top of page

“శ్రీని” వ్యాస వాణి

KCR "అగ్ని" అన్ టెస్టెడ్ మిస్సైల్

Srinivas Pendyala, Madhuravani,Srinivas Pendyala Madhuravani

శ్రీనివాస్ పెండ్యాల

గత సంచికలో ప్రస్తావించినట్లు... ఈసారి  మన ఇద్దరు తెలుగు చంద్రుల లో ఒకరి మూల్యాంకనం చేద్దాం.

మోడీ కి పెట్టినంత చాకిరేవు కాకుండా, మన తెలుగు చంద్రులకి తక్కువ ఘాటు తోనే సరిపెడదాము. ఎంతైనా మన చంద్రులు... వాళ్ళ రాజకీయ అక్షరాభ్యాసం నుంచి, ప్రస్తుత వృద్ధాప్యం దాకా...వేసే పోషాకు కానీ, వాడే భాష గానీ... "ఆ విధంగా ముందుకు పోతూ"..." ఏందిరా బై, పాతరేస్తా..." అనే చమత్కారాలతో సహా ఎలాంటి మార్పు లేదు కావున, వారి మూల్యాంకనానికి మనం పెద్దగా బుర్రకి పని పెట్టాల్సిన అవసరం లేదు.

అనుకోకుండా విరిగిపడిన అవిభక్త రాష్ట్ర రొట్టె ఒకరికి నెయ్యిలో పడగా, మరొకరికి పొయ్యిలో పడింది. యువరాజావారి పట్టాభిషేకానికి వేసిన పాచికను, మన తెలుగు వారు తెలివిగా బంగాళాఖాతంలో కాకుండా, పాతాళంలో నిమజ్జనం చేసిన తీరు మాత్రం, బాల చందర్ సినిమాలో లాగా... కురువృద్ధ రాజకీయపక్షానికి అనుకోని ఆశ్చర్య ముగింపుని అందించింది. ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి అంజయ్యకు, బేగంపేట విమానాశ్రయంలో జరిగిన చిన్న అవమానాన్ని సహించని తెలుగు వారు, అపరభద్ర కాళీ లాంటి ఇందిరపై కన్నెర్ర చేసిన వైనం ఎప్పటికీ తెలుగువారి నైజానికి ఒక ఉదాహరణే. పార్టీని విలీనం చేస్తే తప్ప రాష్ట్రం ఇవ్వమని ఒకవైపు, "తలుపులు మూసి కేక్  కట్ చేస్తా, ఇచ్చిన ముక్కతో సరిపెట్టుకో" అని మరో వైపు... విషక్రీడ ఆడిన 'రాజ' కీయ కుటుంబానికి తెలుగువారు విధించిన శిక్ష చరిత్రలో మరొక ఉదాహరణగా మిగిలిపోనుంది. బహుశా ఏ కేంద్రప్రభుత్వాలూ ఇలాంటి విషక్రీడకి ఇక సాహసించకపోవచ్చు. ఈ వృత్తాంతం ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మన రాష్ట్రాలు ఎక్కడినుంచి నడక ప్రారంభించాయో గుర్తు చేయటానికి. ఒకరు కుబేరుడిగా, మరొకరు కుచేలుడిగా ప్రారంభించిన ప్రస్థానం కాలపరంగా దాదాపుగా సగం పూర్తయ్యింది. ఈ సగ కాలంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనేది అప్రస్తుతం. తెలియాల్సిందల్లా... తెలుగువారు తేరుకున్నారా, లేదా అనేదే!

 

కుబేరుడి గా ప్రారంభించిన నడక KCR ని తన విధేయులు " తెలంగాణా జాతిపిత"గా స్తుతించటం వరకూ తీసుకెళ్ళింది. బహుశా, వడ్డించిన విస్తరి కావటంతో... KCR కి పరిపాలన, నల్లేరు మీద నడకలా మారింది. ఇప్పుడు యుక్తంతా...పార్టీ విస్తరణ, స్థిరీకరణ పైనే. కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన పరివారం ...అంటే... కొడుకు, కూతురు, మేనల్లుడు తోడవటంతో బహుశా ఏ రాజకీయ నాయకుడికి లేనంత బలాన్నిచ్చింది KCRకి.

 

గత రెండు సంవత్సరాలుగా, KCR ఎదుర్కొన్న సవాళ్ళు, పరిష్కరించిన సమస్యలు పెద్దగా ఏమీ లేకపోవటంతో యుద్ధానంతరం సేద తీరిన సైనిక స్థావరంలా కనిపిస్తుంది రాష్ట్రం. దీంతో మన ప్రోగ్రెస్ రిపోర్టుకి ముడిసరుకు అభివృద్ధి కంటే, రాజకీయాన్నే ప్రధానాంశం గా పేర్కొనవచ్చు. ‘పదిమందిలో పాము చావదు’ అనేది పాతమాట. ‘పసి పసిరిక పామునైనా, పదిమంది పదికర్రలతో చావబాదా’లన్నది KCR బాట. ఎన్నికలు ఎంత చిన్నవి, ఎంత పెద్దవి అన్నది కాదు సమస్య. ప్రత్యర్థి కి డిపాజిట్లు కూడా రాకుండా, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటమే KCR ఎంచుకున్న మార్గం.

అప్రతిహతంగా సాగుతున్న ఎన్నికల జైత్రయాత్రకి ఇప్పుడిప్పుడే కళ్ళెం పడేలా కనబడట్లేదు.  దీనికి తోడు "మన తెలంగాణా" అన్న భావన ప్రజల్లో బలంగా ఉన్నంతవరకు వ్యక్తి గుణగణార్హతలకి ఎన్నికల్లో స్థానం ఉండదు.

ఒకప్పుడు ఉప ఎన్నికల్లో సర్వం కోల్పోయిన TRS పార్టీని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి నిండు సభలో "రాజేంద్రా! పట్టుమని పది సీట్లు గెలవని నీ పార్టీ మొహం ఎక్కడ పెట్టుకుంటారు" అని చేసిన అవహేళనకి ... చంద్రశేఖరుడు ఇప్పుడు జవాబిస్తున్నట్టుగా తోస్తుంది.

ఇక "ఆపరేషన్ ఆకర్ష్" విషయానికి వస్తే బహుశా...దేశంలోనే తెలంగాణా అత్యధిక అభివృద్ధి సాధించిన రాష్ట్రం గా అవతరిస్తుందేమో! గత రెండు సంవత్సరాలుగా... MP, MLC, MLA ఇలా అన్నితరగతుల గో.పీ.లు కలిసి TRS తీర్థం పుచ్చుకున్న వారి సంఖ్య దాదాపు 47.  వీరు గులాబీ కండువ ధరించిన వెంటనే “పోరాడి తెలంగాణా సాధించింది మేమే!" అంటూ వీరావేశ ప్రసంగాలతో బ్రహ్మానందాన్ని మించి హాస్యాన్ని పండిస్తున్నారు.

 

ప్రజాస్వామ్యమనే నాణానికి ప్రభుత్వం, ప్రతిపక్షం రెండువైపులా ఉండాల్సిన చిహ్నాలు. అవి కలిసిపోయి ఒకే వైపుకి చేరితే నాణెం విలువ శూన్యం. దీంతో అంతిమంగా నష్టపోయేది ప్రజలే. ప్రతిపక్షాన్ని సమూలంగా సంహరించిన KCRకి ABN లాంటి పత్రికలే ప్రతిపక్షాలయ్యాయి.కానీ... ముల్లుని ముల్లుతోనే తీయాలన్నట్టు, పత్రికని కరపత్రికలతో ఎదుర్కోవటం నయా రాజకీయం.

 

ఒకవైపు రాజకీయ సంహారం చేస్తూ KCR, అభివృద్ధిలో కొత్త రక్తాన్ని ఎక్కిస్తున్న తీరు ప్రశంసనీయం. ఆపరేషన్ భగీరథ, కాకతీయ ఈ కోవలోకే వస్తాయి. దేశ వ్యాప్తంగా ఫైబర్ గ్రిడ్స్ అంటూ ఊదరగొడుతున్న ఈ రోజుల్లో, తెలంగాణలో మాత్రం వాటర్ గ్రిడ్స్ గురించి వార్తలుంటున్నాయి. సామాన్యుడికి కావాల్సింది సాంకేతికత కాదు. కడుపులోకి పట్టెడు ముద్ద అనేది దీని సారాంశమేమో!

 

ఎంతో కాలంగా నీటి యాజమాన్యంలో మనం కోట్లు ఖర్చు చేసినట్టు లెక్కల్లో చూపించాము కానీ, చెరువులో గరిటెడు పూడిక తీసిందీ లేదు, గ్రాము నీటిని గ్రామానికి తీసుకొచ్చిందీ లేదు. వాటర్ గ్రిడ్స్ తో చెరువులని అనుసంధానించబోతున్న ప్రణాళిక వాస్తవ రూపం దాల్చితే, పల్లెల ముఖచిత్రం సమూలంగా మారిపోనుంది.

 

ఈమధ్యే ఉన్నత విద్యావంతుడైన ఓ మిత్రుడు సరదా మాటల్లో, ఓ విషయం తేల్చి చెప్పాడు... "మా ఊర్లో గత నాలుగు దశాబ్ధాల్లో చెరువుని సర్వే చేసిన నాథుడు లేడు. చెరువు నీటికి కాదు, మురుగు నీటికి కూడా ఒక  పైపుని  ప్రభుత్వ పరంగా వాడిన దాఖలాలు లేవు. కానీ, గత రెండునెలలుగా... సర్వేలు, పైపుల హడావిడి చూస్తుంటే, ఎండిపోతున్న మా ఊరి చెరువులోకి నీరొస్తుందో లేదో తెలీదు కానీ, మురుగు నీటికైనా ఈ పైపులు ఉపయోగపడతాయని" చమత్కరించాడు. సరదా మాటలయినా వాటిలో నమ్మకం కనిపించింది. బహుశా ఈ రెండు పథకాలే వచ్చే ఎన్నికల్లో TRSకి ప్రధానాస్త్రాలుగా మారే అవకాశముంది.

 

ప్రస్తుతానికి ఈ వాటర్ గ్రిడ్ ప్రతిపాదనా, ప్రణాళిక దశలోనే ఉంది. ఇది వాస్తవ రూపం దాల్చితే తెలంగాణాకి గట్టి పునాదిగా మిగిలిపోతుంది. ఈ మధ్యకాలంలో జలవిధానం, ప్రాజెక్ట్స్ రీడిజైనింగ్ పై KCR అసెంబ్లీలో ఇచ్చిన ప్రెజెంటేషన్ కూడా మంచి ప్రశంసలు పొందింది.

 

ఇక మరో ప్రధానాంశం- విద్యుత్ సమస్య. రాష్ట్రంగా అవతరిస్తే అంధకారమే అని అనుకున్న నిపుణులని నివ్వెరపరిచేలా... విద్యుత్ సమస్యని అధిగమిస్తున్న తీరు యాధృచ్చికం కాదు.  మహరాష్ట్ర, చత్తీస్ ఘడ్ లతో దీర్ఘకాలిక ఒప్పందాలు విద్యుత్ భారాన్ని కొంతవరకూ తగ్గించాయి. మండుటెండలో కూడా మూడు, నాలుగు గంటల కోతతో మాత్రమే బండి నడిపించాడంటే అది మెచ్చుకోదగ్గ విషయమే.

 

ఇక డబుల్ బెడ్రూం ఇళ్ళు… ఇందులో ప్రభుత్వ వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. బహుశా, ఇందిరమ్మ ఇళ్ళ విధానం అనుసరించటం ఒక కారణం కావచ్చు. ఇళ్ళ మంజూరి కేవలం TRS కార్యకర్తలకే పరిమితవుతుందన్న విమర్శే కాకుండా, ఈ సారి బడ్జెట్లో ప్రతిపాదించినట్టు, లక్ష ఇళ్ళ అంచనాను అందుకోలేకపోయింది. దీంతో మిణుకు మిణుకుమంటున్న చిరు ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మిగిలేలా ఉంది.... ఉద్యోగుల విభజన, ప్రత్యేక హైకోర్టు నిర్మాణం వంటివి ఇంకా పరిష్కరించాల్సి ఉంది. దీంతో పాలనాపరమైన చిక్కులు ఉన్నా, రాజకీయంగా ప్రజల మనోభావాలని మండిస్తూ సెంటిమెంటుని రాజేస్తున్న తీరు మాత్రం ఆక్షేపణీయం.

 

మరొక ప్రధానాంశం- కేజీ టు పీజీ ఉచిత విద్య. ప్రస్తుతానికిది కోల్డు స్టోరేజీలో రెస్టు తీసుకుంటుంది. పనిలో పనిగా... చిన్నా చితకా గ్లామర్ వార్తలు కూడా తెలంగాణ పత్రికలని ముంచెత్తుతున్నాయి. ట్యాంక్ బండ్ చుట్టూ ఆకాశ హార్మ్యాలు, న్యూయార్క్, లండన్ నగరాలని తలదన్నేలా కరీంనగర్, వరంగల్ నగరాల  ముస్తాబు లాంటి  పిట్టలదొర కబుర్లు బానే చక్కర్లు కొట్టాయి. దేశంలోనే ఎత్తైన జాతీయ జెండా ఆవిష్కరణ, దీనికి వారానికి సుమారుగా 28లక్షల సమర్పణ ఓ ప్రహసనంగా 'నిలిచి' పోయేట్టుంది.

 

దళిత, మైనార్టీలకి 12% రిజర్వేషన్లు కేంద్రప్రభుత్వ పరిధిలోనివి. మాటిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టకపోయినా... గులాబీ పిల్లి మెడలో గంటకట్టేందుకు ప్రతిపక్షం వెనుకాడుతుంది... మున్ముందు ఇదో సవాలుగా మారినా, కేంద్రంపై నెట్టేసి వారిని నట్టేట ముంచే సమర్థత KCRకి ఉద్యమంతో పెట్టిన విద్యే!

మొత్తానికి KCR మంచి మార్కులతో గట్టెక్కినా, ఇంకా ఎలాంటి కఠిన పరీక్ష ఎదుర్కోని "అగ్ని" లాంటి అన్ టెస్టెడ్ మిస్సైల్ అని చెప్పుకోవచ్చు

 

ప్రస్తుతానికింతే!... వచ్చే సంచికలో రెండో చంద్రుడు... అదే 'కుచేలేం'ద్రుడు - CBN ప్రోగ్రెస్ రిపోర్టు.

****

bottom of page