MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
క్రింది పేజీలు
ప్రస్తుత తాజా సంచికలో
లభ్యమవుతాయి
శాయి రాచకొండ
పుస్తక పరిచయం
పుస్తక పరిచయాలు
కథ 2014
వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ గార్ల సంపాదకత్వంలో సెప్టెంబరు 2015 లో వెలువడిన కథల సంపుటి.
సంక్రాంతి సంచిక 2016
ఇండియా వెళ్ళినప్పుడల్లా, విశాలాంధ్ర బుక్ డిపోకి వెళ్ళి మంచి తెలుగు పుస్తకాలకోసం వెతకడం, పిల్లల పుస్తక్లాలో, పెద్దల పుస్తకాలో కొని తెచ్చుకోవడం, అలవాటైపోయింది. మొన్నీమధ్య నవంబరులో వెళ్ళినప్పుడు కూడా గుంటూరులో విశాలాంధ్రకి వెళ్ళి అదే పని చేశాను. ఈ సారి నాకు దొరికిన ఒక మంచి పుస్తకం, 'కథ 2014', వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ గార్ల సంపాదకత్వంలో సెప్టెంబరు 2015 లో వెలువడిన కథల సంపుటి.
ఇది కథా సాహితి వారి 25వ సంకలనం. 1999 నించి నిరాఘాతంగా ఇరవై అయిదు సంవత్సరాల పాటు ఆ యా ఏడాది వచ్చిన వందల కథల్లోంచి నాణ్యమైనవి ఎంపిక చేసి సంపుటాలుగా ప్రచురించడం అంత సులభమైన పని కాదు. నవీన్ గారు కథలని గురించి ముందు మాట రాస్తూ "వ్యవస్థని సమూలంగా మార్చి, నూతన సమాజాన్ని ఆవిష్కరించే ఆశయంతో సాగుతున్న ఉద్యమాల ఊపు తగ్గింది…..జీవనపోరాటంలో ఎన్నో సమస్యలకు వ్యక్తిగతకోణం నుంచే పరిష్కారాలు వెతికే ప్రయత్నం చేస్తోంది ఈ తరం. అదే కథల్లోకి తర్జుమా అవుతోంది." అన్నారు.
సంకలనంలోని కథలని చదువుతుంటే, ఆ మాటల్లోని నిజం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అంతే కాదు, శివశంకర్ గారి దృష్టిలో రచయితలూ సాహసయాత్రికులే, గొప్ప రచయితలంతా గొప్ప అన్వేషకులే. అవును. ఆ అన్వేషణా, సాహసం లేకపోతే, సాహిత్యానికి అందవలసిన లోతు, సమ సమాజంలో ఉండే లోటుపాట్లని ఎత్తి చూపించే నేర్పూ, పాఠకుడిని చదివించగిలిగే ఊపు ఎక్కడనించి వస్తాయి మరి? ఈ పుస్తకంలోని కథల్లో పాఠకుడికి ఈ సాహసం, అన్వేషణ, తప్పకుండా కనిపిస్తాయి రకరకాల స్థాయిలలో.
ఈ సంపుటిలో కూడా మంచి కథలని అందించడానికి చేసిన కృషికి నవీన్ గారు, శివశంకర్ గారు అత్యంత అభినందనీయులు.
ఇందులో వైవిధ్య నేపధ్యం ఉన్న రచయితలు రాసిన పధ్నాలుగు కథలున్నాయి. ఈ కథలు రాసిన వారు, రమాసుందరి బత్తుల, పాలగిరి విశ్వప్రసాద్, భగవంతం, పి.వి. సునీల్ కుమార్, తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి, అద్దేపల్లి ప్రభు, మధురాంతకం నరేంద్ర, కొట్టం రామక్రిష్ణారెడ్డి, రాధిక, యాజి, స. వెం. రమేశ్, కల్పనా రెంటాల, సాయి బ్రహ్మానందం గొర్తి, మరియు విమల.
కథలలో కొత్త ఆలోచనలున్నాయి, చాలా రచయితలు రాయడానికి సాహసించలేని కథా వస్తువులున్నాయి. జీవితాన్ని మరోకోణంలోంచి చూపించే కథలున్నాయి, అదే జీవితాన్ని పాత కోణంలోనే చూస్తూ, కొత్తరకంగా భావింపచేసే కథనం వున్న కథలున్నాయి. స్త్రీ స్వేచ్ఛావాద కథలున్నాయి. నవీన్ గారు, శివశంకర్ గారు కూడా తమ తమ ముందు మాటల్లో ఎంచుకున్న కథల గురించి సూక్ష్మంగా స్పష్టంగా చెప్పారు. అయితే నేను ప్రత్యేకమయిన కథా వస్తువులతో నడిచిన కొన్ని కథలగురించి మాత్రం ప్రస్తావిస్తాను.
ఒకరి కథాంశం హొమో సెక్సువల్ సంబంధాలు అయితే, మరొకరిది అబార్షన్. ఈ రెండు కూడా ఆంధ్ర దేశంలో ఉంటున్న తెలుగు వాళ్ళనో, మిగతా మన దేశస్థులనో వేధిస్తున్న సమస్యలు కావు. ఇవి అమెరికా మొత్తం మీద లిబరల్స్, కంజర్వేటివ్స్ మధ్య కాలుతున్న రావణ కాష్టాలు. మన దేశంలో హోమో సెక్సువల్ సంబంధాలు ఒక సమస్యగా మారలేదు ఇంకా ఎందుకంటే, ప్రభుత్వంతో పాటు సంఘం అసలు సమస్య ఉన్నా ఉన్నట్లు గుర్తించరు కాబట్టి. స్వలింగ ప్రవర్తన సహజ సిద్ధమయిన మానవ ప్రవృత్తిగా పాశ్యాచ్య దేశాలలో శాస్త్రజ్ఞులు ఆమోదించినా మనం ఇంకా అంగీకరించని స్థితిలోనే ఉన్నాం. ఇలాంటి వాతావరణంలో వచ్చిన కథ ‘ది కప్లెట్’ ఒక సాహసమే! అబార్షన్ అదే గర్భస్రావం మన దేశంలో ఒక అవసరంగా అయిపోయింది. రోజుకి ఎన్ని జరుగుతూన్న అవి జనాభా ఎడారిలో ఇంకిపోతుంటాయి. ఎన్ని జరిగినా ఎక్కడ జరిగినా ప్రతిసారి నలిగిపోయేది స్త్రీయే! అది చుట్టుప్రక్కల మనుషుల వత్తిడి అవనీ, సమాజంలో ఉన్న మూఢనమ్మకాలవనీ, పుట్టబొయే బిడ్డ అవకరంతో పుట్టే సంభావ్యత ఎక్కువగా వున్నప్పుడవనీ, ఆ స్త్రీ అక్షరాస్య అవనీ, నిరక్షరాస్య అవనీ, ఆమె ఎంతో మనోక్షోభకు లోనైతే కాని ఒక నిర్ణయానికి రాలేదు. ఒక మనుసులో జరిగే ఈ పోరాటాన్ని, విశ్లేషణను, చాలా నేర్పుగా అందించిన కథ 'ప్రవల్లిక నిర్ణయం'. దీనికి నేపధ్యం అమెరికా. పై రెండు కథకులు కూడా అమెరికాలో నివసిస్తూండడం కూడా ఈ కథలకు ప్రేరణ కావచ్చు.
అదే కోవలోకు చెందిన సమస్య కనీసం మనుషులుగా కూడా గురింపు పొందని లింగాతీత వర్గాలు (ట్రాన్స్ జెండర్లు). కనీసపు మానవ హక్కుల్ని కూడా పొందలేని ఒక తరగతి మనుషులు. మిగతా సమాజం చేసే నవ్వులు, హేళనలు, చులకనా మనకు మహా భారత కాలం నించి వస్తున్న సంప్రదాయం. యుధ్ధంలో శిఖండి ఎదురుగా నిలబడితే, భీష్ముడు అస్త్ర సన్యాసం చేశాడు. అది ఎంతవరకు న్యాయం అని రచయిత్రి గుచ్చి ప్రశ్నించిన కథ 'భీష్మా ..... నాతో పోరాడు’ సమాజానికో సవాల్.
ఇవేకాదు ఎన్నో ఉన్నాయి. పుస్తకంలోని కొన్ని కథలు తప్పకుండా మెదడునీ, గుండెల్నీ తట్టి లేపుతాయి. మరి కొన్ని కథా వస్తువులు పై సంవత్సరాలలో రచయితలు ఇంకా ఎక్కువగా స్వేచ్చా ఇతివృత్తాలను ఎంచుకునేటందుకు తప్పక ప్రేరణనిస్తాయి.
మొత్తం మీద 2014 లో ప్రచురింప బడ్డ కథల్ని సూక్ష్మంగా అనుభవించాలంటే, ఈ పుస్తకం తప్పకుండా చదవాలి. ప్రతీ ఏటా వస్తున్న ఒక్కొక్క సంకలనం ఒక్కొక్క మైలు రాయి. కథా సాహిత్యాన్ని ఎంచగలిగే ఒక్కొక్క సూచకం (ఇండికేటర్). పాతికేళ్ళగా శివశంకర్ గారు, నవీన్ గారు చేస్తున్న ఈ కృషి మరో పాతికేళ్ళు సునాయాసంగా కొనసాగుతూ, తెలుగు కథా సాహిత్యం వెళ్ళే దారిని చూపించగలిగే మరిన్ని వెలుగు దీపికలని అందించగలరని ఆశిస్తాను.
*****