top of page

వ్యాస​ మధురాలు

సి. పి. బ్రౌన్- పూర్వాపరాలు

Bhushan

తమ్మినేని యదుకుల భూషణ్

వచనం మీద ఎవరికీ శ్రద్ధ లేదు. కాస్తో కూస్తో రాయడం వచ్చిన ప్రతి ఒక్కరూ కవి అనిపించుకోవడానికి ఉబలాటపడతారు. కాబట్టి, గత నలభై ఏళ్లుగా గమనిస్తే, వచనం అన్నది నశించి పోతోంది. చక్కని వచనం బాగా రాసేవారు  చాలా తక్కువ మంది. పండితులు అనుకునే వారి వచనం చూస్తే అందులో ఏమీ కండ ఉండదు. అంటే బుద్ధికి పని పెట్టగల  -తర్క ప్రజ్ఞ, భావావేశం రెండూ కలగలసిన- వచన శైలి రోజు రోజుకు దిగనాసిల్లి పోతోంది  కాబట్టి, పాండిత్యం అనగానే వచనం రాయగల ప్రజ్ఞ. అలాంటి ప్రజ్ఞ గల వాడే పండితుడు. అలాంటి వారిని గుర్తించి వారికి ప్రోత్సాహకరంగా ఈ అవార్డు తీసుకొచ్చాము- సి. పి.  బ్రౌన్ అవార్డు. 

 

ఇక సి.పి.బ్రౌన్ పేరే ఎందుకు పెట్టుకోవాలి? మనకేమీ పండితులు లేరా  తెలుగులో అని ఒక ప్రశ్న రావచ్చు. మానవల్లి  రామకృష్ణ కవి-ఆయన్ని దేశమంతా కొనియాడింది. మహా పండితుడు రాహుల్ సాంకృత్యాయన్ అంతటి వాడు  కూడా పొగిడేవాడు కవిగారిని. మరి కొమఱ్ఱాజు లక్ష్మణ రావు? మన భారతీయ భాషల్లోనే విజ్ఞాన చంద్రికా గ్రంథమాలను తీసుకువచ్చిన వాడు . మరి పెద్ద పెద్ద వాళ్ళుండగా సి. పి.  బ్రౌన్ పేరే ఎందుకు పెట్టుకోవాలి ? సి. పి.  బ్రౌన్ నే ఎందుకు తీసుకురావాలి? అన్న ఆలోచనలు, అభిప్రాయాలు చాలా మంది నాతో వ్యక్తం చేశారు. నేనెలా ఆలోచించానంటే అనువాదము, పరిశోధన, నిఘంటు నిర్మాణము ఈ మూడు చూస్తే విడివిడిగా కనిపిస్తాయి, కానీ, ఈ మూడు ఒకటే ; ముమ్మూర్తులా ఈ మూడూ  అంశలు కలిసే ఉండాలి పండితునిలో.

 

ఇప్పుడు  బ్రౌన్ నే తీసుకొన్నాము అనుకోండి. 1798 లో పుట్టాడు-నవంబర్ పదిన. ఈ అంకెలు -చాలా మంది ఊహాశక్తికి అందవు-వాటిని మరచి పోతాము మనం. బ్రౌన్ కాలాన్ని ఒక కథకుడిలా ముందుకు తీసుకురావాలంటే- సి.పి.బ్రౌన్ తండ్రి -డేవిడ్ బ్రౌన్ - మత  ప్రచారకుడు East India  Company కి  మత ప్రచారము -నిర్వహణ కోసం వాడు ఇక్కడికి వచ్చాడు. ఒక రకంగా ఆలోచిస్తే,  1767 లో పుట్టిన మన త్యాగయ్యకు సమకాలికుడు అని చెప్పుకోవచ్చు. ఇక సి. పి.  బ్రౌన్ కు , కాకర్ల త్యాగరాజు కు ఒక చిన్న తరం అంతరం ఉంది. ఎందుకంటే, సి. పి.  బ్రౌన్ 1798 లో అంటే దాదాపు ఆ శతాబ్ది చివర  పుట్టిన వాడు. అప్పుడు, మన ఆంధ్ర భౌగోళిక పరిస్థితులను గూర్చి ఆలోచిస్తే అప్పుడే  కోస్తా జిల్లాలు ఈ నిజాము పాలన నుంచి ఆంగ్లేయుల చేతిలోకి వచ్చేశాయి. రాయలసీమ -1800 లో దత్త మండలాలు (ceded districts ) మీరు సినిమాలో  చూసే ఉంటారు- తెరమీద చూడగానే సీడెడ్ , నైజాం అని పడతాయి కదా. ఆ దత్త మండలాలు 1800 లో ఏర్పడ్డాయి అంటే బ్రౌన్ కార్యక్షేత్రానికి కావలసిన ఒక రంగం ఏర్పడింది.

 

మన సి. పి. బ్రౌన్ కు ఆంధ్రదేశానికి సంబంధం ఏమిటి ? ఈరోజు మనం కూర్చుని  బ్రౌన్  మనకు ఏం చేశాడు అని ఆలోచిస్తే - కొన్ని వాక్యాలు చదివి, కొన్ని అంకెలు పరిశీలిస్తే  ఏమీ అర్థం కాదు మనకు. కాబట్టి , ఆ గతం - ఆ గతం  వెనుక ఉన్న వాతావరణం కూడా మనకు అర్థం కావాలి. సరే,  బ్రౌన్  ఆ కాలంలో, దాదాపు 200 ఏళ్ల క్రితం వచ్చి అనువాదం చేపట్టాడు. మరి, బ్రౌనుకు తెలుగు ఎలా వచ్చింది ? ఆయనా  చాలా మంది ఆంగ్లేయాధికారుల్లాగే  ఉన్నాడు. మరి, తెలుగుకు   బ్రౌనుకు సంబంధం ఏమిటి ? ఇలాంటి ప్రశ్నలు రావచ్చు.

 

మీరు గమనిస్తే, 1911 దాకా కలకత్తా మనకు రాజధాని, ఆ తర్వాత ఢిల్లీ అయింది.  ఒక రకంగా చెప్పాలంటే Orientalism -ప్రాచ్యవాదం ; ఈ తూర్పు దేశాల భాషలు పద్ధతుల గూర్చి పరిశోధనలు ఇదంతా Orientalism  అని ఒక మాటలో చెబుతారు .[Oriental -Occidental - (ప్రాచ్య -పాశ్చాత్య)].

పాతరోజుల్లో మీరు చూసే వుంటారు B.O.L అని రాసుకునే వారు కొంతమంది పండితులు. Bachelor of Oriental Learning.  సంస్కృతం గానీ, పర్షియన్ గానీ మన ప్రాకృతం గానీ  ఈ భాషలన్నీ ఓరియెంటల్ (దేశ భాషలకు భిన్నంగా).

 

బ్రౌన్ కలకత్తాలో పుట్టాడు, తండ్రి  డేవిడ్ బ్రౌన్ కలకత్తా  దేశానికి రాజధాని కాబట్టి -అక్కడే ఉన్నాడు. మత ప్రచారం వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు భాషలు నేర్చుకోవడానికి గాని, నానా రకాలుగా ఆలోచించడానికి గాని మూల కారణం మత బోధ. బ్రౌన్ కు మతావేశం హెచ్చు. తండ్రి మత ప్రచారకుడు, వాళ్ళింట్లో తండ్రి స్వతహాగా బ్రౌన్ కు పన్నెండేళ్ల వయసులోనే  నాలుగు భాషల్లో- సిరియాక్, ఆర్మేనియన్,  లాటిన్, గ్రీకు-  పటిష్టమైన పునాది వేశాడు. అలాగే, ఉర్దూ/ పర్షియన్ రెండింటిలో మంచి పునాది ఉంది. బ్రౌన్ కు ఇలాగా నానా భాషల్లో ఒక పునాది అంటూ తండ్రి ఏర్పరచాడు. ఎందుకు? బైబిల్ సువార్త ఆసియా దేశాల్లో వ్యాపింప జేయడానికి వీడు కూడా  ఒక ఉపకరణం అన్నట్టు ఆలోచించాడు. చివరికి ఏం జరిగింది? తండ్రి మరణంతో  బ్రౌన్ వెనక్కు వెళ్ళ వలసి వస్తుంది. బ్రౌన్ తల్లి ఫ్లోరెన్స్  వీరందరినీ తీసుకుని -ఎనిమిదిమంది  సంతానం ఆమెకు -లండన్  తిరిగి వెళ్ళ వలసి వస్తుంది

 

Hailesbury College అప్పుడే (1806) పెట్టారు. ఎంపికయిన Civil  Servants కు   ప్రథమ  శిక్షణ  మొదలయ్యేది అక్కడే. Hailesbury లో బ్రౌన్ చదువుకుంటాడు కొంత కాలం. కానీ, అక్కడ తెలుగు నేర్పరు -పర్షియన్/ ఉర్దూలో మాత్రం శిక్షణ ఉండేది అప్పట్లో. పరిపాలనకు సంబంధించి అనేక విషయాలు  నేర్పేవారు. తర్వాత, ఆ కాలేజీగుండా I.C.S పరీక్షలో నెగ్గి -బ్రౌన్ మళ్ళీ పరిపాలనాధికారిగా మద్రాసు (1817) వస్తాడు. దేశ భాషలు నేర్పడానికి ఏర్పడ్డ  Fort St. George లో శిక్షణ పొందుతాడు. 

 

అప్పట్లో పరిపాలనాధికారులకు తప్పకుండా దేశభాషలు వచ్చి తీరాలి అన్న పట్టుదల ఉండేది కారణం, 1811 లో కంపెనీ వాళ్లకు ఒక నివేదిక వచ్చింది.ఈ  పరిపాలనాధికారులకు దేశ భాషల్లో పరిజ్ఞానం సున్నా. దానివల్ల, పరిపాలన సాగడం లేదు. ఈ రకంగా ఆలోచించి వాళ్ళు- తెలుగు , తమిళం, మలయాళం, కన్నడం, మరాఠీ ని కూడా  దక్షిణాది భాషాకిందే వారు లెక్క వేశారు - ఈ ఐదు భాషల్లో పాండిత్యం -పాండిత్యం కాదు గానీ పరిచయం -పాలనకు అవసరమైన మేరకు నేర్చికోవాలి. ఒక మూడు సంవత్సరాల వ్యవధిలో లో వీరు నేర్చుకొని తీరాలి. 1812 లో Fort St. George మొదలు పెట్టేశారు. బ్రౌన్ ఈ రకంగా తెలుగు నేర్చుకున్నాడు. అంతటితో ఆగిపోక  అందులో పరిణతి సాధించి మళ్లీ కొద్దో గొప్పో ఒక ఉత్సాహము. పట్టుదలతో బ్రౌన్ ముందుకు సాగాడు. 

 

ఇక్కడ ఇంకొక విషయం… మిషనరీ కార్యక్రమాలు తమిళంలో మన తెలుగు కన్నా కూడా బాగా ముందు మొదలైనాయి. చాలా మంది ఐరోపా వాసులు తమిళ దేశానికి వచ్చి, భాష నేర్చుకొని, తమిళంలో రచనలుచేసి, పేర్లు మార్చుకొని, మన సన్యాసుల వేషధారణలోకి మారి-  మసిపూసి మారేడుకాయ చేసి మత ప్రచారం గావించారు.  తెలుగులో మిషనరీ కార్యకలాపాలు నిదానంగా మొదలైనాయి, తమిళంతో పోలిస్తే. కాబట్టి అధికారులు తెలుగు నేర్చుకోవడానికి  పుస్తకాలు రావాలి.  వాచకాలు రావాలి. వ్యాకరణాలు, వాచకాలు వీటికీ కంపెనీ ప్రోత్సాహం ఎక్కువుంది. ఎవరికైనా  సరే తెలుగులో ఒక మంచి వాచకం లేదా ఒక వ్యాకరణం రాసిన వారికి వాళ్ళు ఒక వెయ్యి పగోడాల దాకా ఇస్తున్నారు.(200 ఏళ్ల క్రితం 3500 రూపాయలు అంటే మాటలు కాదు).  ఆ మేరకు ప్రోత్సాహం ఉంది కాబట్టే, ఉత్సాహంగా బ్రౌన్ లాంటివాళ్లు యువకులు తెలుగు నేర్చుకోవడం, దాంట్లో కృషి చేయడము జరిగినాయి. ఈ రకంగా, బ్రౌన్ మన తెలుగు నేర్చుకోవడం వెనుక ఈ వాతావరణం ఉంది.

 

మనందరికీ బ్రౌన్-తెలుగు-వేమన- 1798 -1884 ఇలా అంకెలు చెబితే ఏమీ అర్థం కాదు. వాతావరణం మనకు తెలియదు. చుట్టుపక్కల పరిస్థితులు ఏమీ తెలియవు. ఇది మొత్తానికి బ్రౌన్ గురించి. ఈ విధంగా భాష  నేర్చుకుంటూ కడపలో కలెక్టర్ గా చేసాడు రెండు  సంవత్సరాలు.  తర్వాత బందరులో ( మచిలీ పట్నం ) మరో రెండు  సంవత్సరాలు. క్రమ క్రమంగా 26 ఏళ్ల వయసులో బ్రౌన్ వేమన పద్యాల అనువాదం మొదలు పెట్టాడు. ఇంకొక  గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమంటే,  బ్రౌన్ వేమన అనువాదాలు మొదలు పెట్టేటప్పటికీ కూడా  అతని మత విశ్వాసాల్లో ఏమాత్రం మార్పు లేదు. అతను మత పరంగా చాలా  విశ్వాసమున్న కుటుంబం నుంచి వచ్చిన వాడు.  మన శ్రోత్రీయ బ్రాహ్మణుల్లాగూ అప్పటి బ్రౌన్ పరిస్థితి క్రైస్తవంలో. అంతగా  వాళ్ళ విశ్వాసాల్లోనే పెరిగిన వాడు  కాబట్టి, హిందూ మతం పట్ల గానీ , మన ఆచారాల పట్ల గానీ బ్రౌనుకు ఏదో ఉదార దృష్టి ఉందనుకోవడం కూడా తప్పు. విమర్శనాత్మక   దృష్టే ఉంది.  ఐనా కూడా, పోగా  పోగా  బ్రౌనుకు ఒక విశాల దృష్టి అలవడింది,  మనుషులు వేరు, పుస్తకాలు వేరు, ఆచారాలు వేరు -అని భిన్నంగా ఆలోచించడం ఇవన్నీ అతనికి అలవడినాయి. వేమన శతకంతో అతని అనువాదం మొదలైంది. ఎప్పుడైతే, అనువాదం చేద్దామని కూర్చున్నాడో అతనికి - వేమన శతకం కవిత్వం కదా ! పద్యం ఆటవెలదిలో ఉంది. దానికో నడక ఉంది, దానికో ఛందస్సుంది- ఛందస్సు కొరుకుడు పడలేదు. కాబట్టి, ఆ ఛందస్సులో కృషి చేశాడు మళ్లీ... ఒక పరిశోధన - ప్రతి దానికి బ్రౌన్ వ్యక్తిత్వంలో పరిశోధన అంటూ ఉంటూ వచ్చింది. బ్రౌన్ జీవితాన్ని... ఒక రెండు మాటల్లో చెప్పండి అని నన్నడిగితే  ‘మతం-రెట్ట మతం’  అంటాన్నేను. ‘మతం-రెట్ట మతం’... బ్రౌను చాలా పెద్ద రెట్ట మతం. ఓడ ప్రయాణం లో కలిసిన కాల్డ్వెల్ ( ద్రవిడభాషల గురించి పరిశోధన చేసిన వాడు. సంస్కృతం నుండి తెలుగు రాలేదు, ద్రవిడ భాషలన్నీ వేరే రకంగా వచ్చినాయి అని  చెప్పినవాడు ) కూడా ఇదే విషయం గమనించాడు. బ్రౌన్ గురించి అంచనా వేశాడు ”బ్రౌన్ ఎప్పుడూ కూడా ఒక పద్ధతిగా ఎక్కడా చదువుకోలేదు. కాబట్టి వీడిలో ఈ లోపం ఉంది. తను చేసేదే గొప్ప అనుకొంటాడు. వీడికి పాండిత్య ప్రకర్ష ఎక్కువ అంటే  వీడొక pedant“ అని రాసుకున్నాడు కాల్డ్వెల్ .

 

ఈ రకంగా ఇవన్నీ ఉన్నాయి బ్రౌనులో.  క్లుప్తంగా చెప్పాలంటే  ‘మతం- రెట్ట మతం’ ఇదీ  బ్రౌన్ జీవిత సారం! చివరి వరకు (86 ఏళ్ళు) అలాగే  గడిపాడు. కానీ, అతనికి మతం విషయంలో పట్టు సడలింది కానీ, రెట్ట మతం అలాగే ఉంది.  ఆ కారణంగానే  ఈ అనువాదాలు, ఈ పరిశోధనలు, ఈ నిఘంటు నిర్మాణం ఇవన్నీ చేసి మనభాషకు  బ్రౌన్ ఎనలేని సేవ చేశాడు. కాబట్టి ఈ మూడు విభాగాల్లో -అనువాదం, పరిశోధన, నిఘంటునిర్మాణం - ఈ మూడు రంగాల్లో కృషి చేసిన పండితులను గుర్తించి వాళ్ల  కృషికి మెప్పు గా   ఏదో ఒక చిన్న పురస్కారం ఉడతా భక్తిగా మనం ఇస్తున్నాము . ఇదేమంత  గొప్ప విషయం   కాదు.

(హ్యూస్టన్ సాహిత్య సమ్మేళనంలో భాగంగా బ్రౌన్ పురస్కార ప్రదాన సభలో చేసిన ప్రసంగం)

*****

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...
 

Bio

తమ్మినేని యదుకుల భూషణ్

"కవితాభూషణం" తమ్మినేని యదుకుల భూషణ్ కవి, విమర్శకుడు, బహు భాషా పరిజ్ఞానం గల సాహితీవేత్త.  "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే మొట్ట మొదటి కవితా సంకలనంతో తెలుగు సాహితీప్రియుల దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నారు.

శిల్పంలా పటిష్టమైన కవిత్వం, వజ్ర ఘాతం వంటి విమర్శ, మూలానికి ధీటైన అనువాదాలు, ఏకబిగిన చదివించే కథనాశైలి యదుకుల భూషణ్ గారిని సాహిత్య ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెట్టాయి.

***

Bhushan
Comments
bottom of page