MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
'సినీ' మధురాలు
భువనచంద్రతో ముఖాముఖి
భువనచంద్ర
సినీగేయ రచయిత
సినీ ప్రేక్షకులు, పత్రికా పాఠకులు ఒకేలా అభిమానించే రచయిత శ్రీ భువనచంద్ర. హుషారెక్కించే పాటలు, మాధుర్యం పంచే మాటలు, ఆలోచింపచేసే కథలు, నవలలు, వ్యాసాలతో నిత్యం పత్రికలలో సందడి చేస్తూ ఉంటారు. భువనచంద్ర గారిలో పుస్తకాన్ని ప్రేమించే పాఠకుడు, సృజనకి అంకితమయిన రచయిత, దేశాన్ని ప్రేమించే సైనికుడు, పరిచయాలని జీవిత కాలపు స్నేహాలుగా మలచుకునే ఆత్మీయుడు కనిపిస్తారు. అలానే జీవితంలో ఉన్నత శిఖరాలని, ఒడిదొడుకులని సమాన భావంతో చూసే పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని, పరిపక్వతని చూస్తాము. మనందరి అభిమాన రచయిత భువనచంద్రగారితో స్పెషల్ ఇంటర్ వ్యూ-
మీతో పరిచయం ఉన్నవారు, బాల్యాన్ని చాలా ఇష్టపడతారని చెబుతారు?
నాకనే కాదండి, బాల్యం అంటే అందరికీ చాలా ఇష్టమైన దశ. ప్రపంచాన్ని మొదటిసారి చూసేది అప్పుడే, అలానే ,తెలుసుకునే కార్యక్రమానికి కూడా బీజం అప్పుడే ప్రారంభం అవుతుంది, జీవితమంతా అక్కడినించే ప్రవహిస్తుంది. కోడి అరిస్తే అరుస్తాము, కోయిల కూస్తుంటే కూస్తాము, కుక్కల్ని అనుకరిస్తాము. ఇలా ఎన్నెన్నో చేస్తూ, చూస్తూ మెల్ల మెల్లగా ప్రపంచాన్ని తెలుసుకుంటాము.
బాల్యం తాలూకు జ్ఞాపకం ఒకటి చెబుతాను. వైద్యుల కృష్ణారావుగారు మా తెలుగు మాష్టారు, ఏదైనా పద్యం చెప్పరా అని అడిగేవారు. రాగయుక్తంగా పద్యం పాడుతుంటే కళ్ళు మూసుకుని తన్మయత్వంగా వినేవారు. పాడుతూ, పాడుతూ మెల్లిగా బల్లపైనున్న చాక్ పీసులు తీసుకుని జేబులో వేసుకునేవాడిని. తీసుకున్నానని ఆయనకీ తెలుసు, ఆయనకి తెలుసని నాకూ తెలుసు. ఆ రోజుల్లో మనకి పెద్ద బహుమతులంటే ఆ విరిగిపోయిన చాక్ పీస్ ముక్కలు, చిన్న, చిన్న వస్తువులే. మీరు చెప్తే నమ్మరు, ఈ రోజుకి కూడా ఆ చాక్ పీస్ ముక్కలు నా దగ్గర ఉన్నాయి.
ఎందుకు ఉంచాలంటే, మనం బ్రతికేది ఒకసారే...! అయ్యా, ఈ ప్రపంచంలో గొప్ప వాళ్ళం కావచ్చు, కోటీశ్వరులం కావచ్చు, బీదవాళ్లం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎక్కడి నించి వచ్చామో అక్కడికి పోవాల్సిందే. మనకి ఇద్దరు తల్లులు ఉన్నారండి. ఒక తల్లి జన్మనిచ్చిన తల్లి, ఆవిడ కడుపులోంచి బయటకి వచ్చాకా అక్కడికి తిరిగి వెళ్లలేం, ఇంకో తల్లి నేల తల్లి, ఆవిడ కడుపులోకి వెళ్ళాకా బయటకి రాలేము. ఈ విషయం ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాము. ఏ జీవి అయినా సరే నేలపైనే జీవితం గడపాలి, నేలలోనే కలవాలి.
సినీ రచయిత కావాలని మీకు ఎప్పుడు అనిపించింది?
చిన్నతనం నుండి సినిమాలంటే ఇష్టం ఉండేది. గోడలపై సినిమా పోస్టర్లను చూసేవాడిని, ఆత్రేయ, ఆరుద్ర, శ్రీశ్రీ లాంటి పెద్ద వాళ్ళ పేర్లు చూసి, వారి పేర్ల పక్కన నా పేరు రాసుకునే వాడిని. అలా ఒక విధంగా నా భవిష్యత్తు నేనే రాసుకున్నాను.
మీరు చాలా చిన్నతనంలోనే ఎయిర్ ఫోర్సు లో చేరారు కదా..
అవునండి..నాన్న గారు చిన్నతనంలో పోయారు. నాకు ఉత్తర, దక్షిణాలు లేవు. రికమండేషననే ఉత్తర దిక్కు లేదు, సమర్పించుకుందుకు ‘దక్షిణం’ దిక్కు లేదు. సొంత కాళ్లపై నిలబడడం తప్ప వేరే దారి లేదు. అందుకే ఎయిర్ ఫోర్సు లో చేరాను . అలానే చిన్నతనం నుండి పుస్తకాలు చదవడమంటే విపరీతమైన పిచ్చి, ఇప్పటికి కూడా చేతిలో పుస్తకం లేనిదే ముద్ద దిగదు. అప్పట్లో నేను చదివిన రాహుల్ సాంకృత్యాయన్ పుస్తకం “యాత్రికుడు”, ప్రబోధ్ కుమార్ సన్యాల్ రచించిన “విస్తృత యాత్రికుడు”, అవి చదివాక దేశాన్ని పూర్తిగా చూడాలనిపించింది. అందుకు ఎయిర్ ఫోర్సు ఒక మంచి అవకాశంగా అనిపించింది.
ఒకానొక ఇంటర్వ్యూ లో ఎయిర్ ఫోర్సు నుంచి రిటైర్ కాగానే ఒ.ఎన్.జి.సిలో ఉద్యోగం వచ్చిందని చదివాము. నికరమైన ఉద్యోగం చేతిలో ఉండగా సినిమా పరిశ్రమని ఎందుకు ఎంచుకున్నారు?
ముందు చెప్పినట్టుగా, సినిమాలలో చేరాలని ఎప్పుడూ ఉండేది. స్నేహితులు మద్రాసు పిచ్చోడని అనేవారు. గేయ రచయిత, డైలాగ్ రచయితని కాకుండా ఆఫీసు బోయ్ అయినా పర్వాలేదు, ఏదో రకంగా సినిమాల్లో చేరాలని మద్రాసుకి వచ్చాను. వచ్చే ముందు మా అమ్మని మీరడిగిన ప్రశ్నే అడిగాను, ‘నీ ఇష్టంరా’ అని ఒకే ఒక మాట అంది. అది ఆవిడకి నాపైనున్న నమ్మకం. “When you are committed to anything sincerely, nothing on earth can stop you” అనే మాట మీద నాకు గట్టి నమ్మకం ఉంది.
మద్రాసు వచ్చేసినా డబ్బుల విషయంలో చాలా పద్దతిగా ఉండేవాడిని. మద్రాసులో సంపాదించుకున్నది మాత్రమే తింటాను. ముందు చేసిన ఉద్యోగం వలన వచ్చే పెన్షన్ గానీ, ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు ముట్టుకోనని అనుకున్నాను. ఆ రోజుల్లో ట్రాన్సలేషన్ చేస్తే పేపర్ కి పది రూపాయలు ఇచ్చేవారు, డిటెక్టివ్ నవల్స్ రాసేవాడిని, అలా తంటాలు పడి సుమారు ఐదు వందల దాకా సంపాదించేవాడిని. ఉదయం ఒక ప్లేట్ ఇడ్లీ, సాయంత్రం ఒక ప్లేట్ ఇడ్లీ, ఎనిమిది అడుగుల గదిని నలుగురితో పంచుకునేవాడిని. మద్రాసు వచ్చిన నెల రోజులకి పాటలు రాసే మొదటి అవకాశం వచ్చింది, ఆ తర్వాత అలజడి అనే చిత్రానికి డైలాగులు రాసే అవకాశం కూడా వచ్చింది, అలా సినిమా కష్టాలు పెద్దగా పడకుండానే తెరపై లిరిసిస్ట్ కార్డు పడింది.
ఎయిర్ ఫోర్సు సర్వీస్ లో ఉండగా సాహిత్యం అందుబాటులో ఉండేదా?
నా మొదటి పోస్టింగ్ న్యూఢిల్లీలో వేశారు, అక్కడ ఎయిర్ ఫోర్సు లైబ్రరీలో తెలుగు పుస్తకాలు దొరకక ఇంగ్లీష్ పుస్తకాలు బాగా చదివేవాడిని. పెర్రి మాసన్, జేమ్స్ బాండ్, హరాల్డ్ రాబిన్స్ నవలలతో మొదలుపెట్టి సొమెర్సెట్ మాం, థామస్ హార్డీ, గుస్టావ్ ఫ్లాబర్ట్ లాంటి రచయితల పుస్తకాలు చదివాను. ఏ పుస్తకమైనా చాలా ఇష్టంగా చదివేవాడిని, ఖర్చు లేకుండా ప్రపంచం చుట్టినట్టు, టైం మెషిన్లో విహరించినట్టు అనిపించేది.
అప్పటి విషయం ఒకటి పంచుకోవాలి. “మేడం బోవరీ” అనే నవల చదివాను. జీవితంలో ఎవ్వరిని తిట్టుకోలేదు కానీ ఆ పుస్తక రచయితని విపరీతంగా తిట్టుకున్నాను. నవలలో రైటర్ ఎమ్మా అందాన్ని పేజీల, పేజీల పాటు పొగుడుతూనే ఉంటాడు, ఆ వర్ణనలు చదివి, చదివి విసుగొచ్చింది. ఒకానొక ఉదయం ఎమ్మా మరణిస్తుంది. డాక్టర్ చార్లెస్ ఎమ్మా శవం చుట్టూ తిరుగుతూ, భార్య శిరోజాలని జాగ్రత్తగా కత్తిరించి జేబులో దాచుకుంటాడు, గౌన్ ని ముట్టుకుంటాడు, తాగి వదిలేసిన మంచి నీళ్ళని తాగుతాడు. ఆ రాత్రి నవల పూర్తి చేసాను, ఉదయం నిద్ర లేచి చూస్తే బుగ్గలపై కన్నీటి చారలున్నాయి. భార్య చనిపోతే భర్త పడే ఘోరమైన బాధని కలలో అనుభవించాను, అప్పుడు అర్థమయ్యింది ఆ రచయిత అన్ని పేజీల వర్ణనలు ఎందుకు చేసాడోనని, ఆ బొమ్మ మన మనసుల్లోంచి చెరక్కూడదు. ఆ పుస్తకం నాలో చెరగని ముద్ర వేసింది. అలాంటి క్లాసిక్ పుస్తకాలు మంచి పునాదిని వేశాయి.
ఎయిర్ ఫోర్సు అంటే దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఉంటారు. మీలా సాహిత్య అభిలాష ఉన్నవారికి గొప్ప అవకాశం. ఆ అనుభవాలు పంచుకుంటారా?
ఇక నా స్నేహితులు రకరకాల పాటలు పాడుతూ ఉండేవారు. అవన్నీ నేను నేర్చుకునే వాడిని
“కడళిలే ఓళవుమ్, కరళిలే మోహవుం, అడజ్ఞు విల్లోమనె అడజ్ఞు విల్ల” అంటే
(“కడలిలోని అలలు, హృదయంలోని మోహాలు... ఎంత అణచినా అణగవు”)
దిన్ జో పకేరూ హోతే పింజడే మే రఖ్ లేతా. పా ల్ తా ఉ న్కో జతన్ సే, మోతీ కె దానే దేతా ..
(“రోజులు పక్షులైతే, వాటిని పంజరంలో బంధించి నా గుండెలపై పెట్టుకుని… కన్నీటి ముత్యాలని ఆహారంగా ఇచ్చేవాడిని”)
ఎంత గొప్ప ఊహండి, ఇలా ఒక్కొక్క భాషలో ఉండే మాధుర్యం, భావ సాంద్రత
“ఓ ఖు౦దేరీ రాధేమాయి, బింద బాన్సురియా… కృష్ణ మాధురజాయే…” అస్సామీ జానపదం. దానర్థం “ఓ రాధమ్మా ఈ కృష్ణుడి యొక్క మాధుర్యమంతా ఎక్కడుందో తెలుసా?...ఆ మురళిలో ఉంది” అంటే ఈ శరీరమనే మురళికి ఊపిరినిచ్చేది ఎవరు? ఆ భగవంతుడు.
ఎంత తాదాత్మ్యం, ఒక్కొక్క భాషలో ఉండే సౌందర్యం ఆకళింపు చేసుకుని, నాలుగు వేల పాటలు రాసాను.
ఎయిర్ ఫోర్సులో ఉండగా వేల రచనలు చేసారని చదివాము, అవి పత్రికలలోగానీ, సినిమాలోగానీ వచ్చాయా?
నేను సొంతానికి రాసుకున్న పాటలు నేను పాడుకుందుకు, మీలాంటి రసజ్ఞులు వినడానికి తప్ప సినిమాల్లోకి పనికి రావని ఎప్పుడో అర్థమయ్యింది. అది కాకుండా ఎయిర్ ఫోర్స్ లో ఉండగా ప్రెస్ తో సంబంధాలు పెట్టుకోకూడదు, లేదా స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. ఒక కాంట్రాక్టుపై సంతకం చేసాము దానికి కట్టుబడి ఉండాలని అటువంటి ప్రయత్నాలు చెయ్యలేదు. అదీ కాకుండా రాసింది రాసినట్టుగా ప్రచురించాలనే కోరిక ఉండేది కాదు.
కొన్ని పనులు మన కోసం చేసుకుంటాము, కొన్ని పనులు బ్రతకడానికి చేసుకుంటాము. అప్పటి పాటలు నాకోసం రాసుకున్నవి.
రచయితలకి సినిమా వేదిక కాగలదని నమ్ముతారా?
నా మటుకు నాకు సినిమా వేదిక కాదు. వేదికగా భావించే అనేక మాధ్యమాలు నాకున్నాయి.
నిర్మాత నా పే మాస్టర్, అతడు కోట్లాది రూపాయలు పెట్టి సినిమా తీస్తాడు. ఆ సినిమాపై అతని కుటుంబం, అతని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇంకొక్క విషయం ఏమిటంటే సినిమా కంటే ముందు ఆడియో రిలీజ్ అవుతుంది, ఆడియో సినిమా పట్ల ప్రేక్షకుడి ఆకర్షణని పెంచాలి. ఇవన్నీ రచయిత దృష్టిలో పెట్టుకోవాల్సిన బాధ్యతలు.
నేను నీతులు రాయక్కర్లేదు, నాకంటే ముందు భర్తృహరి సుభాషితాలు, సుమతీ శతకాలు ఉన్నాయి, కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి. పాటంటే ఊహ, చెట్ల చుట్టూ ప్రేయసి, ప్రియుడు తిరుగుతుంటే ప్రేమ చిగురించిందని, దుస్తులు మారుస్తుంటే వారి మధ్య సమయం గడిచిందని సూచిస్తారు. ఆ ఇంటిమేట్ సందర్భాలని రచయిత ఎలివేట్ చెయ్యాలి, వాటికి కాస్త అల్లరి, చిలిపితనం, శృంగారం అవసరం. విషయం కన్వే చేస్తూ ప్రేక్షకుడిని చిరునవ్వు నవ్వేలా చేయాలి.
సినిమా నాకు వేదిక కాదు. నన్ను నేను సంతృప్తి పరుచుకుందుకు కధలు, కవితలు, నవలలు, వ్యాసాలు రాస్తూ ఉంటాను.
పాటలు రాయడానికి కష్టపడిన సందర్భాలు ఉన్నాయా?
అమ్మపై పాట రాయమన్నారు, నేను రాయను అన్నాను. అమ్మంటే నాకు చాలా ఇష్టం, పేరు వింటేనే చాలా ఎమోషనల్ అయిపోయి గొంతులోంచి మాట రాదు. అందుకే మర్యాదగా రాయలేనని చెప్పేస్తాను.
మీరు గేయ రచయితగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఇప్పుడు కథలు, నవలలు, వ్యాసాల ద్వారా పత్రికలలో సందడి చేస్తున్నారు. వీటిలో ఏ ప్రక్రియని ఎక్కువగా ఇష్టపడతారు.
అన్నీ ఇష్టమేనండి, భోజనంలో రకరకాల వంటకాలు కావాలి. ఏది ఇష్టమంటే అన్నీ ఇష్టమే అని చెబుతాను.
రాబోయే పుస్తకాలు గురించి కాస్త చెప్పగలరా?
“వాళ్ళు” అనే ఆధ్యాత్మిక నవల క్రితం ఏడాది పబ్లిష్ అయ్యింది, చాలా మంచి స్పందన వచ్చింది, అసలు ప్రింట్ అవుతుందని కూడా అనుకోలేదు. వచ్చే ఏడాది ఎమెస్కో సంస్థ (సాహితీ ప్రచురణలు) ద్వారా శ్రీ బోధ, శ్రీ బోధానందామృతం అనే రెండు ఆధ్యాత్మిక కథల పుస్తకాలు, స్వాతి పత్రికలో వచ్చిన కథల సంపుటి, ఇతర పత్రికలలో వచ్చిన కథల సంపుటి. అలానే మిడ్ నైట్ మెలోడీస్ అనే పుస్తకం రాబోతోంది.
*****