top of page

సంపుటి 1 సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

ఆహ్వానిత మధురాలు

అబద్ధాయ నమః

ద్వా. నా. శాస్త్రి

"సత్యమేవ జయతే"

"సత్యం వద"

"సూనృతవాక్యము మేలు"

"సత్య హరిశ్చంద్రుడు"

ఈ మాటలకి కాలం చెల్లింది. అసలు వీటి గురించి ఆలోచించటమే బొత్తిగా మానేశాం. ఎవడైనా కొంపదీసి నిజం మాట్లాడితే వాడ్ని పట్టుకొని "సత్తె కాలపు సత్తెయ్య" గా ఏడిపిస్తాం. "నిజం చెప్పాలంటే..." అంటూ కూడా అబద్ధం చెప్పటం నేటి ప్రతిభ. అంతే కాదు - "యధార్థవాదీ బంధు (లోక) విరోధీ" అంటూ (సత్య) ప్రకటన చేస్తున్నాం కూడా. మరి ఇంకా "సత్తెపమానం"గా సత్యం ఎక్కడుందంటారు? సత్యం, సత్యమూర్తి, సత్యానందం, సత్యారావు... వంటి పేర్లు నేతిబీర కాయల వంటివి తప్ప సార్థక నామాలని చెప్తే నమ్మం గదా! న్యాయస్థానాలలో సాక్షులు ప్రమాణం చేస్తూ "అంతా నిజమే చేప్తాను" అన్నప్పుడు మనం కడుపుబ్బేలా నవ్వుకోకుండా ఉండగలమా? అందుకే ముళ్ళపూడి వెంకటరమణ గారు దీనికి దీర్ఘం జోడించి "అంతా నిజమే చెప్తానూ" అని ఉద్ధేశం అన్నారు.

 

హాస్యం అనేది అబద్ధం నుంచే పుడుతుందని ఒక సిద్ధాంతం ఉంది."నేను ప్రజల మనిషిని"

"ప్రజల సేవ చేయటానికే రాజకీయాలలోకి వచ్చాను"

"నా నియోజక వర్గాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుతా"

"విశ్వనగరంగా మారుస్తా"

"రోడ్డుపై గుంత చూపిస్తే వెయ్యి ఇస్తాం"

 

-నాయకుల ఇటువంటి మాటల్ని పట్టించుకోవడం లేదంటే అబద్ధాల్ని గట్టిగా నమ్మటం వల్లనే గదా!ఆడవాళ్ళు అబద్ధం ఆడితే గోడకట్టినట్టు ఉంటుందని ఒక అభిప్రాయం. మగాళ్ళు అబద్ధం ఆడరని కాదు - మగాళ్ళ అబద్ధాలు ఎప్పుడైనా "లీక్" కావచ్చు. ఆడవాళ్ళు అలా కాకుండా "పకడ్బందీ" గా అబద్ధమాడతారని నా వ్యాఖ్యానం. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పకూడదని సత్యం చెప్తున్నాను. ఇంతకీ ఈ నానుడికి నిలువెత్తు ఉదాహరణ వుందా? అని అడిగితే శ్రీనాథుడు రాసిన "కాశీఖండం"లో - "గుణనిథి కథ"లో సోమిదమ్మ పాత్రను పేర్కొనాలి. అబద్ధం చెప్పడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. తను అబద్ధం చెప్తూ..

 

"డబ్బఱలు పల్కువారికడ్డంబు కలదే?"

 

అని అబద్ధం గురించి నిజం చెప్పడం విశేషం. డబ్బఱలు అంటే అబద్ధాలు. అబద్ధాలు చెప్పేవాళ్ళకి అడ్డూ ఆపూ వుంటుందా? అంటే ఇది ఆమె స్వీయానుభవమే!!

 

"వెయ్యి అబద్ధాలాడైనా ఓ పెళ్లి చెయ్యమన్నారు" అనే మాట ఎంత సత్యమో! ఈ మాట వేల సంవత్సరాల నాటిది. అప్పటి నుంచి అబద్ధం తన సత్తా చూపిస్తూ వస్తోంది. అబద్ధం ఆడకపోటే చాలా మంది యువతీయువకులకి పెళ్ళికావడం కష్టాతికష్టం."

 

"మా అమ్మాయిఏడు గంటలకి కానీ లేవదు. పెంకిది. మా మాట వినదు. పంతం ఎక్కువ. వంటరాదు" అని పెళ్ళి చూపులలో నిజాలు చెప్పేవారేరండీ? అప్పటికి 'మమ’ అనిపించుకుంటే చాలు. మా అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ! వాళ్ళతో చిట్ చాట్ చేస్తూ వుంటుంది - అని నిజం చెప్తే పెళ్ళి అవుతుందా? ఎంతటి మాటకారి, పోకులాడి అయినా తలవంచుకొని కూర్చోవటం - సంప్రదాయ బద్ధంగా అలంకరించుకోవటం - అబద్ధాలకి సంకేతం కాదంటారా?

 

ఇక అబ్బాయిల గురించి చెప్తే దాంట్లో అబద్ధాల పాలు ఎక్కువే. వాడెంత "రిఫ్ రాఫ్" గాడైనా, పొగరుమోతు తాగుబోతు అయినా, అలా తల్లిదండ్రులు చెప్తారా? చెప్పండి. వయసు తక్కువ చెప్పటాలూ, జీతాలు ఎక్కువ చెప్పటాలూ షరా మామూలే!

 

అబద్ధాలలో పెద్ద అబద్ధాలు లేదా చిన్న అబద్ధాలు అనేవి కూడా ఉంటాయి. బాస్ ను శెలవు అడగాలన్నా, కాక్ టైల్ పార్టీకి వెళ్ళి ఆలస్యమవడానికి సమాధానం చెప్పాలన్నా, అమెరికాకి విసా కావాలన్నా, అబద్ధమే అతి అనుకూలం. మా ఆవిడకి సడన్ గా బిపి డౌనైపోయి ఆస్పత్రిలో చేరిందనో, మా అత్తగారికి హార్ట్ ఎటాక్ వచ్చిందనో, మామగారికి సీరియస్ గా వుందనో అబద్ధాలు చెప్తేగాని శెలవు మంజూరు గాదన్నది మనకి అనుభవమే. బాస్ అనుగ్రహం పొందాలంటే - "ఏంటి సార్, ఇవాళ కాలేజీ కుర్రాడిలా ఉనారు" లేదా "ఈ డ్రస్ లో అదిరిపోయారు సార్" అనో అబద్ధంగా పొగడటం బాగా అలవాటే గదా! ఇవన్నీ పెద్ద అబద్ధాలు. మరి చిన్న అబద్ధాలంటారా? హైదరాబాద్ వాసులు చెప్పే చిన్న గొప్ప అబద్ధం ఏమిటంటే "ట్రాఫిక్ జాం"లో ఇరుక్కుపోయాను. దీనికింక తిరుగులేదు. "ఏమండీ, టైమైపోతోంది, బయలుదేరారా?" అంటే చెప్పే దివ్యమైన అబద్ధం ఏమిటంటే - "అయిదు నిముషాలలో అక్కడ ఉంటా" అసలు సంగతి ఏమిటంటే అప్పుడే బయలు దేరి ఉంటాడు. మరొక చిన్న అబద్ధం ఏమిటంటే -

"మీ వయసు ఎంతండీ"

"డబ్బయి సంవత్సరాలు"

"అరే అలా కనిపించరే, నలభైలా ఉంటారు"

ఇది అతగాడితో లాభం పొందాలనుకొని ఆడే అబద్ధం!

 

ఇంకొక అబద్ధ రహస్యం ఏమిటంటే - నన్నుతానాకి/ ఆటాకి/ నాటాకి/ఆహ్వానించారు అని తెలుగు వాళ్ళు పేపరు ప్రకటనలు ఇచ్చి ప్రచారం చేసుకుంటారు. నిజానికి వాళ్ళు వీళ్ళని ఆహ్వానించరు. వీళ్ళ ఖర్చులు వీరే పెట్టుకొని బతిమాలుకొని వెళ్తారు. ఇదొక చిదంబర అబద్ధ రహస్యం.

 

అబద్ధాలలో విషాదకరమైన అబద్ధాలూ ఉంటాయండోయ్! విశ్వనాథ శత్యనారాయణ మరణించినప్పుడు సంతాప సభలో ఒక తెలుగు ఉపన్యాసకుడు "ఆయన నాకు బాగా సన్నిహితం. ఒకసారి వారింటికి వెళ్ళినప్పుడు పక్కనే కూర్చొని భోజనం చేశాను. అప్పుడాయన నా విస్తట్లో ఉన్న గోంగూర పచ్చడి తీసుకొని కలుపుకున్నాడు. అంతటి గొప్పవాడు" అన్నాడు. విశ్వనాథ దూరపు బంధువైన నాకు ఇదంతా పచ్చి అబద్ధం అని తెలుసు. అది విశ్వనాథ వారిని కించపరిచేది. ఉన్నప్పుడు పెదవి విరిచేవారు, నొసలు చిట్లించేవారు, అసలు పట్టించుకోనివారు - మరణించగానే "ఆయన మరణం తీరని లోటు" అంటూ చెప్పడం కంటే అపూర్వమైన అబద్ధం ఉంటుందా?

 

మరి అబద్ధం ఆడితే పాపం రాదా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. మహాభారతంలో అశ్వత్థామ ఏనుగు చనిపోయింది - అని కొంచెం అబద్ధమాడితే ధర్మరాజును పొగిడాము తప్ప "అబద్ధాలకోరు" అనలేదు గదా! బద్ధం అంటే కట్టబడినది అని అర్థం. మనం దేనికీ కట్టుబడం గదా? అందుకనే మనమందరం దాదాపుగా అబద్ధ జీవులమే. అబద్ధానికి గల ప్రయోజనం, పేరు, నిజానికి లేదన్నది నేను మరీ ప్రత్యేకంగా చెప్పాలా?మహాభారతంలో కంటే మహాభాగవతంలో అబద్ధపు నైపుణ్యం కనిపిస్తుంది. బలిచక్రవర్తి మూడు అడుగుల భూమిని దానం చేస్తున్న సమయంలో రాక్షస గురువైన శుక్రాచార్యులు "దానం ఇవ్వొద్దు. అతను విష్ణుమూర్తి. నువ్వు నాశనమవుతావు" అని చిలక్కి చెప్పినట్టు చెప్పాడు. బలి చక్రవర్తి "తిరుగన్నేరదు నాదు జిహ్వ" అని బడాయికి వెళ్ళి నాశనమయ్యాడు. అన్న మాట మీద నిలబడితే వాడి గతి అంతేనన్న మాట. అప్పుడు శుక్రనీతిగా ప్రసిద్ధమైన శుక్ర్రాచార్యుల పద్యమిది -

 

"వారిజాక్షులందు-వైవాహికములందు

ప్రాణ, విత్త, మాన, భంగములందు

చకిత గోకులాగ్రజన్మ రక్షణ మందు

బొంకవచ్చు-నఘము పొందదధిప"

(అఘము అంటే పాపం) కాబట్టి అబద్ధం జిందాబాద్! అబద్ధమేవజయతే! అబద్ధో రక్షితరక్షితః! ఇలా జీవిద్దాం!​.

*****

Anchor 1

ద్వా.నా. శాస్త్రి( ద్వాదశి నాగేశ్వర శాస్త్రి) 

ద్వానా శాస్త్రిగా, లబ్ధప్రతిష్టులైన ద్వాదశి నాగేశ్వర శాస్త్రి గారు కృష్ణా జిల్లా లింగాల లో జూన్ 15, 1948 నాడు జన్మించారు. ఆంధ్రా, నాగార్జున & ఉస్మానియా విశ్వవిద్యాలయాలో చదువుకుని డాక్టరేట్ పట్టా అందుకున్నారు. అమలాపురం లో 32 సంవత్సరాలు SKBR కాలేజ్ లో అధ్యాపకుడిగా పనిచేసి, స్వచ్చంద పదవీ విరమణ తీసుకుని సివిల్ సర్వీస్ అధికారులకి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. సాహిత్య సవ్యసాచిగా పేరు పొందిన శాస్త్రి గారు 800 పేజీల తెలుగు సాహిత్య చరిత్ర తో సహా 50 పైగా గ్రంధాలు, వేల కొద్దీ వ్యాసాలూ, రెండు వేల సమీక్షలు రచించడమే కాకుండా ప్రముఖ వక్తగా పేరు పొందారు. సాహిత్య పరమైన అనేక అంశాలపై 12 గంటలు ఏకధాటీగా ప్రసంగించి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు మొదలైన రికార్డుల లో ఎంపిక అయ్యారు. శతాధిక పురస్కార గ్రహీత.

*****

bottom of page