MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
'సినీ' మధురాలు
సినీగేయ రచయిత చంద్రబోస్ తో ముఖాముఖి
అమ్మని వర్ణించే గంభీర శైలి ఐనా...
పంచదార బొమ్మని ఆటపట్టించే అల్లరితనమైనా...
అలతి అలతి పదాలలో అల్లుకుపోతాయి ఆ పాళీలో!
చీర నుంచి చాయ్ వరకు ఏ విషయమవనీ...
భాష నుంచి మతం వరకు ఏ అంశమవనీ...
చిన్ని చిన్ని పదాలలో చేరి పాటగా మారుతాయి ఆ బాణీలో...
అద్భుతమయిన సంగీత దర్శకుల స్వరాలలో చేరి రాగాల సొగసులు అద్దుకుని
మన వీనుల వాకిట చేరుతూనే... కూనిరాగాలలో అందంగా కొలువు తీరుతాయి... ఆ పాటలు!
ఆ పాటల మధురిమకు చిరునామా - చక్కని సినీగేయ రచయితగా తెలుగు వారి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న-సినీ గేయ రచయిత శ్రీ చంద్రబోస్. ఈ ప్రారంభ సంచికలో చంద్రబోస్ గారితో ప్రత్యేక ముఖాముఖి - మీ కోసం…!
నమస్కారం చంద్రబోస్ గారు! మొదటగా... సినీ గేయ రచయితగా సుస్థిర స్థానం చేరుకోవడం సామాన్యమైన విషయం కాదు! అలా చేరుకున్న అతి కొద్ది మంది రచయతలలో మీరొకరు... మీకు మధురవాణి తరఫున అభినందనలు!
ఇక, మొదటి ప్రశ్న- ఇదివరకు కవులు సినిమాలలో వేదసారాన్ని చిన్నమాటలతో చెప్పే వారు. సినీ కవికి శాస్త్ర జ్ఞానం అవసరమా?
ధన్యవాదాలండీ! సినీ కవికి శాస్త్ర జ్ఞానం అత్యవసరం. పురాణాలు, ఉపనిషత్తులు, గొప్ప కావ్యాల జ్ఞానం అవసరం, ఎందుకంటే అవే మన సంస్కృతికి పునాదులు. అప్పటి విలువలు, జీవన సరళి సాహిత్యంలో పొందుపరచబడ్డాయి. పునర్జన్మ, స్వర్గం, నరకం, ఇంద్రుడు ఇలా ఎన్నో వాడుక పదాలకి, మన నమ్మే తత్వాల సారం మన జ్ఞాన సంపద.
ఒక కవికీ, సినీ కవి కి తేడా ఎక్కడుంటుంది?! ఒక 'మంచి' సినీ కవిగా మారేందుకు కావలసిన సులక్షణాలేంటి?
కవి తనకి నచ్చినపుడు స్పందిస్తాడు. మానసిక స్థితి, పరిసరాలు, ప్రకృతి, సమాజం ఇలా ఎన్నో ఉత్ప్రేరకాలకు మాత్రమే స్పందిస్తాడు. సినీ కవి నిత్యం స్పందించాలి. ఏ పరిచయం లేకుండా అనుసృజన చెయ్యాలి. ఒక ఊహని సొంతం చేసుకుని దానికి ప్రాణ ప్రతిష్ట చెయ్యాలి.
అంతే కాకుండా… బాణీకి పాట కట్టడం ఒక అసాధ్యమైన ప్రక్రియ. అసాధ్యాన్ని నిజం చేసేవాడు సినీకవి. ఈ ఒక్క విషయం చాలు సినీ కవిని హిమాలయాలపై నిలబెట్టడానికి. అదే రచన బాణీ లేకుండా కూడా నిలబడగలగాలి. కలకాలం నిలబడాలి. ఇన్ని పరిధుల మధ్య అవతరించే సృజన కాబట్టి సినీ కవికి ప్రజలు పట్టం కడతారు.
మిమ్మల్ని సహజకవి అని అంటారు కదా?
మా అమ్మ చదువుకోలేదు, నాన్న చాలా తక్కువగా చదువుకున్నారు. వారికీ అర్థమయ్యేలా పాటలు రాయాలనేది నా గేయాలకి మూలం.
"మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ'' తో పాటి దరిద్ర దేవో భవ అని తక్కువ స్థాయి వారిని కూడా గౌరవించే సంస్కృతి మనది. నా పాటలు సామాన్య ప్రజలకి అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా ఉండాలి, అప్పుడే నా సృజనకి పరిపూర్ణత అని పూర్తిగా నమ్ముతాను, నా రచనలు ఆ తత్వానికి అద్దం పడతాయి.
ప్రజా కవి వేమన తేలికైన పదాలతో, చిన్న పిల్లలకి సైతం అర్థమయ్యే రీతిలో శతకం రాసాడు. అలానే పదకవితా పితామహుడు అన్నమయ్య సొగసైన కీర్తనలు ప్రజాదరణ పొందాయి. వీరు ఈ రోజుకీ మన మధ్యలో ఉన్నారంటే దానికి కారణం వారి సాధారణ సరళత. ఇలాంటి గొప్ప వారు నాకు మార్గ దర్శకులు అందుకే అందరికీ చేరగలిగే సులువైన, సహజమైన పదాలతో పాటలు రాస్తాను. మామూలు పదాలతో రాసినపుడు కొత్తదనం తప్పనిసరి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఇవన్నీ ప్రేక్షకులకు చేరడం వలన నన్ను ‘సహజ కవి’ అంటారనుకుంటాను. అది బిరుదుగా కాకుండా బాధ్యతగా భావిస్తాను.
మాటల రచయిత, పాటల రచయిత ఇద్దరూ చేసేది పదవిన్యాసమే అయినప్పుడు ఒక పాటల రచయిత మాటల రచయితగా ఎందుకు కొత్త అవతారమెత్తట్లేదంటారు? చంద్రబోసు గారిని ఒక మాటల రచయితగా చూసే అవకాశం ఉందంటారా?
నిజానికి, ఇంతకు మునుపు మాటల రచయితగా అవకాశాలు వచ్చినా ఒప్పుకోలేదు. నా లక్ష్యం ఒక్కటే! గేయ రచయితగా ఎన్నో ప్రయోగాలు చెయ్యాలి, మంచి పాటలు రాయాలి, ప్రజలను మెప్పించాలని. కాస్త ఖాళీ సమయం దొరికినా పుస్తకాలు విపరీతంగా చదువుతాను. మనకు తెలిసినది ఇసుక రేణువుతో సమానం, తెలుసుకోవాల్సింది సాగరమంత అని నమ్ముతాను. ఇక, గేయ రచయితగా సంతృప్తీ ఉంది, సంపాదనా ఉంది.
మీరు టీవీ, అమెరికా లైవ్ గా జరిగే మ్యూజిక్ కార్యక్రమాల నిర్ణేతగా కనిపిస్తూ ఉంటారు. తెర వెనుక రచయిత, తెర ఎదుట స్టార్ జడ్జ్, ఇలా రెండు విభిన్న పాత్రలు పోషిస్తూ మన్ననలు అందుకుంటున్నారు కదా!
ఏవయినా ప్రత్యేకమైన అనుభవాలు మాతో పంచుకోగలరా?
అవునండీ! పాటలు రాసేటపుడు సందర్భోచితంగా రాయడానికి తగిన సమయం ఉంటుంది. కానీ... రియాలిటీ షోలకి నిర్ణేతగా వెళ్ళినపుడు అభిప్రాయాలు కూడగట్టుకుందుకు సమయం ఉండదు, ఆశువుగా మన అభిప్రాయం చెప్పాలి. ఎక్కడ బాగా పాడారు, ఎక్కడ లోపాలు ఉన్నాయి అనే విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. విమర్శ కూడా ప్రోత్సహించే విధంగా ఉండాలి తప్ప నొప్పించకూడదు. రియాలిటీ షోలు కత్తి మీద సాము లాంటివి.
ఒకసారి... మెంఫిస్ ఆటా కార్యక్రమానికి నిర్ణేతగా వెళ్ళాను. ఒకావిడ పోటీలో పాల్గొన్నారు, పోటీ ముగిసాక వచ్చి ‘నేను పోటీకి రాలేదు, మీ కోసం వచ్చాను’ అన్నారు. కాస్త ఆశ్చర్యంగా చూస్తుంటే ‘మీరు పెర్ఫార్మెన్స్ విశ్లేషిస్తారు కదా, అది నిజంగా అప్పటికప్పుడు చేస్తారా లేక ముందే రికార్డ్ చేస్తారా లేదా తెలుసుకుందామని వచ్చాను’ అన్నారు. (నవ్వుతూ...) ఇలాంటి కొన్ని తమాషా అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి...!
ఒక లోతైన భావం సినీ గేయాలలో వ్యక్తీకరించాలంటే జీవిత అనుభవం ఎంతవరకు అవసరమంటారు??
ముందుగా చెప్పినట్టు సినీ కవి ఎప్పుడూ చవి చూడని సందర్భానికి రాయగలగాలి, దానికి పుస్తకాలు నాకు ఎంతగానో సహకరించాయి. కేవలం సొంత అనుభవాలు కాకుండా ఇతరుల అనుభవాలు అంతరీకరణ చేసుకోగలగాలి.
ఇలా… సినీ కవులు పాట సందర్భంలో లీనమయ్యి, ఆ సందర్భాన్ని అనుభూతిస్తూ... రాయాల్సి ఉంటుంది కదా. మరి, అస్సలు మీకు ఏ మాత్రం పరిచయం లేని సందర్భానికి పాట రాయటానికి ఎలా సంసిద్ధమవుతారు?! మీరు అలా ఒదిగిపోవటానికి కాస్తంత కష్టపడిన పాటేదయినా ఉందా?!
నాకు ఇష్టమైన, మీరు అడిగిన కోవకి చెందిన పాట సీతయ్య చిత్రానికి రచించిన ‘సమయానికి తగు సేవ’. అంతవరకూ తెలుగు పాటలలో ఇటువంటి ప్రయోగం జరుగలేదు. కీరవాణి గారు ఈ పాట విని ప్రత్యేకంగా అభినందించడం చాలా ఆనందానిచ్చింది.
మీ కోసం పాటలోని కొన్ని వాక్యాలు…
నాకు నువ్వు నీకు నేను అన్న తీపి మాటతో, చెవిలోన గుసగుసలా చిలిపి వలపు పాటతో
శ్రీమతికి జరిగేను సుప్రభాత సేవ
బంగారు నగలమించు బాహు బంధాలతో, చలువ చందనాలు మించు చల్లని నా చూపుతో
అఋధాంగికి జరిగేను అలంకార సేవ
అమ్మలోని బుజ్జగింపు కలిపిన ఈ గువ్వతో, నాన్నలోని ఊరడింపు తెలిసిన ఈ చేతితో
నా పాపకు జరిగేను నైవేద్య సేవ నైవేద్య సేవ
చాలా బాగుందండీ! అవునూ... మీరెన్నో తెలుగు వారికి గుర్తుండే పాటలు రాసారు కదా... సందేశాన్నిచ్చే పాట రాయటం ఎక్కువ ఆనందాన్నిస్తుందా?! లేక, విజయవంతమయిన చిత్రానికి రాయటం ఎక్కువ తృప్తిని ఇస్తుందా?!
(నవ్వుతూ...) విజయవంతమైన సందేశాత్మక పాటలు చాలా రాసాను, ఉదాహరణగా
కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి... ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలీ...
చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలీ...
చిందే వెయ్యాలీ నటరాజు లాగ... నవ్వే చిందాలీ నెలరాజులా...
మనసే ఉండాలీ మహరాజు లాగ... మరిచే పోవాలి రాజూ పేదా తేడాలన్నీ...
అలానే రాబోయే “నాన్నకు ప్రేమతో” చిత్రంలో పాట మిమ్మల్ని అలరిస్తుంది…
వాళ్ళు నిన్ను విసిరేసామని అనుకోనీ వాళ్ళకు తెలీదు నువ్వొక బంతివని
వాళ్ళు నిన్ను నరికేశామని అనుకోనీ, వాళ్ళకు తెలీదు నువ్వొక నీటి ధారవని
వాళ్ళు నిన్ను పాతేశామని అనుకోనీ, వాళ్ళకు తెలీదు నువ్వొక విత్తనమని
విత్తనమల్లే మొలకెత్తు, వరదలాగ నువు ఉప్పొంగు బంతిలాగ పైపైకెగురు… డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇనఫ్”
గంభీర గోదారిలాంటి సాహిత్యానికి, గల గల పారే నయగారాల నాట్యానికి... జత ఎలా కలిసిందో... ఆ వివరాలు కాస్త చెప్పండి?! (సుచిత్ర గారు నృత్యదర్శకురాలు...)
మా పరిచయం చాలా యాదృచ్ఛికంగా జరిగిందండీ… ఒక సారి ఫ్లైట్ లో వెళ్తూ పలకరించుకున్నాము. మామూలుగా మొదలైన మా సంభాషణ కవిత్వం వైపు మళ్ళింది. నృత్య దర్శకురాలికి కవిత్వంపై అభిరుచి ఉందని తెలియగానే మొదట ఆశ్చర్యపడ్డాను. ఒక సందర్భంలో నేను ‘పరదేశి’ అనే చిత్రానికి రాసిన గేయం “పూలకి రంగులెన్ని ఉన్నా నీడ మాత్రం నలుపే. ప్రేమకి హద్దులు ఎన్నున్నా దాని ఫలితం వెలుగే…” ఉదహరించి చక్కగా విశ్లేషించింది, పాటని అంత చక్కగా అర్థం చేసుకున్న వ్యక్తి నన్ను అర్థం చేసుకుంటుందని అనిపించింది.
కుటుంబ సభ్యులందరితో... కలిసి సరదాగా గడపటానికి ఇష్టపడే ప్రదేశమేది?!
ఎక్కువగా చెన్నై వెళ్తూ ఉంటాము.
పాటకి సంగీతం, గళం, సాహిత్యం పట్టుకొమ్మలనుకుంటే... మొదటి రెండింటిని బ్రతికించడానికి, కొత్తతరాన్ని తీర్చిదిద్దటానికి అనేక శిక్షణాలయాలు అందుబాటులొ ఉన్నాయి. మరి కవులు తయారవడానికి ఎలాంటి శిక్షణాలయాలు అవసరమంటారు? అవి ప్రజారంజకంగా నిలదొక్కుకొని, చిత్ర పరిశ్రమతో ఎలా అనుసంధానింపబడాలంటారు?
కవిత్వం నేర్పిస్తే వచ్చేది కాదు, స్వతః సిద్ధంగా ఉండాలి. వాటిని పదును పెట్టుకుందుకు పెద్దల పరిచయం, పుస్తకాలు సహాయపడతాయి కానీ శిక్షణాలయాల ద్వారా సాధ్యపడదు.
తెలుగు సినీ సాహిత్యం ఆదరణ తగ్గడానికి రాగం కాకుండా బీట్ ప్రధానంగా మారడం అంటారు, పాటల పతనానికి సంగీతం కారణం అనవచ్చా?
మీ ప్రశ్న కొంత వరకూ నిజమే, ఒక్కోసారి బీట్ ప్రవాహంలో పదాలు కొట్టుకుపోవచ్చు. నా మటుకు నాకు సాహిత్యాన్ని ఇష్టపడే గొప్ప సంగీత దర్శకులతో పని చేసాను. అది నా అదృష్టంగా భావిస్తాను. కీరవాణి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, ఇలా ఎందరో సంగీత దర్శకులు అందించిన పాటలు వింటే పదాలు స్పష్టంగా వినిపిస్తాయి, సినీ సాహిత్యానికి ఇవి చాలా మంచి రోజులని నేను భావిస్తాను.
మధురవాణి పాఠకుల కోసం ప్రత్యేక ముఖాముఖి ఇచ్చినందుకు ధన్యవాదాలు, చంద్రబోస్ గారూ!
కొత్త సంచిక సందర్భంగా మీ బాణీలో నాలుగు పంక్తులకి తగ్గకుండా పాఠకులకి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి...! ఎక్కువయితే మరీ మంచిదే అనుకోండి!
మూడు వాక్యాల్లో చెబుతానండీ…
“కష్టాన్నే ఇష్టపడు
ఇష్టంగా కష్టపడు
విజయం మీ వెంటపడుతుంది”
ఒక మంచి ప్రయత్నం చేస్తున్న మధురవాణి నిర్వాహక బృందానికి, పాఠకులకి సంక్రాంతి శుభాకాంక్షలు!!
*****