top of page

క్రింది పేజీలు

ప్రస్తుత తాజా సంచికలో

లభ్యమవుతాయి

కథా ​మధురాలు

రక్తపిపాసి

సంక్రాంతి సంచిక 2016​

వెంపటి హేమ

మనిషి ఎప్పుడూ పరస్పర విరుద్ధాలైన ద్వంద్వ ప్రవృత్తుల మధ్యన పడి నలుగుతూనే జీవిస్తూ వుంటాడు. ఉన్నకర్మకు ఉపకర్మ తోడయ్యింది -  అన్నట్లుగా, వచ్చిపడ్డ కష్టాలకు తెచ్చిపెట్టుకున్న కష్టాలను కూడా జత కలుపుకుంటూంటాడు మానవుడు.

 

అలా తెచ్చిపెట్టుకున్న కష్టాల్లో భక్తీ, భయమూ కూడా ఉన్నాయనిపిస్తుంది.  దేవుణ్ణి నమ్మిన మనిషి దయ్యాన్ని కూడా నమ్మడం సహజం. మితిమీరిన భక్తీ, భయాలవల్ల ఏవేవో రూపాలు కళ్ళకి కనిపించడం, పూనకాలు లాంటివి రావడం మామూలే. ఇవన్నీ మనసు చేసే మాయలు! రేషనల్ థింకింగ్ లేకపోతే నీ భ్రమలన్నీ నిజాలేననిపించడంలో ఆశ్చర్యం లేదు.

 

"అనగనగా ఒకరాజు ..." అంటే జనం నమ్ముతారో లేదోగాని, "అదిగో, దయ్యం" అంటే మాత్రం, చాలా మందికి భయమే! జనంలో నిద్రాణమై ఉన్న ఈ భయాన్ని మరింతగా పెంచేలా, కంప్యూటర్ గ్రాఫిక్సు ధర్మమాని, ఒకదాన్ని మించినది ఒకటిగా భయానక దృశ్యాలున్న సినిమాలు ఈమధ్య తెగ వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే - సినిమా చూస్తూండగా వెన్నులో పుట్టిన ఒణుకు మరి వారం రోజుల వరకు అలాగే ఉండేలా, బ్రహ్మాండంగా హడలకొట్టే సినిమాలు ఉన్నాయిట! అటువంటి సినిమాలను జనం ఎందుకు చూస్తారో తెలియదు. డబ్బిచ్చి దరిద్రాన్ని కొనుక్కోడం అంటే ఇదే కాబోలు! ఈ విశ్లేషణ వల్ల, నేను కౌమారప్రాయంలో ఉండగా జరిగిన విషయం ఒకటి జ్ఞాపకం వస్తోంది నాకు ...

 

ఇప్పుడు తలుచుకుంటూవుంటే నవ్వొస్తోందిగాని అప్పట్లో మాత్రం అదంతా నిజమేనని నమ్మి బేజారైనా! అప్పుడు నా వయసు పద్దెనిమిదో, పందొమ్మిదో ఉంటుంది. మా నాన్నగారి అకాలమరణంతో వచ్చిన ఇబ్బందుల వల్ల, ఇంటర్ తో నేను చదువు మానేసి, నాన్న మరణం వల్ల మా ఆస్తి వ్యవహారాల్లో వచ్చిన చిక్కులు చక్కబెట్టుకోడంలో మా అమ్మకు సాయంగా ఉండడం కోసం, ఆమెతోకలిసి మా స్వగ్రామం వెళ్లిపోయా. తప్పనిసరి కనక తాత్కాలికంగా చదువు ఆపినా, ఆ తరవాత ప్రైవేటుగానైనా చదవాలన్నది నా సంకల్పం.

 

అమ్మ, నేను, అక్క - ముగ్గురమే మా కుటుంబం. అక్క డిగ్రీ చదివింది. నాన్న పోయిన సంవత్సరంలోనే అక్క పెళ్ళి జరిపిస్తే మంచిదని, అలా చేసిననాడు ఆ కన్యాదాన ఫలం ఆయనకు దక్కుతుందని అంతా అనడంతో అమ్మ, అక్కకి పెళ్లిసంబంధాలు చూస్తోంది. మా మామయ్యకు తెలిసిన సంబంధం ఒకటి ఉందంటే, పెళ్ళిచూపులకు రమ్మని మామయ్య ద్వారా వాళ్ళని ఆహ్వానించింది అమ్మ. కాని, వాళ్ళు కొద్దిరోజుల్లో వీలుచూసుకుని వస్తామన్నారు. 

 

నాకు పాత సినిమాలు చూడడం బాగా ఇష్టం. మరీ పల్లెటూరు కావడంతో మా ఊళ్ళో సినిమాహాలు లేదు. రంగుల "మాయాబజారు" సినిమా చూడాలనే ఉబలాటంతో పనిగట్టుకుని పక్కూరు వెళ్ళా. మళ్ళీ ఎన్నాళ్ళకు సినిమా చూడడం కుదురుతుందో ఏమోనని, ఆబగా రెండాటలూ చూసి, అర్ధరాత్రి గాని నేను ఇంటికి తిరిగిరాలేదు. అందుకే మరునాడు ఉదయం అమ్మ నన్ను మరీ మరీ తట్టి లేపవలసి వచ్చింది . అప్పటికే తొమ్మిదవుతోంది. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ గారాలుపోతున్న నన్ను కసిరికొట్టింది అమ్మ.

 

"రేపు కాక ఎల్లుండి మంచి రోజుట! పెళ్ళిచూపులకు వస్తామంటూ కబురుపెట్టారు అక్క పెళ్ళివారు. ఉన్నపళంగా నువ్వెళ్ళి మామయ్యని తీసుకురావాలి. మగదిక్కులేని ఇల్లాయె! అదీ కాక, వాళ్ళు మామయ్యకు తెలిసినవాళ్ళు కనక, తను మాటాడడమే బాగుంటుంది. అన్నివిధాలా మంచి సంబంధం అన్నాడు మామయ్య. ఆ ఏడుకొండలస్వామి దయవల్ల ఈ సంబంధం కుదిరితే చాలు. ఈ రోజు వెళ్ళి, రేపు మధ్యాహ్నానికంతా మామయ్యని వెంటబెట్టుకుని రావాలి నువ్వు. ఇక్కడ సద్దుబాటు చేసుకోవలసిన పనులు చాలా ఉన్నాయి" అంది అమ్మ, స్వామికి చేతులు జోడించి నమస్కరిస్తూ.

 

నాకు కొద్దిగా ఉడుకుమోత్తనం లాంటిదేదో పొడజూపింది మనసులో... నాన్న పోయింది లగాయితూ ఇంట్లో మగాళ్ళు చెయ్యాల్సిన పనులన్నీ నేనే చేస్తున్నా. దానికోసం చక్కగా సాగుతున్న నా చదువు కూడా గుంటన బెట్టి గంట వాయించేసినప్పటికీ అమ్మ నాకింకా మగదిక్కు స్టేటస్ ఇవ్వలేదన్నది నాకు అర్థమయ్యి బాధ కలిగింది.

 

అమ్మ తొందరపెట్టడంతో లేచి బాత్‌రూంకి పరుగెత్తా. నేను తిరిగి వచ్చేసరికి అమ్మ నా కోసం కాఫీ, టిఫిన్ సిద్దంగా ఉంచింది. నేనవి తీసుకుంటూ ఉండగానే అమ్మ నా అవసరానికి డబ్బు, ఒక్క పూటకు అవసరమయ్యే బట్టలూ వగైరా సరంజామా అంతా చేతిసంచీలో సద్ది ఉంచింది.

 

నేను స్టేషన్ చేరుకునీసరికి విశాఖపట్నం పోయే రైలు ప్రయాణానికి సిద్ధంగా ఉంది. కంగారుగా టిక్కెట్ తీసుకుని రైలేక్కేశా.

 *       *     *

అప్పటికింకా అరకు వాలీ ఇప్పుడంత అభివృద్ధిలోకి రాలేదు. రైల్ మార్గం  పడినాక పూర్వం కంటే చాలా నయం.  మామయ్య ఫారెష్టు రేంజర్ కావడంతో వాళ్ళు అటవీ ప్రాంతాల్లో నివసించడం తప్పనిసరి. అప్పట్లో వాళ్ళు అరకులో ఉండేవారు. ఒకసారి మా అమ్మతో కలిసి నేను అక్కడకు వెళ్లి ఉన్నానేమో, ఇప్పుడు దారి ఎవరినీ అడగాల్సిన అవసరం లేకపోయింది నాకు.

                                          

నేనెక్కిన రైలు ఒక జీవితకాలం లేటు - కాకపోయినా, అది ఎంతో కొంత లేటుగానే చేరింది విశాఖపట్నం. అక్కడ రైలు మారాలి. అరకు వెళ్ళే రైలుబండి ఎక్కడంకోసం వేరే ఫ్లాట్ఫాం మీదికి వెడితే తెలిసింది - కొద్ది నిమిషాలకు ముందే ఆ బండి బయలుదేరి వెళ్ళిపోయిందని. మళ్ళీ సాయంకాలం గాని మరో బండి లేదన్నారు.

 

విశాఖపట్నం నాకేం కొత్త కాదు. ఇంతకి ముందు, అంటే నాన్న ఉన్నప్పుడు మేమున్నది అక్కడే. అక్కడున్నప్పుడు రాజు నాకు ముఖ్య ప్రాణస్నేహితుడు. చిన్నప్పటినుండీ ఇద్దరం కలిసి చదువుకున్నాం, కలిసి బ్రతికాం. ఒకసారి వాడిని చూడాలనిపించింది. ఈ రోజు ఆదివారం కనక వాడు ఇంట్లోనో ఉంటాడు. ఈ పూట వాడితో గడపడం అన్నివిధాలా ఇద్దరికీ  బాగుంటుందనిపించి, వాళ్ళ ఇంటికి బయలుదేరా.  

 

వాడు నన్ను ప్రేమగా ఆహ్వానించాడు. వాళ్ళమ్మగారు నాకు చక్కని ఆతిధ్యమిచ్చారు. రాజూ నేను వెనకటి కబుర్లు చెప్పుకుంటూంటే మాకు పొద్దు తెలియలేదు. కాని రైలు టయిం అయ్యేసరికి బాధ్యత నన్ను తట్టి పిలిచింది. ఇక వెళ్లాలని లేచా...

 

నేనంత తొందరగా వెళ్ళిపోడం అన్నది రాజుకి  ఏమాత్రం నచ్చలేదు. రేపు పొద్దున్న వెళ్ళొచ్చులే, ఈ బండి రాత్రికిగాని అరఖు చేరదు. రాత్రి చీకట్లో అడవి దారుల్లో భయంకరమైన దయ్యాలు కారాడుతూ ఉంటాయి. గాలిదయ్యాలు, సమయం చూసి ఆవహించాలని గాలిలో తేలుతూ సంచరిస్తూ ఉoటాయి. కొరివిదయ్యాలు దారి చూపిస్తున్నవాటిలా దీపం పట్టుకు ముందు నడుస్తూ అడవంతా తిప్పి తిప్పి వదులుతాయి. అన్నింటికన్నా వేంపైర్సు అనబడే రక్తం పీల్చే పిశాచాలు మరీ భయంకరం. అవి చెట్లమీద ఉండి, దారేపోతూ ఎవరైనా కనిపిస్తే చాలు, కీచుమని పెద్దగా అరుస్తూ వాళ్లపైన దూకి, మెడకొరికి నెత్తురు తాగుతాయి. వెళ్లొద్దు, నా మాట విను - అంటూ తెగ బ్రతిమాలాడు, ఎలాగైనా నాకు పిరికిమందు పోసి ఆ రాత్రికి ఆపెయ్యాలని. కాని నేను వినిపించుకోలేదు.

 

రేపు సాయంత్రానికల్లా మామయ్యా, నేనూ అమ్మ దగ్గర ఉండాలంటే ఈ రాత్రే నేను మామయ్యకి విషయం చెప్పాలి. రేపు మధ్యాహ్నానికే ఇంటికి వెళ్లి, రేపు సాయంత్రం మేము మరునాటి అవసరానికి కావలసినవన్నీ సమకూర్చుకోవలసి ఉంది. అన్నీ కుదిరితే అప్పటికప్పుడు, క్లుప్తంగా తాంబూలాలు కూడా పుచ్చేసుకోవాలన్నది అమ్మ ఆలోచన.

 

రాజు ఊరికే నన్ను భయపెట్టి వెళ్ళకుండా చెయ్యాలని అలా ఏవేవో మాటలు అంటున్నాడుగాని, రైలు రాత్రి ఏడయ్యీ సరికంతా ఆడంగు చేరుకుంటుంది. ఆటో మీద యిట్టే మామయ్య ఇంటికి వెళ్ళొచ్చు. అప్పటికి ఇంకా పూర్తిగా జనం సద్దుమణగరు. అయినా ఇలాంటివన్నీ నేను నమ్మను కదా! నాకేం భయం - అనుకున్నా. ఆ మాటే చెప్పి రాజు మాటల్ని కొట్టిపారేసి లేచి నిలబడ్డా. ఇక చేసేది లేక రాజు నన్ను అయిష్టంగానే రైలెక్కించాడు. రైలు బయలుదేరింది. కిటికీవార కూర్చుని, బయట కనిపిస్తున్న ప్రకృతిని చూస్తూ తన్మయుడనై నన్ను నేను మరిచిపోయా.

 

కొంతదూరం వరకు బండి చక్కగా నడిచింది. బొర్రా గుహల దగ్గరకి వచ్చేసరికి ఇంజన్ కి ఏదో ఒక చిన్న మరమ్మత్తు వచ్చిందిట. బండిని సైడ్ ట్రాక్ మీదకు తప్పించి, మెకానిక్ కి రమ్మని ఫోన్ చేశారు. మెకానిక్ వచ్చి, బండిని  బాగుచేసి, దానిని ట్రాక్ మీదకు తెచ్చేసరికి మరి మూడు గంటలు గడిచిపోయాయి. అప్పుడు మళ్ళీ ప్రయాణం చేసి రైలుబండి అరఖు స్టేషన్ చేరేసరికి రాత్రి 10 గం. అయ్యింది. నేను రైలు దిగాను. నాతోపాటు మరో ఇద్దరు దిగారు అక్కడ. వారిలో ఒకడు రైల్ ట్రాక్ వెంట నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మరొకడు తనవెంట తెచ్చిన సామాను మోసుకుంటూ స్టేషన్ బయటికి వచ్చి అక్కడ తాళం వేసివున్న సైకిల్కి చుట్టూ వాటిని తగిలించి, తాళం తీసి దాన్ని తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు.  ఆకలి, దాహం నన్ను చుట్టుముట్టాయి. తొందరగా ఇల్లు చేరాలని  స్టేషన్ బయటకి వచ్చా. బయట కొద్ది దూరం వరకు స్టేషన్ దీపాల తాలూకు వెలుగు ప్రసరిస్తోంది.

 

అవి శుక్లపక్షపు తొలి రోజులు కావడంతో గుడ్డివెన్నెల అంతటా పరుచుకుని భయంకరమైన నీడల్ని సృష్టిస్తోంది. స్టేషన్ దగ్గర బళ్ళు ఏమీ లేవు, ఇక రైలుబండి రాదని నిరాశ చేసుకుని బల్ల వాళ్ళు వెళ్ళిపోయారు కాబోలు. నాకు దారి తెలుసన్న ధైర్యంతో, నడక మొదలుపెట్టా. మామయ్య ఇల్లు అక్కడకి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరం ఉంటుందని నా అంచనా. సంచీ బుజాన వేసుకుని, ఈలపాట పాడుకుంటూ నడవసాగా.

 

అటూ ఇటూ దట్టంగా మొలిచి ఉన్న పొదలవల్ల రోడ్డు తీర్చిదిద్దిన పాపిడిలా నిదానంగా కనిపిస్తోంది. రోడ్డుకి వారనున్న చెట్లు ఎత్తుగా పెరిగి ఉన్నాయి. పైకంటా ఎదిగి పెనవేసుకున్న చెట్టుకొమ్మల గాలికి కదిలే ఆకుల మధ్యనున్న ఖాళీలలో నుంచి తొంగిచూస్తున్న చిరువెలుగు వల్ల రోడ్డు పైన తళుకు తళుకుమంటూ వెలుగునీడల సయ్యాట సాగుతోంది. వెన్నెల పులుగులు అంతటా ఎగురుతూ సందడి చేస్తున్నాయి. చెట్టుకున్న ఊడలు చెట్టు కొమ్మలని పట్టి వ్రేలాడుతూ, పడగ విప్పి బుసలు కొడుతున్న నాగుపాముల్లా కనిపిస్తున్నాయి. అంతటా అలమి ఉన్న ఆ కనువెలుగులో చెదురు మదురుగా అక్కడక్కడా పెరిగి ఉన్న ఈత చెట్లు జుట్లు విరబోసుకున్న దయ్యాలలా ఉన్నాయి. చెట్లకు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో పెరిగిన పొదలు పొంచివున్న ఎలుగుబంట్లులా ఉన్నాయి. దూరంగా ఆరుతూ వెలుగుతూ ఒకచోటునుండి మరొక చోటుకి కదులుతున్న దీపాలు అచ్చం సంచరిస్తున్న కొరివిదయ్యాలని తలపిస్తున్నాయి. వద్దనుకున్న కొద్దీ రాజు చెప్పినమాటలే పదేపదే గుర్తుకి వస్తున్నాయి. అప్పుడు వాడితో బీరాలు పలికినమాట నిజమేగాని, ఇప్పుడు కాళ్ళలోంచి నెమ్మదిగా వణుకు మొదలయ్యింది. .

 

అస్తమించే సమయమయ్యింది కాబోలు చంద్రుడు అస్తాద్రిలోకి కృంగిపోయాడు. పరిసరాలని కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి అలుముకుంది. కనీ కనిపించకున్న ఆ రోడ్డు వెంట నడక సాగించా. దగ్గరలోనే గుడ్లగూబ పలికింది. ఉలిక్కిపడ్డా. పొదల్లో రాత్రి తిరిగే జంతువులు సంచరిస్తున్నదానికి గుర్తుగా పొదలలో సందడి మొదలయ్యింది. ఏదో జంతువు వేటాడింది కాబోలు చనిపోయిన దాని ఆర్తనాదం దీనంగా, హృదయవిదారకంగా వినిపించింది. నాలో భయం పుట్టి, నెమ్మదిగా పెరగసాగింది.

 

అస్తమించే సమయమయ్యింది కాబోలు చంద్రుడు అస్తాద్రిలోకి  కృంగిపోయాడు. పరిసరాలని, కన్ను పొడుచుకున్నా కనరాని కటిక చీకటి అలుముకుంది. ధైర్యం చిక్కబట్టి, కనీ కనిపించకున్న ఆ రోడ్డు వెంట నడక సాగించా. దగ్గరలోనే ఎదో పక్షి  భీకరంగా కూసింది. రాత్రి తిరిగే జంతువులు సంచరిస్తున్నదానికి గుర్తుగా పొదలలో  సందడి మొదలయ్యింది. ఎక్కడో ఎదో జంతువు వేటాడినడానికి ఋజువుగా చనిపోయిన దాని ఆర్తనాదం దీనంగా, హృదయవిదారకంగా వినిపించింది. నెమ్మదిగా నాలో భయం పుట్టి, పెరగసాగింది. కాని, అల్లంత దూరంలో మామయ్య ఇంటికి దగ్గరలోని రోడ్డుమలుపు ఎదురుగా కనిపించింది. దాన్ని చూడగానే, ఇంటి దగ్గరకు వచ్చేశానన్న ఆలోచన నాకు ఎంతో తెరిపినిచ్చింది.

 

సంతోషంగా నాలుగు అడుగులు ముందుకి వేశానో లేదో, నా తలకు పైగానున్న చెట్లమీద గలగలమని కొమ్మలు కదిలిన  శబ్దం, అంతలో గట్టిగా కీచు, కీచుమంటూ కేకలు వినిపించేసరికి నా పై ప్రాణం పైకే పోయింది. వద్దన్నా వచ్చింది మనసులోకి ఆలోచన, "వేంపైర్సు!"

 

రాజు మాటలు గుర్తొచ్చి భయంతో ఒణికిపోయా. వేగంగా పరుగెత్తి, శీఘ్రంగా ఆ ప్రదేశంనుండి పారిపోవాలనుకున్నా. పరుగెత్తడానికి కొంచెం ముందుకి ఒంగానో లేదో, చెట్టుకొమ్మల మధ్యనుండి ఎదో జరజరా జారుతూ వచ్చి 'ధబ్బు' మని నా వీపుపైన బరువుగా పడి, వెంటనే నా మెడ కరిచి పట్టుకుంది. వెచ్చని నెత్తురు మరుక్షణం నా మెడ నుండి కారడం తెలిసింది. నా పై ప్రాణం పైకే పోయినట్లు అనిపించింది, ఒళ్ళు తెలియలేదు. వెర్రి కేకలు పెట్టుకుంటూ, మలుపు తిరిగి మామయ్య ఇంటి వైపుగా పరుగెత్తాను.

*     *     *

మళ్ళీ నేను కళ్ళు తెరిచేసరికి అంతా వెలుగుగా ఉంది. రాత్రి సంగతులు ఒకటి ఒకటీ జ్ఞాపకం రాసాగాయి. మామయ్య ఎదుట కనిపించకపోయి ఉంటే అంతా కల అనుకునీ వాడినేమో.

 

"ఏరా! ఒంట్లో ఎలావుంది? ప్రయాణం చెయ్యగలవా" అని అడిగాడు మామయ్య, "ఆశ్చర్యపోకు, నీ జేబులోని ఉత్తరం నేను తీసి చదివా".

నేనదేమీ పట్టించుకోకుండా మెడమీద అంటించబడ్డ "బేండు ఎయిడ్" తడుముకుంటూ, "మామయ్యా! నా మెడ కొరికి నా నెత్తురు తాగిన ఆ రక్త పిశాచి ఏమయ్యింది” అని అడిగా భయం భయంగా.

మామయ్య గుక్కపట్టి నవ్వసాగాడు. అప్పుడే ఆ గదిలోకి వచ్చిన అత్తయ్య అంతా వింది కాబోలు, చిన్నగా నవ్వి, "రా బాబూ నేను చూపిస్తా నీకు దాన్ని" అంటూ నన్ను చెయ్యి పట్టుకుని పక్కగదిలోకి నడిపించింది.  ఆ గదిలో గోడవారగా ఒక ఎండుకొమ్మ, చిలవలు పలవలుతో ఉన్నది.

"ఇదే నీ పాలిటి వేంపైర్! రాత్రి, ఇక పడుకుందామని పుస్తకం మూసి లేచేసరికి, వీధిలో ఎవరో పెద్దపెద్ద కేకలు పెడుతూ పరుగెత్తుకు రావడం తెలిసింది. వెంటనే మీ అత్తయ్యని బేటరీ లైట్ తెమ్మని, నేను తుపాకీ పట్టుకుని బయటికి వచ్చా. అంతలో నువ్వు, "మామయ్యా!" అంటూ వచ్చి నన్ను కౌగిలించుకుని సొమ్మసిల్లిపోయావు. నీ వీపుమీద ఈ కొమ్మ పట్టివుంది. నీ మెడనుండి రక్తం కారుతోంది. వెంటనే నీకు ఫస్టు ఎయిడ్ చేసి, పడుకోబెట్టాము. నువ్వు అలాగే నిద్రలోకి జారుకున్నావు. నీకు చూపించాలనే ఈ కొమ్మని అట్టేపెట్టాము." మామయ్య చెప్పాడు.

ఆ కొమ్మకేసి భయంభయంగా చూస్తూ అన్నా " వేంపైర్సు" కామరూపులుట!"

మామయ్య నవ్వుతూ వెళ్లి ఆ కర్ర చేత్తో ఎత్తి పట్టుకుని చెప్పసాగాడు....

"నేనప్పుడే అనుకున్నాను, నువ్వలాంటిదేదో ఊహించే అంతలా భయపడ్డావని. కాని, నేనిన్నేళ్ళనుండి పగలూ రాత్రీ తేడాలేకుండా ఈ అడవుల్లో తిరుగుతున్నా. కాని, నాకెప్పుడూ ఈ అడవుల్లో దయ్యాలుగాని, భూతాలుగాని, పిశాచాలుగాని కనిపించలేదు."

"నిన్న నేను వస్తూంటే భయంకరంగా గోలచేసి అరిచినవి ఏమిటి మరి?"

"అవా! వాటిని ‘ఋషిపక్షులు’ అంటారు. అవే, చెట్టుకొమ్మల్ని పట్టుకుని తలక్రిందులుగా వేలాడుతూ ఉండే "ఫ్రూట్ బేట్సు" అనబడే పెద్దపెద్ద గబ్బిలాల్లా ఉండే పక్షులు. అవో విచిత్ర జీవులు. నాలుగు పక్షులు ఒకచోట చేరితే చాలు, అవిచేసే గోల ఇంతా అంతా కాదు. కాని దేవుని సృష్టిలో ఏ పనీ ఉత్తినే జరగదని తెలుసుకో... అవి చేసే అల్లరి వల్ల చెట్లపైన నిలవ ఉన్న ఎండు కొమ్మలు రాలిపోయి చిగుర్లకు తెరిపి దొరుకుతుంది.  అలా రాలిన కొమ్మే ఒకటి నీమీదపడి, రాత్రి నిన్నంత భయపెట్టింది. ఆ కొమ్మ తాలూకు పలవలు రెండు నీ చొక్కా కాలర్ లో చిక్కుకుని ఉండడంవల్ల అది పడిపోకుండా నీ వీపుమీద కూర్చుని సవారీ చేసి, నిన్ను గీరి, నీ రక్తం కళ్ళ జూసింది" అంటూ ముగించాడు మామయ్య.

 

రాత్రి నేను చేసిన హడావిడికి నాకు చాలా సిగ్గనిపించింది. తలవంచుకున్నా. 

*      *       *

మామయ్య ఆధ్వర్యంలో అక్క పెళ్ళి చక్కగా జరిగింది. మామయ్య ఊరుకోకుండా నా కథ మనుగుడుపులకు వచ్చిన బావకి చెప్పాడు. బావ సరదాగా నన్ను ఆటపట్టించాడు. పెళ్ళిలో భర్త ముందు తలవంచుకుని కూర్చున్న మా అక్క ఆ తరవాత తలెత్తింది గాని, నాకు మాత్రం చాలా రోజుల వరకూ మా బావ ముందు తల పైకెత్తడానికి మొహం చెల్లక తల వంచుకునే ఉన్నాను.

***********

వెంపటి హెమ

వెంపటి హేమ

ఎనిమిది పదుల వయసులో ఉన్న వెంపటి హేమ గారు ఫిజిక్స్ లో పట్టభద్రురాలు. 1970 లో రచనావ్యాసంగం మొదలుపెట్టి ఇప్పటి వరకూ 52 కథలు, 3 నవలలు, 60 కవితలు, 8 పిల్లల కథలు, 5 వ్యాసాలు,  అర్థాలతో సహా 3000 పిల్లల పేర్ల సేకరణ, ఇకెబానా అమరిక అనే పద్ధతిని & మార్బులింగ్ టెక్నిక్స్ ని తెలుగులోకి అనువాదం చేశారు. “కలం పేరు కలికి. అమెరికాలో కొన్నేళ్ళు గడిపి ప్రస్తుతం హైదరాబాద్ లో నివసిస్తున్నారు. ఒక కుమారుడు, ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు మనవలు, ముగ్గురు మనవరాళ్ళు. “కలికి కథలు” అనే సమగ్ర కథా సంపుటి గత సెప్టెంబర్ 2015 వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు ప్రచురించారు.

Please keep your facebook logged in another browser tab or new browser window to post a comment in madhuravani.com website. 

bottom of page