top of page

సంపుటి 1 సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

అధ్యాత్మిక వాణి

భగవత్ తత్త్వము

ప్రొ॥ డా॥కె.వి.ఎస్. జ్ఞానేశ్వర రావు

మానవుడు-ప్రపంచం-ఈశ్వరుడు. ఈ మూడింటి మధ్య సంబంధం ఏమిటి? జీవులన్నింటిలో విశిష్టుడైన మానవుని ఆవిర్భావం ఎలా జరిగింది?

ఈ ప్రశ్నకి ఆధ్యాత్మిక గ్రంథాలు ఒక రకంగా, విజ్ఞానశాస్త్రం మరోరకంగా ఊహించి చెపుతాయి. పంచభూతాత్మకమైన (పృథివ్యావస్తేజోవాయురాకాశాలు) దశేంద్రియాలద్వారా (శబ్దస్పర్శరూపరసగంధములనే పంచ జ్ఞానేంద్రియాలు, కరచరణవాక్ పాయూపస్థలనే పంచ కర్మేంద్రియాలు) అంతఃకరణం (మనోబుద్ధి చిత్తాహంకారములు) చుట్టూ ఆవరించిన లోకం గురించి మానవునకు అనుభూతి, తద్వారా అవగాహన కలుగుతాయి. మరొక్క ఇంద్రియం వుంటే మరింత అవగాహన కలిగే అవకాశం వుంది. విజ్ఞానశాస్త్రం ప్రకారం కంటికి కనిపించని వెలుగు(విద్యుదయస్కాంత వర్ణపటం), చెవికి వినిపించనిశబ్దాల (పరశ్రవ్య ధ్వనులు, అతిధ్వనులు) ఉనికినికూడా నిరూపించారు కదా? ఒకప్పుడు మంత్రంతో సాధించేది ఇప్పుడు యంత్రం ద్వారా తంత్రంతో సాధిస్తున్నారుకదా? ఇంతేనా? ఇంతకంటే మన ఊహకీ, అనుభూతికీ అందనిది ఏదైనావుందా? ఉంటే అది ఎటువంటిది? అనే జిజ్ఞాస బయలుదేరటం సహజం.

అవాఙ్మానసగోచరమైన ఆ వస్తువు “ఏకం”(ఒకటి)ని తెలిసేదెలా? “తత్” (అది) ఏమైవుంటుంది?

ప్రాచీన ఋషులు తపస్సాధనతో ‘దానిని’ అనుభవైకవేద్యంగా కనుగొన్నారు. ‘యత్రవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ’ (వాక్కు ఎక్కడివరకూపోయి నిర్వచించలేక వెనుదిరిగివస్తుందో, దేనిని మనసుతో ఊహించ శక్యం కాదో) సకలమునకు మూలమైన “అది” (తత్). దానికి ఆరు కల్యాణ గుణాలు (ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యం) కలవని ఆర్షవాక్యం. పురాణాల్లో ‘భగవంతుడు’ అనీ, వేదం లో “పరబ్రహ్మము” అని పిలవబడేది ‘అదే’. ‘అది’ స్త్రీపురుషనపుంసక లింగాలకు భిన్నం. ‘ఓమ్’-‘తత్’-‘సత్’ శబ్దవాచ్యుడు, సర్వాంతర్యామి, నిరుపమ, నిర్గుణ, నిత్య, కేవల, సర్వజ్ఞ, సర్వశక్తిమంత, విశ్వాత్ముడు ‘బ్రహ్మము’.

‘విద్’-ఎరుక; ‘వేదము’-తెలియబడునది-జ్ఞానము. ‘అనంతా వై వేదాః’- అనంత వేదరాశి వ్యాసునిచే విభజించబడి ఋగ్యజుస్సామాథర్వ వేదాలుగా వెలిసింది. వాటియందు ప్రవచించబడిన నాలుగు మహావాక్యాల్లో నిక్షిప్తమైనది ‘అదే’.

ఋగ్వేదంలో ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ - లోకాలన్నింట దొరికే జ్ఞానాన్ని ముద్దచేస్తే అదే ‘బ్రహ్మము’.

యజుర్వేదంలో ‘అహమ్ బ్రహ్మాస్మి’ - నేను బ్రహ్మమునైతిని. సాధకుడు, బ్రహ్మము ఒక్కటే ఐనట్టి ‘కేవల’స్థితి; అంతే కాని ‘నేను బ్రహ్మమును తెలుసుకున్నాను’ అని ఎవడైనా అంటే ఆ మాట వట్టి బూటకం.

సామవేదంలో ‘తత్ త్వమ్ అసి’ - ‘అది’ నీవే అయి ఉన్నావు. ఆదిశంకరుల మాటలో ‘ఏకమేవ-అద్వితీయం బ్రహ్మ’ (బ్రహ్మమొక్కటే - దానికి రెండవది లేదు). ఇంకా వివరించాలంటే ‘ఎందెందు వెదకి చూచిన అందందే గల’ ఏకైక పదార్థం. ‘సత్’

 

వాచ్యమైనది - అనగా త్రికాల అబాధితమైనది. నిత్యమై ఉండేది. ‘చిత్’ – చైతన్యం - జ్ఞానము. ఆనందము - ప్రహర్షము (ఆనందో బ్రహ్మ) - సచ్చిదానందము. (సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ). ‘ఏకం సత్ - విప్రాః బహుథా వదంతి’ – కేవలం ఒకే ఒక్కటిగా వుండే సత్యాన్ని విద్వాంసులు ఎన్నో విధాలుగా ఊహించి చెపుతారు -ఆరుగురు గ్రుడ్డివాళ్ళ కథలో ఏనుగు స్వరూపాన్ని ఎవడూ సరిగా గుర్తించని విధంగా.

అథర్వ వేదంలో ‘అయ‌మ్ ఆత్మా బ్రహ్మ’ - ఈ దేహం‌లో నిర్వాత దీపం‌లా వెలుగుతున్న ఆత్మయే బ్రహ్మము. కాంతి జ్ఞానానికి చిహ్నం.

శంకరులు ‘వేదాంత డిండిమము’లో చెప్పినట్లు ’బ్రహ్మ సత్యం - జగన్మిధ్య - జీవో బ్రహ్మైవ నా పరః’ - బ్రహ్మమొక్కటే సత్యము, కలలో కనిపించే విధంగా దృశ్యమానమైన ఈ జగత్తు మిథ్య. మరి ‘రజ్జుసర్పభ్రాంతి’ గా (మసక చీకటిలో త్రాడుని పాము అని భ్రమసినట్లుగా) గోచరించే దీనిని కనిపెట్టటం ఎలా? మనం చూసేది, వినేది, అనుభవించేది నిజంగా నిజమేనా? లేక ఇదంతా ఇంద్రజాలం వంటి ఒక గారడీ - ఒక మహా మాయ - అయివుంటుందా? దీనికి ప్రమాణం ఏమిటి?

ఏ విషయమైనా నిర్థారించటానికి తార్కికంగా మూడు పద్ధతులున్నాయి - ప్రత్యక్షం, అనుమానం, ఆప్తవాక్యం అని.

ఇంద్రియానుభవం‌తో తెలుసుకునేది అందులో మొదటిది: దూరంగా పొగ లేచింది. కాని, నిప్పులేనిదే పొగ రాదుకదా? అంటే అక్కడ ఎవడో నిప్పు రాజేస్తున్నాడని అర్థం! అంటే తెలిసినదానిని బట్టి తెలియనిది తార్కికంగా ఊహించటం - ఇది రెండోది. అనుభవసారంగా పెద్దలు చెప్పిన సుద్దులు నమ్మటం మూడోది. నువ్వు విశాఖపట్నం పోలేదు. కాని ఆ నగరాన్ని చూసి వచ్చినవాడు చెపితే నమ్మాలికదా?

మనకి ఋషివాక్యం ప్రమాణం. భగవంతుని శక్తియే మహామాయ. అదే మూల ప్రకృతి. దానితోటే లోకాలన్నీ, విశ్వమూ నిర్మితమైనాయి. ఈ ’మాయ’ గనుక మాయమైతే లోకాలన్నీ మాయమై కేవలం ‘సత్’ పదార్థం మిగులుతుంది. అదే ‘బ్రహ్మము’ - అని మన మూలపురుషులు ఋషులు చెప్పారు. కనుక నమ్మాలి. నమ్మి తీరాలి.

లోకాలన్నీ ‘దేశం, కాలం, కార్యకారణ సంబంధం’ అనే మూడింటితో ముడివడి ఉంటాయి. మానవుడు సంచితం (కూడబెట్టినది), ప్రారభ్దం (ఆరంభించబడినది), ఆగామి (రాబోవు కాలములో అనుభవం‌లోకి వచ్చేది) కర్మల పరిపాకం వలన ‘జననమరణ చక్రం‌’ లో పడి తిరుగుతూ వుంటాడు. దీనినే “సంసారం” అంటారు. ఈ చక్రభ్రమణం నుండి తప్పించుకోవటమే ‘ముక్తి’ (కైవల్యం,మోక్షం). అదే జీవన పరమార్థం.

ఇక భగవంతుని గురించి మూడు రకాల భావనలు - నమ్మేవాళ్ళు, నమ్మనివాళ్ళు, సంశయగ్రస్తులు. ఇందులో మళ్ళీ ఆస్తికులు, నాస్తికులు అని రెండు తెగలు. వేదాన్ని ప్రమాణంగా స్వీకరించి ధర్మపరులై, పునర్జన్మ సిద్దాంతాన్ని నమ్మి, దేవునిపై విశ్వాసం కలిగి, ఆ క్రమంలో మూడింటిని నమ్మేవారు మాత్రమే ఆస్తికులు. బౌద్ధం‌లాంటి మతాల్లో వేదాన్ని, దైవాన్ని నమ్మరు. కాని పునర్జన్మని నమ్ముతారు. మరికొన్ని మతాల్లో దైవం ఉంటుంది - పునర్జన్మ ఉండదు, వేదప్రమాణాన్ని అంగీకరించరు... ఇట్టి తెగలన్నీ నాస్తికులు.

 

మతం అంటే విశ్వాసం, నమ్మకం, అభిప్రాయం, ఆచరణ. ఇక ఆస్తికుల్లో 98 శాతం ద్వైత మతస్థులు - జీవుడు, పరమాత్మ వేర్వేరని తలచేవారు. మిగిలిన రెంటిలో అద్వైతం - సాధకునందలి జీవుడు బ్రహ్మం‌తో అభేదంగా ఐక్యం కావటం... జ్ణానము, జ్ఞేయము, జ్ఞాత ఒక్కటే కావటం. విశిష్టాద్వైతం - సాలోక్యం, సామీప్యం, సారూప్యం వరకు అంగీకరించటం. వీటికి సాయుజ్యం తోడైతే పరిపూర్ణమైన అద్వైతంగా భాసిల్లుతుంది. [పుర్రెకొక బుద్ధి - జిహ్వకొక రుచి; లోకో భిన్న రుచిః, భిన్న రుచిర్హి లోకః;]

‘ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు భంగి’ - పరమాత్మే జీవునిగా, జీవుడే పరమాత్మగా భాసిస్తారు. వారిద్దరికీ అభేదాన్ని ఢంకా బజాయించి చెప్తుంది “వేదాంత డిండిమము* “ . మోక్షసాధనకి దారులు మూడు –కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు. దానికి మెట్లు ప్రస్థానత్రయమైన ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు.

ఒక సూక్తి ప్రకారం: ‘ఇక్కడ లేనిది ఏక్కడా లేదు. ఇప్పుడు రానిది (మోక్షం) ఎప్పుడూ రాదు’. అందువల్ల ముక్తి కంఠహారం లాంటిది. నువ్వు గుర్తించగలిగితే అది నీ మెడలోనే వుంది! ‘నీవు నిత్య ముక్తుడవు. అమరుడవు’. బంధ మోక్షాల భావనయే మాయ!!!

 

*****

ప్రొ॥ డా॥కె.వి.ఎస్. జ్ఞానేశ్వర రావు

ప్రొ॥ డా॥కె.వి.ఎస్. జ్ఞానేశ్వర రావు

విజయనగరంలో జన్మించిన(1944) శ్రీ జ్ఞానేశ్వర రావు గారు అక్కడే పట్టభద్రులై, విశాఖపట్నంలో భౌతిక శాస్త్రంలో డాక్టరేట్  పూర్తి చేశారు. స్థానిక మిసెస్.ఏ.వి.ఎన్.కళాశాల, గీతం ఇంజనీరింగ్ కాలేజ్, బాగ్దాదు-ఇరాక్-లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా, ఉత్తర ప్రదేశ్, కర్నాటకలలో వివిద ఇంజనీరింగ్ కాలేజీలలో మధ్యంతర డైరెక్టరు, డీన్ పదవులు కూడా నిర్వర్తించి ఉద్యోగవిరమణ చేశారు. పుణ్యపురుషుల చరితములు (2), ఆధ్యాత్మిక గ్రంథానువాదాలు (2) పాఠ్యగ్రంథాలు(3), పాప్యులర్ సైన్స్ గ్రంథానువాదాలు(5)ఒక  నవల, 60 కథానికలు, 60 సై‌న్స్ వ్యాసాలు రచించారు. 2010లో “కథాపీఠం" పురస్కారం అందుకున్నారు. 8 భాషలతో ప్రావీణ్యం  వుంది.

bottom of page