top of page

'సినీ' మధురాలు

ఆదిత్య సినీ మధురాలు

V N Aditya

వి.ఎన్. ఆదిత్య

చలన చిత్ర దర్శకులు

తెలుగు వాడి మీద, తెలుగు భాష మీద, తెలుగు పేరు చెప్పి తెగ రాసే వాడి మీద, కూసే వాడి మీద, తెలుగు మీద అభిమానం  అడ్డం పెట్టుకుని మేసే వాడి మీద, వెనక్కి తిరగగానే జోకులేసి మోసే వాడి మీద, అందరి మీదా సమానంగా ఒకే రకమైన అభిమానం, వాత్సల్యం కురిపించగల హ్యూస్టన్ హ్యూమరసం, పంచ్ ల పాదరసం, గౌరవనీయులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారి అభిమాన పూర్వక ఆదేశానికి కట్టుబడి “సినిమా””ధుర్యాలని” “సినీ” మధురాలుగా మార్చడానికి, చదువరులని ఏమార్చకుండా ఉండడానికి నడుం కట్టాను. కలం పట్టాను. దయ చేసి నా మీద సానుభూతితో చదవండి. నా సినిమా లోకం లోని అనుభూతుల్ని ఆస్వాదించండి.

 

వాడ్రేవు వెంకట సత్య ప్రసాద్ అనే కవి మిత్రుడు, స్టేట్ బేంక్ ఆఫీసరు ముగ్గురు కొడుకుల్ని కన్నారు. సుధాకరు, సతీషు ఆదిత్య అని. గాంధీ గారి సింబల్సు రోజూ చూసేదేమో మా అమ్మ ఈ మూడు పురుళ్లప్పుడూ.....

పెద్దన్నయ్య చెడు వినడు.

చిన్నన్నయ్య చెడు చూడడు.

మూడో వాడు చెడు మాట్లాడడు.

 

కానీ మూడో వాడు (అంటే నేనే!) చెడు వినేశాడు, చూసేశాడు... చిన్నప్పుడే...

అప్పట్లో (1972 నుంచి 1992 దాకా) సినిమాలు చూడడం అంటే చెడు చూడడం. సినిమా పాటలు వినడం అంటే చెడు వినడమే మరి! వాడు తోటి పిల్లలతో ఆటలాడుకోవలసిన వయసులో రోజుకి నాలుగాటలు చూసేసే వాడు. కొన్ని ఇంట్లో తెలిసేలా, కొన్ని తెలియకుండా. అలా ఆ మూడో కోతి తొందరగా ఇరవై ఏళ్లు కష్టపడి, బి ఎస్ సి అయిందనిపించేసి, ఎనిమిది నెలలు ఇంట్లో వాళ్ళ తోనూ, చుట్టాలతోనూ పోరాడి, అమ్మ వద్దంటున్నా, నాన్న చెవి కొరికేసి, ఒప్పించేసి, రేణిగుంట లో పెద్దన్నయ్య ‘ఈనాడు’ జర్నలిస్ట్ జీతంతో, ఆలిండియా రేడియో, విజయవాడ, హైదరాబాదు, మదరాసు నాటకాల రచనల తాలూకు చెక్కుల ఆర్ధిక సాయంతో పినాకినీ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవ రోజు పాసెంజర్ గా మదరాసు చెక్కేశాడు. అప్పట్నించీ ప్రతీ రోజూ సినీ మధురమే! ఇరవై మూడున్నరేళ్ల నాటౌట్ సినీ మధురాలు నా సొంతాలు. ఎన్నో వేల సార్లు నాకౌట్ అయిపోయాను. ఇంక ఇంటికెళ్ళి పోవాల్సి వచ్చిందనుకున్న ప్రతీ సారీ పరిశ్రమ నన్ను పట్టుకుని నిలబెడుతూనే ఉంది, అమ్మలా. చేయి పట్టి ముందుకి నడిపిస్తూనే ఉంది నాన్నలా.

కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పుకోగలను.  కొంటెగా కామెడీ చేసి ఆ కన్నీళ్లని నవ్వుల నీళ్ళగా మార్చేయనూగలను...ఆర్టికల్ నడుస్తున్నన్ని రోజులూ....

 

ఒకే ఒక్కడు సినిమాలో ఏ ఆర్ రెహమాన్ స్వర పరిచిన “ఒక కంట నీరొలుకూ... ఒక కంట ఉసురొలుకూ... నీ వల్ల ఒక పరి జననం, ఒకపరి మరణం ఐనదీ... అనే లైన్ల భావం ప్రత్యక్షరమూ... ప్రత్యక్షరంగా.... నేననుభవించినదే. ఆ జ్ఞాపకాలని మీతో పంచుకునే అదృష్టాన్ని, అవకాశాన్ని కల్పించినందుకు... madhuravani.com కి కృతజ్ఞతా పూర్వక నమస్కారాలు.

 

అందరి బాగు కోసం పాటుపడేవాడే ఎవ్వరినయినా మందలించగలడు. టాలీవుడ్ లో దాసరి నారాయణ గారి పంథా అదే. ఆ కాంపౌండులో ఆయన అభిమానం సంపాదించిన అతికొద్ది మందిలో నేనూ ఒకడినని గర్వంగా చెప్పగలను. ఇది నా ప్రవర. సినిమా అనే శబ్ధ, ఛాయాగ్రహణాల సంపూర్ణ సంగమాన్ని నిశ్శబ్ధంగా, ఛాయాగ్రహణం మాత్రమే చేసి, 'పుష్పక విమానం' చిత్రాన్ని తీసి, ప్రపంచవ్యాప్తంగా 25 భాషలలో విజయఢంకా మోగించిన కమర్షియల్ సెల్యులాయిడ్ శాస్త్రవేత్త శ్రీ  సింగీతం శ్రీనివాసరావు గారి దగ్గర అసిస్టెంటు డైరక్టర్ గా "భైరవ ద్వీపం” చిత్రం నుంచి నా సినీ ప్రస్థానం మొదలైంది.

సింగీతం గారు, కొత్త పోకడల సినిమా అనే తపస్సు చేసే ఋషి/ ఆయనే నా గోత్రం.

నా వెండితెర నామం వి.ఎన్.ఆదిత్య...

 

పుట్టు పూర్వోత్తరాలతో, గోత్ర నామాలతో నా పరిచయం అయిపోయింది.

ఇప్పుడు వచ్చే సంచిక నుంచీ కథ చెబుతాను చూడండీ... ఒక రేంజులో... కథలు కథలుగా పాఠకులు మాట్లాడుకునేలా... వచ్చే సంచిక కోసం... ఎలాగూ వెయిట్ చేస్తారు  కాబట్టి... అందులో నా అర్టికల్ కోసం కూడా వెయిట్ చేస్తుంటారని, అలా మిమ్మల్ని ఉంచేంత బాగా రాసేలా ప్రయత్నం చేస్తాననీ, అనవసరమైన వాగ్వివాదాల జోలికి పోకుండా మిమ్మల్ని ఎంటర్టెయిన్ చేస్తాననీ... మనసా వాచా కర్మణా భావిస్తూ... (మాటివ్వడం లేదు సుమండీ...)

 

మీ అందరికీ...

ప్రేమపూర్వకమైన షార్ట్ బ్రేక్...

మీ

వి.ఎన్. ఆదిత్య.

విరామం-1

.

*****

 

bottom of page