top of page

సంపుటి 1 సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా ​మధురాలు

సర్వజ్ఞుడు (అనువాద కథ)

ఆంగ్ల మూలం: సోమర్సెట్ మామ్

స్వేచ్ఛానువాదం: ఎలనాగ​

మాక్స్ కెలాడాను ఇష్టపడక పోవటానికి నేను ముందే సిద్ధపడి వున్నాను. యుద్ధం అప్పుడే ముగియటంతో, ఓడలపై ప్రయాణించే మనుషుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఓడల్లో మంచి వసతి దొరకటం కష్టంగా వుండటం వల్ల, ట్రావెల్ ఏజెంట్లు ఏది యిస్తే దాన్నే తీసుకోవాల్సిన పరిస్థితి. విడిగా ఒక క్యాబిన్ దొరకదు కనుక, రెండు పడకలున్న ఓ క్యాబిన్ దొరికినందుకు సంతోషించాను. కాని, నా సహప్రయాణీకుని పేరు తెలుసుకోగానే నా హృదయం నీరసంగా మూల్గింది. కిటికీలు మూసివేయబడి కొత్తగాలి రాక ఊపిరాడనట్టుంటుందా పరిస్థితి, అని భయపడ్డాను. పధ్నాలుగు  రోజులపాటు నాతో కలిసి ప్రయాణం చేసే వ్యక్తి పేరు స్మిత్ కాని బ్రౌన్ కాని అయివుంటే బాగుండేదనుకున్నాను.

 
ఓడలోని క్యాబిన్ లోకి వెళ్ళిన తర్వాత చూస్తే, అప్పటికే మిస్టర్ కెలాడా గారి సరంజామా వుందక్కడ. ఆ దృశ్యం నాకెంత మాత్రం నచ్చలేదు. ఒక్కో సూట్ కేస్ మీద ఎన్నో లేబుళ్లున్నాయి. వార్డ్ రోబులో పెట్టబోయే ట్రంకు పెట్టె మరీ పెద్దదిగా ఉంది. టాయిలెట్లో ఉన్న సెంటు సీసా, షాంపూ బాటిలూ మొదలైన అతని వస్తువుల్ని చూశాక, మాన్సియర్ కోటీ అనే కంపెనీ ఉత్పత్తులకు అతడొక పెద్ద అభిమాని అని అర్థమైంది నాకు. మిస్టర్ కెలాడా వాడే బ్రష్షులు ఎబొనీ అనే చెక్కతో చేయబడి, వాటిమీద బంగారు రంగు అక్షరాలున్నాయి. కాని అవి దంతాలను కాక, వేరే ఏదైనా వస్తువును శుభ్రం చేయడానికి పనికొస్తాయని అనిపించింది. మిస్టర్ కెలాడాను నేనెంత మాత్రం యిష్టపడలేదు. సిగరెట్ తాగటానికి కేటాయించబడిన గదిలోకి వెళ్ళాను. ఒక పేకముక్కల సెట్టును తెప్పించి, నాతో నేనే పేషెన్స్ అనే ఆటను ఆడటం ప్రారంభించాను. అంతలోనే ఒక వ్యక్తి లోపలికి వచ్చి, నా పేరు ఫలానాయేనా అని అడిగాడు. 

“నా పేరు మిస్టర్ కెలాడా” అంటూ అతడు నవ్వినప్పుడు ఒక మెరిసే దంతాల వరుస కనపడింది. అతడు కూర్చున్నాడు. 
 

 “మనమిద్దరం ఈ క్యాబిన్ను షేర్ చేసుకోబోతున్నామనుకుంటా” అన్నాను.
 “దీన్నే అదృష్టం అంటాను. మీరు ఆంగ్లేయులని తెలియగానే నాకు సంతోషమైంది. విదేశాలకు పోతున్నప్పుడు ఇంగ్లిష్ వాళ్లతో కలిసి ప్రయాణం చేయడం బాగుంటుంది. నా ఉద్దేశం మీకు అర్థమైందనుకుంటాను”
 

నేను కళ్లు మిటకరించాను.
“మీరు ఆంగ్లేయులా?” అని అడిగాను, బహుశా యుక్తిని కోల్పోయి.
“అవును. నేనొక అమెరికన్ లాగా కనిపించటం లేదు కదా. సంపూర్ణంగా ఇంగ్లిష్ వాణ్నే” అన్నాడు.
 తాను చెప్పిన విషయాన్ని నిరూపించడం కోసం కెలాడా తన జేబులోంచి పాస్ పోర్టును తీసి, నా ముఖం దగ్గరికి తెచ్చి, ఉల్లాసంగా ఊపాడు దాన్ని.
 కెలాడా పొట్టిగా, లావుగా ఉంటాడు. అతడు ఇంగ్లిష్ లో మాట్లాడాడు కాని, ఆ మాట్లాడ్డంలో  ఇంగ్లీషుతనమేదీ కనిపించలేదు. 
“ఏం తీసుకుంటారు?” అని అడిగాడు.
అతని వైపు అనుమానంగా చూశాను. మద్యనిషేధం అమలులో వున్న రోజులు అవి. ఓడ వాలకం చూస్తే అక్కడ ఒక్క మద్యపు చుక్క కూడా దొరకదనిపించే విధంగా ఉంది. దాహంగా లేనప్పుడు నేను ఏ డ్రింకును కోరుకోనో కచ్చితంగా చెప్పలేను. కెలాడా  తూర్పు దేశాల తాలూకు ఒక నవ్వును నా వైపు విసిరాడు. 
“విస్కీతో సోడా, డ్రై మార్టినీ - ఈ రెండే వున్నాయి. ఏది కావాలో చెప్పాలి మీరు” అన్నాడు. తన రెండు ప్యాంటు జేబుల్లోంచి రెండు సీసాలను తీసి, వాటిని టేబులు మీద పెట్టాడు. మార్టిని కావాలన్నాను నేను. అతడు ఓడ సిబ్బందిలోని ఒకణ్ని పిలిచి, ఓ రెండు గ్లాసులనూ, కొన్ని ఐసు ముక్కల్నీ తీసుకురమ్మని చెప్పాడు. 
“చాలా మంచి కాక్ టెయిల్” అన్నాను.
“ఇవి దొరికిన చోట ఇంకా చాలా రకాల మద్యం సీసాలున్నాయి. ఓడలో మీ స్నేహితులెవరైనా వుంటే, ప్రపంచంలోని మద్యాన్నంతా తెచ్చిపెట్ట గలిగే మిత్రుడొకడు మీకు వున్నాడని చెప్పండి”

 

కెలాడా వదరుబోతు లాగా మాట్లాడుతున్నాడు. అతడు న్యూయార్కు గురించీ, సాన్ ఫ్రాన్సిస్కో గురించీ మాట్లాడాడు. ఆటలనూ, సినిమాలనూ, రాజకీయాలనూ చర్చించాడు. అతనికి దేశభక్తి బాగా వుందని నాకు అర్థమైంది. ఇంగ్లండ్ దేశపు జెండా పవిత్రమైనదే కాని, ఇతర దేశస్థులెవరైనా దాని గురించి మాట్లాడితే అది కొంచెం అవమానకరంగా ఉంటుందని నా అభిప్రాయం. మిస్టర్ కెలాడాతో నాక్కొంచెం పరిచయమేర్పడిన మాట వాస్తవమే కాని, అంతకు ముందు నాకు బాగా తెలియనివాడు నా పేరును పలుకుతున్నప్పుడు దాని ముందు మిస్టర్ అనే పదాన్ని పెడితేనే బాగుంటుందని అనుకున్నాను. నాకు బెరుకు లేకుండా చేయటం కోసం కెలాడా అటువంటి మర్యాదను పాటించలేదేమో. అయినా కెలాడా పట్ల నాకెంత మాత్రం సదభిప్రాయం కలుగలేదు. అతడు క్యాబిన్ లోకి రాగానే పేకముక్కల్ని పక్కన పడేశాను కాని, కెలాడా నిరంతరంగా మాట్లాడటం గమనించి, నా ఆటను మళ్లీ కొనసాగించాను. నేను ఆడుకుంటుంటే “ఫలానా ముక్కను తీసుకోండి” అంటూ పదేపదే అతడు నాకు సూచనలివ్వడం చిరాకును తెప్పించింది. కోపంతో, అసహ్యంతో నా హృదయం సహనాన్ని కోల్పోవటంతో ఆటను మూసేశాను. అతడు ఆ కార్డుముక్కల్ని చేతిలోకి తీసుకుని, “మీకు పేకముక్కలతో చేసే ట్రిక్కులు ఇష్టమేనా?” అని అడిగాడు.
 

“ఉహుఁ, అవంటే నాకసహ్యం” అన్నాను.
“ఒక్కటే చూపిస్తాను మీకు”
మూడు ట్రిక్కుల్ని చూపించాడు. సీటు దొరికించుకోవడం కోసం కింద వున్న డైనింగ్ రూములోకి పోతానని అన్నాను అతనితో. 
“సరే, కాని మీకోసం నేను ముందే ఒక సీటును రిజర్వు చేశాను. మనమిద్దరం కలిసి ప్రయాణిస్తున్నాం కనుక, ఒకే టేబులు మీద తింటే బాగుంటుందని అనిపించింది” 

 

కెలాడా పట్ల నాకెంత మాత్రం ఇష్టం కలుగలేదు. అతని తీరు వల్ల నేను ఓడలో ఏకాంతంగా తిరగలేకపోయాను. అతణ్ని నిరాకరించలేక పోయాను. అతడు మన సొంత యింట్లోకి వచ్చి ఇట్లా ప్రవర్తిస్తే, బహుశా మెట్లమీంచి తోసేసి తలుపు పెట్టుకుంటాము. మంచి కలుపుగోలు మనిషి కావటం చేత, మూడు రోజుల్లోనే అతడు ఓడలోని అందరితో పరిచయం చేసుకున్నాడు. ఓడలో జరిగే ఆటలు, పాటకచేరీలు మొదలైన అన్ని వ్యవహారాల్లో పాలు పంచుకున్నాడు. మేమంతా అతనికి ‘సర్వజ్ఞుడు’ అని పేరు పెట్టి, అలానే పిలిచాము. కాని, దాన్ని అభినందనగా తీసుకున్నాడతడు. భోజనాల దగ్గర మరీ భరించరాని వాడయ్యాడు. అతనికి ఓడలోని ప్రతి విషయం గురించి ఇతరులకన్నా ఎక్కువగా తెలుసు. ఈ విషయంలో ఎవరైనా విభేదిస్తే దాన్ని పొగరుగా భావిస్తాడు. ప్రతి విషయం గురించీ ధారాళంగా మాట్లాడి, తన ఆలోచనా విధానంలోకి మనను తేవడానికి ప్రయత్నిస్తాడు. తన అభిప్రాయం తప్పు అయ్యే అవకాశం ఉందని అతనికెప్పుడూ అనిపించదు. మేము ఒక డాక్టరుగారి టేబులు దగ్గర కూచున్నాం. ఆ డాక్టరు ఎక్కువగా మాట్లాడే ఓపిక లేని సోమరి. నేనేమో మొండిగా అతణ్ని పట్టించుకోకుండా కూచున్నాను. రామ్సే అనే ఒక్క వ్యక్తి మాత్రం మాకు భిన్నంగా కనిపించాడు. కెలాడాతో సమానంగా మొండిగా వుండి, మాటలతో అతణ్ని గట్టిగా ఎదుర్కుంటున్నాడు. వాళ్లిద్దరి మధ్య ఎడతెగని విద్వేషపూరితమైన చర్చలు జరిగాయి. 
 

కోబే పట్టణం లోని అమెరికన్ కాన్స్యులేట్ లో పని చేస్తున్నాడు రామ్సే. అతడు న్యూయార్కుకు వెళ్లి, ఒక సంవత్సరం నుండి అక్కడ ఒంటరిగా వుంటున్న తన భార్యను తీసుకుని, తిరిగి కోబేకు పోతున్నాడు. ఆమె చాలా అందంగా ఉండటమే కాక, అందరితో మర్యాదగా ప్రవర్తిస్తోంది. ఆమెలో వినయం కూడా కనిపించింది.
 

ఒక సాయంత్రం భోజనాల దగ్గర చర్చ ముత్యాల మీదికి మళ్లింది. జపాను వారు నకిలీ ముత్యాలను తయారు చేయడం వల్ల, అసలైన ముత్యాల ధరను తగ్గించక తప్పింది కాదని డాక్టరు ఒక వ్యాఖ్య చేసాడు. తన అలవాటు ప్రకారం కెలాడా వెంటనే చర్చలోకి దూరాడు. అతడు మా అందరినీ ఉద్దేశించి ముత్యాల గురించి పెద్ద ప్రసంగం చేశాడు. రామ్సేకు ముత్యాల గురించి పెద్దగా తెలుసునని నేనుకోను. కాని అదే అవకాశమనుకుని, అతడు రెచ్చిపోయి వాదించాడు. ఐదు నిమిషాల్లో పెద్ద రగడ ఏర్పడింది. కెలాడా ముందరికన్న యెక్కువగా విజృంభించి, తన తీవ్రమైన వాదనను వినిపించాడు. ఆఖరుకు రామ్సే మాట్లాడిన ఒక వాక్యంతో ఉగ్రుడై, బల్ల మీద చేత్తో గట్టిగా గుద్ది ఇలా అన్నాడు: “నేనేం మాట్లాడుతున్నానో నాకు బాగా తెలుసు. ఈ ముత్యాల వ్యాపారం పని మీదనే జపానుకు వెళ్తున్నాను. ముత్యాల గురించి నేను చెప్పేది ఏదీ తప్పు కాదనే విషయాన్ని ఈ వ్యాపారంలో వున్న ప్రతివాడూ ఒప్పుకుంటాడనేది నిజం. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల ముత్యాల గురించి నాకు బాగా తెలుసు. ఒకవేళ తెలియనిదేమైనా వుంటే అది తెలుసుకో తగింది కాదు, అంతే”. తర్వాత కెలాడా విజయగర్వంతో చుట్టూ చూసి, “ముత్యాలకు సంబంధించినంత వరకు వాటి విషయంలో నేను నిపుణున్ని” అన్నాడు.
 

“ఒంటి కంటితో చూసి ముత్యాల నాణ్యతను గుర్తించగలిగే నా వంటి ప్రవీణుడు మరొకడు లేడు” అని, రామ్సే భార్య ధరించిన ముత్యాల హారం వైపు వేలును చూపిస్తూ, “మిసెస్ రామ్సే, మీరు మెడలో వేసుకున్న ఆ ముత్యాల హారం చాలా విలువైనది” అన్నాడు. ఆమె కొంచెం అణకువను కనబరుస్తూ ఆ హారాన్ని తన డ్రెస్సు లోపలికి తోసింది. రామ్సే కొంచెం ముందుకు వంగి, మెరిసే కళ్లతో అందరి వైపు ఒక చూపును విసిరి, “ఆ హారం ముద్దొచ్చే విధంగా ఉంది కదా” అన్నాడు. 
 

“నేను దాన్ని వెంటనే గుర్తించాను. అవి నిజమైన ముత్యాలు అని మనసులోనే అనుకున్నాను” అన్నాడు కెలాడా.
“ఆ హారాన్ని నేను కొనలేదు. మీ బేరీజు ప్రకారం దాని విలువ ఎంత వుంటుందో తెలుసుకోవాలని ఉంది” అన్నది మిసెస్ రామ్సే.
“మామూలు దుకాణాల్లో అయితే పదిహేను వేల డాలర్లకు కొంచెం అటుయిటుగా వుండొచ్చు. కాని అధునాతనమైన పెద్ద దుకాణంలో అయితే  ముప్ఫై వేల డాలర్ల దాకా ఉంటుంది” 

 

రామ్సే చిన్నగా నవ్వాడు.
“రెండుమూడు రోజుల క్రితమే నా భార్య దాన్ని ఒక సూపర్ మార్కెట్లో పద్దెనిమిది డాలర్లకు కొన్నది. ఈ సంగతి మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు” 
మిస్టర్ కెలాడా తడబాటుతో, “శుద్ధ అబద్ధం. అది నిజమైందే కాక, అంత మంచి సైజులో ఉన్న ముత్యాలను నేనింత వరకు చూడలేదు” అన్నాడు. 

 

“పందెం కడతారా? అది నకిలీ ముత్యాల హారమని నేను వంద డాలర్ల పందెం కాస్తాను” అన్నాడు రామ్సే.
“ఓ. కే., పందెం” అన్నాడు కెలాడా.
“అది వాస్తవమైనప్పుడు పందెం కట్టే అవసరమే లేదు” అన్నది రామ్సే భార్య.
ఆమె పెదవుల మీద చిన్న నవ్వు నెలకొంది. కంఠస్వరం వారించే విధంగా ఉన్నది. 
“పందెం కాయవద్దా? సులభంగా డబ్బును సంపాదించే అవకాశం వచ్చినప్పుడు దాన్ని పోగొట్టుకోవడం మూర్ఖత్వమే” అన్నాడు రామ్సే.
“కాని ఎలా రుజువు చేస్తాం?  కెలాడా అన్నదానికి  నేను కేవలం వ్యతిరేకంగా మాట్లాడుతున్నానంతే”
“నేను దాన్ని పరీక్షగా చూడాలి. ఒకవేళ అది నకిలీదైతే వెంటనే చెప్పేస్తాను. వంద డాలర్లను పోగొట్టుకోవడం నాకు పెద్ద సమస్యేమీ కాదు” 
“డార్లింగ్, తీసివ్వు. దాన్ని ఆయన ఎంతసేపైనా పరీక్షించుకోనీ”
మిసెస్ రామ్సే ఒక్క క్షణం సేపు తటపటాయించింది. ఆమె ఆ హారం మీద చేయిని పెట్టి, నొక్కి పట్టుకుంది.

 

“దాన్ని తీయలేను. మిస్టర్ కెలాడా నా మాటను నమ్మాలి, అంతే” 
ఏదో దురదృష్టకరమైన సంఘటన జరగబోతున్నదని అకస్మాత్తుగా అనిపించింది నాకు. కాని సరిగ్గా ఏమీ అనలేకపోయాను.
రామ్సే ఒక్క ఉదుటున ఎగిరి, “నేను తీస్తాను” అన్నాడు.

 

ఆ హారాన్ని తీసి యిచ్చాడు. ముత్యాల నిపుణుడైన కెలాడా తన జేబులోంచి ఒక భూతద్దాన్ని తీసి, దాని సహాయంతో ఆ హారాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. అతని నున్నని, నల్లని ముఖం మీద గెలుపు తాలూకు నవ్వు మెరిసింది. దాన్ని తిరిగి యిస్తూ ఏదో మాట్లాడబోయాడు. అకస్మాత్తుగా అతడు రామ్సే భార్య ముఖాన్ని చూశాడు. ఆమె ముఖం యెంతగా పాలిపోయిందంటే, స్పృహ తప్పి పడిపోతుందా అనిపించిందతనికి. కెలాడా వైపు భయం నిండిన కళ్లతో చూసింది ఆమె. ఆ కళ్లలో నిరాశతో కూడిన ఒక వేడికోలు వున్నట్టు స్పష్టంగా కనపడుతున్నా రామ్సే దాన్ని యెందుకు గమనించడం లేదని ఆశ్చర్యపోయాను నేను. 
 

కెలాడా నోరు తెరిచి ఆగిపోయాడు. అతని ముఖం మీద బాగా చెమట ఏర్పడింది. తనను తాను సంబాళించుకోవడానికి యెంతగా యాతన పడ్డాడో స్పష్టంగా తెలిసింది.
 

“అవును, నేనే పొరపాటు పడ్డాను. గుర్తించలేనంత బాగా అనుకరించి ఈ ముత్యాలను తయారు చేశారు. భూతద్దంలోంచి చూడగానే అది నకిలీదని అర్థమైంది. దాని విలువ నిజంగానే పద్దెనిమిది డాలర్లే అయివుంటుంది” అన్నాడు కెలాడా. జేబులోంచి పర్సు తీసి, ఏం మాట్లాడకుండా అందులోంచి ఒక వందడాలర్ల నోటును తీసిచ్చాడు రామ్సేకు.
 

దాన్ని తీసుకుంటూ, “ఇకముందు మళ్లీ యిలా అతినమ్మకంతో ప్రవర్తించవద్దని తెలుసుకుని వుంటావు” అన్నాడు రామ్సే.
కెలాడా చేతులు వణుకుతుండటం గమనించాను నేను.

 

ఈ కథ ఓడ అంతటికీ పాకిపోయింది. ఆ సాయంత్రం అందరూ అతణ్ని ఆటపట్టిస్తుంటే అదంతా భరించాల్సి వచ్చింది కెలాడాకు. అతను అలా పట్టుబడటం నిజంగా ఒక జోకే. తలనొప్పిగా వుందంటూ రామ్సే తన గదికి వెళ్లిపోయాడు.
 

మరునాడు ఉదయం నేను నిద్ర లేచి, షేవింగ్ చేసుకుంటున్నాను. కెలాడా మంచం మీద వెల్లకిలా పడుకుని సిగరెట్ తాగుతున్నాడు. అకస్మాత్తుగా తలుపు దగ్గర బర్ మని చిన్న శబ్దం వినపడింది. అటు చూస్తే తలుపు కింద నుండి ఒక కవరును గదిలోపలికి తోస్తున్నారెవరో. తలుపు తెరిచి చూశాను. అక్కడెవరూ లేరు. ఆ కవర్ను అందుకుని చూస్తే, అది కెలాడాకు రాయబడినట్టుగా దాని మీద అతని పేరు నల్ల అక్షరాల్లో వుంది. దాన్ని కెలాడాకు యిచ్చాను.
 

“ఎవరి దగ్గర్నుంచి యిది?” అంటూ దాన్ని తెరిచాడాయన. తర్వాత “ఓ” అన్నాడు.
కవర్లోని ఉత్తరాన్ని కాక, అందులోని వందడాలర్ల నోటును తీసుకున్నాడు. ఎర్రబడిన ముఖంతో నా వైపు చూశాడు. కవర్ను చిన్నచిన్న ముక్కలుగా చించి నాకు యిచ్చాడు. 

 

“వీటిని కిటికీలోంచి బయటకు పారేస్తారా” అన్నాడు. 
వాటిని పారేసి, నవ్వుముఖంతో అతనివైపు చూశాను.
“బుద్ధి లేనివాడిగా కనిపించడం యెవరికైనా బాధగానే వుంటుంది” అన్నాడతడు.
“ఆ ముత్యాలు అచ్చమైనవేనా?”
“నాకొక అందమైన భార్య వుంటే, ఆమెను ఒక సంవత్సరం పాటు న్యూయార్కులో వుంచి నేను కోబేలో ఉండటం మంచిపని కాదు” అన్నాడు.
అప్పుడు కెలాడా పట్ల నాకెంత మాత్రం అయిష్టం కలుగలేదు. అతడు ఆ వందడాలర్ల నోటును జాగ్రత్తగా తన పర్సులో పెట్టుకున్నాడు.

***
 

ఎలనాగ

ఎలనాగ

ఎలగందుల గ్రామానికి చెందిన డా. నాగరాజు సురేంద్ర గారి కలం పేరు ఎలనాగ. వృత్తిరీత్యా చిన్నపిల్లల డాక్టరు. నైజీరియాలో, తర్వాత ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో పని చేసి, 2012 లో రాష్ట్రస్థాయి అధికారిగా పదవీ విరమణ. ప్రస్తుత వ్యాపకం సాహిత్య రచన. ఇప్పటి వరకు 14 పుస్తకాలను వెలువరించారు. అందులో 9 కవిత్వానికి సంబంధించినవి. అనువాద కవిత్వం, ఛందోబద్ధమైన పద్యాలు, ప్రయోగ పద్యాలు, గేయాలు   ప్రత్యేకంగా ప్రచురించారు.  మూడు పుస్తకాలు అనువాద కథలవి. భాష గురించిన చిన్న పుస్తకమొకటి వ్రాశారు. వట్టికోట ఆళ్వారు స్వామి రాసిన ‘జైలు లోపల’ కథలసంపుటిని Inside the Prison శీర్షికతో ఆంగ్లం లోనికి అనువదించారు. మరికొన్ని పుస్తకాలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి.

ఎలనాగ  : ఇందిరా దుర్వాసుల గారూ,శేషగిరి రావు గారూ,నేను అనువదించిన సోమర్సెట్ మామ్ కథ మీకు నచ్చినందుకు సంతోషం, కృతజ్ఞతలు.

bottom of page