MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
పుస్తక పరిచయాలు
నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల
ఈ ప్రపంచమంతటా వీచే గాలి ఒకటేనా? సైన్సు ప్రకారం ఆక్సిజెన్, నైట్రొజెన్ల మిశ్రమమే, అదీ, సుమారుగా ఒక పాళ్ళలో వుంటుంది అంతటా వ్యాపించి. మనోభావాల్లోనూ, మనుషులు తామనుభవించే భావాల్లోనూ, కవిత్వంలోనూ కూడా ప్రపంచ ప్రజలమందరం కూడా ఒకటే కదా అన్న భావన కలుగుతుంది ముకుంద రామారావు గారు ఎంతో పరిశోధనతో అందించిన ’అదే గాలి - ప్రపంచదేశాల కవిత్వం - నేపథ్యం’ పుస్తకంలో. అదే ఆలోచనా సరళిలో దాసరి అమరేంద్ర గారు ’అండమాన్ డైరీ’ పుస్తకంలో అండమాన్ నికోబార్ దీవుల పర్యటనలో తనొక యాత్రీకుడిగా పొందిన అనుభవాలని మనతో పంచుకున్నారు. అయితే ’ఆ నేల, ఆ నీరు, ఆ గాలి’ అనే పుస్తకంలో వేలూరి వెంకటేశ్వరరావు గారు మాత్రం ఏ గాలి ఆ గాలే అంటారు.
మహాదేవివర్మ గీతాలు
అదే గాలి - ముకుంద రామారావు
శాయి రాచకొండ
ఇది ఎంతో విలువైన, పరిశోధనా గ్రంథం. చైనా దేశం మొదలుకొని అన్నిఖండాలలోని దేశాలలోని కవిత్వాన్ని మనకు పరిచయం చేసారు ముకుంద రామారావు గారు. ప్రతి దేశపు కవులగురించి, వారి వారి కవిత్వాన్ని పరిచయం చేసే ముందు సూక్ష్మంగా ఆ దేశపు గత చరిత్ర, సాంఘిక సంక్షోభాలు, కవుల స్పందన, దాని వెనుక వున్న మానసిక సంఘర్షణ, ఇలా ఎన్నో విపులంగా రాసారు. పుస్తకం కవిత్వం గురించే అయినా, పుస్తకం పూర్తి చేసేటప్పటికి ప్రపంచం మొత్తాన్ని, ఒక హాట్ ఎయిర్ బెలూన్ లో, అన్ని దేశాల్ని కలుపుతూ వర్తులంగా ఒక చుట్టు చుట్టి వచ్చిన అనుభూతి కలుగుతుంది. చరిత్రలు కొంచెం అటు ఇటు అయి వుండవచ్చు. కాని చరిత్రలో జరిగిన అనేకానేక సంఘర్షణలు, మనుషులు పొందిన ఆవేదన, యుద్ధభూముల్లోని ఆక్రందనలు, నలుపు, గోధుమ, తెలుపు, పసుపు రంగు జాతుల్లో పుట్టిన ఏ మనిషయినా అనుభవించిన అంతర్మధనం ఒక్కటే. భాష వేరవచ్చు, మనుషులు వేరవచ్చు, ప్రదేశం వేరవచ్చు, వ్యక్తం చేసిన భావం ఒక్కటే. అవును, అదేగాలి.
ముకుంద రామారావు గారు ఈ పుస్తకంలో మనకు చూపించిన కవితలు మచ్చు తునకలు మాత్రమే.
విజయనగరం వెళ్ళినప్పుడు చాగంటి తులసి గారిని కలిసే అవకాశం కలిగించాడు శ్యాం. ఆవిడ నాకు ఇచ్చిన పుస్తకాల్లో ఒకటి 'మహా కవయిత్రి మహాదేవివర్మ గీతాలు'. ఇవి మహాదేవివర్మ గారు హిందీ లో రాసిన కవితలకి తులసి గారు చేసిన అనువాదాలు. తులసి గారు అటు తెలుగు నించి హిందీకి, హిందీ నించి తెలుగులోనికి కూడా ఎన్నో తర్జుమా చేసారు. ఒక భాషలో వ్యక్త పరచిన భావాలు నలుగురూ పంచుకోగలిగి, వివిధ భాషల ప్రజల మధ్య అవగాహన పెంచగలిగే అవకాశం ఈ అనువాద గ్రంధాలు మాత్రమే ఇవ్వగలవు. అలాంటి సదుద్దేశంతో ఆవిడ అలుపులేకుండా చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం.
అండమాన్ డైరీ -దాసరి అమరేంద్ర
శాయి రాచకొండ
ఆ గాలే అండమాన్ నికోబార్ ద్వీపాలను అంత అందంగా మలచిందేమో! సౌందర్య పిపాసకులకి, మనుషుల గురించి, కొత్త కొత్త ప్రదేశాలగురించి తెలుసుకోవాలనే ఉత్సుకత వున్నవారికి, ప్రపంచమంతా ఒకటే! కొత్త కొత్త ప్రదేశాలని చూడాలనే కోరిక దాదాపు చాలామందిలో బాహ్యంగానో అంతరంగంలోనో వుంటుంది. అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుదు ’ఆ, మీరేమి చూశారక్కడ?’ అని అడగడాలు, మేము ఫలానా ఫలానా ప్రదేశాలు చూశామని, ఇంకా బోలెడన్ని చూడలేకపోయామని, చూసినవి ఎంత బాగున్నాయో అని మురిసిపోవడాలు, డిజిటల్ కెమేరాలో లెక్కలేనన్ని క్లిక్కులు, ముఖపుస్తకంలో పంచుకోవడం, సహజాతిసహజంగా జరిగిపోయే విషయాలు. చూసిన ప్రదేశాలన్నిటినీ ప్రజలు నిజంగా అనుభవిస్తారా? అన్నీటినీ అస్వాదిస్తారా? ఎవరికి వారు అనుకోవచ్చు నిజంగానే అనుభవించామని. కాని, పచ్చల ద్వీపాలూ, పగడాల సంద్రాలూ ఎవరు ఎంత ఆనందిస్తారో అంతే వారివి.
పుస్తకం చదివితే తెలుస్తుంది, అమరేంద్ర గారు ఎంత సౌందర్య పిపాసో అని!
ఆ నేల, ఆ నీరు, ఆ గాలి - వేలూరి వెంకటేశ్వరరావు
శాయి రాచకొండ
ఇది వేలూరి వెంకటేశ్వరరావు గారు రాసిన కథల సంపుటి. సుమారు ఇరవై తొమ్మిది కథలున్నాయి. నిజంగా చిన్న కథలే. ప్రతి కథా, అప్పుడే అయిపోయిందనిపించినా, మనలోనూ, మన చుట్టుపక్కల వుండే కపటం, అర్థం లేని ఆచారాలు, వస్తువు ఉపయోగమున్నా లేకపోయినా పారేయలేని మనస్తత్వం, ఇలా ఇవన్నీ మనకు గుర్తు చేస్తూ, టెంకి జెల్లలు తగిలిస్తారు రావు గారు.
పుస్తకానికి ముందుమాటలో రావుగారు అంటారు 'ఒక 'కథ పూర్తిగా చదివిన తరువాత మీకు కూడా 'వావ్' అనాలనే అనుభూతి కలిగెతే, అది కథే' అని. ఆ పరిమితమయిన నిర్వచనం ప్రకారం చూసినా, పుస్తకంలో చాలానే ‘కథ’ లున్నాయి...
చీకట్లో నీడలు - డా. రామారావు
వంగూరి చిట్టెన్ రాజు
లండన్ లో తెలుగు వారు అనగానే చాలా మందికి గుర్తుకి వచ్చే పేరు డా. వ్యాకరణం రామారావు గారు. గత 42 సంవత్సరాలుగా అక్కడ స్థిరపడి, వృత్తి రీత్యా మానసిక వైద్య రంగంలో అత్యున్నత శిఖరాలను అందుకోవడమే కాకుండా ఒక ప్రముఖ రచయితగా, తెలుగు సాంస్కృతిక రాయబారిగా తమ విశిష్టతని చాటుకున్నారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఆయన “జీవిత రథ సారధి” డా.పద్మావతీ రావు గారు. చిన్న చిన్న కథలు, వ్యాసాలూ రచించినా ఆయన స్వతహాగా కవి. 2015 లో “తోటమాలి” అనే కవితా సుమాహారాలు ప్రచురించి తెలుగు కవిత్వాభిమానుల ప్రశంసలు అందుకున్నారు. “చీకట్లో నీడలు” డా. రామారావు గారి తొలి నవల. అర్థ శతాబ్దం నాటి జ్ఞాపకాలని ఒక కాల్పనిక చరిత్రగా వినూత్న శైలిలో పాఠకుడిని ఆగకుండా చదివించే గుణం ఉన్న అపురూప ప్రయత్నం. ప్రతీ అధ్యాయం ఒక రాజకీయ, చారిత్రక సంఘటన ప్రస్తావన తో మొదలవడం ఒక ప్రత్యేకత...
సంక్షిప్త పరిచయాలు
‘సంక్షిప్త పరిచయాలు’ శీర్షికలో గత రెండు మూడు నెలలలో వెలువరించిన పుస్తకాలని మాకు అందిన సమాచారం ప్రకారం పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాము. రచయితలు/ రచయిత్రులు పుస్తకపు ముఖచిత్రంతో పాటు టూకీగా మరిన్ని వివరాలు తెలిపితే, ఈ శీర్షికలో ఆయా పుస్తకాలను సంక్షిప్తంగా పరిచయం చేయగలము.
అందమా... నిను వర్ణింప తరమా -ఆచార్య కడారు వీరారెడ్డి
సంక్షిప్త పుస్తక పరిచయం
ఆచార్య కడారు వీరారెడ్డి రాసిన ఈ కావ్యం గురించి రాస్తూ, దాస్యం సేనాధిపతి గారు “అందం జాడ తెలియకున్నా... దాని ఊహల నీడలను అందుకోవడమే లక్ష్యంగా కవి తమ రచనను కొనసాగించి పాఠకులను మెప్పించ యత్నించారు. అందం ఆహార్యానికి అతీతమనీ... అది విశ్వపరివ్యాప్తి, సకల రూపాంతర శక్తి అనీ.. అందనిదీ... అనిర్వచనీయమైనదని కవి తేల్చి చెప్పిన తీరు బాగుంది. మాటలు రాకున్నా, భాష తెలియకున్నా... ప్రకృతిలో పొదిగిన అందానికి పంచ భూతాలే సాక్ష్యమని కవి విడమర్చి చెప్పారు.”
అలాగే కవి చూపిన అందాల్ని గురించి చెబుతూ, “శిల్పంలో కొంత, చిత్రలేఖనంలో కొంత, మనిషి నడకలో కొంత, మమతలో కొంత, మనసులో కొంత, బుంగమూతిలో బుక్కెడంత, శబ్దంలో కొంత, నిశ్శబ్దంలో కొంత, చిరునవ్వులో కొంత, నిండు నవ్వులో బోలెడంత, అభినయంలో ఆశించినంత అంటూ కవి అందం యొక్క వ్యాప్తిని అక్షరాల్లో అందంగా ఆవిష్కరించారు” అని అంటారు.
పుస్తక విశ్లేషణ
మేము ఎంపిక చేసుకున్న కొన్ని మంచి గ్రంధాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి. కేవలం మా ప్రత్యేక వ్యక్తిగత ఆహ్వానం మేరకే పుస్తకాలు స్వీకరించబడతాయి.
సంక్షిప్త పుస్తక పరిచయం
పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.
పంపించవలసిన చిరునామా:
సంక్షిప్త పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే.