top of page

క్రింది పేజీలు

ప్రస్తుత తాజా సంచికలో

లభ్యమవుతాయి

సంక్రాంతి సంచిక 2016​

నెల్లుట్ల నవీన్ చంద్ర

సీ.పీ. బ్రౌన్, తెలుగు తల్లి ఫ్రౌన్, నిజం డౌన్ (మొదటి భాగం)

డాక్టర్ నెల్లుట్ల నవీన చంద్ర

క్లుప్తముగా

సి.పి. బ్రౌన్ను గూర్చి చాలా అతిశయోక్తులు  వాడుకలో వున్నాయి. తమను తాము గొప్ప సాహిత్యకారులుగా, చరిత్రకారులుగా వర్ణించుకునేవాళ్ళూ, మిత్రులచేత చెప్పించుకునేవాళ్ళూ, ఆ మిత్రులను తాము పొగిడేవాళ్ళూ, ఇతర పదాలలో, పరస్పర ప్రస్తుతిలో పట్టా పొందినవాళ్ళూ, పరస్పర పారితోషిక సంఘంలో గొప్ప పదవులు స్వీకరించినవాళ్ళూ తెలుగు సాహిత్యానికీ, దాని చరిత్రకూ, తెలుగు వాళ్ళకూ చెప్పనలవి కాని అన్యాయం చేసారు. చచ్చిపోయిన తెలుగును తాను ఒంటరిగా 1825-1855 కాలం లో ప్రాణం పోసి నిలబెట్టానని బ్రౌను చెప్పుకున్నాడు. దీనిని నమ్మిన చాలా మంది కవులు, రచయితలూ, చరిత్రకారులూ ఈయనను  ఆకాశానికి ఎత్తేశారు. మహాజ్వాలలా ప్రజ్వలించిన తెలుగు సాహిత్యాన్ని (ఉదాహరణకు కర్ణాటక  సంగీత త్రిమూర్తులలొ ఇద్దరైన శ్యామశాస్త్రి, త్యాగరాజు, మహా పండితుడైన ఛిన్నయ సూరి  తమ అత్యద్భుతమైన  సాహిత్యాన్ని 1762-1861 మధ్య కాలంలో ప్రజలకు అందించి, దక్షిణ భారతమంతా  ప్రఖ్యాతి  చెందినారు) ఒక  మిణుకు, మిణుకు మంటున్న దివ్వెగా వర్ణించిన మహానుభావులూ వున్నారు. బ్రౌను చేసిన సేవలో ఇతరులు ఆవగింజంతైనా చేయలేదని బాకాలు  పట్టిన మహానుభావులూ వున్నారు. బ్రౌను  చేసిందేమిటంటే కొన్ని మంచి రూపంలో వున్న తాళపత్ర గ్రంధాలను సేకరించి కాగితపు ప్రతులు  చేయించి, తాను ఎరువు  తీసుకున్న వాటిని స్వంత దారులకు తిరిగి ఇచ్చేశాడు. రాజ రాజ చోళుడు చిదంబరం గుడిలో శిథిలమౌతున్న శివ కీర్తనలను తెలివిగా తలుపులు తీయించి రక్షించాడు- ఇదీ ప్రాణం పోయడమంటే. బ్రౌను ఇది చేయలేదు. రాజ రాజ నరేంద్రుడు  తెలుగులో ఆదికావ్యాన్ని నన్నయగారిచేత రచింపజేసి, శ్రీకృష్ణదేవరాయలు  తాను రచించి, ఇతరులను మహాకావ్యాలు  రచించుటకు  ప్రోత్సాహమిచ్చి బ్రౌను కంటే మహత్తర సేవ తెలుగుకు చేసారు. ఈ సంగతులను ఈ వ్యాసంలో, ఇకముందు వచ్చే మరి రెండు వ్యాసాలలో  విశదీకరించడం జరిగింది.  

 

కట్టు కథలు

ఆరుద్ర "సమగ్ర ఆంధ్ర సాహిత్యం, V. 10 ,P. 136" : "అది ఇవాళ అతిశయోక్తి అనిపించవచ్చు. అసత్యంలాగా కనపడవచ్చు. అయితే తెలుగు సాహిత్యం విషయంలో ఒకానొక దొర గారు చెప్పిన మాట వాస్తవానికి విరుధ్ధంకాదు. ఒంటిచేతి మీదుగా ఏ సాహిత్యానికైనా మళ్ళీ ప్రాణం పోయడం,అందులోనూ ఒక విదేశీయుడు ఆ పని చేయడం నిండా దుష్కరమైన కార్యం. 1825 లో తెలుగు సాహిత్యం చచ్చి పడి ఉంది.ముప్ఫై సంవత్సరాలలో నేను దానిని బతికించి నిలబెట్టాను." ఈ మాటలన్నది చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ దొరగారు".

బండి గోపాల రెడ్డి: “ప్రపంచంలోని అందరు తెలుగు అధ్యాపకులూ, అన్ని అకడెమీలూ, అన్ని ప్రభుత్వాల  పరిశోధకులూ కలిసి చెసిన తెలుగు భాషా సేవ, ఒక్క సీ. పీ. బ్రౌన్ చెసిన దానిలో ఆవ గింజంతైనా వుండదు.“

జనమద్ది హనుమచ్చాస్త్రి (వేప చేదు ఫౌండేషను): “మినుకు మినుకు మంటున్న తెలుగు  వాజ్మయదీపాన్ని స్నేహసిక్తం  చేసి  ప్రజ్వలింపచేసిన  ఆంధ్రభాషోధ్ధారకుడు  C. P. బ్రౌన్.”

బ్రౌణోచ్చిష్టం జగత్సర్వం - నిడదవోలు సుందరేశ్వర రావు. (సమగ్ర V.9, P. 232) అయ్యో బాణుడా నీకెంత దుర్గతి పట్టెను?

(కొత్తపల్లి వీరభద్ర రావు ఇంకా ఇతరులూ, and a You-Tube Clip.)

దీని అర్థం?11

ఆరుద్ర గారి ఈ ప్రకటనలో రెండు కీలక అంశాలు వున్నాయి.

1) ఒంటిచేతి మీదుగా 2) 1825 లో తెలుగు సాహిత్యం చచ్చిపడి ఉంది.

     1825 లో బ్రౌన్ జీవితంలో యాదృచ్ఛికంగా మూడు ఉదంతాలు జరిగాయి.

  1. రావిపాటి గురుమూర్తి శాస్త్రి, పఠ్యం అద్వైత శాస్త్రి, ములుపాకు బుచ్చయ్య శాస్త్రి అధ్వర్యంలో, అండదండలతో "The Prosody of the Telugu and Sanskrit Languages Explained” అనే పుస్తకాన్నిపూర్తిచేసి, 1825, డిసెంబరు13 నాడు బ్రౌన్ కాలెజీ బోర్డు వారికి సమర్పించాడు.  (అదే ఆరుద్ర పుస్తకంలో పేజీ 158). ఈ ముగ్గురు పండితులనూ ప్రశంసించినాడు బ్రౌన్. (అదే ఆరుద్ర పుస్తకంలో పేజీ 158)

  2. 1824 మార్చి 5 నాడు మొదలు పెట్టిన వేమన సాహిత్యం అనువాదం, 1825 ఏప్రిలు 25 నాడు సిద్ధమైనది (పేజీ 156). దీంట్లో తోడుపడిన వారి సంఖ్య ఎవరికీ తెలువదు. ముఖ్యముగా తిప్పాభట్ల వెంకట శివశాస్త్రి, పఠ్యం అద్వైత బ్రహ్మ శాస్త్రి, వారి సోదరులు సీతారామ శాస్త్రి (18 ఏళ్ళ యువకుడు), చినతమ్ముడు రామలింగ శాస్త్రి.(పేజి 152). ఈ విషయంలో చాలా కృషి చేసి వుంటారనడంలో ఏ మాత్రమూ సందేహం లేదు అని బ్రౌన్ భక్తులు ఒప్పుకోక తప్పదు. అంతేగాక  బ్రహ్మ శాస్త్రి గారు బ్రౌనుని భారతం చదవమని అర్థించారు.

  3. A.D. Campbell 1821 లో ఒక Telugu- English Dictionary అచ్చు వేశారు. మామిడి వెంకయ్య గారు కూడా ఒక తెలుగు డిక్షనరీ ప్రకటించి ఉండిరి, కాపీరైటుతో సహా. ఈ రెండు నిఘంటువుల కాపీలను బ్రౌన్ చేయించాడు అని ఆరుద్ర గారే అన్నారు. సుమారు ఇరవైమంది పండితుల సహాయంతో 1825 లో బ్రౌన్ తన డిక్షనరీ మొదలు పెట్టాడు.  

 

మామిడి  వెంకయ్యగారి  కథ చాలా ఆసక్తికరంగా, దారుణముగా, జాలిపుట్టేటట్లు  వుంటుంది. ఆయన  వ్రాసిన నిఘంటువును ప్రభుత్వము వారు వేయి వరహాలకు కొన్నారు కాని దానిని  ప్రచురించలేదు (సమగ్ర, P.9, పెజి.233-234). ఆ పుస్తకాన్ని కాంప్బెల్లుకు ఇచ్చి తిరిగి వ్రాయించి, ఈయన పేరుతో  ప్రచురించారు. కాంప్బెల్లు పేరుపై ప్రచురించబడ్డ వెంకయ్యగారి నిఘంటువు లో వెంకయ్యగారిని ప్రశంసించడం పోనిచ్చి, ఆయనకు  ధన్యవాదాలు కూడ చెప్పలేదు ఇంగ్లీషువాళ్ళు. ఇంగ్లీషువాళ్ళ పక్షపాతము, జాతితత్వమూ దీంట్లో స్పష్టముగా కొట్టొచ్చినట్లు కనపడుతున్నది కదా!  భ్రౌన్ వద్ద కాంప్బెల్లు 1821 లో వ్రాసిన ప్రతియున్నూ, వెంకయ్యగారి ప్రతియున్నూ, కాంప్బెల్లు తిరిగి రాసిన వెంకయ్యగారి ప్రతియున్నూ మూడు ముందు పెట్టుకుని తన నిఘంటువు రాసాడు. అంతేకాదు బ్రౌన్ వెంకయ్యగారి  నుండి కాపీ కూడ కొట్టివుంటాడా? బ్రౌను ప్రభుత్వము పై వెంకయ్యగారి ప్రతిని కొనమనీ, ప్రచురించవద్దనీ, కాంప్బెల్లుతో తిరిగి వ్రాయించమనీ ఒత్తిడి కూడా పెట్టివుంటాడా? ఎందుకంటే తెలుగు నిఘంటువు వ్రాసిన ఘనత తనకే దక్కాలని చాలా ఏళ్ళ నుండి కలలు గన్నవాడాయెను. వేరేవారికి ముఖ్యముగా తెలుగు వాడికి పోనిస్తాడా ఆ కీర్తి? బ్రౌను ఎంత కుట్రదారుడో  దీని వల్ల తేటతెల్లము ఔతున్నది.

ఇంతమంది తెలుగు వాళ్ళ సహాయము తీసుకున్న బ్రౌను తాను ఒంటరిగా చేసానని  చెప్పుకోడానికి  సంకోచించకపోయినా, తెలుగు చరిత్రకారులు, పండితులు, సాహితీవేత్తలు ఈ అబధ్ధాన్ని నమ్మడమేకాక, దానికి మంచి ప్రచారము, ఆధారమూ ఇచ్చారు. వీళ్ళ అమాయకత్వమా, ఆలోచనావిరహితమా మీరే నిర్ణయించండి. దీంట్లో ఒంటరితనాన్ని గమనించింది ఆరుద్రగారు, బంగొరేగారు, తదితర భక్తులు.  మీకు  కనిపిస్తున్నదా ఒంటరితనం? ఇది అతిశయోక్తియో, అసత్యమో నిర్ణయించండి. ఈ మూడింటి విషయము లోనేకాదు, మిగతా పుస్తకాల ప్రసక్తి వచ్చినప్పుడల్లా బ్రౌన్ ఒక్కడే వీటిని అచ్చువేయించాడని ధ్వనించేటట్లు వ్రాయడమూ, మాట్లాడడమూ అలవాటు చేసుకున్నారు కొందరు. 

 

మొదటి వ్యాకరణము రాసాడనీ, మొదటి నిఘంటువు ఆవిష్కరించాడనీ, వేమనను ఉద్ధరించాడనీ వెర్రి  బ్రాహ్మలు ఈయనను ఆకాశానికి ఎత్తివేసి వుంటారు. లేక బ్రౌను స్వయముగా ఊహించుకుని  పై అధికారులకూ తనే స్వయముగా చెప్పి వుండి వుంటాడు. వాళ్ళూ ఈయనను పొగిడి వుంటారు. దీనితో ఆయన మన్సులో తాను చచ్చిపోతున్న తెలుగు భాషను 30 యేళ్ళలో సజీవం చేసానని భ్రమ కలిగి తనను తాను కీర్తించుకుని వుంటాడు.

 

తెలుగులో లాక్షణికులలో (సుమారు 35) మొదటి వాడు “కవిజనాశ్రయం” రాసిన మల్లియ రేచన (940 సీ.ఈ . సమగ్ర V 1, P.132). బహుశా ఇది మొదటి తెలుగు పుస్తకం అయి వుండవచ్చు. ( దేవరపల్లి వెంకట కృష్ణారెడ్డి, భారతి, అక్తోబరు 1959, సమగ్ర  V. 1, P 135). తర్వాతి వాడు“ఆంధ్ర శబ్ద చింతామణి” రాసిన ఆదికవి  నన్నయ (1040?).  చివరివాడు “ఆనందరంగరాట్ఛందం” (1740-1750)  రాసిన కస్తూరి రంగయ్య (సమగ్ర  V1 P123). ఈ లిస్టులో బ్రౌన్ లేడు.

 

Bernard S Cohn యొక్క "Colonialization and its forms of Knowledge, The British in India," అనే పుస్తకాన్ని Princeton University Press 1996 లో ప్రచురించారు. బ్రౌన్ గూర్చి ఈ పుస్తకములో నాలుగు సార్లు చెప్పబడింది. తెలుగు పండితులకు తమకు బ్రౌన్ కన్నా అధిక పాండిత్యమూ, విజ్ఞానమూ వున్నవని తెలుసు. తమను పనిముట్టుగా వాడుకుంటున్నారనీ తెలుసు(Cohn, P 51). తనను ఈ ఛాందసపు పండితులు అంతా భట్టీ వేయమంటున్నారని బ్రౌన్‌కు కోపంగా వుండేది. కాని తాను బైబుల్నూ, మిల్టన్నూ, షేక్స్పియర్నూ కంఠతా వల్లించగలనని వాళ్ళతో సగర్వంగా చెప్పుకునేవాడు.ఇంగ్లీషు విద్యా సంస్థల్లోనూ భట్టీ వేయడం మామూలుగా జరిగేది (Cohn, P51). ఇంగ్లీషు వాళ్ళకి భారతదేశాన్ని వస్త్వీకరించడము ప్రధమ ధ్యేయము. దేశాన్ని క్రోడీకరిస్తే పరిపాలన సులభము ఒవుతుంది. బైబిలు అనువాదాలు మతప్రచారానికి తోడుపడ్డాయి. నిఘంటువులు దేశస్థులతో వ్యవహారాలు చేయడములో ఉపయోగపడ్డాయి (Cohn, P xv). సీ.పీ. బ్రౌన్ 40 ఏళ్ళు తెలుగుభాష కోసం కృషి చేసినవాడు. బ్రాహ్మలు నౌకా భంగం చేసారని పితూరీలు చెప్పాడు. కనపడని, అందుకోరాని ఆశయాలకు అర్రులు చాస్తారనీ, రోజూ వినియోగపడే వాటిని వారు నిర్లక్ష్యం చేస్తారని విమర్శించాడు (Cohn, P51). This scoundrel Brahmin లాంటి ప్రయోగాలు Brown చేశాడని ఆరుద్రగారు రాసారు (సమగ్ర V. 9, P.217).

 

1600-1861 మధ్య కాలములో తెలుగు సాహిత్యం   

తెలుగు  సాహిత్యం 1825లో చచ్చిపడి వున్నదా అనే రెండవ అంశం ముందు ముందు చూద్దాం.

తనకు  అత్యంత ప్రేమ పాత్రుడైన  వేమన కవీశ్వరుని జీవితకాలము 1652-1725 అని బ్రౌను నిర్ధారించాడు (ఆరుద్ర, V8,P.56). బ్రౌన్ తెలుగు సాహిత్యం 1825 లో చచ్చి ఉన్నదని చెప్పాడు. అంటే తెలుగు సాహిత్యపు చావు 1725-1825 మధ్య ఎన్నడో జరిగి వుంటుంది. ఈ చావుకు చరిత్ర ఆధారాలేవైనా వున్నాయా పరిశీలించి చూద్దాము.

బ్రౌన్నూ, ఆతని ప్రాపర శిష్యుడు ఆరుద్రనూ, వాళ్ళ అభిప్రాయలను పాటిస్తే 1725-1825 కాలం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ఎడారి వంటిదనిన్నీ, అప్పుడు ఏ కావ్యాలూ, కథలూ, వ్యాసాలూ రాయబడలేదనిన్నీ, ఏ ఇతర సాహిత్య ప్రక్రియ పుట్టలేదనిన్నీ,  ఒప్పుకోవాల్సి వస్తుంది.

ముద్దుపళని (1850 +, సుమారుగా 1867) వ్రాసిన రాధికా సాంత్వనమును మనం అరుద్ర గారి సమగ్ర ఆంధ్ర సాహిత్యం (V.8, P. 63)లో నివురుగప్పిన నిప్పుగా కలుసుకుంటాం.ముద్దుపళని గారి అద్భుతమైన  శ్రంగార మహాకావ్యము రాధికా సాంత్వనము తెలుగుదేశం లోనే కాదు, బయట కూడా చాలామంది ఎరుగరు. దానికి కారణం ప్రబుద్ధులైన, విక్టొరీయా రాణి  నీతులలో నిష్ణాతులైన తెలుగు సాహిత్యకారులు, తమ ప్రాచీన చరిత్రనూ, సంప్రదాయాన్నీ మర్చిపోయి,  ఆ పుస్తకాన్ని ప్రభుత్వము చేత నిషేధింపబడనీయడమేకాక, దొరికిన ప్రతులను నిర్మూలింపజేయడానికి కారకులైనారు. తెలుగు చరిత్ర నింగిలో ధ్రువతారగా   వెలుగుతున్న మహానుభావుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు తాము మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అత్యంత దీక్షతో ఈ నిషేధాన్ని తొలగించి  తెలుగు సాహిత్యానికి గొప్ప సేవ చేయడమే  కాక, భవిష్యత్తు సాహితీ కారుల కృతజ్ఞతలకు పాత్రులవడమేకాక, తమ కీర్తి ఇంకా ఆచంద్రార్కముగా వృద్ధి కావడానికి దోహదం చేసుకున్నారు. ఈ బృహద్గ్రంధాన్ని మసి నుండి తీసిన మాణిక్యములా, 1990 లో ప్రచురింపబడ్డ "Women writing in India – 600 BC to Present Day“ అనే గొప్ప సంకలనంలో పెట్టిన ఘనత మహిళామణులిద్దరు, సుసీ థరు మరియు కె.లలిత గార్లకుకు చెందుతున్నది. దీని భావమేమిటంటే, తెలుగు చచ్చిపోయిన కాలం 1763-1825 అని నిర్ణయించబడ్డది.

నిజం చెప్పాలంటే ఆరుద్ర ఈ కాలం నాటి ఇంకా 40 కవులను (కూచిమంచి తిమ్మయ్య P.182, సముఖం వెంకట క్రిష్నప్ప P.88,  ఇంకా ఇతరులు) గూర్చి పొగిడాడు. ఇవి చచ్చిపోయిన భాష గురుతులా?

గద్వాల సంస్థానపు రాజులు 1762-1907 తెలుగు సాహిత్యానికి అజరామరమైన సేవ చేసారనీ, కవులనూ, సాహిత్య  సమావేశాలను ఆధునిక యుగం వరకూ ప్రోత్సహించారనీ (సమగ్ర, V.10, P.74) తెలుస్తున్నది.

రాజా చిన్న సోమభూపాలుడు1762---1793

రాజా చిన్న రామ భూపాలుడు1794-1806

రాజా సీతారామ భూపాలుడు1808--1840

రాణీ లింగమ్మ1840--1844

రాజా మూడవ సోమభూపాలుడు(1840--1844)

రాణీ వెంకట లక్షమమ్మ1844-1875

రాజా రాంభూపాలుడు1876 - 1906

రాయబడ్డ కృతులు గొప్ప గుణం కలిగినవనీ, ముఖ్యముగా ఆరుగురు కవులు వ్రాసిన రామాయణం చాలా ఉత్తతమమైన దనీ ఆరుద్ర రాసాడు (సమగ్ర V.10, P.75).

కాణాదం పెద్దన సోమయజి - బాలకాండ

కొత్తపల్లి రామానుజాచార్యులు - అయోధ్యకాండ 

గార్గేయపురం సుబ్బశాస్త్రి  - ఆరణ్యకాండ

కామసముద్రం ఆప్పలాచార్యులు - అవతారిక మరియు కిష్కింధాకాండ

తిరుమల కిష్నమాచార్యులు - సుందరకాండ

బోరవెల్లి శేషయ్య - యుద్ధకాండ

 

ఇవి  చచ్చిపోయిన భాషకు  చిహ్నాలా?

ఇంకా తెలుగు దేశం లోని అనేక ప్రాంతాలలో (ఉదాహరణకు బొబ్బిలి) కవులు వర్ధిల్లారు. వరంగల్లులో, నిజామాబాదులో, నల్లగొండ, కరీంనగరు ప్రాంతాలలో, కవులు అనేకులు వున్నారని తెలుస్తున్నది.

ఇవి చచ్చిపోయిన భాషకు చిహ్నాలా?

అన్నిటికన్నా ముఖ్యముగా 1600-1861 కాలములో ఈ క్రింద ఇవ్వబడిన కవులు తెలుగు సాహిత్య ఆకాశంలో తారలుగా వెలుగుతూనే వుంటారు, బ్రౌన్ మరియు అతని భక్తులు ఒప్పుకొన్నా, ఒప్పుకోకున్నా గూడా, అనుటలో సందేహమేమీలేదు. తెలుగు సాహిత్యము ఒక ఎడతెగని మహానదిలా  ప్రవహిస్తూంటే, ఆ పవిత్రఘోషను వినడానికి నోచుకోలేని చెవిటివాడా బ్రౌన్?

1600-1680 క్షేత్రయ్య   
1684-1712 శహాజి I  
1750+ ముద్దుపళని    
1730 సముఖము వెంకట క్రిష్ణప్ప నాయక    
1762-1827 శ్యామశాస్త్రి   
1767-1847 త్యాగరాజస్వామి  
1807-1861 చిన్నయసూరి  

తెలుగు క్లాసికల్ కృతుల సాహిత్య ఉదాహరణలిస్తూ, వాటిని అనువాదము చెసిన వి.నారాయణరావు పైన ఇచ్చిన రచయితలను గూడా తిక్కన లాంటి మహానుభావులతో కలిపారు. అంటే వీరు గూడ సాహితీకారులంటే సందేహం వుండకూడదు కదా!

ఇవి చచ్చిపోయిన భాషకు చిహ్నాలా? చచ్చిపోయిన భాష ఇంత భాగ్యమైన సృజనాత్మక సృష్ఠి చేయగలుగుతుందా? 1825 లో తెలుగు సాహిత్యాన్ని కప్పివేసిన, బ్రౌన్ చెప్పిన, అంధకారమేదీ?  

“సజీవ భాష చంపినా చావదు” (సమగ్ర, V.1, P.157) అని ఢంకా భజాయించి చెప్పిన ఆరుద్ర తెలుగు భాష 1825 లో చచ్చిపొయింది అన్న బ్రౌన్‌తో ఎలా ఏకీభవించారు?

 

తుదిమాట

తెలుగు సాహిత్యము వివిధ విభిన్న ప్రకృతులలో వృద్ధి చెందింది. “భారతము”, “భాగవతము”, “రామాయణము” ఒక కోవకు చెందినవి. “కుమారసంభవము”, “హరివంశము”, “హరవిలాసము” ఇంకొక కోవకు చెందినవి. ద్విపద కావ్యాలు మరొక కోవకు చెందినవి. “శృంగార నైషధము”, “మనుచరిత్ర”,  “ఆముక్త మాల్యద” వేరొక కోవకు చెందినవి. “పదాలు”, “కృతులు”, “వర్ణములు”, “స్వరజతులు” వీటన్నిటికీ భిన్నమైనవి. “శతకాలు”, ”చాటుపద్యాలు”, “జానపద గీతాలు” కూడా సృజనాత్మక శక్తితో విరాజిల్లుతున్నాయి.”ముత్యాల సరాలు” ఒక రకము, “మహాప్రస్థానము” మరొక రకము, “శివ తాండవము” ఇంకొక రకము - ఇన్ని రకాలలో ఒకటి కవిత్వము, ఇంకొకటి కాదు అని నిర్ణయించే లాక్షణికులు లేరు. మనము అప్పకవి యొక్క అతి సంకుచితమైన అభిప్రాయాన్ని ఒప్పుకుంటే చాలా బాధలు పడాల్సి వస్తుంది. కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్ళా అన్నీ కవిత్వానికి అర్హాలేలని ఇరవైయ్యవ శతాబ్దములో నేర్చుకున్నాము. ఇరవై ఒక్క శతాబ్దములో తెలుగు భాష ప్రజా బాహుళ్యము కావడానికి తోడుపడ్డ వార్తా పత్రికల,  సినిమా పాటల, రేడియో, టీవీ ప్రసారాల ప్రాముఖ్యతను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. తెలుగు ఇలా వృద్ధి కావడానికి కారణము ఈ విభిన్నత్వమే. భిన్నత్వములో ఏకత్వము చూసిన వ్యాస మహర్షి (భగవద్గీత - 18 అధ్యాయము) తెలుగు భాషను మెచ్చుకుంటాడు.  బ్రౌను, అతని భక్తులు శ్యామశాస్త్రి  స్వరజతులూ, త్యాగయ్య పదాలు కవిత్వము కావంటూ అప్పకవి అతి సంకుచితమైన నిర్వచనాన్ని ఒప్పుకొంటున్నారు, శ్రీ శ్రీ గారి విశ్వజనీనమైన కవిత్వపు నిర్వచనాన్ని నిర్లక్ష్యము చేస్తున్నారు. అంతేగాక చిన్నయసూరి "నీతి చంద్రిక", "బాల వ్యాకరణము" సాహిత్యము కాదంటున్నారు. రాముడు కవిత్వానికి అర్హుడు కాడా? రామదాసు కీర్తనలు సాహిత్యము కావా? తెలుగు “పంచతంత్రము” సారస్వతము కాదా? అని అడగాల్సిన దురవస్థ పట్టడము చాలా శోచించవలసిన విషయము.       

బ్రౌను తాను ఒంటరిగా చచ్చిపడివున్న తెలుగుకు ప్రాణం పోసానని చెప్పుకున్నాడు. నిజం ఏమిటంటే ఇతరుల సహకారముతో, ఇతరుల పాండిత్యము ఉపయోగించుకుని కొన్ని తెలుగు కావ్యాలను ప్రచురించాడు. తెలుగు సాహిత్యము 1825 లో చచ్చి పోలేదు. బ్రౌను 30 ఏళ్ళల్లో అంటే 1855 సంవత్సరంలో ఉద్ధరించలేదు. 1861 వరకూ అఖండమైన సాహిత్యము రచించబడ్డది -  శ్యామశాస్త్రి 1827 వరకూ, త్యాగరాజు 1847 వరకూ,  చిన్నయ సూరి 1861 వరకూ తెలుగు భాషను బ్రహ్మాండముగా పోషించారు. బ్రౌన్ చెసిన రెండు ప్రగల్భాలూ  అతిశయోక్తులే కాకుండా, అబధ్ధాలనీ తెలుసుకున్నాం - మొదటిది తాను ఒంటరిగా సాధించాననేదీ, రెండవది తెలుగు సాహిత్యం 1825 లో చచ్చిపోయింది అన్నదీనూ. చావనిదానికి  జీవం పోసే ప్రసక్తి లేనేలేదు. బ్రౌను తెలుగు భాషను ఇష్టపడ్డాడు కనుక తన పరిధిలో కొంత సేవ చేశాడు అంటే సమంజసముగా వుంటుంది.

ఇక ముందు వచ్చే ఇతర విషయాలను గూర్చి మాట్లాడుకుందాము.

*****

Anchor 1

డాక్టర్ నెల్లుట్ల నవీన చంద్ర

నెల్లుట్ల నవీన్ చంద్ర గారి జన్మ స్థలం వరంగల్ నగరం. పుట్టిన తేదీ డిశంబర్ 17, 1941. ఉస్మానియా, ఎడ్మంటన్ -ఆల్బర్టా (కెనడా) లలో విద్యాభ్యాసం. Ph. D. (Physics) పట్టా పొందారు. భారత, కెనడా, బ్రజిలు, మొజాంబిక్  దేశాలలో పరిశొధకులు, అధ్యాపకులు, భూతత్వ-భూభౌతిక శాస్త్రఙులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. తెలుగు రచయితగా కథలూ, గేయాలూ, వ్యాసాలూ, సైన్సు పుస్తకాలూ రచించారు.
ఆయన చిన్నపిల్లల కోసం రచించిన Big Bang, Floating Continents, Life on Earth పుస్తకాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. తోట పనిలో సిద్ధహస్తులుగా టొరాంటో నగర బహుమతి పొందారు. 
Toronto Dharma Group ఉపన్యాసకులు. సంస్కృత, హిందీ భాష అధ్యాపకులు.సాంఖ్య-వైశెషిక అనుచారులు.గౌతమ బుద్ధునిపై ప్రీతి. కపిల మహర్షి ప్రాపర శిష్యులు. భగవత్ గీత,  ఉపనిషత్తులు ఇంగ్లీషులోకి అనువదించారు. తెలుగు భాష అంటే ప్రాణం. ప్రస్తుత నివాసం టొరాంటో, ఆంటేరియో, కెనడా. 

Please keep your facebook logged in another browser tab or new browser window to post a comment in madhuravani.com website. 

bottom of page