top of page

క్రింది పేజీలు

ప్రస్తుత తాజా సంచికలో

లభ్యమవుతాయి

పుస్త​క పరిచయాలు

మహాదేవివర్మ గీతాలు

సంక్రాంతి సంచిక 2016​

శాయి రాచకొండ

విజయనగరం వెళ్ళినప్పుడు చాగంటి తులసి గారిని కలిసే అవకాశం కలిగించాడు శ్యాం. ఆవిడ నాకు ఇచ్చిన పుస్తకాల్లో ఒకటి 'మహా కవయిత్రి మహాదేవివర్మ గీతాలు'. ఇవి మహాదేవివర్మ గారు హిందీ లో రాసిన కవితలకి తులసి గారు చేసిన అనువాదాలు. తులసి గారు అటు తెలుగు నించి హిందీకి, హిందీ నించి తెలుగులోనికి కూడా ఎన్నో తర్జుమా చేసారు. ఒక భాషలో వ్యక్త పరచిన భావాలు నలుగురూ పంచుకోగలిగి, వివిధ భాషల ప్రజల మధ్య అవగాహన పెంచగలిగే అవకాశం ఈ అనువాద గ్రంధాలు మాత్రమే ఇవ్వగలవు. అలాంటి సదుద్దేశంతో ఆవిడ అలుపులేకుండా చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం.
మహాదేవివర్మ (1907-87) ప్రఖ్యాత హిందీ కవయిత్రి, చిత్ర కారిణి, స్వాతంత్ర్యవేత్త, స్త్రీవాది, విద్యావేత్త.  ఆమెను ఆధునిక మీరాగా చెప్పుకుంటారు.  ఆవిడ సాహిత్య అకాడమి ఫెలోషిప్ (1979), జ్ఞానపీఠ అవార్డు (1982), పద్మ భూషణ్ (1956), పద్మ విభూషణ్ (1988) అవార్డు గ్రహీత.

అనువాద గీతాలతో పాటు మహాదేవివర్మ వేసిన కొన్ని చిత్రాలను కూడా ఈ పుస్తకంలో చేర్చడం ఒక విశేషం. ఇక తులసి గారు చేసిన అనువాదం గురించి ఆమె రచనతో పరిచయమున్న వారికి ఎక్కువగా చెప్పనక్కరలేదేమో! పూర్తి స్వేచ్చానువాదం కాదు. అలా అని ప్రతి పదానువాదం కాదు. మహాదేవివర్మ రాసిన భావం ఏమాత్రం చెదిరిపోకుండా, సున్నితమైన పద ప్రయోగంతో మూల గీతానికి మరింత వన్నె తెచ్చేలా చేసిన అనువాదం ఇది. తులసి గారి అనువాదాల్ని గురించి రాస్తూ బాలశౌరిరెడ్డి గారు అవతారికలో "అనువాదంలో మూల రచయిత అనుభూతులని చక్కగా ఆకలింపు చేసుకొని అదే శైలిలో భావస్ఫోరకంగా వ్యక్తీకరించడం ఒక కళ. ఆ కళలో నిష్ణాతురాలైన డాక్టరు తులసి అనువాదం నిజంగా తెలుగు భారతికి ఒక అలంకారం." అన్నారు. మహాదేవవర్మ గారి కవిత్వపు భావామృతంలో పూర్తిగా మునిగిపోయిన వాడ్రేవు చినవీరభద్రుడు గారు తన మాటగా రాసిన 'కన్నీటితో తుడిచిన వేదన మరక’ లో "మహాదేవివర్మ ముందే చిత్రకారిణి, ద్రష్ట, 'ముత్యపు జలం', 'స్వర్ణ రజం', 'విద్రుమ వర్ణం' మేళవించి తన మనో చిత్రాల్ని గీతాలుగా రూపొందించింది." అంటారు. అది అక్షర సత్యం.

 

ఉదాహరణగా నాలుగు పదాలు...

 

నా నేత్రరసంతో తడిసి,

మృత్తిక మనసారా గర్విత,

సుఖంతో అయాను నేను చంచలం.

దుఃఖంతో అయాను నేను భారం

తెలుసుకుని నడిచాను నేను క్షణక్షణం జీవనం,

నశించడానికి నిర్మించి నడిచాను.

 

"మహాదేవివర్మ గారి సంపూర్ణ సాహిత్యం చదవాలని హిందీ భాష నేర్చేసుకుందామన్నంత ప్రేరణ ఈ నా అనువాదం కలిగిస్తే, నా కృషి ఫలప్రదమైనదని ఆనందిస్తా"నని అన్నారు తులసి గారు. ఈ పుస్తకం చదవడంవల్ల ఖచ్చితంగా నేను చెప్పగలిగిందేమిటంటే, ఇప్పుడు హిందీ నేర్చుకున్నా లేకపోయినా, ముందు ముందు మహాదేవి గారి కవితలకి తులసి గారు చేయబోయే అనువాదాలు మాత్రం తప్పకుండా చదవాలని! ఇంకా ఏదో అనుభవించలేదేమో, ఆ 'చక్షువుల అక్షయనిధుల నేత్రజలం' తేమ నన్ను తాక లేదేమో, 'చెమర్చి చెమర్చి వెలిగే దీప కాంతి ' నా చీకటి గుహలోకి ప్రవేశించలేదేమో, మరొక్క సారి, మరొక్కసారి చదవనీ అని అనిపిస్తూ సాహిత్యంలో అంత పరిజ్ఞానం లేని నా చేతే చదివించిన తులసి గారూ, మీకృషి తప్పక ఫలించిందండీ! పుస్తకంలో హిందీలో గీతాల్ని, తెలుగు అనువాదాలని, పక్క పక్కన ప్రచురించారు. రెండు వైపులా ఎలాంటి సందిగ్ధతా రాకుండా రెండు పక్కలా గీతాలకు క్రమాంకాలున్నాయి. ఈ పుస్తకం 2015 చాసో స్ఫూర్తి ప్రచురణ. కవిత్వాన్ని ఆస్వాదించే రస హృదయులకి ఇదొక అమృత భాండం.​

 

****

bottom of page