MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
ఆహ్వానిత మధురాలు
కాల్పనిక వాస్తవం
“అయితే పరకాయ ప్రవేశం సాధ్యమేనంటారా?
“ఆది శంకరులు పరకాయ ప్రవేశం చేసేరని అంటారు. కాని, అంతకు ముందు కాని, ఆ తరువాత కాని ఎవ్వరూ పరకాయ ప్రవేశం చేసిన దాఖలాలు లేవు. కాని....” అంటూ వాక్యాన్ని అర్థాంతరంగా ఆపి వక్త సభలో ఉన్న శ్రోతల వైపు చూసేడు. చూసి…“కానీ ... పాక్షిక పరకాయ ప్రవేశం వంటి ప్రక్రియ సాధ్యమేనని చెప్పటానికి చెదురు మదురుగా ఆధారాలు కనబడుతున్నాయి!
“నేను చెప్పటం కాదు. నా అనుభవంలో జరిగిన ఒక వృత్తాంతాన్ని సినిమాలా తీసేను. ఆ సినిమా ఇప్పుడు చూపిస్తాను. తరువాత జరిగిన సంఘటనలని విశ్లేషిద్దాం.
“దీపాల దీప్తి తగ్గించి తెర మీద బొమ్మలని ప్రక్షేపించండి.”
హాలులో దీపాలు ఆరిపోయాయి. చుట్టూ చీకటితోపాటు నిశ్శబ్దం ఆవరించింది. తెల్లటి తెర మీద కదిలే బొమ్మలు కదలాడడం మొదలయింది.
1
అదొక చిన్న ఊరు. పర్యాటకుల పాదధూళి పడకుండా తప్పించుకున్న అందమైన చిన్న ఊరు. మంచు కొండల సానువులలో, ఒక సెలయేటి చాటున, పచ్చటి పొలాల మాటున, పొంచి ఉన్న పల్లెటూరు. చిత్రకారులు ఊహించి చిత్రించే చిత్రపటం లాంటి ఊరు. ఆ ఊళ్లో అదొక చిన్న వసతి గృహం. దాని ప్రాంగణంలో కుటీరంలా ఉన్న ఒంటిదూలపు పెంకుటిల్లు. ఆ కుటీరం ముందు ఒక కారు వచ్చి ఆగింది. కారులోంచి దిగి అతను లోనికి ప్రవేశించేడు. అతిథులని ఆహ్వానించే బల్ల వెనుక అతనికి ఎవ్వరూ కనబడలేదు. అతను ఆ బల్ల మీద ఉన్న మీటని నొక్కి గంట మోగించేడు.
బల్ల దిగువన కాగితాలు సర్దుకోవడంలో ములిగిపోయిన గుమస్తా ఠక్కున లేచి నిలబడ్డాడు. అసంకల్ప ప్రతీకార చర్యలా కాగితం, కలం ముందుకు తోసి, తల పైకెత్తి ఆగంతకుడిని చూసేడు.
“ఆఁ! మీరా! మా వసతి గృహానికి ఇంత త్వరగా తిరిగి వచ్చినందుకు మరొకసారి స్వాగతం!”
కాగితం మీద పేరు, చిరునామా, వగైరా వివరాలు రాయడానికి ఉపక్రమిస్తూన్న అతను తల పైకెత్తి ఆశ్చర్యంగా ఎదురుగా ఉన్న గుమస్తా వైపు చూసేడు.
“ఆరోగ్యంగా ఉంటున్నారా? మీ వ్యవహారాలు బాగా సాగుతున్నాయా?” గుమస్తా యాంత్రికంగా కుశల ప్రశ్నలు వేస్తున్నాడు.
“అయ్యా! మీరు పొరబడుతున్నారు. నన్ను చూసి మరెవ్వరో అనుకుంటున్నట్లున్నారు. మనిషిని పోలిన మనిషి ఉండొచ్చు. పోలిక పట్టడంలో పొరపాట్లు సహజం,” అంటూ అప్పటికా సంభాషణని తుంచేస్తూన్నట్లు, తల దించి కాగితం మీద కలాన్ని నడిపిస్తున్నాడు అతను.
“అలా అంటారేంటి! మిమ్మల్ని నేను పోలిక పట్టలేనా? రెండు నెలల క్రితమే కదా వచ్చి రెండు వారాలు ఉన్నారు. మా సిబ్బంది మీద మీరు చూపిన ఆదరాభిమానాలు మేము ఇంకా మరచిపోలేదు.”
“నేను ఇంతకు పూర్వం మీ వసతి గృహానికి రాలేదని ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడికే కాదు, ఈ ఊరికి రావడమే మొదటి సారి. ఈ దేశం రావడమే మొదటి సారి. మీరు పొరపాటు పడుతున్నారు.”
గంటబ్బాయిని కేకేస్తూ గుమస్తా బల్ల మీద ఉన్న గంటని రెండు సార్లు కొట్టేడు.
గంటబ్బాయి పరిగెత్తుకు వచ్చి, నేల మీద ఉన్న పెట్టె, బేడా అందుకుంటూ, “ఏమి ఆశ్చర్యం! ఇంత త్వరగా మీరు తిరిగి వస్తారనుకోలేదు,” అంటూ “మీకు ఏ అవసరం ఉన్నా నన్ను అడగండి. మీ మంచి చెడ్డలు అన్నీ నేను చూసుకుంటాను.”
విజయ గర్వంతో గుమస్తా అతని వైపు చూసేడు.
సామాను పట్టుకుని ఇద్దరూ గది వైపు నడుస్తూ ఉండగా గంటబ్బాయి తన ధోరణిలో తను మాట్లాడుకు పోతున్నాడు. “మీరు తిరిగి వచ్చిన తరువాత నాకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని మాటిచ్చేరు. మళ్లా వచ్చినప్పుడు గుర్తు చెయ్యమని కూడ చెప్పేరు. మీరు తిరిగి రావడం వల్ల మాకు చాల సంతోషంగా ఉంది.”
“అబ్బాయ్! చూడు. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో. నేను ఇంతకు పూర్వం ఈ ఊరు రాలేదు. ఇదే మొదటి సారి.” ఆ మాటలు వినేసరికి గంటబ్బాయి గుటకలు మింగేడు.
“అదేంటి అయ్యా! నేను ఒక సారి చూసిన ముఖం మరిచిపోను, మీ గడ్డం దగ్గర చిన్న పుట్టుమచ్చ, మీరు నిలబడ్డ వాలకం, నడిచే తీరు, … అన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. మీరు మీ భోజనపు అలవాట్లు చెపితే నేను వంట గదిలోకి వెళ్లి మీకోసం ప్రత్యేకం శాకాహారం చెయ్యమని పురమాయించేను కూడ. జ్ఞాపకం లేదా?”
గంటబ్బాయి చేతిలో కాసింత చమురు పామి పంపేసేడు అతను.
అతను వసతి గది కిటికీలోంచి బయటకి చూసేడు. విశాలమైన వృక్షవాటిక. అంతా పచ్చగా, ప్రశాంతంగా ఉంది. తల పంకించేడు. స్నానం చేసి, దుస్తులు మార్చుకుని భోజనశాల వైపు వెళ్లేడు అతను.
భోజనశాలలో అడుగు పెట్టేసరికల్లా అక్కడ ఉన్న పరిచారకులు ఒక్కుమ్మడి అతనిని చుట్టుముట్టేరు. రెండు నెలల క్రితం వచ్చినప్పుడు అతను శాకాహారం కోరిన విషయం వారికి ఇంకా బాగా జ్ఞాపకం ఉందని చెప్పేరు. అతనికి పరిచర్యలు చేసినప్పుడు అతను వారందరికీ ఎలా కృతజ్ఞత చూపేడో వారింకా మరచిపోలేదని చెప్పుకుని అతనికి కావలసిన విధంగా వంట చేసి, సదుపాయాలు అమర్చడానికి ఎంతో తహతహలాడుతున్నామనీ వారు ఏక కంఠంతో చెప్పుకున్నారు.
అతను వారి ప్రశంశలకి స్పందించలేదు. మౌనంగా, మారు మాట్లాడకుండా మూడు ముద్దలు దిగమింగి సాలోచనగా బయటకి నడచేడు.
భోజనానంతరం బయట వరండాలో ఉన్న బెత్తు కుర్చీలో కూర్చుని, గట్టిగా గాలి పీల్చుకుని, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నాడు. ఇంతలో ఎదురుగా ఉన్న వరండాలో, గది ముందు, ఆమె కనిపించింది.
ఆమెని ఒక క్షణం పాటు కళ్లప్పగించి చూసేడు. “ఎవరబ్బా, ఈమె? ఎక్కడ చూసినట్లు ఉందే!” అన్న ఆశ్చర్యార్థకం అతని ముఖ కళవళికలలో ద్యోతకమైంది.
ఆమె కూడ ఇతనిని మొదట క్రీగంట చూసింది. తరువాత తేరి పార చూసి, కెవుక్కున కళ్లనీళ్లు పెట్టుకుంది. అక్కడనుండి ఒక్క పరుగున తన గదిలోకి వెళ్లిపోయింది.
అసంకల్పంగానే ఆమెని అనుసరించేడు. ఆమె అలంకరణ చేసుకునే అద్దాల బల్ల పక్కని నిలబడి కంట తడి పెట్టుకుంటోంది.
అతను సంకోచిస్తూనే ఆమెని సమీపించాడు. పూర్వ పరిచయం ఉన్న వాడిలా ఆమె భుజాలు చేత్తో పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. ఆమె అతని వక్షస్థలం మీద వాలిపోయింది. ఆమెని గుండెలకి హత్తుకుంటూ అతను గదిలో కలయచూసేడు.
అలంకరణ సామగ్రులు ఉన్న అద్దాల బల్ల మీద అతనికి ఒక ఛాయాచిత్ర పటం కనిపించింది. ఆ పటంలో అతనూ, అతని పక్కన ఆమె!
అతను సాలోచనగా గుమస్తా బల్ల దగ్గరకి వచ్చి, “నేను ఇంతకు పూర్వం ఇక్కడకి వచ్చేనని కదా మీరు అంటున్నారు? ఏదీ మీ పుస్తకంలో నేను ఎప్పుడు వచ్చేనో, ఎన్నాళ్లు ఉన్నానో నమోదు అయి ఉంటుంది కదా. అదొక సారి చూపించండి.”
గుమస్తా కాగితాలు వెతకడం మొదలుపెట్టే తరుణంలో మరొక కొత్త అతిథి రావడంతో ఆ కార్యక్రమం భంగపడింది.
2
ఆమె అతనిని సమీపించింది. “నాతో ఒకసారి రాండి,” అంటూ అతని చేతిని తన చేత పుచ్చుకుని పక్కనున్న భవనంలో ఉన్న ఒక వైద్యుడి దగ్గరకి తీసుకెళ్లి పరిచయం చేసింది.
“ఈయన రెండు నెలల క్రితం ఇక్కడకి వచ్చి రెండు వారాలు ఉండి వెళ్లేరు. ఇక్కడకి ఎప్పుడూ రాలేదని ఇప్పుడు అంటున్నారు. గతాన్ని ఎందుకు మరచిపోయేరో పరీక్ష చేసి చెబుతారనే ఆశతో తీసుకువచ్చాను.”
వైద్యుడు అతనిని సూత్రప్రాయంగా పరీక్ష చేసేడు: తాపోగ్రత, నాడి, రక్తపు పోటు, కనుబొమలలో ప్రతివర్తితలు పరీక్ష చేసి,
“అయ్యా! రెండు నెలల క్రితం మీరు ఎక్కడ ఉన్నారు?” అని అతనిని అడిగేడు.
“మా ఊళ్లో.”
“ఆ రెండు వారాలు మీరు మీ ఊళ్లో ఎక్కడ ఉన్నారో, ఏమిటి చేసేరో జ్ఞాపకం ఉందా?”
“ఆసుపత్రిలో ఉన్నాను. నాకు శస్త్ర చికిత్స చేసేరు. కోలుకుంటూన్న సమయంలో పరిస్థితి విషమించింది. గుండె అకస్మాత్తుగా ఆగిపోయింది. మళ్లా పెద్ద ప్రయత్నం మీద, నాలుగు నిమిషాల తరువాత, స్పందించేటట్లు చేసేరు. గుండె తిరిగి కొట్టుకోవడం మొదలు పెట్టింది కాని స్పృహ వచ్చినట్లే వచ్చి, కొద్ది సేపట్లో తిరగబెట్టింది. నేను అపస్మారం వంటి కుంభనిద్రలోకి జారుకుని జీవచ్ఛవంలా అలా చావు బతుకుల మధ్య ఊగిసలాడుతూ రెండు వారాలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండవలసి వచ్చింది.”
“ఆ రెండు వారాలు మీరు ఆసుపత్రిలోనే ఉన్నట్లు దాఖలాలు ఉన్నాయా?”
“చికిత్స పూర్తి అయి, ఆసుపత్రి నుండి విడుదల అయే తరుణంలో వైద్యులు రాసిచ్చిన కాగితం ఒకటి నా దగ్గరే ఉంది,” అంటూ జేబులోంచి ఒక కాగితం బయటకి తీసి చూపించేడు అతను.
వైద్యుడు ఆ కాగితాన్ని పరీక్షగా చూసి, “ఇతను నిజమే చెబుతున్నాడమ్మా. మీరు తేదీలలో పొరపాటు పడలేదు కదా?”
“తేదీని నిశ్చయించడం ఎంతసేపు. ఈయన ఈ వసతి గృహంలో ఉన్నారనే కదా అంతా అంటున్నారు. గుమస్తా దగ్గర చిట్టా పుస్తకంలో ఈయన పేరు నమోదు అయి ఉందేమో చూద్దాం.” అంటూ ఆమె గంటబ్బాయిని కేకేసింది.
“మీ ప్రయాణ పత్రాలు కాని మీ దగ్గర ఉన్నాయా?”
అతను జేబులోంచి చిన్న నీలిరంగు పుస్తకాన్ని తీసి వైద్యుడికి ఇచ్చేడు.
“ఇది సరికొత్త పుస్తకం. ఈ సంవత్సరమే, మూడు నెలల కిందటే, దఖలు పడ్డాది. దీనిలో సర్కారు వారి ముద్ర ప్రకారం ఇతను వారి దేశం వదలి నిన్న ఇక్కడకి రావడమే మొదటి విదేశీ ప్రయాణం. కనుక ఇతను మీరు చెప్పిన రెండు వారాలు వారి దేశంలోనే, ఆసుపత్రిలో, వైద్యుల సమక్షంలో, కుంభనిద్రలో, ఉన్నాడని రుజువు అవుతోంది.”
ఇంతలో వసతి గృహం నుండి గంటబ్బాయి ఒక కాగితం పట్టుకుని వచ్చేడు.
“ఈ కాగితం ప్రకారం, ఈ కాగితం మీద ఉన్న సంతకం ప్రకారం, ఈ సంతకంలో ఉన్న దస్తూరీ ప్రకారం ఈయన ఈ వసతి గృహంలో, పైన చెప్పిన రెండు వారాలు ఉన్నాడన్నది అనుమానానికి ఆస్కారం లేని విషయం.
“ఇంతకీ ఇతను ఎవ్వరో, ఇతను అక్కడ ఆ ఆసుపత్రిలోనూ, దేశాంతరంలో, ఇక్కడ ఈ వసతి గృహంలోనూ ఒకేసారి ఉండడం ఎలా సంభవమో అర్థం కావటం లేదమ్మా,” అంటూ వైద్యుడు తీర్పు చెప్పేడు.
3
ఆ వసతి గృహానికి ఎదురుగా ఉన్న తోటలో, అతను ఏదో ఆలోచిస్తూ, ఏకాంతంగా తిరుగాడడం మొదలు పెట్టేడు. అవగాహనకి అందని అయోమయ పరిస్థితి అతని ముఖ కళవళికలలో ద్యోతకమవుతోంది.
“మళ్లా ఎప్పుడు వచ్చేవు, నాయనా?” నిశ్శబ్దాన్ని చీల్చుతూ, అతని ఏకాంతానికి భంగం కలిగిస్తూ, ఒక కంఠం వినిపించింది.
ఉలిక్కిపడి చుట్టూ కలయచూసేడు అతను.
చెట్ల మాటునుండి బయట పడుతూ నిలువెత్తు విగ్రహం ఎదురుగా సాక్షాత్కరించింది. తెల్లటి దుస్తులు. తెల్లటి జుత్తు. తెల్లటి పొడుగాటి గడ్డం. తెల్లటి మంచు కొండల నేపథ్యంలోంచి ఆ వ్యక్తి ఎప్పుడు, ఎలా ఊడిపడ్డాడో అతను గమనించినట్లే లేదని ఆ ఉలికిపాటు చెబుతోంది.
“ఇంతవరకు ఇక్కడ నేను ఒక్కడినే ఉన్నానని అనుకున్నాను. తపస్వి ఎదుట భగవంతుడు ప్రత్యక్షం అయినట్లు అకస్మాత్తుగా ఎక్కడనుండి ఊడిపడ్డారు మహత్మా?”
“మహాత్ముడిని కాను. కేవలం మార్మికుడిని. సుదూరంలో ఉన్న ఆ మంచు కొండల గుహలలో నా నివాసం. ఆలోచనకి అనుకూలంగా ఉంటుందని అప్పుడప్పుడు ఈ తోటలో, ఈ చెట్ల మధ్య తిరగడానికి వస్తూ ఉంటాను.”
“మళ్లా ఎప్పుడు వచ్చేవు అని అడుగుతున్నారు. ఇంతకు పూర్వం నేను ఇక్కడ ఉండగా మీరు చూసేరా?”
“చూసేను. నా రాక వంటిదే నీ రాక కూడ. అందుకే నువ్వు నా కంట పడ్డావు.”
అతను కళ్లప్పగించి చూస్తున్నాడు. ఆ కళ్లల్లో ఒక ఆశాకిరణం మెరిసింది. కాని నర్మగర్భంగా ఉన్న మార్మికుని మాటలలోని అంతరార్థం అతనికి అర్థం అయినట్లు లేదు. ఈ విషయం మార్మికుడు గ్రహించినట్లున్నాడు.
“చూడు నాయనా, నా పరిస్థితి నీకు అర్థం అయితే నీ పరిస్థితి కూడ నీకు అర్థం అవుతుంది.”
“స్వామీ! నా పరిస్థితి అంతా అయోమయంగా ఉంది. నా పరిస్థితి నాకు అర్థం అయే మార్గం మీరు చూపించగలిగితే నాకు అంతకంటే కావలసినది ఏదీ లేదు.”
“నేను పూర్వాశ్రమంలో భౌతిక శాస్త్రం చదువుకున్నాను. కలనయంత్రాల వాడుకలో ప్రావీణ్యం సంపాదించేను. కాల్పనిక వాస్తవం అనే ఒక రకం ప్రత్యేకమైన శాఖలో బాగా కృషి చేసేను. ఈ కాల్పనిక వాస్తవ ప్రపంచంలో ఒక భౌతిక వాస్తవానికి అనేక “అవతారాలు” పుట్టించవచ్చు. ఈ సందర్భంలో “అవతారం” అనే మాటకి సాంకేతికమైన కొత్త అర్థాన్ని నేనే సృష్టించి మొదటిసారి వాడేను. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్మికతతో జోడించి దూరయానం అనే సమర్ధతని సాధించాలని ప్రయత్నం చేస్తున్నాను. దూరయానం అంటే ఉన్న చోటు నుండి మరొక చోటుకి లిప్త మాత్రపు కాలంలో వెళ్ల గలిగే సమర్ధత.”
“పాదాలకి పసరు పూసుకుని ప్రబంధాలలో ప్రవరాఖ్యుడు ప్రయాణం చేసేడు. ఆ కథని వినే ఉంటారు.”
“ప్రవరాఖ్యుడి కథా విన్నాను, శంకరాచార్యులు చేసిన పరకాయప్రవేశం గురించీ విన్నాను. ప్రవరాఖ్యుడు పసరు ప్రభావంతో సుదూరం వెళ్లగలిగేడు; అతగాడు త్రిమితీయ భౌతిక తలంలోనే ప్రయాణించేడు తప్ప తాను ఉన్న తలాన్ని దాటి “బయటకి” వెళ్లలేదు. పరకాయప్రవేశంలో ప్రాణం భౌతిక శరీరాన్ని ఉన్న చోట వదిలేసి, అదే భౌతిక తలంలో వేరొక చోట ఉన్న మృతదేహంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ ఒక్క ప్రాణం మాత్రం – మార్మిక తలంలో - ప్రయాణించింది. నేను ఊహించిన దూరయానం ఇటువంటిది కాదు.”
“మరి మీరు చెప్పే దూరయానం ఎటువంటి ప్రక్రియ అంటారు?”
“నేను ఊహించుకుంటూన్న దూరయానానికి ఉదాహరణ చెబుతాను, విను. భూలోకంలో ఒక యోగి తపస్సు చేస్తాడు. అతనికి దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అవడం అంటే ఏమిటి? దేవుడు వైకుంఠాన్నో, కైలాసాన్నో వదలిపెట్టి భూలోకానికి దిగి రాడు. దేవుడులోని ఒక అంశ మాత్రం దివి నుండి భువికి దిగి వస్తుంది. ఆ అంశ భక్తుడి ఎదుట సాకారం పొందుతుంది. పని అయిన తరువాత అదృశ్యం అయిపోతుంది. అవతార పురుషులు జన్మించినప్పుడు కూడ జరిగేది ఇదే. దేవుడనే అనంతమైన శక్తి నుండి లేశమాత్రపు అంశం ఒకటి విడివడి మూర్తిత్వం చెంది సాక్షాత్కరిస్తుంది. మనకి కావలసినది ఈ రకం దూరయానం.”
“మీరు చెప్పిన ఉపమానం అర్థం అయింది కాని, దీనిని ఈ అనుభవ ప్రపంచంలో సాధించడం ఎలా?”
“ఈ పద్ధతిని రకరకాలుగా ఆచరణలో పెట్టవచ్చు. నాకు తోచిన పద్ధతి చెబుతాను విను. ఈ జీవికి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అని రెండు భాగాలు ఉంటాయి అని మనం నమ్ముతాము కదా. స్థూల శరీరం స్థావరజంగమాత్మకం. సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరానికి ఒక చైతన్య శక్తిని ఇస్తుంది. ఈ స్థూల శరీరాన్నే మనం “కట్టె” అనిన్నీ, సూక్ష్మ శరీరాన్ని “ప్రాణం” అనిన్నీ అంటాం.”
మార్మికుడు చెప్పే మాటలు ఎక్కడో అఘమేఘాల మీద కాకుండా నేల మట్టంగా సాగి అర్థం అవుతోండడం వల్ల కాబోలు అతను తల పంకించి వింటూ ఉత్సాహభరితంగా ఊకొడుతున్నాడు.
“భగవానుడు భూలోకం మీద అవతరించినప్పుడు అనంతమైన ఆ భగవత్స్వరూపం నుండి కేవలం ఒక అంశ భువి నుండి భూమి మీదకి దిగి వస్తుందని చెప్పుకున్నాం కదా? అదే నమూనా ప్రకారం ఒక వ్యక్తి నుండి ఒక అంశని విడదీసి దానితో ఆ వ్యక్తి అవతారాన్ని సృష్టించవచ్చు. మనం అనుకుంటూన్న పని సక్రమంగా జరగాలంటే ఇలా విడదీసిన అంశకి కూడ ఒక స్థూల శరీరం, ఒక సూక్ష్మ శరీరం ఉండాలి అని గుర్తు పెట్టుకో.”
“కంటికి కనిపించని సూక్ష్మ శరీరంతో అవతారం నిర్మిస్తే దానికి మూర్తిత్వం ఎలా వస్తుంది? మీరు సృష్టించిన అవతారం కంటికి కనబడాలంటే దానికి స్థూల శరీరం కూడా ఉండాలి కదా?”
“అదే నేను చెబుతూన్నది! అవతరించిన శాల్తీకి మూర్తిత్వం రావాలంటే జనక స్థానంలో ఉన్న భౌతిక కాయంలో కూడ కొంత భాగం ప్రయాణించి గమ్య స్థానం చేరుకోవాలి. ఇక్కడే నేను సాధించిన మార్మిక రహశ్యం ఉంది.”
“రహస్యం అంటున్నారు కనుక వివరాలు చెప్పమని అడగడం సముచితం కాదు. కాని ఒక అనుమానం నివృత్తి చేసుకోవాలి. సూక్ష్మ శరీరంలో ఒక అంశ, స్థూల శరీరంలో ఒక అంశ జనక స్థానంలో ఉండిపోతాయి కదా? వాటి మాట ఏమిటి?”
“దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చెయ్యడానికి దేవుడు భూమి మీద అవతరించినప్పుడు ఒక అంశని దేవేరి దగ్గర ఉంచినట్లే ఇక్కడ కూడా జరుగుతోందని ఊహించుకోవడంలో తప్పు లేదు. గమ్యస్థానం చేరుకున్న పాక్షిక అంశలకి పరిపూర్ణ అస్తిత్వం ఉండదు; పాక్షిక అస్తిత్వం మాత్రమే ఉంటుంది. కనుక మూర్తిత్వం కూడ పాక్షికంగానే ఉంటుంది. అంటే అస్థిత్వ వాస్తవం కొంత, కాల్పనిక వాస్తవం కొంత ఉంటాయన్నమాట. పాక్షికంగానైనా సరే రెండూ ఉన్నాయి కనుక గమ్యస్థానం చేరుకున్న మూర్తి కూడ చైతన్య మూర్తే – నా లాగ! నీ లాగ!”
“అంటే, మీరనేది, మీరనేది… నా ఎదురుగా ఉన్న, నేను చూస్తూన్న, మూర్తిత్వంలో అస్తిత్వ వాస్తవం కొంత, కాల్పనిక వాస్తవం కొంత….”
“….అవును. నాయనా. జనక స్థానంలో, అంటే ఆ కొండ గుహలో, నా భౌతిక శరీరంలో కొంత భాగం, నా చైతన్య శక్తిలో కొంత భాగం, కొన ఊపిరితో, కుంభనిద్రలో, సురక్షితంగా ఉన్నాయి.“
“నేను నా ఎదురుగా చూస్తూన్న ఈ అస్తిత్వం భౌతిక తలంలోనా లేక…”
“ఇంకా సందేహం తీరలేదా? కొండ గుహలో, కుంభనిద్రలో ఉన్న శాల్తీ యొక్క అస్తిత్వం భౌతిక తలంలోనే. కాని దూరయానం చేసి వచ్చిన, నువ్వు చూస్తూన్న, మూర్తిత్వం భౌతిక తలంలో లేదు. ఇది భౌతిక తలం కాదు. ఇది మరొక తలం. ఇదొక కాల్పనిక వాస్తవం. భౌతిక తలంలో ఉన్న వారు ఈ కాల్పనిక తలాన్ని వారి జ్ఞానేంద్రియాలతో స్పృశించలేరు. ఈ తలంలో ఉన్నంత సేపు మనం కూడ ఆ భౌతిక తలాన్ని స్పృశించలేము.”
“మరి జనక స్థానంలో దిగవిడచి వచ్చిన భౌతిక భాగం సంగతి?”
“అది కొన ఊపిరితో, శరీరం మీద స్మారకం లేకుండా, దరిదాపు మృతప్రాయంగా పడి ఉంటుంది. దూరయానానికి వెళ్లిన భాగం తిరిగి వెనక్కి వెళితే ఆ వ్యక్తికి స్పృహ వచ్చి కోలుకునే అవకాశం ఉంది. అందుకనే కొన ఊపిరితో కుంభనిద్రలో ఉన్న వారికి మరణం తథ్యం అనే భ్రమతో తొందరపడి అంతిమ సంస్కారాలు చెయ్యకూడదు.…. ఆఁ, నా సమయం మించిపోతోంది. నేను వెళ్లాలి. నేను లేస్తాను,” అంటూ మార్మికుడు లేచి వెళుతూ ఉంటే ఆ తెల్లటి ఆకారం తోటలో దట్టంగా ఆవరిస్తూన్న పొగ మంచులో కలిసి కరిగిపోయింది.
4
“నేను లేస్తాను. నేను లేస్తాను…….”
ఎదురుగా తెల్లటి దుస్తులలో ఒక ఆకారం ఇంకా మసకగా కనబడుతూనే ఉంది. ఆ ఆకారం అతని మీదకి వంగి చేతిలో ఉన్న దీపాన్ని కంటి ముందు కదుపుతోంది.
అతను కళ్లు తెరచేడు. ఎదురుగా అమ్మా, నాన్నా! వారి పక్కనే ఉబికి వస్తూన్న కన్నీటిని ఆపుకుంటూ…
ఆమె!
గదంతా దీపాల దీప్తితో నిండిపోయింది.
*****
వేమూరి వేంకటేశ్వరరావు
ప్రొఫెసర్ వేమూరి వేంకటేశ్వర రావు గారు అమెరికాలో తొలి తరం రచయితలలో అగ్రగణ్యులు గా జగమెరిగిన వారు. ఇటీవల ఒక వెబ్ పత్రిక దేశవ్యాప్తంగా “లివింగ్ లెజెండ్” గా ఆయనని గుర్తించడం అందుకు ఒక చిన్న ఉదాహరణ. చోడవరం లో పుట్టిన వేమూరి గారు తుని, మచిలీపట్నం కాకినాడ లలో విద్యాభ్యాసం తరువాత 1960 దశకం లో అమెరికాలో స్థిర పడి, యూనివర్సిటీ ఆఫ్ కేలిఫోర్నియా లో కంప్యూటర్ సైన్సెస్ లో ఆచార్యుడిగా పదవీ విరమణ చేశారు. అక్కడి బెర్క్ లీ లో తెలుగు విద్యాపీఠం నెలకొల్పారు.
వైజ్ఞానిక ఇతివృత్తాలతో అనేక కథలు రచించి, అఖండమైన పేరు ప్రఖ్యాతులు గడించిన వేమూరి గారు జీవ నది, నిత్య జీవితంలో రసాయన శాస్త్రం, మహాయానం, విశ్వ స్వరూపం, ప్రాణి ఎలా పుట్టింది మొదలైన శాస్త్రీయ గ్రంధాలు, కించిత్ భోగే భవిష్యతి అనే వైజ్ఞానిక కథా సంపుటి, అమెరికా అనుభవాలు యాత్ర అనే స్వీయ చరిత్ర, ఒక బృహత్తర శాస్తీయ నిఘంటువు మొదలైన అనేక గ్రంధాలు, శతాధిక వ్యాసాలు, కథలు ప్రచురించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి జీవిన సాఫల్య పురస్కార గ్రహీత. కాలిఫోర్నియా లోనీ ప్లెజన్టన్ నివాసి.
****