top of page

 కాదేదీ కథలకనర్హం

Satyam Madapati

వ్యాస​ మధురాలు

సత్యం మందపాటి

ఎక్కడయినా, ఎప్పుడయినా మన సాహితీ మిత్రులని కలిసినప్పుడు, కొంతమంది అడిగే ప్రశ్న, “కథలు వ్రాయటం ఎలా?” అని.

వీరిలో కథలు వ్రాద్దామనే కుతూహలం వున్నవారు కొందరయితే, రచయితల ఆలోచననా స్రవంతి ఎలా కథారూపం దాల్చుతుందో తెలుసుకోవాలనుకునేవాళ్ళు కొంతమంది.

ఇక్కడ మిగతా రచయితల తరఫున వకాల్తా తీసుకుని చెప్పే స్థోమతా, అర్హతా నాకు లేవు కనుక, నా స్వంత అభిప్రాయాలు ఎలా వున్నాయో, నేను అభిమానించే రచయితల రచనల ద్వారానూ, వారి మాటల  ద్వారానూ ఏకలవ్య శిష్యత్వంతో నేర్చుకున్నదీ కలిపి చెబుదామని వుంది.

కథలు వ్రాయటంలో ఒక సంప్రదాయం, నియమం, లక్షణంలాటివి వున్నాయా అనేది మొదటి ప్రశ్న.

అలా సంప్రదాయ పద్ధతిలోనే కథలు వ్రాసే రచయితలూ, ఆ బాణీలో వ్రాసినవే మంచి కథలు అని నిర్థారించే కథా విమర్శకులూ, కథలు వ్రాయటం అంత సులభంకాదనీ, కథకు వుండవలసిన లక్షణాలన్నీ లేని కథ కథ కాదనీ వాదించటం మనం వింటూనే వున్నాం. కానీ ఎన్నాళ్ళనించో ఉత్తమ కథలు వ్రాస్తున్న కొందరు రచయితలు, ఈ వాదనతో ఏకీభవించకపోవచ్చు. కొందరయితే, కథాకథనంలో కొత్త పుంతలు తొక్కుతున్న రచనలు రావాలంటే మరి, ఆ నియమాల చట్రంలోనించీ బయటికి రాకపోతే ఎలా? అని కూడా ప్రశ్నిస్తారు.

అంతేకాదు, పశ్చిమ దేశాల్లో అయితే, కథలు వ్రాయటంలో శిక్షణ అవసరం అనే వాదన బలంగా వుంది. ఉదాహరణకి, 1996లో నా మొదటి పుస్తకం “అమెరికా బేతాళుడి కథలు” విడుదల అయిన సందర్భంలో మా వూరి పేపర్లో నన్ను ఇంటర్వ్యూ చేసిన ఒక అమెరికన్ యువతి, “మీరు కథలు వ్రాయటంలో ఫార్మల్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు?” అని అడిగింది. ఆవిడ ఉద్దేశ్యం ఏ స్కూల్లో కథలు వ్రాయటం చదువుకున్నారు అని. నేను “అదేమీ లేదు, నాకు ఇరవై ఏళ్ల వయసు వచ్చినప్పటినించీ, నా అంతట నేనే వ్రాస్తున్నాను” అంటే ఆవిడ నమ్మలేదు. నాకు తెలిసినంతవరకూ రావిశాస్త్రి, గోపీచంద్, కారా, బీనాదేవి, కొకు, మధురాంతకం, పద్మరాజు, ముళ్ళపూడిలాటివారు కథలు వ్రాయటం ఏ స్కూల్లోనూ చదువుకోలేదు. వారి జీవితమే వారికి ఆ స్పందన ఇచ్చింది. ఆ స్పందనే వారి రచనలకి ఊపిరి అయింది. దానిని వారికి తెలిసిన వారివారి బాణీలలో వ్రాసి మహా రచయితలయినారు.

ఇక్కడ నాకు తెలిసిన ఒక ఉదాహరణ చెప్పాలి. కొన్నేళ్ళక్రితం మా ఆస్టిన్ తెలుగు సాహిత్య సదస్సుకి, నా అభిమాన రచయిత గోపీచంద్ గారి కూతురు రజనిగారిని ఆహ్వానించాం. అప్పుడు ఆవిడ నాకొక కాసెట్ బహుమానంగా ఇచ్చారు. దానిలో గోపీచంద్ మాటల్లో ఆయన కథలు ఎలా వ్రాస్తారో చెప్పారు. ఆ కాసెట్ ఇంకా నా దగ్గర భద్రంగా వుంది. దానిలో ఆయన చెప్పింది నా మాటల్లో నేను చెబుతున్నాను ...

“రెండు మూడేళ్ళ కుర్రవాడు పరుగెత్తుకుంటూ వస్తూ రోడ్డు మీద పడిపోతాడు. అది చూసి ఒకావిడ ‘అరెరే! పిల్లవాడు పడిపోయాడే’ అంటుంది ఆదుర్దాగా. ఒకాయన కోపంగా  ‘కళ్ళు మూసుకుని పరుగెత్తుతాడు’  అంటాడు. వాళ్ళ నాన్న అయితే ‘వెధవా, నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా’ అని వీపు మీద ఒకటి తగిలిస్తాడు. వాళ్ళ అమ్మ గబగబా పరుగెత్తుకుని వచ్చి, వాడిని ఎత్తుకుని హృదయానికి హత్తుకుంటూ ‘దెబ్బ తగిలిందా నాన్నా’ అంటుంది. ఇక్కడ జరిగినది ఒకటే సంఘటన, కానీ ఎన్ని రకాల స్పందనలో చూడండి. అదే ఒక రచయిత కంట పడితే ఒక కవితకో, కథకో నాంది కావచ్చు. ఒక చిత్రకారుడి కంట పడితే ఒక చక్కని చిత్రరూపణ జరగవచ్చు’ 

 

సరే స్పందిస్తామండీ… మరి కథకి వుండాలి అంటున్న లక్షణాల సంగతో...?  అదీ చూద్దాం!

లాక్షణికులు చెప్పేది ఏమిటంటే, కథకి ముఖ్యంగా కావలసినవి ఒక వస్తువు, శైలి, శిల్పం అని. ఇక్కడ వస్తువు అంటే కథాంశం. Theme లేదా Subject.  శైలి అంటే Style లేదా Manner of Expression. రచయిత తన భావాలని అక్షరరూపంలో తెలిపే విధానం. శిల్పం అంటే కథనం. Story Structure లేదా Technique. రచయిత కథని చెప్పే విధానం. 

దీనిలో కథా వస్తువు, అంటే ఇతివృత్తం, గోపీచంద్ చెప్పినట్టు, రచయిత చూసిన/విన్న/చదివిన సంఘటనల వల్ల వచ్చిన స్పందన, చాలమంది రచయితల కథలకు వస్తువు అవుతుంది. ఏదో కథల పోటీకి వ్రాయాలి కాబట్టి, అప్పటికప్పుడు కూర్చుని దేనిమీద కథ వ్రాయాలా అని ఆలోచించి ఏది తడితే అది వ్రాసే దానికన్నా, నా ఉద్దేశ్యంలో ఇలా రచయిత స్పందన వల్లే మంచి కథలు వచ్చే అవకాశం వుంటుంది. శ్రీశ్రీ అగ్గిపుల్లా, కుక్కపిల్లా, సబ్బుబిళ్ళా కాదేదీ కవితకనర్హం అన్నారు. అలాగే కథలకి కూడా అన్నీ అర్హమైనవే. రావిశాస్త్రి, శ్రీశ్రీ చెప్పిన వాటన్నిటి మీదా, ఆరు సారా కథలు వ్రాసేశారు!

ఇక శైలికి వస్తే, ఎవరి శైలి వారిదే. మరి ఆ శైలి ఎక్కడినించీ వస్తుంది? రచయిత మామూలుగా ఎలా మాట్లాడుతాడో అక్కడినించే ఆ శైలి వస్తుందని నా అభిప్రాయం. ముళ్ళపూడిగారితో మాట్లాడుతుంటే, ఆయన సంభాషణ ఎంతో హాస్యపూరితంగా వుంటుంది. అదే ఆయన శైలి. హాస్యంగా చెబుతూనే, అప్పుడప్పుడూ చెంప మీద చెళ్ళుమని కొట్టటం ఆయన ట్రేడ్ మార్కు. “నవ్వొచ్చినప్పుడు ఎవరైనా నవ్వుతారు, ఏడుపు వచ్చినప్పుడు నవ్వేవాడే హీరో!” అనగల సత్తా ఆయన ఒక్కరికే వుంది. ఒక్కొక్కప్పుడు ఆ శైలి కథలోని పాత్రలనిబట్టి మారుతుంటుంది కూడాను.

కారా, బీనాదేవి, రావిశాస్త్రి, భమిడిపాటి, మల్లాది, మునిమాణిక్యంలాటి మహా రచయితల శైలి ఎవరిది వారిదే. 

మరి ఎలాంటి శైలి మంచిది? రమణగారే చెప్పినట్టూ, అన్నీ మంచివే. పాఠకుడిని రచనా ప్రవాహంలో అలా చదివించుకుని పోయేదే మంచి శైలి అని నా అభిప్రాయం. కథ చెప్పే విధానం, వాడే పదాలు, వాక్యాలు, సంభాషణలు, వర్ణనలు, పాత్రలనుబట్టి వివిధ రసపోషణలూ శైలిలో భాగాలే. వర్ణన కానీ, హాస్యం కానీ కథకి అడ్డు రాకుండా, కథా కథనానికి తోడ్పడితే పాఠకులకు విసుగు పుట్టదు. బీనాదేవి, రంగనాయకమ్మ వర్ణనని హాస్య పూరితంగానే కాక, వాడిగా వాడి, చురకలంటించి కొత్త ప్రయోగాలు చేశారు. రావిశాస్త్రి, పురాణం  వ్యంగ్యం ఎక్కువగా చూపించారు. ముళ్ళపూడి, భమిడిపాటి, శ్రీ రమణ హాస్యాన్ని సునిశితంగా వాడారు. గోపీచంద్, బుచ్చిబాబు, కారా, కొడవటిగంటి మొదలైనవారు కథని చెబుతూనే, మనలో ఎన్నో ఆలోచనలు రేకెత్తించేవారు. కొందరు రచయితలు తాము చెప్పదలుచుకున్నది సూటిగా, క్లుప్తంగా చెప్పారు.

 

ఇక శిల్పం అంటే ఏమిటి అని కొందరు అడిగితే, కథకి శిల్పం అవసరమా అని అడిగారు ఇంకొందరు. కథాకథనమే శిల్పం. ఒక ఇతివృత్తం తీసుకుని, కథని నిర్మించే పద్ధతి శిల్పం. ప్రారంభం, నడక, ముగింపు ఆ శిల్పంలో భాగాలు. కథ చెప్పే విధానాన్నిబట్టి, ఒకే ఇతివృత్తాన్ని ఎన్నో రకాలుగా వ్రాయవచ్చు. అది రచయిత ఊహ, తెలివితేటలూ, అనుభవాన్ని బట్టి మారుతుంటుంది. కథకు శిల్పం అవసరమా అన్నదానికి అర్ధం లేదు. ప్రారంభం, నడక, ముగింపూ వున్న ప్రతి కథకీ , రచయిత కావాలనుకున్నా వద్దనుకున్నా ఆ శిల్పం వుండనే వుంటుంది. కొన్ని కథలు ఉపన్యాస ధోరణిలో వున్నాయనీ, ముగింపులో పస లేదనీ, కొంచెం చదవగానే కథ అంతా తెలిసిపోయిందనీ, చెప్పదలుచుకున్నది రచయిత సరిగ్గా చెప్పలేకపోయాడనీ మనం కొన్ని విమర్శలు వింటూ వుంటాం. దానికి ముఖ్య కారణం ఆ కథకి సరైన శిల్పం లేకపోవటమే!

నాకు బాగా ఇష్టమైనది కథకి ఇచ్చే ముగింపు. పాఠకులు ఊహించని విధంగా కథని ముగించితే, వాళ్ళని ఆశ్చర్యంలో ముంచగలిగితే, ఆ కథ పాఠకులకు ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం వుంటుందని నా అభిప్రాయం. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ కథల ముగింపు అంత గొప్పగా వుండటానికి కారణం ఏమిటని ఆయన్ని   అడిగితే, ఆ సస్పెన్స్ కథా రచయిత ‘కథని  పాఠకులు ఊహించినట్టుగా నడిపిస్తూ, హఠాత్తుగా నూట ఎనభై డిగ్రీలు తిప్పి, వాళ్ళని విభ్రాంతుల్ని చేయటమే’ అని అంటాడు. కొన్ని కథలు మంచి చమత్కారంతో ముగుస్తాయి. కొన్ని హృదయాన్ని బరువెక్కించి ముగుస్తాయి. శ్రీరమణ ‘మిధునం’ ఒక అనుభూతిని మిగిల్చి ముగుస్తుంది. కొన్ని కథలు మంచి పంచ్ లైనుతో ముగుస్తాయి. ఎలా వ్రాసినా ఇలాటి ముగింపులు, మామూలు కథలని కూడా చాల కాలం గుర్తుండే కథలుగా నిలబెడతాయి.

నా ఉద్దేశ్యంలో మంచి కథకి అవసరమైన ముఖ్య లక్షణం ఒక్కటే ఒక్కటి. కథ చదవటం మొదలుపెట్టాక  చివరి దాకా దానంతట అదే వదలకుండా చదివించుకు పోయే శక్తీ, ఆసక్తీ కలిగించటం. కథ చదివాక, ఒక చక్కటి కథ చదివామన్న తృప్తిని, మళ్ళీ చదవాలనే కోరికని కలిగించటం. పాఠకులుగా మనం ఎలాటి కథలని  కోరుకుంటామో, వాటినే మన రచనల్లో తీసుకురాగలిగితే, పాఠకులకు నచ్చే అవకాశం వుంటుంది.

మరి కథకి వుండాల్సిన లక్షణాలు ఇన్ని వున్నాయి కదా, అవన్నీ ఏ ఏ పాళ్ళల్లో వుండాలి, అని అడుగుతున్నారు ఆత్రేయపురంనించీ ఆత్రేయగారు, ఆమదాలవలసనించీ ఆమదంగారు, మరి మీరేమంటారు రైటర్జీ? అని అడుగుతున్నారు కదూ..

ఇదేమయినా పిండివంటా,  పెళ్లి  వంటా... ఇవీ... ఇన్ని పాళ్ళల్లో వుండాలి అని చెప్పటానికి?

రచయిత తన ఊహలకి పూర్తి స్వాతంత్రాన్నిఇచ్చి, తన భావాల కళ్ళాలు వదిలి, కథ వ్రాస్తే మంచి కథ వస్తుంది. పైన చెప్పిన అన్ని లక్షణాలు తగు పాళ్ళల్లో సలక్షణంగా వాటంతట అవే వస్తాయి.

ఒక చిన్న కథ వ్రాసి చూడండి. నేను చెప్పేదేమిటో మీకే తెలుస్తుంది!

 

 

ఈ వ్యాసం ముగించే ముందు కాబోయే రచయితలకి రెండు సలహాలు ఇద్దామని వుంది.

ఒకటి: మీరు వ్రాసిన కథ, ఎంతమందికి నచ్చుతుందో, మరంతమందికి నచ్చకపోవచ్చు. దాన్ని కొందరు రాయని భాస్కరులు చీల్చి చెండాడవచ్చు. భయపడకండి. నిరుత్సాహ పడకండి. వారికోసం మీ కథలో మీకు నచ్చని మార్పులు చేయకండి. మీ కథ! మీ ఇష్టం!

రెండు: కథ వ్రాసేటప్పుడు, ఏ పత్రికలో వేసుకుంటారు, ఆ కథ ప్రచురించక పోతే ఎలా, భూమి బ్రద్దలై పోతుందా…  మొదలైనవి ఏవీ మనసులోకి రానీయకండి. మీకు నచ్చిన విధంగా ఒక మంచి కథ వ్రాయటానికి ప్రయత్నించండి. కథ బావుంటే, ఎవరైనా వేసుకుంటారు. వేసుకోకపోతే వాళ్ళకే నష్టం!

మరి ఇక మీదే ఆలస్యం... ఓ కథ వ్రాసేయండి!

మీ కథ కోసం ఎదురు చూసే వాళ్ళల్లో నేనూ ఒకడిని!

*****

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...
 

Bio

సత్యం మందపాటి

తూర్పు గోదావరి జిల్లా లోని ఆత్రేయ పురంలో పుట్టి గుంటూరులో పెరిగిన సత్యం మందపాటి గారు కాకినాడ, విశాఖపట్నం లో ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పట్టభద్రులు. త్రివేండ్రంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో పదేళ్ళు సీనియర్ ఇంజనీరింగ్ మేనేజర్ గా పనిచేశారు. ఆ నాటి యువ, జ్యోతి ల నుండి ఈ నాటి రచన, ఆంధ్రభూమి, నవ్య, కౌముది, సుజన రంజని మొదలైన అనేక పత్రికలలో ఐదు దశాబ్దాలుగా 200 కథలు, కవితలు, వ్యాసాలు, నాటకాలు, నవలలు, పత్రికలో దీర్ఘకాలిక శీర్షికలు రచించారు. అమెరికాలో అత్యధిక సంఖ్యలో కథలు రచించిన కథకుడు సత్యం గారే. కథా సంపుటులు, నవలలు, కవితా సంపుటి వెరసి 10 పైగా గ్రంధాలు ప్రచురించారు. సతీమణి విమల గారితో నాలుగు దశాబ్దాలుగా ఆస్టిన్ నగర నివాసి.

***

Jagadeeswaran Puduru
Comments
bottom of page