top of page

వలస వేదన - నా కవిత్వం

Mukunda Rama Rao

వ్యాస​ మధురాలు

ముకుంద రామారావు

కవిత్వంలో జీవితమూ ఉంది, జీవితంలో కవిత్వమూ ఉంది. నా వరకూ నాకు, రెండూ విడదీయలేనివి. వలస కూడా నాకు అటువంటిదే. నా కవిత్వంలోనే కాదు, బహుశా నా రక్తంలోనే, వలస ఉంది. నా పూర్వీకులు భూమిని నమ్ముకున్న వారు. అది ఏ భూమి, ఎక్కడి భూమి అన్న దానితో సంబంధమే లేదు. ఎక్కడైనా వారికి అదే ఆకాశం, అదే భూమి, అదే గాలి, అదే నీరు. లేదంటే వాళ్లు, చదువు లేకుండా, మరో భాష రాకుండా, ఏ ప్రాంతమో చూడకుండా, ఎలాంటివారో తెలియకుండా, దేశాల్ని సముద్రాల్ని దాటిపోగలిగే సాహసం ఎలా చేయగలిగారు. కేవలం బతుకుతెరువు కోసమేనా? ఎన్నో ఆలోచనలు చేసి, ఎన్నో జాగ్రత్తలు తీసుకుని, ఎన్నెన్నో ప్రణాళికలు వేసుకుని కూడా, ఊరు దాటేందుకైనా భయపడే  చాలామందికంటే, వాళ్లు ఎంత ముందున్నారు అని ఆలోచిస్తే, ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది.  అయినా ఎవరి పూర్వీకుల మూలాల్ని వెదికినా, వారి మూలాలు మరెక్కడో దొరుకుతాయి. కనిపించే వలసలు కొన్నయితే, కనిపించని వలసలు మరెన్నో. చదువుకోసం, ఉద్యోగం కోసం, జీవిత భాగస్వామి కోసం ఏదయితేనేం - అన్నీ ఒక విధంగా వలసలే కదా! అంతెందుకు మన కలల్లో ఎన్నెన్ని వలసలో. అలా మా తాతయ్య వందేళ్లకు పూర్వమే అనకాపల్లి తుమ్మపాల దగ్గర్లోని వెంకుపాలెం నుండి, దక్షిణాఫ్రికాకి వలస పోవడం, నా కవిత్వం కాకుండా ఎలా ఉంటుంది. ముందుగా ఆ కవిత చదివి వినిపిస్తాను. 

 

వలస వేదన

చెరువులో నీరులా ఉండక

సమస్తం వదిలి

సముద్రాలు దాటిపోవటమెందుకో?

 

సాహసం

ఆకలి తీరకా?

ఆశ తీరకా?

 

ప్రవహించే నీటికి -

మార్గం ప్రాంతం ఏదీ తెలీదు

ముందు ఏముందో ఏమౌతుందో తెలీదు

నువ్వు కూడా అంతేనా తాతయ్యా?

 

మట్టిని నమ్మేవాడికి -

ఏ మట్టైనా ఒకటేనా?

అవసరమనుకుంటే భాషేమిటి?

రంగు రుచి ఏవీ అడ్డురావా?

 

వందల సంవత్సరాలున్నా -

పరాయి ముద్రపడ్డప్పుడే అనుమానితులం

తరిగిపోయే ఆస్తులు అవకాశాలకు కారణభూతులం

పాలులో నీరులా కలిసిపోతున్నా -

అదంతా కలుషితం

 

తిరుగు ప్రయాణం చేయాలన్నా

కూడలి వచ్చేవరకూ ఆగాల్సిందే కదా

ఈ లోగా ఏ అడ్డంకి నీ మార్గాన్ని మళ్లింస్తుందో?

 

అయినా ప్రవహించే నీరు -

ముందుకు పోలేనప్పుడు

అక్కడే అలా -

ఇంకిపోవడం

ఆరిపోవటంలోనే

ఆనందముందేమో!

అవునా తాతయ్యా?

 

ఒక అడుగు ముందేస్తే, ప్రాణమున్న జీవితాలు సమస్తం, వలసే. ఎక్కన్నించో వచ్చి, ఎన్నాళ్లో గడిపి, ఎక్కడికి పోతాయో తెలీని తనం. అంతా ఆదరాబాదరా జీవితం. అప్పటికే అది అతి ముఖ్యం. వెంటనే అది మళ్లీ ఏమీ కాదు. అంతా తాత్కాలికం. అది చెప్పే ప్రయత్నమే  మరో కవిత. ‘వేచి ఉండు గది (Waiting Hall)’ అందులో ఉన్నట్టే అందరూ. 

వేచి ఉండు గది

వస్తూ పోతూ ఉండే వాళ్లతో

ఆ గది కిటకిట లాడుతూనే ఉంది

రాక తప్పని పరిస్థితి

 

కొత్తగా అడుగు పెడుతున్నా

ఎప్పుడో వచ్చిన అనుభూతి

వచ్చాక సౌఖ్యాల వేట 

 

వెళ్లాల్సింది తెలిసి

స్థిమితంగా ఉండనీయక

ముందో వెనకో తెలియని ఆదుర్దా 

 

గడియారంలో చేతులు

అవిశ్రాంతంగా తిరుగుతూ

ఎవరో ఒకరికి

ఏదో ఒక సంకేతాన్నిస్తున్న హెచ్చరిక

 

కొత్తగా వచ్చి

అక్కడున్న వాళ్లని -

పాతబడి

వచ్చీ పోయే వాళ్లని -

తాము మాత్రం వేరన్నట్టు

నిర్లిప్త చూపులు

 

అక్కడ ఎవరూ ఉండిపోరు

ఎవరి సమయానికి వారు

మళ్లీ వస్తామో రామో

ఆలోచనైనా లేకుండా

ఆదరాబాదరాగా

అంతలోనే కనుమరుగైపోతారు

ఉన్నన్నాళ్లూ ఏవీ ఆగిపోవు. సమయాన్ని, వయస్సునీ ఆపే శక్తి ఎవరికీ లేదు. ఆనందాలు, విషాదాలు జీవితంలో అవిచ్ఛిన్న భాగాలు. వాటి హెచ్చు తక్కువల్లో తేడాలు తప్ప, అందర్నీ తాకేవే అవి. మనకు తెలియకుండానే మన బాల్యం  కనుమరుగవుతుంది. గతం ఏవో కొన్ని జ్ఞాపకల్ని మాత్రం మిగిల్చి పోతుంది. మన పిల్లలే మన బాల్యాన్ని ఏదోవిధంగా గుర్తు చేస్తారు. మనముందే మనంతవారై పోతారు. అలాంటి సందర్భమే మా పెద్దమ్మాయి వివాహం, అత్తవారింటికి పంపడం. నాలోని దాచుకోలేని భావాల్ని, కేవలం భావాలుగా రాసుకున్నా, అది “చేరా” గారి లాంటి పెద్దల కంటపడి, వలసపోయిన మందహాసం కవితయింది. అది కవితగా అందరూ అంగీకరించాక నేను ఆ దిశలో మరింత కృషి చేసేందుకు బాటయింది. ఆ కవిత -

వలసపోయిన మందహాసం

నాకు మొలకెత్తిన ఓ సుందర చైతన్యాకృతి

నాకే వీడ్కోలిస్తున్నప్పుడు

ఇన్నాళ్లూ

గుండెగదిలో వొదిగి వొదిగి

కళ్లకేదో మంచుతెరకప్పి

చూస్తూ చూస్తూనే

గువ్వలా ఎగిరిపోయినట్టుంది.

తెలిసి తెలిసి 

సైబేరియన్ పక్షిలా వలసపోయినట్టుంది.

సందడిని, సంబరాన్ని మూటకట్టుకు పోయిందేమో!

ఇంతలోనే మేము మనుషుల మధ్యే లేనట్టుంది.

అనుభవానికొస్తేగాని

ఏ వేదనైనా ఆవేదనైనా అర్ధం కాకుండా ఉంది

 

ఛెంగు ఛెంగున గెంతులు

చిన్నప్పటి గుజ్జెనగూళ్లు

చిలిపి చేష్టలు

ఇల్లంతా నింపిన అలంకరణలై

ఇంటందరికీ గుర్తు చేస్తూనే ఉంది.

ఎగిరిపోయిన ఛాయలెక్కడా లేవు

కనిపించక కలవరం తప్ప

లేకుండా ఉండలేని నిర్లిప్తత తప్ప

 

నువ్వైనా నేనైనా

మొలకెత్తిన చోటే మొక్కలన్నింటినీ ఉండనీయం

పూచిన పూలనీ పండ్లనీ చెట్టుకే వదిలేయం

 

ఎంతలేదన్నా కాదన్నా

విడిచిపోలేని బాధ

విడదీస్తున్న చేతులకంటదు

లేదంటే చూడు

పోగొట్టుకున్న వాడి ముందు గెల్చుకున్న వాడి గర్వంలా

ఆ చేతిలో చెయ్యి

 

అభయహస్త మవునో కాదో

మందహాసమై మెరుస్తోంది

సరిగ్గా ఒకప్పటి నాలాగే!

 

ఆ పరిస్థితి తండ్రిగా నాకే కాదు, తల్లిగా నా భార్యకు మరో రకమైన బాధ. తల్లులందరూ జీవితాంతం అనుభవించే బాధ. తప్పించుకుంటున్నట్టు కనబడే తండ్రికి ఎప్పటికప్పుడు తాకుతున్నా, అంతగా బయటపడని తనం. తల్లికది తప్పించుకోలేని, బయటపడలేని తనం.  ఈ కవిత అదే. 

 

చీలిన ప్రపంచాల మధ్య ...

అర్ధాంగి కాక ముందు

ఆ అమ్మాయి

ఒకే ఒక్క ప్రపంచంలో

స్వేచ్ఛా విహంగం

 

ఇప్పుడామె

రెండు ప్రపంచాల మధ్య లోలకం

ఈవల ఆవల

రెండడుగులు వేసి

ఇరువేపులా దాహం తీర్చే

నిరంతర చైతన్య ప్రవాహం.

 

తన తల్లి కిపుడు

మూడు ప్రపంచాలు

రాను రాను దూరమయే

రక్తాణువుల కోసం

ఎన్నెన్ని ప్రపంచాల మధ్య

ఊగిస లాడుతుందో

 

కారణ భూతుడైన తండ్రున్నాడు

పగిలిన అద్దం ముక్క లన్నింటిలో

ప్రతిబింబాల్ని చూసుకుంటూ ..

 

వలసకి జీవితం ఎంత అలవాటుపడ్డా, బంధనాల వ్యామోహం ఎంత గట్టిదంటే, కొన్నాళ్లకైనా అందరికీ దూరంగా ఉండాల్సి రావటం, ఎక్కడో ఎవరూలేని అడవిలోనో, ద్వీపంలోనో అమాంతం విసిరేసినట్టుంటుంది. ఒంటరితనం పట్టిపీడిస్తుంది. దగ్గరున్నపుడు అంతగా పట్టించుకోకపోయినా, వారికి దూరమయినపుడు, మనకు వారంతా ఎంత దగ్గరో, వారికి మనమెంత దగ్గరో తెలిసొస్తుంది. అది –

 

 

ఏకాకి

ద్వీపాంతర వాసంలో విముక్తి కోసం

ఒక మమేకం కోసం

నా అంతర్మధన పోరాటాన్ని ద్విగుణీకృతం చేస్తూ

కనిపించని రెండు తీగల్లో మీ స్వరాలు

మీకు తెలీకుండా

మీ అందర్నీ స్పృశించి వస్తున్న ఆలోచనలు

కనిపించిన ఆకారాల్లోనూ

అక్షరాల్లోనూ

ఎవరో ఒకరిని నిరంతరం

దర్శిస్తున్న కళ్లు కలలు

అంతా అవిశ్రాంతం అవిశ్రాంతం

ఎంత గింజుకున్నా బహుశా

సాయంత్రం పక్షి మనసు

ఎదురు చూస్తున్న చెట్టును చేరుకున్నప్పుడే  

ఊరట, విశ్రాంతి

 

అదేమిటో మిత్రులూ అంతే వేధిస్తారు. అయినా చాలా నేర్పుతో వారిని ఓదార్చగలగటం విశేషం. రక్త సంబంధీకుల్లానే వారంతా నిజానికి ఎంత దగ్గరో, ఎంత దూరమో తెలిసేది కూడా అప్పుడే. అటువంటి ఒకానొక సందర్భంలో వచ్చిన కవిత -

 

వర్షం వెంటాడినట్టు

కలసిపోయే సమయాలు లేవు

సూటిగా క్లుప్తంగానైనా

సారాంశం ఒకటే చాలు

 

మిత్రమా

సంజాయిషీలూ లేవు

పేరుకుపోయిన జ్ఞాపకాల పొరల్లో

నువ్వింకా భద్రంగా ఉన్నందుకే

నాకు ఆనందం

 

వలస ప్రయాణంలో

దూరం

ఒంటరితనం

దుఃఖం

నా తోటి ప్రయాణీకులు

 

ఆటుపోట్ల మధ్య కూడా

ఆనందించే విషయం

స్ఫురించడమే

నీ జ్ఞాపకం

 

బహుశా వెలితి

జ్ఞాపకాల గుప్తనిధికి

తాళపు చెవి

 

అదేమిటో

దారి పొడుగునా

వర్షం వెంటాడినట్టు

ఈ రోజు నువ్వు ...

 

బాధపడినా ..

నన్ను నీ నుండి

కత్తిరించుకోవటం

ఉన్నచోటే విస్తరించకుండా

మరోచోట మొలకెత్తటానికి కూడా!

 

రా! ..

చూద్దువు గాని!

 

నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. నాముందు నా జీవనచిత్రం కదలాడుతూనే ఉంటుంది. అది గ్రందస్థం చేయబోతే ఈ కవితయింది.

 

వక్రరేఖల్లో

నా చిత్రాన్ని నేనే గీసుకుంటున్నాను

పూర్వీకుల ఛాయలందులో

 

బాధలు భావాలు

కోపతాపాలు

కలల శకలాలు

అవమానాల పరంపరలు

పొరలు పొరల్లో అన్నీ

 

నాకు తెలియకుండానే

నా చిత్రంలో మారిపోతున్న రంగులు రేఖలు

మీనేను

నా చిత్రంలో నేను

వేరు వేరు

 

కెరటాల్ని విసిరి

కాళ్లు లాగుతున్న సముద్రం

మచ్చిక చేసుకొని స్వారీ చేస్తున్నాను

 

చెట్లను గుద్దుకుని

చీలిపోతున్న దారి

ఎటుపోవాలో ముందే తెలుసుకుంటున్నాను

 

ఎంత

సజీవ చిత్రమైనా నేను

చూసే

వక్రరేఖల్లో వికృతంగానూ

ముగింపు కొచ్చినా

అసంపూర్ణంగానే!

 

ఆగిపోయేది అన్వేషణ కాదు. నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. బహుశా ఏదో మూల అసంతృప్తే, దాని కొనసాగింపుకి కారణమౌతుందేమో!

 

స్వయం అన్వేషణ

చూపుల కందని

రహస్య వేదిక

శూన్యం

 

మాటలకందని

అనంత విశ్వం

నిశ్శబ్దం

 

బంధనాల వ్యామోహం

ఉదయాస్తమయాల

సముద్ర సూర్యుడంత

అద్భుతం

 

అతీతుడనో

భిన్నమైన వాడినో కాదు

అదిగదిగో నేనేనని

ఎందరిని చూసి

భ్రమపడ్డారో?

 

వెదికే శ్రమెందుకు?

 

సముద్రాకర్షణలో

పడిపోయిన వాడిని

రాత్రి నదిలో ఒంటరిని

 

అలల్లో

కలల్లో

అన్నింటిలో

నన్ను నేనే

వెదుక్కుంటున్న వాడిని

 

కాల పరిమితులు

నిరీక్షణలు

నీటిలో నీడలు

 

నిరంతర ప్రయాణంలో

అన్ని వేపులా తిరిగితిరిగి

అందరికీ

నాకు నేనుగానే

పరిచయమవుతాను

 

వలస అంటేనే ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ప్రయాణం. ప్రయాణానికి సర్వసన్నద్ధంగా ఉండటం. అయినా ప్రయాణానికి ముందు ఉండే అలజడి, ఆందోళన ఎప్పుడూ మామూలే. 

 

మరో మజిలీకి ముందు

అద్దం ముందు ఆకాశమంత అబద్దం

అద్దాల మధ్య బింబ ప్రతిబింబాల్లో

నిజానిజాల సందేహం

 

ఎండని చెమటతో తుడుచుకుంటూ

చలిని ఎండలో కాచుకుంటూ

పగుళ్లు బారిన దేహాన్ని

చాలీచాలని చినుకులతో తడుపుకుంటూ

రోజులు

 

అవును నిజమే

ఏక కణానికి ఏ ప్రతిపత్తీ ఉండదు

మనసుకి హత్తుకోని

ఏ కలా మర్నాటికే గుర్తుండదు

 

ఎంత మోజుపడ్డా

ఎదుగుతున్న కొద్దీ

ఉన్న దుస్తులేవీ సరిపోవటం లేదు

ఎరిగున్న దారులేవీ విశాలం కావటం లేదు

పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీలోలా

ఆ కొసకెలా చేరాలన్నది

ఎప్పుడూ తలెత్తే ప్రశ్నే!

వెనక్కి పోనూలేక

ఆగిపోనూలేక

 

మొదట్లా కాదు

ప్రాకారాలు దాటుతున్న ఆలోచనల్ని

లోపలి సమస్యలు లాగిలాగి ప్రశ్నిస్తున్నాయి

నా కాళ్లకింద భూమి

నన్ను తొలిచేస్తూనే ఉంది

నా వేర్లని తెలుసుకుందుకిప్పుడు

నన్ను నేనే తవ్వుకోవాల్సొస్తోంది

 

తొందరపడాలి

సాయంకాలం మంచుతెరలు దట్టమయేలోగా

వాటిలోని పరిమళాల్ని

నా దారంతా పరుచుకుంటూ పోవాలి

 

ఎవరెక్కడున్నా తండ్రికి కూతురు ఎంత దగ్గరో, కూతురుకు తండ్రి కూడా అంతే దగ్గర. బహుశా కూతురులో అమ్మ కనిపిస్తుంది, సోదరి కనిపిస్తుంది, తన హృదయానికి దగ్గరైనవన్నీ కూతురులో కనిపిస్తాయేమో! ఆ కవితే ఇది.

 

కూతురు

ఉదయమెప్పుడూ

కూతురులానే

అందంగా ఆప్యాయంగా వస్తుంది

 

ఉన్నంతసేపూ ఉత్సాహామే

 

చీకటిలో కూరుకుపోకుండా

చంద్రుడ్ని వెలిగించి

లోనున్న నక్షత్రాల్ని బయటకులాగి

కనుమరుగవుతున్న సూర్యుడిలా

తనింటికి అమ్మాయి

 

గుర్తు చేసే ఎన్నెన్నో జాడల్ని వదిలి

 

ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు దాదాపు లేకుండా పోయాయి. అత్తరింటికి అమ్మాయిని పంపినట్టు, అబ్బాయిని ఉద్యోగం కోసం, ఎక్కడో చోటుకి పంపాల్సిన స్థితి. అలా దూరమైన పిల్లల కోసం తల్లిదండ్రులు, అమ్మానాన్నల కోసం పిల్లలు, ఎదురు చూపులతో బతకడం జీవితంలో భాగమయిపోయింది అందరికీ. ఆ సందర్భమే ఈ కవిత.

 

ప్లాట్ ఫాం

ఇంటికి రాకుండా

మూడు సంవత్సరాలే అయింది వాడికి

ఒక వెయ్యి తొంబై అయిదు రోజులయ్యాయి మాకు

 

వీలయినపుడల్లా మాటాడుతూనే ఉన్నామంటాడు వాడు

మాటడకపోయినా, చెప్పిందేదీ వినకపోయినా

మిమ్మల్ని మమ్మల్ని

ప్రతి రోజు తాకుతూ పలకరించే

సూర్యుడే నయం అనుకుంటాం మేము

 

ప్లాట్ ఫాం ఉంది కదా అని

రైలు అక్కడే ఆగిపోతే ఎలా

వస్తూ పోతుండాలి కదా అంటాడు వాడు

రావల్సిన సమయానికి రైలొస్తే

ఎదురు చూపులుండవు కదా అంటాం మేము

 

రావాలని మాకు మాత్రం ఎందుకుండదూ అంటాడు వాడు

చూడాలని మాకు మాత్రం ఉండదా అంటాం మేము

 

ఎవరిగోల వారిదనుకునే లోపే

వాళ్లొస్తారు

సమయాన్ని ఎంత తొందరగా తిప్పేస్తారో

ఆనందంలో అనారోగ్యాన్ని ఎలా మాయం చేస్తారో

 

అవును ఆ తరువాతెపుడో

బద్దకంగా లేచి చూస్తే

బయట గోల విని

ఎన్నాళ్లో అయినట్టుంటుంది

పిల్లలు వెళ్లిపోయాక

 

ఇంతకీ నేనెవర్ని? రమణ మహర్షి ఎవరిని వారు అడిగి తెలుసుకోమన్న ప్రశ్నే అయినా, అంత ఆత్మపరిశీలన చేసుకునే శక్తి సామర్ధ్యాలు నాకు లేవనే అనుకోవాలి. ఎంత శోధించినా, ఏవో భౌతికమైన జవాబులే నాకు మిగిలేవి ఇలా –

 

నేను

తీరాలు సముద్రాలు దాటొచ్చిన రక్తాన్ని

ప్రాంతాలు నదులు దాటిన శరీరాన్ని

రంగు మార్చని పూవుని

భాష రాని పాటని

పక్షుల ఆకాశ భాషని

నవ్వుతూ ఏడుస్తూ సాగిపోతున్న మేఘాన్ని

చేతులు చాచి ఆహ్వానిస్తున్న ఆకాశాన్ని

నచ్చిన సుగంధాన్ని పంచుతున్న గాలిని

కాంతిలో కళ్లు నింపుకుంటున్న దీపాన్ని

మార్గదర్శకుల నీడని

ఆకులకన్నీరు కారుస్తున్న చెట్టుని

రాస్తూ చెరిపేస్తున్న వర్షాన్ని

సముద్రం తల్లీ తండ్రికి చేరువవుతున్న నదిని

 

కవుల్ని తెలుసుకుందుకు ఆయా కవుల కవిత్వాలు మనకు పనికొస్తాయి. అందుకు వారి కవితలు వారిని ఏమి రాసి చూపించాయో చూస్తే చాలేమో. కిటికీ బయట కనిపించేదంతా వారికి ఒక గురువులా, కవిత్వంలా కనిపిస్తుంది. కవిత్వానికి సమస్త జీవితం వారికి ఒక కార్య క్షేత్రం. కవిత్వం వారికి ఒక విశ్వభాష. ఎవరి మొహాల్ని వారు అందులో చూసుకోవచ్చు. ఎవరిని వారు అందులో తెలుసు కోవచ్చు. మన లోపలి మనిషిని ఎవరో ఒకరు చూపిస్తే, అవునుకదా మనకే తెలియలేదు ఇన్నాళ్లూ - అని మనం ఆశ్చర్యపోవచ్చు.

 

అయితే నేను రాసే కవితలన్నీ ఇలా విడని ముడులకు సంబంధించినవే కావు. అనేక ఇతర కవితలున్నా, అందులో ప్రముఖంగా కనిపించే వలస వేదనని మాత్రం మీ ముందుంచాను.  నా మట్టుకు నాకు కవిత్వం మానవ సహజమైన ఆత్మ నివేదన. నా కవిత్వవృక్షానికి ఉన్న ఒక్కొక్క ఆకునీ, ఒక్క ఆకైనా మిగల్చకుండా విదిల్చి పొమ్మని నా అత్మను మాత్రం ఎప్పటికప్పుడు వేడుకుంటుంటాను.

***

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...

Bio

ముకుంద రామారావు

ప్రముఖ కవి ముకుంద రామారావు గారు 1946 నవంబర్ 9 వ తేదీనాడు ఖరగ్‌పూర్ లో జన్మించారు. రైల్వే శాఖ, సాఫ్ట్ వేర్ రంగాలలో పనిచేసి 2006లో పదవీ విరమణ చేసారు. వలసబోయిన మందహాసం, ,మరో మజిలీలోకి ముందు మొదలైన సుప్రసిద్ద తెలుగు కవితలు అనేకం, The smile that migrated,and other poems అనే ఆంగ్ల కవితా సంపుటి, అనేక కథలు, వ్యాసాలు గ్రంధాలు ప్రచురించారు. “అదే గాలి” పేరిట ప్రపంచదేశాల కవుల, కవిత్వ చరిత్ర గ్రంధం ముద్రణలో ఉంది. వీరి కవితలు అనేక ఇతర భాషలలోకి అనువదించబడ్డాయి. టీవీ, రేడియోలలో మంచి వక్తగా పేరుపొందిన ముకుంద రామారావు గారు తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం మొదలైన అనేక పురస్కారాలు అందుకున్నారు.

***

Mukunda Rama Rao
Comments
bottom of page