MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
“దీప్తి” ముచ్చట్లు
నిర్భావం సద్భవతి! అవునంటారా?
దీప్తి పెండ్యాల
ఆరోజు… కృతి వాళ్ళింట్లో ఓ డిన్నర్ పార్టీ కి వెళ్ళాలి. మామూలుగా అయితే, వాళ్ళింటికి వెళ్ళే ముందు చాలా ఉత్సాహంగా ఉంటుంది నాకూ, నా ఫ్రెండు శ్వేతకి. కానీ, ఆరోజు మాత్రం తెగ నీరసంగా ఉంది. మా వాళ్ళకు మాత్రం అర్థమవలేదు సమస్యేమిటో. కనుక వాళ్ల దోవన వాళ్ళు "నిర్భావం సద్భవతి" అనే సూత్రం... అహ. ఈ సూత్రం ఎక్కడా లేదనుకొండి. నేనే మరి "యద్భావం తద్భవతి" కి చిన్న మార్పు చేశానన్నమాట. నిర్భావంగా ఉంటే అన్నీ సవ్యమవుతాయనటానికి ఇది సరియైన ప్రయోగమే కదా?!! సరే, అలా... 'నిర్భావం సద్భవతి' మోడ్ లోనే వాళ్ళనుండనిచ్చి... మేము... మొహాలు వేళ్ళాడే మోడ్ లో ఉన్నామన్నమాట ఆ రోజు!
ఎప్పుడూ మేమందరం, ముఖ్యంగా మా మూడు ఫ్యామిలీలు ఉబుసుపోనంత తీరిక లేకున్నా సరే, 'ముచ్చట్లమిదం జీవితం' అన్న సూత్రాన్ని పాటిస్తూ చక్కగా మధ్య మధ్యలో కలుస్తూంటాము. గేదరింగ్ అనుకున్నప్పుడల్లా... ఉత్సాహంగా కలిసి, ఆ తర్వాత ఆనవాయితీగా వెయింగ్ మెషీన్ మీద ఎక్కి చూసుకుని అరకిలో బరువు పెరిగామని... ఇంకో నెల వరకూ కలవొద్దని తీర్మానించుకుంటాము. ఆ రోజు మాత్రం... మాకిద్దరికీ పక్కాగా తెలుసు ముచ్చట్లేవీ ఉండవని. అర్ధ గ్రాము కూడా పెరక్కుండా... శ్రద్ధగా... తిండి మీద మాత్రమే ధ్యాస పెట్టి తినబోతున్నామని...! ఈ అర్ధగ్రాము పెరగటమేంటని విస్తుపోకండి. అర్ధగ్రాము పవర్ సామాన్యమైందా?! హమ్మో! ఉత్తినే బెలూన్లా పెరిగే సూపర్ ఫాస్ట్ హైపర్మెటాబాలిజం ఉన్నవారికే తెలుస్తుంది ఈ అర్ధగ్రాము పవర్ సంగతి! పట్టి పట్టి పట్టుమని పది మిల్లీ గ్రాముల బరువైనా ఉండని పాపడం తిన్నా పది కిలోల బరువు పెరిగినంత భారమైన ఫీలింగు కలిగించే పవరు మరి !!... పోనీ లెండి. బరువు టాపిక్ ఇప్పుడొద్దు. బరువనే మాట చూస్తేనే మనసు బరువయ్యి గుండె చెరువవుతుంది. అసలయితే, చిన్నప్పుడు అమ్మ నన్నెలా లావు చేయాలా అని పడ్డ తిప్పలు ఎన్ననుకున్నారు? అన్నా, ఇన్నా... అమ్మో! ఎన్నెన్నో! అలా రివటలా ఉండటమూ అదృష్టమని తెలీలేదు అప్పట్లో. అంటాము కానీ, ఎప్పుడయినా... అప్పుడున్న అదృష్టాన్ని ఎవరూ రియలైజ్ అవరు. ఆరోజూ… అదే ... మీరు వేగంగా చదివేవారయితే రమారమి ముప్పావు నిమిషం ముందు మొదటి పేరాలో చదివేసిన రోజు... ఆ రోజు... "పార్టీ రోజూ" అలాగే ..."ఆహా, ఎంత అదృష్టం! అర్ధకిలో బరువు పెరగబోవట్లేద"ని సంతోషించాలా... ?! అహ, లేదు. తెగ నిర్వేదం లో ఉన్నామిద్దరమూ! పార్టీ అనగానే... నిర్వేదం, నీరసం, నిరాసక్తత వగైరాలన్నీమెదడులో మెల్లగా దూరాయి. అతిథి దేవుళ్ళు కదాని, ఆ ఫీలింగ్స్ ని చక్కగా ఆదరించి, కొంచెం శ్రద్ధ తీసుకుని... అతిథి సత్కారాలు చేశాము. అంతే! కదలకుండా తిష్ట వేసుకుని మరీ కూర్చున్నాయి...!
"అవునూ నిర్వేదం అంటే వేదం లేదనా అర్థం? చొప్పదంటు ప్రశ్న వేసింది శ్వేత. కృతి వాళ్ళింటికి వెళ్ళేందుకు రెడీ అవటానికి వెళుతూ...
"అంతే కావొచ్చు. వేదం తెలీని స్థితి వేదన కలిగించేదేగా!" అన్నీ తెలిసిందానిలా పోజు కొడుతూ అన్నాను...
ఆ మాట విని, మా వాళ్ళు... అనగా మావారు+శ్వేతవారు, వాళ్ళ మానాన వాళ్ళు పాలిటిక్స్ చూసే కార్యక్రమానికి పావు సెకన్ బ్రేకిచ్చి మరీ మా వైపు తలలు తిప్పి, అయోమయంగా ఒకరి మొహాలొకరు చూసుకున్నారు.
"అంతా ఓకేనా?" అని అనుమానంగా, భయంగా చూస్తూ పరామర్శించారు.
"ఓకే, ఓకే" అన్నాను, అసలు సిసలు నిర్వేదం ఎఫెక్ట్ కోసం మాడ్యులేషన్ మారుస్తూ!
శ్వేత మొహంపై ఏ ప్రయత్నం లేకుండానే నిర్వేదం ఎఫెక్టు ఒక్కింత ఎక్కువయ్యింది. అది వాడే ఏకైక బ్రాండ్ ఐలైనర్ ఏదీ నా కిట్ లో లేకపోవటం గమనించి!
కట్ చేస్తే... పాజామాలు ఫార్మల్ డ్రెస్సులుగా మారి, తుడుపు గుడ్డల్లాంటి టీ-షర్టులు కాస్తా తళతళలాడే చీరల్లా మారి, కృతి వాళ్ల పెరడు లో పెరేడ్ చేసాయి...
మేము, మరో ఇద్దరు మరాఠీ ఫ్రెండ్స్ కాక అక్కడున్న కృతి కలీగ్స్ అంతా తెల్ల మేళం... కకేషన్ ఫ్రెండ్స్. ఉన్నట్టుండి హైపిచ్ లో నవ్వుతూ... భువనగోళాలు దద్ధరిల్లటం లాంటి అతిశయాలని అతి సహజంగా, ప్రాక్టికల్ గా చూపిస్తూంటారు. మామూలుగా అయితే సరదాగా అనిపించే ఆ గ్యాంగు కూడా ఈ రోజెందుకో బోరింగు అనిపిస్తున్నారు. బోరింగు అంటే- మన చిన్నప్పుడు వేసవి శెలవులకని ఊరెళ్ళినప్పుడు... సూర్యుడేమో... అదేదో యాడ్ లోలా... మన తలల్లోకి స్ట్రాలు వేసుకుని శక్తి పీల్చేస్తూ మరీ డీహైడ్రేట్ చేస్తుంటే... దాహమేసి నీరు తాగేందుకు వాడేవాళ్ళము చూడండి, ఆ ‘బోరింగ్’ కాదు. ఇది వేరు బోరింగ్. నిరాసక్తత అన్నమాట. చుట్టూ ఉన్నవాళ్ళెవరూ మాలా బాధితులు కాదేమో అనిపించింది వాళ్ళ సందడి చూస్తుంటే...
అంత సందడిలోనూ... కృతి శ్వేత కళ్ళని చూసి, "ఏమైందే, బానే ఉన్నావా" అంది. తుళ్ళిపడింది శ్వేత "ఎలా పసిగట్టిందీ నీరసాన్ని" అని.
నాకర్థమయ్యింది… నే కవర్ చేశాను..." ఐలైనర్ పెట్టుకోలేదు. అందుకే డల్ గా కనిపిస్తుంది. షి ఈజ్ ఫైన్" అని! మెచ్చుకోలుగా చూసింది శ్వేత. గర్వంగా... జ్ఞానిలా చిద్విలాసంగా నవ్వాలనుకుని... అదెలాగో తెలీక... మామూలుగానే నవ్వేసాను.
అదిగో... సరిగ్గా ఆ సమయంలో...
మా నీరసానికి మరియు ఈ పార్టీకి… కంబైన్డ్ కారణమైన మన హీరోయిన్ ఎంట్రీ చాలా ఘనంగా జరిగింది...!
మేళతాళాలు... బాజా భజంత్రీలు లేని లోటు లేకుండా... "వావ్, సో క్యూట్ " "ఆవ్... , హౌ స్వీట్ " అంటూ ఆబాలతెల్లమేళం కొడుతున్న చప్పట్ల మధ్య అటూ ఇటూ ఠీవీగా చూస్తూ కళ్ళతోనే గ్రీట్ చేస్తూ క్వీన్ లా వచ్చింది మన హీరోయిన్.
పిల్లా పెద్దా అంతా ఫిదా!! మేము నిట్టూర్చాము.
అరె! ఇంత చెప్పీ, ఇంటర్వల్ దగ్గరపడుతుంటే కూడా... మన హీరోయిన్ ఎవరో చెప్పనే లేదు కదూ?! హీరోయిన్ అనగానే... తెలుగు అసోసియేషన్లు పోటీలు పడుతూ, డజన్ల కొద్దీ హీరోయిన్లను రప్పిస్తున్న ఈ సీజన్లో, తెలుగు వాళ్ళింట్లో… డిన్నర్ పార్టీలో ‘హీరోయిన్’ అనగానే... సరదాగా ఏ సమంతానో, ఏ శృతిహాసనో అని ఊహించుకొనేరు. కాదు. మన హీరోయిన్ చాలా స్పెషల్! ఈ స్పెషల్ హీరోయిన్ ఎవరంటే... కృతి వాళ్ళమ్మాయి ముచ్చటపడితే, వాళ్ళు తెచ్చుకున్న పెట్- ఒక గిన్నీ పిగ్. ఆ! అవును పిగ్గే. అదిగో, అచ్చు అలాగే... నేనూ అలాగే ఫీలయ్యాను. అదండీ, అలా పెంచుకోవటానికి గిన్నీ పిగ్గు తెచ్చుకున్నది మొదలూ మొదలయ్యాయి మా పాట్లు. చెవులకి పోట్లు!
కృతి ఫోన్ చేసిందంటే చాలు... “మిన్నీ(ఆ పిగ్గు పేరు లెండి) ఏం చేసిందనుకున్నావూ?” అంటూ ఓ లెవెల్లో బాదడం..., మిన్నీ ముచ్చట్లు కాక మరేమీ మాట్లాడకపోవటం, నన్నూ, శ్వేతనీ చూడ్డానికి రమ్మని ఒకటే పోరటం, ఆఖరికి "మీట్ మిన్నీ" అంటూ ఓ వాట్సప్ గ్రూప్ పెట్టి ఈ పార్టీ ప్లాన్ చేయటమూ... మైక్రోవేవ్ లో పాప్ కార్న్ లా... పది సెకన్లకో మెసేజ్ తాలూకు బీప్ తో మా ఫోన్లు, మెదళ్ళూ పేలిపోయే దశలో మేము నోటిఫికేషన్లని ఆపేయాల్సి రావటమూ... అబ్బబ్బా... ఒకటా, రెండా, అకటా...! పిగ్గుపిల్లని తెచ్చుకుని పిల్ల పుట్టినంత సంబడం! ఇక ఈ పార్టీ ఏర్పాట్లు చూస్తే అయితే... "పావలా కోడిపిల్లకి ముప్పావలా..." అనేదో సామెత ఉంది. అది గుర్తొచ్చింది. పాత పప్పీ స్కిటిల్స్ వచ్చినప్పుడు మరీ ఇంత హడావిడి చేయలేదు. స్కిటిల్స్ ని ఏదో సేల్ ఉందని $1600 పోసి వేరే స్టేట్ వెళ్ళి మరీ తెచ్చుకుంది కృతి. ముద్దు ముద్దు గా ఉండే జపనీస్ స్పిట్జ్ బ్రీడ్ పప్పీ. దానికోసం ఈ లెవెల్లో పార్టీ చేసిన గుర్తు లేదు మరి.
ఇదిగో ఈ గిన్నీ మిన్నీ హీరోయిన్ కి మాత్రం పార్టీ ఏర్పాట్లు చూసీ చూసీ నీరసమొచ్చింది. అలా పార్టీ తంతు అంటేనే నిరాసక్తత ఆవరించిదన్నమాట.
కానీ, ఇక్కడ చూస్తే మాలాంటి బాధితులు ఎవరూ లేనట్టున్నారు. అందరూ మా వాళ్ళలా ‘నిర్భావం సద్భవతి’ మోడ్ లో ఉన్నట్టున్నారు. ‘మీట్ మిన్నీ’ టైం ని ఎంజాయ్ చేస్తున్నారు.
చెప్పొద్దూ, తెలుపు, బూడిద రంగులో లాంగ్ హెయిర్ తో క్యూట్ గా ఉంది మిన్నీ. కానీ, నాలో నిర్వేదం గట్రా ఫీలింగులు విలన్లలా అడ్డు పడుతున్నాయి యాక్సెప్ట్ చేయటానికి. శ్వేత వైపు చూద్దును కదా... దాన్లో నిర్వేదం- "నేను మెయిన్ విలన్ కాదుపో" అంటూ ఎప్పుడో తోకముడిచి హీరోయిన్ పార్టీలో చేరినట్టుంది! ఎంచక్కా శ్వేత మొహం విప్పార్చుకుని దాని గెంతులు చూస్తుంది. మిన్నీ అటూ ఇటూ చిన్నగా గెంతుతుంది, దూకుతుంది, లాంగ్ జంపులు చేస్తుంది. చేతులు చాపటం ఆలస్యం… గెంతి, అందరి చేతుల్లో కడ్లీ గా ఒదిగి కూర్చుంటుంది. అబ్బో! ఎక్కడా తగ్గట్లేదది! అందరూ ఒకటే పొగడ్డం దాన్ని! మా మరాఠీ శాల్తీ కాంప్లిమెంట్ విని అటు చూసాను. "గిన్నీ పిగ్ అంటే... ప్రయోగాలకి పనికొచ్చే ప్రాణి అనుకున్నాను కానీ, ప్రాణంగా పెంచుకునేందుకు పెట్ లానూ పనికొస్తుందని తెలీదు కృతీ, నిజంగా గిన్నీ మేక్స్ ఎ బెస్ట్ పెట్" అంటుంది… నాకూ మొదటి సగం కాంప్లిమెంట్ నచ్చింది కానీ... మిన్నీ మీదే ఎందుకో ఈ నిరాసక్తత.
ఫక్తు కమర్షియల్ మూవీ టెంప్లేట్ లో… రాన్రాను హీరోయిన్ పవర్ పెరిగిపోతుంది. నిర్వేదం, ద విలన్ కాస్త దడుస్తున్నా... బింకంగా… నన్ను తల తిప్పమని చెప్తే చూపు మరల్చి ఎటో చూస్తున్నాను.
అంతలో, శ్వేత మిన్నీని ఎత్తుకుని నా దగ్గరికి తీసుకు వచ్చేసరికి, సరే లెమ్మని, మెయిన్ విలన్ ని తరిమికొట్టి దాన్ని అందుకోబోయాను.
అప్పుడిచ్చింది మన హీరోయిన్ ఓ బంపర్ ట్విస్టు. నాపైకి గెంతలేదు సరి కదా, నా పక్కనే ఉన్న మా చిన్నాడి చేతుల్లోకి వెళ్ళి సెటిలయ్యింది. ఊహించని ఈ హఠాత్పరిణామానికి కంగారుపడ్డా, అందరి దగ్గరికీ వెళ్ళి నా వరకూ ఇలా చేయటంతో పంతం పెరిగి... మళ్ళీ ప్రయత్నించాను."రాను పో" అన్నట్టు తల ఎటో తిప్పి పిల్లి పిల్లలా 'పర్ర్' మంది! మళ్ళీ ప్రయత్నించాను. ఉహూ... లాభం లేదు. చాలా బెట్టు చేసింది. బొత్తిగా, ఇంత బతుకూ బతికి, పంది పిల్ల ప్రాపకం కోసం ప్రాకులాడాలా అని నేను అభిమాన పడ్డాను. మా వాడేమో... "మిన్నీ లవ్స్ మీ, నన్ను వదలదట" అంటూ దాన్ని తీసుకుని పిల్లల వైపుకి తుర్రుమన్నాడు.
... కొంచెం దిగాలు పడ్డాను. కమర్షియల్ మూవీ అనుకుంటే ఆర్ట్ మూవీలా సాడ్ ఎండింగ్ ఏంటని!
నలుగురూ యాక్సెప్ట్ చేసారు కనుక దాన్ని దగ్గరికి తీసుకోవాలనుకున్నానో, నిజంగానే అది నచ్చిందో క్లారిటీ లేకున్నా... నేను రమ్మన్నా అది రాలేదు కనుక ఇలా హర్టయినట్టున్నాను! కృతిని అనాలి అసలు, ఏ కుక్కపిల్లనో, పిల్లి పిల్లనో... తెచ్చుకుంటే ఈ సినిమా ఉండేదా? నా ప్రాణానికి, ఏదో పిగ్గుపిల్లని తెచ్చి ఈ కన్ఫ్లిక్ట్ తెచ్చింది కానీ! అనుకున్నాను. మళ్ళీ మిన్నీ వైపు చూస్తే... భలే సరదాగా అందరితోనూ ఆడుతోంది. అంతలో మరో డవుటు వేంచేసింది. కొంపదీసి కృతి అన్నట్టు ఇది బ్రిలియంట్ గిన్నీ కాదు కదా? పిల్లి పిల్లనో, కుక్కపిల్లనో అయితే నాకు ఈ అకారణ వైరభావం ఉండేది కాదని పట్టేయలేదు కదా? పిగ్గుపిల్ల కనుకే ఎంత క్యూట్ గా ఉన్నా దాన్ని నేను యాక్సెప్టు చేయలేదని... ఈ హిపోక్రసీ ని అది పట్టేసిందో, ఏమో! అందుకే 'నీవు తక్క ' అన్నట్టు నన్నే టార్గెట్ చేసిందా, ఏ? డిన్నర్ చేస్తున్నంత సేపూ, ఆలోచనలు బ్లాక్ అండ్ మూవీ స్టైల్లో ఏకధాటీ గా... ఎమోషనల్ గా ఎటాక్ చేసాయి.
అందరూ బయల్దేరాక, కాసేపు కృతికి హెల్ప్ చేసి, మేమూ బయల్దేరాము. బయటకొస్తూంటే... మిన్నీ మావైపు వచ్చింది. చిన్నాడు బానే అలవాటయ్యాడు అనుకునేంతలో... క్లైమాక్స్ లో కథ సుఖాంతం చేయటానికన్నట్టు... నాపైకి దూకిందది. యెస్! ఎట్ లాస్ట్! హమ్మయ్య! ఏమయితేనేం… పది పౌండ్లు తగ్గినంత... అక్షరాలా పది వారాలపాటు ఒక్కరోజైనా తప్పకుండా రోజూ 350 కేలోరీలు ఖర్చు చేసినంత తేలిగ్గా... పదిరోజుల్లో పది పిజా స్లైసులు తిన్నా పావు గ్రాము కూడా పెరగకుంటే కలిగేంత సంతోషం తో క్లౌడ్ నైన్ పైకి తేలిపోయా! కడ్లీగా ఒదిగి కూర్చుంది… ఎమోషనల్ లెవెల్స్ పీక్ కి వెళ్ళిపోయి ప్రేమగా, మృదువుగా నిమిరా...!
కృతి మళ్ళీ మొదలెట్టింది..."మిన్నీ... అంతే...." ఏదో ఏదో!
చెవుల్లోకీ ఏదీ ఎక్కలేదు. ఎక్కినా బాధ లేదు!
మరే! నిర్భావం సద్భవతి!
******
మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...