top of page

కథలు ఎందుకు చదవాలి?

medico Shyam Chilavuri

వ్యాస​ మధురాలు

మెడికో శ్యాం

ఈ శీర్షికని రెండు రకాలుగా అర్ధం చేసుకోవచ్చు.

ఒకటి : కథలు ఎవరైనా ఎందుకు చదవాలి?

రెండు: ప్రత్య్రేకించి కథకులు ఎందుకు చదవాలి??

అసలు ఏ పనైనా ఎందుకు చేయాలి?  ఉధాహరణకి భోంచెయ్యడం, తిండి తినడం. తినడంకోసం బతుకుతామా?  బతకడం కోసం తింటామా?  అంటే అందరూ బతకడం కోసం తింటామనే చెబుతారు. నిజానికి తినడం కోసం బతుకుతున్నవాళ్లే ఎక్కువనిపిస్తుంది. లేకపోతే ఇన్నిరకాల తినుబండారాలెందుకు? ఏదో  ఇంత అన్నమో లేక హిందీ వాడన్నట్టు దాల్ రోటీ చాలదా?  ఏదో ఉల్లిపాయో, మిరపకాయో ఉప్పుతో నంజుకుంటే చాలదా?

ఇన్ని ఊరగాయలూ ఆవకాయలూ, పచ్చళ్ళూ... అప్పడాలూ, వడియాలూ, కరకరలూ... ఇంకా ఇంకా విభిన్న నాన్వెజ్జిలూ రకరకాలుగా దంచి, వాయించి, వేపించి తినడం అవసరమా?

ఇవికాక 'బీరకాయలూ' సొరకాయలూ కూడా కావాలి మనకి. రకరకాల రుచులు కావాలి. జీవన మాధుర్యం పెరగడానికి పెంచుకోడానికి.

అలాగే అభిరుచులకీ, అనుభవాలకీ, ఆలోచనల పదునుకూ, జ్ఞానసంపదకీ, గవేషణకీ, అన్వేషణకీ, అన్నిటికీ చదువు అవసరం. ఏ ఒక్క చదువూ మనని పరిపూర్ణ మానవులుగా తయారు చెయ్యలేదు. జీవితానికి, బడిలో చదువుకి మధ్య ఖాళీని పూర్తి చేసే చదువు చాలా అవసరం. అలాంటి చదువులే పుస్తక సాహిత్యం, సాహిత్య పుస్తకాలూ. కథలు అందులో ఒక భాగం. ఇవాల్టి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కథ మరీ ముఖ్యమైనదేమో. ఏదో చేస్తూ, ఎక్కడో బస్సులోనో, ట్రెయిన్లోనో , టాయిలెట్లోనో ఏదో విధంగా చదివేద్దాం, పూర్తి చేసేద్దాం అనుకునే మనుషులు మనకి కనిపిస్తూ వుంటారు. వీళ్ళందరికీ సులభంగా అవకాశం ఇచ్చేది కధేనెమో అని నాకన్పిస్తుంది..బహుశా ఒక కథ చదవడానికి పట్టే సమయం తక్కువ కావడం వలన కావచ్చును. బహుశా నిడివి వలన కావచ్చును.

 

కథలు-చిన్నకథలు, పెద్ద కథలు (కొందరు పెద్దల చిన్నకథలు కూడా పెద్దవే). కధానికలు-

ఈ చిన్నకథలు చెప్పేవి మాత్రం పెద్దవిషయాలే!

పందొమ్మిదో శతాబ్దంలో ఎడ్గర్ ఎలెన్ పో మొట్టమొదట కథని నిర్వచించాడు. ఆ  నిర్వచనం ప్రకారం ఒక సంఘటన గానీ, ఒక విషయానికి సంబందించిన కొన్ని సంఘటనలు గానీ, ఒక్క సిట్టింగు లో చదవగలిగేలా రాయబడింది కథ. అందుకే ఎవరినైన కూర్చొబెట్టి కదలనివ్వకుండా రాసిందంతా చదివి వినిపిస్తే కథ అయిపోతుందని సరదాగా అనేవాళ్ళం.

నా దృష్టిలో కథలు జీవిత దృశ్యాలు. జీవితంలోని అన్ని కోణాలూ, అన్ని సందర్భాలు,  ఆలోచనలూ, ఒకే ఒక జీవితంలో మనకి లభించడం సాధ్యం కాదు. ఒక్కొక్క కథ ఒక్కొక్క జీవితంలో ఒక సంఘటన. ఒక అనుభవం.ఒక దృక్కోణం. ఒక క్షణానికి లేక కొన్ని క్షణాలకి పెన్ తో తీసిన ఫొటోగ్రాఫ్/ గీసిన పోర్ట్రెయిట్.

మనల్ని ఆహ్లాదపరుస్తూ,ఆనందపరుస్తూ ఆలోచింపజేసే అవకాశం. మనలోని లోపాలను మనకి చూపగల పరికరం లేక వేరెవరిలోనో వున్న ఉన్నతభావాలనీ, ఆదర్శాలనీ, గొప్పదనాన్న్నీ మనకి చూపగల దిక్సూచి లేక మైక్రోస్కోపు.

సాటిమానవుణ్ణి అర్ధంచేసుకోవడానికీ, ఓదార్చడానికీ  కూడా సహాయపడగలవు కథలు.

ప్రపంచంలో వేరు వేరు మూలల్లో, దేశాల్లో, ప్రాంతాల్లో వుంటూ, రకరకాల భాషలూ, వివిధ ధోరణులూ, అనుభవాలూ వున్న మానవుల మధ్య సామ్యాన్నీ, సామాన్యతనీ చూపించే శక్తి గలవి కథలు. అరుదైన పరిపూర్ణ వ్యక్తిత్వానికీ , అంతకన్నా పరిపూర్ణమైన ఉన్నతమైన వ్యవస్థకీ  దారి తీయించగలవి కథలే అని నా అభిప్రాయం.

మహోన్నతమైన, అత్యద్భుతమైన ఆనందాన్ని అనుభవించగలరు చదువరులు. మానవ బలహీనతల నుండీ, స్వార్ధపరత్వం నుంచీ కనీసం క్షణకాలమైనా దూరంగ వుంచగలిగే శక్తిగల రచనలూ వున్నాయి. రచన గొప్పతనం రచయిత శక్తిపై ఆధారపడినంతగా  రాస్తున్న విషయం పై ఆధారపడదు. దీనికి ఉదాహరణలు ఇవ్వగలను గానీ ప్రత్యేకించి ఇవ్వకూడదని నిశ్చయించుకోవడం వలన ఇవ్వడంలేదు.

ఇలాంటి ఎన్నో విలువైన విషయాలు సులభంగా, చౌకగా, చక్కగా పొందే అవకాశం చదవడం. అందులో కథ చదవడానికి, ఇందాక చెప్పినట్టు, పట్టే సమయం కూడా తక్కువే. అందుకే చదవాలి ఎవరైనా. చదువుతూనే వుండాలి.

కానీ రచయితలెందుకు చదవాలి?

వాళ్ళు వాళ్ళకి తెలిసిన విషయాలు రాస్తూ పోవొచ్చును కదా?  వాళ్ళ జీవితం నుంచీ వాళ్ళు గ్రహించినవి రాసుకుంటూ పోవొచ్చుకదా అంటే పోవొచ్చును. కానీ పోలేకపొతున్నారు. అన్ని విషయాలూ స్వంత అనుభవం నుంచే నేర్చుకోవడం చాలా కాస్ట్లీ ఎఫైర్. దాదాపు అసాధ్యం. మనకి మిగతావారి గురించి తెలియనంతవరకూ మనకి మనం చాలా గొప్పగా అనిపిస్తాం. ఈ విషయం మన కథకుల్నీ, రచయితల్నీ గమనిస్తే మనకి సులభంగా అర్ధమౌతుంది.

మన అదృష్టమో దురదృష్టమోగాని, ప్రపంచంలో వున్న మేధావులందర్లో నూటికి 99 శాతం మనవాళ్ళే. వాళ్ళు ఆంధ్రాలో వున్నారా? తెలంగాణాలో వున్నరా? అమెరికాలో వున్నారా? నేను చెప్పలేను. మీకే తెలుసు. ఈ మేధావుల దృష్టిలో వాళ్ళు తప్ప మిగతావాళ్ళందరూ మేతావులే. వాళ్ళు మాత్రమే మేధావులు.

ఈ రచయితలెవరూ, కనీసం చాలా మంది  మిగతా వాళ్ళ రచనలు చదవరు. తమ కంటే తక్కువస్థాయి రచయితలని భావించడం వలన. గొప్పవాళ్ళ రచనలూ చదవరు, ఎక్కడ ప్రభావితులమైపోతావేమో అని. వీళ్ళలో లేని మొడెస్టీని ప్రదర్శిస్తూవుంటారు. "కథాచిలుక పట్టుబడనేలేదు" లాంటి వాక్యాలు వాడుతూ వుంటారు. ప్రసిధ్ధుల నిబద్దతని ప్రశ్నిస్తూ కబుర్లు చెప్తారు. మహానుభావుల రచనల్ని చదవకుండా వాళ్ళ సంస్మరణ సభల్లో ప్రసంగిస్తారు; బ్రహ్మాండమైన లెక్చర్లు ఇచ్చేస్తారు. వారికి/వీరికి (కాదు వాడికి/వీడికి) అనవసరంగా ఎక్కువ పేరు వచ్చిందని వాపోతారు.

అతనెవరో గాయకుడు అందరి పాటలూ నేనే బాగా పాడ్తాను అన్నట్టుగా ( ఎందుకో అతగాడు మహ్మద్ రఫీ ని మాత్రం వదిలేసాడు), వీళ్ళలో కొంతమంది రచయితలు తాము క్లాసికల్  కథకుల కథల్ని వాళ్ళకంటే బాగా రాయగలమని అనుకుంటారు. అనుకుంటే పరవాలేదు, బయటకి అంటూ వుంటారు. అదే నన్ను ఇబ్బంది పెడుతున్న విషయం.

నేను పేర్లు వాడడం లేదు గనక నాకు సంబంధం ఉన్న ఉదాహరణ ఇస్తాను. నా ఏదో కథ మీద చలంగారి ప్రభావం బలంగా వుందని ఒకాయన ఓ సభలో నొక్కి వక్కాణించారు.

వీడిమీదా నా ప్రభావం అని చలంగారు విలవిలలాడి ఉంటారు. కనీసం ఆయన నా ఆ కథ చదివారా అని నా సందేహం!

కథల్లో సందేశం అక్కర్లేదని కొందరి అభిప్రాయమైతే, సార్వజనీయత కాదు ప్రాంతీయత ఉండాలి అని కొందరి నినాదం.

లెఫ్టైతేనో, రైటేతేనో అని " ఎలిఫంట్ అండ్ సిక్స్ బ్లైండ్ మెన్" లా జీవితాన్ని నిర్వచిస్తారు. జీవితాన్ని పట్టుకోవడాన్నీ, పట్టించుకోవడాన్ని పట్టించుకోవడంలేదు.

తమ గురించీ, తమ రచనల గురించీ మాత్రమే  మాట్లాడుతూ  తమని తామే మెచ్చుకుంటూ, తను కాకపోతే తన ముగ్గురు నలుగురు చెంచాగాళ్ళని సభల్లో, సోషల్ మీడియాల్లో మెచ్చుకుంటూ ప్రసంగిస్తూ, ప్రస్తావిస్తూ, విహరిస్తారు.

నేను గత సంవత్సరం ఇన్ని పుస్తకాలు చదివాను, అన్ని పుస్తకాలు చదివాను అని తెలియబర్చడాలూ, రాయడాలూ, వాటిని మిత్రులు మెచ్చుకోవడాలూ చూస్తూంటే  " చదివిన నీ చదువంతా వ్యర్ధమా?" అనే పాట గుర్తొస్తోంది.

అసలు వీళ్ళు ఇన్ని పుస్తకాలు ఎలా చదువుతున్నారు?

అసలు వీళ్ళకింత టైమెలా దొరికింది? వీళ్ళు ఉద్యోగాలూ, సద్యోగాలూ చెయ్యడంలేదా అని నాకు ఆశ్చర్యం  వేస్తుంది. పోనీ, చదివారనే అనుకుందాము. చదవడం వాళ్ళకోసమా? ప్రపంచంలో అందరికీ చెప్పడం కోసమా? నాకర్ధం కావడం లేదు. నాకు అర్థం కాని మరో విషయం ఏమిటంటే ప్రతి రచయిత రాసిన ప్రతీ రచన గొప్పదవవలసిన అవసరమూ లేదు. అలా కుదరదు కూడా. కాని ప్రతీసారి, ప్రతిరచయితని పట్టుకుని వాడు రాసినదాంట్లో బాగులేని వాటిని తీసి ఫలానవాడిని మహా రచయిత అని ఎలా అన్నాం? అనడం, అదో సమస్య.

ఆరుద్ర గారు ఒక సందర్భంలో తన తొలినాటి రచనల గురించి ముచ్చటిస్తూ ఇలా అన్నారు :

“నేను నా తొలినాటి రచనల గురించి ఏమంటాను? స్పార్కులు వున్నా మార్కులు ఇవ్వలేను.”

సోమర్సెట్ మామ్ కొందరు యువ రచయితల కథల పుస్తకానికి ముందుమాట రాస్తూ ఇలా అన్నాడు:

“ఈ కథలు నేను కథలు రాసే తొలి రోజుల్లో వుండి వుంటే నేను ఇంకా బాగా రాయగలిగేవాణ్ణి అనిపిస్తోంది.” - సుమారుగా ఈ భావం ధ్వనించే వాక్యాలు రాసేడాయన.

రంగనాయకమ్మ గారు తన కొన్ని రచనల్ని తరువాత కాలంలో తొలగించారు.

రావిశాస్త్రి గారు తన రచనల్ని డిఫెండు చేయడానికి నిరాకరించిన డిఫెన్సు లాయరుగారు.

మరి వీరు ఈ స్థాయికి ఎలా చేరేరు? తమని తాము సరిగ్గా అంచనా వేసుకుంటూ తమ లోపాల్ని ఒప్పుకుంటూ దిద్దుకోవటానికి వీలు లేకపోతే ఊరుకుంటూ ఎలా? ఎలా?

నిరంతర అధ్యయనం అంటే చదవడమే అందుకు కారణమని నేను భావిస్తున్నాను.

హైస్కూల్ కాంపొజీషన్ లాంటి వ్యాసాల్లో  ఇటివల కథకులందరూ కథలెలా రాయాలో మిగతావాళ్ళందరికీ తెగ చెప్పడం మొదలుపెట్టారు. ఎక్కడబెడితే అక్కడ రాయడం మొదలుపెట్టారు. ఇలా రాయాలి. అలా రాయకూడదు. ఇలా రాయొచ్చు. ఇలా చెబుతున్నారు.

మన వర్ధమాన రచయితలకి ఆ స్థాయి ఎందుకు రావడం లేదు? ఆ పరిణతి  ఎప్పుడు వస్తుంది?  ఇవి నాకు ఎదురైన, నన్ను నేను వేసుకున్న ప్రశ్నలు. నిరంతర అధ్యయనం  లేకపోవడం వలన అనీ, విస్తృతంగా చదివినపుడే అనీ, విస్తృతంగా చదవడమొక్కటే దీనికి సరియైన సమాధానమనీ  నేను భావిస్తున్నాను.

ఇందులో నేను రచయితల పట్ల హార్ష్ గా వున్నానని చాలామందికి అనిపించవచ్చు. అలా ఎందుకు అన్నానంటే రచయిత విజిబిలిటీ తక్కువగా వుండాలి, వాళ్ళు చెప్పే విషయాలు స్పష్టంగా కనబడాలి. కాని ప్రస్తుతం రచయితల విజిబిలిటీ ఎక్కువైపోయి చెబుతున్న దాంట్లో విషయం కనబడడం తక్కువైపోయింది. పెద్దగా చెప్పడానికి ఏమీ లేనపుడు వాళ్ళు చెప్పకుండా వుండడమే మంచిది. రాయని భాస్కరులు అవడం మంచిది.

ఇది నా పాక్షికదృష్టి కావచ్చును, వ్యక్తిగతంగా నాకు నచ్చని విషయాలు కావచ్చును. నచ్చినవాళ్ళు మెచ్చుకుంటారు. నచ్చనివాళ్ళు కొందరు నొచ్చుకుంటారు. నొచ్చుకునేవారిని నొచ్చుకోవద్దనీ, మెచ్చుకొనేవాళ్ళని అంతగా మెచ్చుకోవద్దనీ కోరుతున్నాను.

(నాలాంటి రిలక్టెంట్ స్పీకర్ని బలవంతంగా నా చేత నాటా సభలో మాట్లాడించిన డాక్టర్ ఇస్మాయిల్ గారికీ, చంద్ర గారికీ అభినందనలూ, కృతజ్ఞతలూ.)

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...

Bio

మెడికో శ్యాం

ఎంచుకున్న వృత్తి వైద్యమే అయినా, సాహిత్యమే ఆయన జీవన పథం.  చిన్నతనం నించే తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రముఖ రచయితల పుస్తకాలు ఎన్నెన్నో చదివి తన తండ్రి గారైన సి ఎస్ శర్మ గారు, చాసో, రోణంకి అప్పలస్వామి గారు తదితర విజయనగరంలోని ప్రముఖులతో సమానంగా సాహితీ చర్చలలో పాల్గొనేవారు.  వంగూరి ఫౌండేషన్ వారు ప్రచురించిన 'శ్యాం యానా' కథల పుస్తకం మెడికో శ్యాం సాహితీ మేధకు ఒక మచ్చుతునక. తను పుంఖాను పుంఖాలుగా కథలు రాయలేదు.  రాసిన కొన్ని కథలూ తను చేసిన ప్రయోగాలకు, పదునైన ఆలోచనాశక్తికి దర్పణం పడతాయి.  మెడికో శ్యాం ఆధునిక తెలుగు సాహిత్యానికి నడుస్తున్న ఒక ఎన్ సైక్లోపీడియా అంటే అతిశయోక్తి కాదు.

***

medico Shyam Chilavuri
Comments
bottom of page