MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వ్యాస మధురాలు
అల్లసాని అల్లికలు-జగదీశుని మల్లికలు
పుదూరు షణ్ముగం జగదీశ్వరన్
సీ: సహృదయులార! సాహితీ ప్రియులార !
సభకు వచ్చినారు సాదరముగ
సరస పోషకులార! శాస్త్ర కోవిదులార!
సారంగ మతులార! సభ్యులార!
హూస్టను తెన్గు రాహుత్తులార! ప
ద్యరచనా మణులార! యార్యులార!
భారతీ కరుణా కృపాభవ్యులార! అం
తర్జాల భాషాభిధాన్యులార!
తే.గీ: ఇపుడు మీముందు నిలబడి ఇట్టి సభలొ
అల్లసాని అల్లికలపై సల్లలితపు
రీతి వాక్రుత్తు వర్ణింతు భూతలమున
చాటు పద్యాల చెప్పెద సభ ముఖమున
శిరసు వంచి దండంబిత్తు సురుచిరముగ
వంగూరి మహాశయులకు నమస్కారములు.
ఉ: వంగురి వంశసోమ వర వైభవ సద్గుణ ధామ మిత్రమా
సింగము గాదె నీవు గుణశేఖర శ్రీకర చారు సుందరా
రంగమభంగ శృంగమున రాజిలు హాస్య తరంగ కీర్తులున్
హంగులు పొంగు రంగులతొ హాటక గర్భుడు నీకు నిచ్చుతన్
జంగమ దేవరయ్య యిడు సౌఖ్యము నాయువు సర్వసిద్ధులన్
వంగూరి వారు నాకు ఒక ఈ-ఉత్తరము పంపిరి. దానిలో పేర్లు రెండు రంగులలో ఉన్నవి. ఎఱుపు మరియు నీలము. నా పేరు ఎఱుపు రంగులో ఉన్నది. నన్నెందుకు రిపబ్లికను చేసిరో నాకు అర్థము కాలేదు. మరొక్క విశేషము. ఈ రోజు నేనిచ్చే ప్రసంగానికి ఒక చిరు తాంబూలం ఇస్తానని హామీ ఇచ్చిరి. కానీ నిరుపహతి స్థలము లేదు. రమణీ ప్రియ ధూతిక తెచ్చి ఇచ్చు కప్పురపు విడెము లేదు. ఇవి అన్నియు లేక చిరు తాంబూలం ఇచ్చి ప్రసంగము చేయమని అడుగుట భావ్యము గాదని నా మనవి.
ఈ రోజు కవి సమ్మేళనము. అనగా కవుల కూటమి. ఇది ఎటువంటి కూటమి అని అడిగిన నాకు తెనాలి రామ లింగడు చెప్పిన పద్యము గుర్తొస్తున్నది.
కం: కవి యల్లసాని పెద్దన
కవి తిక్కన సోమయాజి గణుతింపంగా
కవి నేను రామ కృష్ణుడ
కవి యను నామంబు నీరు కాకికి లేదే
“కవి అంటే అల్లసాని పెద్దనయట. కవి అంటే తిక్కన అంట. నేను కూడ కవినే. నీరు కాకికి కూడ కవి యనే పేరుంది కదా” అని అంటాడు తెనాలి. “క” అంటే నీళ్ళు. “వి” అంటే పక్షి. కనుక కవి అంటే నీటి పక్షి లేక నీరు కాకి అని అర్థము.
మరి కవి సమ్మేళనం అంటే నీరు కాకుల కూటమి అనే అర్థం.
ఈ నాటి నా శీర్షిక "అల్లసాని అల్లికలు - జగదీశుని మల్లికలు". నా కిచ్చిన వ్యవధి ఇరువది నిముషములు. అంటే అల్లసాని అల్లికల పైన పది నిముషములు మరి నా పద్యములపై పది నిముషములన్న మాట. అల్లసాని పై పది నిముషములలో ప్రసంగించడం ఎవరి కైనను సాధ్యము గాదు. కాని ప్రయత్నించెదను. ఇంతకు మునుపు మీ సాహిత్య సదస్సులో అల్లసాని వారి పద్యములు ఒకటో రెండో మీకు వినిపించితిని. వానిని ఈ రోజు మీరు అడిగినా చెప్పను.
అల్లసాని పెద్దన కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో మొట్టమొదటి వాడు. చొక్కయామాత్యుని పుత్రుడు. ఆంధ్రకవితాపితామహుడు. ఒక రోజు కృష్ణ దేవరాయల వారు ఒక బంగరు పళ్ళెం తెచ్చి దానిలో గండ పెండేరాన్ని ఉంచి ఆస్థాన కవులను జూచి "మీలో ఎవరైనా సంస్కృతాంధ్ర భాషలలో సమానంగా కవిత్వం చెప్పిన యెడల వారికి ఈ గండ పెండేరం యిస్తాను" అని చెప్పారు. ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు కృష్ణ దేవరాయల వారు
ఉ: ముద్దుగ గండపెండియరమున్ గొనుడంచు బహూకరింపగా
నొద్దిక నాకోసంగు మనియొక్కరు గోరగలేరు లేరొకో
అనే పద్యం ప్రారంభించారు. అల్లసాని వారు లేచి ఆ పద్యాన్ని
“పెద్దన బోలుపండితులు పృథ్విని లేరని నీవెఱుంగవే
పెద్దన కీ దలంచినను పేర్మిని నాకిడు కృష్ణ రాణృపా”
అని పూరించారు. ఆ పైన ముప్పది పాదాల ఉత్పలమాలికను సగం పాదాలు అచ్చ తెన్గులో సగం సంస్కృతంలో ఆశువుగా చెప్పారు.
నేను:ఈ పద్యం ఏదో ఎవరికైనా తెలుసా?
సభ: పూత మెఱుంగులుం
నేను: పూర్తిగా తెలుసా?
సభ: తెలియదు
ఈ పద్యం చెప్పడానికి ఐదు నిముషాలు పడుతుంది. కాని చెపుతాను.
ఉ: పూత మెఱుంగులుం బసరు పూప బెడంగులు జూపునట్టి వా
కైతలు? జగ్గు నిగ్గు నెనగావలె గమ్మన గమ్మనన్వలెన్
రాతిరియున్ బవల్ మఱపురానిహొయల్ చెలి యారజంపు ని
ద్దాతరితీపులో యనగ దారసిలన్వలె లో దలంచినన్
బాతిగ బైకొనన్ వలెను బైదలికుత్తుకలోనిపల్లటీ
కూత లనన్వలెన్ సొగసు కోర్కులు రావలె నాలకించినన్
జేతికొలంది గౌగిటనుజేర్చినకన్నియ చిన్నిపొన్ని మే
ల్మూతలచన్నుదోయివలె ముచ్చట గావలె బట్టి జూచినన్
డాతొడనున్న మిన్నులమిటారపుముద్దులగుమ్మ కమ్మనౌ
వాతెఱ దొండపండువలె వాచవిగావలె బంటనూదినన్
గాతల దమ్మిచూలిదొర కైవసపుంజవరాలి సిబ్బెపు
న్మే తెలియబ్బురంపుజిగి నిబ్బర పుబ్బగుగబ్బిగుబ్బపొం
బూతలనున్నకాయసరిపోడిమి కిన్నెర మెట్లబంతి సం
గాతపు సన్నతంతి బయకారపు గన్నడగౌళపంతుకా
సాతతతానతానలపసన్ దివుటాడెడు గోటమీటుబల్
మ్రోతలునుంబలెన్ హరువు మొల్లము గావలె నచ్చ తెన్గు లీ
రీతిగ, సంస్కృతంబు పచరించెడుపట్టున భారతీవధూ
టీతపనీయగర్భనికటీభవదాననపర్వసాహితీ
భౌతికనాటక ప్రకరభారతభారతసమ్మతప్రభా
శీత నగాత్మజా గిరిజ శేఖర శీతమయూఖ రేఖికా
పాతసుధా ప్రపూరబహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ
జాతకతాళయుగ్మ లయసంగతి చుంచువిపంచికామృదం
గాతతతేహితత్తహితహాధితధంధణుధాణుధింధిమి
వ్రాతనయానుకూలపదవారకుహూద్వహహారికింకిణీ
నూతన ఘల్ఘలాచరణనూపురఝాళఝళీమరందసం
ఘాతవియధ్ధునీ చకచకద్వికచోత్పలసారసంగ్రహా
యాతకుమారగంధవహహారిసుగంధవిలాసయుక్తమై
చేతము చల్లజేయవలె జిల్లన జల్లవలెన్ మనోహర
ద్యోతకగోస్తనీఫలమధుద్రవగోఘృతపాయస ప్రసా
రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారెసారెకున్
ఈ విధంగా పెద్దన గారు చెప్పిన మరు క్షణమే రాయల వారు ఆంధ్ర కవితా పితామహుడైన పెద్దన గారి వామ పాదానికి గండ పెండేరాన్ని తొడిగారు. అంత గొప్ప వాడైన పెద్దన కూడ తెనాలి గారి వ్యాఖ్యానానికి గురి అయ్యారు. ఒకప్పుడు పెద్దన రచించిన
“కలనాటి ధనములక్కర
గల నాటికి డాచ కమలగర్భుని వశమా
నెలనడిమి నాటి వెన్నెల
అలవడునే గాడె బోయ అమవస నిసికిన్.”
అనే పద్యంలో "అమవస నిసికిన్" అనే పదప్రయోగం బాగలేదని
“ఎమి తిని సెపితివి కపితము
బ్రమపడి వెఱిపుచ్చకాయ వడి దిని సెపితో
యుమెతకయ తిని సెపితివో
యమవసనిసి యనెడిమాట యలసని పెదనా”
అనే పద్యం తెనాలి రామ లింగ కవి చెప్పారు. అది మీ కంతా తెలిసినదే. ఇది తమాషాగా చెప్పిన పద్యం గాని నిజంగా తెనాలి రామ లింగ కవికి పెద్దన పైన చాల గౌరవం అట. అసలు “అమవస, నిసికిన్” అనే పదాలు వికృతి పదాలు. తప్పేమియును లేదు.
మరొక్క సారి
శరసంధాన బలక్షమాది వివిధైశ్వర్యంబులుం గల్గి దు
ర్భరషండత్వ బిలప్రవేశకలన బ్రహ్మఘ్నతల్ మానినన్
నరసింహక్షితి మండలేశ్వరుల నెన్నన్ వచ్చు నీ సాటిగా
నరసింహక్షితి మండలేశ్వరుల కృష్ణా! రాజ కంఠీరవా!
అనే పద్యాంతంలో “రాజ కంఠీరవా” “ఓ రాజ సింహమా” అని రాయలను సం బోదిస్తాడు పెద్దన. “తోక ముడుచుకొని బిలప్రవేశం చేసే సింహం కృష్ణదేవరాయలకు సాటి కాదంటూ కృష్ణదేవరాయలను రాజసింహమా అని సంబోధించడం సమంజసంగాదని తెనాలి రామ లింగ కవి పెద్దనను ఆక్షేపించి! అలా కాదు ఇలా అని
కలనం దావక ఖడ్గ ఖండితరిపుక్ష్మాభర్త మా ర్తాండ మం
డల భేదం బొనరించి యేగునెడ దన్మధ్యంబునన్ హారకుం
డల కేయూరకిరీటభూషితుని శ్రీ నారాయణుం గాంచి లో
గలగం బాఱుచు నేగె నీవ యను శంకన్ గృష్ణరాయాధిపా!
అనే పద్యాన్ని చెప్పాడు తెనాలి. “యుధ్ధంలో నీ ఖడ్గం తో ఖండింప బడిన శత్రు రాజు సూర్య మండలాన్ని దాటి వీర స్వర్గానికి వెళ్ళే టప్పుడు ఆ మధ్యలో మహా విష్ణువును జూచి నీవేనని భయపడి పారిపోయాడు, కృష్ణ రాయాధిపా!” అంటాడు. ఇచట మాత్రము తెనాలిదే పైచేయి.
ఇక పెద్దన గారి "మను చరిత్ర" ను గురించి కొన్ని విషయాలు చెపుతాను. మను చర్రిత్రకు పెద్దన గారు పెట్టిన పేరు స్వారోచిష మను సంభవము. అనగా స్వారోచిష మనువు యొక్క జన్మ వృత్తాంతం అని అర్ట్థము. కాని ఇది మను చరిత్ర గా ప్రజల వాడుక వలన మారి పోయింది. ఏది ఏమైనను మను చరిత్ర తెలుగులో ఉన్న పంచ మహాకావ్యాలలో మొట్ట మొదటిది. మను చరిత్రలో కథ ఏమంత పెద్దది గాదు. ప్రభంధ రూపమే పరాకాష్ఠ. ఈ మను చరిత్రలో ఉన్న ప్రతి పద్యము, మకరందం తో కలిపిన ఖండ శర్కర. ఏ పద్యానికి ఆ పద్యమే సాటి. ముందు క్లుప్తంగా మీకు మను చరిత్ర కథ చెప్పి ఆ తర్వాత కొన్ని పద్యాలను విమర్శ చేద్దాము.
ప్రవరుడు పాదలేపనం పూసుకొని హిమాలయాలకు వెళ్తాడు. ఆచట అది కరిగి పోతుంది. ఇంతలో వరూధిని వస్తుంది. ఆమె అతనిని మోహిస్తుంది. అతడు తిరస్కరిస్తాడు. అగ్ని దేవున్ని ప్రార్థిస్తాడు. తిరిగి ఇంటికి వస్తాడు. ఇంతటితో కథ అయిపోయింది. కాని పెద్దన ఇక వరూధిని కథ చెబుతాడు. ఒక గంధర్వుడు ప్రవరుని వేషంతో వరూధినిని మోసం చేసి ప్రేమ లోనికి దింపి, విడిచిపెట్టి వెళ్తాడు. వరూధిని గర్భవతి అవుతుంది. వారికి స్వరూచి పుడుతాడు. మరొక్క గంధర్వుడు (ఇందీవరాక్షుడు) గురువు శాపంతో రాక్షసుడు అవుతాడు. కూతురుని (మనోరమ) మ్రింగ బోతాడు. స్వరూచి వలన శాప విమోచనం చెంది తన కూతురుని అతనికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆమెకు ఇద్దరు చెలికత్తెలు (కళావతి, విభావసి). వారిని కూడ స్వరూచి వివాహ మాడతాడు. ఈ ముగ్గురు భార్యలకు మువ్వురు కొడుకులు పుడుతారు. వారికి స్వరూచి మూడు రాజ్యాలనిచ్చి వానిని ఏలుకోమంటాడు. ఒక నాడు స్వరూచి వనవిహారం చేస్తూ ఉండగా, దేవతల ప్రేరేపణ వలన లేడి రూపంలో ఉన్న వనదేవతను ఆమె బతిమాలగా, కౌగలించు కుంటాడు. వనదేవత నిజ స్వరూపము దాల్చగా, ఆమెను వివాహ మాడుతాడు. విరక్తి జెంది మొదటి ముగ్గురు భార్యలను విడిచిపెట్టి వనదేవతతో కాపురం చేసి స్వారోచిషున్ని కంటాడు. అతడే పదునాల్గు మనువులలో ఒకడు. అందుకే ఇది స్వారోచిష మను సంభవం లేక మను చరిత్ర అయింది.
ఇది వరకే మీ సభలో అరుణాస్పద పుర వర్ణన, హిమవన్నగ దృశ్యాల గూర్చి చెప్పిన “అట జని గాంచె” అనే పద్యాలని వినిపించాను. అందుకే ఇపుడు వానిని చెప్పదలచుకొ లేదు. ఈ నాడు ఒకటో లేక రెండు ఘట్టాలను మాత్రము పరిశీలిద్దాం. వరూధిని ప్రవరున్ని జూచినపుడు చక్కని పద్యం పెద్దన చెపుతాడు.
ఉ: చూచి ఝళంఝళత్కటక సూచిత వేగ పదార వింద యై
లేచి కుచమ్ములన్ దుఱుములేనడు మల్లల నాడనయ్యెడన్
బూచిన యొక్క పోక నునుబోదియ జేరి విలోకనప్రభా
వీచికలన్ దదీయ పదవీకలశాంబుధి వెల్లిగొల్పుచున్.
ఈ పద్యంలో “తుఱుము” అనే పదం చాల గొప్పది. తుఱుము అంటే మనం టెంకాయను తుఱుముతాము గదా. అంటే ఆ కుచములు టెంకాయల వలె ఉంటాయట. ఇక్కడ చక్కగా గుండ్రంగా అనే గాక, స్తన కాఠిన్యతను కాళి దాసు లా చెప్పకయే చెపుతున్నాడు కవి.
మరొక్క ఘట్టంలో ఇందీవరాక్షుడు ఆయుర్వేదం నేర్చుకునేందుకు ఒక గురువు వద్దకు వెళ్తాడు. ఆతడు “నీకెందుకు ఈ విద్య”
“నట విట గాయక గణికా
కుటిల వచ శ్శీథురసము గ్రోలెడి చెవికిం
కటువీశాస్త్రము వలది
చ్చటనిను జదివింపకున్న జరుగదె మాకున్”
అని హేళన చేస్తాడు. అందుకు గంధర్వుడు మారు వేషంలో వచ్చిఆ గురువు వద్దనే ఆయుర్వేదం నేర్చు కుంటాడు. ఊరక పోక క్రొవ్వెక్కి గురువు వద్దకు వెళ్ళి
“తండ్రీ! నాకు ననుగ్రహింపగదె వైద్యంబంచు బ్రార్థించినన్
గండ్రల్ గానటు లాడి ధిక్కృతుల బోకాల్మంటి వోహో! మదిం
దీండ్రల్ గల్గిన వారి కేకరణినేనిన్ విద్య రాకుండునే?
గుండ్రా డాచిన పెండ్లి యేమిటికి చిక్కున్ కష్ట ముష్టింపచా!”
“నువ్వు వద్దన్న మాత్రాన నేను నేర్చుకోలేననుకొంటివా? గుండ్రాయి దాచినంత మాత్రాన పెండ్లి నిలిచి పోతుందా?” అని అంటాడు. ఈ విధమైన సామెతలు వాడడానికి అందె వేసిన చేయి పెద్దన గారిది. అపుడు గురువు కోపంతో ఇందీవరాక్షున్ని శపిస్తాడు. అతని కోపాన్ని ఎంత అద్భుతంగా వర్ణిస్తాడో చూడండి.
మ: అనినన్ కన్నులు జేవురింప నధరంబల్లాడ వేల్లత్పునః
పున రుద్యద్భ్రుకుటీ భుజంగ యుగళీ పూత్కారరానిలం
బన నూర్పుల్ నిగుడన్ లలాటఫలకంబందందఘర్మాంబువుల్
చినుకన్ కంతు దిదృక్ష రూక్ష నయన క్ష్వేళా కరాళ ధ్వనిన్.
ఈ పద్యంలో ఇన్ని సంస్కృత పదాలున్నా ఆ కోపం మీకు తెలిసి పోతుంది. కన్నులు ఎఱ్ఱ బడడం. కనుబొమలు రెండుపాముల వోలె బుసలు కొట్టడం. ఆ బుసలు ఒక పెద్ద సుడి గాలిలా ఉండడం. నొసట అచ్చటచ్చట స్వేద బిందువులు రాలడం. శివుడు మన్మథుని దహించేటప్పుడు ఏ విధంగా అగ్ని నేత్రాలతో రుద్రుడై శబ్దం చేసెనో ఆ విధంగా సింహ నాదం చేయడం. ఎంత కోపమో మీకు కన్నులకు కట్టినట్లు తెలుస్తుంది. ఎంత గొప్ప వర్ణనో! ఇంతటితో పెద్దన అల్లికల గూర్చి చెప్పుట విరమిస్తాను.
ఇక జగదీశుని మల్లికలు. నేను శ్రీనాథున్ని అనుకరిస్తూ వ్రాసిన రెండు పద్యాలు మీకు వినిపిస్తాను. శ్రీనాథుడు తన చాటు పద్యాలలో ఒక అందాల స్త్రీ ని జూచి
సీ: సొగసు కీల్జడ దాన సోగ కన్నుల దాన
వజ్రాల వంటి పల్వరుస దాన
బంగారు జిగిదాన బటువు గుబ్బలదాన
నయమైన యొయ్యారి నడలదాన
తోరంపు గటిదాన తొడల నిగ్గులదాన
పిడికిట నడగు నెన్నడుముదాన
తళుకు జెక్కులదాన బెళుకు ముక్కరదాన
సింగాణి కనుబొమ చెలువుదాన
తే. గీ: మేలిమి పసిండిరవ కడియాలదాన
మించి పోనేల రత్నాల మించుదాన
తిరిగి చూడవె ముత్యాల సరులదాన
చేరి మాటాడు చెంగావి చీర దాన
అని అంటాడు. నేను ఈ దేశానికి వచ్చినపుడు తెల్ల పిల్లలను చూశాను. శ్రీనాథుడు గుర్తు కొచ్చాడు. అపుడు నేను చెప్పిన పద్యమిది.
సీ: పిల్లి కన్నులదాన తెల్ల దేహపుదాన
మిలిటరీ నడదాన మిణుకుదాన
చిఱుత కురులదాన పిఱుదు హెచ్చినదాన
చిన్నస్కర్టులదాన సన్నదాన
సిగ్గన్న తెలియని చిన్నారి కటిదాన
బుగ్గకు రంగులన్ పూయుదాన
బొట్టును ముఖమున పెట్టని పసిదాన
సిగరెట్ల నూదెడి చిన్నదాన
తే. గీ: సూటు బూటుల దాన ఓ సోకుదాన
గౌను వేసెడి టక్కరి గడుసుదాన
బ్లౌసు వేయని దాన ఓ బడుసుదాన
చేరి మాటాడు నాతోడ సీమదాన
మరొక్క పద్యం. కాశీఖండంలో శ్రీనాథుడు, అగస్త్యుడు కాశిని విడిచి వెళ్ళు నపుడు ఎంత బాధ పడినాడో అనే ఘట్టాన్ని వర్ణిస్తాడు.
సీ: పరమ కళ్యాణి భాగీరథీ గంగ
వార్థిభామిని పోయి వత్తునమ్మ
యమరేంద్రులార లోలార్కకేశవులార
వనజ సంభవ పోయి వత్తునయ్య
శ్రీ విశాలాక్షి దాక్షిణ్య పుణ్య కటాక్ష
వాసవార్చిత పోయి వత్తునమ్మ
శ్రీ పూర్ణభద్ర పారిషదనాయకులార
వటుక భైరవ పోయి వత్తునయ్య
తే. గీ: తీర్థసంవాసులార కృతార్థులార
పాశుపతులార భాగ్యసంపన్నులార
మందిరోద్యాన వాటికామఠములార
పోయి వత్తునె మీ కాశి పురము విడిచి
అని వర్ణిస్తాడు. ప్రతి పుట్టకు, చెట్టుకి చెపుతాడు. “కాశి పురము” అని చెప్పడు. “మీ కాశి పురము” అంటాడు. అంటే ఇంత వరకు కాశిలో అతడుండేవాడు. ఇపుడు వీడి పోవుచున్నాడు గదా. ఇక అది మిగత వారి పురము. అందుకే మీ పురము అన్నాడు. దీనిని అనుకరిస్తూ నేను మా ఊరు కార్వేటినగరం విడిచి అమెరికా వచ్చినపుడు చెప్పిన పద్య మిది.
సీ: తండ్రి షణ్ముఖ నామ, తమ్ముడా సుబ్రాయ,
పోయి వచ్చెద నేను పురము వీడి
తల్లి సరోజమ్మ, దైవమ్ము నీవమ్మ
పోయి వచ్చెద నేను పురము వీడి
రాజరాజేశ్వరీ, రమణీయ సౌభ్రాత్రి
పోయి వచ్చెద నేను పురము వీడి
గిరిజా, ప్రభావతీ, కరుణ, ఉమాదేవి,
పోయి వచ్చెద నేను పురము వీడి
తే.గీ: చంద్రశేఖర భవనమా, చనెద చనెద
వెళ్ళి వచ్చెద నిప్పుడు బొల్లి గుట్ట,
స్కంద పుష్కరిణీ, కృష్ణు మందిరమ్మ,
పోయి వచ్చెద నగరమా, పోయి వత్తు
మన వంగూరి వారు రచించిన ఒక పుస్తకంలో తెలుగు సభలను ఉద్దేశించి ఒక మంచి వచనం వ్రా సిరి. వారు వాడిన పదాలను మాత్రమే వాడుతూ దాన్ని నేను పద్య రూపంలో పెట్టాను. అది వినిపిస్తాను.
సీ: నన్నయాదులునంత కన్న తల్లికి భువిని
సన్న జాజుల మాల లన్ని యిడుచు
ఆంధ్ర కేసరి సువీరాంధ్ర మాతకు సాంద్ర
కర్పూర హారతుల్ కలిసి యిడుచు
రాళ్ళనే కరగించు రాగమాలికలైన
త్యాగయ్య గానాల సొగసు వొంది
కూచిపూడి సుకళా కోమ లాంగికి యట్లు
చారు గంభీర నంజలులు నిడుచు
తే:గీ: అమెరికా యందు సభ లోన ఆంధ్ర మాత
కింక యిత్తుము సాహిత్య పంకజముల
మురిసి పోదము మన మంత ముదము మీర
వెలుగు, తెలుగు భాషాభి మానులము గాదె
మరొక్క పద్యం.
ఉ: ఇటలీ దేశము నందు పుట్టితివి ---
నేను:ఈ పద్యం దేని పైన వ్రాసితినో చెప్ప్గగలరా?
సభ: సోనియా గాంథి
నేను: కాదు.
సభ: పిజ్జా
సంతోష పడి ఇదిగో పద్యం
మ: ఇటలీ దేశము నందు పుట్టితివి నీ విష్టమ్ముగా నాడు ఆ
అట లాంటిక్ ఘన సాగరంబును ప్రభన్ అబ్బో మరిన్ దాటితీ
వటులే పీజ్జవు నిన్ను జూచిరి గదా అమ్మేరికన్ లిప్పుడే
పటు విస్తార పవిత్రతన్ గొలుతురే బ్రహ్మాండ భాగ్యంబుతో
+++++++
సభ: పకోడి పైన పద్యం చెప్పండి.
కం: సొరకాయ వంటి కూరయు
సరసిజ ముఖి రంభ వంటి సాధ్వీమణియున్
సురరాజు వంటి దైవము
గరగర మను పకొడి వంటి కారము గలదే
ఇంతకు ముందే ఒక సారి చప్పాతి పైన పద్యం మీకు వినిపించాను గనుక దానిని చెప్పదలచుకో లేదు.
సభ: మరల చెప్పండి.
సీ: చక్రమ్ము వలె నుండు చక్రమ్ము గాదది
చర్మమ్ము వలె నుండు చర్మ మగునె?
నోటిలో పెట్టంగ నొప్పి పుట్టగ జేయు
పంటికి సైతమ్ము పనిని బెట్టు
రెండు చేతుల తోడ రెండు జేయగ లేము
సగము తెలుపుగ నుండు సగము నలుపు
అట్లు గాదని తిన ఆస్పత్రికింజేర్చు
కడుపు నొప్పిని తాను కలుగ జేయు
తే:గీ: అహహ! ఏమెస్సు చప్పాతి యన బరంగు
అఘము లొనరింప పూర్వ జన్మంబు నందు
స్వామి యిట్టుల శిక్షించె యేమి చెపుదు
సత్య ధీధితి తెలుగు సాహిత్య సమితి
చప్పాతి పైన మాత్రం చెపితే చాలదు. ఇది ఊతప్పం పైన పద్యం.
శా: ఊతప్పమ్మట పిండి వంట యట నేనూహింప దుస్సాధ్యమౌ
ఏతప్పుల్ మరి జేసినానొ ఈ ఏ మెస్సు ఊతప్పమున్
చేతందాకిన రాయి వోలె యనిపించెన్ దాని పుణ్యంబనన్
ప్రాతః కాలము నందు స్రుక్కె ఉదరంబట్లే కఫేటీరియా
రాతన్వీ తనయా యనింబిల్వ కారంబైన బోండాలతో
నీతిందప్పి డిపార్టుమెంటు వదలిర్నిష్ణాతులానంద సం
జాతోత్సాహపు కప్పు సిప్పులతొ తాజా కొల్పు టీ నీళ్ళతో
మేతంబెట్టిరి సైన్సు పండితులు టీ మేదిన్ యశంబందుకో
*****
మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...
పుదూరు షణ్ముగం జగదీశ్వరన్
డా. పూదూర్ జగదీశ్వరన్‌గారు ఉత్తర టెక్సాస్ విశ్వవిద్యాలయంలో మానవ-జన్యు శాస్త్రంలో అధ్యాపకులుగ పని చేస్తున్నారు. చిన్నతనం నుండీ పద్యసాహిత్యంపై మక్కువ పెంచుకొన్న పూదూర్‌గారు పదేళ్ళ వయసులో తమ మొదటీ పద్యం ఉత్పలమాల వృత్తంలో వ్రాసి, 14 ఏళ్ళ వయసులో మొదటి అష్టావధానం చేశారు. భారతదేశంలోనూ, అమెరికాలోనూ పలు అవధానాలు చేసిన వీరు పలు శతకాలు (లక్ష్మీ శతకము, చంద్రశేఖర శతకము, అభాగ్య శతకము, మొ.) రచించి, సహ్స్రాధికమైన ఆశుపద్యాలు (ప్రశస్తి చెందిన చపాతీ, పకోడీ పద్యాలతో సహా) కూడా సందర్భోచితంగా చెప్పారు. విశ్వనాథ వారిచే, కంచి కామకోటి పీఠాధిపులచే సన్మానింపబడ్డారు. అమెరికాలోని డాలస్ నగరంలో వీరి నివాసం.
***