అనిరుధ్‌ను ఒడుపుగా పట్టుకుని, వెనక్కి తోసేశారు. అల్లంత దూరాన... సరిగ్గా బాటిల్ మీద పడ్డాడు. ఆ వేగానికి ఖాళీ బాటిల్ పైకిలేచి, మళ్లీ అనిరుధ్ మీదే పడింది. అడుగున మిగిలిన రెండు చుక్కలు నుదుటి మీద పడటంతో కేకలు పెడుతూ నేలమీదే పొర్లాడాడు.
అతని బాధను పట్టించుకునే స్థితిలో లేని అమ్మాయిలు కసిదీరా దేహశుద్ధి చేసి, ప్రిన్సిపల్‌కు అప్పగించారు.
భయంతో వణికిపోతున్న అవనిజను పైకిలేపి, ధైర్యం చెప్పి, క్లాసుకు తీసుకువెళ్లారు.
నాలుగు నిమిషాల వ్యవధిలో జరిగిన ఆ హఠాత్పరిణామంతో రోజంతా కళాశాల అట్టుడికిపోయింది.
''పోలీసులొచ్చారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులొచ్చారు. బంధువులొచ్చారు. అమ్మాయిలు సివంగులయ్యారు. వాడి శరీరం రక్తసిక్తమైంది. వాడి ఫ్రెండొకడు ఫోన్జేశాడు. నేనూ వెళ్లాను. ప్రేక్షకుడిలా కళ్లప్పగించి చూట్టం తప్ప, ఇంకేం మాట్లాడగలను? నా గురించి వివరాలు తెలుసుకున్నాక, మధ్యాహ్నానికి పోలీసులు కల్పించుకుని, వాణ్ని ముందు ఆస్పత్రికీ, ఆ తర్వాత స్టేషన్‌కు తరలించారు. అతికష్టం మీద మొన్న సాయంత్రమే బెయిల్ దొరికింది...'' దు:ఖపుజీరను బలవంతంగా తొక్కిపెడుతూ చెప్పాడు అల్లుడు.
మూర్తి శ్రద్ధగా వింటున్నారు.
''అసలు... వాడిలో ఇలాంటి మృగం ఒకటి దాగి ఉందని నేను ఏ కోశానా కనిపెట్టలేకపోయాను మావయ్యగారూ'' ఆక్రోశించాడు అల్లుడు.
కూతురి వెక్కిళ్ల శబ్దం హెచ్చింది.
''ఎవరికి చెప్పుకోవాలి? ఏమని చెప్పుకోవాలి? చిన్నాచితకా తప్పు కాదాయె. ఆఫీసు లేదు. మార్కెట్టు లేదు. ఆరుబయట కాలుపెట్టి అయిదు రోజులు. ఇంట్లో మగ్గిపోతున్నాం. టీవీల్లో, పేపర్లలో చూసిన ఫ్రెండ్స్ ఫోన్లు చేస్తుంటే, ఏం చెప్పాలో తెలియక సతమతమవుతున్నాం...'' తల కొట్టుకున్నాడు అల్లుడు.
''అనిరుధ్‌ను కూర్చోబెట్టి మాట్లాడారా?'' అడిగారు మూర్తి.
''లేదు. ధైర్యం చెయ్యలేకపోతున్నాం. అసలేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఓ సైకియాట్రిస్టుతో మాట్లాడాను. 'రేషనల్ ఎమోటివ్ బిహేవియర్ థెరపీ'తో దారిలోకి తీసుకురావచ్చని అన్నాడు. తీసుకెళ్లాలో లేదో తేల్చుకోలేకపోతున్నాను..''
హఠాత్తుగా ఏడుపు ఆపేసింది కూతురు. పైటకొంగుతో కళ్లు తుడుచుకుంది. ముక్కు చీదింది.
ఒక్కో అక్షరం కూడబలుక్కుంటూ ''చంపేద్దాం నాన్నా... వాణ్ని చంపేద్దాం... వాడిప్పుడు క్రూరజంతువు. ఇంట్లో ఉంచుకోకూడదు. బజాట్లో తిరగనివ్వకూడదు. పదిరోజులు ఏడుస్తాం. నెలరోజులు తలుచుకుంటాం. ఫర్లేదు, చంపేద్దాం'' అంటూ బద్దలైంది.
మూర్తి మాట్లాడలేదు. డెబ్భై ఆరేళ్ల మూర్తి అప్పట్లో పీయూసీ చదివారు. నియమబద్ధమైన జీవితానికి నిర్వచనం ఆయన. బంధువర్గంలో 'ట్రబుల్ షూటర్'గా పేరుంది. ఏ చిన్న సమస్య తలెత్తినా ఆయన ఓ పరిష్కారం కనిపెట్టగలరు. కానీ, జరిగింది దుర్మార్గమని భావించడంతో భార్యాభర్తలు వెంటనే ఆ పెద్దాయన్ని సంప్రదించలేకపోయారు. చివరికి అల్లుడే గుండె దిటవు చేసుకుని మామగారికి ఫోన్‌చేశాడు.
ఆయన కుర్చీలోంచి లేచి, కూతురికి దగ్గరగా వెళ్లి, ఆమె తల నిమిరి ''వెంటనే నాకు కబురు పెట్టి ఉండాల్సిందమ్మా. మించిపోలేదు. ఇప్పుడు వాణ్ని చంపటం పరిష్కారం కాదు. ఏం చేయాలో ఆలోచిద్దాం. ముందు, ఇద్దరూ మొహాలు కడగండి. బయటినుంచి టిఫిన్ తెస్తా. వాణ్ని కూడా లేపండి...'' చెబుతూనే చెప్పులు వేసుకుని బయటికెళ్లిపోయారాయన.
అనిరుధ్, తలెత్తి తాతవంక చూడలేకపోతున్నాడు.
ఆయన పనిగట్టుకుని పలకరిస్తున్నా, తను తల వంచుకుని తప్పించుకుంటున్నాడు.
మరుసటి రోజు... అనిరుధ్‌ను కూచోబెట్టి, ముగ్గురూ మాట్లాడారు. మందలిస్తూనే ధైర్యం చెప్పారు. నైతిక విలువల గురించి వివరించారు. ఇప్పటికైనా అతిగా ఆలోచించడం మానేసి, బుద్ధిగా మెలగమన్నారు. అన్నీ శ్రద్ధగా విన్నాడు అనిరుధ్.
''మా మానాన మేమింతలా మొత్తుకుంటున్నా, నువ్వు నోరు తెరవకపోతే ఎట్లా'' అడిగింది తల్లి.
మెల్లగా నోరు విప్పాడు అనిరుధ్.
''నేను చేసింది తప్పే. నాకేదో అయింది. కానీ... కానీ...''
''ఆ... కానీ... చెప్పు...'' అడిగిందామె.
''నేను... నేను...''
''పర్లేదు నాన్నా, చెప్పు. నీ బాధేమిటో మాకు తెలియాలిగా...''
''నేను... అవనిజను మర్చిపోలేకపోతున్నాను. ఆమె నాకు కావాలి...'' మాట పూర్తికాకముందే అనిరుధ్ చెంప ఛెళ్లుమంది. అల్లుడిలో అంతటి ఆగ్రహాన్ని ఎన్నడూ చూడని మూర్తి అడ్డుతగిలి, మనవణ్ని మరో బెడ్‌రూములోకి పంపేశారు.
భార్యాభర్తలు మళ్లీ శోకతప్తులై మిగిలారు.
నిజానికి మూర్తి ఎప్పుడు ఆ ఇంటికి వచ్చినా, వాళ్లిద్దరినీ కలిపి చూడటం అరుదు. కూతురికి పగలు, అల్లుడికి రాత్రిపూట డ్యూటీలు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. సంయుక్తంగా దొరికే సంధి సమయం అత్యల్పం.
మనవడివైపు పరిశీలనగా చూశారు మూర్తి. ఆ కుర్రాడి మనసేమిటో ఆయనకు తెలియంది కాదు. కాన్వెంటులో చదివే రోజుల్లో తనకేది కొనిపెట్టినా రెండు కావాలనేవాడు. ఒకటి తీసుకెళ్లి వాచ్‌మన్ కొడుక్కి ఇచ్చేవాడు. పదోతరగతిలో ఫ్రెండుకు కాలు విరిగితే, రోజూ అతనింటికెళ్లి, రెండు నెలలపాటు తన సైకిలుపై అతన్ని స్కూలుకు తీసుకెళ్లాడు. ఇంటర్‌లో ఓ అమ్మాయి ఫీజు కట్టలేకపోతే, తన కిడ్డీబ్యాంకులో డబ్బంతా త్యాగంచేసి, ఆ తర్వాతే తల్లిదండ్రులకు చెప్పాడు.
''అనిరుధ్‌ని నేను ఓ వారంపాటు ఊరికి తీసుకెళ్తాను'' వాళ్ల అనుమతి కోసం ఎదురు చూడకుండా అక్కణ్నుంచి కదిలారు మూర్తి.
+++++++++++++
శాఖోపశాఖలుగా విస్తరించిన వేపచెట్టు కింద చాపమీద పద్మాసనం వేసి కూచున్నాడు అనిరుధ్.
''కళ్లు మూసుకో. గాలి పీల్చుకో. నీ బ్రెయిన్‌లో ఉన్న ఆలోచనలన్నీ పక్కకు నెట్టెయ్. ప్రశాంతంగా ఉండు. ఏమీ ఆలోచించవద్దు. కాన్‌సన్‌ట్రేట్...'' మూర్తి మనవడికెదురుగా కూచుని, యోగా నేర్పుతున్నారు.
కృష్ణా జిల్లా చల్లపల్లికి సమీపంలోని ఓ గ్రామమది. నిన్న సాయంత్రమే అక్కడికి చేరుకున్న మూర్తి, తన మనవణ్ని వీలైనంత ఉల్లాసంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
''ఇవాళ, విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. సమాజంలో నైతిక విలువలు పతనమైపోయాయి. రాత్రింబవళ్లూ సంపాదన యావలో పడి, భార్యాభర్తలు కలిసుండటం కూడా మర్చిపోతున్నారు. ఇక పిల్లలకు నీతికథలు చెప్పేదెవరు! పాతతరాల గురించీ, అప్పటి మనుషుల గురించీ, అప్పటి విలువల గురించీ పిల్లలకు వివరిస్తే వారిలో వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది''... ఇలాంటి మాటలు వినడానికి నేటి యువత సిద్ధంగా లేదన్న విషయం మూర్తికి బాగా తెలుసు. అందుకే, ఆయన అలాంటి ఊకదంపుడు ఉపన్యాసాల జోలికి వెళ్లలేదు.
'ఒక్క వారంరోజులు అన్నీ మర్చిపో. నేను చెప్పినట్లు చెయ్యి' సావధానంగా చెబుతూ అనిరుధ్‌ని తన దారికి తెచ్చుకుంటున్నారు.
సాయంత్రం ఏటి వద్దకు తీసుకెళ్లి, ఈత నేర్పించారు.
పొలాల వెంట తిప్పారు. వరికోతలు, నూర్పిళ్లు చూపించారు. ట్రాక్టరు నడపటం నేర్పారు. చెరుకుగడలు విరిచి, తినిపించారు. కంకులు కోసి, కర్రపుల్లతో కొట్టి, లేతజొన్నల రుచి చూపించారు.
''దీని పేరేంటి అమ్మమ్మా?'' ఆరోజు సాయంత్రం ఆమె పెట్టిన స్వీటు తింటూ అడిగాడు అనిరుధ్.
''సజ్జ బూరె. ఎలా ఉంది?'' ప్రేమగా అడిగిందామె.
''ఎక్స్‌లెంట్'' లొట్టలేసుకుంటూ మరోటి తిన్నాడు. అనిరుధ్ తెరిపిన పడ్డాడు.
తన చిన్నప్పుడు సెలవులకూ ఫంక్షన్లకూ కొన్నిసార్లు వచ్చాడుగానీ, ఏసీ లేని ఆ ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండలేకపోయేవాడు. 'కరెంటుకోత, ఉక్కపోత తప్ప ఏముందిక్కడ' అనేవాడు.
+++++++++++++
ఉదయం ఎనిమిదిన్నర అవుతోంది. మూర్తి, అనిరుధ్ ప్రభుత్వ పాఠశాల బయట ఉన్న రావిచెట్టు కింద నిలబడి, బ్యాగులు తగిలించుకుని లోపలికి వెళ్తున్న పువ్వుల్లాంటి పిల్లల్ని గమనిస్తున్నారు. తాతయ్య తననెందుకు అక్కడికి తీసుకొచ్చాడో అనిరుధ్ ఊహకు అందడం లేదు.
అయిదు నిమిషాల తర్వాత ''అలా చూడు అనిరుధ్'' అన్నారు మూర్తి.
అంధుడైన వ్యక్తిని ఓ మహిళ చెయ్యి పట్టుకుని తీసుకువస్తోంది. తమ ముందునుంచే ఆమె అతన్ని స్కూల్లోకి నడిపించుకువెళ్తున్న దృశ్యాన్ని చిత్రంగా చూశాడు అనిరుధ్.
''వాళ్లు భార్యాభర్తలు. ఆమెకు పాతికేళ్లుగా ఇదో దినచర్య. మళ్లీ సాయంత్రం వచ్చి ఇంటికి తీసుకెళ్తుంది. అతను సోషల్ టీచర్. పుట్టుగుడ్డి. కానీ క్లాసులో చరిత్రపాఠం చెబుతుంటే మనం కళ్లప్పగించి వినాల్సిందే. రాజులు, రాజ్యాలు, యుద్ధాలు, అవి జరిగిన కాలాల గురించి అనర్గళంగా చెబుతాడు''.
ఇంకో మూడు నిమిషాల తర్వాత మరో దృశ్యం ఆవిష్కృతమైంది.
పదహారేళ్ల అమ్మాయి పధ్నాలుగేళ్ల అబ్బాయిని భుజాలమీద ఎక్కించుకుని నడిచివస్తోంది. తమకు దగ్గరగా వచ్చి, వాళ్లు స్కూల్లోకి వెళ్తుండగా గమనించాడు అనిరుధ్, ఆ కుర్రాడికి కాళ్లు లేవని.
''తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు. చిన్న గుడిసే వారి ఆస్తి. తమ్ముణ్ని చదివించడం కోసం తను చదువు మానేసి, పొలం పనులకెళుతోంది. ఏళ్ల తరబడి ఆ అమ్మాయి అలుపెరుగకుండా అలా తమ్ముణ్ని భుజాల మీద మోస్తూనే ఉంది''.
మరోరోజు... ఊరిచివరి శ్మశానం... ఓ సమాధి వద్ద మోకాళ్ల మీద కూచున్నారు మూర్తి.
కళ్లు మూసుకుని శ్రద్ధాంజలి ఘటిస్తున్న తాతయ్య ఆంతర్యం అంతుబట్టక, తనూ పక్కనే కూచున్నాడు.
కొద్దిసేపటి తర్వాత ఆయన కళ్లువిప్పి ''అప్పుడు నాకు పంతొమ్మిదేళ్లు...'' అంటూ తన జీవితపు లోతుల్లోకి దిగటం ప్రారంభించారు మూర్తి.
++++++++++++++
పడమటి పొలాన కలుపు తీస్తున్న శ్రీరామచంద్రమూర్తికి, పక్కపొలంలోంచి ఎవరిదో పిలుపు గాలిలో తేలివచ్చినట్లనిపించింది.
చెవులు రిక్కించి ఉన్నాడు. మళ్లీ వినిపించింది. అమ్మాయి గొంతు. లేచి పరిగెత్తాడు అటువైపు.
కుంటలోని బురదలో ఇరుక్కుపోయిన గేదెను బయటకు లాగటానికి తంటాలు పడుతోంది ఓ అమ్మాయి.
మూర్తి దగ్గరగా వెళ్లి, పరిస్థితిని అంచనా వేశాడు. తన పొలంలోకి వెళ్లి, ఓ పెద్దదుంగను తెచ్చాడు.
సూర్యుడు నడినెత్తిమీదకు చేరే సమయానికి మొత్తానికి గేదెను ఒడ్డుకు తీసుకురాగలిగాడు.
అలా పరిచయం మొదలైంది పదిహేడేళ్ల నాగమ్మతో. పక్కపక్క పొలాలు కావడంతో, పనులవేళ చూపుల్తో మాట్లాడుకునేవారు. పరస్పరం పనిముట్లు ఇచ్చిపుచ్చుకునేవారు.
చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో, మూర్తిని మేనమామ చేరదీశాడు. పీయూసీ దాకా చదివించి, తర్వాత తనవెంట పొలం పనులకు తీసుకెళ్లాడు. మెల్లగా పొలం బాధ్యతలన్నీ మూర్తికి బదలాయించాడు.
ఆ ఊరికి నాలుగైదు పర్లాంగుల దూరంలోని దళితవాడలో ఓ చిన్నగుడిసె నాగమ్మ నివాసం. తండ్రి దినసరి కూలీ. చెల్లి, ఇంటినే అంటిపెట్టుకుని ఉంటుంది.
అప్పటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడెనిమిదేళ్లు! భూస్వాముల పెత్తందారీతనం చలామణి అవుతున్న రోజులు.
ఏదో అంటువ్యాధి! చూస్తుండగానే దళితవాడంతా పాకిపోయింది. నాగమ్మ తండ్రి, చెల్లి కూడా ఆ వ్యాధిబారిన పడ్డారు. వాడజనం గ్రామానికి వచ్చి, భూస్వామి శ్రీపతిరాజాను కలిశారు. సాయం చేయమని మొర పెట్టుకున్నారు.
''తెలిసి తెలిసీ ఆ రొంపిలోకి రాటానికి ఏ వైద్యుడు ఒప్పుకొంటాడు? ఓపిక పట్టండి, అదే తగ్గిద్దిలే'' అన్నాడు సమస్యను తేలిగ్గా కొట్టిపారేస్తూ. జనం నిరాశగా వెనుదిరిగారు.
ఆరోజు పొలంలో తొలిసారి మూర్తి ముందు నోరువిప్పింది నాగమ్మ.
''చూస్తంటే కడుపు తరుక్కుపోతంది. మందుల్లేక అల్లాడుతున్నారు...''
''సాయంత్రం చల్లపల్లి జమీందారును కలుద్దాం వస్తావా?'' హఠాత్తుగా ఆ ప్రస్తావన ఎందుకో అర్థం కాలేదు నాగమ్మకు.
''ఆస్థానవైద్యుల్ని పంపమని అడుగుదాం'' చెప్పాడు మూర్తి.
''ప్చ్... లాభం లేదండీ. వాళ్లు మా వాడకు రారు'' దీనంగా చెప్పిందామె.
''ప్రయత్నిద్దాం. పోయేదేముంది...''
ఆరోజు సాయంత్రం నాగమ్మను తన సైకిలుమీద ఎక్కించుకుని చల్లపల్లి తీసుకెళ్లాడు మూర్తి. జమీందారును కలిసి, అంటువ్యాధి గురించి వివరించి, ఆదుకోమని అభ్యర్థించాడు. ఆయన వెంటనే స్పందించారు.
మరుసటిరోజే నలుగురు వైద్యులు దళితవాడకు వచ్చారు. పసరు మందులు అందించారు. రెండురోజులకే గుణం కనిపించింది. వ్యాధితీవ్రత తగ్గుముఖం పట్టింది.
''అందరూ కోలుకుంటున్నారండీ. కాకపోతే, రోజూ కూలికి వెళ్లి పొట్టపోసుకునే వారు... వారం రోజులుగా పనులకు వెళ్లలేకపోవడంతో పొయ్యుల్లో పిల్లుల్లేవడం లేదు'' నాలుగురోజుల తర్వాత చెప్పింది నాగమ్మ.
మూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. అమలు చేసేందుకు నాగమ్మ ఒప్పుకొంది.
ఆ రాత్రి... నడిజాము దాటాక... తమ వరండాలో పేర్చి ఉంచిన వాటిల్లోంచి రెండు వడ్లబస్తాలను గోడమీదగా అవతలికి వేశాడు మూర్తి. అప్పటికే అక్కడ ఎడ్లబండితో సిద్ధంగా ఉంది నాగమ్మ. మూర్తి వచ్చి జత కలవగానే బండి వాడవైపు సాగిపోయింది. మరుసటి రోజు... వడ్లు దంచగా వచ్చిన బియ్యంతో వాడజనమంతా కడుపారా భోంచేశారు.
ఎలా తెలిసిందోగానీ, మూర్తి మేనమామ ఆ విషయాన్ని పసిగట్టాడు. ఒళ్లు వాతలు తేలేలా కొట్టాడు.
''ఏం జరిగింది?'' రెండురోజులపాటు పొలం రాకపోవటంపై మూడోరోజు ప్రశ్నించింది నాగమ్మ.
చెప్పాడు మూర్తి. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది, ''అంతా నా వల్లే కదా'' అంటూ.
మూర్తి ఓదార్చాడు. పక్కనే ఉన్న బంతిపువ్వు కోసి, ఆమె చేతికందించాడు. ఆమె దాన్ని తల్లో తురుముకుంది.
''పెళ్లి చేసుకుందామా'' హఠాత్తుగా మూర్తి అడిగిన ఆ ప్రశ్నకు ఏం జవాబివ్వాలో తోచలేదు నాగమ్మకు.
''సాధ్యమవుతుందనుకుంటున్నారా?'' నవ్వుతూ ప్రశ్నించిందామె.
''అసాధ్యం కాదుగా!''
''చూద్దాం, అదేగానీ జరిగితే నా అంత అదృష్టవంతురాలు మరొకరు ఉండరు'' అంది సంతోషంగా.
కాలంతోపాటు ఇద్దరి నడుమా స్నేహం గాఢమైంది.
మూర్తి ప్రేమ వ్యవహారం మేనమామకు తెలిసి అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. మతిస్థిమితం లేని తన కూతుర్ని కట్టబెట్టాలన్న ఆయన ఆలోచన బెడిసికొట్టినందుకు హతాశుడయ్యాడు.
''ఆ కులం తక్కువదాన్ని చేసుకుంటే, నా ఇంటికి రావద్దు'' హుకుం జారీచేశాడు.
అదేరోజు రాత్రి... మూర్తి, నాగమ్మ పోలేరమ్మ గుడివద్ద కలుసుకున్నారు. అతనిమీద నిఘా ఉంచిన మేనమామ, శ్రీపతిరాజాతో కలిసివెళ్లి వాళ్ల పెళ్లిని అడ్డుకున్నాడు. కేవలం పెళ్లి ఆపడానికి వచ్చిన శ్రీపతిరాజా అక్కడ నాగమ్మ అందాన్ని చూసి కక్కుర్తి పడ్డాడు.
పెడరెక్కలు విరిచి, మూర్తిని చెట్టుకు కట్టేశారు. మూర్తిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మేనమామ మొహాన కాండ్రించి ఉమ్మాడు. అతను ఆగ్రహంతో ఊగిపోయాడు. రాజావైపు చూసి ఏదో సంజ్ఞ చేశాడు.
రాజా వెంట వచ్చిన ఇద్దరు ఆగంతకులు నాగమ్మను బలవంతంగా ఎత్తుకెళ్లి గుర్రపుబగ్గీలో పడేశారు.
రాజా కూడా అందులో ఎక్కగానే, గుర్రం ముందుకు కదిలింది.
మూర్తి డొక్కల్లో కసిదీరా తన్ని, అక్కణ్నుంచి నిష్క్రమించాడు మేనమామ.
తెల్లవారేసరికి... నాగమ్మ ఆత్మహత్య చేసుకుందనీ, ఆమె శవం పొలాల్లో పడి ఉందన్న విషయం చల్లపల్లి పరగణాలో గుప్పుమంది. ఎవరో కనికరించి కట్లు విప్పడంతో, గాయాల్ని లెక్క చెయ్యకుండా సుడిగాలిలా పొలాల్లోకి పరిగెత్తాడు మూర్తి.
ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి, కిరోసిన్ పోసి, శవాన్ని తగలబెట్టారని స్పష్టంగా అర్థమవుతోంది చూసేవారికి.
మూర్తి కంటికీ మంటికీ ధారగా విలపించాడు.
శవం పక్కనే నాగమ్మ తండ్రి నిస్తేజంగా కూచుని ఉన్నాడు.
''ఇదంతా నీ వల్లే... ఛీ, నీ మొహం నాకు చూపించకు...'' మూర్తిని శాపనార్థాలు పెట్టాడాయన.
++++++++++++
''ఆ తర్వాత నేను మా మేనమామ ఇంటినుంచి బయటికొచ్చేసి, ఓ ఇల్లు తీసుకుని, రెక్కల కష్టాన్ని నమ్ముకున్నాను. రెండెకరాలు కౌలుకు తీసుకున్నాను. రాక్షసుడిలా కష్టపడ్డాను. నాగమ్మను మర్చిపోవడానికి పనే లోకంగా బతికాను. ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి పుస్తకాలకు దగ్గరయ్యాను. ఎన్నో చదివాను. అమూల్యమైన విషయాలెన్నో తెలుసుకున్నాను. పేదల హక్కుల కోసం పోరాటాలు చేశాను...''
తాతయ్య మొహంలోకి దీర్ఘంగా చూస్తున్నాడు అనిరుధ్. అతని మనసులో ఆలోచన్ల తుపాను.
''నేను... ప్రేమించిన అమ్మాయిని రక్షించుకోడానికి ప్రాణాలకు తెగించాను. ప్చ్... దక్కించుకోలేకపోయాను. నిరాశలో కూరుకుపోయాను. అయితే, అదే జీవితం కాదన్న విషయం తెలుసుకోగలిగాను కాబట్టే, మళ్లీ నా జీవితం గాడిలో పడింది''.
''మరి... అమ్మమ్మ...!'' సందేహంగా చూశాడు తాతవైపు.
''ఆమె... నాగమ్మ చెల్లెలు'' సమాధి నుంచి దూరం జరుగుతూ చెప్పారు మూర్తిగారు.
తుపాను తీరం చేరింది. అనిరుధ్ కళ్లల్లో కొత్త వెలుగు!
OOO
ఎమ్వీ రామిరెడ్డి
పూర్తి పేరు మువ్వా వెంకటరామిరెడ్డి. పుట్టిందీ, పెరిగిందీ గుంటూరు జిల్లా పెదపరిమిలో. సూర్యాపేటలో 'ఈనాడు' దినపత్రికలో పదేళ్లు సబ్-ఎడిటర్‌గా ఉద్యోగం. పదేళ్ల నుంచి 'రామ్‌కీ ఫౌండేషన్' హెడ్-ఆపరేషన్స్‌గా, హైదరాబాదులో.
‘బిందువు’, ‘మనిషి జాడ’, ‘అజరామరం’ కవితాసంపుటాలు; ‘వెన్నలో లావా’ కథాసంపుటి ప్రచురించారు.
'మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్టు' తరఫున పేదపిల్లల చదువుకు ఆర్థిక సహకారం అందించడంతోపాటు 11 పుస్తకాలు ప్రచురించారు.
***