MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
ఆహ్వానిత మధురాలు
చిన్ని మాట
విజయలక్ష్మీ మురళీధర్
"గట్టిగా అనకు నాన్నకి వినిపిస్తుంది," గబగబా వంటింటి దగ్గరకి వచ్చి లోపల పనిలో ఉన్న భార్యతో అన్నాడు ప్రసాద్.
"నేనేదో గయ్యాళినయినట్లు నా నోరు మూస్తారేమిటండీ? నేను ఏమన్నాననీ, మీ నాన్నగారు కూడా నిద్రలేస్తే అందరికీ ఒకేసారి కాఫీలు , పిల్లలకి బోర్నవీటాలూ కలిపేస్తే నాకు సులువవుతుందంటున్నా అంతేగా ?"
కోడలి గొంతుకి ఉలిక్కిపడి లేచి మంచం మీద నిటారుగా కూర్చున్నారు రావుగారు. "ప్లీజ్, నీకంత కష్టమయితే ముందే కలిపేసి ఫ్లాస్క్ లో పోసి ఉంచచ్చు కదా," గొంతుని అణిచి పెడుతూ కొడుకు అవస్థలు పడుతూ ఉంటే జాలేసింది ఆయనకి.
'ఏమండీ లేచారా? ఇదుగో మీ కోసం వేడి వేడిగా ఫిల్టర్ కాఫీ తెచ్చాను, లేవండి. ప్రేమా అదమాయింపుతో కూడిన భార్య పావని మేల్కొలుపు గుర్తొచ్చి దుఃఖం ఉబికి వచ్చింది ఆయనకి.
"పావనీ, ఎక్కడున్నావు, నన్నూ నీతో తీసుకెళ్ళకుండా వెళ్లిపోయావేంటీ?" ఉద్వేగాన్ని ఆపుకోలేక చంటిపిల్లాడిలా రోదించాడాయన.
ఆరునెలల క్రితం భార్య పోయినా, అంత క్రితం రోజే ఆవిడ వదిలేసి వెళ్లిపోయినట్లు ప్రతీ రోజూ కుమిలిపోతున్నారు రావు గారు.
పోనీ ఆత్మహత్య చేసుకుని నేనూ పావని దగ్గరకి వెళ్ళిపోతే ఈ బాధ తప్పుతుంది కదా అని ప్రతీ రోజూ అనుకుంటూనే ఉన్నారు ఆర్నెల్లనించీ.
"నాన్న గారూ లేచారా, ఇదుగో పేపర్" అంటూ సడన్ గా వచ్చిన కొడుకుని చూసి తమాయించుకున్నారు,
"స్వప్నా, తాతగారికి ఈ కాఫీ ఇచ్చి రా" కమల కూతురికి కప్పు అందిస్తూ, ఇంకోమాట కూడా అనేసింది,
"ఈ మధ్య నువ్వు కాలేజ్ నించి లేట్ గా వస్తున్నావు, తిన్నగా ఇంటికి రాకుండా ఎక్కడ తిరుగుతున్నావు ?"
తల్లి ప్రశ్నకి షాక్ అయిన స్వప్న, " ఏమిటమ్మా నీ ఉద్దేశ్యం, నేను ఏదో చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నానంటావా? అంత నమ్మకం లేని దానివి నన్నెందుకు కన్నావు? పోనీ ఇప్పుడైనా నా పీక నులిమెయ్యి , ప్రశాంతంగా బతకచ్చు,"
అలాగే రుసరుసలాడుతూ గదిలోకొచ్చి టక్కున కప్పు పెట్టి వెళ్ళిపోయింది స్వప్న.
"ఈ చాకిరీ ఎవరికోసం చేస్తున్నాననీ, పిల్లలని ఆ మాత్రం మందలించలేనా, ఎందుకీ బతుకూ," కాఫీ కప్పుని వెంటాడి వచ్చిన కోడలి లోని ఆవేదన రావుగారి చెవుల్లో పడింది.
స్తబ్దుగా అయిపోయిన రావుగారు మెల్లిగా లేచి స్నానం కూడా చేసుకుని, తయారయి బయటికి వెళ్ళడానికి చెప్పులేసుకున్నారు.
వెడుతూ వెడుతూ కొడుకు రూం లోకి తొంగి చూసి, తయారయి కూడా ఆఫీసుకి బయలు దేరకుండా కంప్యూటర్ ముందు నొసలు చిట్లించి కూర్చున్నాడేంటా అనుకున్నారు.
"ఖర్మ, అన్నీ నేనే చూసుకోవాలంటే ఈ అసిస్టెంట్ లు ఎందుకూ, ఛా, నాదీ ఒక లైఫేనా, ఫెడ్ అప్," కొడుకు ప్రసాద్ చికాకు పడుతోంటే , ఒక నిముషం పాజ్ ఇచ్చాక నిట్టూరుస్తూ బయలు దేరారు రావు గారు.
పార్క్ లోకి అడుగు పెడుతూ, భార్యని పోగొట్టుకుని ఒంటరితనంతో, పలకరించే దిక్కు లేక నేను కుమిలిపోతోంటే, వీళ్ళ గోల వీళ్ళది.'
పావనీ నేనూ రోజూ వాకింగ్ కి వచ్చేవాళ్ళం, తను లేని జీవితం అవసరమా నాకు.
దిగులుగా అడుగులేస్తున్న ఆయనకి ఎదురుగా బెంచి మీద స్కూల్ బాగ్ తో పాటూ కూర్చున్న పదేళ్ళ మనవడు కనిపించాడు.
నిజం చెప్పొద్దూ, ఆ దృశ్యం కాస్సేపు రావుగారి దుఃఖం నోరు నొక్కేసింది.
"బాబీ! స్కూల్ కి వెడుతున్నా అని చెప్పి ఇక్కడ కూర్చున్నావేంట్రా? "పక్కనే కూర్చున్నారు.
"స్కూల్ కి వెళ్ళడం ఇష్టం లేదు," పట్టుబడ్డానన్న భయం కూడా లేకుండా వాడలా అంటుంటే ఆశ్చర్యం వేసింది.
"ఏం ఎందుకూ?
"హోంవర్క్ చెయ్యలేదు, వెళ్లి తిట్లు తినాల్సిన అవసరం లేదు" కసిగా అన్నాడు.
"ఎందుకనీ?"
"అర్ధం కాని లెసన్స్ గురించి ఎలా రాయనూ, అమ్మా నాన్నాకూడా హెల్ప్ చెయ్యరు, ఎప్పుడూ బిజీ, అక్క ఉంది వేస్ట్, దానికి టైం ఉండదు, అసలు నాకు స్కూల్ ఎందుకూ, టీచర్లతో తిట్లు ఎందుకూ, చచ్చిపోవాలని ఉంది."
చచ్చిపోవాలని ఉంది అన్న మనవడి మాటలు కరెంటు కొట్టినట్లు మనసునీ శరీరాన్నీఊపేశాయి.
ఈ చిట్టి తండ్రికి కూడా చనిపోవాలని ఉందా, వీడి వయసెంతా, అసలేమి చూసాడనీ, ఆర్ద్రతతో నిండిపోయింది హృదయం, ఈ ఆరు నెలల్లో మొదటిసారిగా తన బాధలని పక్కన పెట్టి ఇంకొకరి గురించి ఆలోచించారాయన.
తేరుకున్నాక, "తప్పు నాన్నా అలా మాట్లాడకూడదు, నీకేదైనా హెల్ప్ కావాలంటే నేను ఉన్నాగా! "
నిజంగానా అన్నట్టు మనవడు తనవైపు చూస్తోంటే, మరిన్నాళ్ళూ ఏమయ్యావు అంటూ బోనులో నిల్చోబెట్టి దోషిలా చూస్తున్న భావం కలిగింది.
"ఇకనుంచీ నీ లెసన్స్ అన్నీరోజూ నేనూ ఫాలో అవుతా, బోడి, వాటికి మనం భయపడడం ఏమిటీ, టైం టైం కీ నేర్చేసుకుంటే అన్నీ ఈజీయే"
ఆ తాత ఇచ్చిన ధైర్యానికి పిల్లాడి ముఖంలో వికసించిన చిరునవ్వుకంటే , ఏదో కొత్త మనిషి లా కొత్త ఊపిరి తీసుకుంటూ, కొత్త ఆశల్ని నింపుకుంటూ , జీవించడానికి కొత్త ఎనర్జీ తనలో నిండిన భావం ఆయన్ని పులకింప చేసింది.
"మరైతే రోజూ కాస్సేపు నా వీడియో గేమ్స్ కూడా ఆడుకోనివ్వాలి!"
తన మీద నమ్మకముంచిన మనవడిని, కండిషన్ లు పెడుతున్న మనవడిని గట్టిగా ముద్దు పెట్టుకున్నారాయన.
నేను ఒంటరినా అనుకున్న ఆయన ఒక్కసారిగా లేచి నిల్చుని "పద " అంటూ మనవడి చెయ్యి పట్టుకుని పార్క్ బయటికి అడుగులేసారు.
నేనింకా ఎందుకు బతికి ఉన్నాను, ఎవరి కోసం, పర్పస్ లేని జీవితం ఎందుకు, ఆప్యాయతలూ, పలకరింపులూ లేని జీవితాన్ని కొనసాగించే బదులు నా పావని దగ్గరకి వెడితే పోలా, అనే ఆలోచనల స్థానే
వీళ్ళందరూ నావాళ్ళే , నా పావని వీళ్ళకీ కావలసినదే , ఆమె పోయిన బాధ ఇంట్లో అందరికీ ఉంటుంది. నా కుటుంబం మా కల, ఆ కుటుంబానికి నేనేం చేస్తున్నాననీ, నేనేం సపోర్ట్ గా ఉన్నాననీ, ఇంత వయసు వచ్చీ, జనన మరణాల అవగాహన ఉండీ, నా ఒక్కడికే అన్యాయం జరిగిందని కుమిలి పోతున్నా. కొడుకూ కోడలూ, మనవలూ రోజువారీ ఒత్తిడితో సతమవుతోంటే , ఎందుకీ బతుకూ అనుకుంటూ కలత చెందుతోంటే, కాళ్ళూ చేతులూ మనసూ ముడుచుకుని కూర్చునే బదులు నా చిన్న పలకరింపు వారికీ సహాయం చేస్తుందన్న జ్ఞానం లేకపోయిందే.
ఇంట్లోకి అడుగు పెడుతూనే "అమ్మా కమలా ప్రసాద్ కి టైం ఎక్కడుంటుందీ, సాయంత్రం నేను సూపర్ బజార్ కి వెళ్లి సరుకులూ కూరలూ తెచ్చేస్తా, లిస్టు రాసెయ్యి, అన్నట్లూ కాకరకాయ వేపుడు తిని చాలా రోజులయ్యింది, నువ్వు కూడా మీ అత్తయ్య చేసినంత టేస్టీ గా చేస్తావని తెలుసు, మర్చిపోకు అవి లిస్టు లో రాయడం," హుషారుగా అన్నారు ఆయన.
ఎన్నో నెలల తర్వాత మామగారి చురుకైన గొంతు విన్న కమల మొఖంలో వెలుగు.
దాన్ని చూసిన రావుగారి కళ్ళు చెమర్చాయి.
“మనిషీ, బాధలూ పోటీ పడుతూనే ఉంటాయి. మనవాళ్ళు భాధల్లో మునిగిపోకుండా మన ఒక చిన్ని మాట కూడా హాయిగా జీవించేందుకు చిన్ని ఆశలని చిగురింపచేస్తుంది !” అనుకుంటూ మనవడి మిషన్ మొదలెట్టడానికి కదిలారు రావుగారు హృదయాంతరాలలోంచి వచ్చిన ఉత్సాహంతో !
*****
విజయలక్ష్మీ మురళీధర్
విజయలక్ష్మీ మురళీధర్ గారు చదువుకుంటున్నప్పుడు తెలుగు నేర్చుకునే అవకాశాలు లేకపోయినా కేవలం మాతృభాషాభిమానంతో, స్వయంకృషితో ఒక మంచి రచయితగానే కాకుండా, రేడియో ఆర్టిస్ట్ గానూ, బ్లాగ్ ప్రపంచంలోనూ, టీవీ ధారావాహిక దర్శకురాలిగానూ, అనేక కళలలో ఆరితేరిన వ్యక్తిగా గుర్తింపు పొంది ఆదర్శప్రాయులయ్యారు. న్యూరో సర్జన్ అయిన భర్త మురళీధర్ గారి ప్రోత్సాహం, పాఠకుల ఆదరణ తన పురోగతికి ప్రధాన కారణాలుగా నమ్మిన విజయ లక్ష్మి గారు అనేక సాహిత్య పురస్కారాలూ, తన నవల “స్వయంవరం” కథని సీరియల్ గా దృశ్యబద్ధం చేసి నిర్మాత, దర్శకురాలిగా విజయం సాధించి ఐదు నంది బహుమతుల్ని గెలుచుకున్నారు. పిల్లలు- కార్తిక్, దీపక్. నివాస స్థలం- హైదరాబాద్.
*****