MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
అధ్యాత్మిక వాణి
పశ్యమే యోగమైశ్వరం
సుధేష్ పిల్లుట్ల
అద్వైత తత్త్వాన్ని అరటి పండులాగా వొలిచి చూపించిన సిరివెన్నెలగారి పాట "జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది!"
“నిజానికి ఏకాకినైన నేను ఎల్లకాలము ఒంటరినై, నాతో నేనే అనుగమిస్తూ, నిరంతరం సృష్టిని కలలుగా కంటూ, ఈ జగత్తును ఒక ఇంద్రజాలంలా సృష్టించి, నా సృష్టిలో నేనే ఆకాశమై, ఆ ఆకాశంలో జ్ఞానం లాంటి కంటినై, అన్నింటినీ చూస్తూ నా ఆనందానికి నేనే కారణంగా, నాతో నేనే రమిస్తూ, భావాద్వైతంలో ఉన్నప్పటికీ ఆచరణలో జగమంతా వసుధైక కుటుంబంలా చూస్తూ మసలుకుంటాను” అనే ఉపనిషత్ సారాంశాన్ని సిరివెన్నెల గారు నర్మగర్భంగా తెలిపారు.
"అయం బంధురయం నేతి గణనా లఘు చేతసాం ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకం" అని చెప్పే ఉపనిషద్ దృక్పథం కూడా ఇదే.
భగవద్గీత లో తన స్వరూపం చూపించబోతూ కృష్ణ భగవానుడు, జగత్తును విశ్వరూపంగా చూడాలంటే మామూలు మానవుడికి కష్టసాధ్యం కనుక దివ్యచక్షువులను ఇస్తున్నాను, యోగమైన తన ఐశ్వర్యాన్ని చూడమని “పశ్యమే యోగమైశ్వరం” అంటాడు
న తు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా
దివ్యం దదామి తే చక్షు: పశ్య మే యోగమైశ్వరం
సనాతనం మరియు ఋషిప్రోక్తము అయిన వేద వాఙ్మయమే మనకు విశ్వరూపసందర్శనానికి పరమాత్మ ప్రసాదించిన దివ్య చక్షువులు. వైదిక సంస్కృత సాహిత్యం ప్రతిచోటా మనకు ఈ అద్వైత జ్ఞానాన్ని చాలా మంత్రాలు, శ్లోకాలు, సూక్తాలు, సహస్ర నామాలు ద్వారా అందించింది.
"అన్ని జీవరాసులు తన తలలుగా, తానే విశ్వమై, తను సృష్టించిన విశ్వంలో తానే అంతర్యామియై, ఆ విశ్వంలో జ్ఞానస్వరూపంగా మనకు సాధనతో అందుబాటై, మనందరికీ గమ్యమైన ఆ అక్షర తత్వమే నారాయణుడు" అని నారాయణ సూక్తం మొదటి సూక్తం తెలియ చేస్తున్నది.
“ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం"
ఇదే భావనని విశ్వాన్ని విష్ణువుగా చూడు ఎందుకంటే యజ్ఞమైన ఈ విశ్వంలో తానే వషట్ అనే ప్రణవంగా వ్యాపించి తానే కాలతత్వమై, తానే సృష్టి, స్థితి, లయకారకమై జగత్‌గా గోచరించే ఈ విశ్వంలో తనే ఆత్మయైనది ఆ ఈశ్వరుడే” అని విష్ణు సహస్రంలో మొదటి శ్లోకం “విశ్వం విష్ణు: వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు: భూతకృత్ భూతభ్రుత్ భావో భూతాత్మా భూత భావన:” చెబుతున్నది.
నేను, నాది, నా కుటుంబం, నా మతం అనే సంకుచిత దృష్టిని వీడి విశ్వాన్ని ఈశ్వరుడిగా చూస్తూ, విశ్వంలో ఉండే ప్రతి చరాచరము “నా కుటుంబము” అనే విస్తృత భావనను కలిగి ఉండాలని, ఆ ఈశ్వరతత్త్వం అనంతమైనపుడు నారాయణుడు తప్ప మరియొకటి లేదనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలనేదే వైదిక ధర్మం ఉద్దేశ్యం.
రమణ మహర్షి కూడా “జగత ఈషధీ యుక్త సేవనం అష్ట మూర్తి భ్రుద్ దేవ పూజనం” అని ఉపదేశసారంలో ఆదేశించారు.
ఈ భావనతో చెసే ప్రతి పనీ కర్మయోగమౌతుంది, ప్రతి ధ్యానమూ ఉపాసనయోగమౌతుంది, ప్రతి జ్ఞానసముపార్జనా జ్ఞానయోగమౌతుంది, ఆ జ్ఞానం ముక్తిదాయకమౌతుంది.
ఈ సాధన కోసమే వేదం ఒక ధార్మిక జీవన విధాన్ని ఏర్పాటు చేసింది. నేను "అల్పజ్ఞుడనైన జీవుణ్ణి" అనే ఇహం నుంచి "అంతా పరమాత్మ తత్వమే" అనే పరానికి చేరడం కోసం నిరాకారమైన అనంతాన్ని అనేక నామ, రూప, ఉపాధులతో ఒక ఆలంబనగా చేసుకొని ఇష్టదేవతా భావనతో మొదట సాధన ప్రారంభించమన్నది. ఇష్టదేవత ఒక బంధనం కాకుండా అదే తత్వాన్ని అనేక రూపాలలో కొలవమన్నది.
సంకుచిత మనస్సు విశాలతను పొందడానికి మానవ స్వరూపమే కాదు సమస్త జంతుజాలాన్ని, పశుపక్ష్యాదులని, చెట్టు చేమలను కూడా దైవ స్వరూపంగా పూజించమన్నది. చైతన్యం జీవసముదాయంలోనే కాదు జడపదార్థాలలో కూడా అవ్యక్త రూపంలో ఉందని తెలియచేయడం కోసం పర్వతాలను, నదులను కూడా భక్తిభావనతో చూడమన్నది. రేఖాగణిత రూపాలను శ్రీచక్రంగా భావించమన్నది.
కాలు మోపుతున్న భూమిని భూదేవిగా చూడమన్నది, చిత్తు కాగితాన్ని సరస్వతిగా భావించమన్నది. సమస్త సంపదను లక్ష్మిగా కొలవమన్నది, అన్నిటికి కారణమైన ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులను లలితగా పూజించమన్నది. సృష్టిని బ్రహ్మగా, స్థితిని విష్ణువుగా, లయమును శివంగా చూడమన్నది. జన్మనిచ్చిన తల్లిని, తండ్రిని, జ్ఞానమిచ్చిన గురువును, గృహస్థధర్మానికి తోడ్పడుతున్న అతిథిని దేవతాస్వరూపంగా చూడమంది. కనపడిన ప్రతి ఒక్కరిని వ్యతిరేకంగా కాక నీలో ఉండే పరమాత్మను ఎదుటి వ్యక్తిలో కూడా చూసి నమస్కరించమన్నది.
చివరకు జ్ఞాన పరాకాష్టలో పరమాత్మ తప్ప మరియొకటి లేదు - "ఏకం అద్వితీయం బ్రహ్మ" అనే అపరోక్ష అనుభూతితో జీవన్ముక్తుడవమ్మన్నది.
మనకున్న ప్రతి ధ్యానశ్లోకం యొక్క పరమోద్దేశ్యం అదే. సాధన మొదటి స్థితిలో ఏకాగ్రత కోసం సగుణ స్వరూపం గాను, సాధన వృద్ధి చెందినపుడు విశాల తత్వాన్ని చూపుతూ చివరకు నిరాకార సత్యమును చూపడం ధ్యాన శ్లోక ఉద్దేశ్యం.
ఉదాహరణకు మనందరికీ చాల సుపరిచయమైన ధ్యాన శ్లోకం:
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
“తెల్లని వస్త్రములు ధరించి పూర్ణచంద్రుడి వలె ప్రసన్నముఖము కలవాడై, నాలుగు భుజములతో ఉన్న శ్రీ మహావిష్ణువు (లేక వినాయకుడు)ను అన్ని విఘ్నములను తొలగించి శాంతిని చేకూర్చమని ప్రార్ధిస్తున్నాను” అనే భావం మనందరికీ సుపరిచయమే. ఇది మొదట మన అలంబనకోసం నిలపవలసిన భావం. కాని మనసు వికసించి విశాలతను పొందినప్పుడు ఇదే శ్లోకం విశ్వరూప దృక్పథాన్ని అందిస్తున్నది.
శుక్లమంటే శుద్ధమైన చైతన్యం, అంబరమంటే ఆకాశం , శుక్ల అంబరధరం అంటే సూక్ష్మమైన చిదాకాశాన్ని స్వరూపంగా ధరించిన; విష్ణుం - సర్వవ్యాపకత్వం, చతుర్భుజం – భుజం (భుక్) అంటే అనుభవించడం, ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలు అనే విభూతులు అనబడే నాలుగు సిద్ధిచతుష్టయం తన అనుభవాలుగా ఉన్నటువంటి ఆ పరమాత్మ; "శశి వర్ణం" - శశి అంటే మనస్సు, శశివర్ణం అంటే మానసికమైన వివిధ గుణాలతో బాధితులమైన మనకోసం; ప్రసన్న – ప్రసన్నుడై; వదనం (వాక్) - జ్ఞానం బోధించి; మన సాధనలో సర్వ విఘ్నములను తొలగించి ఉపశాంతి చేయమని ఆ పరమాత్వను గురు రూపంలో ధ్యానిస్తున్నాను”.
ఈ విధమైన విశ్వభావనతో పూజిస్తే సాధకులు సార్ధకులు అవుతారు.
మరో ఉదాహరణ తీసుకుందాము - విష్ణు సహస్రనామ పారాయణం ముందు చేసే ధ్యానశ్లోకం:
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం
వన్దే విష్ణుం భవభయహరం సర్వ లోకైక నాథం
“శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కమలనయనం”లో ఒక సగుణ, సారూప్య తత్వాన్ని చూపిస్తున్నది. ఇది సాధకుని ప్రారంభ స్థితిలో కనపడే అర్ధం. సాధకులు అక్కడే ఆగిపోకుండా విశ్వమంతా వ్యాపించి గగన సదృశమైన విష్ణుతత్వాన్ని చూడగలగాలి. ఆ స్థితి నుంచి కూడా పరాకాష్ట పొంది ఆ పరమాత్మను శోధించి చూస్తే సాధనతో యోగ స్థితి పొందిన నీహృదయం లోనే ఉంది అని చూపుతుంది.
అంతే కాదు, కమలమునకు మరో నామం పుష్కరం. కమలనయనం అంటే పుష్కరాక్షం, అక్షం (కన్నులు) జ్ఞానానికి చిహ్నం. అంటే సంపూర్ణ జ్ఞానతత్వమన్నమాట. కమలనయన అనే మాటలో జ్ఞానమే నారాయణుడు అని చెబుతూ "ప్రజ్ఞానం బ్రహ్మ" అనే మహావాక్యాన్ని తెలుపుతున్నది.
విష్ణువుని పద్మనాభుడుగా సంకేతపరంగా చూపించి, ఎలాగైతే “ఊర్ణనాభి” (సాలే పురుగు) తన బొడ్డులోనించే పదార్థాన్ని పుట్టించి తన జగత్తును తానే సృష్టిస్తున్నదో, పరబ్రహ్మం కూడా తానే ఉపాదాన నిమిత్త కారణుడైన జగత్కారకుడనే అద్వైతభావనను అందిస్తున్నది.
పోతన ప్రహ్లాదుడి నోట "ఇందు గలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుడు, ఎందెందు వెదకి చూచిన అందందే గలడు..." అని పలికించినది కూడా ఇది తెలుపడానికే.
ఈ విధంగా మంత్రాలలోనూ, సూక్తాలలోనే కాక ప్రతి పదంలో ఈ విశ్వరహస్యాన్ని, విశ్వతత్వాన్ని సంసృత వాఙ్మయము చూపిస్తుంది. వాసుదేవ అంటె వసుదేవుడి తనయుడైన కృష్ణునిగా మొదట పూజించినా, "వసతి (అస్తిత్వం) ధీయతి (చైతన్యం) ఇతి వాసుదేవ" అంటే సత్చిత్ బ్రహ్మగా చూడమని, అదే విధంగా లింగాకారం లో శివుని కొలిచినా, లీయతే (లీనమైయున్న అస్తిత్వం) గమ్యతే (బయటకు కనబడుతున్న చైతన్యం) అనే వాసుదేవ తత్వంగా గ్రహించమని ఉపదేశించి, నామ రూప భేదమేనని, వస్తు భేదం లేదని, ఏ రూపం పట్టుకున్నానిరాకార అనంత సత్యతత్వాన్ని చూడగలమని వేదోద్దేశ్యం.
ఈ విశాలభావంతో, అద్వైత చింతనతో, వైదిక జీవనవిధానాన్ని పాటిస్తే సర్వ మానవ సౌభ్రాతృత్వం, సర్వమత సమానత్వంతో మనిషి జీవించగలడు. సమస్త జంతుజాలాన్ని, సమస్త భూప్రపంచాన్ని ఒక దైవ స్వరూపంగా భావించి మితిమీరిన వనరుల వాడుక, వాతావరణ కాలుష్యం లేకుండా ఒకరితో ఒకరు సహజీవనం చేయవచ్చు, భావి తరాలకి మార్గదర్శకం కావచ్చు. కులాల పేరిట అక్రమాలు, సంకుచిత మనస్తత్వంతో చేస్తున్న మతమార్పిడులు, మతం పేరిట ఇప్పడు జరుగుతున్న మారణహోమాన్ని ఆపవచ్చు. ఆస్తికులు, నాస్తికులు వివిధ మతస్తులు కలసి శాంతియుతంగా ఉండవచ్చు.
సర్వే జనా: సుఖినో భవంతు
ఓం శాంతి: శాంతి: శాంతి:
*****